Friday, 28 April 2017

హల్వా

ఆమె యవ్వనాన్ని అతనికి ధార పోసింది.
ఎంతో అనుకువగా అతనితో ఉంది.
అతను ఆవిడని వదిలి మరో స్త్రీ తో వెళ్ళి పోయాడు.
ఆమె ని ఒక్క సారిగా శూన్యం ఆవహించింది.
ఒక నిస్పృహ.. వేదన ముంచెత్తాయి.
మనశ్శాంతి కోసం పరితపించింది.
కాశీ వెళ్లింది. అనేక సాధువులని దర్శించింది.
చివరికి ఆమెకి ఒక గురువు లభించాడు.
తన బాదంతా వెళ్లగక్కింది.
“నేను అతన్ని ఎంతో ప్రేమించాను. జీవితం లో విలువయిన కాలం అతని సేవలకే కేటాయించాను. నన్ను విడిచి వెళ్లిపోయాడు.” దుఖం మళ్ళీ తన్నుకొచ్చింది.
అతను ఆశ్రమం నుండి ఒక హల్వా పాకెట్ తెప్పించాడు.
ఆమెని కుదురుకుని దానిని స్వీకరించమన్నాడు.
ఆమె స్థిమిత పడింది. హల్వా తింది.
“ఎలా ఉంది?”
“తియ్యగా ఉంది. రుచిగా ఉంది”
“మరోసారి స్వీకరిస్తావా”
ఆమె అవునన్నట్లు తల ఉంపింది.
సాదువు నవ్వాడు. “ ఇదే సమస్య” అన్నాడు.
“ఏమయినా అర్ధం అయిందా” అనునయంగా అడిగాడు.
ఆమె కొద్ది క్షణాలు మౌనంగా ఉంది పోయింది.
తర్వాత నెమ్మదిగా తనలో మాట్లాడు కుంటునట్లు “అవును మనిషి ఆశ కి అంతం ఉండదు. ఒకటి అందాక మరొకటి. పెద్దది. ఇంకా రుచిగా ఉండేది. ఏది శాశ్వతం కాదు. కానీ కోరికలు తీరే కొంది పెరిగి పోతూ ఉంటాయి. ఆయన విషయం లో అదే జరిగింది. ఆశ .. ఒక పెద్ద భూతం..”
..
..
..
“తమరి బొంద... ఇప్పటికే ఇంత లావు ఉన్నావు. తిండి తగ్గించు. నోరు కట్టుకో..”... :p :D

Tuesday, 25 April 2017

జూదానికీ మరో పేరు

చాలామందికి తెలిసిన చందమామ కధ లాటిదే...
రామయ్య సోమయ్య ఇద్దరూ చెరో కొంత రొక్కం పుచ్చుకుని జూదానికి బయలుదేరారు.
మంచి శకునం చూసుకుని వెళ్తూ ఉండగా మార్గమధ్యం లో ఒక సాదువు ద్యానం చేసుకుంటూ కనిపించాడు.
ఇద్దరూ ఆయన దర్శనం చేసుకుని, భవిషత్తు గురించి ఆరా తీశారు.
రామయ్యకి మంచి జరుగుతుందని, పట్టిందల్లా బంగారం అని ఆశీర్వదించి చెప్పాడు.
సోమయ్యకి జూదం వలన నష్టపోతావని, వీలయితే దాని జోలికి వెళ్లొద్దని చెప్పాడు.
వైరాగ్యాలలో మరో వైరాగ్యం, ‘సలహా వైరాగ్యం’ .
మన మనసుకి వ్యతిరేకంగా ఎవరు చెప్పినా కొద్ది సేపటి కి నచ్చదు.
మనలో చాలా మందిమి మన మనసులో ఉన్నదాన్ని సమర్ధించే వాళ్ళ కోసం వెతుకుతాం కానీ, సరయిన సూచన చేసేవారిని పక్కన పెడతాం.
రామయ్య, సోమయ్య లు కూడా మనలోని వారే కనుక నేరుగా జూదానికి వెళ్లారు.
సాయంత్రానికి సాధువు చెప్పిన దానికి భిన్నంగా రామయ్యకి పైసా మిగల్లేడు. తెచ్చిన రొక్కం ఊడ్చుకు పోయింది.
సోమయ్య కి చొక్కా జేబులు పట్టనంత గా లబ్ది చేకూరింది.
మార్గమధ్యలో సాదువు ని ఒకరు దుర్బాషలాడుతూ, మరొకరు గేలి చేసుకుంటూ .. ఇళ్లకు చేరారు.
కట్ చేస్తే...
రామయ్య జూదం మానుకుని, ఇంటి పట్టున కుల వృతి చేసుకుంటూ బార్యా పిల్లలని, కుటుంబాన్ని నిలబెట్టుకున్నాడు. ఆరోగ్యంగా ఉన్నాడు.
సోమయ్య మరింత ఆశతో, ఆస్తి పాస్తులు అమ్ముకుని, జూదం లో పోగొట్టుకుని, తిరిగి అందులోనే వెతుక్కోవాలని, కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని రెంటినీ కోల్పోయాడు.
ఇదంతా తెలిసిన కధే కావచ్చు...
చాలామందికి తెలియనిది ‘జూదం’ అంటే ‘రియల్ ఎస్టేట్ వ్యాపారం’ అని.

