Sunday, 14 October 2018

దీర్ఘ సుమంగళీ భవ


వర్షం కురవటం ఆగి అరగంట దాటింది.
సిమెంటు రేకుల కప్పు నుండి సన్నగా కారుతున్న వర్షం నీరు సరిగ్గా స్టౌ మీద పడుతుంది.
వర్ధని పొయ్యి పక్కకి జరిపి ఖాళీ పెయింట్ డబ్బా ఒకటి అక్కడ ఉంచింది.
ముందు గదిలో పడక కుర్చీ లో కుర్చుని పేపరు చూస్తున్న ముకుందం “టైం ఎంతయింది?” అని పెద్ద గొంతు తో అడిగాడు.  
తన మాట తనకి వినబడాలి అంటే ఆమాత్రం అరవాల్సిందే..
“ఎనిమిదిన్నర..” అంతే గొంతు తో వర్ధని సమాదానం చెప్పింది.
పక్కకి జరిపిన స్టవ్ మీద ఒక స్టీలు గిన్నెలో పాలు కాచి, కొద్దిగా ఫిల్టర్ డికాషిన్ కలిపి ఒక కప్పులో పోసి, ప్లేట్లో రెండు రసుకులు  ఉంచి తీసుకువచ్చి ముకుందం ముందు ఉంచింది.
ఆతని తల తృప్తిగా ఊగింది. రెండు రసుకులు నోట్లో వేసుకుని కాఫీ చప్పరించి, జేబులోనుండి చుట్టిన లంక పొగాకు చుట్ట ముట్టించాడు. ఇక మధ్యానం భోజనం వేళయితే తప్ప ఎవరినీ ఇబ్బంది పెట్టడు. కొడుకు చూసి  పడేసిన నిన్నటి పేపరు తాజాగా అక్షరం మిగలకుండా లావు పాటి కళ్ళజోడు లోనుండి చదివేస్తాడు. అప్పుడప్పుడూ బార్యని పిలిచి కొన్ని వినిపిస్తూ ఉంటాడు.
“నువ్వు కుడా ఒక గుక్క తాగు” అన్నాడు బార్యతో తల ఊపుతూ. అతను తల ఊపినప్పుడల్లా అడవిలో మృగరాజు లాగా ఉంటాడు. భారీ మనిషి.
వర్ధని నాలుగు వందల గజాల స్థలం లో ఒక మూల ఉన్న అవుట్ హౌస్ లాటి రేకుల ఇంట్లో నుండి మద్యలో ఉన్న విశాలమయిన ఇంటిలోకి వచ్చింది. కోడలు మనమడిని రెడీ చేస్తూ ఉంది. వర్ధని ని చూడగానే “వీడిని స్కూల్ బస్సు ఎక్కించండి నాకూ లేట్ అవుతుంది.” పిల్లాడి కి రెండు కాళ్ళకి బూట్లు తొడిగి  పమిటలో శుబ్రంగా తిడిచి పుస్తకాల సంచీ  అందుకుని వాడి రెక్క పుచ్చుకుని బయటకి నడిచింది.
వర్ధని వీది మలుపులో పిల్లాడిని స్కూల్ బస్సు ఎక్కించి వచ్చాక, సాయంత్రానికి చెయ్యాల్సిన పనులు లిస్టు ఏకరువు పెట్టి కోడలు కూడా ఆఫీసు కి బయలు దేరింది.
***
కొడుకు ఇంటి వంట గది సర్ది అంట్లు బయట వేసి మనమడు ఆట వస్తువులు సర్దుతూ ఉండే సరికి ‘జరీనా’ వచ్చింది.
జరీనా వాగుడు కాయ. ముపై ఏళ్ల పరిచయం. వర్ధని  కడుపుతో ఉన్నప్పుడు పనికి కుదిరింది. పని మనిషి కోసం రేకుల గది ఒకటి  కాంపౌండ్ లోపల  కట్టిస్తాను అన్ని ముకుందం అన్నప్పుడు ఆమె ఒప్పుకోలేదు. పని మనిషి కుటుంబం కోసం కనీస సౌకర్యాలతో రెండు గదులు  అనేసరికి వర్ధని భర్త ని వారించింది. ముకుందం ఆమెకి నచ్చచెప్పి  మెయిడ్ రూమ్ కట్టించాడు.
జరీనా, కొలిమి పని చేసే ఖాదర్ తో పాటు ఆ గదిలోనే ఉండేది. ఇద్దరు పిల్లలు పుట్టటం ఆ ఇంట్లోనే పెరగటం పెళ్ళిళ్ళు అవటం అన్నీ అయిపోయాయి. కొడుకు ఎదో డిపార్ట్మెంట్ స్టోర్ లో మేనేజర్ గా చేస్తాడు. అదే స్టోర్ లో పని చేసే పిల్లని పెళ్లి చేసుకుని దగ్గరలో వేరే ఇల్లు చూసుకుని జరీనాని, ఖాదర్ ని తీసుకుని వెళ్లి పోయాడు. అదే ఇంట్లో స్వయంగా తామే ఉండాల్సి వస్తుందని వర్ధని ఉహించలేదు.
