Tuesday, 27 June 2017

మనం ఏం నేర్పబోతున్నాం?


రెండున్నర టిక్కెట్ తీసుకుని, మూడు సీట్లు ఆక్రమించుకుని, నాలుగంటల ప్రయాణం చేసి సాయంత్రం అయిదుకి బస్ స్టాండ్ లో దిగి 'కాబ్' లో ఇంటికి చేరి ప్లాట్ లోకి వచ్చేసరికి నాలుగేళ్ల మా అమ్మాయి, మా ఆవిడ నీరస పడ్డారు.
అప్పటి దాకా బస్సులో నిద్ర పోయిన మా పాప 'ఆకలో' అంటూ గొడవ..
మా ఆవిడ వంట గది ప్రవేశం చేసింది.
'టు మినిట్స్' మాగి అయిదు నిమిషాల్లో చేసి హాల్లోకి వస్తూనే..
“నా పాస్ పోర్ట్” అంటూ గావుకేక పెట్టింది.
కెనడా లో ఉండే మా బామర్ధి తన పెళ్లి కి ఆడబిడ్డ కట్నం అనబడే రౌడీ మామూలు కింద ‘బ్లాక్ బెర్రి పాస్పోర్ట్’ ఫోన్ కొనిచ్చాడు. సుమారుగా అరలకారం ఖరీదు ఉంటుంది.
“బాగ్ లో ఎక్కడో పడిఉంటుంది కంగారు పడకుండా వెతుకు. “
ఆవిడ బాగ్ లో బట్టలు చిందరవందర చేసే లోగా నేను తన నెంబరుకి కాల్ చేశాను.
రింగవుతుంది. కానీ ఇంట్లో కాదు.
“నా ఫోన్. మా తమ్ముడు కొనిచ్చాడు.” అలివిమాలిన విపత్తు వచ్చినట్లు ఆమె మాట్లాడుతుంది.
మళ్ళీ రింగ్ చేశాను. ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరు లిఫ్ట్ చెయ్యటం లేదు
స్విచ్ ఆఫ్ చేయటానికి వీలవదు. పేట్రాన్ లాక్ చేసి ఉంది.
మూడోసారి రింగ్ చేసినప్పుడు. ఫోన్ లిఫ్ట్ చేశారు.
“హలో ..” ఎవరో స్త్రీ
ఈ లోగా నా చేతి లో ఫోన్ తను తీసుకుంది.
“ హలో .. నమస్తే ఆండీ.. అది మా ఫోన్ గంట క్రితమే శ్రీశైలం నుండి బస్సులో వచ్చాం. ఎక్కడో పడి పోయింది. బస్సు లో కానీ లేదా కాబ్ లో కానీ ..”
మా ఆవిడ అంత మర్యాదగా మాట్లాడగలదా?
నేను వాష్ రూమ్ కి వెళ్ళి వచ్చే సరికి
“వెళ్ళండి.. వెళ్ళండి .. బస్ స్టాండ్ లో నే ఉండావిడ. మెరూన్ కలర్ కాటన్ చీర, తెల్ల జుట్టు కి
పోన్నిటైల్ కట్టుకుని ఉంటుంది.”
“కాస్త మానవ భాషలో చెప్పవే.. “
“పన్నెండో నెంబరు ఫ్లాట్ ఫార్మ్ “
సెల్లార్ లో ఉన్న కారు తీసి బస్ స్టాండ్ కి వెళ్ళాను.
***
గంటన్నర తర్వాత ఇంటికి వచ్చిన నన్ను వాకిట్లో నే నిలేసింది.
“దొరికిందా? “
ఫోన్ చేతిలో పెట్టాను.
“ఇంత సేపు పట్టింది??. లాక్ ఉండే సరికి ఎటూ పనికిరాదని తెలిసి ఉంటుంది ముసల్దానికి”
తనని చెయ్యి ఎత్తి వారించాను.
“ఫోన్ ఇవ్వటం కోసం ఆమె అమ్మనబ్రోలు బస్సు మిస్ చేసుకుంది.
వాళ్ళ ఊరు వెళ్ళి ఇంటివద్ద దించి వస్తున్నాను. మీకు ఇవ్వమని ఈ సీసా జున్ను పాలు ఇచ్చింది.“
అన్నీ ముగించుకుని నిద్ర కి ఉపక్రమించే ముందు
“ శ్రావణి.. మనం బస్సులో వచ్చేటప్పుడు ఒకావిడ మన పక్కనే నిలబడి ఉంది కదా? మనం సర్దుకుని ఆమెని కూర్చొనివ్వొచ్చు కానీ మనం అలా చేయలేదు. రెండు గంటల పాటు ఆవిడ నిలబడే ఉంది. పెద్దవయసుని కూడా మనం గౌరవించలేదు. మనం ఏం నేర్చుకున్నాం? మన పాప కి ఏం నేర్పబోతున్నాం?”
‘నాది మరీ చాదస్తం’ అన్నట్లు నా వైపు చూసింది.
ఆ 'పెద్దావిడ' నే నేను దించి వచ్చింది.

