Sunday 25 February 2018

నలుపు.


"రిటైర్ అయ్యాక మీ నాన్న గారి చాదస్తం మరీ ఎక్కువయింది అంది జయలక్ష్మి కూతురితో వంటగదిలో నిలబడి, చట్నీ తాలింపు వేసిన చిన్న బాండి లో రెండు ఇడ్లీ అద్దుకు తినేస్తూ...
“కాఫీ కాస్త వేడిచేసి నాన్నగారికి ఇవ్వు .. వచ్చేస్తున్నానని చెప్పు” అంది కూతురితో
రాజు గారు కాఫీ తాగేసరికి ముడేసుకున్న జుట్టు అర్జంటుగా దువ్వేసి, క్లిప్ తగిలించుకుని,
ముందుగా సర్ది ఉంచుకున్న హాండ్ బాగ్ అందుకుని, "నేను రెడీ" అంది హల్లో కి నడుస్తూ...
రాజు గారి చూపు ఇంకా తడి ఆరని ఆమె జుట్టు మీదకి ఒక్క క్షణం వెళ్లింది.
“ఏమయినా తిన్నావా?” అన్నాడు చెప్పుల్లో కాళ్ళు దూరుస్తూ..
"తిన్నాలెండి లేటవుతుంది పదండి" అంది ఆవిడ కూడా బయటకి నడుస్తూ..
“ఇంట్లో జాగర్త తల్లీ.. మద్యానం బోజనం టైమ్ కి వచ్చేస్తాము. అక్కడ బయలుదేరగానే ఫోన్ చేస్తాను. రైస్ కుక్కర్ స్విచ్ వెయ్యి. నాన్న గారికి చల్లటి అన్నం అరగదు తెలుసుగా?” కుమార్తె తో అంది.
ఆటో లో బస్ స్టాండ్ చేరుకుని, యడ్లపాడు వెళ్ళటానికి గుంటూరు బస్సు ఎక్కిందాకా ఇద్దరు పెద్దగా మాట్లాడు కోలేదు.
మంచి ఏ‌సి బస్సు, ఊరు దాటగానే “అబ్బాయి నల్లగా ఉంటే మాత్రం ఒప్పుకునేదే లేదు” అంది ప్రారంభం గా.
రాజు గారు నవ్వాడు. “సర్లే.. పసుపు బొమ్మ లాగా ఉంటావు. నన్ను చేసుకోలా?”
ఆవిడ బుగ్గలు దాచుకుంటూ “మన కాలం వేరు. ఇప్పుడు పిల్లలు ఆస్తులు చూడటం లేదు. ఒడ్డు పొడుగు.. చూడ చక్కగా ఉంటే తప్ప ఊ అనటం లేదు.”
“తప్పు జయా మనుషుల ని వంటి రంగు ని బట్టి లెక్కించడం మంచిది కాదు. పిల్లాడు అబ్రాడ్ లో ఎం‌ఎస్ చేశాడు. పి‌హెచ్‌డి కూడా చేస్తున్నాడు ఫెలో షిప్ స్కాలర్షిప్ కూడా హండ్సమ్ గా వస్తుందట. ఒక్కడే కొడుకు. తండ్రికి వ్యవసాయ పొలం, నెలవారి ఆదాయం ఇచ్చే షాపింగ్ ఏరియా ఉన్నాయట.”
“ఈ వారం లో ఇది ఏ పదో సారో చెప్పటం”
జయలక్ష్మి ఇంట్లో కూతురికి ఫోన్ చేసింది.
“ పాలు తోడు పెట్టటం మర్చి పోయినట్లున్నాను. ఒక చుక్క చేమిరి వెయ్యి. పక్కింట్లో అడిగి కొంచెం తోడు తీస్కో. ఆ .. ఆ . బస్సు ఎక్కేశాం.”
***
కుర్రా రాజ శేఖర్ @ శేఖర్ కుర్రా ఇంటికి చేరుకునే సరికి వాళ్ళు తమ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
సంబందం చెప్పిన వెంకటేశం బస్టాండు లోనే కలిశాడు.
పిచ్చాపాటి .. ఆరంభ మాటలు పూర్తి అయ్యాక తెలిసిన విషయాలనే మళ్ళీ కొత్త కొత్తగా ఒకరికి ఒకరు చెప్పుకుని బుద్దిమంతులుగా తలాడించు కున్నారు.
