Sunday 31 May 2015

పసుపుతాడు


నేను దిగిన బస్సు దుమ్ము లేపుకుంటు వెళ్లింది.
.
ఆ మట్టిబాట మీద నిలబడి సంచి బుజాన తగిలించుకుని చుట్టూ పరికించాను. .
అంతా నిర్మానుష్యంగా ఉంది. కొద్ది దూరంలో ఒక నేరేడు చెట్టు కింద ఒక పాక ఉంది.
బయట ఉంచిన ఒక చిన్న బెంచీ మీద నల్లటి యువకుడు ఒకరు టీ కాస్తు కనిపించాడు.
..
దూరంగా దేవాలయపు ద్వజ స్తంభం ఒకటి కనిపిస్తోంది. ..
చుట్టూ ఉన్న పచ్చటి పొలాలలో లేగ దూడలు రెండు ఆనందంగా గెంతు తున్నాయి.
రామాయపాలెం లో చాంతాడు చుట్టరికాపు అమ్మమ్మ ఒకావిడ ఉంది. .
రెండు సంవత్సరాల క్రితం బందువులతో వచ్చినపుడు మొదటి సారి చూశాను ఆవిడని.
చనిపోయిందని తెలిసి చివరి సారిగా చూడటానికి వచ్చాను .
నెమ్మదిగా ఆ పాక వద్దకు నడిచాను.
..
రామాయపాలెం ఎంత దూరం లో ఉంటుంది? ..
గతం లో ఒకసారి వచ్చినప్పటికి జ్నాపకం రాక అడిగాను .
.
అతడిని పరీక్షగా చూశాను . .
గతం లో ఎక్కడో చూశాను.
ఎక్కడ చూసానో జ్ణపకం రాలేవటం లేదు.
..
టీ చెప్పి సిగిరెట్టు ముట్టించి ఆలోచించ సాగాను . ..'
నిన్నేక్కడో చూసిన గుర్తు “ టీ గ్లాసు అందుకుని చెప్పాను.
..
నాకు గుర్తొచ్చారు జగ్గయ్య పేట లో లాడ్జి ఉండికదా మీకు “ సన్నగా నవ్వి చెప్పడతను...
..
అవును ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. ..
మా లాడ్జి చరిత్రలో అలాటి సంఘటన అదే ప్రధమం.
మరిచి పోలేని అరుదైన విషయం అది.
సంవత్సరము క్రితమనుకుంటాను .. తరచు ( తరచూ అంటే మామూల్లు లేటయిన ప్రతిసారి )
జరిగే పోలీసు దాడిలో ఈ కుర్రాడు మరొక ప్రౌడ తో పోలీసులకి చిక్కాడు.
.
అప్పటి ఎస్సై కి కాస్త కోక పిచ్చి ఎక్కువ ఉందని, .
పెళ్ళాం తరుచూ మంచం మీది నుండి తంతుందని ,
అలా తన్నిన ప్రతిసారి తన మోజు తీర్చుకోవటం కోసం దాడి కార్యక్రమాలు నిర్వహిస్తాడని వినికిడి.
..
అలాటి దాడిలో ఆ కుర్రాడు ఆమెతో దొరికి పోయాడు. ..
ఆమె నల్లగా తుమ్మ మొద్దులా ఉంది.
కానీ స్త్రీ తాలూకు సహజ మయిన సౌందర్యం మాత్రం ఆమెలో ఉన్నది .
కళ్ల నిండా మత్తు ఉంది.
..
ఎస్సై నాలుక తడుపుకున్నాడు...
..
దాన్ని స్టేషన్ కి లాక్కు రండి. అన్నాడు..
.
పోలీసులకి బొత్తిగా తెలుగు వ్యాకరణం రాదు. .
ముఖ్యంగా లింగ బేదం తెలియదు .
స్త్రీ లింగం బదులుగా నపుంసక లింగాన్ని వాడతారు.
అప్పటిదాకా వంగి మౌనంగా ఉన్న కుర్రాడు పెద్దగా అరిచాడు.
స్టేషన్ కి ఎందుకు .
"ఆ మె నా బా ర్య."
..
చదువు లేక పోయినా అతనికి పోలీసు జాతి గురించి చూచాయగా తెల్సినట్టుంది. ..
ఆ మాటల్కి యెసై కంటే ఆమే ఎక్కువగా కలవర పడింది.
తనని ఒక్క దాన్ని స్టేషన్ కు రమ్మన్నప్పుడు మౌనంగా అతడు జారుకుంటాడని అనుకుంది.
కానీ అతను అలా ప్రకటిస్తాడు అనుకోలేదు.
హటాత్తుగా అర్ధం కానీ భావం ఒకటి ఆమెని చుట్టుకుంది.
చీర కొంగు ని బుజం చుట్టూ కప్పుకుంది.
ని పేరు ఎంటిరా ? లాటీ తో తల పైకి లేపుతూ అడిగాడు యెస్ సై .
“రాజు “
రాజు .. అబ్బా బాగుందిరా. మరి దాని పేరు రాణా?
అవును
.
ఆ కుర్రాడి సమాదానానికి నాకు ఆశ్చర్యం వేసింది. .
ఆ ప్రౌడ తరచూ రకరకాల పేర్లతో దాదాపు మా లాడ్జి అన్నీ రూముల్లోనూ ,
అన్నీ రకాల మగాళ్ల తోను గడిపిండి.
నిజానికి ఆవిడ పేరు ఆవిడ కె తెలియ క పోవచ్చు.
..
నీ అమ్మ వయసు ఉంటుంది . ఇది నీ పెళ్ళామా?..
..
ఎస్సై అతడిని పక్కకి తీసుకెళ్ళాడు...
సహజంగా పోలీసు వాళ్ళు ఉపయోగించే టెక్నిక్ ఒకటి ప్రయోగించాడు.
“ నిన్న ఉదయం ఏమి తిన్నార్రా? “
ఇద్దరి వద్దా రెండు రకాల సమాదానాలు రాబట్టాక నా దగ్గరా మీ వేషాలు .
మక్కెళు విరుగుతాయి . అంటూ పోలీసు బాషలో తిట్టటం మొదలెట్టాడు సబ్ ఇన్స్పెక్టర్.
..
యెస్సై మాటలకి అడ్డు పడుతూ ఆ కుర్రాడు (రాజు ) ..
రెప్పోద్దుటే పెళ్లి చేసు కుంటున్నాం' అంటూ ఆమె చేతిని కానిస్టేబుల్ చేతిలోంచి గుంజాడు .
రేపటి దాకా ఎందుకు ఆ పెళ్ళే దో ఇప్పుడే చేసుకోండీ' అన్నాడు వెటకారంగా.
ఇద్దరు కానిస్టేబుళ్లని పురమాయించి పసుపుతాడు ,
పోటో గ్రాఫర్ ని పిలిపించాడు.
ఈ తతంగం అంతా నేను మిగతా వారితో కలిసి చూస్తూనే ఉండిపోయాను.
.నిమిషాల్లో పెళ్లి పూర్తి చేయించాడు టేప్ లో మంగళ వాయిద్యాలు వినిపిస్తూ..
మంచి పోటో ఒకటి తియ్యవయ్యా రెప్పొద్దుట పేపర్లో వేయిద్దాం.
..
ఈ వింత పెళ్లి విషయం...
..
తర్వాత వధూవరులను (?) అలానే విడిచి వెళ్ళి పోయారు పోలీసు బృందం. ..
అంతా నాటకీయంగా అరగంటలో పూర్తి అయ్యింది.
..
జేబులు కొట్టుకు బతికే వీడికి , ..
ఒళ్ళు అమ్ముకునే దానికి పెళ్లేమిటి ?
యెస్సై పిచ్చి కాక పోతే సాయంత్రానికి మామూలే'
విషయాన్ని తేల్చి చెప్పాడు మరో పెద్ద మనిషి.
..
సిగిరెట్టు చేతిని చురుక్కు ..మనిపించింది.
ఇహం లోకి వచ్చాను . అదే చివరి సారి చూడటం ఈ కుర్రాడిని.
ఆ తర్వాత రాణీ (నాకు తెలిసిన ఆమె చివరి పేరు ) తిరిగి మా లాడ్జి లో మకాం పెట్టలేదు .
ముఖం చెల్లలేదు కాబోలు . నాకు నవ్వొచ్చింది.
పెళ్లి చేసుకున్నావటోయ్? " మామూలుగా అడిగినా నా కంఠం లో వ్యంగ్యం ద్వనించింది.
"రాణీ" అంటూ పిలిచాడు అతను.
తడిక తొలగించుకుని ఒక స్త్రీ బయటకి వచ్చింది.
బాష రాని వాడిలా మూగ బోయాను.
గతం లో విటులని ఆకర్షించడానికి కట్టిన ఛీరకి ,
ఇప్పుడు ఒద్దికగా కట్టుకున్న నేత చీరకి చాలా బేధం ఉంది.
..
నుదుట రూపాయ బిల్లంత బొట్టు తో నిండుగా ఉంది. ..
నేను తేరుకోటానికి చాలా సేపు పట్టింది.
..
నన్ను చూసిన ఆమె ఒక్క క్షణం నుదురు చిట్లించి, ..
గుర్తు పట్టిన తర్వాత ఒక పలకరిపు చిరునవ్వు నవ్వింది .
ఆ నవ్వు నిర్మలంగా ఉంది.
..
వస్తానోయ్..' అని చెప్పబోయిన మాట
'వస్తాను రాజు' గా బయటకి వచ్చింది.
..
నా గొంతు నాకే వినిపించలేదు...
తిరిగి గాఢమయిన నిశ్శబ్దం నన్ను ఆవరించింది.
(కోస్తావాణి , రాజమండ్రి 1989)

