Thursday 27 September 2018

శివ సుబ్రహ్మణ్యం

తమిళనాడులో మంచి కళాశాల లో ఇంజనీరింగ్ విద్య అభ్యసించాలని అనుకునేవారికి SSN కాలేజి గురించి పరిచయం చెయ్యక్కరలేదు.
సువిశాలమయిన ప్రాంగణం, అన్ని ఆధునిక సౌకర్యాల తొ కళాశాల. ఆధునిక లైబ్రరీ..ఆన్లైన్ పత్రికలు, ఎన్నో పుస్తకాలు ప్రశాంతమయిన హాల్స్ .. ఆసక్తి ఉండాలేగాని అందుబాటులో సర్వ విజ్ఞాన భండారం...
శివ సుబ్రహమణ్యం అనే ఒక సాధారణ మయిన కాఖీ డ్రెస్ వేసుకున్న యువకుడిని, కాలేజీ మొదలయిన అరగంట తర్వాత అక్కడే చూడొచ్చు. తిరిగి కాలేజి ముగిసే అరగంట ముందు వరకు అక్కడే ఉంటాడు. చేతి సంచి లో తెచ్చుకున్న రద్దు పేపర్ల పుస్తకం లో నాసిరకం బాల్ పెన్ను తొ తనకు నచ్చిన విషయాలు వ్రాసుకుంటూ ఉండేవాడు.
విల్లుపురం జిల్లా లోని ముత్తతూర్ లో అతను హైయ్యర్ సెకండరీ వరకు చదివాడు.
సైన్సు, లెక్కల్లో అద్బుతమయిన ప్రతిభ కనపరిచే వాడు. పరిస్థితులు అనుకూలించక, కుటుంభానికి ఆర్ధిక భారం కాలేక SSN ఇంజినీరింగ్ కాలేజి లో బస్సు కండక్టర్ గా కొద్ది పాటి వేతనానికి చేరాడు.
ఉరి చివర చిన్న గదిలో ఉంటూ వచ్చిన జీతం లో కొంత బాగం ఇంటికి పంపుతూ ఉండేవాడు. వేసుకోటానికి రెండు జతల కాఖీ యునిఫారం బట్టలు, హవాయి చెప్పులు, ఒక చేతి సంచీ అతని ఆస్తి.
కాని వీటన్నిని మించి శివ సుబ్రహ్మణ్యం వద్ద మరొక విలువయిన ఆస్తి ఉంది. ఆది “దృక్పదం “
కాలేజి ట్రిప్స్ అవగానే బస్సులు ఒక వరసలో నిలబెడతారు. తిరిగి సాయంత్రం వరకు అతనికి అక్కడ పని ఉండదు.
తనతో పాటు మిగిలిన డ్రైవర్లు, కండక్టర్ లు ఒక చెట్టు నీడ న చేరి కార్డ్స్ ఆడుకోవటమో, కబుర్లు చెప్పుకోవటమో చేసేవాళ్ళు.
శివ సుబ్రమణ్యం తన చేతి సంచీ తీసుకుని నేరుగా కాలేజి లైబ్రరీ కి వెళ్ళేవాడు. లైబ్రయిన్ తొ మంచిగా ఉంటూ ఒక మూల కుర్చుని తనకి కావాల్సిన పుస్తకాలు చదువుకునే వాడు.
కాలం ఆగదు. నడుస్తూనే ఉంటుంది. అనేక మార్పులని తెస్తూ ఉంటుంది. దానికి సద్వినియోగం చేసుకోవటం లేదా వృధా చేసుకోవటం అనేది మాత్రం అచ్చంగా మన చేతుల్లోనే ఉంటుంది.
ప్రైవేట్ గా డిగ్రీ వ్రాసి మంచి మార్కులతో పూర్తి చేసిన సుబ్రమణ్యం అంతటితో ఆగలేదు.
UPSC పరిక్షల వైపు దృష్టి సారించాడు.
ఎవరి బలవంతం మీదో, మొక్కుబడి గానే, హోదా కోసమో, కాటగిరి లు వాడుకోవటం కోసమో ఆతను చదవలేదు.
అతనికి ఒక గొప్ప 'దృక్పదం' ఉంది ఒక 'లక్షం' ఉంది. అందుకే అతని కి విజయం లొంగిపోయింది.
*****Odisha రాష్ట్రం లొనీ బొలంగిర్ జిల్లా లో ప్రస్తుతం IPS అధికారి గా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ శివ సుబ్రహ్మణ్యం ఇప్పటికీ ఒక సాధారణం గా కనిపించే అసాధారణ వ్యక్తి.