అందరు కూర్చున్న గదిలో కుర్చీలో లో కూర్చుని ఉన్న శేఖర్ తెల్లగా లేడు.
అలాగని నలుపు కాదు.
రాజు గారు శేఖర్ ని గమనిస్తూ, మద్య వర్తి చెప్పేది వింటూ ఉన్నాడు.
జయ లక్ష్మి బాగ్ లోనుండి కుమార్తె ఫోటో తీసింది.
“ఇదిగొండి వదినా మా అమ్మాయి ఫోటో .. మా ఇంట్లో అయ్యప్ప భజన పెట్టుకున్నప్పుడు తీసిన ఫోటో .. పిల్ల పెళ్లి చూపులకి అంటూ ప్రత్యకంగా తీసిన ఫోటో లో లేవు” అంది శేఖర్ తల్లి కి ఇస్తూ..
“బావగారు ఎక్కడమ్మా?” రాజు గారు అడిగారు.
“తాగి ఎక్కడో దొర్లుతుంటాడు. వస్తాడు లెండి.” అంటూ శేఖరం తండ్రికి ఫోన్ చేశాడు.
తను చదివిన విధానం, ఎం‌ఎస్ లో తన పర్ఫార్మన్స్, తను పి‌హెచ్‌డి చేస్తున్న యూనివర్సిటీ, తను ఉండే సిటీ అక్కడ ఉన్న సౌకర్యాలు చెబుతూ ఉంటే జయలక్ష్మీ చూస్తూ ఉండి పోయింది.
"అబ్బాయి ఫోటో ఏదయినా ఇవ్వండి మా బందువులకి చూయించుకొటానికి అంటూ అడిగింది."
శేఖర్ తల్లి ని ..
“నేనూ పెళ్లి కంటూ ప్రత్యేకంగా ఏమి ఫోటో లు తీయించు కోలేదు ఆంటీ” చెప్పాడతాను.
తల్లి లోపలికి వెళ్ళి ఆల్బమ్ లో నుండి ఒక ఫోటో తీసు కొచ్చింది. “ఇది చూడండి” అంది.
శేఖరం లేచి లోపలికి వెళ్ళాడు. తల్లి కూడా వెళ్లింది. “బుద్ది ఉందా నీకు ఆదా ఇచ్చేది? ఆ కోటు వేసుకున్న ఫోటో ఏది?” లోపలి గది లో నుండి తల్లీ కొడుకుల మాటలు హాల్లోకి మెల్లిగా వినబడుతున్నాయి.
రాజు గారికి, శేఖరం కి తల్లి తండ్రి పట్ల ఉన్న గౌరవం ఏపాటిదో అర్ధం అయింది.
రెండు నిమిషాల్లో జయలక్ష్మీ చేతికి మరో ఫోటో వచ్చింది.
ఈ లోగా పిల్లాడి తండ్రి వచ్చాడు. కొబ్బరి బోండాల గెల తీసుకుని.
నల్లగా దృడం గా ఉన్నాడు.
మరో అరగంట సమావేశం తర్వాత ఇద్దరు బయలు దేరారు.
‘అమ్మాయి అభిప్రాయం తెలుసుకుని, తమ తోబుట్టువుల తో మాట్లాడి మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం’ అని చెప్పి బయలు దేరారు రాజు గారి దంపతులు.
శేఖరం తండ్రి మామిడి తాండ్ర పొట్లం ఒకటి జయలక్ష్మీ దంపతులకి ఇచ్చి బయటి వరకు సాగనంపాడు.
మళ్ళీ తిరుగు బస్ ఎక్కగానే కూతురికి ఫోన్ చేసింది జయలక్ష్మి. “పిల్లాడు చామన ఛాయ. మంచి ఆస్తి పాస్తులు ఉన్నాయి. ఒక్కడే కొడుకు. మంచి చదువు. జీవితం. మంచి మ్యాచ్ అనిపిస్తుంది”
“నాన్న ఏమంటున్నారు?”
“ఏమి చెప్పలేదు. ఇంటి కి వచ్చాక నువ్వే అడుగు. ఒక గంట లో ఇంట్లో ఉంటాం.”
**
బోజనం అయ్యాక రాజూ గారి మాట కోసం ఎదురు చూస్తున్న కూతురితో ఆయన అన్నాడు.
“పిల్లాడు కారు నలుపు”

