Saturday 30 September 2017

స్కూటి ఆవిడ

డ్రైవింగ్ చేస్తుంటే పక్కనే స్కూటీ తొలుతున్నావిడ నన్ను ఆరాధనగా గమనించడం,
పక్కనే ఉన్న గుండమ్మకి తెలియకుండా చూసాను.
అద్దం లో ఓసారి మొహం చూసుకున్నాను.
ఉదయాన్నే వేసిన 'డై' బాగా నప్పింది.
కార్ డాష్ బోర్డ్ లో నుండి 'రేబాన్' గ్లాసు లు స్టైల్ గా పెట్టుకున్నాను.
స్కూటీ ఆవిడ గుండమ్మని కార్లోంచి గెంటేయమని సిగ్నల్ ఇచ్చింది.
నీ అసాధ్యం కూలా. .. మరీ అంత ఫాస్టా??....
కార్ స్లో చేసి దువ్వెనకోసం వెతుక్కుంటుంటే..
పక్కనే వచ్చి స్కూటి ఆపి, అద్దం మీద తట్టింది.
"అంకుల్ .. మీ సైడ్ డోర్ సరిగా పడలేదు" అంది.
"తూ ... &^%$#"

గుడ్లగూబ

సునీత తన బర్త గురించి ఒక గమత్తయిన విషయం గమనించింది.
రవీంద్ర రోజు సాయంత్రం పార్కుకి వెళ్ళటం అక్కడ గుడ్లగూబ లా అరవటం.
పక్కింటి వాళ్ళు చెబితే మొదట్లో నమ్మలేదు. చాటుగా గమనించింది.
ఇదేదో సరదా అని మొదట్లో అనుకున్నా.. అతని దినచర్యలో అది ఒక బాగం అవటం గమనించి ఒకరోజు అడిగింది “ఏం జరుగుతుంది?”
“నీకు తెలుసా? చెట్టు లో ఉన్న గుడ్లగూబ నాతో మాట్లాడుతుంది.”
సాయంత్రం తనతో పాటు తీసుకెళ్లి ఎప్పుడు కూర్చునే చెంచి మీద కూర్చుని గుడ్లగూబలా అరిచాడు.
అటునుండి సమాదానం వచ్చింది.
రవీంద్ర ఈ సారి మళ్ళీ దీర్గంగా కూత పెట్టాడు.
సమాదానం గా మళ్ళీ మరో సౌండ్ వచ్చింది.
“వి ఆర్ టాకింగ్ టు ఈచ్ ఆధర్. ఇట్స్ నైస్ నో. గత ఆరు నెలలుగా అనేక విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఎఫ్‌బి లో ఫుడ్ లవర్స్ గ్రూప్ నుండి, కవిత తవికలు వాటి ప్రభావం, అంతరిక్షం లో బ్లాక్ హోల్స్, వాటి విశిష్టత వాట్ నాట్? నేను ఒక పుస్తకం రాద్దామని అనుకుంటున్నాను. ‘మై ఎక్స్పీరియన్స్ విత్ ఔల్’ అనే పేరుతో...” ఆవేశం గా చెప్పడతాను.
సునీత కి భయం వేసింది.
సాయంత్రం ఒక సైక్రియటిస్ట్ అప్పాయింట్మెంట్ తీసుకుని రవీంద్ర తో పాటు వెళ్లింది.
ఒక్కతే వెళ్ళి డాక్టర్ తో మాట్లాడింది.
“గుడ్లగూబతో గత ఆర్నెల్లనుండి మాట్లాడుతున్నాడండి . రోజు పార్కు కి వెళ్ళటం, అయిదుగంటల సైరన్ మోగినప్పటి నుండి గంట సేపు పిచ్చి అరుపులు అరవటం ..” సునీత చెప్పింది.
ఒక్క అరగంట వెయిట్ చేయండి మీ ఇద్దర్ని పిలుస్తాను. ఆయన ఫోన్ అందుకుంటూ చెప్పాడు.
***
అరగంట కి డాక్టర్ వద్ద నుండి పిలుపు వచ్చింది.
అప్పటికే లోపల ఒకావిడ మతి స్థిమితం తక్కువగా ఉన్న కుర్రాడితో పాటు కూర్చుని ఉంది.
“రవీంద్ర గారు రండి.. మీ గుడ్లగూబ తో నేరుగా మాట్లాడండి” ఆ పిల్లాడిని చూపిస్తూ డాక్టర్ చెప్పాడు.

