Tuesday, 31 October 2017

వెంకట్రామయ్య ఫోన్

ఈ ఉదయమే గుర్తుచేసింది. రేపు ఒకటో తేదీ అని.
నేను నవ్వాను.
“అయితే?” అన్నాను తనేమంటుందో నని.
“ఈ నెల తప్పదు. నల్ల పూసల దండ ఆర్డర్ ఇవ్వాల్సిందే.” అంది.
అసలు తప్పంతా నాదే. ఏదో బలహీన క్షణం లో పల్లెటూర్లో ఒకావిడ మెడలో చూసిన పాత కాలం నాటి దండ మోడల్ బాగుందని నీకయితే ఇంకా బాగుంటదని నోరు జారాను. పైగా ఒక కాగితం మీద గీసి చూపించాను.
మొన్నా మద్య బంగారం కొట్లో వాళ్ళకి చెప్పి ‘లచ్చాలు’ డిజైన్ అని తేల్చి పారేసింది.
ఖచ్చితంగా తన పుట్టినరోజు కి చేయించాలని షరతు కూడా ఉంచింది.
"చూద్దాం" .. అంటూ ఆఫీస్ కి బయలు దేరాను.
నెలాఖరు మీటింగులు చూసుకుని లేటుగా వచ్చాను.
ఫ్రెష్ అవగానే “వెంకట్రామయ్య ఫోన్ చేశాడు” అంది ఏ ఉపోద్గాతము లేకుండా.
చక్కటి, చిక్కటి టీ త్రాగుతూ.. “ఫోన్ చేసివ్వు.. నేను మాట్లాతాను” అని చెప్పాను.
వెంకటరామయ్య మా స్నేహితుడు. దేవారం అనే పల్లెటూర్లో ఉండి సిన్సియర్ గా సేద్యం చేసుకునే రైతు. మనం గొప్ప అనుకునే చదువు మాత్రమే లేని గొప్ప సంస్కారి.

“ఏం . వెంకట్రామయ్యా ఫోన్ చేసావంట.. “
“అన్నాయ్.. పొలం పనులు మొదలయ్యాయి.” చెప్పాడతను . రెండు నిమిషాలు మాట్లాడి
“నేను రెండు రోజుల్లో ఫోన్ చేస్తాను” అని చెప్పి ఫోన్ మా ఆవిడకి ఇచ్చాను.
మా కుటుంబానికి ఉన్న ఆత్మ బందువులలో అతనొకడు.
“ముందు వెంకట్రామయ్య అవసరం చూడండి. గోల్డ్ షాప్ కి మరో నెలలో వెళ్లొచ్చు” పది నిమిషాల తర్వాత నాతో అంది మా ఆవిడ.

Saturday, 28 October 2017

వారి సమస్య

మౌనం, చిరునవ్వు విలువైనవి.
చిరునవ్వు సమస్యలని పరిష్కరిస్తే , మౌనం సమస్యలను దూరం గా ఉంచుతుంది.
విజయాన్ని చూసిన వ్యక్తుల పెదవుల మీద వీటి చిరునామా.
చక్కెర, ఉప్పు ని కలిపి ఉంచినా చీమలు తీపినే తీసుకువెళ్తాయి.
సరైన వ్యక్తులని జీవితం లోకి ఆహ్వానించండి. మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండీ. 
పుట్టుక ద్వారా వచ్చినవి మాత్రమే మన చేతిలో లేవు. మిగిలిన మొత్తం మన చేతిలో నే ఉంది.
మన కలలని సాకారం చేసుకోలేనప్పుడు మన మార్గాలు మార్చుకుందాం. ‘గమ్యం’ ని కాదు.
ప్రకృతి లో జరిగేది ఇదే. చెట్లు ఆకులని మార్చుకుంటాయి ‘వేర్ల’ ని కాదు.
మోరిగే ప్రతి కుక్క మీద రాళ్ళు వేసుకుంటూ వెళితే.. చివరికి మనకు అది మాత్రమే చాతనవుతుంది.
విమర్శకులు ఎప్పుడూ ఉంటారు. మనం నీళ్ళ మీద నడిచేటప్పుడు వాళ్ళు మనకి ఈత రాదని గేలి చేస్తారు.
ఎవరయినా అసూయ చెందారు అంటే మనం విజయం వైపు ప్రయాణిస్తున్నట్టు
‘పంది’ తో పోట్లాట మనన్ని బురదలోకి లాగుతుంది. పైగా దానికి అది ఆనందాన్ని ఇస్తుంది.
సన్మార్గం లో జీవించడం, సమాజం గురించి భాద్యత తీసుకోవటం, నచ్చిన పనిని స్వయం గా చేయటం, జీవితాలని పరిపూర్ణం చేస్తాయి.
ఈ రోజు మంచి రోజు... మనకి మిగిలిన ప్రతి రోజు మంచి రోజే. పిల్ల వాడు మధురమయిన మామిడికాయను ఆస్వాదించినట్లు జీవితాన్ని అనుభవిద్దాం. మనం మరొకరికి నచ్చక పోవటం అనేది వారి సమస్య. మనది కాదు. వారి సమస్య కోసం మన సమయం వృధా చేసుకునేంత అవివేకం మనకి వద్దు.
నా ఆత్మీయ మిత్రులకి శుభోదయం. _/][\_

