Tuesday, 14 August 2018

ఇంటర్

ఒక ఉమ్మడి బందువు కుమార్తె వివాహం అని శుభలేఖ ఇవ్వటానికి ఒంగోలు లో ఉండే ఒక టీచర్ ఫోన్ చేసి ఇంటికి వచ్చాడు.
“వెంకట్రావు కూతురు వివాహం. కనిగిరి లో 17 వ తేది” అని మొదలెట్టాడు.
తలకి రంగు, తెల్ల జుట్టు కనిపించకుండా నున్నటి మూతి, టీ షర్టు, ఫాంటు, చూడు సిద్దప్పా నీకు కుండ లేదు నాకు నిండుగా ఉంది మిగిలినదంతా సేం టు సేం.. అ .. అ అన్నట్లు ఒకే వయసు.
ఈ అబ్బి బాగా తెలుసు. ఎక్కడా? అని ఆలోచనలో పడ్డాను.
"మనం లోగడ కలుసుకున్నామా?" అడిగాడు ఆతను.
“చాలా సార్లు .. మైండ్ లో సెర్చ్ కొడుతున్నాను” సోఫాలో ఎదురుగా కూర్చున్నాను.
ఇద్దరం పలుగు పారా తీసాం. తవ్వటం మొదలెట్టాం.
ఒకవైపు భావనా మరో వైపు రమ సాయం చేస్తున్నారు.
“టెన్త్ నేను మద్దిపాడు లో “
“నేను ఇక్కడే.. ఒంగోలు “ అన్నాడతను.
“ఇంటర్?”
“1980-82 శర్మా కాలేజ్ MPC ఇంగ్లిష్ మీడియం”
“మా నాన్న కుడా అదే బాచ్.. సేం కాలేజ్” అంది భావన.
నిజమా!! అన్నట్లు చూసాడతను.
“ఇంటర్ వెంకటేశ్వర ధియేటర్ లో చదివాను. సర్టిఫికేట్ శర్మా కాలేజి వాళ్ళు ఇచ్చారు.” అతని సందేహం తీర్చేసాను.