Sunday, 23 April 2017

ఈ బియ్యం వండే అవసరం లేదు.

(Jolphan) జోల్ఫన్ అంటే అస్సామీ లో సంప్రదాయ అల్పాహారం.
వీటిలో ఒక ప్రత్యేకం .. కోమల్ సౌల్ (Komol saul) ఉత్తర ఈశాన్య రాష్ట్రం అయిన అస్సాం లో పండించే ఒక సంప్రదాయ వరి వంగడం ఇది. 
సాఫ్ట్ రైస్ అని పిలవబడే కోమల్ సౌల్ ఒక ప్రత్యేక మయిన వరి పంట. 
ఉడికించడం తో పనిలేకుండా తినగలగడం ఈ బియ్యం ప్రత్యేకత.
కేవలం 15 నిమిషాలు నులివెచ్చటి నీటిలో నానబెడితే చాలు, ఉడికిన అన్నం మాదిరిగా లావుగా మెత్తగా తయారయ్యే అన్నం లో పెరుగు, బెల్లం కలుపుకుని తినేస్తారు. ఇష్టం గా తినే సంప్రదాయ ఈ అల్పాహారాన్ని రుచి చూడకుండా అస్సాం వెళ్ళి రావటం చేయకండి.
సి‌ఆర్‌ఆర్‌ఐ (central rice research institute) ఒరిస్సా వారు ఈ వంగడం మీద పరిశోదన చేశారు.
అస్సామ్ లోనే తక్కువగా పండే ఈ రకం వరి వంగడాన్ని, ఒరిస్సాలో ఎక్కువ ఈల్డింగ్ ఉన్న వరి వంగడం తో కలిపి ఒక హైబ్రిడ్ పంటని అభివృద్ది చేశారు. ఈ నూతన వరి పంట పేరు Aghunibore


అస్సామ్ తో పోలిస్తే హ్యూమిడిటీ తక్కువగాను, ఉష్ణోగ్రత ఎక్కువగాను ఉండే ఒరిస్సా లో ఈ వరిని ప్రయోగాత్మకంగా పండిస్తున్నారు.
ఈ విధానం విజయవంతం అయితే దేశమంతా ఈ వరి ని పండించడానికి శాస్త్రవేత్తల ప్రయత్నం. పోషక ఆహార లోపం తో బాధపడే ఇండియా లాటి దేశాలలో ఇలాటి పంటల అవసరం ఎంతో ఉంది.

