Saturday, 22 July 2017

పార్సిల్

“హలో.. మేడమ్”
“హలో .. ఎవరు?”
“సుగుణ మేడమ్ గారెనా? ‘అమెజాన్’ నుండి మీకో పార్సిల్ వచ్చింది. పెద్ద అట్టపెట్టె. “
“తీసుకు వస్తున్నారా?”
“ COD మేడమ్ రెండువేల చిల్లర ఉంది.”
“పర్లేదు తీసుకురండి. పే చేస్తాను”
“ఇక్కడ కస్తూరి బా గర్ల్స్ స్కూల్ అని ఉంది. వెలుగొండ రూట్ లో ఉన్న స్కూల్ .. ఆదేగా?”
“అవును. అక్కడే ఉన్నాను. తీసుకురండి”
“సారి మాం కనీసం 18 కి మీ పైగా రావాల్సి ఉంటుంది. సర్వీస్ గిట్టదు. మీరు సాయంత్రం. టౌన్ లోకి వచ్చినప్పుడు తీసుకుంటారా?”
“నేనయినా ఆ పార్సిల్ ఇక్కడికి తీసుకు రావాల్సిందే. మీరే పంపండి. అడిషనల్ గా పెట్రోల్ ఖర్చు నేను ఇస్తాను”
..
డెలివరీ బాయ్ స్కూల్ కి వెళ్ళేసరికి గంట పైన పట్టింది. పార్సిల్ పెట్టె పెద్దది కానీ బరువు పెద్దగా లేదు.
స్కూల్ కి వెళ్ళే సరికి సుగుణ మేడమ్ గారు క్లాస్స్ లో ఉన్నారు. ఆఫీసు గది వద్ద వెయిట్ చేస్తుంటే వాళ్ళ దూరపు బంధువు కూతురు అక్కడే చదువు తున్న విషయం అతనికి గుర్తొచ్చింది.
గ్రౌండ్ లో తోటి పిల్లలతో కలిసి చెట్ల కింద కూర్చుని చదువుకుంటున్న ఆ అమ్మాయిని కలుసుకుని పలకరించాడతను.
“అన్నా .. సుగుణ టీచర్ కోసమా? పార్సిల్ తెచ్చావా?” 9 వ క్లాసు చదువుతున్న ఆ అమ్మాయి అడిగింది.
“పార్సిల్ . విషయం నికెలా తెలుసు?”
“స్కూల్ లో పిల్లలందరికోసం తెప్పిస్తారు టీచర్ గారు. ఆమె స్వంత డబ్బు తో.. మాకు ఇక్కడ ‘అమ్మ’ ఆమే “ ఆ అమ్మాయి చెప్పింది.
..
“హలో.. బాబూ “
“మేడమ్ చెప్పండి”
“ఇందాక కార్టన్ పెట్టె డెలివరీ ఇచ్చావు. డబ్బు లు చిల్లర ఇచ్చేటప్పుడు. పొరపాటున రెండొందలు ఎక్కువ ఇచ్చావు”
“లేదు మేడమ్ కరెక్ట్ గానే ఇచ్చాను. మా చెల్లెలు ఆ స్కూల్ లోనే ఉంది. అంత మంది ఆడపిల్లలకి మీరు నాప్కిన్స్ కొనిస్తున్నప్పుడు. ఒకరిద్దరికి నేను ఇవ్వలేనా? పార్సిల్ డెలివరికి నాకు వచ్చే డబ్బు మేడమ్ అది. మిమ్మల్ని మర్చిపోను మేడమ్. మీరు నాకు గుర్తుంటారు . నమస్తే”