ఈ ఉదయం అతనికి ఒక అభినందన ....

Tuesday 25 September 2018

మారుతీ రావు

మెయిన్ బాజారు నుండి ఒక సన్నటి వీదిలో పాతకాలం నాటి పెంకు ఇంటికి పెద్ద అక్షరాలతో “హరికా స్టూడియో ‘ అన్న ఒక బోర్డు ఉంది.
మండల కేంద్రం అయినా పొగాకు వ్యాపార ఆధారిత ప్రాంతం. ఒక మాదిరి టౌన్.
వరండా కి ఒక ఇనుప గ్రిల్లు ఉంది.
ఒక పక్కగా నీలం రంగు బాగ్ గ్రౌండ్ బోర్డు మరో రెండు పక్కలా చిక్కటి కర్టెన్లు అవసరాన్ని బట్టి వాడుకునే విధంగా ఉన్నాయి.
బయట గ్రిల్లు కి అమర్చిన చెక్క మీద ఉన్న కాలింగ్ బెల్ మోగించాడు ఆయన.
లోపల నుండి ఒక పాతికేళ్ళ అమ్మాయి వాకిలి కర్టెన్ తొలగించి వచ్చింది.
“గంగాధరం లేరండీ. హై స్కూల్ లో టెన్త్ పిల్లలకి పాస్ పోర్ట్ ఫోటో లు తీయటానికి వెళ్ళారు. మధ్యాహ్నం అవుతుంది అని చెప్పారు.”
నేను నీ కోసమే వచ్చానమ్మా.. “లావణ్య కదూ?”
తెలియని వ్యక్తి తన పేరు చెప్పటం అదీ తనకోసమే వచ్చానని చెప్పటం ఆమెని ఆశ్చర్య పరచింది.
‘రండి కూర్చోండి’ అంది దారి ఇస్తూ..
..
“మొన్న ఆదివారం మార్కెట్ లో నువ్వు పర్సు పారేసుకున్నట్లు ఉన్నావు.” అయన చేతి సంచీ లో నుండి ఒక వెల్వెట్ తో చేసి నగిషీలు అంటించిన ఒక చేతి పర్సు తీసి చూపించాడు.
“లేదండీ ఇది నా పర్సు కాదు. పైగా నాకు మార్కెట్ కి వెళ్ళే అవసరం లేదు. మీరు కరెక్ట్ చిరునామాకే వచ్చారా?”
ఈ లోగా లోపల ఉయ్యాల లో నుండి ఒక పసిబిడ్డ ఏడుపు వినిపించింది.
“కూతురా? ఎన్నో నెల? హారిక కదూ పేరు?”
లావణ్య లోపలి వెళ్తూ అతన్ని అనుమానంగా చూసింది.
పసిబిడ్డ ని ఎత్తుకుని ఏడుపు మాన్పిస్తూ బయటకి వచ్చింది. “అసలు మీకేం కావాలి అంది” అసహనంగా..
ఆతను అదేమీ పట్టించు కోకుండా పర్సు లోనుండి మడత పెట్టిన తెల్ల కాగితాలు తీసాడు.
