Sunday, 30 October 2016

చిన్ననాటి దీపావళి

నరకాసుల వధలు, పిండివంటలు, కొత్తబట్టలు, మిఠాయిలు విషయం మాకెందుకు. మేము’ చాట’ బ్యాచ్. ఇప్పటి జెనరేషన్ కి ఈ విషయాలు తెలీదు. అబ్బో మా రోజుల్లో...
ఒక వెదురు పుల్లకి పిన్నిసుని నిలువుగా ఉంచి ముక్కు కిందకి ఉండేట్టు గా నిలబెట్టి కట్టడం, రెండో చివర పుల్లని చీల్చి మందపాటి అట్ట ముక్కని డైమండ్ షేపులో ఉంచి నేర్పుగా కుట్టటం తో దీపావళి సంబరాలు మదలయ్యేవి మా చిన్న తనం లో .. 5 పైసలకి/ పది పైసలకి తుపాకి రీళ్లు, బిళ్ళలు (గుండ్రటి బొట్టు బిళ్లలా గా ఉండే రెండుపోరల కాగితం మద్య చిన్న మొటిమంత ప్రేలుడు మందు ఉండేది) 
ఒక్కొక్క తుపాకి బిల్ల మధ్య నున్న మందు కి పిన్నిసు ములికిని గుచ్చి పైకి ఎగరేస్తే అది కిందపడేటప్పుడు నెలని గుద్దుకుని ప్రేలేది. తక్కువ ఖర్చుతో ఎక్కువ వినోదం అంటే అప్పట్లో అదే. 
ఒక పిల్లిపిసర దండ పావలా ఉండేది. తెచ్చి జాగర్తగా తాడు విప్పి విడిగా చేసేవారం. 50 వచ్చేయి. ఒక చాట లో పేపరు పరిచి దీపావళి కి పది రోజులముందు నుండే కొనుక్కున్న మందు సామాగ్రీ పరుచుకుని పెంకుటింటి చూరు మీద ఎండలో పెట్టేవారం. విచిత్రంగా, కుట్టు మిషన్ సొరుగులు, గిరగమాత పెట్టెలో, కండిపప్పు డబ్బాల్లో ఉండే చిల్లర మాయమవుతుండేది. పెద్దవాళ్ళు అడిగినప్పుడు ఎండబెట్టిన చాట మీద ఒట్టేసి ‘ఏమి ఎరగమ్’ అని చెబుతుండేవాళ్లం. 
ఎండబెట్టిన ‘చాట’ కి వైఫై ఉండేది. ఇప్పటి jio కంటే మోస్ట్ పవర్ ఫుల్. దాన్ని ఎవరయినా తాకారో ఎంత దూరాన ఉన్నా పిల్లలకి ఎలెర్ట్ వెళ్ళి పోయేది. క్షణాల్లో ప్రత్యక్షం అవటం, ఆస్తులు కాపాడు కోవటం వెను వెంటనే జరిగేది. మద్యాన్నం నుండే బొమ్మల కొలువులా స్నేహితుల మందు గుండు సామాగ్రి పరిశీలించడానికి వెళ్ళేవాళ్లం. అందరి వద్ద ఉన్న వి తమ దగ్గర ఉన్న వాటితో బెజురి వేసుకుని కొందరు స్థితి మంతులులని గుర్తించి మొదట వాళ్ళ వరండాలో కాల్చడం మొదలెట్టేవాళ్లం.
తర్వాత ఎవరి ఇళ్ళకి వారు వెళ్ళేవాళ్లం. అక్క చెల్లెళ్లతో పంపకాలు మొదలయ్యేయి కొవ్వొత్తులు, మతాబులు, వెన్నపూసలు , తాళ్ళు,పాము బిళ్ళలు, కాకరపూవత్తులు, కొండకచో భూ చక్రములు వాళ్ళకి. మిగిలిన ప్ల్రెలుడు సామాను భూ విష్ణు చక్రములు, అవ్వాయి సువాయిలు, తౌసండ్ వాలాలు, టెలిఫోనే లు ఇత్యాదులు మగపిల్లలం మొదలెట్టేవాళ్లం. 
పెద్దవాళ్ళు ఏవో చెబుతూనే ఉంటారు. బామ్మలు బక్కెట్ల తో నీళ్ళు అందుబాటులు ఉంచుతారు. అవేవీ మనం పట్టించుకోం . 
ఒక కర్ర పుల్లకి విడదీసిన పిల్లిపిసర ని రబ్బరు బాండు తో చుట్టి కర్ర రెండో చివర పట్టుకుని దైర్యంగా (?)కాల్చే వారం. ఒక్కెక్కటి కాల్చి విసుగొచ్చి ఒక కాగితం ముక్క అంటించి దాని మీద మిగిలినవి అన్నీ వేసి కాల్చడం  తో దీపావళి దిగ్విజయంగా పూర్తి అయ్యేది. 
ఉదయాన్నే లేచి రాత్రి కాల్చిన వాటిలో , కాలకుండా మిగిలినవి వెతుక్కుంతుండే.. పెద్దవాళ్ళు కేకలు వెయ్యటం తో తిరిగి కాల చక్రం మొదలయ్యేది. వచ్చే దీపావళి కి టెంటేటివ్ గా ఒక ప్రణాళిక మనసులో  తయారవుతుండేది. 
చిన్నతనం మరచి పోనీ/పోలేని మిత్రులకి దీపావళి శుభాకాంక్షలు.