Saturday, 11 August 2018

ఒక నకులుడి కధ

“రవీ ... నేను చీరాల లో ఉన్నాను. మరో అరగంట లో ఇంటికి వస్తాను. నీతో మాట్లాడి బాపట్ల వెళ్లి కమలాకర్ ని కలుస్తాను. అక్కడికి బోజనానికి వస్తాను అని చెప్పాను. నువ్వు ఎక్కడ ఉన్నావు?”
“అన్నా నేను ఆఫీసు లో ఉన్నాను. ఈ నెల ఒక్కటే సెలవు మిగిలింది. పెళ్లి కోసం జాగర్త చేసాను. ఇంట్లో మీ మరదలు కుడా లేదు. స్కూల్ కి వెళ్ళింది. నాలుగు దాటితే కాని తను రాదు. పిల్లలిద్దరూ ఉన్నారు. వాళ్లకి ఇవాళ స్కూల్ లేదు..”
“సరే నేను ఇంటికి వెళ్లి.. పిల్లలని పలకరించి బాపట్ల వెళ్తాను.”
“సరే అన్నా.. రిటర్న్ లో ఇంటికి రా అన్నా.. వీలుంటే..”
“ఖచ్చితంగా..”
రవి అంటే మా పిన్ని గారి పెద్ద కొడుకు. మా ఆమ్మ వాళ్ళు నలుగురు అక్కచెల్లెళ్ళు. మా అమ్మ పెద్దది. నలుగురికి కలసి అయిదుగురు కొడుకులం.
పెద్దావిడ కి అందరికంటే పెద్ద వాడిని నేనూ. అందరి లోకి చిన్న పిన్నికి ఇద్దరు కొడుకులు. వెరసి పాండవుల లెక్క..
నా సంగతి సరే..
భీముడు బొంబాయి లో ట్రాన్స్పోర్ట్ ఏజెంట్ గా స్థిర పడ్డాడు.
అర్జునుడు బాపట్ల లో సాఫ్ట్ డ్రింక్స్ స్టాకిష్టు కం ఎగ్స్ హోల్సేలర్. బాగానే ఉన్నాడు.
రవి అంటే నకులుడు. తండ్రి (మా బాబాయి ITC కార్మిక ఉద్యోగి) తో పాటు ఇంటివద్దే చిన్న చిల్లర అంగడి నడిపేవాడు.
లోకల్ గా డిగ్రీ చదివాడు. పచ్చళ్ళు అమ్మాడు. data ఎంట్రి జాబ్ వర్కులు చేసాడు. సహదేవుడు ని చదివించాడు.
చాలీ చాలని జీతం తో తండ్రి తో పాటు చాతనయిన పని చేసి తమ్ముడు ని తమిళనాడు లో MCA (అప్పట్లో అందని ద్రాక్ష) చదివించాడు. తమ్ముడు నిలదొక్కుకున్నాడు. ఉద్యోగం... అబ్రాడ్..ఆరు అంకెల జీతం.. మరో ఆరు అంకెల జీతపు బార్య.. ఇక్కడో తల్లి తండ్రులకి ఇల్లు, న్యూజెర్సీ లో ఇల్లు ఇలాటివి ఇంకా చాలని చాలా..
మా బాబాయి వాలంటరీ విరమణ చేసి రవి కి ITC లో ఉద్యోగం వేయించాడు.
తల్లి కి ఇష్టం లేని; చిన్నప్పటి నుండి బీదరికం లో మగ్గుతున్న మేనత్త కూతురు ని వివాహం చేసుకున్నాడు.
అదిగో అక్కడ కధ మలుపు తిరిగింది.