Monday, 26 June 2017

వింత గిన్నె

అనగనగా ఒక ఊరిలో రంగయ్య అని ఒక రైతు ఉండే వాడు.
అతను బీదవాడు. తనకి తండ్రి ఇచ్చిన కొద్ది పాటి పొలం లో పక్కనే ప్రవహించే వాగు నుండి నీరు తెచ్చి కూరగాయలు పండించే వాడు.
అతని బార్య ఆ కూరగాయలు దగ్గర్లో ఉన్న నగరం లో అమ్మి , ఇంటికి కావల్సిన అవసరాలు గడుపుతూ ఉండేది.
ఒక రోజు ఆ రైతు తన పొలం లో చెట్ల పాదులు తవ్వుతూండగా అతని పలుగుకి ఏదో లోహం తగిలి శబ్దం వచ్చింది.
ఆసక్తిగా తవ్విన అతనికి భూమిలో ఎప్పటినుండో ఉండిపోయిన ఒక పెద్ద గిన్నె బయటపడింది.
దాదాపు వందమందికి వంట వండగలిగిన పెద్ద పాత్ర.
రైతు తనకి మరేదయినా విలువయిన వి దొరుకుతాయేమో నని చుట్టూ తోవ్వి చూశాడు. కానీ ఇంకేమీ దొరకలేదు.
అలసి పోయిన రైతు తన పలుగుని ఆ గిన్నె లోకి విసిరి వేసి, ఒక చెట్టు కింద పడుకుని నిద్ర పోయాడు.
కొద్దిసేపటికి అతను నిద్ర లేచే చూసే సరికి ఆ పెద్ద గిన్నెలో వంద పలుగులు కనిపించాయి.
రంగయ్య ఆశ్చర్య పోయాడు.
బార్యని పిలిచాడు. విషయం చెప్పాడు. ఆమె ఆ పలుగులు అన్నీ తీసి వేసి అందులో ఒక మామిడి కాయ ఉంచింది. ఆశ్చర్యం గా అవి వంద కాయలు గా మారి పోయాయి.
రంగయ్య అతని బార్య ఆ గిన్నెని బద్రపరిచారు. మామిడి కాయలు అందరికీ పంచి పెట్టారు.
తమ అవసరాన్ని బట్టి ఆ గిన్నెని వాడుకోవటం తమ అవసరాన్ని మించి ఉన్నవి ప్రజలకి పంచి పెట్టటం జరుగుతూ ఉంది.
త్వరలోనే వారి కుటుంబం అందరికీ సాయం చేయటం గురించి, చుట్టుపక్కల ఉర్ల కి తెలిసి పోయింది.
రంగయ్య తన కి అవసరం అనిపించిన ఆహార పదార్ధాలు మాత్రమే దాని లోనుండి వంద రేట్లు చేసి, తను తినగాగా మిగిలినవి నలుగురికి పంచుతూ వ్యవసాయం చేసుకుంటు ఆనందం గా జీవిస్తున్నాడు.
ఈ విషయం జమిందారి గారి బార్యకి అమ్మలక్కల ద్వారా తెలిసింది. ఆమె జమీందారు ని పోరు పెట్టి ఆ వింత గిన్నె కావాలని పట్టు పట్టింది.
ఆయన ఆ వింత గిన్నెని రంగయ్య వద్ద నుండి బలవంతంగా స్వాదినం చేసుకున్నాడు.
అతని బార్య సంతోష పడింది.
ఆమె వద్ద ఉన్న బంగారాన్ని ఆ గిన్నె లో వేసింది. అది వంద రెట్లు అయ్యింది.
బార్యా బర్తలు ఇద్దరు ఆనందం గా బంగారాన్ని సంచులలో నింపి బద్రం చేశారు.
గిన్నెలో మరో బంగారు నాణెం మిగిలిపోయింది.
దానిని తీసుకోటానికి బార్య గిన్నె లోకి వంగింది.
నాణెం అందుకోటానికి మరింత ముందుకి వంగి జారీ గిన్నె లో పడింది. 

గుండు

పది / పన్నెండు యేళ్ళ ఆ పిల్లాడు వయసుకి తగినంత చురుగ్గా ఉండకపోవటం ఆ హోటల్ రిసెప్షనిస్ట్ గమనించాడు.
రెండు రోజుల క్రితం వచ్చారా ఇద్దరు. ఒక తండ్రి బేలగా ఉన్న కుమారుడిని వెంటబెట్టుకుని.
“ఒక రూము కావాలి. ఒక వారం పాటు ఉంటాం. హాస్పిటల్ పని మీద వచ్చాం”
రెసెప్షన్ లో ఉన్నతను తండ్రి వివరాలు ఆధార్ వివరాలు నమోదు చేసుకుని రూమ్ బాయ్ ని పంపాడు.
అప్పటి నుండి వాళ్ళిద్దరిని అతను గమనిస్తూనే ఉన్నాడు. అతనితో పాటు రూము బాయ్స్ కూడా..
మర్నాడు టి నుండి హోటల్ లో భోజనం చేసేటప్పుడు ఆ పిల్లాడు సరిగా తినక పోవటం, తండ్రి కుమారుని అపురూపంగా బ్రతిమిలాడటం అందరూ గమనించారు. తండ్రి ఆ కుర్రాడి పట్ల చూపించే శ్రద్ధ వాళ్ళని గమనించేలా చేసింది.
మూడో రోజు పిల్లాడు నిద్ర పోయాక తండ్రి బయటకి వచ్చి, రిసెప్షనిస్ట్ తో మేనేజర్ కోసం అడిగాడు.
“రూము లో ఏదయినా అసౌకర్యం గా ఉంటే చెప్పండి. సరిచేయిస్తాను”
“అలాటిది ఏమి లేదు. బానే ఉంది. మీ మేనేజర్ ని కలవాలి”
మేనేజర్ వద్దకి రెసెప్షనిస్ట్ అతన్ని తీసుకు వెళ్ళాడు.
“చిన్న విషయం. మా అబ్బాయి కి ఆరోగ్యం బాలేదు. కిమో దెరపీ చేస్తున్నారు.. జుట్టు రాలిపోతూ ఉంది. మా వాడికి పొడవాటి జుట్టు అంటే ఇష్టం. అలా ఉడిపోవటం కంటే తానే పూర్తిగా తొలగించుకోవాలని బాబు అనుకుంటున్నాడు. మా అబ్బాయికి తోడుగా నేను కూడా జుట్టు తీసేసుకుంటున్నాను.”
అతను తటపటాయింపుగా నవ్వాడు.
మేనేజరు ఆశ్చర్యం గా వింటూ ఉంటే.. “రేపు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి బయటకి వచ్చినపుడు ఎవరు మమ్మల్ని చూసి నవ్వొద్దు. మా వాడు నొచ్చుకుంటాడు. దయచేసి అర్ధం చేసుకోండీ.” తండ్రి అతని  గది లోపలికి వెళ్ళి పోయాడు.

మర్నాడు ఉదయం తండ్రి కొడుకులు బయట కి వచ్చి హోటల్ వైపు వెళ్తున్నప్పుడు
రెసెప్షనిస్ట్ ఎదురోచ్చి.. ఆ పిల్లాడికి ఒక చాక్లెట్ ఇచ్చాడు “ గుడ్ మార్నింగ్ యంగ్ మాన్” అంటూ పలకరించాడు.
ఆరోజు డ్యూటీ లో ఉన్న రూం బాయ్ ని పరిచయం చేశాడు.
తామిద్దరిలాగే నున్నటి తలలతో ఉన్న హోటల్ స్టాఫ్ ని విప్పారిన కళ్ళతో ఆశ్చర్యంగా చూశాడా అబ్బాయి.