Saturday 30 May 2015

వాళ్ళు


మా నాన్న గారు తాలూకా ఆఫీసు తాసిల్దారు గా పని చేస్తున్న రోజుల్లో
ఆయన గొడుగు మోయటానికి,
ఆయన తువ్వాలు ముట్టు కోటానికి,
ఆయన చెప్పులు తుడవటానికి పోటీలు పడే వాళ్ళు ___
..
ఇంటి ముందు డజన్ల కొద్ది వాహనాలు ,
రకరకాల మనుషులు నాన్నగారు తయారయ్యే బయటకు రాగానే
వంగి నమస్కరించడానికి రిహార్సిల్స్ చేసుకునే రోజుల్లో
ఆయనకి వాళ్ళకి మద్య చిల్లర పోగుచేసుకునే, వాళ్ళు __
..
మా ..మేనమామ పినతల్లి కోడలు బిడ్డ తాతగారి తమ్ముడు
వేలు విడిచిన ఆడబిడ్డ చిన బామర్ది స్నేహితుడికి
స్వయానా మేనమామ పినతల్లి సవతి బిడ్డ లాంటి
చుట్టరికాలు కలుపుకుని వంటింట్లో అంట్లు తోమి,
బజారు నుండి కూరగాయలు తెచ్చి,
వంటింట్లో తిని వరండా లో పడుకునే, వాళ్ళు ___
..
నన్ను మా చెల్లెల్ని బుజాన వేసుకుని వీపున ఎక్కించుకుని తిప్పి,
మేం సగం కొరికి వదిలేసిన బిస్కెట్టు ముక్కలు
చాటుగా దాచుకుని తినే , వాళ్ళు __
..
అటెండరు వద్ద నుండి హెడ్ గుమస్తాల వరకు
పైరవీలు చెప్పించుకుని పనులు పూర్తి చేయించుకునే, వాళ్ళు __
..
ఆయన గుండెజబ్బుతో మమ్మల్ని వీడిపోతే
శవం మోయటానికి కూలివాళ్ళ కోసం మా అమ్మ బజార్ణ పడితే
ముఖం చాటేసి చాటుగా వచ్చి సానుభూతి మాటలు చెప్పి
కల్లబొల్లి ఎడ్పులు ఏడ్చిన, వాళ్ళు __
..
మా చదువులకి సంద్యలకి ఉన్న సొమ్ము హరించుకు పోయి
అమ్మ ఉన్న పొలం అమ్మల్సి వస్తే, కమిషన్ తో ఇల్లు కట్టిన వాళ్ళు ___
..
పద్దెనిమిది సంవత్స్రాల శరీరాన్ని పన్నెండేళ్ళు దాటని చెల్లెల్ని
తీసుకుని దిక్కు తెలియని నేను వీదిన పడితే
వీది తలుపు తాళం వేసుకుని దొడ్డి త్రోవన తిరిగిన , వాళ్ళు __
..
నాలుగొందల రూపాయలకి పెద్ద దుకాణం లో..
రోజుకి పన్నెడు గంటలు సేల్సు గర్ల్ గా పనిచేస్తు ఉంటే
ఆ కొట్టుకొచ్చి ఇంస్టెంట్ కాఫీ పొడిని ,
కాశ్యునట్ పాకెట్లని కొనుక్కుని నన్ను గుర్తించని (?) వాళ్ళు __
..
వీడిన నడుస్తుంటే పోకిరి  కుర్రాళ్ళు ఈల వేస్తే..
కంట్లో ఆగే మేఘం వర్షించడాన్ని కర్చీఫ్ తో దాచేస్తుంటే
పక్కనే పోతూ పళ్లికిలించే వాళ్ళు __
..
ఎప్పుడో యే పండగ కో ఒకసారి గుర్తొచ్చి
పెద్దరికంగా పలకరిస్తే గుండెల లోని బాద కళ్ళలో వర్షిస్తే
“ ఊరుకోమ్మా __ యెడిస్తే పోయిన రోజులు వస్తాయా “
అంటూ తాకకూడని ప్రదేశాలు తాకే వాళ్ళు __
..
నన్ను ఏమిటో తెలుసుకుని, ..
నా బాద్యతలు చూసి జాలిపడి సానుభూతిగా ,
ప్రేమగా ,ఆప్యాయంగా మాట్లాడే అతనితో
ఎప్పుడయినా ఒక పది నిమిషాలు బజారులో
కలిసి నడిస్తే “తిరుగుబోతు” గా ముద్రించిన , వాళ్ళు __
..
నా ఒంటరి పోరాటానికి చేయూతగా నేనున్నానంటూ..
అతనే ముందుకొచ్చి చేతులు చాచి హృదయ గవాక్షాలు తెరిస్తే ,
అర్ధం కాక దైర్యం కోసం ప్రాకులాడితే ,
‘లేచిపోతావా’ అని సూటిగా అడిగిన, వాళ్ళు __
..
ఒంటరితనానికి భయపడి , వణికి ,..
స్వయంగా నిర్ణయం తీసుకుని ‘అతడి’ చేతిని అందుకుంటే,
కులం మంట కలిపావు కాదే బ్రస్టు రాలా అని వెలివేసిన , వాళ్ళు __
..
అంతా అయిపోయాక , ..
కడుపో కాలో వచ్చి ఉంటుంది టక్కున ఎవడో ఒకడిని తగులుకుంది.
పెళ్లి పెటాకులు చేయటానికి మేము లేమా?
అని చాటుగా గుండెలు బాదుకున్న, వాళ్ళు __
..
రేపు నా బిడ్డల్ని , విది గాలపు ఎరల్ని , ..
నా దేశపు అభాగ్యులని ,
గుచ్చి గుచ్చి చంపే ఈ శాడిస్టిక్ రాక్షసులయిన వాళ్ళు __
..
బఃగవంతుడా!! వీరి నుండి ఈ సమాజాన్ని రక్షించు తండ్రీ..