చిన్నాడి కి పెద్దాడికి మధ్య మాటల్లెకుండా పెద్ద వాళ్ళు గొయ్యి తీసారు.
ఒక చిన్న స్థలం తనకి వదిలేసారు. వాడు అందులో చిన్న ఇల్లు కట్టుకున్నాడు. నా చేతనయిన సాయం చేసాను. ప్రభుత్వ పదకం మంజూరు చేయించాను. వీలయినంత మంచి డిజైన్ ఇచ్చాను.
బార్య అనుకూలవతి. కాన్వెంట్ లో టీచర్ గా కొద్ది జీతానికి పని చేస్తూ ఉంటుంది. ఇద్దరు ముత్యాల్లాంటి పిల్లలు. పొదుపుగా ఆదర్శంగా తృప్తిగా ఉండే కుటుంభం.
పిన్ని బాబాయి లో ఎవరు సిక్ అయినా కనిపెట్టుకు చూసే పెద్దాడి కుటుంభం US నుండి చిన్న కొడుకు నెలకు పంపే డబ్బుకి సమానం గా ఇవ్వటం లేదని మా పిన్ని కంప్లైంట్. కొరవ... వాడితో సరిగా మాట్లాడదు. పిల్లలిద్దరికి మాటల్లెకుండా చేయగలిగినంత చేసింది.
అదో ఉన్మాదం...
నేనూ వెళ్ళే సరికి మగ పిల్లలిద్దరూ ఇంట్లో ఉన్నారు. పెద్దోడు 7 లోను చిన్నవాడు 4 లోను ఉన్నారు. ఈ రోజు వాళ్ళ స్కూల్ శలవట.
బండి ఆపగానే పెద్ద వాడు వచ్చి “పెదనాన్నా.” అని నోరారా పిలిచాడు. వర్షం బురద తో నిండిన నల్లని బూట్లు విప్పి లోపలి వెళ్లి కూర్చున్నాను.
వాళ్ళ నాన్నకి ఫోన్ నుండి మిస్ కాల్ ఇచ్చాడు.
చిన్నవాడిని పక్క వీది లోకి పంపి కూల్ డ్రింక్ తెప్పించి ఒక గాజు గ్లాసులో పోసి ఇచ్చాడు.
“టీ.వీ పెట్టనా పెద నాన్నా అన్నాడు”
వద్దని తల ఊపి (అలవాటు లేని) డ్రింక్ తాగుతూ పిల్లలతో మాట్లాడాను.
పది నిమిషాలు కుర్చుని వాళ్లకి బై చెప్పి వాకిట్లో కి వచ్చే సరికి ఎప్పుడు తుడిచారో ఏమో కాని నా బూట్ల శుబ్రంగా ఉన్నాయి.
సాయంత్రం బాపట్ల నుండి మళ్ళీ చీరాల వచ్చాక ఫోన్ చేసాను.
“అన్నా.. ఆఫీస్ టైం అయిపొయింది వచ్చేస్తున్నాను”
“నేను ఇంటికి రావటం లేదు. వేరే పని ఉంది ఇంకొల్లు వెళ్తున్నాను.”
“సరే అన్నా.. సెంటర్ కి రానా.. కలిసి టీ తాగుదాం.”
“వద్దు రా నేను చీరాల దాటాను..”
“ఒరేయ్ రవీ “
“చెప్పన్నా..”
"......."
“అన్నా..వినబడటం లేదు... సిగ్నల్ ఉందా?”
“నీ పిల్లలు ముత్యాలు రా.. బాగా పెంచుతున్నావు. నువ్వు శ్రీమంతుడివి”