Wednesday, 21 June 2017

అయిదు జోకులు

1. “మీ అన్నయ్య గారు పెళ్లి కాక ముందు రోజు గుడికి వెళ్ళేవారట. ఇప్పుడు మానేశారు” గోడ మీద నుండి పక్కింటి ఆవిడ తో చెబుతుంది.
బండి పార్క్ చేసి లోపలికి వస్తున్న ఇంటాయనకి ఇది వినబడింది.
“నీతో పెళ్లి అయ్యాక నాకు దేవుడి మీద నమ్మకం పోయింది” ఇద్దరు వినేట్టుగా అని ఇంట్లోకి వెళ్ళాడు ఆయన.
..
రేపు పొద్దుట పేపర్ చూస్తే గాని రాత్రి ఆ ఇంట్లో జరిగిన విశేషాలు తెలియవు.
*****

2. మజ్ను భూమి మీద  పని ముగించుకున్నాక స్వర్గం చేరాడు.
ఫ్రంట్ ఆఫీసు లో కౌంటర్ దేవతా గాల్ అతని అడ్మిషన్ డీటైల్స్ వెరిఫై చేసింది.
మెడికల్ చెక్ అప్ కి రిఫర్ చేసింది.
మెడికల్ రేపోర్ట్స్ లో ఇంకా గుండె కొట్టుకుంటున్నట్టుగా ఈ‌సి‌జి ఎగుడు దిగుడు తీటాల్తో చండాలం గా ఉంది.
“ఎక్కడో పొరపాటు జరిగింది. ఇంకా ని గుండె కొట్టుకుంటుంది “ అందా దేవతా గాల్.
“నా గుండెలో నా బార్య ఇంకా బ్రతికే ఉంది” పోయేటిక్ గా చెప్పాడు మజ్ను..
..
..
..
..
“ఎవరక్కడ.. ఈ ఎక్స్ట్రా  గాడిని నరకానికి పంపండి.”

3. “హలో జియో సెర్వీస్ సెంటర్? మూడు రోజుల నుండి జియో సిమ్ నుండి నెట్ రావటం లేదు. దనాధన్ పాకేజీ లో బోలెడు  డబ్బు కట్టాను. ఎన్ని సార్లు చెప్పినా కంప్లైంట్ అటెండ్ అవటం లేదు. ఇప్పుడు మేమేం చెయ్యాలి?” కోపంగా ఆవిడ.
..
“ఇంట్లో పనులు బోలెడు ఉంటాయి. అవి చూసుకోండి.” ప్రశాంతం గా సమాదానం.
****
4.“మా ఆవిడకి గొంతు లో ఏదో సమస్య వచ్చింది. మాట్లాడలేక పోతుంది.  ఒక సారి టెస్ట్ చేయిద్దామని అనుకుంటున్నాను.”  ఒక డాక్టర్ మిత్రుడితో బర్త.
“హోం టెస్ట్ చేశావా?” అటునుండి డాక్టర్.
“హోమ్ టెస్ట్?.. అంటే “
“ సాయంత్రం బయటకి వెళ్ళి అర్ధరాతి దాటాక ఇంటికి వెళ్ళు. వీలయితే రెండు లార్జ్ లు పుచ్చుకో.
అప్పటికి మాట్లాడలేక పోయిందనుకో. పొద్దుటే క్లినిక్ వచ్చేయి” :D
****

5.ఒక రోజు శ్యామ్ మిత్రులందరిని పోగేసి మంచి పార్టీ ఇచ్చాడు.
రెండు రౌండు లు అయ్యాక “విషయం ఏమిటని?” అందరూ వాకబు చేశారు.
“ఫ్లాట్ కొన్నాను. మేం రెంట్ కి ఉండే ఫ్లాట్ పక్కదే. త్రీ బెడెడ్.” ఆనందం గా చెప్పాడు శ్యామ్.
“ఎంతేమిటి?
“మామూలుగా అయితే 70, 72 వరకు ఉంది. మనకి యాబై  లోపే వచ్చింది.”
“సొ లక్కీ .”
**
**
**
**
**
**
**
మీ ఆవిడ తవికలు వ్రాసి పాడుతుంది కదూ?”  ఎవరో అరిచారు.


Sunday, 18 June 2017

ముత్యాల హారం

ఒక యువకుడు  దారిన వెళుతూ ఉంటే ఒక ప్రక్క మురికి కాలవ లో ఒక ముత్యాల హారం కనిపించింది.
పెద్ద ముత్యాలు. చూడగానే చాలా విలువయినదిగా తెలుస్తుంది.
చుట్టూ గమనిస్తే కనుచూపు మేర లో ఎవరు కనిపించలేదు.
ఒక కర్ర పుల్ల తీసుకుని కాలవలో ముంచాడు. ఊహూ కర్ర కి తగల్లేదు
మరి కొంచెం లోపలికి ఉంది. వంగి చేతితో తీసే ప్రయత్నం చేశాడు. లాభం లేదు.
మరికొంత వంగి చూశాడు. ముత్యాల హారం చేతికి తగల్లేదు. కానీ అది మెరుస్తూ ఉంది.
ముత్యాలు కలుపుతూ బంగారు తీగ.. అయిదారు ముత్యాల మధ్య బంగారు పూస.. అద్బుతం గా ఉంది.
బట్టలు విప్పి, కాలవలోకి దిగాడు. కాలువ అంచులమీద బాలన్స్ చేస్తూ కాలితో తీసే ప్రయత్నం చేశాడు.
ఊహూ లాభం లేదు.
మరో పావుగంటకి బురద లో పోర్లాడిన పందిలా తయారయ్యాడు. కానీ హారం చేతికి దొర్కలేదు.
అది అద్బుత మయిన అందం తో మెరుస్తూ ఉంది. కంటికి కనిపిస్తూనే ఉంది.
కాసేపటికి ఆ యువకుని తండ్రి అదే దారిలో పోతూ, మురికి లో పోర్లాడుతున్న కొడుకుని చూశాడు.
“ఏం చేస్తున్నావు బాబూ?” ప్రేమగా అడిగాడు.
“నాన్నా.. ముత్యాలహారం కనిపిస్తుంది దానికోసం వెతుకుతున్నాను. కానీ చేతికి అందటం లేదు.” ఏడుపు గొంతుతో చెప్పాడా యువకుడు.
తండ్రి కుర్రాడి చేతిని పుచ్చుకుని బయటకి లాగాడు.
ముత్యాల హారం బురదలో లేదు. నువ్వు సరిగ్గా తల ఎత్తుకోగలిగేలా ఎదినట్లయితే.. చెట్టు కొమ్మకి వేలాడే ముత్యాల హరం కనిపించేది. లభించేది.Friday, 16 June 2017

పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ (ప్రకాశం, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా)

ఒక పదేళ్ళ తర్వాత.. మన ఆంధ్ర ప్రదేశ్ లో, ప్రకాశం -కర్నూలు జిల్లాల లో మనిషి సాధించిన ఒకానొక ఇంజనీరింగ్ అద్బుతం గా చెప్పుకోగలిగిన ఒక గొప్ప నిర్మాణం...