... :(  :(  :(
(కోస్తావాణి , రాజమండ్రి 1989 నా శ్రీమతి సుంకర రామాంజని పేరుతో )

Tuesday 26 May 2015

సున్నుండలు


ఎండాకాలం మద్యాన్నం మరో ఊర్లో పెళ్ళికి 
కుటుంబ సమేతంగా హాజరవటం అంటే సాహసమనే చెప్పాలి.
..
ఒంగోలు నుండి బాపట్ల బయలు దేరామ్ . ..
పది దాటింది.
అప్పటికే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు.
..
ఎప్పటిలాగే అందరం కారు ఎక్కినా మా ఆవిడ మాత్రం ఇంటి తాళాలు వేసి ,..
టెనెంట్స్ కి జాగర్తలు చెప్పి కారు ఎక్కడానికి అందరికంటే ఆఖర్ణ వచ్చింది.
వస్తూ అమ్ముల్ని వెంటబెట్టుకుని వచ్చింది.
..
అమ్ములు మా ఇంటి పైన అద్దెకుందే ముస్లిం కుటుంబలోని చిన్న పిల్ల ,..
పెద్ద కళ్ళు , కొద్దిగా పట్టి పట్టి చెప్పే తెలుగు తో ముద్దుగా ఉంటుంది.
రెండు జడలకి పూసల తో రిబ్బన్లతో చక్కగా అలంకారం చేసి ,
పాపిడి బిల్ల పెట్టుకుని లంగా పావడాతో వచ్చింది.
చేతిలో దాని సైజు హాండ్ బాగ్ కూడా..
..
అమ్ములు ఎక్కడికి ? అడిగాను నేను దాన్ని కారు ఎక్కిస్తుంటే ..
వాళ్ళ బాబాయి వాళ్ళింటికి , అడ్డ్రస్ ఫోన్ నెంబరు నేను తీసుకున్నాను .. ..
మీరు పదండి ఆలస్యం అవుతుంది.
..
అలంకరణ తో చేసిన ఆలస్యాన్ని కూడా మన నెత్తిన వేయటం లో ఆడావాళ్ళు దిట్ట.
అమ్ములు డ్రైవింగ్ సీటు పక్కనే కూర్చొబెట్టుకుని మేము హైవే ఎక్కాము ...
..
12.00 కి పెళ్లి. ప్రతిసారి పెళ్లి మిస్సవుతున్నాము . ..
హోటల్ కి బోజనానికి వెళ్ళినట్టు ఉంటుంది.
ఇవాళ కొంచెం ముందు వెళ్ళాలి “ వేగంగా వెళ్ళమని మా ఆవిడ చూచాయగా చెప్పింది.
..
75 కి మీ దూరం ఎంత లేదన్నా రెండు గంటల ప్రయాణం ,, ..
చీరాల బైపాస్ మీద వెళ్ళి నప్పటికి.
కార్లో ఏ‌సి ఆన్ అవగానే వెనుక గుండమ్మ పిల్లలు .. కబుర్లలో పడి పోయారు.
పెళ్లి వంటకాలు , చీరలు , గోదావరి జిల్లాల వారి పెళ్లి మర్యాదలు ,
కళ్యాణ మంటపాలు ,, అనేకం ..
..
హైవే ఎక్కి అయిదు కిలో మీటర్ల దూరం లోని త్రోవగుంట మలుపుతిరిగి సింగిల్ రోడ్డు ఎక్కుతుంటే .
అమ్ములు “ అంకుల్ చినగంజాం ఇదేనా?” అంది. ..
..
తెల్లగా పౌడర్ ఉన్న బుగ్గని తుడుస్తూ “లేదమ్మా ఇంకా 30 కిలో మీటర్లు ఉంది ..
చాలా దూరం అరగంట పట్టుద్ది “ చెప్పాను నేను.
..
మరో అయిదు కిలోమీటర్లు వెళ్ళాక చేకూరపాడు దాటేటప్పుడు ..
మళ్ళీ అడిగింది “ అంకుల్ చినగంజాం ఇదేనా? అని “
..
నేను నవ్వుతూ ..” ఇంకా చాలా సేపు పడుతుంది.నేను చెబుతాను నువ్వు నిద్ర పో “
వెనకాల ఉన్న మా వాళ్ళు పూర్తి బిజీగా మాట్లాడుకుంటూ ఉన్నారు .. ..
..
ఈ లోగా ఆఫీసు నుండి ఫోన్ .. ..
ఓవర్ హెడ్ టాంక్ వెరిఫిశేషన్ కి క్వాలిటీ కంట్రోలే ఈ‌ఈ
రేపు ఉదయాన్నే వస్తున్నారని సిద్దంగా ఉండమని “
అన్య మనస్కంగానే కారు తోలటం ప్రారంభించాను..
కారు చినగంజాం దాటి వేటపాలెం మీదుగా చీరాల బైపాస్ ఎక్కేటప్పటికి
వెనక సీట్లో మా గాంగ్ కూడా నిద్రపోయింది.
..
అమ్ములు సొంగ కార్చుకుంటూ నిద్ర పోతుంది.
చినగంజాం సంగతి గుర్తొచ్చింది.. అది దాటి 15 కి వచ్చేశాను .....
మరో 15 కిమీ వెళితే బాపట్ల వస్తుంది.
నా పరధ్యానన్ని నేనే తిట్టుకుంటూ ,
కారు వెనక్కి తిప్పి చినగంజాం వచ్చాను .
అప్పటికే 12.00 అవోస్తుంది.
..
పక్కనున్న అమ్ముల్ని తట్టి లేపి “చినగంజాం వచ్చింది నాన్నా” చెప్పాను
అది లేచి బుగ్గ తుడుచుకుని తన బాగ్ లోంచి ఒక ప్లాస్టిక్ డబ్బా తీసింది . ..
..
ఈలోగా మా ఆవిడ బాపట్ల వచ్చేశామా? అంది.
“లేదు సగం లో ఉన్నాం” చెప్పాను నేను. ..
..
“మా అమ్మ చినగంజాం వచ్చాక సున్నుండలు తిని , ..
వాటర్ తాగమంది అంకుల్ “ అమ్ములు డబ్బా మూత తీసి ఆ పనిలో పడింది.
..
“అమ్ములు వాళ్ళ బాబాయి , మనం వెళ్ళే పెళ్లి మండపానికి వచ్చి తనని తీసుకెళ్తానన్నాడు”
మా గుండమ్మ చెప్పింది. ..
..
నేను అయోమయంగా వెనక్కి ఒక పిచ్చి చూపు చూశాను ... frown emoticon frown emoticon



