Thursday, 22 March 2018

విరామం

తేదీ 21_03_18 సాయంత్రం  16.43 కి మా కుటుంబాని కి ఒక అపురూపమయిన   కానుకని 
నిత్యం మేము కొలిచే "శ్రీ అభయ ఆంజనేయ స్వామి" ప్రసాదించాడు.

మా పెద్దమ్మాయి పాలడుగు భావనా స్రవంతి & రాజా లకి  కొడుకు పుట్టాడు.
నాకు తాత ప్రమోషన్ వచ్చింది.

మా 'మనుమడి' తో  చర్చించ వలసిన విషయాలు చాలా ఉండిపోయాయి.
కనుక బ్లాగ్ కి కొన్నాళ్లు విరామం.

Tuesday, 20 March 2018

దేవుడి పటం


ఊరికి దూరంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం లో ఉన్నదా ఇల్లు. వరండా తో కలిసి నాలుగు గదుల నిలువు ఇల్లు.
చుట్టూ ప్రహరి గోడ ఉన్న స్తలం లో గోడ వారగా కూరగాయల మొక్కలు, పూల మొక్కలు ఉన్నట్లు మసక వెలుగులో కనిపిస్తూ ఉంది. గేటు నుండి ఇంటి వరండా వరకు నాపరాళ్ళు పరిచి ఉన్నాయి. నాపరాళ్ళ మద్య మెత్తటి గడ్డి.
ఎక్కడయినా ఒక్క వీది లైటు వెలుగుతూ ఉంది. ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందని ప్రాంతం. అప్పుడప్పుడూ వచ్చి పోయే సర్విస్ ఆటో లు తప్ప పెద్దగా జన సాంద్రత లేని ప్రాంతం.
ప్రశాంతమయిన వాతావరణం. ఎక్కడ ఏం జరిగినా అంత తొందరగా మిగిలిన వారికి తెలిసే అవకాశం లేని ప్రాంతం.
ఒక పాత మోటార్ సైకిల్ వచ్చి వీది మొదట్లో ఉన్న ఆ ఇంటి ముందు ఆగింది. గేటు తీసుకుని బండి లోపలి కి తెచ్చి పార్క్ చేసాడతను. బిడియం గా గేటు వద్ద నిలబడి చుట్టూ పరికిస్తున్న ఆమెని “వచ్చేయ్” అన్నాడు మెల్లిగా.
వరండా లైట్ వెయ్యకుండానే చీకట్లో తాళం తీసాడు.
ఇద్దరు లోపలి వెళ్ళాక తలుపు వేసాడతాను.
గదిలో ఎల్యీడి లైటు వెయ్యగానే కిటికీ పరదాలు సరిచేసాడు.
“కూర్చో “ చక్క సోఫా చూపిస్తూ ఆమెతో అన్నాడు.
“బట్టలకి బురద అంటింది “ అతన్ని గమనిస్తూ అంది.
మెయిన్ రోడ్డు మీద నుండి మలుపు తిరిగేటప్పుడు మంచి నీటి పైపు పగిలి అయిన మడుగులో వేగంగా ఎదో లారి వెళ్ళినప్పుడు చిమ్మిన బురద. వళ్ళంతా చింది ఉంది.
“నువ్వు కూడా తడిచి పోయావ్” అన్నాడు ఆమెని మళ్లీ గమనిస్తూ..
ముఖానికి పుసుకున్న పౌడర్ సరిగా అతకలేదు. కనకాంబరాలు, మల్లెలు కలిసిన పూలదండ వాడిపోటానికి సిద్దంగా ఉంది.
నడుం మీద ప్రౌడ వయసుతో వచ్చిన ముడత అందం గా ఉంది.
