Monday, 1 December 2014

గుప్పెడు నేరేళ్ళు

గుప్పెడు నేరేళ్ళు
...........    సుంకర శ్రీనివాస రావు
రాత్రి నుండి మా శ్రీమతి ముభావంగానే ఉంది. వాతావరణం సాధారణ స్థితికి తేవటానికి విఫల ప్రయత్నం చేసి, మిన్నకున్నాను.
సాదారణంగా ఆదివారం బద్దకంగా మొదలవుతుంది. కాని ఈ ఆదివారం అన్ని రోజుల్లాగానే వేగంగా మొదలయ్యింది. తొమ్మిదయ్యేసరికి అందరం (అందరం అంటే నేను మా ఆవిడా..మా 16 ఏండ్ల మా కుమారుడు.) రెడీ అయ్యాం.
తను కాటన్ చిర కట్టుకుని , తలలో పులు తురుముకుని ..నుదిటి మిద పూజ చేసిన తాలుకు కుంకుమ తో సహజంగా ఉంది కాని  ముఖం మిద ఎప్పుడూ ఉండే చిరునవ్వు లోపించడం తో అందం మరుగున పడింది.
నిన్న సాయంత్రం సాయిచందు (మా అబ్బాయి) చదివే కాలేజి నుండి “ మీ అబ్బాయి గురించి మీతో మాట్లాడాలిట  ఆదివారం ఉదయం ప్రిసిపాల్ గార్నిని కలవండి..” అని ఫోన్ వచ్చినప్పటినుండి. ఫోను తనే అటెండ్ అవటం తో విషయం సీరియస్ అయ్యింది.
పెరట్లో దానిమ్మ పళ్ళు తెంపుకుని కవర్లో వేసుకుని , తన హ్యాండ్ బాగు లో సర్దుకుని ఇక పదండి అంది. సాయి నేను  మా మోటారు సైకిల్ తీసి రోడ్డు మీదికోచ్చాం.
పక్కింటి ఆవిడకి చెప్పి తను వచ్చింది. మేము ముందుకు జరిగి సర్దుకుని కూర్చున్నాం. ఎండ పడునెక్కటం మొదలయ్యింది. దారిలో గుడికి వెళ్లి నమస్కరించుకుని మా వాడు చదివే కాలేజి దగ్గరకు చేరే సరికి..అరగంట దాటింది.
మాలాటి పేరెంట్స్ మరి కొద్దిమంది,ప్రిన్సిపాల్ రూము బయట బిక్క మొహాలు వేసుకున్న బిడ్డలతో కుర్చుని ఎదురు చూస్తున్నారు. ఒక్కరోక్కరిగా ప్రిన్సిపాల్ రూము లోకి వెళ్లి వస్తుంటే మా వంతు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం.
దూరంగా ఒక పిల్లవాడ వేసుకున్న స్పోర్ట్స్ షూ మావాడికి చూయించి ‘అలాటివి నీ సైజు అమెజాన్ లో కొన్నాను. ఈ వారం లో వస్తాయి’ అని గుస గుస గా మా వాడికి చెబుతుంటే .. వాడి ముఖం లో ఆనందం .. వాళ్ళ అమ్మ వాడి చూపులకి గుచ్చుకుని మాయమయింది.
ఇక మా వంతు వచ్చే వరకు మా మధ్య మాటల్లేవు....కొద్దిసేపట్లో ఆ క్షణాలు రానే వచాయి..
‘సాయి చందూ ‘ అంటూ ఆయమ్మ పిలిచింది. మేము లోపలి నడుస్తుంటే ఆయమ్మ పలకరింపుగా నవ్వింది. ఎందుకో తేలేదు కాలేజి లో ఆయమ్మకి సాయి అంటే ప్రత్యేక అబిమానం ఉన్నట్లు నేను చాలాసార్లు గమనించాను.
ప్రిన్సిపాల్ (ఉపేంద్ర) గారి టేబుల్ మిద తను తెచ్చిన దానిమ్మ పళ్ళు ఉంచి విష్ చేసి కూర్చున్నాం. మర్యాద పూర్వక సంభాషణలు పూర్తయాక మమ్మల్ని పిలిపించిన విషయం చెప్పాడాయన.
“సాయి ఇంటి దగ్గర చదువుతున్నడా? ఈ నెల తన పెర్ఫార్మెన్స్ మూడో ర్యాంకు నుండి ఎనిమిదికి పడిపోయింది.”
నేను టక్కున మా ఆవిడని చూసాను..మా వాడు ఎదో అఘాతం లోకి పడిపోతున్నట్లు ఆమె ఆందోళనగా చూసింది. వినకూడని విషయం విన్నట్లు నేను ముఖం వికారంగా పెట్టి తన దృష్టిలో పడ్డాను.
“వాడి చదువు మీద చాలా ఆశలు పెట్టుకున్నాం సార్ ..ఒక్కగానొక్కడు..వాడు మంచి పొజిషన్ కి వస్తే చూడాలని మా స్థాయిని మించి , వాడి కోసమే ఈ ఊర్లో ఉంటున్నాం ...వీడేమో..” అంటూ పిచ్చి మాటలు మొదలెట్టింది.
సాయి చందు ముభావంగా మా మధ్య నుంచుని ఉన్నాడు. ఇంటికెళ్ళాక బజన కార్యక్రమం  తప్పించుకోవాలి కనుక నేను రంగం లోకి దిగాను.