Sunday 24 September 2017

ఒకటి పొడవు ?!?

మిస్సెస్ బ్రహ్మ ట్రే లో వేడి వేడి టీ తీసుకు వచ్చేసరికి ఆయన కల్వం లో ఉన్న మట్టి వద్ద అప్పటికి సిద్దంగా ఉన్నాడు.
“ప్రాతః కాలముననే ప్రారంభించితీరా?!? వారాంతర శలవు మీరు సృష్టించిన మానవ జాతికేనా? సృష్టి కర్త యగు మీకు వర్తించదా?” అంటూ పక్కనే ఉన్న బల్ల మీద చెంకీల చీరకి మట్టి అంటకుండా కూర్చుంది.
బ్రహ్మ ఏమి మాట్లాడలేదు. ఆడవారి తో అర్గుమెంటు అవివేకమని ఆయనకి అనాదిగా తెలుసు.
“మమ్మల్ని చలన చిత్ర వీక్షణమునకు తీసుకువెళ్లి ఎన్ని దినములు అయ్యేను?” అంది
మెత్తగా ఉన్న మట్టిని అచ్చులలో సర్ధి చేతులు శుభ్రం చేసుకుని టి కప్పు అందుకున్నాడు ఆయన.
నాలుగు నోర్లు తో ఒక్కో గుక్క చప్పరించి. “ఏమి చేయుదును సఖీ .. గరళ కంఠుడు ఓవర్ టైమ్ కూడా చేయుచున్నాడని వర్తమానము అందినది. సృష్టి సమ దఃర్మము కొరకు తప్పదు అన్నాడు టీ చప్పరించుచు...
అతనిని మార్చుట సాధ్యపడదని ఆమె గ్రహించి “ఎల్లప్పుడు ఈ పాత డిజైన్ లెనా? అప్డేట్స్ ఏమయినా ఉన్నాయా?”
బ్రహ్మ కి తన పని మీద బార్య చూపించిన ఆసక్తి హుషారును తెచ్చింది.
“ఎన్నో మార్పులు చేసి యుంటిమి. వాలమును హరించితిమి. ద్వి పాదులను చేసితిమి. కరములను కురచగా చేసితిమీ. బ్రోటన వేలు వ్యతిరేక దిశలో వంగునట్లు చేసితీమి. అది అద్బుత మయిన ‘ఆకృతి’ అని అనేకుల ప్రశంసలు పొంది యున్నది. మరేమీ మార్పు చేయవలెను? “
“నా సూచన గమనింపుము. రెండు చేతులలో ఒకదానిని పొడవుగా సృస్తించినచో బాగుండును. ఒక పరి ఆలోచించుడీ”
ట్రే తీసుకుని వెనక్కి వెళ్తున్న ఆమెని అర్ధం కానట్లు చూశాడు మిస్టర్ బ్రహ్మ. 


గవాక్షము వద్ద నిలబడి ఆపిల్ x ఫోన్ ని వామ హస్తముతో దూరంగా పట్టుకుని సెల్ఫి తీసుకుంటూ ఒక్క నవ్వు నవ్విందావిడ ..

Sunday 17 September 2017

నిమ్మ ముళ్ళు

సన్నటి త్రోవలో కొద్దిదూరం నడిచి వెళ్ళి కొత్తగా కట్టిన మిద్దె కి నైరుతి మూల ఉన్న మెట్లు ఎక్కి తే మేము కొత్తగా కిరాయి కి తీసుకున్న రుము. చిన్నదే. కానీ సౌకర్యం గాను ప్రశాంతం గాను ఉంటుంది.
దారిలో ఒక వైపు ఉన్న చిన్న రేకుల  రూము లో ఒక పెద్దావిడ ఉంటుంది. తరువాత రెండు పాడుబడ్డ ఇల్లు వెనుక బాగం; ఆ తరువాత మా అతిది గృహం.
మాకు అనుచర గణానికి లోటు ఉండదు. ఎప్పుడూ ఎవరో ఒకరు అందుబాటులో ఉంటూనే ఉంటారు. మా వృత్తి అలాటిది. ప్రతి ఉదయం ఒక కుర్రాడు వాటర్ బబూల్ (త్రాగటానికి అవే)  తెచ్చి ఇస్తూ ఉంటాడు. ఖాళీది తీసుకెళ్తాడు.