ఆతను ఆమె దగ్గరగా వచ్చి బుగ్గ లు నిమిరాడు. నడుం మడత మీద చెయ్యి వేసాడు.
శరీరం తయారుగా లేదు.
“బాత్ రూము ఎక్కడ?” అంది.
ఆతను పక్కకి జరిగి హల్లో నుండి వంట గది లో నుండి పెరడు లోకి నడుస్తూ ‘అక్కడ” అన్నాడు.
ఆమె అలవాటు అయిన చీకట్లో ఇంటికి పది అడుగుల దూరం లో ఉన్న బాత్రుం లోకి నడిచింది.
డోరు పక్కనే లైట్ స్విచ్ ఉంది.
బాత్ రూము శుబ్రంగా ఉంది ఒక ప్లాస్టిక్ పీపా లో నీళ్ళు నింపి ఉన్నాయి. రెండు మగ్గులు బోర్లించి ఉన్నాయి.
ఒక పక్క గోడకి ఉన్న చిన్న అరమారా లో బాత్రుం శుబ్రం చేసుకొనే లిక్విడ్స్ , సబ్బులు ఒక పేపర్ రోల్, ఒక వేస్ట్ బక్కెట్ ఒక ప్లాస్టిక్ సానిటరీ బ్రష్..
ఆమె తన చీర విప్పి తడిచిన బాగాన్ని నీళ్ళతో శుబ్రం చేసుకుంది. గట్టిగా పిండి మళ్లీ కట్టుకుంది. గోడకి ఉన్న చిన్న అద్దం లో ముఖం చూసుకుని బయటకి వచ్చింది.
లైట్ ఆర్పి ఆమె తిరిగి గదిలోకి వచ్చే సరికి ఆతను పొయ్యి మీద నీళ్ళు కాచుకుంటున్నాడు.
“అయిదు నిమిషాలు కూర్చో వచ్చేస్తాను” అంటూ వేడినీళ్ళు బక్కెట్లో పోసుకుని టవల్ తీసుకుని బాత్రుం కి వెళ్ళాడు.
ఆమె సోఫాలో కూర్చో బోతూ వాటిలో ఉన్న కుషన్ వైపు చూసింది. మాటి క్లాత్ మీద రెండు నెమళ్ళ బొమ్మలు రంగు రంగుల ఎంబ్రాయిడి దారం తో అల్లి ఉన్నాయి. అన్ని కుషన్ల మీదా అదే డిజైన్, అన్నీ చేత్తో కుట్టినవే...
ఆమె పక్కనే ఉన్న ప్లాస్టిక్ కుర్చీ లో కూర్చుంది.
గదిలో గోడ మీద ఒక పెద్ద ఫ్రేం కట్టిన బోర్డు ఉంది.
రంగు రంగుల గుండి లతో మాటి క్లాత్ మీద కుట్టిన మూడు అక్షరాల పేరు అది. “మాధవ్”
అర్మారా లో పోద్దిగ్గా సర్దిన బొమ్మలు, ఎక్కువ గా చేత్తో చేసినవే...
మద్య గది ఆనుకుని ఉన్న పడక గది. నవారు మంచం మీద మెత్తటి పరుపు. అలిగి పడుకోటానికి సరిపోనంత వెడల్పు. గోడ మీద ఒక కలర్ ఫోటో. అతను బార్య తొ కలిసి సముద్రం ఒడ్డున తడిచిన బట్టలతో అంటుకుని నిలబడ్డ ప్రైవేట్ ఫోటో. శుబ్రం గా ఉన్న గది. పొందికగా శ్రద్ధగా సర్ది ఉన్న గది. ఆమె గోడ మీది ఫోటో లో ఉన్న అతని బార్య ని తదేకంగా చూసింది. ఏంతొ కాలం తపస్సు చేసాక దొరికిన ‘ఫలాన్ని’ అందుకున్నట్లు... అతను అపురూపమయినట్లు
అందగత్తె... ఆ అందం శారీరకమైనదే కాదు. మరేదో తనకి అర్ధం కాని గంభీరమయిన అందం.