Tuesday, 25 October 2016

నివాళి

చాలా కాలం క్రితం ఓ పెద్ద ఆపిల్ చెట్టు ఉండేది. ఓ చిన్న పిల్లవాడు చాలా ఇష్టంగా, ప్రేమగా దాని చుట్టూ ఆడుకునేవాడు. 
ఓ రోజు చెట్టు పైకి ఎక్కాడు, పండ్లు కోసుకొని తిన్నాడు, ఆ చెట్టు నీడలో కాసేపు పడుకున్నాడు. ఆ అబ్బాయి ఆ చెట్టును ఎంతగానో ప్రేమించాడు, ఆ చెట్టు కూడా ఆ అబ్బాయి తన వద్ద ఆడుకోవడాన్ని చాలా ఇష్టపడింది, అతన్ని అమితంగా ప్రేమించింది. 
కాలం గడిచింది, చిన్న పిల్లవాడు పెరిగి పెద్ద వాడైయ్యాడు. ఇప్పుడు ఎక్కువగా ఆ చెట్టు నీడలో ఆడుకోవడం లేదు
కొంత కాలం తర్వాత ఓ రోజు ఆ బాలుడు చెట్టు వద్దకు వెళ్లాడు,ఎందుకో విచారంగా ఉన్నాడు. "రా వచ్చి నా వద్ద ఆడుకో" అని చెట్టు అడిగింది. 
బాలుడు: "నేనింకా చిన్న పిల్లాడిని కాను, చెట్ల చుట్టూ తిరుగుతూ ఆడుకునే వయసు కాదు నాది, నాకిప్పుడు ఆడుకోడానికి బొమ్మలు కావాలి, అవి కొనడానికి డబ్బులు కావాలి " అన్నాడు. 
చెట్టు : "నా దగ్గర డబ్బులు అయితే లేవు, కానీ నువ్వు ఓ పని చేయవచ్చు, నా పండ్లన్ని కోసుకుని వెళ్లి అమ్మివేయి, దానితో నీకు డబ్బులు వస్తాయి" అని అన్నది. 
బాలుడు సంతోషంతో ఆ చెట్టు పండ్లన్ని కోసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి రాలేదు.. చెట్టు తనకోసం దిగులు పడుతూ, దుఃఖంతో ఉంది. 
క్రమంగా ఆ బాలుడు పెద్దవాడై యువకుడిగా మారాడు, ఓ రోజు అతను రావడం చూసి చెట్టు చాలా సంతోషిపడి "రా నా వద్దకు వచ్చి ఆడుకో" అని ఆహ్వానించింది 
"
నీతో ఆడుకునే సమయం లేదు నాకు, నా కుటుంబం కోసం పని చేయాలి. మేము ఉండటానికి ఓ మంచి ఇళ్ళు కట్టుకోవాలి, నువ్వేమైనా సహాయం చేయగలవా"? అని అడిగాడు. 
"
నా వద్ద ఇల్లు లేదు, అయితే నా కొమ్మలు నీకు సహాయపడతాయి, వాటిని తీసుకో, నీ ఇళ్ళు కట్టుకో " అని చెట్టు అన్నది. అతను ఆ చెట్టు కొమ్మలన్ని నరికి సంతోషంగా తీసుకుపోయాడు. 
అతను సంతోషంగా వెళ్లడం చూసి చెట్టు చాలా ఆనందపడింది, కాని అతను మళ్ళి తిరిగి రాలేదు, చెట్టు మరల విచారిస్తూ ఒంటరిగా ఉంది. 
బాగా ఎండగా ఉన్న ఓ వేసవి కాలం రోజు అతను మళ్ళి వచ్చాడు, చెట్టుకు ఆనందంగా అనిపించింది. "రా వచ్చి నాతో ఆడుకో" అని అడిగింది, నేను ముసలివాన్ని అయ్యాను ఆడుకోలేను, ఈ ఎండల నుండి ఉపశమనం పొందటానికి నేను సముద్ర ప్రయాణం చేయాలనుకుంటున్నా, దానికి నాకో పడవ కావాలి, నువ్వు ఇస్తావా అని అడిగాడు
నీ పడవ కోసం నా చెట్టు కాండము ఉపయోగపడుతుంది, నా కాండాన్ని నరికి తీసుకెళ్లు, దానితో మంచి పడవ చేసుకుని, హాయిగా ప్రయాణం చేయి, అని చెట్టు అన్నది. 
అతను సంతోషంగా చెట్టు కాండాన్ని నరికి తీసుకపోయి, పడవ చేయించుకుని, హాయిగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు, చాలా కాలం చెట్టుకు అతను తిరిగి తన మొఖం చూపించలేదు. 
చివరిగా, చాలా కాలానికి అతను మళ్లీ చెట్టు వద్దకు వచ్చాడు.. 
నాయనా.. నీకు ఇవ్వడానికి నా వద్ద ఏవి మిగలలేదు, పండ్లు కూడా లేవు అని చెట్టు అన్నది.. 
ఏమి ఇబ్బంది లేదు, నాకు తినడానికి పళ్ళు లేవులే అన్నాడు.. 
చెట్ట: నువ్వు ఎక్కడానికి నాకు కాండం కూడా లేదు. 
ఎక్కడానికి నాకు బలమూ లేదు, ముసలి వాన్ని కదా అని అన్నాడు .. 
నిజంగా నీకివ్వడానికి నావద్ద ఏమీ లేదు, చచ్చిపోతున్న నా వేర్లు తప్ప, అంటూ ఏడుస్తూ చెప్పింది చెట్టు. 
నాక్కూడా ఇపుడు ఏది అవసరం లేదు, చాలా అలసిపోయాను, విశ్రాంతి తీసుకోడానికి ఓ మంచి ఆసరా కావాలి అన్నాడు. 
వృద్ధ చెట్టు వేర్లు ఒరిగి విశ్రాంతి తీసుకోడానికి మంచివి, అనుకూలంగా ఉంటాయి నాయనా, రా వచ్చి నా వేర్లపై ఒరిగి కాస్త విశ్రాంతి తీసుకో అన్నది చెట్టు, అతను కూర్చున్నాడు, సంతోషంతో ఏడుస్తూ సేదతీర్చింది చెట్టు. 
ఇది మనందరి కథ, ఆ చెట్టు మన తల్లిదండ్రులు లాంటిది. చిన్నప్పుడు అందరం తల్లిదండ్రుల వద్ద వారితో ఆడుకుంటాం. 
కొంచెం పెద్దగయ్యాక వారిని వదిలి పెడ్తాం, మనకు అవసరమైనప్పుడు లేదా ఏదైన కష్టం వచ్చినప్పుడు మాత్రమే మన తల్లిదండ్రుల వద్దకు వెళతాం. వారు ఏ పరిస్థితిలో ఉన్నా సాధ్యమైనంతలో మీరు సంతోషంగా ఉండటానికి చేయాలసినదంతా చేస్తారు. 
చెట్టు పట్ల ఆ బాలుడు చాలా నిర్దయగా ప్రవర్తించాడు అని మీకు అనిపించొచ్చు. కాని మన తల్లిదండ్రుల పట్ల మనం కూడా అదే చేస్తున్నాం.
మనకు భరోసాగా వాళ్లను చూస్తాం, మనకు సర్వస్వం దార పోసినా కనీసం కృతజ్ఞత చూపం. కాని అప్పటికే సమయం మించి పోతుంది. 
ఈ కథలోని నీతి.. 
మీ తల్లిదండ్రులని ప్రేమగా సంరక్షించండి. వారు కూర్చున్న ఖాళీ కుర్చీలని చూసినప్పుడు మీకు వారి విలువ, వారు లేని లోటు తెలియవస్తుంది. 
మన తల్లిదండ్రులు మనల్ని ఎంతగా ప్రేమించారో తెలుసుకోలేం.
(సేకరణ)
(23 -10-16 సాయంత్రం మమ్మల్ని వీడి వెళ్ళి పోయిన మా అత్తగారి ఆత్మ శాంతి కోసం ప్రార్ధిస్తూ... )

Thursday, 20 October 2016

ఆర్డనరీ ?

నీదా మెల్ల కన్ను,
తిరిగేది ట్రయినుల్లో, సరే అవసరార్ధం బస్సు ఎక్కావే అనుకో..
సీట్లో కూర్చున్న దంపతుల్లో నువ్వు అడిగేది మగ మనిషిని అని నికొక్కడికే తెలుసు!!
బస్సు భాష వేరే ఉందిరా అయ్యా
పెద్ద పుడింగిలాగా " పాసింజరా?" అని బుర్ర వాడకుండా అడగటమే.. తిక్క సన్నాసి..