Tuesday 20 February 2018

పిల్లి తల

మద్యాహ్నం ఎండ ఎక్కువగానే ఉంది. ఫిబ్రవరి నెల దాటనే లేదు.
26 పంచాయితీలు, 72 గ్రామాలు లో ఉన్న మూడువందల పై చిలుకు ఆగిపోయిన యూనిట్లలో వారం రోజుల్లోగా పూర్తి అయ్యేవాటి వివరం అరగంట లో(???) ఇవ్వమని మెయిల్ లో వచ్చిన ఫార్మెట్ కి రెండు నిమిషాల్లో సమాదానం ఇచ్చి(!!!) రికార్డ్ వర్క్ చూసుకుంటున్నాను. 
అప్పుడప్పుడు ఆఫీసు ప్రశాంతం గా ఉంటుంది. ఈ రోజు లాగే..
ఎవరో ఒక జంట నెత్తిన ‘మూత ఉన్న పెద్ద స్టీలు కేరేజి’ మా ఆఫీసు వరండా లో దించుకుని, బిడియంగా లోపలికి చూస్తూ మా స్టాఫ్ తో మెల్లగా మాట్లాడుతున్నారు. అద్దాల విండో లో నుండి నాకు కనిపిస్తూ ఉంది. 
మా స్టాఫ్ శ్రీను ఒక సీసా నిండుగా వాటర్ పట్టి వాళ్ళకి ఇచ్చాడు. 
“సార్ పుట్ట తేనె అంట తీసుకుంటారా?” నా రూము లోకి వచ్చి అడిగాడు. 
“వద్దు.. బాలు ఎక్కడ?”
“సిద్దవరం వెళ్ళాడు సార్. ఇంకాసేపట్లో ఆఫీస్ కి వస్తాడు.”
“ నువ్వు లంచ్ తెచ్చుకున్నావుగా. బాలుని వస్తూ జంక్షన్ లో పార్సిల్ తెమ్మను. అందరం ఇక్కడే తినేద్దాం.”
నేను సీట్లో పని ముగించుకుని బయటకి వచ్చి చేతులు కడుక్కుంటూ వాళ్ళని గమనించాను. 
వరండాలో ఎవరికి ఎబ్బంది లేకుండా ఒక మూలకి జరిగి చేతి సంచి లో తెచ్చుకున్న ఒక గుడ్డ మూట నుండి గట్టిగా ఉన్న రొట్టెలు తీసి మరో సీసా లోని ఎర్ర కారం వంచుకుని తింటున్నారు. 
“శ్రీను బాలు కి మరో పార్సిల్ తెమ్మని చెప్పు” లోపలికి వచ్చి నా సీట్లో కూర్చుంటూ చెప్పాను. 
అప్పటికే బాలు వచ్చేశాడు. తెచ్చిన పార్సిల్ ఆ దంపతులకి ఇచ్చి మరో పార్సిల్ కోసం వెళ్ళాడు.
***
తన ఊరు మహానంది అని, తేనె ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడి నుండి సేకరిస్తారో చెబుతూనే ఉంది. వాగుడు కాయ లాగా.. మా వాడు “ఇది బెల్లం పాకు/ ఇది కల్తీ” అంటాడు.
ఆవిడ మనో భావాలు దెబ్బ తిన్నాయి. ఇక మాటలు కట్టలు తెంచుకున్నాయి. 
‘ నట్టు లో ఉంటదిగా చూసుకొండయ్యా. (నెట్ లో అని కాబోలు) ఇదిగో గాజు గ్లాసు నీళ్ళలో ఒక చుక్క వేస్తే కరగకుండా అడుక్కి వెళ్తుంది, దూది తడిపి వెలిగిస్తే వెలుగుతుంది, బట్ట మీద వేస్తే పాదరసం లా పక్కకి జారుతుంది. గోరు మీద చుక్క వేస్తే అలాగే నిలబడుతుంది.” అంటూ అన్నీ డెమో చేసి చూపించినట్లు ఉంది. 
తేనె పుట్టు పూర్వోత్తరాలు చెప్పటం మొదలెట్టింది. విజయవాడ మంతెన సత్యనారాయన ప్రకృతి ఆస్పత్రి కి తానే పంపుతానని. రోజు వేడి నీళ్ళు తేనె కలుపుకు తాగితే వళ్ళు తగ్గుద్దని, పెద్ద గొంతు లో నాకు వినబడేట్టు గా అరుస్తూ (దొంగ రాస్కెల్ Grrr) చెప్పింది. 
పుట్ట తేనె, కొమ్మ తేనె ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ విరివిగా ఉంటుందో ఒక ఎన్సైక్లోపీడియా లాగా వివరం గా చెబుతూ నే ఉంది. ఆ నోటికి మాటకి ఆఫ్ బటనే లేదు. ఆమెని భరాయిస్తున్న మగ మనిషి ని మరో సారి చూడాలని పించింది. బాగోదని ఉరుకున్నాను. లీటరు సీసా తేనె 300/- కి ఇస్తానని తీసుకోమని, కావాల్సింటే తన ఫోన్ నెంబరు వ్రాసుకోమని చెబుతూనే ఉంది. 
లోపల నుండి నాకు వినబడుతూనే ఉన్నాయి. 
బాలు ని పిలిచి “ఒక బాటిల్ తీసుకొని, వాళ్ళని పంపు. అసలే టెలీ కాన్ఫరెన్స్ తో చెవులు వాచి ఉన్నాయి.” అయిదు వందల నోటు ఇచ్చి చెప్పాను. 
వాళ్ళు వెళ్ళి పోయిన అయిదు నిమిషాలకి బాలు వచ్చి “రెండు బాటిల్స్ ఇచ్చింది. చిల్లర లేదు. సార్ కయితే 500 కి రెండు బాటిల్లు. అంది.” అన్నాడు నవ్వుతూ.. 
“వ్యాపారం.. నేర్చుకోండి” నేను కూడా నవ్వుతూ చెప్పాను. 
ఈ లోగా మా రెండో కుర్రాడు శ్రీను లోపలికి వచ్చి “సార్ ఆమె నెంబరు వ్రాసుకున్నాను కానీ పేరు అడగటం మర్చి పోయాను.” అన్నాడు 
“ ‘చెంచు లక్ష్మి’ అని సేవ్ చేసుకో.. “ 