Thursday, 13 July 2017

ద్విభాషీ - పావులూరి శంకరనారాయణ శ్రేష్ఠి

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు.
ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి....
వాడి భాష మనకి రాదు...
వాడు "గాడ్ ఈజ్ గుడ్" అనేవాడు.
మనకి అది "గాడిదగుడ్డు" గా అర్థమైంది.
మనం "రాజమహేంద్రి" అన్నాం...
వాడికి "రాజమండ్రి"లా వినిపించింది.
మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు... వాడి భాష మనకి బోధపడేది కాదు.
వ్యాపారం, పరిపాలన వాళ్ల అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు. 1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారుచేశాడు. మన మాటలు వాడికి అర్థమయ్యాయి. కానీ వాడి మాటలు మనకి అర్ధం కావాలి కదా. అవసరం వాడిది. అందుకే జాన్ కార్నిక్ మారిస్ అనే వాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ తయారు చేశాడు. ఆ తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో డిక్షనరీ 1852 లో (ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి సరిగ్గా అయిదేళ్ల ముందు) తయారు చేశాడు.
చాలా మంది తెల్ల అధికారులు దుబాషీలను పెట్టుకున్నారు. దుబాషీలంటే ద్విభాషీలు. అటుది ఇటు ఇటుది అటు వివరించి చెప్పగలవారు వీరు. కానీ అందరికీ అంత దృశ్యం ఉండేది కాదు. వీళ్లు ముక్కస్యముక్కానువాదం చేసేవారు.
గుడిమెట్ల బంగారయ్య అంటే .....  Temple steps golden father అని..
పత్తికొండ నాగప్ప అంటే  cotton mountain cobra father అని
తోటకూర అంటే Garden to come  అనీ చిత్ర విచిత్రంగా అను"వధించే" వారు.
అలాంటి సమయంలో తెల్లోడి భాషను తెల్లోడి కన్నా తేటతెల్లంగా నేర్చుకుని, ధారాళంగా మాట్లాడేయడం అంటే మాటలు కాదు. ఇంకా ఇంగ్లండుకు పోయి ఉన్నత విద్య నేర్చుకోవడం వంటివి అలవాటు కాలేదు. అలాంటి రోజుల్లో తెల్లోడే తెల్లబోయేలా ఇంగ్లీషు మాట్లాడే వాడికి బోలెడంత డిమాండ్ ఉండేది.
అలాంటి వాడే మన నాయకుడు. ఆయన పేరు పావులూరి శంకరనారాయణ శ్రేష్ఠి. సొంతూరు నెల్లూరు. కానీ మద్రాసులో స్థిరపడ్డారు. తండ్రి రామానుజం చెట్టి నుంచి ఇంగ్లీషు నేర్చుకున్నారు. తండ్రిలాగానే దుబాషీ అయ్యారు. తండ్రి గంజాంలో రస్సెల్ అనే తెల్లదొరకు దుబాషీగా పనిచేసేవాడు. ఈయన విజయనగరం మహారాజా, జయపురం మహారాజా, పిఠాపురం, కొచ్చి, నూజివీడు జమీందారీ కుటుంబాల పిల్లలకు ఇంగ్లీషు చదువులు చెప్పారు. ఆ తరువాత మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో లెక్కల మేస్టారుగా పనిచేశారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో పరీక్షాధికారిగా కూడా పనిచేశారు. అంటే తన జీవిత కాలంలో ఆయన తమిళనాడు రాజధాని మద్రాసు, ఒరిస్సాలోని గంజాం, జయపురం, మన రాష్ట్రంలోని విజయనగరం, పిఠాపురం, నూజివీడు, నెల్లూరు, కేరళలోని కొచ్చి లను సందర్శించాడన్న మాట. ఆ రోజుల్లోనే ఆయన ఉద్యోగాల కోసం ఊరు వదలిన మహాసాహసి అంటే అడ్వెంచరర్ అన్న మాట.
రాచబిడ్డలకు చదువులు చెబుతున్నప్పుడే ఆయన వారి సౌలభ్యం కోసం ఇంగ్లీషు పదాలు, వాటి తెలుగు అర్థాల జాబితాను తయారు చేశారు. తరువాత దాన్నే వ్యవస్థీకరించి తెలుగువాడు తయారు చేసిన తొలి ఇంగ్లీషు తెలుగు డిక్షనరీని తయారు చేశారు. అంతే కాదు ... ఆయన తమిళ - ఇంగ్లీషు, ఇంగ్లీషు - తమిళ డిక్షనరీలను కూడా తయారు చేశారు. 1900 ప్రాంతంలో తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ కూడా తయారు చేశారు.
తన అవసరం కోసం ఇంగ్లీషు వాడు తయారు చేసినవి కాకుండా మన అవసరం కోసం మనవాడు తయారుచేసిన మొట్టమొదటి డిక్షనరీలు ఇవేనేమో!
ఆయన తయారుచేసిన తెలుగు డిక్షనరీ 1897లో ప్రచురితమైంది. దాని పేరే శంకరనారాయణ డిక్షనరీ. అప్పటి నుంచీ ఇంగ్లీషు నేర్చుకోవాలనుకున్న వారందరికీ శంకరనారాయణ డిక్షనరీయే ఆధారమైంది. అందరికీ ఆధునిక వేదమైంది. ఆయన బతికుండగానే అయిదు ముద్రణలకు నోచుకుంది. ప్రతి ముద్రణకీ కొత్త పదాలు జోడయ్యాయి. ఆయన 1924-25 ప్రాంతంలో చనిపోయారు. ఆ తరువాత 1927 లో గిడుగు సీతాపతి గారు, 1951 లో చిలుకూరి నారాయణ రావు గారు, తరువాత వేదం లక్ష్మీనారాయణ గారు కొత్తకొత్త పదాలను జోడించారు. 1953 లో నారాయణ అయ్యర్ దీనిని పరిష్కరించారు. ఇలా 1897 నుంచి 1953 వరకూ పదకొండు సార్లు పునర్ముద్రణ పొందింది ఈ డిక్షనరీ. కోస్తా జిల్లాల్లో ఇప్పటికీ ఈ డిక్షనరీయే ప్రామాణికం. తరతరాల విద్యార్థులకు ఇది హస్త భూషణంగా నిలిచింది. అనుమానం వస్తే చాలు ఆ పుస్తకం తీస్తారు. అంత ప్రజాదరణ ఉంది ఈ డిక్షనరీకి. 2004 అక్టోబర్లో విజయవాడకు చెందిన విక్టరీ పబ్లిషర్స్ దీన్ని మళ్లీ ముద్రించారు. ఆగస్టు 2005 నాటికి మలి ముద్రణ అవసరమైంది. మళ్లీ 2006, 2007లలో పునర్ముద్రించాల్సి వచ్చింది. ఈ నిఘంటువు ప్రజాదరణకు ఇదే నిదర్శనం.
కోస్తా, తమిళనాడుల్లో ఆంగ్ల భాష నేర్చుకోవడంలో ఆయన పాత్ర అనన్యసామాన్యం. ఆయన పేరుతోనే ఆయన వ్రాసిన డిక్షనరీ పేరొందింది. ఇప్పటికీ శంకరనారాయణ డిక్షనరీ అంటే ప్రామాణికమే.

