Sunday, 13 December 2015

స్కూల్లో కురిస్తే బావుణ్ణు :(

..ప్రతి ఆదివారం అమ్మో నాన్నో చీకటితో పాసింజర్ ఎక్కి నా వద్దకి వస్తారు .
వస్తూ అమ్మ స్వయంగా చేసిన సున్నుండలు, కారప్పూస తీసుకు వస్తారు. 
అప్పుడప్పుడు పిలక్కీ మందారపూవు కట్టుకున్న చెల్లెలు కూడా వచ్చుద్ది. 
వారం లో వాళ్ళు కలిసే రెండు గంటల కోసం నేను ఎదురు చూస్తుంటాను .
..
చెల్లెలంటే అసూయగా ఉంటుంది. ..
అమ్మ చంకన ఎక్కి తిరుగుతుంది.
నాన్న సైకిలు ఎక్కి ఊరంతా చక్కర్లు వేస్తుంది.
..
అమ్మ దగ్గర పడుకుంటుంది. లక్క పిడతలలో అన్నం కూరా వండుతుంది. ..
బుగ్గనున్న కాటుక చేతుల్తో ముఖమంతా పూసుకుంటుంది.
నా పుస్తకాలు చించి పడవలు చేసుద్ది. లాగి పెట్టి గుద్దినా
వంటగదిలో ఎత్తుకొచ్చిన బెల్లం ముక్క కాకి ఎంగిలి చేసి పెట్టుద్ది.
తాటాకుకి తాడు గట్టి దానిమీద కూర్చో బెట్టి బజారు అంతా కారు నడపటం గుర్తొస్తుంది.
నాన్న సైకిలు మీద గడ్డి మోపు కట్టుకుని
ముందు నన్ను కూర్చో బెట్టుకుని పొలం నుండి వస్తూ..
జేబులో వేసిన కంది కాయలు తింటూ,
నాన్న చెప్పేది వింటూ .. మళ్ళీ వీలవుతుందా ??
..
నాకీ హాస్టల్ అంటే కోపం . ..
నన్ను నాన్న నుండి వేరు చేసిందిది.
అమ్మనుండి లాగేసింది..
చెల్లెలు నుండి తోసేసింది.
అయిదు గంటలకి లేసి, పదకొండుకి పడుకునేదాకా,
లెక్కలు, సైన్సు , పరుగులే.. మార్కుల పోటీలు,..
..
కాలక్షేపం అల్లా చాకలి మూట లోంచి బట్టలు ఏరుకోవటం, ..
సున్నుండల డబ్బా పెట్టెలో జాగర్త చేసుకోవటం,
అవి లాక్కున్నప్పుడు తోటి పిల్లలతో యుద్దం చెయ్యటం,
వార్దెను చేత దెబ్బలు తినటం.
..
ఇంటి నుండి నన్ను వేరు చేసేంత తప్పు ఏమి చేశానో ఎంత ఆలోచించినా గుర్తు రాదు ..
హాస్టల్ లో బల్బులు పగల గొడతాను, ..
బాత్రూములో కుళాయిలు విరగ్గొడతాను,
తలుపుల గోళ్ళాలు వంగ గొడతాను.
గోడల నిండా అమ్మ కావాలని బొగ్గు ముక్కతో రాసేస్తాను.
కానీ సాద్యపడదు.ఏది తృప్తిగా ఉండదు ..
..
‘మీ పిల్లాడిని పట్నం లో హాస్టల్ లో వెయ్యండి’ అని చెప్పిన..
పల్లెటూరి పంతుల్ని పైకి కంకర రాయి విసిరేసి పరిగెత్తాలని ఉంటుంది .
నన్ను హాస్టల్ గదిలో దించి కొంగు తో కళ్ళు తుడుచుకునే అమ్మ ని అడగాలని పిస్తుంది.
నేను ఇక్కడ ఉండను నాన్నా అని నాన్న తో చెప్పాలని పిస్తుంది.
..
కుట్టిచ్చిన కొత్త బట్టలు,రేకు పెట్టె, బక్కెట్టు,మగ్గు,
జేబులో చిల్లర, చెల్లెలు ఇచ్చిన బొమ్మ, అమ్మ పుణికిన బుగ్గలు,
నాన్న పెట్టిన ముద్దూ ఇవేవీ ఇప్పుడు నన్ను సంతోష పెట్టడం లేదు.
శెలవు లు వస్తే బాగుండు.. ..
..
అక్కడెక్కడో చెన్నై లో కురిసిన వర్షం ఈ స్కూల్ లో కురిస్తే బావున్ను.
నీళ్ళలో ఈదుకుంటూ ఇంటికెళ్ళి పోవచ్చు .. ..
..
(తల్లి తండ్రుల ప్రేమకి మరో రూపమే.. స్థాయికి మించి ఖర్చు చేసి చదివించడం .. అని అర్ధమయ్యేలా పిల్లలకి చెప్పగల ఒక మంచి ఉపాద్యాయుడు హాస్టల్ లో ఉండే పిల్లలందరికి దొరకాలని కోరుకుందాం )

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...