Monday 12 February 2018

సన్మానం

వీది మలుపు తిరిగి ఇంటి వైపు వెళ్తుంటే.. మా వీదిలో మగాళ్ల గుంపు నా బండి ఆపేశారు. 
“ ఇంజనీర్ సార్ మీకో ఒక విషయం చెప్పాలి, ఆగండి” ఉపోద్ఘాతం గా మొదలెట్టారు. 
“ఇంటికెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను. “
“అంత టైమ్ లేదు. అర్జెంట్ అయితే ఆ రోడ్డు పక్కకి వెళ్ళండి” ఒకాయన చెప్పాడు. అప్పటికే నానా విధాల పరిమళాలు నిలబడ్డ నలుగురి దగ్గర ఘుమాయిస్తున్నాయి. 
“కాసిని ఉడుకు నీళ్లయినా తాగి వస్తాను. “ 
“రేయ్ సారుకి మంచి టీ పట్టుకురా పో” .. అందుబాటులో ఉన్న ఒక కుర్రాడిని పురమాయించారు.
విషయం సీరియస్ అని, పంచాయితీ తప్పదని కొద్ది దూరం నుండి ఈ వ్యవహారం గమనిస్తూ నవ్వుతున్న ఓబులు రెడ్డి ( మా వీది లో ఛారిటీ స్కూల్ ప్రిన్సిపాల్, మా దేవాలయం జెనరల్ సెక్రటరీ) గారిని చూశాక అర్ధం అయింది.
బండి పక్కన ఉంచి గుడి ముందు అరుగు మీద కూర్చున్నాను. ఓబులు రెడ్డి గారు కూడా వచ్చి చేరారు.
“ఏమయింది మాస్టారు?” అని అడిగాను.
“ఏదో కుటుంబ విషయం. వాళ్ళనే చెప్పనియ్యండి.” ఆయన సన్నగా నవ్వుతూ అన్నాడు.
“సరే మీరే చెప్పండి.” బాశా పట్లు వేసుకుని కూర్చున్నాను.
మెడలో దండ వేసుకున్న పొట్టి వెంకటేశం ముందుకి వచ్చాడు. “రేపు శివరాత్రి రోజు మా సంపూర్ణ కి సన్మానం చెయ్యాలి.” అన్నాడు స్థిరంగా. సంపూర్ణ అతని బార్య.
నాకు కొంత విచిత్రం గా అనిపించింది. “ ఎవరికీ? మీ ఇంటావిడకా?” మర్యాద తెచ్చి పెట్టుకుంటూ అడిగాను.
వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఎప్పుడు మొగుడి మాట విన్నదే లేదు. ఒక లోటా నీళ్ళు చేతికి ఇచ్చినట్టు గాని, ఒక పూట కంచం లో అన్నం వడ్డించినట్లు గాని రికార్డు లలోనే లేదు. ఇంట్లో అతని గొంతు వినిపించి ఎరగదు. చాలా కాలం అతన్ని ఇంట్లో పనోడు అనే అనుకునేవాడిని. నాలుగేళ్ల క్రితమే మొగుడని నాకు తెలిసింది.
ఇష్టమయినా లేకున్నా, ఎడిటర్ కి బొమ్మ గీసేటోడికి వచ్చిన ప్రతి కధా చదవక తప్పనట్టు. .. బలవంతాన ఆసక్తి కలిపించుకుని. ‘ఏమిటి విషయం ?” అన్నాను జనాంతికంగా.
“మా ఆవిడ దేవత” అన్నాడతను ముద్ద ముద్దగా, జారిన లుంగీ చెంగు ని వంగి అందుకుంటూ ముందుకు తూలి పడ్డాడు.
“కాదని ఎవరయినా అన్నారా?” ఓబులు రెడ్డి గారిని అడిగాను. ఆయన నవ్వు ని బిగబట్టే ప్రయత్నం లో ఉన్నాడు.
కింద పడ్డ వెంకటేశం ఎందుకు వంగాడో మర్చి పోయి కాలికి మిగిలిన చెప్పు తీసుకుని పైకి లేచే ప్రయత్నం చేశాడు. మిగతా సువాసన వీరులు సాయం చేశారు.
“నా పెళ్ళాం దేవత.” అన్నాడు మళ్ళీ నమ్మకం గా ..
ఇవి సెన్సిటివ్ విషయాలు కాబట్టి .. ఈ రోజు కూడా జాగారం తప్పెట్టు లేదనుకుంటూ ఉంటే...
“దేవతని అపార్ధం చేసుకున్నాను. ఇవాళ నా పెళ్ళాం నాకు వేడినీళ్లు తోడింది. వేడివేడి అన్నం ప్లేటో పెట్టి, పక్కనే దోమల బాటు తీసుకుని కూర్చుంది. పిల్లలు ఇద్దరినీ ఇవాళ స్కూల్ లో ఏమి చెప్పారో నాన్నకి అప్పచెప్పి అప్పుడు పడుకోండి అని వాళ్ళతో చెప్పింది.... నా పెళ్ళాం దేవత.” వెంకటేశం చెప్పు ని చొక్కా జేబులో పెట్టుకున్నాడు.
“నా దేవత కి సన్మానం చెయ్యల్సిందే” ...