Tuesday, 18 October 2016

కాక్ టైల్ జీవితం

నిస్ప్రయోజనమయిన ఒక అదికారిక మీటింగు పూర్తి అయ్యే సరికి సాయంత్రం 7.30 దాటింది.
అప్పటిదాకా బిగబట్టుకు కూర్చున్న రెండు వందల పైగా అదికార్లమి  పోలోమని బయటకి వచ్చాం.
మా పెద్దమ్మాయి కి ఫోన్ చేసి “ నాన్నా నేను వస్తున్నాను. బయటకి తీసుకెళ్లి నీకు డ్రస్ కొనిస్తాను. నీ పుట్టినరోజుకి” అని చెప్పాను.
నా టు వీలర్ తీస్తుంటే, మా దూరప్రాంతం వెళ్లాల్సిన మా   కొలీగ్ ఒకరు లిఫ్ట్ అడిగాడు. అతడికి బి పి, సుగర్ లాటి దగ్గర మిత్రులు ఉన్నారు. ఈ మద్యే స్పైనల్ నొప్పి మొదలయ్యిందని చెప్పాడు.
బస్ స్టాండ్ వైపు అతన్ని దించడానికి వెళుతుంటే..  దారిలో చర్చి సెంటర్ వద్ద, “ఇవన్నీ జరిగే పనేనా మీటింగులో చెప్పిన టార్గెట్స్ అందుకోగలమా?” అన్నాడు బాధగా.

బండి అపాను. చూడు కోటి (కోటేశ్వర రావు) నువ్వు ఇప్పుడు కోటేశ్వర రావువి. అదికారి చొక్కా అక్కడే వదిలేయ్యి. రేపు ఉదయం ఆఫీసులో కూర్చున్నప్పుడు వేసుకో. ని స్వంత టైమ్ ని కుటుంబానికి, సన్నిహితులకి లేదా నీ స్వంతానికొ లేక ఇష్టమయిన వ్యాపకానికో  వాడుకో. ఆఫీసులో ఉన్నప్పుడూ టైమ్ ని పూర్తిగా ఉద్యోగానికి వాడుకో.  రెండు మిక్స్ చేసుకుని కాక్ టైల్  జీవితం గడపకు. ఆరోగ్యం ఇంకా పాడవుతుంది.”

అతన్ని బస్ స్టాండ్ లో వదిలి వచ్చేస్తుంటే.. “#33grade పోస్ట్ ల  లో నువు వ్రాసిన compartmentalization ఇదే కదా? అన్నాడు. "దీన్ని  నేను కనీసం పదేళ్ళ క్రితం వంటబట్టించుకుంటే బావుండేది. ఒకే థాంక్ యు “  

Monday, 17 October 2016

చింతపండు సమస్య

మా చింతపండు కొట్లో ఒక గుమాస్తా ఉద్యోగం ఖాళీగా  ఉంది.
కొత్త బ్రాంచి ఏర్పాటు చేశాం. 1500 కే‌జి ల వరకు మోయగల  త్రాసు కొన్నాము.
ఈ కే‌జి నుండి 1000 కేజీ ల వరకు ఒకే సారి తూయడానికి సరిపడేట్టు గా తూనిక రాళ్ళు కోనాల్సి ఉంది.
తూనికరాళ్ళు ఎన్ని కేజీలవి అయినా లబ్యమవుతాయి. ఎన్ని తక్కువ రాళ్ళతో కొత్త కొట్టు లో 1 నుండి 1000 కేజీలు ఒకే సారి సరిగా తూయడానికి ఎన్ని తూనిక రాళ్ళు ఏ యే బరువు ఉన్నవి కావాల్సి ఉంటుందో చెప్పిన వారికి ఉద్యోగం ఇవ్వటానికి సిద్దం. మీరేమయినా ప్రయత్నిస్తారా?

ఉదాహరణ:  1 కే‌జి, 3 కేజీ, 5కేజీ  ల రాళ్ళు ఉన్నాయనుకోండి
1 కేజీ తుయ్యటానికి   ఇటు 1Kg తూకం రాయి        ||         అటు చింతపండు.
2 కేజీ లు తుయ్యటానికి ఇటు 3 కే‌జి ల తూకం రాయి   ||     అటు 1 కే‌జి తూకరాయి +చింతపండు
4 కేజీ లు తుయ్యటానికి ఇటు 1+3 Kg ల తూకం రాళ్ళు ||  అటు చింతపండు. ఇలా 
..

..

..
   [The answer is 3^ o, 3^ 1, 3^ 2, 3^ 3, 3^4, 3^ 5, 3^ 6   means  (1,3,9,27,81,243,729) (7 weights)]

దసరా మామూలు

ఇంటి నుండి తెచ్చుకున్న లంచ్ బాక్స్
మద్యాన్నం తింటుంటే..
పప్పులో రాయి పన్నూడ గొట్టింది.
ఇల్లాలికి  .'దసరా' కి ఏమి కొనివ్వని విషయం గుర్తుకొచ్చింది.Saturday, 15 October 2016

ఆడపెత్తనం

కొన్ని బాగుంటాయి. 
అసలు ఈ బాగుండటం అనే స్థితిని ఇదమిద్దంగా నిర్వచించడం కష్టం. 
నేనీ రోజు ఒక రిమోట్ పల్లెటూరిలో ఒక చిన్న దుకాణం కం, హోటల్ కం, మెడికల్ షాప్ కం, పెట్రోల్ బంక్ కం, టెలిఫోన్ బూత్ కం, స్టేషనరీ కం, so.. on లో కూర్చుని అల్పాహారం చేస్తుంటే.. ముగ్గురు పిల్లలు వచ్చారు. యూనిఫారం ని బట్టి స్కూల్ కి వెళ్తున్నట్టు గమనించాను. వాళ్ళు రాగానే రెండు రెండు బిస్కెట్లు శుబ్రమయిన కాగితం లో చుట్టి వాళ్ళకి షాపు అతను ఇచ్చాడు. వాళ్ళు చక్కగా జేబులో పెట్టుకుని స్కూల్ కి వెళ్ళి పోయారు. ఏవిదమయిన అల్లరి గాని మరొకటి కావాలని అడగటం గాని, లేదు. చాలా క్రమశిక్షణగా నిలబడి షాపు అతను పొట్లం కట్టి ఇచ్చేంతవరకు నిల్చుని అంతే క్రమశిక్షణ తో వెళ్లారు. మనం ఊరుకోం గా
తర్వాత షాపతన్ని గీకాం.
ఇంట్లో 'పాడి బర్రె'లు ఉన్నాయట. కుటుంబం లో ఇద్దరు రైతు కూలీలు. తల్లి హైస్కూల్ వరకు చదువుకున్నది. యజమాని నిరక్షరాస్యుడు. ఇంట్లో అన్నీ గడుపుకుని 5000 రూపాయలు చిట్లు రెండు కడుతుందిట. ప్రతి రోజు పిల్లలకి స్నాక్స్ ఇచ్చే ఏర్పాటు తల్లే చేసిందట. రెండు వారాలకి పాల బిల్లు రాగానే పచారి బిల్లు పైసల్తో సహా ముట్టచెబుతుండట. ఇంట్లో పెత్తనం తల్లి దేనట. అంతా ‘ఆడపెత్తనం’ అని ముక్తాయించాడు.
చక్కగా సంసారం నెట్టుకొస్తున్నప్పుడు అభినందించాల్సింది పోయి ఈ పెత్తనాల గోల ఏమిటో.