Friday, 27 October 2017

హస్త వాసి

'టెన్నిస్ ఎల్బో' నుండి చాలావరకు బయట పడ్డాను.
పరిస్తితి చాలా మెరుగ్గా ఉంది. ఆర్ధో డాక్టర్ OP (నెల రోజులు) గడువు ఇంకా ఉంది కదా అని హాస్పిటల్ కి వెళ్ళాను. 
ఆయన సర్జరీ లో ఉన్నారు.
వెయిటింగ్ రూమ్ లో ఖాళీ చూసుకుని కూర్చున్నాను..
స్మార్ట్ ఫోను, jio సిమ్ ఎటూ ఉన్నాయిగా??
గంట పైగా కూర్చున్నాను.
కాంపౌండర్ వచ్చి “శ్రీనివాసరావ్.. ఒంగోలు” అని రెండు మూడు సార్లు పిలిచిందాకా గమనించనే లేదు.
హడావిడిగా లెచానా?.. కాలు తిమ్మిరెక్కింది.
అలానే లాక్కుంటూ డాక్టర్ గారి రూము లోకి వెళ్ళాను.
డాక్టర్ గారితో పాత పరిచయం బానే ఉంది. కుశల ప్రశ్నలు, ‘చేతి నొప్పి’ విషయాలు మాట్లాడుకున్నాక ఎక్కువ టైమ్ తీసుకోకుండా ఆయన చెప్పిన జాగర్తలు గుర్తు పెట్టుకుంటూ బయటకి వచ్చాను.
వెయిటింగ్ హల్లో నుండి చక చకా బయటకి నడుస్తుంటే ...
ఎవరో ఒక పెద్దావిడ నా నడకని గమనిస్తూ
“నే చెప్పలా? డాక్టర్ గారి హస్త వాసి చాలా మంచిదని” అనటం వినబడింది.