Sunday 4 February 2018

బిక్ష పాత్ర


జీవితం మనకు అవసరం అయినవి ఇస్తుంది.
కానీ అవసరాన్ని మించి మనం అడుగుతూ ఉంటాం.
అప్పుడు నిజమయిన అవసరం మరుగునపడుతుంది. 
ఆశ అనేది ముందుకు వస్తుంది. ఆశ కి అంతులేదు.
మనకి జీవితం ఇచ్చిన దాని పట్ల స్పృహ ఉంటే మన ఆనందం అక్కడే ఉంటుంది.
ఒక రోజు.... రోజు మాదిరిగానే రాజు గారు ఉద్యానవనానికి వచ్చాడు. ..
సాయంత్రం ఉల్లాసంగా ఉన్నాడు. గాలి స్వచ్చంగా ఉంది.
వాతావరణం ఆహ్లాదంగా ఉంది. మందీ మార్బలం లేకుండా ఒంటరిగా వచ్చాడు.
ఒక బిక్షగాడు ఎప్పటి నుండో రాజు గారి దర్శనం చేసుకోవాలని అనేక ప్రయత్నాలు చేసి ఆరోజు ఆయన అంతః పురానికి తిగిరి వెళ్ళే త్రోవలో కాచుకుని ఉన్నాడు. రాజుగారు విలాసంగా నడుచుకుంటూ వస్తుంటే.. బిక్షగాడు ఎదురు వెళ్ళాడు.
“రాజా ఎన్నాళ్ల నుండో మీ దర్శన భాగ్యం కోసం ఎదురుచూస్తున్నాను. మిమ్మల్ని బిక్ష అడగాలన్నది నా కోరిక”
రాజు గారు ఉల్లాసంగా ఉన్నారు. “ఈ మాత్రం దానికి ఇంత శ్రమ పడ్డావా? ఏం కావాలో అడుగు” అన్నాడు.
బిక్షగాడు తన వద్ద నున్న చిన్న పాత్ర ని చూపించి “దీని నిండుగా ఏమిచ్చినా తీసుకుంటాను” అన్నాడు.
రాజు గారు ‘ ముత్యాల తో ఇతని బొచ్చ నింపండి” అని చెప్పాడు.
మంత్రి గారు ముత్యాలు తప్పించి ఆ పాత్ర లో పోసాడు. .
ఆశ్చర్యం అవి బొచ్చ లో అదృశ్యం అయి పోయాయి.
రాజు, మంత్రీ ఇద్దరు ఆశ్చర్య పోయారు. ...
బస్తాతో బంగారు, వెండి నాణేలు తెప్పించారు.
బిక్ష పాత్ర లో పొసేకోంది అవి మాయం అయిపోసాగాయి.
రాజు అదిరి పోయాడు. ”నువ్వు బిచ్చగాడివా? మాయావి వా?” అన్నాడు అనుమానంగా
దానికా బిక్షగాడు.” అయ్యా నేను మామూలు బిక్షగాడినే. కనీసం బిక్షా పాత్ర కొనుక్కోలేని బిక్షగాడిని. ఒక రోజు శ్మశానం నుండి వస్తూ ఉంటే నా కాలికి మనిషి పుర్రె తగిలింది. దాన్ని శుభ్రం చేసి మెరుగు పెట్టి బిక్ష పాత్ర గా వాడు కుంటున్నాను. మనిషి పుర్రె కదా? ఇదెప్పుడూ సంతృప్తి పడలేదు. ఇక లాభం లేదని మీ దగ్గరకి వచ్చాను.”