Wednesday, 12 October 2016

ముసుగు

మూర్తి గారింటికి వెళ్ళి రమ్మని అమ్మ చెబితే తీరిక చేసుకుని నేను మా చిన్నమ్మాయి బయలు దేరాం. 
మూర్తి గారి బార్యకి ఆరోగ్యం బాలెదట పలకరించి రమ్మని రెండు రోజుల నుండి అమ్మ చెబుతూనే ఉంది. ఎప్పుడో నాన్నగారి కి సన్నిహితుడట . అడ్రెస్ కూడా సరిగా తెలీదు. రామ్ నగర్ లో ఉంటున్నట్టు చూచాయగా చెప్పింది. 
ఆ పూట తీరిక చేసుకుని వెళ్తుంటే సెలవులకి ఇంటికి వచ్చిన చిన్నమ్మాయి ‘నాన్నా నేను వస్తాను’ అంది. 
“ఎందుకు నాన్నా నాకే సరిగా అడ్రెస్ తెలీదు. కనుక్కుని వెళ్ళాలి “ అన్నాను. 
“పర్లేదు వస్తాను.. ..వస్తూ పాని పూరి తిందాము” అంది. 
***
రామ్ నగర్ లో మా సన్నిహిత మిత్రుడు ఒకడున్నాడు. తన దగ్గరకి వెళ్ళి అడిగాను. మూర్తి గారి చిరునామా గురించి. “ఇలాటివి మనకేలా తెలుస్తాయి. మా ఆవిడని అడుగుదాం.” అంటూ శ్రీమతి ని కేక వేశాడు. 
“బాగున్నారా అన్నాయ్యా?” అందామే పలకరింపుగా. 
“అదేనమ్మా, మూర్తి అని మా నాన్న గారి ఫ్రెండ్. ఆయన ఇక్కడెక్కడో ఉంటారు. వాళ్ళావిడ ఆరోగ్యం అంత బాగా లేదట” 
ఆమె అయోమయంగా మొహం ఉంచింది. నేను ట్రంప్ కార్డులు బయటకి తీశాను.
“వాళ్ళ పిల్లలిద్దరూ న్యూ జెర్సీ లో ఉంటారు. ఈ ఏరియాలో నే ఇల్లు కట్టుకున్నారు. అక్కడి నుండే కారు కొని పంపారట ..” నా మాటలు ఇంకా పూర్తి కాలేదు. “ఓ కామేశ్వరమ్మ గారా? మూడో లైన్ రెండో ఇల్లు వైట్ బిల్డింగ్, స్టీల్ రైలింగ్ డిజైన్ గ్లాస్ వర్క్ “ వాళ్ళకి థాంక్స్ చెప్పి మూడో లైన్ కి వెళ్ళాం. 

ఊహించని విషయం అది. ఇల్లు ఎంతో లక్షరీ గా ఉంది. డబ్బు అంగుళం అంగుళం అతికించినట్లు ..
బిడియంగా నే కాలింగ్ బెల్ నోక్కాను. ఎవరో మైడ్ ఒకరు వచ్చి తలుపు తీసి "ఎవరు?" అంది. 
“శ్రీరామమూర్తి గారి ఇల్లు ఇదేనా? “ “అవును”. 
మా నాన్న గారి పేరు చెప్పి “ఆయన కుమారుడిని వచ్చానని చెప్పండి” అన్నాను. మూసిన తలుపులు రెండు నిమిషాలకి తెరుచుకున్నాయి. “లోపలికి రండి” అంది ఆవిడ
పాల రంగు పాలరాయి మీద మా కాళ్ళ గుర్తులు పడకుండా లౌక్యంగా అడుగులు వేసుకుంటూ హల్లో కి నడిచి సోఫాలో కూర్చున్నాము. మూర్తి గారు వచ్చారు. 
వయో భారం తో ఉన్నారు. చిన్నగా వచ్చి ఒక చక్క కుర్చీ లో కూర్చున్నారు. “సోఫాలో కూర్చుంటే మళ్ళీ ఒక్కడినే లేవటం కష్టం “ అన్నాడు జనాంతికంగా. 
“నమస్తే సార్ .. నేను _________ “ 
“ ఓహ్ తెలుసు. అప్పట్లో మీ నాన్న గారి స్టూడెంట్ ని. ఈ అమ్మాయి ఎవరు? నీ కూతురా? అమ్మ బాగుందా?” 
నాకు చాలా సంతోషం వేసింది. అతను చక్కగా రిసీవ్ చేసుకున్నందుకు. “బాగుందండీ. కామేశ్వరమ్మ గారి ఆరోగ్యం బాలేదని ఒక్క సారి వెళ్ళి కనబడి రమ్మని రెండు రోజుల నుండి చెబుతుందండి. రేపటి నుండి మళ్ళీ ఎవరి గోల వారిది సెలవులు కూడా అయిపోయాయి. ఆవిడ ఎలా ఉన్నారండి ?” 
ఆయన లేచి లోపలికి రమ్మన్నట్టు మావైపు చూసి తల ఊపి మరో గది లోకి నడిచాడు. అక్కడ పడక కుర్చీ లో కూర్చుని ఉన్నారావిడ. ఒక నర్సు స్పూన్ తో ఏదో తినిపిస్తూ ఉంది. ఎంత శుబ్రంగా ఉన్నప్పటికి ఆసుపత్రీ వాసన వేస్తూ ఉంది. 
కొద్ది నిమిషాలు ఆమెతో మాట్లాడి మళ్ళీ హల్లో కి వచ్చాం. 
మా పిల్లలిద్దరూ న్యూ జెర్సీ లో ఉన్నారు. అక్కడే స్వంత ఇల్లు కొనుక్కున్నారు. పెద్దోడు ఫెరారి కొన్నాడు. చిన్నోడు కి అమరావతి వద్ద 80 సెంట్లు స్థలం ఉంది. మొన్నే అక్కడి నుండి కారు పంపాడు. ఇల్లు కోటి రూపాయలు దాటింది. ఇద్దరు పనిమనుసులు, విజిటింగ్ డాక్టర్లు, ఈ గోడ మీది పెయింటింగ్ చూశావా రెండున్నర లక్ష అంత చిన్నోడు కొని పంపించాడు.” ఒకదానికి ఒకటి ఏమాత్రం సంబందం లేని విషయాలు చాలా మాట్లాడాడు. 
లోపలి నుండి ఇందాక తలుపు తీసిన పని పిల్ల గ్లాసు ల్లో ఏదో జ్యూస్ లాటిది తెచ్చింది. 
“తీసుకోండి. మా వాడు రెండు నెలల క్రితం ఇండియా వచ్చినపుడు తీసుకువచ్చాడు. ఇంస్టెంట్ జ్యూస్. నేనెప్పుడు తాగలేదు. మా ఇద్దరికీ షుగర్ ఉంది.” 
నేను మా అమ్మాయి గ్లాసులు తీసుకుని తాగటం మొదలెట్టాం. 
బస్టాండ్ లో టి తాగే అలవాటు ఉన్నవాడిని ఏదయినా తాగగలను కాబట్టి నేను మామూలుగా తాగినా.. కళ్ళతోనే డ్రింక్ బాలేదని వదిలేస్తానని మా చిన్నది చెప్పింది. వద్దు బాగోదు, ఎలా కొలా తాగేయ్యమని నేను చెప్పాను. ముఖం అనేక రకాలుగా మారుస్తూ బలవంతాన త్రాగుతుంది.
“ఆ గ్లాసులు అక్కడి నుండి మా వాడు పంపించాడు. ఒక్కోటి మన డబ్బులో 1800 ఆట. మామూలు వస్తువులు వాడితే వాడికి నచ్చదు” మళ్ళీ ఆయనే సంబందం లేని విషయాలు అందుకున్నాడు. ఆయన కళ్లలోకి చూసి “మీరు ఎలా ఉన్నారు? అంతా సంతృప్తిగా నే ఉందిగా?” అన్నాను నేను. 
మూర్తి గారి కళ్ళలో ఒక ముసుగు ఉంది దాని వెనుక భావం మాత్రం నాకు అందలేదు. 
“ఓహ్ భ్రహ్మాండం “ నవ్వడాయన. మేం సెలవు తీసుకుని లేచి బయటకి నడవబోయేటప్పుడు లోపల నుండి ఒక పెంపుడు కుక్క పరిగెత్తుకు వచ్చి మా మీద దూక బోయింది.. 
“ అయ్ జానకి “ అంటూ పిలిచాడు మూర్తి గారు. ఠక్కున వెనక్కి తిరిగింది. టీపాయ్ మీద పెట్టిన గ్లాసు కింద దొర్లి పగిలింది. నేను పక్కకి సర్దుకునే లోపు ఒక గాజు పెంకు నా కాలి బొటన వేలు కి గుచ్చుకుంది. 
మా చిన్నమ్మాయి వెంటనే నన్ను కొర్చోమని నైపుణ్యంగా గాజు పెంకు తీసి, నెత్తురు కారకుండా చేతిని బిగించి పట్టుకుని తన చేతి రుమాలుని వ్రేలుకి బిగించి కి కట్టింది. 
మేము బయలుదేరుతుంటే.. గేటు వద్దకి వచ్చి మూర్తి గారు వీడ్కోలు చెప్పాడు. ఆయన కళ్ళలో ఉన్న ముసుగు తొలిగి లోపలి భావం నాకు స్పష్టంగా అర్ధమవుతుండగా.. 
మా అమ్మాయి “పద నాన్నా చలపతి డాక్టర్ వద్దకి వెళ్ళి ఒక టి టి చేయించు కుందాం’ అంది.