ఆమె ఆ గది దాటి ముందుకు వచ్చి కర్టెన్ తొలగించి వంట గదిలో కి చూసింది.
కొద్ది సామాను శ్రద్ధగా శుబ్రంగా ఉన్నాయి. ప్రతి వస్తువు ఎక్కడివక్కడ పొందికగా.. ఆవిడ చూస్తూ ఉండి పోయింది.
వంట గదిలో ఒక వైపు చిన్న దేవుడి గూడు. సీతా రాములు ఉన్న ఒకే ఒక్క ఫోటో, మట్టి ప్రమిదలు, నూనె ఉన్న సీసా అగరువత్తీలు, పూజా సామాగ్రి ..
***
ఆతను స్నానం చేసి లుంగీ కట్టుకుని బాత్రుం తలుపు వేసి ఇంట్లోకి వచ్చాడు.
ఆమె గది లో లేదు.
టీ షర్ట్ వేసుకుంటూ బయట వరండా లో చూసాడు. లేదు. బయట లైటు వేసి ఇంటి చుట్టూ చూసాడు. లేదు.
గేటు వద్దకి వెళ్లి రోడ్డు మీద చూసాడు. దూరంగా వెళ్తున్న అటో శబ్దం తప్ప అంతా ప్రశాంతం.
అతనికి భయం వేసింది. గబ గబా లోపలి వచ్చి చూసాడు. టేబుల్ మీద ఉంచిన వాలెట్ బద్రం గా ఉంది. డబ్బు దాదాపు సరిగ్గానే ఉంది ఒకటి రెండు నోట్లు తప్ప.
ఇంట్లో విలువయిన వస్తువులు అన్నీ చూసుకున్నాడు. బీరువా తాళాలు దానికే ఉన్నాయి. బీరువాలో బట్టలు, విలువయిన సామాను అన్నీ ఎక్కడివి అక్కడే ఉన్నాయి.
వంట గదిలో ను, హల్లో ను మరో సారి వెతికాడు.
దేవుడి గూటి ముందు కనకాంబరాల పూలదండ పడి ఉంది.
‘సీతా రాముల’ పటం వెనక్కి తిప్పి ఉంది.


Sunday, 11 March 2018

మనెమ్మ ఇక రాదు.