“వీటిని చూడమ్మా. ఏమయినా గుర్తుకి వస్తుందేమో “
కాగితాలు చేతిలో కి తీసుకుంటూ నే ఆమె కి కాళ్ళు వణికాయి. నిలబడలేనట్టు ఆమె అక్కడే కూల బడి పోయింది.
‘మీరు? మీరు?” అంది.
“నేను రాకేశ్ వాళ్ళ తండ్రిని. నువ్వు రాకేశ్ అర్దరాత్రి దాటాక చాటింగ్ లో మాట్లాడుకున్న సంభాషణలు ఇంకో వంద పేజీలు ఉన్నాయి.”
లావణ్య బేలగా చూసింది.
“గతం గురించి పోస్ట్ మార్టం కోసం నేను రాలేదు. తెలిసీ తెలియని అడాలిసెన్స్ లో ఎదో జరిగిపోయింది. మీ మధ్య అంత బలమయిన నమ్మకం కాని ఓపిక గాని లేవు. ఇద్దరూ చెరో దారి అయ్యారు. నీకు హరిక పుట్టింది. మా వాడు కూడా త్వరలో తండ్రి అవబోతున్నాడు. మీ సంభాషణ అంతా ఆరోనెల గర్భిణి.. నా కోడలు చదివింది. ఒక్క సారి ఆలోచించు ఆమెకి ఎలా ఉంటుంది.”
అక్కడ మౌనం పరుచుకుంది.
“తప్పు మావాడి వద్దా ఉంది. వాడిని కూడా మందలిస్తాను. కాని దీనీ వల్ల ఎక్కువగా నష్ట పోయేది నీ జీవితమే.
అటునుండి మరో సారి నీకు ఫోన్ రాకుండా నేను చేస్తాను. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. మీ మధ్య ఎలాటి పలకరింపులు ఉండకూడదు.”
“గంగాధరం మంచి కుర్రాడు. అతన్ని దూరం చేసుకోకు.
అతనికి హైస్కూల్ ఫోటో ల పని చెప్పించింది నేనే.
ఏదయినా బ్యాంకు లో అప్పు ఇప్పిస్తాను. స్టూడియో అభివృద్ధి చేసుకోండి. చక్కగా ఆరోగ్యం గా బతకండి. ఇది నాకు నా కోడలికి నీకు మాత్రమె తెలుసు. .. ప్రస్తుతానికి” చివరి పదం గట్టిగా వత్తి చెప్పాడు.
ఆతను కుర్చీ లోనుండి లేచి “అర్ధం కానంత చిన్న పిల్లవి మాత్రం కాదనే నమ్మకం ఉంది. నీకు ఏదయినా సాయం కావలసి ఉంటె ఫోన్ చెయ్యి నా నెంబరు అందులో ఉంది.”
ఆతను బయటకి వస్తూ “నా పేరు మారుతీ రావు. గుర్తు ఉంచుకో”అన్నాడు.