Sunday, 5 August 2018

ఒక అరగంట


రోడ్డు వారగా కారు ఆపి, పెయింట్ మీద తాజా గా పడిన గీత ని మళ్ళీ చూసుకుని “దిగు” అన్నాను.
హ్యాండ్ బాగ్ లో మరి కొన్ని శుభలేఖలు సర్దుకుని తను కారు దిగింది. 
పల్లెటూరిలో కట్టిన విశాలమయిన ఇల్లు. పెద్ద గేటు.
లోపలి వెళ్లి మొదటి అంతస్తు గ్రిల్ గేటు వద్దకి వచ్చి గేటు తీయబోయేసరికి బలంగా ఉన్న తెల్లటి బొచ్చు కుక్క వెనుక కాళ్ళ మీద నిలబడి పెద్దగా అరవసాగింది.
మా శ్రీమతి కి కుక్క పిల్లలంటే బెరుకు. వాటిని ఎందుకు అంత ముద్దు చేస్తారో ఆవిడకి అర్ధమే కాదు.
లోపలినుండి మా మిత్రుడి బార్య వచ్చి “కొత్త వాళ్ళని తనే ముందు పలకరించాలని రాణి ఆత్రం” అంది నవ్వుతూ
“బాగున్నారా? రండి.” దాని మెడలో ఉన్న తోలు బెల్టు కి చైన్ బిగిస్తూ పలకరించింది
మేం లోపలి అడుగేట్టాం. మా వాడు రూమ్ లో నుండి షర్ట్ వేసుకుంటూ బయటకి వచ్చాడు.
పలకరింపుగా నవ్వాడు.
"రండి కూర్చోండి" అన్నాడు. సోఫా చూయిస్తూ...
విశాలమయిన ఇల్లు. గాలి వెలుతురూ విధ్యుత్ తో సంబంధం లేకుండా.
నలబై అడుగుల మించి పొడవు ఉన్న హాలు.
రాణి ఇంకా గోల గోలగా మా కాళ్ళ చుట్టూ తిరుగుతూ రెండు కాళ్ళ మీద లేచి నిలబడి పైకి ఎగిరే ప్రయత్నం చేస్తూ ఉంది.
“దాన్ని పలకరించనిదే అది మనన్ని మాట్లాడుకోనివ్వదు” అన్నాడు వెంకట్.
రెండు చేతులు చాచి పిల్లాడిలా ఎత్తుకుని దాని మెడ నిమిరాక నెమ్మదించింది.
“అమ్మాయి పెళ్లి ఈ నెల 24 న “ ప్రారంభంగా చెప్పాను.
“ఆ తెలుసు.” అన్నాడు మా వాడు.
ఈలోగా మా ఆవిడ ఆమెకి కుంకుమ బొట్టు పెట్టి శుభలేఖ అందించింది.
పిచ్చాపాటి మాటలు మొదలయ్యాయి.
“అబ్బాయి ది ఎక్కడ? ఏం చదివాడు ? ఏం చేస్తున్నాడు” అని మాత్రమే అడిగాడు.
స్నేహితులు “ఎంత ఇస్తున్నావు ?” అని ప్రశ్నించక పోవటం పొద్దుట నుండి మా శ్రీమతి గమనిస్తూనే ఉంది.