కృష్ణ నది శ్రేశైలం డామ్ ఎగువ రిజర్వాయర్ కి చేరే మలుపు వద్ద నుండి, 18.8 కిలోమీటర్లు దూరం కొండలని తొలుచుకుంటూ నలమల్ల సాగర్ రిజర్వాయర్ కి కేవలం గ్రావిటీ ఆధారంగా నీళ్ళు ప్రవహించేట్టుగా , రెండు సొరంగమార్గాలు నిర్మాణం భావితరాల దేవాలయం “పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్”

ప్రకాశం జిల్లా, మార్కాపురం, దోర్నాల నుండి సుమారుగా 20 కిలోమీటర్ల వద్ద సాగర్ రిజర్వాయిర్ నుండి అప్ స్త్రీమ్ సైడ్ శ్రీశైలం రిజర్వాయర్ (కొల్లం వాగు) వరకు తవ్వుతున్న రెండు సొరంగాల ను ఈ రోజు చూశాను.

క్లుప్తంగా... కృష్ణా నది కి వరదలు వచ్చినపుడు, శ్రీశైలం డాం నుండి క్రింది కి వదిలేసే నీరు ని మళ్లించి, ప్రకాశం జిల్లా లోని 23 మండలాలలో ని 3,24,600 ఏకరాలకి సాగునీరు, 6500 ఎకరాల ఆయకట్టు కలిగిన కంభం చెరువు, 3,500 ఎకరాల ఆయకట్టు ఉన్న గుండ్లబ్రహ్మేశ్వరం రిజర్వాయర్, 1,500 ఎకరాల రాళ్ళవాగు రిసర్వాయర్ లను నింపుతూ, పక్కనే ఉన్న నెల్లూరు జిల్లాలో 77500 ఎకరాలకు సాగునీరు, 6,500 ఎకరాల ఆయకట్టు కలిగిన గండిపాలెం చెరువు, కడప జిల్లాలోని రెండు మండలాలలో 27200 ఎకరాలు కి సాగునీరు, 1,800 ఎకరాల ఆయకట్టు ఉన్న రాచెరువు నింపే అవకాశం ఉన్న ఈ ప్రాజెక్ట్, 15.25 లక్షల మందిని ఫ్లోరైడ్ పీడిత మూడు జిల్లాల లోని 30 మండలాల దాహర్తిని తీర్చేందుకు ఉద్దేశించిన ప్రాజెక్ట్ ఇది.

మొదట 7.0 మీటర్ల వ్యాసం తో 18.8 కిలోమీటర్లు, దూరం ఏర్పాటు చేసే టన్నెల్ ద్వారా 45 రోజుల వరద కాలం లో 85 Cumecs నీటిని తరలించే ఆలోచనతో మొదలయిన ఈ ప్రాజెక్ట్.. 2004-05 ఆర్ధిక సంవత్సరం లో ఫైనల్ అయింది.
9.2 మీటర్ల వ్యాసం తో 18.8 కిలోమీటర్లు, దూరం ఏర్పాటు చేసే టన్నెల్ ద్వారా 30 రోజుల్లోనే 43.5 Cumecs నీరు తరలించే రెండో యూనిట్ ను కూడా సమాంతరం గా మంజూరు చేసి ప్రారంభించారు.
***
150 కోట్ల విలువ చేసే tunnel boring machine TBM లని జర్మనీ ఏర్పాటు చేసింది.
ఎలుక అని ముద్దుగా పిలవబడే ఈ యంత్రం కొండని సుమారుగా 7.5 మీటర్ల వ్యాసం తో, మీటర్ గేజ్ రైలు పట్టాల మీద ముందుకు నడుస్తూ, తొలుచుకుంటూ ముందుకు వెళుతుంది.

58 బోర్ కట్టింగ్ వీల్స్ దీని ముఖ బాగాన అమర్చి ఉంటాయి. (జర్మనీ నుండి షిప్స్ ద్వారా సైట్ కి వస్తుంటాయి. చైనా మేడ్ వి కొన్ని, చెన్నై మేడ్ వి కొన్ని కూడా వాడుతుంటారు)
ఇవి తిరిగేటప్పుడు ఉత్పన్నమయ్యే 200 డిగ్రీల ఉష్ణోగ్రత ని బయట నుండి పంపింగ్ చెయ్యబడే ఎయిర్ కూల్డ్ వాటర్ పిచికారి చెయ్యటం ద్వారా కంట్రోల్ చేస్తారు.
అంతే కాకుండా ఉత్పన్నమయ్యే దుమ్ము (dust) కూడా నీటితో తడిచి స్లర్రి (బురద) గా మారుతుంది. తోవ్విన రాయి ముక్కలుగా మారి కొన్వేయర్ బెల్ట్ ద్వారా సొరంగం బయటకి వస్తూ ఉంటుంది. దాన్ని జే‌సి‌బి, లు ట్రాక్ ల సాయం తో దూరంగా పంపిస్తూ ఉంటారు.

తవ్విన బాగం లోకి, ప్రికాస్ట్ ఆర్‌సి‌సి చాపాలతో 7మీటర్ల వ్యాసం వచ్చెట్టుగా అమర్చి దాని చుట్టూ నాణ్యమయిన సెమెంట్ స్లర్రి తో గ్రౌటింగ్ చేస్తూ ఉంటారు.

కొండ లోపలికి వెళ్ళే కొంది యూనిట్ వద్ద పని చేయటానికి మీటర్ గేజ్ మీద ఏర్పాటు చేసిన డీజిల్ జెనరేటర్ యంత్రం తో లాగబడే రైలు లాటి వాహనాలు ఉంటాయి. వీటినే అన్నీ రకాల పని ముట్ల రవాణా కి వాడుతుంటారు,(జనరేటర్, వర్కర్స్, ప్రీ కాస్ట్ అర్చేస్, రైల్స్, వెల్డింగ్ మెషిన్స్, లాటివి)

కోడాని తొలిచ్చేటప్పుడు ఉరే నీరు ని బయటకి పంపి అందులో కొంత నీరు ని చల్లబరచి మరో పైపు ద్వారా యూనిట్ చల్లబరిచేందుకు లోనికి పంపుతుంటారు.