Saturday 22 September 2018

castration

అదేంటో విచిత్రం. 
వెలుతురు లో ఇంటికి వెళ్దాం అనుకున్న రోజే ఆలస్యం అవుతుంది. 
ఆఫీసులోనే ఆరు దాటింది. రోడ్డు మీదికి వచ్చి బస్సు కోసం చూస్తూ ఉన్నాను. 
తాసిల్దారు ఆఫీసు వైపు వేగంగా వెళ్ళిన కారు అదే వేగం తో బయటకి వచ్చింది. 
కారు నడుపుతున్న వ్యక్తి కాకుండా రెండో మనిషి దిగి ఒంటరిగా నిలబడి ఉన్న నన్ను, “జానయ్య VRO గారు ఉండేది ఎక్కడ గంట క్రితమే ఆఫీసు నుండి వెళ్లి పోయాడట.” అని అడిగాడు. ఆడగటం లో మర్యాద ఉంది కాని అడిగిన వ్యక్తి గురించి అది లేక పోవటం గమనించాను. 
“శనివారం ఈ టైం దాకా ఆఫీసులో ఎవరు ఉంటారు? ఎర్లీ గానే వెళ్లి పోతారు.”
“మీరున్నారుగా?” అడిగాడు ఆతను.
లాజిక్కే...
“ఆతను ఉండేది పొదిలి అటగా .. మీరు ఎందాకా?” అన్నాడు మళ్ళీ
మార్కాపురం డ్రాపింగ్ కి వచ్చిన కార్లో సర్విస్ చెయ్యటం పరిచయమే.
“నేను ఒంగోలు వెళ్ళాలి”
“పొదిలి దాకా తీసుకు వెళ్తాం రండి.”
కార్లో ac ఎక్కువగా ఉంది. వెనక సీట్లో నేనూ ఒక్కడినే.
“మీరేం చేస్తారు?” డ్రైవింగ్ సీట్లో కుర్చుని ఉన్నఅతను అడిగాడు.
“ఇక్కడే మండల AE ని”
“మీకు జానయ్య VRO ఎక్కడ ఉంటాడో తెలీదా? “
“వృతి రీత్యా ముఖ పరిచయమే.. వివరాలు తెలీదు.”
“అతని కోసమే వచ్చాం” కార్లో ఎక్కించుకున్న వ్యక్తి చెప్పాడు. మద్యలో ఆతను అటెండ్ అయిన కాల్ ని బట్టి ముస్లిం అయిఉంటాడని గ్రహించాను. ఇద్దరూ మంచి వత్తిడి లో ఉన్నట్లు కొద్ది క్షణాల్లోనే గమనించాను.
“ఏదయినా రెవిన్యూ పాస్ బుక్ ల గొడవా?” ఉండబట్టలేక అడిగాను.
“కాదండీ .. మాది గుంటూరు” అన్నాడు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి. వెనక్కి తిరిగి నన్ను గమనిస్తూ మీరు “వైశ్యులా ?” అన్నాడు. అట పట్టిద్దామనుకున్నాను కాని వాతావరణం అనుకూలంగా లేదు.
“కాదండీ.. మేము ..........” చెప్పాను.
“మేము కాపులం. మా పెద్దన్న కూతురు వివాహం ఉంది త్వరలో “ డ్రైవింగ్ సీట్లో నుండి రేర్ మిర్రర్ లో నన్ను గమనిస్తూ నాకు చెప్పొచ్చో లేదో అంచనా వేసుకుంటూ మొదలేట్టాడు.
“వారం క్రితమే ఎంగేజ్మెంట్ అయింది. హైదరాబాదు లో. కట్న కానుకలు ఇచ్చి పుచ్చుకోవటం పూర్తి అయింది.”
వాళ్ళు చెబుతున్న విషయాలకి ఒకదానికి ఒకటి పొంతన లేదు. అయోమయంగా వినసాగాను.
“ఈ జానయ్య రెండో కొడుకు రవితేజ అట.. అమ్మాయితో ఇంటర్ చదివాడు”
కారులో ఒక మౌనపు విస్పోటనం జరిగింది. నాకు విషయం అర్ధం అవసాగింది.
“మేజర్ వే కదా వచ్చేసేయ్. sp దగ్గరకి వెళ్దాం. అని ఫోన్ చేస్తున్నాడు.” అతని గొంతు జీరగా అయిపొయింది.
తర్వాత వాక్యాలు ఆతను అల్లుకుంటుంటే... వద్దన్నట్లు సైగ చేసాను.
“అర్ధం అయింది. నేనూ ఒక తండ్రినే..”
కారు ఒక పక్కగా ఆపించి దిగాను. నాలుగయిదు ఫోన్ కాల్స్ చేసాక మళ్ళీ ఎక్కాను.
“రాసుకోండి.. అతని అడ్రెస్స్, బస్స్టాండ్ దాటాక చర్చి ఉంది. ఎదురుగా సిమెంట్ రోడ్డు లో వెళ్తే హాస్టల్ ఉంటుంది. అక్కడి నుండి మూడో అడ్డరోడ్డు లో నాలుగో ఇల్లు. మొత్తం నలుగురు కొడుకులు. పోయిన ఏడాది ACB ట్రాప్ నుండి తప్పించుకున్నాడు. స్వగ్రామం _________ ఇది. ఫోన్ నెంబరు ఇది. నా మిత్రుడు AMC చైర్మన్ తో మాట్లాడాను. వాళ్ళ ఊరే. ఆయన నెంబరు ఇది. పోలిస్ పర్సన్ సాయం కావాలంటే అడగండి. నా నెంబరు ఇది. కారు డిక్కీ పెద్దదేగా మూట కట్టి ఇందులో వేసుకుని వెళ్ళండి. అన్నట్లు నాకు తెలిసిన మంచి పశువుల డాక్టర్ ఉన్నారు. కావాలంటే ఆయన నెంబరు ఇస్తాను.” 