పావులూరి శంకరనారాయణ శ్రేష్ఠి ఇప్పుడు లేరు. ఆయన పోయి దాదాపు తొంభై ఏళ్లు కావస్తోంది. కానీ లక్షలాది మంది విద్యార్థులు ఆంగ్ల పదం విషయంలో అనుమానం రాగానే "శంకరనారాయణను తీసి చూడు" అనుకుంటూ అప్రయత్నంగానే ఆయనను తలచుకుంటూనే ఉంటారు.

Sunday, 2 July 2017

పెద్దరికం అంటే ఇస్త్రీ చొక్కాలు, ఇనప వాచ్చీలెనా ?

మా ఊర్లో ఉన్న పెద్ద కళ్యాణ మండపం లలో అదొకటి.
ఆటొ లో అక్కడికి చేరే సరికి దాదాపుగా మా (ఆఫీసు) బ్యాచ్ అందరూ దిగారు.
తెలిసిన వాళ్ళ పెళ్లి. బ్రతికున్నప్పుడు మాతో పాటు పని చేసిన ఒక కొలీగ్ కుమార్తె పెళ్లి.
ఒకరి నొకరు పలకరించు కున్నాం.
రంగుల దీపాల అలంకరణ ని, పక్కనే ఉన్న ఖాళీస్థలం లో చక్కటి కార్పెట్స్ వేసి ఏర్పాటు చేసిన బఫే విందుని దాటి కళ్యాణ వేదిక వద్దకి వెళ్ళాం.
పెళ్లి కూతురు అన్న విజయ్ వచ్చి వినయంగా నమస్కరించి “బాగున్నారా అంకుల్. ఆంటీ ఎలా ఉన్నారు? చెల్లెలు ఏమి చదువుతుంది “ అంటూ పలకరించాడు.
సమాదానం చెప్పి అందరం కబుర్లలో పడ్డాం.
విజయ్ సీనియర్ ఇంటర్ పూర్తి అయ్యి పరీక్షలు వ్రాసిన మూడు నాలుగు రోజులకి తండ్రి సేరిబ్రల్ హెమరేజ్ తో చని పోయాడు.
మంచి మార్కులు వచ్చినా లోకల్ B గ్రేడ్ కాలేజీ లో ఇంజనీరింగ్ చదివాడు...
తల్లి స్వంత ఇంటి లో కొంత బాగాన్ని రెంట్ కి ఇచ్చి బర్త పెన్షన్ తో గుట్టుగా కాపురం లాక్కొచ్చింది. కుమార్తెని చదివించింది.
పిల్లాడి ని కోజీకోడ్ NIT లో ఎం.టెక్ చదివించింది. విజయ్ ఒక మంచి ఉద్యోగం సంపాదించాడు.
రెండు మూడేళ్లు తర్వాత చెల్లెలి పెళ్లి చేస్తున్నాను రమ్మని అందరికీ ఇంటింటికి వచ్చి పిలిచాడు. మా కొలీగ్ తో మాకు బందం తెగిపోయి 10 ఏండ్లు దాటింది. మళ్ళీ ఇప్పుడు ఈ పెళ్లి లో అతన్ని గుర్తు తెచ్చుకున్నాం.
చూడ చక్కగా ఉన్న నూతన వధువు –వరుడి ని అక్షితలతో ఆశీర్వదించి అందరం బోజనాల వద్ద పొగయ్యాం.
పల్లె నుండి వచ్చిన జనం తో బఫే వద్ద కొంచెం రద్దీగా ఉంది. విజయ్ అందరినీ పలకరిస్తూ, అటు పెళ్ళిని ఇటు అతిదులని బాలన్స్ చేస్తున్నాడు.
మేము ఇస్త్రీ బట్టలు నలగకుండా జాగర్తగా , హుందాగా బోజనం చేస్తున్నప్పుడు మావాళ్లు డజన్ల కొద్ది లోపాలు కనిపెట్టేశారు.
పెళ్లి కొడుక్కి కొంచెం జుట్టు తక్కువ, పెద్ద గా రాబడి ఉన్న ఉద్యోగం కాదు. వంకాయ కూర రుచిగా లేదు, సాంబారు మరి పలచగా ఉంది. కేరెట్ హల్వా గిన్నెతో ఇచ్చిన స్పూన్ క్వాలిటీ తక్కువగా ఉంది .. మొదలయినవి.
ఈ లోగా విజయ్ తన తల్లి తో పాటు బోజనాల వద్దకి వచ్చి మరో సారి అందరిని పలకరిస్తున్నాడు.
మాకు పక్కనే ఒక ప్లాస్టిక్ కుర్చీ లో కూర్చుని మరో దాని మీద ప్లేట్ ఉంచుకుని సాంబారు అన్నం లో అరచేయి మొత్తాన్ని ముంచుకుని తింటున్న మనిషి ఒకాయన, విజయ్ ని పిలిచాడు.
“ఒరేయ్ అబ్బాయ్. నువ్వు గట్టొడివిరా.. మీ అయ్య ఉన్నా ఇంత బాగా పిల్ల పెళ్లి చేసేవాడు కాదు” అన్నాడు పెద్దగా.
ఆ మాట మేమందరం విన్నాం. అది నిజమని మాకు తెలుసు.
పొద్దుటే వాష్ రూమ్ లో వదిలేసే వాటి గురించి ఆసక్తి గా మాట్లాడుకున్న మేము
ఈ మాత్రం ప్రశంస ఎందుకు చేయలేక పోయాం. ??
పెద్దరికం అంటే ఇస్త్రీ చొక్కాలు, ఇనప వాచ్చీలెనా ?