వెంకట్ పెద్ద కుమార్డు యు ఎస్ లోను చిన్న వాడు బెంగుళూరు లోను పని చేస్తున్నారు. పెద్దాడు వచ్చి రెండేళ్ళు దాటినట్లు, చిన్నవాడు చుట్టపుచూపుగా మూడు నాలుగు నెలలకి ఒక సారి వచ్చి పోతున్నట్లు చెప్పాడు.
స్కూల్ టీచర్ గా మరో ఆరేళ్ళ సర్వీస్ ఇక్కడే ఉండాలని “ఎవరి జీవితాలు వారివి.” అని నవ్వాడు.
ఈ లోగా రాణి మా వాడి ని చూసి పలకరింపుగా మొరిగింది.
“నీకు చెప్పలేదనా? మా ఫ్రెండ్ ఈయన. చిన్నప్పుడు ఇక్కడ హైస్చూల్ లో చదివినప్పుడు మా జూనియర్. వాళ్ళ రెండో అమ్మాయి పెళ్లి కి పిలవటానికి వచ్చారు.” అచ్చు మరో మనిషికి చేబుతున్నంత సిన్సియర్ గా చెప్పాడు.
మా వైపు తిరిగి “మాటల్లో తన ప్రసక్తి లేనిదే ఒప్పుకోదు” అన్నాడు.
రాణి విని అర్ధం చేసుకున్న మాదిరిగానే కుర్చుని తల ఉపింది.
"మాకు కాలక్షేపం ఇదే." అన్నాడు మళ్ళీ తనే.
శలవు తీసుకుని మేట్లుదిగుతుంటే..
“పెట్స్ ఎందుకో పెంచుకుంటారో అర్ధం అయింది.” అంది మా ఆవిడ.
నాకు శ్రమ తగ్గిస్తూ..

Sunday, 29 July 2018

నల భీమ


“ఏమండీ... ఏం చేస్తున్నారు?”
“ఇప్పుడే పిల్లాడూ నేనూ భోజనం చేసాము. 
వాడు వర్క్ చేసుకుని నిద్ర పోయాడు. నేను టివి చూస్తున్నాను.”
పార్సిల్ తెచ్చుకున్నారా?
లేదు వండుకున్నాము. ఫ్రిడ్జ్ లో పెరుగు ఉందిగా ?
కూర కర్రీస్ పాయింట్ నుండి తెచ్చుకున్నారా?
రైస్ కుక్కర్ ఎలాను ఉండే. దోసగింజల చింత కాయ పచ్చడి. చేసాను. నెయ్యి వేసుకుని అప్పడాలు వేయించుకుని లాగించాం.
అబ్బో..
మరి.?
వంటగది అంతా కంగాళీ చేసి ఉంటారుగా? అబ్బా కొడుకులు.
ఏం లేదు. శుబ్రంగా కప్ బోర్డు లు తుడిచాం. ఫ్లాట్ ఫార్మ్ కడిగి పెట్టాం. నేల కి తడిగుడ్డ పెట్టాం. ఇద్దరం రెండు సార్లు స్నానం చేసాం. గుమ్మడి కాయ వడియాలు, ఊరమిరపకాయలు.
..
..
..
హ హ హ
..
..
ఎందుకే అంత నవ్వు? ఒక్క రోజు నువ్వు ఊరెళితే వంట చేసుకోలేమనుకున్నావా?
..
..
..
మిక్సీ స్విచ్ వేసేముందు జార్ మూత కుడివైపుకు తిప్పితే లాక్ అవుతుంది.