Tuesday, 11 October 2016

హారతి

కెనడా లోని మాట్రి నగరం లో ఒక మహాత్ముడు రామాయణ కధ పద్దెనిమిది రోజుల పాటు చెబుతున్నాడు. 
..
గుజరాత్ నుండి వచ్చిన ‘మురారి బాపు హర్యాని’ అనే మహాత్ముడు ఆయన. దేశ విదేశాలలో రామాయణ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు. వీరి ఉపన్యాసాలకి లక్షల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. ప్రేక్షల సౌకర్యార్ధం పెద్ద పెద్ద ఇంటర్ సర్క్యూట్ టి వి లు ఏర్పాటు చేశారు. ఆయన ఉపన్యాసం ఏర్పాటుకి చాలా కాలం ఎదురుచూడాల్సి ఉంటుంది అంత పెద్ద వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది...
.. 
కనడా లో ఉన్నఎక్కువ మంది భారతీయులు హాజరయ్యారు. వారిలో ఇద్దరు బార్యా బర్తలు ఉన్నారు. 23 ఏండ్ల క్రితం ‘ఇగో’ సమస్య తో విడిపోయి ఉన్నారు. ఎవరి పాటికి వారు ఉద్యోగాలు చేసుకుంటూ విడిగా బ్రతుకుతున్నారు. ఉన్న ఒక్కగాని ఒక్క పసివాడిని ఆమె అన్నీ సర్వస్వం చేసుకుని పెంచుతూ ఉంది. ..
..
23 ఏళ్లలో చాలా మార్పులు వచ్చాయి. ఇగో లు మాయమయ్యాయి. నిజంగా బార్య/బర్త ఒకరికి మరొకరి అవసరం తెలుసున్నారు. అప్పటికే మానసికంగా కుంగి పోయి ఉన్నారు. యాదృచ్చికంగా వారిద్దరు రామాయణ గాధ వినటానికి వేర్వేరుగా క్రమం తప్పకుండా వస్తూ ఉన్నారు...
..
ఆఖరి రోజు శ్రీరామపట్టాభిషేకం. ఆరోజు దంపతులయిన వారు వచ్చి సీతారాములకి హారతి ఇచ్చి దేవుని ఆశీస్సులు పొందవలసినదిగా ‘మురారి బాపు’ గారు సభలో ప్రకటించారు. ..
..
ఈ సదవకాశం కోల్పోవటం ..భర్తకు ఇష్టం లేదు. మహిళల విభాగం లో కూర్చుని ఉన్న మాజీ బార్యని గత కొద్ది రోజులుగా మానిటర్ లో గమనిస్తూనే ఉన్నాడు. అతను తన ప్రయత్నం చేద్దామని అనుకున్నాడు.
మనస్సులో శ్రీరాముల వారిని ప్రార్ధించుకుని మహిళా విభాగం లోకి వచ్చాడు. ఆమెను పలకరించాడు. మర్నాడు ‘సీతారాములకి’ హారతి ఇవ్వటానికి తనవెంట ఉండాల్సిందిగా బేలగా అడిగాడు.
ఆమె తన పర్సు నుండి విజిటింగ్ కార్డు తీసి ఇచ్చింది. “ఇంటికి రండి అక్కడ మాట్లాడదాం” అంది.
***
మర్నాడు ఉదయం అతను ఆమె ఇంటికి వెళ్ళాడు.
కుమారుడు అచ్చు తనలాగే ఉన్నాడు. చేతులు జోడించి తండ్రికి నమస్కరించాడు. తడి కళ్ళతో ఆమె అతడిని లోపలికి ఆహ్వానించింది.
హల్లో గోడకి తన చిన్న నాటి నిలువెత్తు ఫోటో ఉంది.
పిల్లాడు పుట్టినప్పుడు తను ఆమెకి బహుకరించిన చీర కట్టుకుని ఉంది.
అత్తగారు పెళ్ళికి బహుకరించిన బంగారు గాజులు వేసుకుని ఉంది.
నుదుటన సింధూరం ఉంది. అతను ఆమె కళ్ల లోకి చూడలేక పోయాడు.
సోఫాలో కూర్చుని చేతుల్లో ముఖం కప్పుకున్నాడు.
ఏడ్వాలని పించింది. ఆమె వచ్చి పక్కన నిలబడి భుజం మీద చేయి వేసింది.
కొడుకు గదిలోకి వెళ్ళాడు. 


ఆమె చేతుల్లో ముఖం దాచుకున్నాడు. చాలా సేపు అలానే ఉండి పోయారు..
కొడుకుతో కలిసి టిఫిన్ చేశారు.
***
ఆ సాయంత్రం సీతారాముల కళ్యాణఘట్టం పూర్తయింది.
బార్యా బర్తలు ఇద్దరు కలిసి హారతి ఇచ్చారు.
దూరం నుండి కుమారుడు కేమారాలో ఆ దృశ్యం బంధించాడు. 

Monday, 10 October 2016

దిల్ పసందులు ఎన్ని?

మా కొట్టు ‘దిల్ పసంద్’ లకి ఫేమస్. రెండు బాగాలుగా కోసి విడిగా గాని మొత్తం గాని అమ్ముతుంటాం.
ఇవాళ ఒక తమాషా జరిగింది. మొత్తం నాలుగురు కష్టమర్స్ వచ్చారు. 
మొదటి కస్టమర్ మొత్తం కొట్లో ఉన్న దిల్ పసంద్ స్వీట్లు లలో సగం పార్సిల్ చేయించుకున్నాడు. వెళ్తూ మరో అర బాగం కొనుక్కుని అక్కడే తిని వెళ్ళి పోయాడు. 