Sunday 24 May 2015

నమ్మోద్దు .. నమ్మోద్దు

మీనాకుమారి కారు డ్రైవింగ్ చేసుకుంటూ నెల్లూరు వెలుతుంది.
అటునుండి పవన్ కుమార్ కార్లో ఒంటరిగా వస్తున్నాడు.
..
వాళ్లూరమ్మ గుడి ముందు పాస్ ఓవర్ బ్రిడ్జ్ పనులు జరిగే చోట.
రోడ్డు ఒకే లేన్ మీద ఎదురెదురుగా వస్తుండటం తో చిన్న కొన్ఫూజన్ తో 
రెండు కార్లు ఒకదాన్ని ఒకటి డీ కొట్టుకున్నాయి.
..
కార్లు బాగా దెబ్బ తిన్నాయి కానీ అదృష్టవశాత్తు ఇద్దరు క్షేమంగా మిగిలారు.
డోర్లు తెరిచి పాక్కుంటూ బయట కొచ్చి ..ఇద్దరి తప్పు సమానంగా ఉందని గ్రహించి
ఒకరినొకరు పరిచయాలు చేసుకున్నారు.
..
."వాళ్లూరమ్మ తల్లి మహిమ గలది .
కాబట్టే కార్లు పాడయినా మనకేమి కాలేదు " మీనా కుమారి.
..
"నిజంగా ఆమె ప్రాణాలు కాపాడింది ." పవన్ కుమారు ఒప్పుకున్నాడు.
..
మన్నిద్దరం .. కలిసి మంచి స్నేహితుల్లా ఉండాలని తల్లి కోర్కె లాగుంది .
పవన్ మరో సారి తలుపాడు.
..
"గొప్ప ప్రమాదం నుండి బయట పడ్డాం . లెట్స్ సెలెబ్రేట్..
కారు అద్దాల లోంచి సాఫ్ట్ డ్రింక్ బాటిల్ తీసి
చూసారా .. ఈ బాటిల్ కూడా చెక్కు చెదర్లేదు "
మీరు సగం తాగండి . నేను తర్వాత " మీనాకుమారి సీసా అందించింది.
..
ఆమె అందమయిన సొట్ట బుగ్గల్ని చూస్తూ సగం పైగా తాగిన పవన్ కుమార్
" ఇది . సాఫ్ట్ డ్రింక్ లా లేదు.. వైన్ లా ఉంది. ఒకే మీరు తాగండి."
..
ఆమె సీసా మూత పెట్టి దూరంగా విసిరేసి ఫోన్ తీసి డయల్ చేసింది.
..
" హల్లో పోలీస్ స్టేషన్ .. వాళ్లూరమ్మ గుడి ముందు .. రెడ్ స్విఫ్ట్ ..కార్లో
30 కి మీ వేగం దాటకుండా వెళ్తుంటే..
ఎవడో తాగి ఫోర్డ్ ఫిగో కారు తో డాష్ ఇచ్చాడు..
నా కార్ కి ఇన్సూరెన్స్ కూడా లేదు"
నాకు స్పృహ తప్పెట్టు ఉంది. .
..
అతని పేరు పవన్ కుమార్ .
నెల్లూరు నేటివే ,స్టోన్ పేట నివాసి
జీన్స్ ఫాంటు మీద , వంగ రంగు చేక్స్ షర్ట్ వేసుకున్నాడు.
మొబైల్ నెంబరు 78 ------------821. ..
smile emoticon tongue emoticon

Saturday 23 May 2015

ఇంట్లో ఇంటర్నెట్

సాయంత్రం హోమ్ మంత్రివర్గ సమావేశం జరిగింది.
డాటా కార్డ్ తో పిసినారి తనంగా వాడుకునే ఇంటర్నెట్ స్థానే ..
కేబుల్ నెట్ కి మారాలా వద్దా అన్న విషయం మీద తీవ్ర వాదోప వాదాలు జరిగాయి.
..
ఆన్ లైన్ టెస్ట్ లు , ప్రేపరేషన్ , మెటీరీయల్ మొదలయిన వి
 విరివిగా వాడాల్సి రావటం తో మా పిల్లలు కావాలని ..
..
ఎక్కువగా నెట్ అందుబాటులో ఉండటం వల్ల అనార్ధాలు ,
పిల్లలు వాట్స్ అప్ వినియోగం , ఎవరి లోకం లో వారు ఉండటం,
ఒంటరి గా గడిపే నైజము ఎక్కువవుతాయని మా శ్రీమతి వాదన...
..
మొత్తానికి అరచేతిని అడ్డు పెట్టటం ఎవడి వల్ల కాదు కనుక అదీ ఈ వేసవిలో
కొన్ని అత్యవసర తీర్మానాలు చేశాం.. ఉభయకుశ లోపరిగా...
..
ఎట్టి పరిస్తితి లోనూ వైఫై వాడక పోవటం.
బెడ్ రూమ్ లో డస్క్ టాప్ ని హాల్లో కి మార్చడం.
కేవలం లాన్ ద్వారానే కన్నెక్ట్ అవటం.
అందరం నెట్ కోసం ఒకే సిస్టెమ్ వాడటం ..
..
తదుపరి బడ్జెట్ లో సవరణలు మీద చేర్చల్లో
న్యూస్ పేపర్ ఆపాలని , నెట్ లో అన్నీ పేపర్లు చదువుకోవచ్చు అని
పిల్లల వాదన...
..
పేపర్ మానేస్తే కుదరదని .. మద్యాన్నం పేపర్ చదివితే నే నిద్ర వీలవుతుందని.
మా ఆవిడ..
..
“ఇంకా పేపర్ ఎందమ్మా నువ్వు టాబ్ లో చదువు కొమ్మా .. అప్డేట్ అవ్వు “ మా వాడు
..
పేపర్ చదవడానికి, గాలి విసురుకోవటానికి, పిండి జల్లించు కోవటానికి..
చంటి పిల్లల వి శుబ్రమ్ చేయటానికి, ఆరామారాల్లో పరుచుకోటానికి.
వంటగదిలో తొక్కలు వేసుకోవటానికి... మా ఆవిడ చెబుతూనే ఉంది.
...
“నాన్న పేపర్ మాత్రం ఆపకండి,, అమ్మ పేపర్ తో బొద్దింకలని చంపుద్ది
టాబ్ తో ఆ పని చేసిందనుకో .. మన పని గోవిందా “ మావాడు
వోట్ ఆఫ్ థాంక్స్ తో  ముగించాడు.