Saturday, 28 July 2018

మొనగాడు.

హైదరాబాదు లో ఉండే రాజా మహేంద్ర ప్రతాప్ కి అయిదేళ్ళ వయసు ఉన్నప్పుడు జరిగింది ఆ సంఘటన.
అతని కి, అతని స్నేహితులు కి మధ్య చిన్న పోటి. ఒక ఇనుప రాడ్ తో రెండు బజారు స్తంబాల మధ్య వేలాడే తీగలని తాక గలవా? అని
ప్రతాప్ శరీరం నుండి హై వోల్టేజ్ విధ్యుత్ ప్రవహించింది. 
అచేతనంగా పడిపోయిన ప్రతాప్ నుండి నుండి రెండు కాళ్ళు మోకాళ్ళ వరకు రెండు చేతులు మోచేతుల వరకు తోలిగించ వలసి వచ్చింది.
పదేళ్ళు... అవును నిండా పదేళ్ళు ...
అతనికి పదహారు వయసు వచ్చేవరకు నాలుగు గోడల మధ్య అతని జీవితం గడిచింది. సుదీర్గమయిన పగళ్ళు ...
మరింత సుదీర్గమయిన రాత్రులు...
అదే గది అతని మొత్తం ప్రపంచం.
మధ్యతరగతి కుటుంబం లో ముగ్గురు ఆడపిల్లల తర్వాత సంతానం.
అతని కోసం దర్జీ ఇంటికి వచ్చేవాడు.
డాక్టర్ ఇంటికే వచ్చేవాడు. అతను మాత్రం ఇల్లు దాటి రాలేదు.
కాని అతనికి ముగ్గురు అక్కలు ఉన్నారు.
అతనికి వాళ్ళే టీచర్లు. వాళ్ళే అమ్మలు. వాళ్ళే అక్కలు.
అతనికి ఉన్న అవయవాలతో నడవటం నేర్పారు.
మోచేతులు మోకాళ్ళు సాయం తో నడవటం నేర్చుకున్నాడు.
మోచేతులు రెండిటితో పెన్ను పట్టుకుని వ్రాయటం నేర్చుకున్నాడు.
అక్కలు అతనికి పాఠ్య పుస్తకాలు చదివి వినిపించారు.
వ్రాయటం నేర్పారు. చదవటం నేర్పారు.
అన్నీ ఇంట్లో అదే గదిలో ... అదే ప్రపంచం లో...
ప్రైవేటు గా పదో తరగతి పరీక్ష వ్రాయటానికి ఆతను మొదటిసారి ఇల్లు వదిలి వచ్చాడు.
మోకాళ్ళ కి కుట్టించుకున్న ప్రత్యక చెప్పులతో ఆతను ప్రపంచం లోకి వచ్చాడు.
ఒక్క రోజు కుడా స్కూల్ కి వెళ్ళకుండా ఆతను టెన్త్ పాసయ్యాడు.
ఇంటర్ పాసయ్యాడు. అతనిక వెనక్కి చూడలేదు.
ప్రపంచం అతనికి అద్బుతం గా అనిపించింది.
ఆతను నడిచే కొంది దూరం తగ్గిపోతుందని గమనించాడు.
ఆతను B.Com ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాడు.
ఉస్మానియా యునివర్సిటి నుండి ఫైనాన్స్ లో MBA పూర్తిచేసాడు.
డిల్లీ లోని ‘National Center for Promotion of Employment for Disabled People”.
నుండి ఉపకార వేతనం తీసుకున్నాడు.
అతని 'రేజ్యూం' చూసి అనేక ఉద్యోగ అవకాశాలు వచ్చాయి.
ఇంటవ్యూ లలో అతని ని వ్యక్తిగతం గా చూసాక అవి నిరాశ ని మిగిల్చాయి.
అపజయాలు అతనిలో పట్టుదల మరింత పెంచేవి.
నేషనల్ హౌసింగ్ బ్యాంకు లో అసిస్టెంట్ మేనేజర్ గా మొదటి ఉద్యోగం వచ్చింది.
ఉద్యోగం చేరిన మొదటి రోజు ఒక ఫారం ఫిల్ చెయ్యటానికి సహోద్యోగి చేయబోయిన సాయాన్ని ప్రతాప్ సున్నితంగా తిరస్కరించాడు.
నన్ను సహోద్యోగి గానె గుర్తించండి, బలహీనుడిగా కాదు అని చెప్పేవాడు.
ప్రస్తుతం అహమ్మదాబాదు ONGC లో అకౌంట్స్ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు.
కొలీగ్స్ సహకారం తో, అతని పట్టుదలతో ఒక మంచి అధికారిగా చాలా తక్కువ సమయం లో పేరు తెచ్చుకున్నాడు.
ప్రయాణాలు అంటే ఇష్టపడే ప్రతాప్ చాలా చోట్లు తిరిగాడు.
ప్రజల కళ్ళలో విస్మయం గమనించడానికి అలవాటు పడి పోయాడు.
చెస్ , కారేమ్స్ అధ్బుతం గా అడే ప్రతాప్ మంచి హోస్ట్. తన మీద తనే ఛలోక్తులు విసిరి నవ్వించ గల మొనగాడు.
ఒంటరిగా బస్సు/రైలు/విమాన ప్రయాణాలు చేస్తాడు. ఆనందం గా జీవించడం, తోటి వారికి సాయం చేయటం అతన్ని చూసి నేర్చుకోవాల్సిందే.
మనమంతా ఎదో ఒక చోట బలహీనులమే.
మానసిక అంగ వైకల్యం తో ఏంతో కొంత బాధపడుతున్న వారిమే.
రాజా మహేంద్ర ప్రతాప్ చూపులకి మాత్రమే తక్కువ.
వ్యక్తిగా మాత్రం చాలా ఎక్కువ..   
Saturday, 21 July 2018