ఉదయం పూట .. అదీ వర్కింగ్ డే ఏ ఇల్లాలికయినా కురుక్షేత్రమే..
కాలింగ్ బెల్ మోగింది.
పొయ్యిమీద కుక్కర్ ఉంచి హల్లో కి వచ్చి తలుపు తీసింది మీనాక్షీ.
బయట ఒక అతను. ఆటో వాలా అని తెలుస్తుంది. ఖాకీ షర్ట్ వేసుకుని ఉన్నాడు.
“ఏమిటి?” అడిగింది విసుగ్గా.
“మీ పనావిడ మనెమ్మ మా ఆవిడ”
మీనాక్షీ కి కోపం నషాలానికి అంటింది.
మూడు రోజుల నుండి చెప్పా పెట్టకుండా పని లోకి రావటం మానేసింది. ఒక ఫోన్ లేదు పాడు లేదు. పొద్దుటే హౌస్ కీపింగ్ చేసుకుని పిల్లలని రెడీ చేసి, వండి లంచ్ బాక్స్ లు సర్ది పెట్టేసరికి పధ్మవ్యూహం కనిపిస్తుంది.
“ఎవయింది. మూడు రోజులుగా రావటం లేదు” గట్టిగా అడిగింది.
అతను ఒక్క నిమిషం తటపటాయించాడు.
“ఇక రాదు. వేరే చూసుకోండి. అది చెప్పటానికే వచ్చాను.”
“ఏం ? అడిగినంత జీతం ఇస్తున్నాగా? పండక్కి పబ్బానికి ఏదో ఒకటి కొనిస్తున్నాగా? రోజు ఇంట్లో మాతో పాటు టీ/ టిఫిన్లు అందుతున్నాయి గా? మరి ఇంకెందుకు మానటం” గయ్యిమంది మీనాక్షీ.
ఈ వాక్యం అంతా “ఏం రోగం” అనే అర్ధం వచ్చేలా చెప్పింది.
“అన్నీ బానే ఉన్నాయి. మీ నుండి కొన్నిచెడ్డ అలవాట్లు కూడా నేర్చుకుంటుంది. అందుకే నేనే వద్దన్నాను”
మీనాక్షీ ఆశ్చర్య పోయింది. తర్వాత ఆమెకి కోపం వచ్చింది. అవమానంగా అనిపించింది.
అతన్ని పరిశీలనగా చూస్తూ.. “ఏమిటట .. అంత చెడ్డ అలవాట్లు? తాగుడా? డ్రగ్సా? ” 'చెడ్డ' అనే పదాన్ని వత్తి వ్యంగ్యంగా అడిగింది.
“మీతో ఇవన్నీ మాట్లాడటం ఇష్టం లేదు. కానీ మీకు తెలియాలి కాబట్టి చెబుతాను”
అతన్ని నిశితం గా గమనిచ్చింది మీనాక్షి.
సన్నగా ఉన్న ఆరోగ్యం గా ఉన్నాడు. తల శుబ్రంగా దువ్వుకుని, ఉతికిన బట్టలు వేసుకుని నుదిటిన సిందూరం చుక్క పెట్టుకుని.... చూడాగానే ఒక సదభిప్రాయం కలిగేట్టు గా..
“తను బాగా మారిపోయింది. చెరో పని చేసుకునే వాళ్ళం. ఉన్నదాంట్లో బిందాస్ గా ఉండేవాళ్లం. మా అమ్మ మాతోనే ఉంటుంది. ఈ మద్య నన్ను చులకనగా మాట్లాడుతుంది. మరొకరితో పోలుస్తుంది. 'అత్త'ని పాత విషయాలు గుర్తుచేసి మరీ గొడవ పెడుతుంది. ఎందుకు పనికిరాని వాడినని ఏదేదో చేసి ఉండాల్సిందని ఫాల్తూ మాటలు మాట్లాడుతుంది. చంటి దాన్ని కొడుతుంది. నాకు బాధగా ఉంది. పోచమ్మ గుడికి తీసుకెళ్లి ప్రమాణం చేయించి అడిగాను. ఇందుకిలా అయ్యావు అని. చాలా సేపు మాట్లాడుకున్నాక దానికి కారణం ఇక్కడ పనిచేయటమే అని అర్ధం అయింది. మీరు ఇంట్లో మాట్లాడుకునే మాటలు, సార్ కి మీరు ఇచ్చే గౌరవం, ఇంటికి బందువులు వచ్చి వెళ్ళాక సార్ తో వాళ్ళ గురించి తక్కువగా చెప్పటం లాటివి బాగా వంట పట్టించుకుంది. గతం లో ఇలా లేదు మీ ఇంట్లో పని చెయ్యటం మొదలెట్టాకే ఇలా అయింది.”
మానాక్షి కి మైండ్ బ్లాక్ అయింది.
ఒక తక్కువ జాతి (స్థాయి) వాడు వేలెత్తి తన ప్రవర్తన ని చూపించి గేలి చెయ్యటం తట్టుకోలేక పోయింది.
ఆమెకి ఏం సమాదానం చెప్పాలో అర్ధం కాలేదు.
ఈ లోగా ఇంట్లో కుక్కర్ నాలుగోసారి విజిల్ వేసింది.
“అంబోతులా గా ఇంట్లో తిరక్క పోతే.. ఆ కుక్కర్ ఆపోచ్చుగా.?” హల్లో కి తొంగి చూసిన మొగుడిని కేక వేసింది.
నమస్కరించి వెనక్కి తిరిగి వెళ్తున్న అతను విన్నాడా? విని నవ్వాడా?
మీనాక్షి కి అర్ధం కాలేదు.