Tuesday, 24 October 2017

తిరుగు టపా

ఇంకో రెండు  నిమిషాల్లో బస్సు బస్టాండ్ కి చేరుతుంది అనగా జరిగిందా సంఘటన.
గట్టిగా పది పన్నెడు ఏళ్ల మద్య ఉంటుందా  పిల్లాడి వయసు. నిలబడ్డ పిల్లాడు నిలబ్డ్డట్టుగా కూలిపోయాడు. పక్కనే ముప్పై  మించని మరో మనిషి, చేతిలో ఉన్న గుడ్డల  సంచి  సర్దుకుని పిల్లాడిని పొదివి పట్టుకున్నాడు.
రాఘవ  కూర్చున్న సీటుకి మూడు అడుగుల దూరం లో  కూలబడ్డ కుర్రాడు స్కూల్ యూనిఫార్మ్ వేసుకుని ఉన్నాడు. కుడి అరచేతి వెనుక ప్లాస్టర్ వేసిన సూది ఉంది.
అప్పటిదాకా  సెల్ లో చాటింగ్ చేస్తున్న రాఘవ చప్పున లేచి పిల్లాడిని లేపటానికి సాయం చేశాడు. పిల్లాడు అపస్మారక స్థితి లోకి జారుకున్నాడు. తోడుగా ఉన్నతను ఏమి అర్ధం కానీ పరిస్తితి లో ఉన్నాడు.
ఎవరో ఒకావిడ హాండ్ బాగ్ నుండి నీళ్ళ సీసా తీసి అరచేతిలో కొంచెం వంపుకుని పిల్లాడి ముఖం తుడిచింది.
“ రేయ్ బాబు” అంటూ కదిలించింది.  ఊహూ ఏమి చలనం లేదు.
“ఏమయింది? “ రాఘవ అడిగాడు.
“నా మేనల్లుడు వీడు. వెలిగొండ రెసిడెన్షియల్ స్కూల్ లో ఆరో తరగతి. ఉదయం తేలు కుట్టిందట. మార్కాపురం గవర్నమెంట్ ఆసుపత్రికి చేర్చి, మా బావ కి ఫోన్ చేశారు. నేను వెళ్ళాను. తీరా సాయంత్రం నాలుగప్పుడు మా వల్లకాదు ఒంగోలు (వంద కిలోమీటర్ల జిల్లా కేంద్రం) తీసుకెళ్ళండి అని చెప్పారు. తీసుకొస్తున్నాను. RIMS (Govt Hospital) కి తీసుకెళ్లమన్నారు. దుఖం తో గొంతు పూడుకు పోతూ ఉంటే చెప్పాడు. 
ఈ లోగా బస్సు బస్ స్టాండ్ కి చేరింది. పిల్లాడిని నెట్టుకుంటూ పోలో మని జనం దిగేశారు.
రాఘవ అతని వద్ద ఉన్న చేతి సంచి ఒక చేత్తో, మరో చేత్తో పిల్లాడు జారవిడిచిన స్లిప్పర్లు మరో చేత్తో పట్టుకుని బస్సు దిగాడు. “బస్ స్టాండ్ ఎదురుగా వెంకట రమణ హాస్పిటల్ ఉంది అక్కడికి తీసుకెళ్దాం అన్నాడు.”
మేనమామ పిల్లాడిని బుజాన వేసుకుని మొహమాటం గా “రింస్ కి తీసుకు వెళ్తాను” అన్నాడు.
“అంత టైమ్ లేదు. నా మాట విను. డబ్బు కి ఇబ్బంది లేదు నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు” అంటూ చక చక నడవ సాగాడు. తప్పని స్థితి లో పిల్లాడిని బుజాన వేసుకుని వెనకే నడవసాగాడు.
పొద్దుట నుండి ఆహారం లేదు, వంట్లో తేలు నరాల్లో తిరుగుతూ ఉంది. హాస్పిటల్ కి చేరాక పావుగంట లో జెనరల్ వార్డ్ లోకి పిల్లాడిని మార్చడం. ఫ్లూయిడ్స్, ఆంటీ బయటిక్స్ ఇవ్వటం జరిగిపోయాయి. గంటన్నరకి పరిస్తితి లో మార్పు వచ్చింది. పిల్లాడు పలకరిస్తే స్పందించే దశ కి వచ్చాడు.
“బాబు ఏం పేరు?” అడిగాడు రాఘవ.
“ప్ర భా క ర్”
“ఆకలిగా ఉందా ఏమయినా తింటావా?” మళ్ళీ అడిగాడు.
జూనియర్ డాక్టర్ ని అడిగి మైన్ రోడ్డు లోకి వచ్చి ఇడ్లీ పార్సిల్ చేయించుకుని, వాటర్ బాటిల్ కొంటుంటే.. తన ఆఫీస్ బాగ్ లో ఉన్న బాటిల్ గుర్తు వచ్చింది. అవును అందులో ఉంది. అసలు బాగ్ ఎక్కడ?
బస్సులో నుండి బాగ్ తీసుకున్న జ్ణాపకం లేదు.
రాఘవ ఆసుపత్రి లోకి వెళ్ళి ప్రభాకర్ ఇడ్లీ తినేంత వరకు ఉండి, పరిస్తితి మెరుగు పడ్డాక తన ఫోన్ నెంబరు ఇచ్చి బయటకి వచ్చాడు.
రాత్రి పదిన్నర అయింది. నేరుగా బస్టాండ్ కి వెళ్ళి ఎంక్వరి లో డ్యూటి లో ఉన్న స్టాఫ్ “ సర్ నేను ఏడుగంటలకి శ్రీశైలం నుండి వచ్చిన బస్సు లో  వచ్చాను. హడావిడిలో నా బాగ్.. ఆఫీస్ బాగ్ ..”
రాఘవ మాటలు పూర్తి కాక ముందే కౌంటర్ కింద నుండి బాగ్ తీసి పైన పెట్టడతాను. “ఇదేనా?”
“అవును”
“ఎవరో లేడి టీచరు గారు ఇక్కడ ఇచ్చేసి వెళ్లారు. మీకు ఫోన్ చేస్తాను అని చెప్పారు” అన్నాడు.
“థాంక్స్ అంది. ఆమె కి కూడా”
రాఘవ బాగు తీసి చూశాడు. తన ఆఫీసు డైరీ, లంచ్ బాక్సు, అన్నీ సరిగానే ఉన్నాయి. సైడు జీప్పులో ఉండాల్సిన కాష్ తప్ప.
ఉదయాన్నే ఆసుపతికి వెళ్ళి ప్రభాకర్ తో మాట్లాడుతుంటే .. రాఘవ ఫోన్ మోగింది.