Wednesday, 19 April 2017

ప్రతాపం

34 లక్షలు అంతకు మించి ఒక్క రూపాయి తగ్గినా క్వాలిటీ లో రాజీ పడాల్సి వస్తుంది. 
బిల్డర్ ఖరాకండిగా చెప్పాడు. 
“అయినా మీరు అడగాల్సిన పనే లేదు మేడమ్. సారు మాకు ఎంతో సన్నిహితుడు. సార్ ఆఫీసులో మాకు ఎన్నో పనులు ఉంటాయి. మీకు తెలీదు గాని సార్ ఎంత చెబితే అంతే.. ఆఫీసులో అందరూ భయపడేది సారుకే. ఆయన మా అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనటం మా అదృష్టం. అలాటి ఆయన కి ఏమాత్రం అవకాశం ఉన్న మేము రూపాయి కూడా ఎక్కువ చెప్పం. మీరింతగా అడుగుతున్నారు. సార్ మీద గౌరవం తో ఆ కరెంటు ట్రాన్స్ఫోర్మ్ కి కట్టాల్సిన 15 వేలు తగ్గించుకోండి. ఇక మీరు అడగొద్దు” బిల్డర్ ఆవిడ నోటినే కాదు, అతని నోటిని కూడా మూయించాడు.
చదరపు అడుక్కి 100 ఎక్కువ అడుగుతున్నాడని, డీవియేషన్ పది శాతం కంటే ఎక్కువ ఉందని, పర్మిషన్ లేని పెంట్ హౌస్ కట్టడని, సెల్లార్ లో పార్కింగ్ జాగా లో షాపు కట్టి అద్దెకి ఇచ్చుకున్నాడని అతనికి తెలుసు. కానీ అడగలేదు.
అతను గట్టిగా అడిగితే జనరేటర్ ఖర్చు కూడా మిగిలేదోమో గాని.. బిల్డర్, మాజీ ఎంపీ గారి తమ్ముడు, ధనికుడు, పైగా బార్య ముందు పొగిడే సరికి మొహమాట పడ్డాడు. గొంతులో మాటలు బయటకి రాలేదు.
యబైవేలు పన్నెండు సార్లు లెక్క పెట్టి రశీదు కుడిచేత్తో పుచ్చుకుని, బార్యకి ఇచ్చాడు. ఆమె కళ్ళకి అడ్డుకుని హండు బాగ్ లో పెట్టుకుంది. బిల్డర్ తెప్పించిన కాఫీ తాగి ఇద్దరూ బయలు దేరారు.
ఎన్నో ఏళ్ల నుండి టౌన్ లోకి మారాలని ఆమె కోరిక. పక్కనే ఇరవై కిలోమీటర్ల దూరం లో పంపకాల్లో వచ్చిన పాత మిద్దోకటి ఉంది. కానీ స్వంతంగా ఒక ఇల్లు అది టౌన్ లో.. ఇన్నాల్టికి నెరవేరబోతుంది.
టౌన్ దాటేసరికి చీకటి ముసురుకుంటుంది. బండి ముందు చక్రం ఫ్లాట్ అయింది.
హెల్మెట్ తీసి అద్దానికి తగిలించి పంచర్ షాపు కోసం వెతుక్కుంటూ నడవసాగారు.
కొద్ది దూరం లోనే ఒక చిన్న సైకిల్ షాపు. అక్కడో పది హేనేళ్ళ పిల్లాడు షాపు మూసేయ్యబోతున్నాడు. పది నిమిషాల్లో పంచర్ వేసి, తొక్కుడు పంపుతో బండి రెడీ చేశాడు.
“ట్యూబు లెస్ టైర్లు వాడండి సార్, ఇలా ఇబ్బంది పెట్టదు. ఇంటికి చేరుస్తుంది” చెప్పాడు.
“ఎంత?” అతను పర్సు తీశాడు.
“యాబై”
“ఎందుకురా యాబై? ముప్పై తీసుకో. అసలు రోడ్డు పక్క షాపు ఎవరి పర్మిషన్ తో పెట్టావ్?. నేనెవరో తలుసా? రెప్పొద్దుట మునిసిపాలిటీ వాళ్ళని పంపిస్తాను. ఇక్కడ షాపు పీకించేస్తాను. అర్ధమయిందా?” అతను పులి అయిపోయాడు.
“అంత పనేందుకు సార్. మీరు ఇవ్వదలుచుకుంది ఇవ్వండి” పిల్లాడు సరెండర్ అయిపోయాడు.
అతను ఎక్కి హెల్మెట్ తగిలించుకుని, ఆవిడ వెనుక కూర్చున్నాక
“ మీ ప్రతాపాలు మాలాటి వాళ్ళ దగ్గరేగా?” అన్నాడు.
అతనికి వినబడిందో లేదో కానీ, బండి స్టార్ట్ అయింది. 