మరో గంటకి మరో కష్టమర్ వచ్చాడు. అతను కూడా సగం పార్సిల్ చేయించుకుని, ఒక అర్ధ బాగం తినేసి వెళ్ళాడు. 
తమాషాగా మిగిలిన ఇద్దరు కూడా అదే పని చేశారు. 
నాలుగో కస్టమర్ వెళ్ళే సరికి మొత్తం దిల్ పసంద్ లు పూర్తిగా అమ్ముడు పోయాయి.
ఇంతకీ ఉదయం మా షాపు తెరిచే సరికి మొత్తం ఎన్ని దిల్ పసందులు ఉన్నాయంటారు . ??

మైంటనెన్స్

విజయవాడ పాత బస్స్టాండ్ సెంటర్ లో ఉన్న హోటల్ తిలోత్తమ రిసెప్షనిస్ట్ దగ్గర సెర్వీస్ ఫోన్ మోగింది. 
రిసెప్షనిస్ట్ ఫోన్ తీసుకున్నాడు. 
“నేను 403 నుండి మాట్లాడుతున్నాను. మా ఆవిడ నా మీద అలిగింది. కిటికీ లోంచి దూకుతానని అంటుంది”
ఒక్క నిమిషం తర్వాత “సార్ అది మీ కుటుంబ వ్యవహారం, జరగకూడనిది ఏదయినా జరిగితే పోలీసుల వ్యవహారం, మేమేం చేయగలం?”
“ఆ మాత్రం కామన్ సెన్స్ నాకు ఉంది. హోటల్ మైంటనెన్స్ అద్వానంగా ఉంది. పావుగంట నుండి ట్రై చేస్తున్నాను. కిటికీ తెరుచుకోవటం లేదు.”

Sunday, 9 October 2016

హేపీ దసరా!!

దసరా కి పుట్టింటికి వెళ్ళిన బార్య  బర్త కి పంపిన వాట్స్ అప్ మెసేజ్ లోని కొంత బాగం.
** పనిమనిషికి జీతం ఇచ్చేశాను. దారళంగా దసరా మామూలు ఇవ్వక్కర్లేదు. నేను ఉరినుండి వచ్చిందాకా పనిమనిషి వాళ్ళ అమ్మ పనిలోకి వస్తుంది.
** 10 రోజులు వైఫై ఆపెయ్యమని ప్రొవిడర్ కి చెప్పేశాను. పెండలాడే పడుకోండి. మీ external HDD కేబుల్ కోసం వెతక్కండి. అది నా తో పాటు హాండ్ బాగ్ ఉంది.
** మీరు చాలా హెల్తి గా ఉన్నారు. మాటి మాటికి ఆ లేడి డాక్టర్ వద్ద చెకప్ కి వెళ్లవద్దు.
** మీ కోతి మూకని పోగు చేయకండి. సోఫాలో సిగిరేట్ పొడిని, పోయిన సారి క్లీన్ చేసుకోటానికి రెండు రోజులు పట్టింది. పిజ్జా బిల్లు లు చాలా దొరికాయి.
** మీ మరదలు పుట్టిన రోజు పోయిన నెలలోనే అయిపోయింది. మనిద్దరం వెళ్ళి వచ్చాం. అర్ధరాత్రి వెళ్ళి దానికి బిలేటెడ్ బర్త్ డే విశేస్ చెప్పాల్సిన పని లేదు. మా మరిది కరాటే నేర్చుకుంటున్నాడట. అది మీకోసమే అని నా నమ్మకం.
** పక్కింటి వాళ్ళని పొద్దుటే లేపి పేపర్ వచ్చిందా, పాలు వచ్చాయా అని విసిగించకండి.
** అర్మారాలో కుడి వైపు మీ చడ్డీలు ఉన్నాయి. ఎడంవైపు ఉన్నవి పిల్లాడివి. ఆఫీసునుండి ఏదో ఇబ్బందిగా ఉంది అని పోయినసారి హడావిడి పెట్టారు గుర్తుందా?
** మొబైల్ ఫోన్ బాత్రూమ్ సోప్ బాక్స్ లో పెట్టి ఇల్లంతా రెండు రోజులు వెతికారు పోయినసారి. కళ్ళజోడు ఫ్రీడ్జ్ లో ఉంది పోయింది.
** మరి అంత ఎక్కువ స్మార్ట్ గా ఆలోచించకూ. మన బజార్లో ఉండే మిసెస్ జానకి, కనకం నవనీతం ముగ్గురు ఊర్లో లేరు.
** షరా మామూలుగా నేను ఎప్పుడయినా తిరిగి వచ్చే అవకాశం ఉండనే ఉంది.

***  హాపీ దసరా 

Friday, 7 October 2016

హై టెక్

వారం క్రితం జిల్లా మొత్తం లో మంచి టెక్నికల్ మార్క్స్ ఉన్న ది బెస్ట్ హై టెక్  డాటా ఎంట్రీ ఆపరేటర్ ని మా సబ్ డివిజన్ కి కేటాయించారని తెలిసి సంతోషం వేసింది. 
మా ఆన్లైన్ కష్టాలు చాలా వరకు తీరినట్టే.. హార్డ్ కాపీ(రిపోర్ట్ కాగితాలు) విషయం పక్కన పెట్టి ఇక నుండి సాఫ్ట్ కాపీలతో వేగంగా పనులు చేసుకోవచ్చు,
ఈ సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి బయలు దేరి బస్సులో వస్తుంటే. 
అతను ఫోన్ చేశాడు. 
“ఏ ఈ గారు.. మీరు పంపిన ఎక్సెల్ షీట్ లో 1364 మంది ఇన్ఫోర్మేషన్ ఉంది. కాని విలేజ్ వైజ్, కాస్ట్ వైజ్ డీటైల్స్ కావాలి. మీరు అవి పంపలేదే?
“నెక్స్ట్ షీట్ లో Pivot టేబుల్ వాడుకో “
“ఇక్కడ అన్నీ గోద్రెజ్ టేబుల్స్ ఉన్నాయి. మీరు చెబుతున్నటేబుల్ ఎక్కడ? ” అటునుండి సమాదానం.
“సరే .. నేను సాయంత్రం మరో మెయిల్ పెడతాను. సరేనా?”
“సరే సార్.. ఒక్క నిమిషం సార్.. ‘ఫలానా సైట్ పొజిషన్’ ఫోటో కావాలి. అప్లోడ్ చెయ్యాలి “
“వాట్స్ అప్ లో పంపుతాను. “
“సిస్టమ్ కి కనెక్ట్ అవటానికి ఇక్కడ కేబుల్స్ లేవండి.”
“ వై.. ఫై నెట్ ఉంది కదా? వాట్స్ అప్ వెబ్ లో నుండి తీసుకో బాబు”
“సార్ .. మీకు అర్ధం కావటం లేదు. సెల్ ని సిస్టమ్ కి కనెక్ట్ చేయటానికి కేబుల్ లేదు అంటున్నా”
“నువ్వు ఫోను పెట్టు తమ్ముడు. ఫోటో ప్రింట్ తీయించి, ప్రత్యకంగా ఒక అటెండెంట్ ని ఇచ్చి పంపుతాను”
“ఎందుకు సార్ స్కాన్ చేసి మెయిల్ లో పెట్టండి సార్ “
“ఒరే నాయనా నువ్వు ఫోన్ పెట్టు.. నేను ఏదో ఒకటి చేస్తాను”