Saturday 3 February 2018

ఇద్దరు తల్లులు- ఇద్దరు పిల్లలు.

డిపో నుండి బయటకి వస్తున్న బస్సు కి ఎదురుగా ఒక కారు ఆగింది.
ప్రభుత్వ వాహనం లో దిగటం, దిగగానే అటెండరు కార్లో నుండి హాండ్ బాగు అందివ్వటం డ్రైవరు కం కండెక్టర్ గమనించాడు.
అప్పటికే ఒకరిద్దరు ప్రయాణికులు నిలబడి ఉన్నారు.
“నెక్స్ట్ స్టేజ్ లో సీట్లు ఖాళీ అవుతాయి లోపలికి రండి “ డ్రైవరు చెప్పాడు. నెక్స్ట్ స్టేజ్ అంటే కనీసం పదిహేను కిలోమీటర్లు... టికెట్ తీసుకున్నాను.
చీకటి చిక్కబడుతూ ఉంది. చల్లటి గాలి ఎక్కువయింది.
బస్సులో ఉన్న రెండో పోల్ వద్ద కి వెళ్ళి అనుకుని నుంచున్నాను. బాక్ సీటు ఖాళీగా ఉన్నట్లు అనిపించింది.
నలుగురే కూర్చుని ఉన్నారు. కిటికీ ల పక్క ఇద్దరు కుర్రాళ్ళు ఉన్నారు. సెల్ కి ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకుని పరలోకం లోకి వెళ్ళి పోయి ఉన్నారు.
మధ్యలో ఇద్దరు స్త్రీలు. ఒకావిడ వర్కింగ్ క్లాస్ ఉమన్ అని అహర్యాన్ని బట్టి అర్ధం అవుతుంది.
మరోకావిడ ఉన్నింటి పల్లెటూరి మహిళ ఏదో ఫంక్షన్ కి వెళ్ళి వస్తున్నట్టు, ఇమిటేషన్ పట్టు చీర, రాళ్ళ నక్లెస్ ధరించి ఉంది.
వీటన్నిటిని మించి ఇద్దరి ఒడిలో పసి బిడ్డలు. నెలల బిడ్డలు. మొదటి ఆవిడ ఒక గుడ్డ సంచీ నుండి పాల బాటిల్ తీసి బిడ్డకి పట్టిస్తూ ఉంది.
నక్లెస్ ఆవిడ వళ్ళో బిడ్డని చిన్నగా కాళ్ళు కదుపుతూ ఊపుతుంది. ఆ పిల్ల ఆమెని గమనిస్తూ ఉంది.
బస్సు యదావిడిగా స్పీడ్ బ్రేకర్ల మీద ఎగురుకుంటూ పరిగెడుతుంది.
పసి పిల్లలు జారీ పోకుండా తల్లులిద్దరూ జాగర్త పడుతున్నారు. ఇద్దరు తల్లులకి చాలా తేడా ఉంది. ఆహార్యం లో ..
నక్లెస్ ఆవిడ ని వళ్లో పిల్ల ని నవ్వుతూ ఆడిస్తుంది.
ఎందుకో గాని ఆ ధృశ్యం నా దృష్టిని ఆకర్షించింది.
***
మర్రిచెట్లపాలెం స్టేజ్ వచ్చింది.
మొదటి తల్లి తన పక్క నే సీటు మీద మెత్తటి చీర పరిచి డబ్బా పాలు పట్టిన బిడ్డని పడుకోబెట్టింది.
అప్పటి దాకా పక్క సీట్లో కూర్చుని ఉన్న నక్లెస్ ఆవిడ చేతి లో పిల్లని తల్లికి ఇచ్చి
బస్సు దిగుతూ డ్రైవరు ని రెండు నిమిషాలు బస్సు ఆపమని అడిగింది.
గబగబా స్టేజ్ లో ఉన్న అంగడి వైపు నడిచింది.
నిమిషం లో వెనక ఉన్న కిటికీ లోనుండి ఒక వాటర్ బాటిలు, బన్నూ రొట్టె రెండో పసిబిడ్డ తల్లి కి అందించింది.
అప్పటికే రెండో పిల్ల తల్లి ని పాల కోసం తడుముతూ ఉంది.
బస్సు బయలుదేరింది.