ఒక రోజు ఆ కుర్రాడిని పెద్దావిడ  ఆపి ఏదో మాట్లాడటం మేడ మీది నుండి టీ తాగుతూ నేను గమనించాను.
“రెండు చెంబులు నీళ్ళు వంచయ్యా.. బోరు  నీళ్ళు త్రాగి వళ్ళు నొప్పులు గా ఉంటున్నాయి” అని అడిగిందట. మా కుర్రాడు ససేమిరా కుదరదని చెప్పాడట.
వారం లో ఒక రోజు ఆవిడకి కూడా ఒక బబూల్ నీళ్ళు తెప్పించి ఇవ్వటం మొదలెట్టాను.
ఆ తర్వాత ఆ పెద్దావిడని తీరిగ్గా గమనించడం మొదలెట్టాను.
పెద్ద వయసు కానీ కాయ కష్టం చేసినావిడ.  చిన్న పాటి ఇనప రేకుల కప్పు ఉన్న  గదిలో స్వంతం గా వంట చేసుకుని తింటూ కాలం గడుపుతుంది. పక్కనే ఒక చిన్న పాక లో నులక మంచం వాల్చి ఉంచుతుంది.
బబూల్ వ్యవహారం పూర్తి అయ్యాక తానే ఒక రోజు పలకరించింది. “ మోటారు బండి ఈ పాకలో పెట్టుకొయ్యా . వానకి తడవకుండా ఉంటుంది.” అంది.  ఆ పూట  నులక మంచం ఎత్తి గోడ వారగా పెట్టి ఉంది.
“సరే ..మామ్మా” నేను కూడా సమాదానంగా చెప్పాను.
ఒకసారి పొద్దు పోయాక ఇంటికి వస్తుంటే.. పెద్దావిడ బయట మంచం మీద కూర్చుని పమిట చెంగుతో దోమలు విసురుకుంటూ కూర్చుని ఉంది. “మామ్మా ఇంట్లో ఫాను కింద కూర్చో కూడదూ ?” అని అడుగుదామనుకున్నాను.
గదిలో ఛార్జింగ్ లైటు వెలుగుతూ ఉంది. కరెంటు పోయినట్లుంది.
“దోమలు రాకుండా ఉంటాయని ఈ నిమ్మ మొక్కలు తెచ్చి పెట్టానయ్యా.. కానీ వీటి బెడద తప్పట్లేదు”. అంది పలకరింపుగా.
 “పెద్దావిడ చూడండి ఎవరో దోమలు రావని చెప్పారట ఎన్ని నిమ్మ మొక్కలు తెచ్చి గోడ వారగా పెట్టిందో” మా ఆవిడ నాతో  అదే రోజు ఉదయం అంది.
నేనేం మాట్లాడలేదు. 
కొద్ది సేపు తర్వాత “ అటు నుండి నడిచేటప్పుడు ముళ్ళు గుచ్చు కుంటున్నాయా?” అడి గాను.
***
ఆమె చుట్టూ నలుగురు కొడుకులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నారు. “ఓపిక ఉండి వండుకుంటే సరి. లేనప్పుడు ఏదో ఒక కొడుకు దగ్గరకి పోయి గిన్నె లో కొంచెం పచ్చడో.. కూరో తెచ్చుకుంటుందట.”  అంది మా ఆవిడ ఒక రోజు.
 “ఆమె పని ఉత్తమం.  నలుగురు కొడుకులు కోడళ్ళు చుట్టూతా ఉన్నారు. చక్కగా అందర్నీ చూసుకుంటూ శేష జీవితం గడిపేయ్యొచ్చు”  మళ్ళీ తానే చెప్పింది.
నేను నవ్వేసి ఊరుకున్నాను.
“నీకు చాలా సార్లు చెప్పాను. కొన్ని విషయాల గురించి ఎక్కువ ఆలోచించ వద్దని. “
“ఏం? ఇప్పుడెమయిందట?”
“ముసలావిడ ఉండే రూముకి కరెంటు గాని ఒక ఫాన్ గాని లేదు. నలుగురు కోడళ్ళు ఎవరి ఇంటి నుండి కరెంటు ఇవ్వటానికి ఇష్టపడటం లేదు. ఆవిడకి ఒక చిన్న వెలుతురు బల్బు, ఒక ఫాన్ ఉంటే బావుంటుంది”
తను నోరు తెరుచుకుని నన్నే చూస్తూ ఉంది పోయింది. నిమ్మ మొక్కల ముళ్ళు ఆవిడ కి గుచ్చుకుని ఉంటుంది.

17/09/17 

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...