“సార్ నేను నిన్న మీతో పాటు బస్సులో ఉన్నాను. మీరు బాగ్ వదిలేసి పిల్లాడితో పాటు పరిగెత్తటం చూశాను. ఎంక్వైరీ లో బాగ్ ఇచ్చాను. తీసుకోండి . డైరీ లో మీ ఫోన్ నెంబరు చూశాను. మీ బాగ్ లో ఉన్న పదిహేడు వేలు తీసి  జాగర్త చేశాను. మీరు ఎక్కడున్నారో చెబితే మా అబ్బాయి  చేత ఇప్పుడే పంపుతాను” 

Sunday, 22 October 2017

ఘర్వాలా


తెల్ల వారు ఝాము మూడున్నరకి ప్రతిరోజూ మాదిరిగానే..

కరిమున్ బస్ స్టాండ్ కి వచ్చేశాడు. రెగ్యులర్ గా వచ్చే బస్ వచ్చి రాగానే డ్రైవర్ ని విష్ చేశాడు.

“కాలి గాయం ఇంకా తగ్గలేదా?”  డ్రైవర్ పలకరించాడు.

“పర్లేదు కుట్ల వద్ద ఇంకా నొప్పిగానే ఉంది” సమాదానం చెబుతూ బస్సు లో నుండి పల్చటి గోనె సంచి లలో ఉన్న పూల మూటలని దించుకున్నాడు.

కరిమున్  ఇంటికి వచ్చేసరికి చెల్లెలు హసీనా, తల్లి ముందు గది శుభ్రం చేసి చాపలు పరిచి సిద్దం గా ఉన్నారు.

పూల మూట లు అక్కడ ఉంచి లోపలి కి వెళ్ళి మళ్ళీ ముసుగు తన్నాడు. 
అమ్మమ్మ దొడ్లో గిన్నెలు శుభ్రం చేస్తూ ఉంది.
కరిమున్ మళ్ళీ నిద్ర లేచే సరికి ముందు గదిలో రెండు మూటలు పూలు, మాలలు గాను, దండలు గాను మారి ఉన్నాయి .

హసీనా అక్కడే గోడ వారగా నిద్ర పోతూ ఉంది.  
కరిమున్ పూలు దగ్గర్లో ఉన్న మార్కెట్ కి వెళ్ళి షాపు లో  ఇచ్చి వచ్చేసరికి
తల్లి నాస్తా చేసి పెట్టింది.

అతను రెడీ అయ్యి మేనత్త గారి బాటరీ షాప్ కి పనిలోకి వెళ్ళాలి
.
తండ్రి చనిపోయాక మేనత్తే వాళ్ళ  కుటుంబాన్ని ఆదుకుంది.  
బర్తని ని ఒప్పించి పదహారేళ్ళ కరీమున్ ని పనిలో పెట్టించింది.

నెలకి ఆరువేలు జీతం ఇప్పించింది. చదువుతున్న ఇంటర్ ని మద్యలో ఆపేయ్యాల్సి వచ్చింది. తల్లి పిల్లా పూల దండలు కట్టి, పాత బట్టలు కుట్టి ఎంతో కొంత సంపాదిస్తుంటారు.

నెల క్రితమే బాటరీ షాపు కలెక్షన్ కోసం బండి మీద వెళ్తుంటే అజాగర్తగా వచ్చిన మరో బైక్ ని తప్పించబోయి కాలి మడెమ వద్ద గాయం అయింది. 
హాస్పిటల్ లో ఆరోగ్య బీమా కి సరిపడే ఎముక డామేజ్ కానందున స్వంత ఖర్చు మీద వైద్యం చేయించుకోవాల్సి వచ్చింది. మొత్తం ముప్పై వేలు అయింది. 
హసీనా నిఖా కోసం పొదుపు చేసుకున్న ఇరవై మూడు వేల తో పాటు అయిదు రూపాయల వడ్డీకి మరో ఏడువేలు అప్పు చేయాల్సి వచ్చింది.