Friday 22 May 2015

బ్యూటీ స్పాట్

సింధూర చంద్రశేఖర్  గురించి ఇంట్లో చెప్పినప్పుడు తండ్రి ఎగిరిపడ్డాడు.
ప్రేమలు దోమలు తమ వంశంలోనే లేవన్నాడు.
చదువు మాన్పించి ఇంట్లో ఉంచి తాళం వేస్తానన్నాడు.
తల్లి బావిలో దూకి చస్తానంది.
.
చెల్లెలు పావని ఒక్కతే మౌనంగా ఉండి పోయింది.
.
ప్రేమించిన యువకుడు గురించి ఓ ఆడపిల్ల చెప్పినప్పుడు
తల్లి తండ్రులు చేసే ఫార్సంత వాళ్ళు చేశారు.
.
చివరికి సింధురే గెలిచింది.
చంద్రశేఖర్ సధ్గుణాలు, అతని అయిదంకెల  
మంచి  ఉద్యోగం కూడా వారి ఓటమికి ఒక కారణం.
.
చంద్రశేఖర్ కి సాంప్రదాయపు వివాహం మీద సదాభిప్రాయం లేదు.
వారిద్దరి వివాహం ఈ ఆర్భాటం లేకుండా జరిగింది.
భర్త తో కలిసి సింధూర బెంగళూరు వెళ్లిపోయింది.
..

ఇది జరిగిన రెండు సంవత్సరాల తర్వాత,
.
పావని అక్కని చూడాలని మరీ మరీ వ్రాసిన మీదట సింధూర పుట్టింటికొచ్చింది. 
.
మనిషి బాగా మారింది.
శరీరచ్చాయ మెరుగుపడింది.
చీరకట్టు అందంగా మారింది.
స్స్లీవ్స్ పొట్టయిపోయాయి.
తలమీద కట్టుకున్న కొప్పు ఎయిర్ హోస్టెస్ ని గుర్తుకు తెస్తుంది.
వీటన్నింటికీ మించి ఆమె ఎడమవైపు చెక్కిలిమీద పెట్టుకున్న
 కాటుకచుక్క ఆమె మేక్ ఓవర్ కి  పరాకాష్ట.
.

రెండు రోజుల పాటు అక్క చెల్లెళ్ళిద్దరూ ఊరంతా తిరిగారు.
చిన్ననాటి కబుర్లన్ని చెప్పుకున్నారు.
.
సాయంత్రం భోజనాల సమయంలో తండ్రి చిన్నకూతురి వివాహ ప్రస్తావన తెచ్చిన్నప్పుడు
పావనీ చాలా అనీజి గా కదిలింది.
.
సముద్రపు ఒడ్డున కట్టుకున్న ఇసకగూడు మరెవరో నిర్ధాక్షీణ్యంగా పాడుచేస్తున్నట్టు.
 ఆ భావం సింధూర పసిగట్టింది.
.
భోజనాలయాక మేడమీద పడకలు పర్చుకున్నారు.
సింధూర ఏవో పుస్తకాలు వెతుకుతూ తీసింది.
పుస్తకం మధ్య దొరికిన కాగితం విప్పింది...
.
“వెలుతురు చీకటిని జయించే ప్రభాతవేళ
మన కలల జలతారుని నీలిరంగు కాగితం కప్పుకుని
కొండ చివరలనుండి జాలువారే మంచు క్రింద తడిచి తడిచి.....
ఆమె చప్పున ఉత్తరం క్రింద సంతకం చూసింది... రాఘవ..
.
 “పావనీ మేడమీదికొచ్చి చెల్లెల్ని పిలిచింది. ఏంటక్కా?
“ రాఘవ ఎవరు” సూటిగా అడిగింది. .
.
 పావనీ ఊహించినంత కలవరపడలేదు..
.
అసలు ఆమె ఆ విషయం మాట్లాడడానికే అక్కని మరీ మరీ రమ్మని పోరుపెట్టింది..
.
“మా కాలేజీ, ఫైనల్ డిగ్రే నసిగింది.
“ప్రేమించు కున్నారా? ఆస్పస్టంగా తలుపింది పావని.
.
“నీ వయసెంత? చెల్లెల్ని దగ్గరిగా తీసుకుంటూ సింధూర ప్రశ్నించింది.
”పద్దెనిమిది” ప్రేమించడానికి సరైన వయస్సు” సింధూర నవ్వింది..
.
ప్రేమంటే ఎమిటీ? ఏ ఉద్దేశంతో అతనిని ప్రేమించావ్
“ అందంగా ఉంటాడు. బాగా మాట్లాడతాడు.”.
.
పసిపిల్లలా మాట్లాడకు, కొద్దిగా చూడటానికి బాగుండి. 
చక్కగా మాట్లాడితే అది ప్రేమవుతుందా? ఇంఫాచ్యుయేషన్ అవుతుంది కానీ.
.
 అక్క గొంతులోని కోపాన్ని పసిగట్టి పావని మరేం మాట్లాడలేదు.
  సింధూర లాలనగా ముఖాన్ని చేతుల్లోకి తీసుకుంది.
ఆమె కళ్ళనిండా బెరుకు ..
.
రెండు హృదయాలు శూన్యంలో స్పృశించు కోవటం ప్రేమంటే ...
కదల్లో సినిమాల్లో చూపించి నంత గొప్పగా ఉండదు.
ప్రేమంటే భాద్యత .. అయినా చదువుకునే కుర్రడి ని చేసుకుని ఏమి చేద్దామని?
ప్రేమ కోరుక్కుతిని ఎన్నాళ్లు బతుకుదామని? 
చూడమ్మ ప్రేమ, స్నేహం లాటివి ఆర్ధిక పునాది మీద లేవాల్సిన గోడలు లాటివి ఆ ట్రాప్ లోకి  జారకు .
..
నన్నిలా డిజప్పయింట్ చేస్తావని అనుకోలేదు.’’ పావని  నెమ్మదిగా గొణీగింది...
..
ఇదేమాట అతడితో అనే అవసరం రాకుండా జగార్త పడమంటున్నాను...
అర్ధం చేసుకో ..అంతకుమించి తాను చెప్పటానికి ఏమీ లేనట్లు  
 సింధూర గొడవైపు తిరిగి పడుకుంది.
..
ఆ రోజే ఆమె ప్రయాణం...