350 యూనిట్ల విద్యుత్తు తయారు చేసి, TBM ని పని చేయించే శక్తివంతమయిన యంత్రాలు, TBM కట్ చేసిన రాయి, డస్ట్ ని బయటకి చేరవేసే రోలింగ్ బెల్ట్లు, పని జరిగే చోట వరకు బలంగా మంచి గాలిని నిరంతరం అందించే పెద్ద గొట్టాల ఏర్పాటు, సొరంగం మ్ముందుకు వెళ్ళేకోంది, అదనంగా ట్రాక్ నిర్మాణం ఇవన్నీ రోజుకి మూడు షిఫ్ట్ లలో నడుస్తుంటాయి.

ఒక్క సారి TBM సుమారుగా 0.8 మీటర్లు దూరం కట్ చేస్తుంది. ఆరుసార్లు ఈ యంత్రం ముందుకు వెళ్ళాక, కట్టర్ లని పరీక్షిస్తారు.
ఎక్కువగా అరిగి పోయిన కట్టర్ ని కొత్త రింగులు వేసి మారుస్తారు.
(సుమారుగా ప్రతి 4.8 మీటర్లకి కట్టింగ్ యూనిట్స్ మార్చడం జరుగుతుంది)

టి‌బి‌ఎం తవ్విన వ్యాసం కంటే ఫినిష్ అయ్యాక ఉండే వ్యాసం తక్కువ కనుక అది ముందుకు వెళ్ళి సొరంగం పూర్తి అయ్యాక రెండో మార్గం నుండి బయటకి రావటం మినహా తిరిగి వెనక్కి రావటం సాద్యపడదు.
(పెళ్లి అయిన మగాడి లెక్కే :p )

ఏ అవాంతరాలు లేకుంటే సుమారుగా 150 మీటర్లు నెలకి సగటున తవ్వకం జరుగుతుంది.

7 మీటర్ల వ్యాసం కలిగిన మొదటి టన్నెల్ 14.5 కిలోమీటర్ల వద్ద పని నడుస్తుంది, 9.2 మీటర్ల వ్యాసం కలిగిన రెండవ టన్నెల్ 10 కిలో మీటర్లు వరకు తవ్వాక పనులు ఆపి వేయబడి ఉన్నాయి.

అద్బుతమయిన ఇంజనీరింగ్ ప్రతిభ అనువనువునా కనిపించే ఈ నిర్మాణం హెడ్ రేగులేటరీ పనులు ప్రారంభించాల్సి ఉంది.

ప్రతి కోర్ ఇంజనీరింగ్ స్టూడెంటు (civil/mechanical/electrical) తప్పనిసరిగా చూసి తెలుసుకోవాల్సిన ఒక అద్బుత నిర్మాణ విధానం ఈ “పూల చెంచయ్య వెలిగొండ ప్రాజెక్ట్”

వ్రాస్తూ పోతే చాలా ఉంది.
క్లుప్తంగా పరిచయం చేయటం మాత్రమే నా ఉద్దేశం.

ఈ రోజు నా జీవితం లో గుర్తుంది పోయే రోజు.
ప్రాజెక్ట్ ని విపులంగా చూడటమే కాకుండా, టన్నెల్ లోకి ప్రయాణం చేసే అవకాశం దొరికింది.
దీన్ని సాద్యం చేసిన మిత్రులకి దన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

Wednesday, 14 June 2017

ప్లాన్ 'A'

ఆదివారం ఉదయాన్నే రఘుపతి గుంటూరు నుండి నేరుగా వచ్చేశాడు. 
మస్తాన్ ఇడ్లీ తిన్నాక పిచ్చాపాటి మాట్లాడుకున్నాం. 
“ పాంచజన్య ఎలా ఉన్నాడు?”
“వాడికేం? బావున్నాడు గురుజీ”
“ఇప్పుడు నీకేం అయింది? 
“ఇంట్లో నన్ను సరిగా పట్టించుకోవటం లేదు గురూజీ” రఘుపతి కళ్ళు ఒత్తుకున్నాడు.
“బాధపడకు మన దగ్గర దండిగా అవుడియాలున్నాయి”
అతను నమస్కరించాడు.
నేను దీవించాను.
***
రాత్రి పది దాటింది.
వాట్స్ అప్ కాల్. రఘుపతి నుండి.
“గురుజీ..” గొంతుని బట్టి ఏడుపు ఆపుకుంటున్నట్టు తెలుస్తుంది.
“ఏమయింది?” కంగారుగా అడిగాను.
“మీరు చెప్పినట్లే ప్లాన్ A ప్రకారం హల్వా కొనుక్కుని, మూరెడు మల్లెపూలు కొనుక్కుని ఇంటికెళ్ళాను.”
“ఏడుపు ఆపు. విషయం చెప్పు”
“పోగానే హల్వా, పూల పొట్లాం ఇచ్చి ‘ఎంత అందంగా ఉన్నావు డియర్’ అన్నాను”
“నవ్వుతూ సిగ్గుపడిందా?”
“తమరి జ్ఞానం మండి నట్టే ఉంది. నవ్వితే మీకేందుకు ఫోన్ చేస్తాను?”
“మరి?”
“నేను అందంగా ఉన్నావు డియర్ అనగానే, ‘ఓరి దేవుడో ఈయన మళ్ళీ తాగొచ్చాడు’ అంటూ కింద కూలబడి ఏడుపు మొదలెట్టింది. “
“ఇప్పుడేం చెయ్య బోతున్నావు?”
“మిమ్మల్ని unfriend/block చెయ్య బోతున్నాను”
“ఒక్క నిమిషం .. ఆగు మన దగ్గర ప్లాన్ B ఉంది” నా మాట పూర్తి కాకుండానే ఫోన్ కట్టయింది. 