Friday 21 September 2018

ఒక ప్రేమ కధ

MBA చదువుతున్న కుమార్తె ఆ సాయంత్రం మొదట గా తల్లి తో “శివ” గురించి ప్రస్తావించింది.
తల్లి ఇలాటిది ఎదో జరుగుతుందని నెల రోజులుగా మధన పడుతూనే ఉంది.
వయసు లో కుమార్తె మరొక ఆకర్షణ లో ఉన్నప్పుడు తొలిసారిగా గుర్తించ గలిగేది ఇంట్లో తల్లి మాత్రమే....
తల్లి కేకలు వేసింది. తర్వాత ఏడ్చింది.
ఆ రాత్రి భర్త తో చెప్పింది. ఆతను ఏమీ మాట్లాడలేదు. నిద్ర పోనూ లేదు.
మర్నాడు కుమార్తెని ఇరవై కిలోమీటర్లు దూరం లో ఉన్న గుడికి తీసుకెళ్ళాడు.
కొండమీద ఉన్న ఆంజనేయుని మెట్లు దారి లో ఒక చెట్టు కింద కూర్చున్నాక “ఇప్పడు చెప్పమ్మా? శివ ఎవరు?” అన్నాడు. అది మాట్లాడటం కోసమే తనను అక్కడికి తీసుకు వచ్చాడని అర్ధం అయి తనేం చెప్పాలో త్రోవ పొడుగునా రిహార్సిల్స్ వేసుకుంటూ ఉంది.
“నాన్నా .. మా MBA క్లాస్మేట్ .. మంచి అబ్బాయి. క్రమశిక్షణ తో ఉంటాడు. జీవితం పట్ల మంచి అవగాహన ఉన్న వాడు. మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పటి వరకు తొమ్మిదో తరగతి పిల్లల్లాగా ‘ఐ లవ్ యు’ లాటి చెత్త చెప్పు కోలేదు. అతను నాకు నచ్చాడు. మీ ఇద్దరితో చెప్పాలని అనిపించింది.”
తండ్రి కి ఏమనాలో అర్ధం కాలేదు. తన బిడ్డ తప్పుగా మాట్లాడటం లేదని అర్ధం అయింది.
“నీకో చెల్లెలు ఉంది. మర్చి పోకు. వేరే కులం అబ్బాయి తో పెళ్లి చేసే దైర్యం నాకు లేదు. ఇలాటి ఆకర్షణలు అన్నీ మామూలే. నీకేం కావాలో నాక్కూడా కొంత తెలుసు. నీ సమ్మతి తోనే నీ పెళ్లి జరుగుతుంది. శివ ని మొదట్లోనే తుడిచెయ్యి. నువ్వు కాలేజి కి వెళ్ళకు. అతనితో మాట్లాడకు. మరో కాలేజ్ లో అడ్మిషన్ తీసుకుంటాను. మళ్ళీ మన మధ్య అతని గురించిన చర్చ నేనూ తెచ్చినప్పుడే మొదలవ్వాలి”
చాలా సేపు ఇద్దరి మధ్య స్నేహపూర్వక మాటల తర్వాత రాజ్య లక్ష్మి తండ్రి కి తన అభిప్రాయం చెప్పింది.
“అలాగే నాన్నా.. మీరు చెప్పినట్లుగానే చేస్తాను. నాకు పెళ్లి ప్రయత్నాలు చెయ్యకండి. ఒక్కటి మాత్రం నిజం. మీ సమ్మతి లేకుండా నేనూ ఎటువంటి నిర్ణయం తీసుకొను.”