Thursday, 6 October 2016

పి హెచ్ డి

కొత్త ప్రొఫెసర్ బోర్డ్ వైపు తిరిగి డిస్ప్లే స్రీన్ మీద ఉన్న సిద్దంతాన్ని వివరించేటప్పుడు ఉన్నట్టు ఉండి క్లాస్ లో వెనుకనుండి ఎవరో పిల్లాడు విజిల్ వేశాడు చెవులు దిబ్బడి పోయేట్టు శబ్దం.
.. 
ప్రొఫెసర్ వెనక్కి తిరిగాడు. “ హూ ఈజ్ ఇట్ ?” అన్నాడు. 
..
యదావిదిగా ఎవరు మాట్లాడలేదు. 
..
అందరూ మౌనం వహించారు. ముసి ముసి నవ్వులు కామనే.
***
ప్రొఫెసర్ పాఠం ఆపేశాడు.
బయటకి వెళ్లబోతూ ఆగాడు.
..
“ఇంకా అరగంట ఉంది. మీకో తమాషా చెప్తాను.”..
..
అందరూ ఆసక్తి గా వినసాగారు. ..
..
“రాత్రి నేను మన యూనివర్సిటీ నుండి మా ఫ్లాట్ కి వెళుతుంటే.. ..
బీచ్ రోడ్డు లో ఎదురుగా తెల్లటి డ్రస్ వేసుకున్న ఒక ..ఆవిడ కారు ఆపి లిఫ్ట్ అడిగింది. నేను కారు ఆపగానే ఆమె కారు ఎక్కింది.
విరబోసుకున్న జుట్టు ఎడం చేతి ముని వేళ్ళతో వెనక్కి నెట్టుకుంటుంది.
పర్ఫ్యూమ్ వాసన మత్తుగా ఉంది. మేము మాట్లాడు కుంటూనే ఉన్నాం.
ఇద్దరం ఒక హోటల్ కి బోజనానికి వెళ్ళాం. ఎంతో కాలం నుండి తెలిసిన వాళ్లలా మేము అర్ధరాత్రి దాకా మాట్లాడుకుంటా ఉండి పోయాం.
తన గురించి చాలా విషయాలు చెప్పింది తనకో తమ్ముడున్నాడని మన యూనివర్సిటీ లో నే చదువుతున్నాడని, అద్బుతంగా విజిల్ వేస్తాడని, చెవులు దిబ్బడి పోయేట్టు శబ్దం వస్తుందని “
..
క్లాసు లో అందరూ  ఒక పిల్లాడి వైపు చూశారు.

Wednesday, 5 October 2016

K


(Whats app ప్రేమికుల సంభాషణ) 
ఆమె: కార్తీక్ నాకో 7k పంపవా?
అతను: ఎందుకు ?
ఆమె: “దసరా కి ఒక డ్రస్ కొనొక్కోవాలి దానికో 4k . ఫేషియల్, బ్యూటీ పార్లర్ ఖర్చు 2k, మంచి సాండీల్స్ కొనుక్కోవాలి.”

అతను: “సరే పంపుతున్నాను K K K K K K K K K రెండు K లు ఎక్కువ పంపాను. పర్ఫ్యూమ్ కొనుక్కో. ఇంకా మిగిలితే కొంచెం తెలివి కూడా “

Tuesday, 4 October 2016

యువ సన్యాసి

మండు వేసవి. పెటేల్మని ఎండ. మిట్ట మద్యాన్నం. ఆ యువ  సన్యాసి టారి గేటు స్టేషన్ లో దిగి నేలపై ఒక సంభాన్ని అనుకోని కూర్చుని ఉన్నాడు. ఎండ నిప్పులు చెరుగుచున్నది. సన్యాసి వద్ద ఎటువంటి నగదు లేదు. అతనికి అమితమయిన ఆకలి గాను, దాహం గాను ఉంది.
ఒక ధనవంతుడు ఎదురుగా కూర్చుని మంచి ఆహారం తీసుకుంటూ సన్యాసిని చూసి “అన్నపానీయాలు లేకుండా మాడుటే సన్యాసుల  గతి “ అని హేళన చేశాడు. ఆ యువ సన్యాసి ఆ వాక్యాలని స్వీకరించలేదు.

అంతలో ఒక మిటాయి దుకాణాదారుడు, రుచి కరమయిన బోజనాన్ని చల్లటి మజ్జిగను  తీసుకుని వచ్చి సన్యాసి ఎదుట ఉంచి “స్వామి వీటిని భుజించండి” అని బ్రతిమాలాడు.
ఆ సన్యాసి అతనితో “ మీరెవరు? నాకు మీరు పరిచయం లేదు. మీరు మరెవరో అనుకుని బ్రమపడి నావద్దకు వచ్చినట్లున్నారు “ అని బోజనం తీసుకోకుండా తిరస్కరించాడు.
దానికా వర్తకుడు “ స్వామి! నా ఇష్ట దైవమయిన శ్రీ రామ చంద్ర ప్రభువు నాకు కలలో కనిపించి, రైల్వే స్టేషన్ లో ఉన్న మిమ్ములను చూపించి అదిగో అతను నిన్నటి నుండి అతడు ఆహారం లేకుండా ఉన్నాడు. నా మనసు తల్లడ్డిళ్ళు తుంది. వెంటనే ఆహార పానీయాలను తీసుకు పోయి అతనికి అందచేయుము అని ఆదేశించి యున్నాడు.”
నేను నిద్ర నుండి మేలుకుని ఇది కలే కదా అని నిర్లక్షం తో మళ్ళీ నిద్ర కి ఉపక్రమించాను. మళ్ళీ అదే కల ఎవరో తట్టి లేపినట్లు అయినది. ఆయన ఆజ్ఞానుసారము ఈ బోజనం తీసుకు వచ్చాను. ఖచ్చితంగా మిమ్మల్నే శ్రీరామ చంధ్ర ప్రభువు నాకు చూయించారు. దయచేసి వీటిని స్వీకరించండి” అని ప్రాదేయ పడ్డాడు.
పరమేశ్వరుని లీలకు ఆశ్చర్యముతో కన్నీరు విడుచుచూ  సన్యాసి  ఆ వర్తకుని కి కృతజ్ఞత తెలిపి వాటిని స్వీకరించాడు. ఎదురుగా కూర్చుని ఉన్న దనవంతుడు సన్యాసి పాదముల పట్టుకుని తన మూర్ఖత్వాన్ని క్షమించమని వేడు కున్నాడు.
“ఎవరు ఇతర చింతలు లేకుండా నన్నే ఉపాసింతురో వారి యోగ క్షేమములు లకు నేను బాద్యత వహించేదను “ అని గీతలో శ్రీకృష్ణుని పలుకులను ఆ దనవంతునికి సన్యాసి అయిన వివేకానందుడు గుర్తు చేశాడు.