Monday, 10 April 2017

బూమరాంగ్

బూమరాంగ్ 
-----------
ఒంగోలు నుండి త్రోవగుంట మీదుగా కడవకుదురు దాటాక రైల్వే గేటు వేసి ఉంది. వరుసగా వాహనాలు ఆగిఉన్నాయి. 
అక్కడ గేటు పడితే కనీసం పదిహేను నిమిషాలు పడుతుంది. అప్ డౌన్ రెండు ట్రైన్ లు వదిలాక కానీ గేటు లెగవదు.
జీడిపప్పు బెల్లం ఉండలు, జీడి మామిళ్ళు, వేపిన జీడిపప్పు పాకెట్లు అమ్మే వాళ్ళ కి వ్యాపారం అక్కడే. 
గోల్డ్ కలర్ కొత్త బ్రేజ్జ కారు, అప్పటికే ఆగిఉన్న పాత మారుతి 800 కారు వెనుక కొండచిలువ లాగా వచ్చి ఆగింది.
తాటిముంజలు.. జామ కాయలు, టేగలు ..అమ్ముకునే చిన్న వ్యాపారులు..చుట్టూ ముట్టేశారు.
పది నిమిషాలు గడిచాయి. గేటు తీశారు.
800 కారు హాండ్ బ్రేక్ తీసి లోడ్ గేర్ లో ముందుకు కదిలించే లోగా .. రోడ్డు పల్లంగా ఉండటం తో వెనక్కి జరిగింది. రెండంటే రెండు అడుగులు వచ్చేసరికి కొత్తగా కారు నేర్చుకుంటున్న.. ఆ20 ఏళ్ల పిల్లాడు కంగారు పడి హాండ్ బ్రేక్ పట్టుకున్నాడు.
కానీ అప్పటికే జరగాల్సిన డామెజి జరిగింది. కొత్త కారు ని మెత్తగా నెట్టుకున్నట్టు బాయినెట్ ముందు వేలాడుతున్న నిమ్మకాయలు నలిగి పోయాయి.
పిల్లాడు కంగారు గా కారు దిగి వచ్చేసరికి, బ్రేజ్జ యజమాని పిల్లాడి కాలరు పట్టుకుని ఈడ్చి గూబకెసి ఒక్కటి పీకి, “వెదవ లంజా కొడకా” అని తిట్టాడు.
పిల్లాడి కళ్ళవెంట నీళ్ళు తిరిగాయి. రోడ్డు పక్కన ఉన్న రాయి ఒక దాన్నివెనుక టైరు క్రింద పెట్టి, కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళి పోయాడు.
పందిళ్ళ పల్లి ఊరు దాటుతుండగా, ఇద్దరు పోలీసులు బ్రేజ్జ కారుని అపారు. రోడ్డు పక్కనే ఉన్నరెండంతస్తుల విశాలమయిన భవనం నుండి ఒకాయన వచ్చి, కారులోకి తొంగి చూస్తూ.. “క్షమించండి. నా పేరు మోహన్. ఇందాక మీ కారు ని మా మేనల్లుడు డాష్ ఇచ్చాడట. ఏదయినా డామెజి అయిందా?”
అతనెవరో అర్ధం అయిన కారు యజమానికి అప్పటికే చెమటలు పట్టాయి.
“అబ్బే లేదండీ. ఏమి అవలేదు. నేనే కోపం తో ...”


“ మీరు గమనించారో లేదు పిల్లాడి కారు వెనుక అద్దం మీద L అంటించి ఉంది. ఒక పని చేయండి మీరు కొత్త కారు కొనుక్కోండి. హైయ్యర్ ఎండ్ కొనుక్కోండి ఇదిగో 13 లక్షల చెక్. ఆ పిల్లాడి కి మీరిచ్చినవి మీరు తీసుకెళ్ళండి చాలు” అతను లోపలికి వెళ్ళాడు.
చుట్టూ జనం ప్రోగయ్యారు.