Friday 2 February 2018

విశ్వాసం.

జనవరి నెల 2015 గొంగోలి గ్రామం, ఉత్తర ప్రదేశ్.
ఒక అనామక మహిళ ఆగ్రామం లో సంచరించడం, గ్రామస్తుల కంట పడింది. చాలా దయనీయమయిన పరిస్థితి లో ఉందావిడ. సరయిన తిండీ, బట్టా లేకుండా పిచ్చిదానిలా నీరసంగా ఉంది. ఏ వీది అరుగు మీదో చతికిల పడి ఎవరయినా ఏదయినా ఇస్తే తినటం మినహాయించి మరేమీ తెలియని స్థితి లో ఉంది. మనస్థిమితం కుడా సరిగా లేదు. ఆ గ్రామస్తులు ఆమెను ఒక చోట కూర్చోబెట్టి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.
కాని ఆమె వారితో మాట్లాడే పరిస్థితి లేదు. చుట్టూ గుమిగూడి వింతగా గమనిస్తున్న వాళ్ళందరిని దిక్కుతోచని స్థితి లో చూస్తూ ఉంది. మధ్య మధ్య లో కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంది.
“నేను ఆమెని ఎక్కడో చూసాను” అన్నాడు ఒక పిల్లాడు ఎదో గుర్తు కొచ్చినట్లు..
అందరు ఆ కుర్రాడిని ఆశ్చర్యంగా చూసారు.
"మన ఊర్లోకి కొన్నాళ్ళ క్రితం ఒక పెద్దాయన వచ్చాడు. గ్రామ పంచాయితీ వద్ద కుర్చుని తన సంచి లోనుండి ఫోటో కాపీలు తీసి చూయించాడు. కనిపిస్తే ఫోన్ చెయ్యమని వంచాయితి గోడ మీద ఫోన్ నెంబరు వేసాడు. ఆ ఫోటో లో ఉంది ఈమె అనుకుంటాను” అన్నాడు.
ఆ మాత్రం ఆధారం చాలు.
సాయంత్రానికి ఆఘమేఘాల మీద ఆ పెద్దాయన వచ్చేసాడు.
ఆవిడని చుసిన మరుక్షణం, మోకాళ్ళ మీద పడిపోయాడు. కళ్ళలో నీరు. కన్నీరు కాదు. పందొమ్మిది నెలలుగా గుండెల్లో గూడు కట్టుకున్న బాధ..
లేచి పరిగెత్తుకుంటూ ఆవిడ దగ్గరికి వెళ్లి ఆమెని కౌగలించుకున్నాడు. చిత్రంగా ఆమె అతని చుట్టూ చేతులు వేసింది.
ఆ దంపతులు కోలుకునే వరకు ఎవరూ మామూలు మనుషులు కాలేక పోయారు. కన్నీళ్ళతో అందరు ఆనందించారు.
***
ఆయన పేరు విజయకాంత్. ఆమె లీల. 2013 లో తీర్ధ యాత్రలకి ఉత్తరాఖండ్ వెళ్ళారు. అక్కడ వరదల్లో ప్రమాదవశాత్తు కొట్టుకుపోయిన వారిలో లీల ఒకరు. ప్రభుత్వం చనిపోయిన వారిలో ఒకరిగా ఆమెను కూడా ప్రకటించారు. కాని విజయకాంత్ కి ఒక పిచ్చి నమ్మకం. తన బార్య బ్రతికే ఉందని. ఆ రోజు నుండి ఆమె ఫోటో లు పట్టుకుని చుట్టూ పక్కల గ్రామాలన్నీ తిరుగుతున్నాడు. పందొమ్మిది నెలల తర్వాత అతని అన్వేషణ ఫలించింది. అతని నమ్మకం నిజమయ్యింది. వాళ్ళ ప్రేమ సజీవంగా మిగిలింది.
గ్రామస్తులందరి ఆతిధ్యం అందుకుని ఆ జంట ఇంటికి ప్రయాణం అయ్యారు.
నిజమయిన విశ్వాసం అనేది ఓటమి ఎరగదు. <౩ <౩ <౩