తోడు

అర్ధరాత్రి పై ఫ్లోర్ లో ఉన్న ఇంటి ఓనర్ కాలింగ్ బెల్ కొట్టాడు సుబ్బారావు.
అయిదునిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది. ఇంట్లో అందరూ నిద్ర లేచినట్లున్నారు. 
..
"ఏమిటి విషయం?" టెనెంట్ ని చికాకుగా అడిగాడు ఒనరుడు...
..
నేరుగా విషయం లోకి వచ్చాడు సుబ్బారావు "ఈ నెల దసరా మామ్ముళ్ళు, పోయిన నెల గణేశ్ చందాలు .. చాలా ఇబ్బందిగా ఉంది ఈ నెల కూడా అద్దె ఇవ్వలేను."..
...
సర్రున మండింది ఆయనకి. ...
" అర్ధరాత్రి వచ్చి చెప్పాలా ?? రేపు ఉదయం మాట్లాడుకోవచ్చు కదా?'
...
"నిజమే అనుకోండి.. రాత్రంతా నేను ఒక్కడినే బాదపడటం ఎందుకా? అని" సుబ్బారావు నసిగాడు.

Monday, 3 October 2016

మత విశ్వాసం

ఇంగ్లండ్ లో ఐ సి యస్ డిగ్రీ చదివిన భారతీయ యువకుడు ఒకరు ఉత్తర ప్రదేశ్ లోని  ఇటావా జిల్లా కలెక్టర్ గా ఉండేవాడు.
ఆగ్రా నుండి యునైటెడ్ ప్రొవిసన్స్ ఆఫ్ ఇండియా కి కమిషనర్ గా పనిచేస్తున్న  విన్సెంట్ ఆర్థర్ స్మిత్, పర్యవేక్షణ నిమిత్తం  కలెక్టర్ గారి హెడ్ క్వార్టర్స్ కి వచ్చారు. పాశ్చాత్య పద్దతులు పూర్తిగా ఎరిగిన కలెక్టర్ గారు ఆయనని గౌరవించడానికి ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశాడు.
స్మిత్ గారికి బోజనమ్ లో ఆయనకి అత్యంత ప్రియమయిన వంటకం మొదటగా వడ్డించగానే..  ఒక్క క్షణం ఆయన దానిని చూసి పక్కకి నెట్టేశాడు.
కలెక్టర్ గారికి ఆశ్చర్యం వేసింది.” మీకోసం ప్రత్యేకంగా చేయించాను. దానిని గుర్తుపట్టలేదా?? పక్కకి నెట్టేశారు?” అన్నాడు.
అతను మెల్లగా “నాకు తెలుసు. గుర్తుపట్టాను” అన్నాడు
“మీకు ఇష్టం లేదా?” అడిగాడు కలెక్టర్.
“ఇష్టమో లేదో వేరే విషయం. ఇక్కడ భారత దేశం లో ఆవుని మాత గా పూజిస్తారు. ఈ దేశం లో ఉన్నంత కాలం నేను ఈ ప్రజల మత విశ్వాసాలని గౌరవించడం నా విది. నేను అంత అనాగరికుడిని కాను” అన్నాడు.
కలెక్టర్ గారు సిగ్గుతో తలెత్తుకోలేక పోయారు.
*****
Sir Vincent Arthur Smith,  (1848–1920) గ్రేట్ బ్రిటన్ & ఐర్లాండ్  యునైటెడ్ కింగ్ డమ్ లో జన్మించారు. 23 వయసుకి ఇండియన్ సివిల్ సర్వీసెస్ పాసయ్యాడు. 1871-1900 మద్య కాలం లో యునైటెడ్ ప్రొవిసన్స్ ఆఫ్ ఇండియా కి కమిషనర్ గా పనిచేశాడు.

తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళి పోయాక భారతదేశం గురించి, గొప్ప రాజుల గురించి అనేక గ్రంధాలు వ్రాశాడు (The Early History of India and The Oxford History of India, Buddhist emperor, Ashoka and the Mughal emperor, Akbar, and a history of fine arts in India and Ceylon ఆయన వ్రాసిన వాటిలో కొన్ని )

Sunday, 2 October 2016

చక్కెర పొంగలి

స్నానం చేసి బయటకి వెళ్తుంటే హల్లో చదువుకుంటున్న మా పెద్దమ్మాయి అడిగింది.
“గుడికా ?!! ప్రసాదానికి ఇంకా పావుగంట ఉంది” అంది. 
భీబత్చమయిన  బక్తులకే తప్పలేదు అవమానాలు. మనం ఎంత? 
“అమ్మ, నానమ్మ ఇద్దరు వెళ్లారు. మనిద్దరికి ప్రసాదాలు వస్తాయి " అంది. 
"చక్కెర పొంగలి చల్లారి పోతుంది. నేను అక్కడే తింటాను" అని నవ్వేసి గుడికి వచ్చాను.
..
మా వీదిలో ఉండే పిల్లల్ని కొంతమందిని పోగుచేసి, చాలీసా పారాయణం, మంగళ హారతి అబ్యాసం చేయిస్తున్నాం. పిల్లలు రాగ యుక్తంగా పాడలేక పోయినా ఆ పసి గొంతుల్లో స్వచ్చత ఉంటుంది. అమాయకత్వం ఉంటుంది. అది చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళు పాడటం అవగానే చప్పట్లు కొట్టి గట్టిగా మెచ్చుకోవటం నాకు అలవాటయిపోయింది. అందుకే ఎక్కడున్నా పూజ ముగిసే సమయానికి గుడికి వెళ్తున్నాను. 
శుభరాత్రి.

కాలం

ఒక వ్యక్తి సంచి నిండా ఇంట్లో చాన్నాళ్లుగా ఉన్న గులక  రాళ్ళు పోసుకుని ఊరి వెలుపలికి వెళ్ళాడు. అక్కడ ఒక నది పారుతూ ఉంది. నది ఒడ్డున ఒక పొడవాటి చెట్టు ఉన్నది. దాని కొమ్మల మీద పక్షులు ఉన్నాయి. రంగు రంగుల పక్షులు.
అతను సంచి లోని రాయి తీసుకుని గురి చూసి ఒక పక్షి  మీదకు విసిరాడు. అది పక్షికి తగల లేదు ప్రవహించే కాలవలో పడిపోయింది. మరొకటి విసిరాడు. అది కూడా తగల లేదు. ఏదో ఒకటి తగలక పోతుందా అని విసురుతూనే ఉన్నాడు.
పక్షులు ఒక చోట నుండి మరొక చోటకి ఎగురుతున్నాయి గాని దేనికి రాళ్ళు తగల లేదు. రాళ్ళన్ని నదిలోకి పోయి పడ్డాయి.
ఆఖరుకు ఒక రాయి మిగిలింది. మెరుస్తున్న దానిని తీసుకుని అతను వెనక్కి వచ్చాడు. ఊరి మొదట్లో ఒక దుకాణాదారునికి దాన్ని చూపించాడు. వ్యాపారి దాన్ని చూసి అబ్బురం చెందాడు. “ఇది మామూలు గులక రాయి కాదు. చాలా విలువయినది. దీని ఖరీదు కూడా నేను చెప్పలేను. నిపుణులయిన వారు మాత్రమే చెప్పగలరు” అన్నాడు
అప్పుడా వ్యక్తి అయ్యో నేను విలువయిన రాళ్ళు వృధాగా నదిలో జారవిడుచుకున్నానే.. అని భాదపడి మిగిలిన ఒక్క దానిని అయినా సద్వినియోగం చేసుకోవాలి అనుకున్నాడు.

ఆ రాళ్లే జీవితకాలం లో విలువయిన తిరిగిరాని సంవత్సరాలు, నెలలు. చెట్టుమీదున్న పక్షులే ఆశలు, కోరికలు. ఆ నదే మృత్యువు. వ్యాపారే గురువు.
ఇది ఒక క్రైస్తవ నీతి కధ.