 అక్కకి తోడుగా పావని కూడా స్టేషన్కోచింది.

 సింధూర కిటికీ పక్క సీట్లో కూర్చుంది. సింధూర చెల్లెల్ని దగ్గరకు పిలిచింది.
 “తొందరపడి రాఘవ విషయం లో ఒక నిర్ణయానికి రాకు”
 స్వేచ్చ అంటే బాద్యత. ప్రేమ వివాహాలలో  ముందడుగే కాని వెనకడుగు ఉండదు.
 ముందు ఆర్ధికంగా నిలదోక్కొని, అసలు మీ మద్య ప్రేమ ఉందో లేక
మీ పరిచయానికి అలా పేరు పెట్టుకొని గాబరా పడుతున్నారో తెలుసుకోండి.
రెండు మూడు సంవత్సరాల గడువిచ్చి చూడండి.
ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి.
అర్ధం చేసుకోవడానికి ఏకాంతాలు, శారీరక స్పర్శలూ అక్కర్లేదు.
ఒకరినొకరు గమనిస్తూ , ఉంటే చాలు.
వీటన్నింటికి మించి అతను నిన్ను ప్రేమిస్తున్నాడో లేక
నీ  వయస్సుని ప్రేమిస్తున్నాడో తెలివిగా తెలుసుకో ”
.
చివరి వాక్యం అంటున్నప్పుడు సింధూర కళ్ళు చమర్చాయి. క్షణం లో ఆమె సర్ధుకుంది..
.
 “ నీ బుగ్గ మీద ఆ బ్యూటీస్పాట్ బావుందక్కా. వాతావరణం తేలిక పరచడానికి పావని అంది.
“ పిచ్చిపిల్ల.. నీకు ఈ బ్యూటీస్పట్ ల అవసరం రాదనుకుందాం!
 నీ భర్తకి సిగరెట్లుతో కాల్చెంత సరదాలు ఉండవనే ఆశిద్దాం!! “
మనసు లోనే  అనుకుంది సింధూర..
.
అప్పుడే సింధూర చెంపమీదకి కన్నీటి చుక్క ఒకటి జారింది.
చెల్లెలికి ముఖం కనిపించకుండా సీటు వెనక్కి చేరగిలబడింది.
  రైలు బండి కదిలింది.

(పల్లకి వార పత్రిక .. 1990 )

44 డిగ్రీలు

మద్యాహ్నం NH-5 మీద ఒక ముప్పయి కిలోమీటర్లు ..
44 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత లో ప్రయాణం చేయడం
అదీ టు వీలర్ మీద చేయాల్సి రావటం ఎంత కష్టం.. frown emoticon
అందుబాటులో ఉన్న అందరినీ తిట్టుకుంటూ వస్తుంటే 
...
ఒక బ్రిడ్జ్ ఎక్స్ టెన్షన్ పని వద్ద అప్పుడు పవర్ డ్రీల్లర్ తో
సైడ్ కాంక్రీట్ వాల్ కూల్చి వేసే ఒక యువకుడి ని చూశాక
మాయమయ్యింది. బండిలో ఉన్న కూలింగ్ బాటిల్ లోని
నీళ్ళు అతని చేత తాగించాక, అతనిని చల్ల బడేదాకా బ్రిడ్జ్ కింద
ఉండమని చెప్పాక ..ఎండ తీవ్రత తగ్గినట్లు అనిపించింది.
..
స్వేదం చిదించే అతని వృత్తి దర్మాన్ని అభినందించాల్సిందే గాని
ఆరోగ్యం చాలా ఖరీదయిన విషయం అనేది కూడా గమనించాలి.
..
ఒక కుటుంబం ఒక జీవిత కాలం సంపాదన ని .
వారం లో హరించే కార్పోరేట్ ఆసుపత్రుల మద్య
మనం బిక్కు బిక్కు మని బతుకుతున్న విషయం
సదా మనం గుర్తుంచుకోవాల్సిన సత్యం.
..
జాగర్త like emoticon ..take care