Sunday, 4 March 2018

మతిమరుపుకి మరో పేరు

తెలుసండీ తెలుసు.. గతం తో ఆమెని కొప్పడి తిట్టిన ప్రతిసారి తేదీలతో సహా చెప్పగలను.
హాస్పిటల్ బిల్ల్స్ అన్నీ ఫైల్ చేసే అలవాటు ఉంది. వాటిని చూస్తే సరిగ్గా చెప్పగలను.
అయితే మాత్రం మా ముసల్దానికి మతిమరుపు ఎక్కువవుతుంది. ఎప్పుడో రెండు గంటల క్రితం రోడ్డు పక్క దాబా హోటల్ లో తిన్నాం. అక్కడ మర్చిపోయిందట కళ్ళజోడు.
దాదాపు డెబ్బై కిలోమీటర్లు ప్రయాణం చేశాక ఇప్పుడు తీరిగ్గా చెబుతుంది.
“కళ్ళజోడుజు బోజనం చేసిన చోట మరిచి పోయానని.”
ఖరీదయిన కళ్ళజోడు ప్లాటినం ఫ్రేం, బ్రాండెడ్ అద్దాలు పోయిన నెల లోనే దాదాపు ఒక నెల పెన్షన్ మొత్తం ఖర్చు చేసి కొనిచ్చాను.
ఆడాళ్ళకి మతిమరుపు ఎక్కువండీ. అప్పటికి చెబుతూనే ఉంటాను.
నా లాగే సుడోకు లు, వర్డ్ పజిల్స్ చేస్తూ ఉండు. బ్రైన్ షార్ప్ గా అవుతుంది.
మతిమరుపు అనేది దగ్గరకి రాదు. అని. వింటేనా?
ఏం చేస్తాం.. కారు వెనక్కి తిప్పాను.
మళ్ళీ రెండు గంటలు ప్రయాణం. దారిలో రెండు టోల్ గేట్లు..
తిరుగు ప్రయాణం మొత్తం తిడతూనే ఉన్నాను.
కిక్కరుమన లేదు. తప్పు వాళ్లదగ్గర ఉన్నప్పుడూ ‘కుయ్ కయ్’ మని అనరు.
ఇదే అవకాశం గా కడుపులో ఉన్న కసంతా తీర్చుకున్నాను.
“అసలు నిన్ను కాదే? మీ అమ్మా బాబుని అనాలి. ఒక్కటి ఒక్క పని వయినంగా చేసి చచ్ఛావా? నలబై ఏళ్ళు కాపరం చేశావు నలుగురిని కన్నావ్. అరడజను మంది మనమలు మనమరాళ్ళు , కాస్తన్నా బుర్ర పని చెయ్యొద్దా?
మళ్ళీ రెండు గంటలు వెనక్కి తోలుకొచ్చాక.
ఆ హోటల్ రాగానే కారు డోరు తీసుకుని గబాలున కిందకి దిగి లోపలికి పరుగు లాటి నడకతో వెళ్లే ఆవిడని కేకెవేసి చెప్పాను.
“అక్కడే నా టోపీ, SBI క్రెడిట్ కార్డు పెట్టాను. అవి కూడా పట్టుకురా?.”
ఏం చెబుతున్నాను?.. ఆ .. అసలు మతిమరుపుకి మరో పేరు ఆడది.

గృహ వాస్తు.