అంతే.... ఇద్దరు వ్యక్తులు బిజినెస్ గురించి మాట్లాడుకున్నట్లు వారిద్దరి మద్య సంభాషణ నడిచింది.
తండ్రి చూస్తుండగానే సెల్ ఫోన్ లో అతని నెంబరు తొలిగించి మొబైల్ తండ్రికి ఇచ్చింది. “నాకో బేసిక్ ఫోన్ ఇవ్వండి చాలు.”
**
రాజ్య లక్ష్మి MBA మానేసి గ్రూప్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవటం మొదలెట్టింది.
తన ఎబిలిటీస్ పెంచుకోటానికి సహాయపడే పరిక్షలు అటెండ్ చెయ్యటం మొదలెట్టింది.
తండ్రి ఆమె కి పెళ్లి ప్రయత్నాలు చేసే సాహసం చెయ్యలేక పోయాడు.
రెండో అమ్మాయి పెళ్లి దగ్గరి చుట్టరికం లో చేసాడు.
రెండేళ్ళు గడిచి పోయాయి. రాజ్యలక్ష్మి కి మూడు బ్యాంకు ఉద్యోగాలు వచ్చాయి.
తండ్రి ఈ కాలం లో ఎవరికీ చెప్పకుండా చేసిన పని ‘శివ’ గురించి వివరాలు సేకరించడం.
మంచి కుటుంభం. భాద్యత గల పెద్ద కొడుకు. పల్లె లో ఉన్నంత కాలం తండ్రి తో పాటు పౌల్ట్రీ పని చూసుకుంటాడు.
ఇద్దరు పెళ్లి కావాల్సిన చెల్లెళ్ళు. MBA పూర్తి కాగానే ICICI బ్యాంకు లో అధికారి గా చేరాడు. ఇంకా మంచి స్థితి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
**
సింపుల్ గా వివాహం చేసిన తండ్రి కూతురుకి అల్లుడుకి హైదరాబాదు లో ఒక ఫ్లాట్ కొనిచ్చాడు.
ఆరేళ్ళు గడిచాయి. ఇద్దరు ముత్యాల్లాంటి పిల్లలు.
ఇద్దరు తాతలు మనమరాళ్ళ ని పెంచే విషయం లో గొడవ పడటం మొదలయ్యింది.
<<<< పేర్లు మార్చి వ్రాసిన ఒక విజయవంతమయిన ప్రేమ కధ ఇది. ఆ అమ్మాయి నన్ను 'బాబాయ్' అని పిలుస్తుంది. తనకి పెళ్లి కాక ముందు నుండి fb లో పరిచయం. మొన్న రాత్రి మిర్యాలగూడ విషయం మాట్లాడుతుంటే హటాత్తు గా బాబాయ్ మీకో విషయం చెప్పాలి అంటూ తమ ప్రేమ కధ గురించి చెప్పింది. దంపతులకి వారిద్దరి పిల్లలకి శుభ కామనలు. అన్న గారికి (అమ్మాయి తండ్రి) నమస్కారాలు. (వివరాలు అడగవద్దు).>>>>
మీరెవరయినా మీ పరిధి లో మంచి ముగింపు ఉన్నవాస్తవ ప్రేమ కధ వ్రాస్తే సంతోషిస్తాను.
#good_parenting