రెండో అత్త

చిన్నదానికి అన్ని మా అత్త గారి పోలికలు వచ్చాయి.
ఆవిడ ఉండగానే ఈవిడ తయారు. ఎదో రకంగా అత్తగారి మెప్పు పొందొచ్చు గాని చిన్నదానితో వేగటం కష్టం. పగలంతా వేపుకుతినటం, సాయంత్రానికి వాళ్ళ నాన్న కి నా మిద పితూరీలు చెప్పటం. ఇదే దాని పని.
అరగజం పొడవు, ఆరిందా మాటలు మాట్లాడే మా చిన్నది స్కూల్ కి ఇప్పుడిప్పుడే వెళ్తుంది.
మూడేళ్ల వరకు రాని మాటలు పుట్ట పగిలినట్లు ఒకేసారి ప్రవాహం లా వచ్చాయి.
రాత్రిళ్ళు నిద్రపోదు. హటాత్తుగా లేచి “అమ్మా రామాంజమ్మా తలుపులు సరిగా వేసావా లేదా? అంటుంది. “
లేదా ‘పాలు తోడూ పెట్టావా? లేకపోతె రేపు మాకు మజ్జిగ ఉండవు” అంటుంది.
ఆ టేబిల్ మిద ఉరగాయ సీసా తియ్యమ్మా, పగిలితే, మళ్ళి మా నాన్న కొనలేడు” అంటుంది.
“ఉప్మాలో జీడిపప్పు అన్ని తెనేసావా? మాకేమయినా ఉంచావా?”
ఇలా ఉంటాయి దాని ముదురు మాటలు. వాళ్ళ నాన్న ముందు మాత్రం అమాయకంగా ఉంటుంది. బిస్కెట్లు, చాక్లెట్లు తెచ్చేది ఆయనేగా?
నేను ఎన్ని చెప్పినా నమ్మరాయన. “ఉర్కొ .. మూడేళ్ళ పిల్ల అలా ఎలా మాట్లాడుతుంది?” అంటారు
ఈ వేళ ఆ ముచ్చట కుడా తీరిపోయింది.
స్కూల్ లో ఎవరిదో పుట్టినరోజు పార్టి ఉందని పెద్దమ్మాయి, చిన్నదాన్ని తీసుకువెళ్ళింది.
ఈ లోగా ఈయనోచ్చి ఫ్రెష్ అయి టి తాగుతున్నారు.
“పిల్లలేరి?”
 “స్కూల్ కి వెళ్ళారు. వెంకటేశ్వర్లు మాస్టారి పాప పుట్టిన రోజుట. అక్కడే తింటారు. ఎనిమిది కి వెళ్లి నేను తీసుకొస్తాను" అని చెప్పాను. “
నేను సమాదానం చెప్పే లోగా మా చిన్నది పరిగిత్తుకు వచ్చి వాకిలి దగ్గరనుండి కేక వేసింది. మధ్య గదిలో ఉన్న వాళ్ళ నాన్న ని గమనించ లేదు లా ఉంది.
“అమ్మో .. రామంజమ్మో అక్కా నేను కేకులు తినేసి వస్తాం. మాకు అన్నం వండ వద్దు. మా నాన్న సరుకులు తేవటం నువ్వు దుబారా చెయ్యటం.” అంది.
ఆయన నోరు తెరుచుకుని టి తాగటం మర్చి పోయి పిచ్చి చూపులు చూడటం మొదలెట్టారు. 
( కొన్ని జ్ణాపకాలు)

Saturday, 8 April 2017

గోడకి కొట్టిన బంతి

బాగా అలసి పోయి ఉన్నాడు.
బస్ స్టాండ్ లో ఉన్నాడు.
అరగంటకు ఒక ఎక్సప్రెస్ బస్ వస్తుంది.
సీట్లు లేవు . అతనికి నిలబడే ఓపిక కూడా లేదు. 
రాత్రి 10. నిద్ర.. అలసట ఆకలి
బస్ స్టాండ్ బయట అరడజను అరటిపళ్ళు కొనుకుని
రెండు తిని నీళ్లు తాగాడు.
ఫ్లాట్ ఫారం చివర ఒక మనిషి ముడుచుకుని ఉన్నాడు.
సృహలో లేనట్టు నిద్ర పోతున్నాడు.
.....
కనిగిరి విజయవాడ బస్ వచ్చింది. భోజనాలకి పావుగంట ఆపాడు.
నిండా ప్రయాణికులు. తప్పలేదు ఎక్కేసాడు.
ముందు సీట్లో పెద్దావిడ పిల్లలని సర్ది పక్కకి జరిగి "కూర్చోండి " అంది.
"నన్నెనా?? "
"మిమ్మల్నే కూర్చోండి."
ఆశ్చర్యం .. అతనికి మొహమాటపడే సీన్ లేదు.
.....
టికెట్ కొంటున్న అతనితో..
" ఎంత ఆకలితో ఉన్నాడో పాపం ..అరటిపళ్ళు తింటూ కళ్లనీళ్లు తుడుచుకుంటున్నాడు" అందామె

Tuesday, 4 April 2017

మెడ మీద కొబ్బరి కాయ.