అప్పట్లో ఒక నెల బడ్జెట్


మా చిన్నమ్మాయి హై స్కూల్ లో ఉన్నప్పుడు, పొదిలి నుండి ఒంగోలు కి షిఫ్ట్ అయ్యాం.
స్కూల్ కి దగ్గర్లో ఒక చిన్న ఇల్లు 1500 రూపాయల అద్దెకి తీసుకున్నాం.
మ చిన్నది 9th క్లాస్ లోనూ, పెద్దది 10th లోనూ, సాయి 4th లోనూ ఉన్నారు.
చిన్నమ్మాయికి డబ్బు గురించి చెప్పాల్సిన వయసు వచ్చిందని అనిపించింది.
ఒక రోజు అందరం బోజనం చేసేటప్పుడు స్క్రిప్ట్ ప్రకారం మా చిన్నమ్మాయికి ఉన్న తెలివితేటలు గుండమ్మకి లేవని నమ్మేట్టు చెప్పాను. కావాలంటే ఒక నెల బడ్జెట్ తను చూస్తుంది అని చెప్పాను.
ఒకటవతేదీ జీతం 8,600 రూపాయలు, మా చిన్న దానికి ఇచ్చాం. తానొక నోట్సు పెట్టుకుని చిన్న బాగ్ ఒకటి వేరుగా ఉంచుకుని అందులో డబ్బు ఉంచుకుంది.
ప్రతి రోజు మా ఆవిడ ఖర్చులకి డబ్బు అడగటం, తను తీసి ఇవ్వటం, ఇంత ఎందుకయిందని ఆరా తియ్యటం. నోట్సు లో ఖర్చు వ్రాసుకోవటం. తీసివేతలు వేసి, బాలన్స్ చెక్ చేసుకోవటం మొదలయ్యింది.
ఈ విషయం లో ఎదురు దెబ్బలు తిన్న పెద్దమ్మాయి, చిన్న దాన్ని జాలిగా చూడటం మాత్రం దాచలేక పోయింది.
ఇంటి అద్దె, పాలు, కరెంటు బిల్లు, గాస్, స్కూల్ ఫీజులు, కూరగాయలు ఖర్చు పోను మూడు వేలు దాకా మిగిలాయి.
రెండు రోజులకి ఒక సారి పెట్రోల్ కి వంద అడిగే వాడిని, రెండు సార్లు బానే ఇచ్చింది. తర్వాత పెట్రోల్ వినియోగం వల్ల జరిగే అనర్ధాలు, భూమి వాతావరణ వేడి పెరగటం, ఓజోన్ పొర దెబ్బతినటం గురించి క్లాస్ ఇచ్చి, శుభ్రంగా బస్సు కి వెళ్ళండి అని 50 రూపాయలు చేత పెట్టింది.
ఈలోగా ఒక పెద్ద విపత్తు వచ్చి పడింది. ఇంట్లో వాషింగ్ మెషీన్ పని చెయ్యటం మానేసింది.
అందరం దగ్గర్లో షాపు కి వెళ్ళి కొత్తది చూసి వచ్చాం. మా చిన్నది ఎన్నిరకాలుగా అడిగినా 7200 కి ఒక్క పైసా తగ్గేది లేదని ఖరాకండిగా చెప్పేశాడు.
ఇంటికొచ్చాక వాళ్ళ తమ్ముడిని అక్కని కూర్చోబెట్టి, పాత మిషను ఎందుకు చెడిపోయింది. దానిని ఎలా రిపైర్ చెయ్యొచ్చు అనే దానిమీద పరిశోదన చేసింది.
బట్టలు చేతితో ఉతకటం వల్ల ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందో వాళ్ళ అమ్మకి చెప్పింది. మా ఆవిడ రెండు రోజులు ఉతికిన బట్టలు చిన్నదానితో ఆరేయించింది.
అది టప్పున మనసు మార్చుకుని "నాన్నా వాషింగ్ మెషీన్ వాయిదాల్లో ఇస్తారటగా" అంది.
పాత దాన్ని అమ్మేసాము.
అయిదొందలు కి మేం సిద్దపడ్డప్పుడు కొనేవాడి పీసు తీసి 550 వసూలు చేసింది.
ఆనెలలో అదొక్కటే జమ.
నాలుగు ఇంస్టాల్మెంట్స్ లో చెల్లించేట్టుగా వాషింగ్ మెషీన్ తెచ్చాము.
నెలలో మరో పది రోజులు మిగిలి ఉండగానే బాలన్స్ మూడు అంకెల్లోకి మారి పోయింది.
ఇంట్లో ఏ అవసరం వచ్చినా, చిన్నదాన్ని అడగాలంటే భయం వేసెట్టు గా క్లాసులు పీకటం మొదలెట్టింది.
ఈలోగా ఒక సెల్ ఫోన్ కోనాల్సిన పరిస్తితి వచ్చింది. కనీసం 2600 ధర ఉంది. (చైనా ఫోన్ లు రాలేదు)
“జీవనా ఒక ఫోన్ కొంటె ఎలా ఉంటుంది. “ పొద్దుటే టిఫిన్ చేస్తూ అడిగాను.
ఒక్క ఉదుటున వెళ్ళి డబ్బు సంచి, లెక్కలు వ్రాసి పెట్టిన పుస్తకం తెచ్చి....మా ముందు పెట్టి
” అయ్యా నా వల్ల కాదు. మీరే కొనుక్కోండి. ఈ నెల్లోనే వాషింగ్ మెషిన్లు, ఫోన్లు అన్నీ కొనెయ్యండి."
ఉడుకుమోతు తనంగా అరిచింది.
పెద్ద దాని చూపు కి పూర్తి అర్ధం చిన్నదానికి తెలిసింది.
“అమ్మ ఊరికే డబ్బు దుబారా చేస్తుంది తల్లి నువ్వయితే బాగా ఉంటుందని “ నేను ఉడికించాను. ..
“అయ్యా నాకు ఈ డబ్బు వద్దు.. ఈ పెత్తనం అసలే వద్దు.. “
అంటూ అలిగి మూతి ముడిచింది చిన్నది.
ఒక జ్ణాపకం

Monday, 12 June 2017

మొదటి అనుభవం.