Monday 18 May 2015

పాపి కొండలు

అందమైన గోదావరిమీద బోటులో ఉదయం 9-00 గంటలనుంచి సాయంత్రం 6-00 గంటలదాకా గడపటమంటే ఇష్టపడని వాళ్ళుంటారా? అయితే మీరు గోదావరి జిల్లాలోని పాపికొండలు చూసేవుంటారు. ఇంకా చూడలేదా అదేమిటండీ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ కొండలలో సగందాకా మునిగిపోతాయి.. మన రాష్ట్రంలో వుండి, కనుమరుగు కాబోతున్న ఈ అందాలను మనం చూసి ఆ ఙాపకాలను పదిలపరుచుకుని మన వారసులకు అందివ్వాలికదా. అయితే వెంటనే బయల్దేరండి.
రాజమండ్రిలో ఈ ప్రయాణానికి ఏర్పాటు చేసే టూరిస్టు అఫీసులు వున్నాయి. ఎ.పి. టూరిజం వారు కూడా ఏర్పాటు చేస్తారు. హైదరాబాదు నుంచి కూడా రిజర్వు చేసుకోవచ్చు. ఈ ప్రయాణం రెండు రకాలు. మొదటిది ఉదయం 7-30 కి బయల్దేరి మళ్ళీ రాత్రి 8-00 గం. కి తిరిగి వచ్చేది. ఇందులో వెళ్ళేటప్పడు గంటన్నర వచ్చేటప్పడు గంటన్నర బస్సు ప్రయాణం వుంటుంది. ఇది ట్రావెల్ ఏజెంట్సే ఏర్పాటు చేస్తారు. ఛార్జీలు టికెట్ లోనే కలసి వుంటాయి. టికెట్ ఒక రోజుకి మనిషికి 650 రూ.లు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం టీ కూడా ఈ టికెట్ ఖరీదులోనే లాంచీలో ఏర్పాటు చేస్తారు. స్నాక్స్, కూల్ డ్రింక్స్ లాంచీ కేంటీన్ లో కొనుక్కోవచ్చు. మరి రెండవ ప్రయాణం బాంబూ కేటేజీ లలో రాత్రి బస. మర్నాడు పిక్ అప్ .ఇది అన్నీ ఏర్పాట్ల తో కలిపి మొత్తం రెండు వేలు ఒక్కఒక్కరికి.
ఉదయం 7-30 కి రాజమండ్రి లోని .రైల్వే స్టేషన్ వద్ద మమ్మల్ని పిక్ అప్ చేసుకున్నా బస్ లో
బయల్దేరి 9-00కి పట్టిసం అనే వూరు చేరుకున్నాము. ( ఇక్కడ వీరభద్ర స్వామి ఆలయం చాలా ప్రసిధ్ధి చెందింది కానీ ఒక రోజు ప్రయాణంలో ఈ దేవాలయ దర్శనం లేదు. దీని కోసం కొంత దూరం పడవ ప్రయాణం తర్వాత కొంత నడక వుంటుంది.) జానికి రాముడు సినిమా చిత్రీకరణ ఇక్క జరిగినది ఆట. పట్టిసం రేవులో లాంచీలు సిధ్ధంగా వున్నాయి. మేము రిజర్వు చేసుకున్న భగీరధ అనే లాంచీ ఎక్కాము. 9-10 కి భగీరధ బయల్దేరింది. లాంచీ లోనే అల్పాహారం సర్వే చేశారు. . మేము పైన డెక్ మీదకెళ్ళి కూర్చున్నాము. గైడు ముందుగా ఆందరినీ పరిచయం చేసుకుంటూ మైకుతో సహా క్రిందా, డెక్ మీదా కలియ తిరిగుతూ హుషారు చెయ్యటం మొదలు పెట్టాడు. చుట్టుప్రక్కల ప్రదేశాల వివరాలు, విశేషాలు చెప్పటమేగాక కబుర్లు, జోక్సు, డాన్సులతో ప్రయాణమంతా హుషారుగా వుండేటట్లు చేశాడు.
నాసిక్ దగ్గర పుట్టిన గోదావరి 1600 కి.మీ.లు ప్రయాణంచేసి, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపూరు వద్ద సముద్రంలో కలుస్తుంది. ఈ రోజు గోదావరి మీద మా ప్రయాణం 65 కి.మీ.లు. రాజమండ్రి దగ్గర 5 నుంచి 6 కి.మీ.ల వెడల్పు వుండే గోదావరి పాపి కొండల మధ్య 200 నుంచి 500 మీటర్ల వెడల్పు మాత్రమే వుంటుందిట.
రామయ్యపేట దగ్గర పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదలయింది. గోదావరికి ఒక గట్టుమీద వున్న రామయ్యపేటనుంచి ఇంకో గట్టుమీద వున్న చిన్న కొండదాకా డామ్ నిర్మాణం జరుగుతుంది. ఇది పూర్తయితే 235 గిరిజన గ్రామాలు, పాపి కొండలు సగం 100 అడుగుల పైగా మునిగిపోతాయట. 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందటమేగాక విద్యుదుత్పాదన కూడా జరుగుతుంది.
కుడివైపు దెందూరు అనే గ్రామం దగ్గర లాంచీ మొదటి సారి ఆగుతుంది. ఇక్కడ గట్టుమీద వున్న గండి పోచమ్మ అమ్మవారి దర్శనార్ధం 15 ని. ల సమయం ఇస్తారు.
.ఇక్కడి నుండి అన్నీ సెల్ సిగ్నల్స్ మాయం అవుతాయి . కేవలం కేమారాలు గా మారి పోతాయి. అందరూ ఈ విషయం గురించి జాగర్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
దైవ దర్శనం తర్వాత సినిమా కబుర్లు. గట్టు మీద కనిపించే పూడిపల్లి అనే వూళ్ళో పల్లెటూరు వాతావరణం వున్న సినిమాలు తీస్తారుట. త్రిశూలం సినిమాలో రావు గోపాలరావు ఇల్లు గట్టుమీద కనిపిస్తుంది. ఇంకా అందాల రాముడు, ఆట, ఆపద్బాంధవుడు, ఇలా ఎన్నో సినిమాలు అక్కడ రూపు దిద్దుకున్నాయి. తర్వాత దేశ భక్తి, చరిత్ర. అల్లూరి సీతారామరాజు చరిత్రలో వినిపించే దేవీ పట్నం లోని పాత, క్రొత్త పోలీసు స్టేషన్లను చూస్తాం. గట్టు మీద కనిపించే రెండు గులాబీ రంగు భవనాలు కొత్త పోలీసు స్టేషను, క్వార్టర్లు .. వాటి మధ్య కనిపించే పాత పెంకుటిల్లు బ్రిటిషు కాలంనాటి పాత పోలీసు స్టేషను.
దేవి పట్నం వద్ద లాంచీ లో సెర్వ్ చేయటానికి బోజనాలు లాంచీ లోకి తెస్తారు.
కొండ మొదల అనే ఇంకో గ్రామం గురించి గైడు చెప్పిన సంగతి వింటే వెంటనే ఆ వూరు వెళ్ళాలనిపిస్తుంది కానీ అక్కడికి వెళ్ళటానికి రోడ్లు వగైరాలేమీ లేవు. ఇంకో విశేషం అక్కడ ఏమైనా కొనుక్కోవాలంటే ఇప్పటికీ బార్టరు సిస్టమే అంటే వస్తువులిచ్చి పుచ్చుకోవాల్సిందేగానీ, మీ డబ్బులక్కడ చెల్లవు.
ఇంత వెనుకబడిన గ్రామం తర్వాత వచ్చేది కొరుటూరు. ఇక్కడ ఎ.సి. నాన్ ఎ.సి. కాటేజస్ వున్నాయి. కావాలంటే ట్రావెల్స్ వాళ్ళని అడగండి.
ఇన్ని గ్రామాలను గురించి తెలుసుకుంటూ లాంచీలో జరిగే నాట్య ప్రదర్శనలు తిలకిస్తూ పాపికొండలు చేరేలోపల భోజనాలు పూర్తి చేశాము ఆ అందాలను గుండెనిండా నింపుకోవటానికి ఏ ఆటంకమూ వుండకుండా.. ప్రకృతి సోయగాలను ఇనుమడింపచేసి చూపించటానికి వరుణదేవుడు మద్యాహ్నం పలకరించి వెళ్ళాడు.. వానలో తడుస్తున్నా ఆ అనుభూతులెక్కడ కోల్పోతామోనని చాలామంది డెక్ మీదే వుండిపోయారు .
ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లో బాగంగా, ఒక వృద్ద జంట కి మళ్ళీ పెళ్లి , యవ జంటలతో , దూయట్లు, నడివయస్కులకి పాప్ సాంగ్స్, పిల్లల తో లుంగీ డాన్స్ లతో బాగా ఆహ్లాద పరిచారు. చుట్టూ ఉన్న అందాల తో పాటు. ముగ్గురు డెన్సర్ లు చేసిన హింది సాంగు కి నృత్యం అద్భుతం.
మా తరువాత మజిలీ పేరంటపల్లి, శ్రీ రామకృష్ణ మునివాటము అందులోని శివాలయం. లాంచీలో గైడు ముందే అక్కడ పాటించాల్సిన నియమాలు చెప్పాడు. గిరిజనులచే నిర్వహింపబడుతున్న ప్రదేశమని, అక్కడ వారికి సహాయం చేసే ఉద్దేశ్యం వుంటే ఆశ్రమ ప్రచురణలు కొనాలి తప్ప వేరే డబ్బు, వస్తువులు ఇస్తే వాళ్ళు చాలా బాధపడతారని. ఆ ఆలయం చాలా శక్తివంతమైనదవటంవల్ల అక్కడ తగుమాత్రమే మాట్లాడాలి అదీ మంచిమాటలే. ఇక్కడ పూజారి వుండడు, పూజకు సంకల్పం కూడా ఎవరూ చెప్పకూడదు. సంకల్పం వల్ల సూర్య చంద్రాదుల సాక్షిగా కోరికలు వెలిబుచ్చటమవుతుంది. జన్మ రాహిత్యానికి ఈ సంకల్పము ప్రతిబంధకమని ఇక్కడ నమ్మకం. దేవునికి ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు పూజ చేసుకోవచ్చు. నైవేద్యం మాత్రం ఆశ్రమంలో వండిన పదార్ధాలే పెట్టాలి. శుచి, శుభ్రత కోసం. పాలు, పళ్ళు, కొబ్బరికాయలు, ఎవరి ఇష్టం వారిది. అయితే వాటిని వినియోగించే బాధ్యత కూడా వారిదే. ఈ దేవాలయం చేరుకోవటానికి కొంచెం దూరం కొండమీదకి ఎక్కాలి. ఇక్కడ మాకిచ్చిన సమయం అర్ధగంట.ట్రైబల్ మహిళలు చేసిన వెదురు బొమ్మలు కొనకుండా అక్కడ నుండి రావటం కుదరదు అంతా అద్బుతంగా ఉంటాయి మీరు కొనలేదు అంటే రవాణా కష్టం గురించే. పాకింగ్ కి సరైన ఏర్పాట్లు ఉంటే అమ్మకాలు బాగా పెరుగుతాయని పిస్తుంది. దేవాలయానికి వడ్డాణం లాగా కొందలనుండి ప్రవహించే జలపాతం లో ఫోటోలు తీసుకోకుండా మనం అక్కడి నుండి కదలలేము.
ఇక్కడనుంచి మధ్యాహ్నం 2-45 కి తిరుగు ప్రయాణం మొదలు పెట్టి సాయంత్రం 3-30 కి కల్లూరు ట్రైబల్ విలేజ్ చేరాము. మమ్మల్ని అక్కడ దించిన భగీరధ మర్నాడు అదే సమయానికి పిక్ అప్ చేసుకుంటామని చెప్పి మమ్మల్ని అంధరిని దించి వెళ్లారు.
హోలీ మొదలయ్యింది.................ఇంకా ఉంది.