Thursday 1 February 2018

తాళం

బాగా రద్దీగా ఉండే ప్రాంతం లో ఉన్న ఇరుకయిన దారులతో ఉన్న చిన్న చిన్న షాపుల సముదాయం.
చెన్నై లో పారిస్ సెంటర్ ని గుర్తుకు తెస్తూ..
ఒక్క దుకాణం లో ఒక్కో రకం వస్తువులు.
కమర్షియల్ టాక్స్ ఆఫీసు లో పనిచేసే మాధవరావు ఆఫీసుకి కొత్తగా లీజు కి తీసుకున్న గోదాముకి  తాళాలు కొనటానికి వెళ్ళాడు. ఇస్మాయిల్ షాపు ఫేమస్ అని విని, ఫిక్షెడ్ రేట్లు కి   మన్నికయిన వస్తువులు దొరుకుతాయి అని వెతుక్కుంటూ వచ్చాడు.
ఆఫీసుకి అవసరం అయినవి కొని నెలాఖరు లోగా  కంటింజెంటు బిల్లు పెట్టుకుంటుంటాడు.  
రద్దీగా ఉన్న షాపు కి వెళ్లి తనని తానూ పరిచయం ఒక మెట్టు ఎక్కువగానే చేసుకున్నాడు.
నాణ్యమయిన తాళాలు మొత్తం ఎనిమిది తీసుకున్నాడు. కొత్తగా వచ్చిన మాగ్నెటిక్ తాళం ఒకటి చూయించాడు షాపులో కుర్రాడు. తాళం చెవి కప్పకి అంటించి ఉంచితే చాలు తాళం తెరుచుకునుంది. చీకట్లో తాళం తీయటం సులువు.
“ఇది ఒకటి ఇవ్వండి. ఊర్లో ఉన్న మా అమ్మ కి ఇస్తాను. ఆవిడ కి సులువుగా ఉంటుంది.”
ఒక పదినిమిషాల్లో అతని షాపింగ్ ముగిసింది. ఇస్మాయిల్ బిల్లు వ్రాయబోతుంటే.. “ఇరవై పర్సెంట్ రేటు ఎక్కువ కి బిల్లు తయారు చేయండి” చెప్పాడు మాధవరావు.
“మన్నించండి. అలా ఇవ్వను. ఎంత తీసుకుంటానో దానికే బిల్లు ఇస్తాను” పుస్తకం మూస్తూ చెప్పాడు ఇస్మాయిల్.
“నేను ఎవరో తెలుసా?” అడిగాడు మాధవరావు.
“అంతదూరం ఎందుకండీ? మా పద్దతి నచ్చకుంటే మరొ చోట తీసుకోండి.” ఇస్మాయిల్ సౌమ్యంగా చెప్పాడు.
పది నిమిషాలు వాదన జరిగాక మాధవరావు ఓడిపోయి బిల్లు చెల్లించి తాళాలు తీసుకుని వచ్చేసాడు.

మర్నాడు సెక్షన్ హెడ్ కి బిల్ల్స్, తాళాలు సబ్మిట్ చేస్తుంటే.. “ఓహ్ ఇస్మాయిల్ షాపు లోనా? క్వాలిటీ ఉంటాయి.” అన్నాడాయన.
“బిల్లు మనకి కావలసినట్లు ఇవ్వలేదు.” మాధవరావు అసంతృప్తిగా చెప్పాడు.
“ఆతను ఇవ్వడు. ఎథిక్స్ ఉన్న మనిషి. నాకు బాగా పరిచయం .. మా వీధిలో ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి తాళాలు కొనటానికి వెళ్ళినపుడు పరిచయం అయింది.”  మాధవరావుని చూస్తూ చెప్పాడు సెక్షన్ హెడ్.
“ఇంకో విషయం. దేవాలయాలకి, వ్రుద్దాశ్రమాలకి , మసీదులకి, స్కూల్స్ కి డబ్బు తీసుకోడు.”
మాధవరావు కి తను చాటుగా  తెచ్చుకున్న మాగ్నెటిక్ తాళం కి ఇస్మాయిల్ బిల్ ఎందుకు వేయలేదో అర్ధం అయింది.

#susri  01_02_2018

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...