ఇప్పుడే ఒక మిత్రుడు ఫోన్ చేసి అడిగాడు.
“స్టువాట్ పురం వెళ్దాం. ఆదివారం రోజు వస్తావా?” అని
“ఏంటి విషయం?”
“మీకో గొప్ప స్టంట్ మాన్ ని పరిచయం చేస్తాను. 15 ఏండ్ల పాటు కొరియా లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోటానికి వెళ్ళాడు.
కరాటే, జూడో, కుంఫూ లాటి వి సాదన చేశాడు. సండే ప్రదర్శనఉంది వెల్ధామా?”
“పనులున్నాయి వీలవుతుందో లేదో చూడాలి”
నన్ను ఇంకా ఉరిస్తూ.. “ బార్య మెడ మీద కొబ్బరి కాయ ఉంచి కళ్ళకు గంతలు కట్టుకుని కత్తితో దాన్ని రెండు ముక్కలుగా నరుకుతాడు”
“తెలివయిన వాడు. ఆవిడ జన్మలో అతనితో గొడవ పడదు.”

మా మిత్రుడు ఫోన్ కట్ చేయలేదు. మాట్లాడటం లేదు. బోనులో పడ్డ ఎలుక సౌండు వినబడుతుంది. 

Sunday, 2 April 2017

తీగ – చెట్టు

వానలు మొదలయ్యాయి.
నేలలో విత్తనం నీరు తగలగానే ఉత్సాహం గా మొలకెత్తింది.
మొలకెత్తటం ఏమిటి చర చరా పాకింది.
మూడో రోజుకి చిగురు వేసింది. 
చూస్తుండగానే పెరిగి చెట్టుని చుట్టుకుంది.
బిరబిరా పెరిగింది. పచ్చని ఆకులతో పర పరా ఎదిగింది.
చక చకా చెట్టుని చుట్టుకుంటూ ప్రాకేసింది.
రోజుల్లోనే అది చెట్టుని కనబడకుండా చేసింది.
తీగకి గర్వం పెరిగి పోయింది. చెట్టుని గేలి చేసింది.
ఎదగటం తనని చూసి నేర్చుకొమంది.
ఎప్పుడొచ్చామన్నది కాదు ఎంత ఎదిగామన్నది ముఖ్యం అంది.
చెట్టు మౌనంగా వింటూనే ఉంది.
చెట్టు మాట్లాడలేదు.
తీగ అహంకారం పెరిగిపోయింది.
అది అవాకులు చెవాకుల రూపంలో బయటకి వచ్చింది. అట్టహాసాలు, వికటాట్టహాసాల రూపంలో వినిపించింది.
చెట్టు మాట్లాడలేదు.
వానలు ఆగిపోయాయి.
నేలలో తేమ ఆవిరైపోయింది.
తీగ వేళ్లకు లోతు లేదు. నీరందడం లేదు.
ఆకులకు ఆశచచ్చింది. ఊపిరందడం లేదు.
ఆకులు రాలిపోయాయి.
తీగ రెండ్రోజుల్లో ఎండిపోయింది.
కళకళలాడిన తీగ ఆఖరి శ్వాసలతో విలవిలలాడసాగింది.

"ప్రతి సంవత్సరం వానలు పడగానే తీగలు ఎదుగుతాయి.
అక్టోబర్/ నవంబర్ వచ్చే సరికి అవి ఎండిపోతాయి.
రెండొందల యాభై ఏళ్లుగా ఇదే చూస్తున్నాను. వేళ్లకు లోతు ఉండదు.
కాండానికి బలం ఉండదు. కొద్ది గంటల పాటు నీరు లేకుండా బతక లేవు.
కాసింత ఎండకు తాళలేవు. పుబ్బలో పుట్టి మఖలో చచ్చిపోతాయి.
అయినా ఇంత మిడిసిపాటు ఎందుకో." అనుకుంది ఆ చెట్టు జాలిగా.....