Monday 3 September 2018

Where ever you go 'IT' fallows


ఆమెతో చాలా సాన్నిహిత్యం ఉన్న వాడిలా కనిపించే ప్రయత్నం చేస్తున్నాడు భార్గవ.
అతనికి కొద్దిపాటి పరిచయం ఉన్న వారికి తన బార్య ని పరిచయం చేస్తూ మాట్లాడుతున్నాడు.
ఆమె వైపు నవ్వు మొహం తో ఎదో చెబుతున్నాడు.
ప్రైమర్ వెయ్యని గోడ కి ఎమల్షన్ వేసినట్లు అతని నవ్వు మొహానికి నప్పలేదు.
పాతికేళ్ళ పాత స్నేహితుడు రాజేంద్ర కుమారుడి పెళ్లి రిసెప్షన్ కి అటెండ్ అవటానికి గుండమ్మ తో కలిసి స్తానిక సరోవర్ ఫంక్షన్ హాల్ కి వెళ్లాం.
ఒకే స్థాయిలో కొన్నాళ్ళు ఉద్యోగం చేసాం.
అతనిప్పుడు బదిలీ మీద మదనపల్లి లో ఉన్నాడు. దూరం మా స్నేహాన్ని తగ్గించలేక పోయింది. తరచూ ఫోన్ లో మాట్లాడుకున్తుంటాం. ఇద్దరు IIT లో చదివి స్థిరపడ్డ మగ పిల్లలు.
ఒంగోల్లో గత ఏడాది ఒక వారం సర్వే చేసి (తనూ, నేనూ) ఫ్లాట్ ఒకటి కొడుకు పేరున కొన్నాడు.
పెద్దబ్బాయి వివాహం రాత్రి చీరాలలో అయింది.
చాలా సింపుల్ గా హోమ్లీ గా వేడుక జరుగుతుంది.
అమ్మాయి తాడేపల్లి గూడెం NIT లో కాంట్రాక్ లెక్చరర్. ఆర్ధికంగా సమస్యలు ఉన్న కుటుంబం. ఏమాత్రం కట్నకానుకల ప్రసక్తి లేకుండా కొడుకు పెళ్లి చేస్తున్నాడు మా మిత్రుడు రాజేంద్ర.
అదే విషయం గుండమ్మకి చెబుతున్నప్పుడు భార్గవ కనిపించాడు.
అసలు భార్గవ పరిచయం పాతికేళ్ళ క్రితం రాజేంద్ర ద్వారానే కలిగింది. వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఎలా ఏర్పడిందో అనేది ఇప్పటికీ నాకు అర్ధం కాని పదార్ధం. ఇద్దరూ బద్ద వ్యతిరేక స్వభావులు.
పరిచయం అయిన రెండు మూడు నెలల్లోనే అతను మనకి సరిపడడు అని తెలుసు కుని దూరం గా ఉంచేశాను.
మళ్ళీ ఇదే అతన్ని చూడటం.
రమా, నేనూ పిల్లలకి అక్షితలు వేసి శుభాబినందనలు చెప్పాక బోజనం చేద్దామని రద్దీ తగ్గటం కోసం ఒక పక్క గా కుర్చుని ఉన్నాం.
మా పక్కనే ఉన్న ఒక పెద్దావిడకి బార్యని పరిచయం చెయ్యటానికి భార్గవ వచ్చాడు. అప్పుడే మొదటి సారి నన్ను గమనించాడు.
ఒక వెలిసిపోయిన నవ్వు నవ్వి “సుశ్రీ అని ఒక వ్రాతగాడు. నాకు బాగా తెలుసు” అని పరిచయం చేసాడు.
ఆమె చేతులు జోడించి నమస్కరించింది. “ఈవిడ ఎవరు?” అడిగాను.
“మా ఆవిడ.” అన్నాడు.
అది కుడా అర్ధం కాలేదా అన్నట్లు.
“నీ గురించి బాగా తెలుసు కదా అందుకే అడిగాను.” స్పష్టంగా చెప్పాను.
అంత సందడి లోను ఆ వాక్యం ఇద్దరికీ వినబడింది.

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...