'పాప'O

బస్సు దిగి అటో కోసం బైపాస్ లో నిలబడ్డాను. 
రెండు నిమిషాల్లోనే అటో వచ్చింది. 
''సార్ రండి'' ఆటో అబ్బాయి పిలిచాడు. తెలిసిన పిల్లాడే..
వెనక సీట్లో ఒక పెద్దావిడ కూర్చుంది. బాగ్ వళ్ళో పెట్టుకుని సర్దుకుని కూర్చున్నాను. 
ముందుగా దిగాల్సిన మూడో అతను కుర్చోగానే బాగ్ సీటు వెనుక పెట్టాను. 
‘ఆడాళ్ళ పక్కన ఎలా కూర్చోవాలో కుడా తెలీదు’ అంటూ పెద్దావిడ కుడివైపు ఇనప హండిల్ మీద కూర్చుంది.
అప్పటిదాకా నాకు పక్కన ఉన్నది ‘ఆడ’ (?) మనిషి అని తెలీదు.
ఇంకొంచెం సర్దుకుని “సరిగా కూర్చోండి అమ్మా?” అన్నాను.
“అమ్మా ఏమిటి అమ్మా ఎదో బొప్పి వైనట్లు”అంది.
**
జెడ్పి కాలని వద్దకి వచ్చేసరికి అటో ఆతను “రెండు నిమిషాలు సార్ ఈవిడని లోపల దించి వద్దాము.” అన్నాడు.
చీకటి మొదలయ్యింది.
“వద్దు. నేను ఇక్కడే నిలబడి ఉంటాను. వెళ్లి రా” అంటూ దిగాను.
“పర్లేదు కూర్చోండి. ఎంత రెండు నిమిషాలు”
“వెళ్లిరా ఈ లోగా వంద కాగితం మారుస్తాను.”
**
కొబ్బరి బొండా తాగి పదినిమిషాలు గడిచినా అటో రాలేదు. కొద్దిగా నడిచి చూద్దామని లోపలి వెళ్లాను.
నలుగురు అయిదుగురు గుమిగూడి ఉన్నారు. అటో ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
తిరగబడ్డ అటో నుండి డ్రైవర్ కుర్రాడిని చేయి అందించి లేవటానికి సాయం చేసాను.
“ఏమయింది?”
“పొరపాటున అడ్డ రోడ్డు దాటి కొద్దిగా ముందుకు వెళ్లాను. చీకట్లో నన్ను ఎక్కడికి తీసుకెల్తున్నావురా? అని గావు కేక పెట్టింది. టక్కున సైడ్ కి తిప్పాను వెనక టైరు ఎదో రాయి ఎక్కింది.”
“సర్లే పద వెళ్దాం”
“ఇంతకీ ఆవిడ ఏది ?”
ఆ కుర్రాడు చీకట్లో చూపించిన వైపు సెల్ లో లైట్ వేసి చూసాను.
సైడు కాలవలో పాప కదులుతూ ఉంది.