నమ్మం గాని ఆడవాళ్ళ ధారణ శక్తి అమోఘం అండి.
నిన్న ఆఫీసు నుండి ఫోన్ చేసి “టాబ్ ఎక్కడ వుందో చూడు దానితో పని పడింది.” అని చెప్పాను.
వెతికే వస్తువు కాకుండా మిగిలినవన్నీ దొరకటం మధ్య తరగతి సంప్రదాయ విధానం.
సహజం గానే టాబ్ కనిపించలేదు గాని ‘ఏదో గృహ వాస్తు పుస్తకం కనిపించిందట. పుస్తకాల రేక్ లో '
సాయంత్రం ఇంటికి వచ్చాక “ఈ పుస్తకం చదువుతున్నాను” అని చూపించింది.
“హల్లో సోఫా నడకి అడ్డం గా మార్చావు ఎందుకు?” అని అడగబోయి మౌనంగా ఉన్నాను.
టీ కప్పు ఇస్తూ ఇక్కడ కూర్చోండి అంటూ హల్లో ఒక మూల ఉంచిన ఎత్తుపాటి స్టూల్ చూయించింది.
“ఇంటి యజమాని ఈ మూల కూర్చోవాలి” అంది.
“డ్రస్ కోడ్ లేదు కదా? అనుమానంగా అడిగాను. అప్పటికే సగం బట్టలు విప్పేసి ఉన్నాను.
“ఇంకా ఆ చాప్టర్ దాకా చదవలేదు”
యర్రగొండపాలెం లో తెల్లారితే మొదలెట్టాల్సిన ఇంటి మార్కింగ్ ప్లాన్స్, బెడ్ రూమ్ లో ఉన్న సిస్టెమ్ మీద సిద్దం చేస్తూ ఉంటే.
“మన మంచం పక్క యజమాని వైపు నైరుతి లో ఫ్లోరింగ్ ఎత్తుగా ఉండాలి కదా? “ అంది.
కాళ్ళు తుడుచుకునే పట్టా మాత్రమే ఉంది అక్కడ.
“ఇక పడుకుంటావా? నాకు కొంచెం పని ఉంది.” ఓపిగ్గా చెప్పాను.
“అటు వైపు నేలమీద ఒక సన్నటి పరుపు వేస్తే ఎత్తుగా ఉంటుంది కదా?” అయిడియా కూడా తానే ఇచ్చింది.
“ఇక వాగుడు ఆపుతావా? పడుకో నోర్మూసుకుని” దైర్యం గా అన్నాను.
పెళ్లయాక ఇలాటి సాహసాలు పట్టుమని పది కూడా ఉండవు.
ఇక అటునుండి మాటల్లేవ్.
ఆవిడ మూడ్ ఎలా ఉందో అని మనసులో పీకుతూనే ఉంది.
వళ్ళు విరుచుకుంటున్నట్లు గా వెనక్కి చూశాను. ఇయర్ఫోన్స్ పెట్టుకుని చైనీస్ సినిమా టాబ్ లో చూస్తూ ఉంది.
డేట్ మారేలోగా పని పూర్తి చేసుకుని వాట్స్ అప్ప్ లో ప్లాన్స్ పంపి, పడుకున్నాను.
నైరుతి లోనే...
***
ఉదయం లేటుగా లేచాను.
వాష్ రూమ్ కి వెళ్ళి వచ్చి ఎందుకయినా మంచిదని హల్లో మూల ఉన్న ఎత్తుపాటి స్టూల్ మీద కూర్చుని ‘టీ’ కోసం ఎదురు చూస్తుంటే..
“కింద పడుకున్నారు ఏమిటి?” అంది. తెలిసే అడిగిందా? తెలియక అడిగిందా?
“రాత్రి కుంఫు సినిమా చూశావా?” అడిగాను.
“అవును. భలే ఫైట్ మూవీ” అంది ఆనందంగా.
మెలిక పడ్డ చేతిని జాగర్త గా ముందుకు చాపి కప్పు అందుకున్నాను.
నమ్మం గాని ఆడవాళ్ళ ధారణ శక్తి అమోఘం అండి.
బజార్లో పరుపులు కుట్టేవాడిని పట్టుకోవాలి.