కొడుకు  ఉద్యోగం చేసే భార్యని పేపర్ లో ప్రకటించి మరీ సెలెక్ట్ చేసుకున్నాడు. మనుష్యులని సంభందాలని డబ్బుతో కొలవటం అలవాటు చేసుకున్నాడు. అది తొలుత గమనించింది ముకుందమే ..
మెయిడ్  హౌస్ లోకి మారడం అనే ఆలోచన అతనిదే..
ముకుందం రోజు చుట్ట కాలుస్తాడు. వాకింగ్ కి వెళ్లి వేపపుల్ల నోట్లో పెట్టుకుని వస్తాడు. అతను ఉమ్మి వేయటం కోడలికి నచ్చదు. మనమడిని దగ్గరకి రానివ్వదు. రెండు రకాల వంటలు పనిమనిషికి చెప్పి చేయించడం మొదలెట్టింది.
“వర్దనీ... నాలుగువేలు పై చిలుకు పెన్షన్ వస్తుంది. మన గంజి మనం కాసుకుంటూ బతకటానికి ఈ ఇల్లు చాలదా?” అన్నాడు ఒకరోజు.
మొదట ఆశ్చర్యపోయిన వర్ధని .. రెండు రోజుల్లోనే భర్త చెప్పిన మాట ని అనుసరించింది. పాత నవారు మంచం, పడక కుర్చీ, కొద్ది వంట  సామాను ఆ గది లోకి మార్చుకుంటుంటే కొడుకు ఎదో మాట్లాడ బోయాడు. కోడలు కళ్ళతో రిమోట్ చేసింది. అప్పటి నుండి ముకుందం కొడుకు ఇంట్లో అడుగుపెట్టిందే లేదు. వర్ధని మాత్రం కొడుకు కోడలు పనిలోకి వెళ్ళగానే పనిపిల్ల తో  ఇల్లు శుభ్రం చేయించడం (చేయటం) ముకుందం అవసరాలు చూసుకోవటం చేస్తూ ఉంటుంది.
జరీనా ఎప్పుడయినా తీరిక చేసుకుని తమని పలకరించడానికి వస్తుంది.
వచ్చిన రోజు తనకి సాయం గా ఒక పూట ఉంటుంది. ముకుందం తో ఆయనకీ వినబడే వాయిస్ తో చాలా విషయాలు చెబుతుంది.
“ఏంటమ్మా... ఈ ఖర్మ స్వంత ఇంట్లోనే  ఈ రేకుల కొంపలో వేరే పొయ్యి” అంది పలకరింపుగా..
వర్ధని నవ్వింది.
“ఒక్క సాయం చెయ్యవే... జరీనా  “
“చెప్పండమ్మా...”
“ కాసేపు ఇల్లు కనిపెట్టుకుని ఉండు. స్నానం చేసి గుడి కి వెళ్లి వస్తాను. ఆయనొక్కడే ఉంటాడు. బయట ఎవరయినా పిలిచినా వినబడదు.”
“ ఓ అదేమంత భాగ్యం .. అలానే వెళ్లి రండి.”
***
వర్ధని వచ్చేసరికి రెండు గంటల  పైగా పట్టింది. ఖాళీ స్థలం లో ముకుందం పెంచుతున్న ఆకు కూరలు, కూరగాయల మొక్కల కి పాదులు చేసి ఎరువు వేయటం లో సాయం చేసింది జరీనా.
పొయ్యి మీద భోజనం తయారు చేసి పెట్టింది. ఆకుకూర పప్పు చేసింది.
వర్ధని రాగానే ముగ్గురూ చాప పరుచుకుని బోజనానికి కూర్చున్నారు. ముకుందం పడక కుర్చీ ముందు ఒక చక్క స్టూల్ ఉంచి భోజనం వడ్డించింది.  
“గాంధీ బజార్లో ఉన్న గుడికి వెళ్లి వచ్చాను.”
“ఈ వీది చివర్లోనే గుడి ఉంది కదమ్మా.. అంత దూరం లో ఉన్న గుడికి ఎందుకు వెళ్ళటం? దేవుడు ఎక్కడయినా దేవుడేగా?” అంది జరీనా.
ముకుందం అన్నం ముద్ద నోట్లో పెట్టుకుంటూ “ఈ వీది లో ఉన్న పూజారి వయసులో పెద్ద వాడు. పూజ చక్కగా చేస్తాడు. ప్రసాదం పెట్టి ఆశీర్వచనం చేసి గాని పంపడు.
వర్ధని నవ్వింది.
“గాంధీ నగర్ గుడిలో కుర్ర పుజారీ ఎర్రగా ... బాగుంటాడు.” అంది.
ముకుందం అదేమీ పట్టించుకోకుండా “ ఈయన ‘దీర్ఘ సుమంగళీ భవ’ అని శటగోపం పెట్టి ఆశీర్వదిస్తాడు. అదెక్కడ నిజమయి, తను ముందే వెళ్లి పోయి, నేను బికారి ని అవుతానని ...” ముకుందం కళ్ళు తుడుచుకున్నాడు.