Sunday, 15 July 2018

ఇద్దరు అమ్మాయిల కధ

ఈ కధ ముప్పై అయిదేళ్ళ క్రితం 12 మార్చి 1982 న మాదాపూర్ అనే గ్రామం లో ఉత్తర ప్రదేశ్ లోని గౌండ జిల్లాలో మొదలయ్యింది.
క్రిమినల్స్ గురించి సమాచారం రావటం తో తన సబ్ అర్దినేట్స్ తో కలిసి DSP ఎస్.పి. సింగ్ రాత్రి వేళ హుటాహుటిన వెళ్ళాడు.
అతని శరీరం మర్నాడు ఉదయం ప్రభుత్వ అసుపత్రి కి చేరింది.
మరో 12 మంది దుండగులతో కలిసి అతను బాంబు దాడిలో చనిపోయినట్లు బార్య విభా సింగ్ కి సమాచారం పంపారు.
నిజానికి DSP సింగ్ కి అతని సబ్ అర్దినేట్స్ కి మధ్య ఉన్న వైరం అతన్ని పొట్టన పెట్టుకుంది. అతని సబ్ ఆర్దినేట్స్ ఒక నకిలీ ఎన్కౌంటర్ లో చంపేశారు.
“దయచేసి నన్ను కాల్చొద్దు. నాకు ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు” అనేది ఆయన చివరి మాట.
సింగ్ భార్య 'విభా సింగ్' హై కోర్టుని ఆశ్రయించింది. సిబిఐ కి కేసు బదలాయించారు. తోటి ఉద్యోగులు క్రిమినల్స్ తో కలసి ఈ దారుణానికి పాల్పడినట్లు సిబిఐ చార్జ్ షీట్ ఫైల్ చేసింది.
సుదీర్గమయిన కోర్టు ప్రక్రియ మొదలయింది.
**
DSP సింగ్ హత్య జరిగినప్పటికి, అతనికి బార్య విభా సింగ్ కి కింజాల్ అనే ఆర్నెళ్ళ పాప, ఇంకా లోకం చూడని (ప్రింజాల్ సింగ్) బిడ్డ ఉన్నారు.
తల్లి కి వారణాసి ట్రెజరీ లో ఓక చిన్న ఉద్యోగం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది.
తండ్రి మరణాన్ని ప్రశ్నిస్తూ న్యాయం కోసం తల్లి చేసిన పోరాటం నీరు కారి పోయింది. భర్త తో పాటు పని చేస్తున్న ఉద్యోగులు ఆమెకి ఎవరు సహకరించలేదు.
ఆమె ఉద్యోగం లో జాయిన్ అయింది. రెండో బిడ్డ భూమి మీదకి వచ్చింది.
ఇద్దరు పిల్లలని ఆమె చదివించడం మొదలెట్టింది.
కొద్ది ఆదాయం, తండ్రి లేని ఒంటరి కుటుంభం. అన్ని రకాల గడ్డు సమస్యలని ఎదుర్కుంది.
పిల్లలిద్దరూ వారి చదువుల కోసం అనేక త్యాగాలు చేసారు.
తండ్రి ఫోటో ని చూస్తూ.. అతన్నే ఇన్స్పిరేషన్ గా తీసుంటూ ఇష్టపడి చదువు సాగించారు.
పెద్దమ్మాయి కింజాల్ డిల్లీ లోని అత్యున్నతమయిన “లేడి శ్రీరాం కాలేజ్” లో సీటు సంపాదించింది.
కింజాల్ డిగ్రీ మొదటి సంవత్సరం లో ఉన్నప్పుడు తల్లి కి కాన్సర్ అని తెలుసుకుంది. ఆమె ఎక్కువ కాలం జీవించే అవకాశం లేదని తెలిసిన రెండు రోజుల కి వ్రాసిన పరిక్షల లో ఆమె యునివర్సిటీ టాపర్ గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది.
తల్లి మరణ శయ్య వద్ద తామిద్దరు UPSC క్రాక్ చేస్తామని మాట ఇచ్చింది.
**
2004 లో తల్లి మరణానంతరం అక్క చేల్లెల్లిద్దరు డిల్లీ చేరారు.
ముఖర్జీ నగర్ లో ఒక సాదారణ గది లో నివాసం ఉంటూ UPSC కి చదవటం మొదలెట్టారు.
మిత్రుల వద్ద అరువు తెచ్చుకున్న పుస్తకాలతో వాళ్ళు యజ్ఞం మొదలెట్టారు.
స్వగ్రామం మరిచి పోయారు.
బందువులు లేరు. ఒక పండగ లేదు ఒక సరదా లేదు. ఒక విరామం లేదు. వాళ్లిద్దరు ఒకరి కొకరు ప్రేరణ. వాల్లిదరికి తల్లి తండ్రి ప్రేరణ.
2007 లో కింజాల్ సింగ్ IAS, ప్రింజాల్ సింగ్ IRS ని సాధించారు.
వారిద్దరి పట్టుదల విజయగాధ జ్యుడిషిల్ వ్యవస్థని తాకింది.
తండ్రి ని చంపిన 31 ఏళ్ల తర్వాత, చార్జ్ షీట్ చేసిన 27 ఏండ్ల తర్వాత ఎనిమిది మంది పోలిస్ అధికారులని నిందితులుగా నిర్ధారించింది. ఎస్ పి సింగ్ నిజాయితీ ని, తల్లి ఆరోపణలని నిజమని ప్రపంచానికి కోర్టు రుజువు చేసింది.
తీర్పు చెప్పినప్పుడు అప్పటి 'లక్ష్మి పుర ఖేరి' జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ గా ఉన్న కింజాల్ సింగ్ దుఖం దాచుకోలేక పోయింది. కన్నీటి పర్యంతం అయింది.
**
ఆడపిల్లలని తక్కువ గా చేసి చూసే/మాట్లాడే వాళ్లకి కింజాల్ సింగ్, ప్రింజాల్ సింగ్ ఒక సమాధానం.
దేశం గర్వించదగ్గ ఈ సోదరీమణులు ఇద్దరు నేటి అనేక మంది పిల్లలకి ఆదర్శం.