“అన్నా ఇవాళ ఆదివారం..” హసీనా వచ్చి నాస్తా చేస్తున్న అన్న తో చెప్పింది.

ఆదివారం మద్యాహ్నం వరకు షాపు ఉంటుంది.  
మద్యాహ్నం నుండి ఖాళీయే.. చెల్లెలు కి తనతో  ఏమయినా పని పడిందేమో నని ఆమె వైపు చూశాడు కరీమున్ ..

“ఈ వాళ్ళ రెండో ఆదివారం అన్నా” హసీనా మెల్లిగా చెప్పింది.

ఘర్వాలా అయేగా .. ఇంట్లో ముసలమ్మ మెల్లగా గొణిగింది.

పోయిన నెల హాస్పిటల్ లో నే ఎక్కువ రోజులు గడిచి పోయాయి.

జీతం డబ్బులు షాపు లో రాలేదు. 
మూడువేలు అద్దె కట్టాలి. ప్రతి నెలా రెండో ఆదివారం ఇంటి యజమాని వస్తాడు. 
వేరే ఊర్లో  ఉంటాడు. ప్రతి నెలా బాడుగ డబ్బులు వసూలు కి మాత్రమే వస్తుంటాడు.  
తెల్లటి బట్టలు తొడుక్కుని  ఎర్రటి బండి వేసుకుని వచ్చి బయట నిలబడి హారన్ కొడతాడు. 
కరుగ్గా ఉంటాడు. డబ్బు విషయం తప్ప మరోటి మాట్లాడడు. 
ఇంట్లో చిన్న ఇబ్బందులు ఉన్నా ఆ లోకాలిటిలో ఇంత తక్కువ అద్దెకి ఆ మాత్రం ఇల్లు దొరకదు కనుక గమ్మున సర్దుకుపోతుంటారు.

 “అత్త వద్దకి వెళ్ళి కనీసం, సగం జీతం అయినా అడిగి వస్తాను.” కరీమున్ తల్లి తో చెప్పాడు.

కుట్టు మిషను డబ్బాలో నుండి డబ్బులు పోగు చేసి లెక్కపెడుతున్న తల్లి “ పన్నెండు వందలు ఉన్నాయి మరో పద్దెనిమిది వందలు కావాలి అంది”

కరీమున్ తింటున్న చేతిని కడుక్కుని బయటకి వచ్చి సైకిల్ తొక్కుకుంటూ రెండు వీదుల అవతల ఉన్న మేనత్త వద్దకి వెళ్ళాడు.

ఈ లోగా  బయట రోడ్డు మీది నుండి హారన్ మ్రోగింది. ఘర్వాలా బండి హారన్ అది. 
హసీనా లోపలి గది లోకి వచ్చింది.
తల్లి తడబడుతుండటం గమనించింది.

అమ్మమ్మ ముందు గది తలుపు తీసు బయటకి వచ్చి “కొద్ది సేపు కూర్చోండి. అబ్బాయి డబ్బులు తీసుకు రావటానికి వెళ్ళాడు.  పది నిమిషాల్లో వచ్చేస్తాడు.”

ముందు గదిలో కి వచ్చి కూర్చున్నాడతను. 
లోపలి నుండి హసీనా ఒక గాజు గ్లాసులో మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చింది.

మా మానమరాలు “ పరిచయం గా అంది. ముసలావిడ.
లోపల తల్లి కూతురు .. ముందు గదిలో ముసలమ్మ ఘర్వాలా..

పది నిమిషాలు అరగంట అయింది.

కరీమున్ వస్తూనే అతనిని విష్ చేశాడు. 
మూడువేలు లెక్క బెట్టి ఇచ్చేశాడు. నిమిషం లో ఘర్వాలా మాయం అయ్యాడు.
**
పది నిమిషాల తర్వాత ముందు గది కుర్చీ లో  ఒక కవరు పడి ఉండటం హసీనా చూసింది.

కవరు తల్లి కి చూయించింది. అందులో సరిగ్గా ఏడువేలు డబ్బు ఉంది.

కొడుకు ఘర్వాలా కి ఫోన్ చేశాడు.

“ సర్ మీ డబ్బుఉన్న కవరు  మా ఇంట్లో పడి పోయింది.”


“ముందు అయిదు రుపాయల వడ్డీ బాకీ తీర్చుకోండి. నెలకి అయిదువందలు చొప్పున నాకు అద్దెతో కలిసి ఇవ్వండి చాలు” అటునుండి ఘర్వాలా కరుగ్గా చెప్పాడు.