How can it happen? Upendra gaaru. He is working hard at home. Wakes up early at 4 am నేను ఆంగ్లం లోకి మారక పోతే మా ఆవిడ దగ్గర మార్కులు పడవు!!!!
“రెండు రోజుల క్రితమే staff మీటింగు జరిగింది. వాళ్ళ లెక్చర్స్ దగ్గర ఫీడ్ బాక్ తీసుకున్నాను. కాలేజి కి రోజు లేటుగా వస్తాడు, వెనక బెంచిలో కూర్చుంటాడు. లెక్చర్స్ ని డౌట్స్ ఎప్పుడూ అడగడట. ఐ పి లో మార్కులు బానే వస్తున్నాయి గాని ఐ ఐ టి పేపర్ లో మార్కులు తగ్గిపోతున్నాయి .”
మా ఆవిడ కలిపించుకుని సాయి వైపు తిరిగి”రోజు ఇంటి దగ్గర ఎనిమిదికే బయలుదేరుతావుగా? టైం అయిపోతుందని టిఫిన్ కుడా సరిగా తినవుగా?” అంది. వాళ్ళ అమ్మ చూపులు తప్పించుకుని వాడు
సమాదానం నాకు చెప్పాడు.” షబ్బీర్ కి సైకిల్ లేదు నాన్నా...వాడి ఇల్లు చాలా దూరం ..ఇంటినుండి వాడి కోసం వెళ్లి ఇద్దరం కలిసి వస్తాము.”
 షబ్బీర్ మావాడి స్నేహితుడు.తెలివైన వాడు. మూడు కిలోమీటర్ల పైగా ఉంటుంది వాడి ఇల్లు. ఇంటి వద్ద ఉన్న కొద్ది సమయం లో తన తండ్రి ఇనప బొచ్చల తయారీలో సాయం చేస్తుంటాడు. రండో టర్మ్ ఫీజు కి ఇబ్బంది పడుతున్నవిషయం   మావాడు చెబితే ఇద్దరు మిత్రుల సాయం తీసుకుని నేనే కట్టాను.
సమస్యని ఎక్కువ సేపు పోడిగించ కుండా ..”ఈ వారమే విజయవాడ నుండి ఓ.పి.టాండన్ బుక్స్ తెప్పించాను. అవి కుడా ప్రాక్టీసు చేయించండి. ఇంటివద్ద మరికొంచెం శ్రద్ద తీసుకుంటాం ‘ అని చెప్పి మావాడిని “సాయి నీ ప్రాబ్లం ఏమిటి?” అని అడిగాను.
” ఫండమెంటల్స్ బాగానే అర్దమవుతున్నాయి నాన్నా, అప్లికేషన్ కి టైం చాలటం లేదు..” అన్నాడు.
నేను కంక్లుడ్ చేస్తూ..” సాయి అన్ని కొత్త మెటిరియల్ కూడా ప్రాక్టిస్ చెయ్యి.ఇవి గురుకులాలు కాదు  We are paying, you got all rights to get your doubts cleared . డౌట్స్ అన్ని పెన్సిల్ గుర్తు పెట్టుకుని వచ్చి, మర్నాడు చెప్పించుకో. I don’t like to face the same situation again. Get improved .Work hard and just remember that this is all for you future.  అంటూ నాలుగు జనాంతిక మాటలు వాడి ఇద్దరినీ బయటకి లాక్కోచ్చాను.
టైం పన్నెండు దాటింది. తిరిగి బండి మీద ఇంటికొస్తూ కర్రీ పాయింట్లో రెండు కూరలు తీసుకున్నాం.
మద్యాన్నపు ఎండ కి మాడు మంట పుడుతుంది. బాగా దాహం అనిపించింది. బండి దిగిన మా ఆవిడ కాంపౌండ్ వాలు బయట చాలి చాలని చెట్టు నీడ న కుర్చుని ఉన్న, మా వీధిలో కాయలమ్ముకునే పెద్దావిడని చూసి పలకరింపుగా నవ్వి లోపలి కెళ్ళింది.
నేను బండి ని  గోడ వారగా పార్క్ చేసి ఇంట్లోకి వచ్చేటప్పుడు, మా అబ్బాయి కుండలోని మంచినీటి ని పెద్ద లోటా తో తీసుకెళ్ళి బయట పెద్దావిడకి  కి ఇవ్వటం గమనించాను.
లోపలి వస్తున్న నన్ను “ వీడు ఏడి?”అంది. ఒక అరగంట క్లాసు పీకటానికి రెడీ అయి ఉన్నట్టుంది.
“నువ్వు పంపలేదా మంచినీళ్ళు ఆవిడకి?”... అడిగాను.. అర్ధం కానట్టు చూసింది..
ఇద్దరం వరండాలోకి వచ్చాం.
పెద్దావిడ సాయి చందు రెండు బుగ్గలు వత్తి వాడు వారిస్తున్నా వినకుండా గుప్పెడు నేరేడు పళ్ళు వాడి దోసిలిలో పోసింది.

మా ఆవిడ ముఖం మీద నిన్నటి నుండి మాయమయిన చిరునవ్వు  వచ్చి చేరింది.  ఆమె ముఖం ఇప్పుడు రెట్టింపు అందంగా కనబడింది...మా అబ్బాయి మనసు లాగా..