గదిలో ఏ సి... చల్లటి వాతావరణం.
మెత్తటి పడక ని ఆమెకి చూపించాడు.
ఆమె మెల్లగా కూర్చుంది. "ఊహూ కొంచెం రిలాక్స్ గా ఉండొచ్చు."
అతను దైర్యం చెప్పాడు. 
ఆమె వెనక్కి వాలింది.
కళ్ళు మూసుకుని ఘాడం గా ఊపిరి పీల్చుకుంది.
"ఇదే మొదటి సారా?" అతను మృదువుగా అడిగాడు. 
అవునన్నట్టు ఆమె తల ఊపింది.
మెల్లగా దగ్గరకి వచ్చాడు.
మాట్లాడే అవకాశం లేకుండా చేతి వేలితో సరిగా అక్కడ పట్టుకుని వత్తాడు.
ఆమెకి మత్తుగా ఉంది.
అతని వేలి స్పర్శ తెలుస్తుంది.
"ఇబ్బంది గా ఉందా?"
లేదన్నట్లు బేలగా కళ్ళు తిప్పింది.
అతను మెల్లిగా తన పని చేసుకు పోసాగాడు.
ఆమె అతనికి సహకరించే ప్రయత్నం చేసింది.
కానీ నొప్పి తెలుస్తుంది.
"కొద్దిసేపు ఆగనా? అతని ప్రశ్న.
"ఊహూ త్వరగా కానివ్వండి :p " అన్నట్టు కళ్ళతోనే చెప్పింది.
అతనికి చాలా అనుభవం ఉంది. :
నవ్వుతూనే తన పని కానిచ్చాడు..
అతను తన నుండి దూరంగా జరుగుతూ ఉంటే ఆమె అలసటగా కళ్ళు విప్పారించింది.
....
....
....
....
....
....
....
....
....
ఏందయ్యా?? తెగ గుచ్చి గుచ్చి చదువుతున్నారు.
మీరెప్పుడు పన్ను పీకించుకోలా?

Sunday, 11 June 2017

డుర్రు

జస్టిస్ రాజశేఖరం గారు తనుండే ఐశ్వర్య అపార్ట్మెంట్, నాలుగో అంతస్తు నుండి లిఫ్ట్ వాడకుండా మెట్లు దిగి వాకింగ్ మొదలెట్టే సరికి టైమ్ సరిగ్గా నాలుగున్నర అవుతుంది.
ఎవరయినా గడియారం సరిచేసుకోవచ్చు. అంత కరెక్ట్.
ఒక వారం క్రితం సరిగ్గా పోయిన శనివారం జరిగిందా విషయం.
రోజు లాగే..మెట్లు దిగి గేటు వైపు నడుస్తూ ఉంటే..
అనూహ్యంగా ఏదురు వచ్చిన వాచ్మేన్ ‘కొండలు’ రెండు చేతులు బొటన వెళ్ళు నోట్లో, చూపుడు వేళ్ళు తో కళ్లని సాగదిస్తూ.. నాలుక బయట పెట్టి “డుర్ర్ “ మంటూ వెక్కిరించాడు.
ఏం జరిగిందో రాజశేఖరం గారు గ్రహించే లోపు వడి వడి గా నడిచి గేటు బయట మంచు లోకి నడిచి వెళ్ళాడు.
రాజశేఖరం గారు తెరుకుని పిలిచే లోపు కనుమరుగయి పోయాడు.
ఆ రోజు అరగంట ముందు గానే వాకింగ్ ముగించుకుని ఫ్లాట్ కొచ్చాడు ఆయన..
వచ్చి రాగానే,, బార్య సుధామణీ ని పిలిచి “మన అపార్ట్మెంట్ వాచ్మేన్ పేరు ఏమిటి?” అని అడిగాడు.
అతనికి సమయానికి వాచ్మేన్ పేరు గుర్తుకు రాలేదు.
“అతనా? ఏడు కొండలో, కొండల రావో .. మొత్తానికి అందరూ కొండలు అని పిలిచెట్టు ఉన్నారు” అని సమాదానం ఇచ్చిందావిడ.
“ఏం ఏమిటలా అడిగారు? ఏదయినా పని పడిందా?”
“ఏం లేదు.. ఉరికినే.. ఈ రోజు వాకింగ్ కి వెళ్ళేటప్పటికే గేటు తాళం తీసి ఉంచాడు. కుతూహలం కొద్ది అడిగాను”
ఆయన జరిగిన విషయం బార్య కి చెప్పటానికి మొహమాట పడ్డాడు.
అసలు ఏమని చెబుతాడు? ఎందుకు వెక్కిరించాడని చెబుతాడు.
రోజు మాదిరి గానే రెడీ అయ్యి, క్లబ్బుకి తన కార్లో బయలు దేరాడు.
జిల్లా జెడ్జి గా రిటైర్ అయ్యి నాలుగేళ్లయింది.
ఒకే అమ్మాయి.
అల్లుడు, అమ్మాయి ఇద్దరు విశాఖ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. స్థిర పడ్డారు. ఏ బాదర బందీ లేదు.
ఆరోగ్యంగా ఉండే బార్యతో ప్రశాంతమయిన జీవితం గడిపుతున్నాడు.
అన్యమనస్కంగా డ్రైవ్ చేస్తున్నానని క్లబ్ దాటి రెండు కిలోమీటర్లు వెళ్ళాక గాని ఆయన గుర్తించలేదు.
ఎందుకు? అసలు ఎందుకలా ప్రవర్తించాడు? నాలుక బయటపెట్టి డుర్రు మని శబ్దం చేస్తూ...
మద్యానం లంచ్ కి వచ్చినప్పుడు బార్య ని “సుధా? మన వాచ్మేన్ వాళ్ళు ఎన్నాళ్ల నుండి ఇక్కడ ఉంటున్నారు?”
మునక్కాడ పులుసు వడ్డిస్తూ ఆవిడ విస్తూ పోయింది.
ఎప్పుడు లేనిది బర్త వాచ్మెన్ గురించి కుతూహలం గా ఉండటం. “ నాలుగేళ్ళు అనుకుంటానండి. మీ రిటైర్మెంట్ ఫంక్షన్ అప్పుడు కొత్తగా వచ్చినట్టున్నారు” అనుమానం గా చూస్తూ చెప్పిందావిడ.
“ ఏమయిందండి”
“ఏం లేదు పాపం పిల్లా జల్లా తో ఉన్నట్టు ఉన్నారు జీతం అది సరిపోతుందో లేదో.. అసలే ఖర్చులు మండి పోతున్నాయి . కొద్దిగా గమనించు”
దానికావిడ కుదుటపడ్డ మనసుతో.. “ అతని బార్యే నండి మనింట్లో పని చేసేది. ఇద్దరిమే ఆయినా వెయ్యి రూపాయలు ఇస్తున్నాను. పైగా కొండలు ఇస్త్రీ చేసి కొంత సంపాదిస్తాడు. పనిచెయ్యాలే గాని ఈరోజుల్లో వాళ్ళకి జరిగినట్లు ఒంటి జీతగాళ్ళకి కూడా జరగదు. పెద్దగా ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని నేను అనుకొను. అయినా మీరు చెప్పారుగా? ఒక సారి కదిలించి చూస్తాను ఏదయినా అవసరం అనుకుంటే పాతికో పరకో సర్దుతాను.”
రాజ శేఖరం ఇవేవీ వినలేదు. అతని చెవుల్లో డుర్రు మని అతను చేసిన శబ్దమే వినబడుతుంది.
ఆరోజు నుండి కొండలు ఇతనికి కనబడలేదు.
ఉదయాన్నే మెట్లు దిగే టప్పుడు, మెట్ల వద్ద ఎవరిదో నీడ కనబడుతుంది.
కొండలా? ఊహూ.. కాదు మరెవరో??!!
రాజశేఖరం గారు మెట్లు దిగటం మానేశారు.
లిఫ్ట్ లో కిందకి దిగి నైరుతి మూలగా ఉన్న వాచ్మేన్ గది వైపు చూసి చూడనట్టు చూస్తాడు.
ఆక్కడెవరూ కనబడరు.
ఎప్పుడయినా ఆ గది లో నుండి నీడ ఒకటి కనిపిస్తుంది.
ఒక్కోసారి అతనికి అక్కడే నిలబడి “ఒరేయ్ కొండలూ “ అని గట్టిగా పిలవాలనిపిస్తుంది.
ఒక వేళ పిలిచాడే అనుకో అతను వచ్చి ఎదురుగా నిలబడి చేతులు కట్టుకుంటే”ఏమని?” ఆడటం.??
“ఎందుకు ఎక్కిరించావు ?” అని ఎలా అడగటం.
ఈ లోగా ఎవరయినా వింటే.. ఎవరూ వినకపోయినా అతని బార్య పిల్లలు వింటారు.
జడ్జి గారిని కొండలూ “డుర్రు” మని వెక్కిరించాడని అందరికీ తెలుస్తుంది.
అప్పుడు, అందరూ తనని చూసి “డుర్రు” మని ఎగతాళి చేస్తే... ఎలా?
డుర్రు -2
-----------
ఇన్నాళ్లుగా కాపాడుకుంటున్న పెద్ద మనిషి ముసుగు చినిగి పోదూ?
అసలు ఎందుకు అతను వెక్కిరించాడు? తెలియకుండా తన కారణంగా అతనికి నష్టం జరిగిందా? బాధ పడ్డాడా?
అతని జీతం విషయం లో కానీ, అతని విషయం లో కానీ ఫ్లాట్ ఓనర్ కమిటీ లో తను వ్యతిరేకించినది లేదు.
అతనికి తనకి ఇంటరాక్షన్ కూడా తక్కువే.. మరి ఎక్కడ? ఏం జరిగింది.?
రాజశేఖరం గారికి సుధామణి మర్నాడు గుర్తు చేసింది. “మీరు షేవ్ చేసుకుని మూడు రోజులయింది. గతం లో ఎప్పుడు ఇలా జరగలేదు? ఏమయింది? వైజాక్ నుండి ఏదయినా??”
“చ ఛ అలాటిదేమీ లేదు” అన్నాడు. కొంచెం నలతగా ఉంది అంతే” సర్ది చెప్పాడు.
క్లబ్ లో పాత మిత్రుడు ఒకరు తారసపడ్డాడు. బహుముఖ ప్రజ్ఞాశాలి
“ చెంగల్రాయుడూ నాకో సాయం చెయ్యాలి.”
రాజశేఖరం అతనితో అన్నాడు.
“ఒక సామాన్యుడు తనకి ఏవిదం గాను సంభందం లేని వ్యక్తి ని ఎందుకు ద్వేషిస్తాడు? లేదా తక్కువ చేస్తాడు?అంతెందుకు తక్కువ చేసి వెక్కిరిస్తాడు?” ఆశ్చర్యపోవటం అతని వంతు అయ్యింది.
చెంగల్రాయుడు ఒక సారి నిశితం గా అతన్ని గమనించి... “దేర్ ఈజే కాజ్ బిహైండ్ ఎవ్రి ఆక్ట్. ఏదో కారణం గా ఎక్కడో నొచ్చుకొక పోతే ఒక సామాన్యుడు అలా ప్రవర్తించడం జరగదు. ఉదాహరణ కి మనమే ఉన్నాం అనుకో.. అతనికి లేదా అతని తాలూకు వారికి చెయ్యని తప్పుకి శిక్ష విదించి ఉండొచ్చు.. సరయిన న్యాయం జరగలేదని దానికి మనమే కారణమని అతను భావించి ఉండవచ్చు..”
రాజశేఖరం తను రిటైర్ అయ్యే కాలం లో జడ్జిమెంటు ఇచ్చిన కేసులన్నీ ఒక సారి నెమరు వేసుకున్నాడు. అంతర్ముఖంగా అనేక మంది వ్యక్తులని, సంఘటనలని గుర్తు చేసుకునే ప్రయత్నం చేశాడు కానీ ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు.
రాజశేఖరానికి కొండలు ఒక పెద్ద సమస్య అయి కూర్చున్నాడు.
రాత్రి మంచి నిద్ర లో ‘డుర్రు’ మని ఎవరో వెంటబడుతున్నట్టు.. ముఖం మీద వంగి మరెవరో వెక్కిరించినట్లు... హటాత్తుగా మెళుకువ వచ్చేది... పడక కుర్చీ లో కూర్చుని దీర్ఘం గా ఆలోచిస్తూ ఉండేవాడు.
శీతా కాలం చిక్కబడుతుంది. పొగమంచు దట్టంగా ...పేరుకుంటూ ఉంది. రాజ శేఖరం బుర్ర నిండా అనుక్షణం .. కొండలు కొండలు... నిద్ర లోనూ.. మెళుకువ లోనూ...
అతనికి చీకట్లో బయటకి వెళ్ళటం అంటే నే ఒక బెరుకు ఏర్పడింది.
***
ఈ ఉదయం అతను ఇంట్లోనే ఉండి పోయాడు.
“ఏం వాకింగ్ కి వెళ్ళటం లేదా?” సుధారాణి ప్రశ్నించింది.
“ఊహూ.. తలనొప్పినా ఉంది మంచి కాఫీ చెయ్యి.”
“పని మనిషి రాలేదు. రెండు నిమిషాలు. ఆగండి. గిన్నెలు జాలార్లో అలానే ఉన్నాయి”
“ ఏం ? ఎందుకట?”
“కొండలు కి ఆస్తమా ముదిరిందిట. ఊపిరి ఆడక నోరు బలవంతంగా తెరిచి మరి ఊపిరి తీసుకోవాల్సి వస్తుందిట. 'డుర్రు' మని ఒకటే శబ్దం. చాప మందు కోసమని హైదరాబాదు వెళ్లారు”
😀😜😀😝