విమానం హైజాక్

బోయింగ్ 373 విమానం హైజాక్ అయ్యింది.
యదావిదిగా అటూ.. ఇటూ.. తిరిగి కాందహార్ లో దిగింది.
వారం పాటు ఎయిర్ పోర్ట్ లో సందడే.. సందడి. ..157 మంది ప్రాణాలు 
ప్రపంచ మీడియా అంతా అక్కడే ఉంది...
..
వాళ్ళడిగిన నలుగురు గడ్డపాళ్లని వదలలా వద్దా
 అని మోడి జీ హిందీ లో ఆలోచిస్తుంటే .. 
ఆయన చెవిలో దూది ఉండలుంటాయని తెలీని cbn సలహాలిస్తున్నాడు.
పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు రాటానికి ..

నున్నంగా ఉన్న గడ్డం ..చింపిరిగా ఎలా మారాలి
అనే విషయం మీద మేకప్ ఆర్టిస్టులని సంప్రదిస్తున్నాడు.

..
తెలుగు ఛానెల్స్ రోడ్ల మీద పది ఎవడిని బడితే వాడిని ఇంటర్వ్యూ లు చేస్తున్నారు.
హటాత్తుగా సుబ్బారావు తెర మీది కొచ్చాడు.
" ప్రయాణికుల ప్రాణాల్ని పణంగా పెట్టాయినా సరే .. ..

దేశ ద్రోహుల లని మాత్రం వదల కూడదు. 
అని అనర్గళంగా అయిదు నిమిషాలు మైకు వదలకుండా మాట్లాడి 
చివర్లో వందేమాతరం . అంటూ అరిచాడు.
..
చుట్టూ జనం చప్పట్లు కొట్టారు ...

..
ఫోన్ ఇన్ కార్యక్రమంలో బాగంగా స్టూడియో నుండి ఒక బందీ తాలూకు బందు వొకరు ..

లైన్ లోకి వచ్చారు. సుబ్బారావు మనీషా? మృగామా? , 
బాద్యత లేకుండా ఆ స్టేట్మెంట్లు ఏమిటి. 
ఆయన బందువులు ఎవరయినా విమానం లో ఉంటే తెలిసేది ఆ బాద ." 
గయ్యిమన్నాడు ఫోన్ లోనే.
..
సుబ్బారావ్ వేదాంతి లాగా నవ్వాడు...

..
" పిచ్చి వాళ్ళారా , నా బందువులు లేరని ఎవరన్నారు ?..

మా ఆవిడ అందు లోనే ఉంది . మా అత్త కూడా ఉంది.
 ఉంటే మాత్రం దేశ ద్రోహులని విడవటం కంటే మనమే
 ఆ విమానాన్ని పేల్చడం ఉత్తమం. 
వందే మాతరం .. వందే మాతరం " 
కేకలెట్టాడు సుబ్బారావు.
 tongue emoticon tongue emoticon tongue emoticon

రెండు పిలకల పొట్టి పిల్ల

ఆ రెండు పిలకల పొట్టి పిల్ల అంటేనే నాకు కచ్చ...
దొంగముఖంది. దాని చూపంతా నా వైపే .
మానాన్న పనిచేసే స్కూల్లో రెండో పంతులి కూతురు ఇక్కడ నా క్లాస్ మేట్.
చిటుక్కు మంటే చాలు నేరుగా మా పంతులు గారికి పితూరీలు.
.
మొన్నటికి మొన్న వెనక బెంచీ లో వెంకట్రావు గాడి పక్కన కూర్చున్నానా
దీనికేందుకు. మాకు మాకు అనేకం ఉంటాయి.
వాడు మాత్స్ లో కొంచెం వీకు.
కొత్త లెక్కల మాస్టారు తేడా వస్తే బెత్తం తో ఎముకలు లెక్క బెడుతున్నాడు.
పాపం వెంకట్రావు కి ఏదో మాట సాయం ,
పంతులు క్లాసు మధ్యలో పాటం ఆపి ఏదో అడుగుతాడు.
పసిబిడ్డ వెంకటరావు కొంచెం అందిస్తే అల్లుకుపోతాడు.
అయినా నాకు లేని అబ్యంతరము ఆ రెం. పి. పో. పి. కి ఎందుకుట?.
.
సార్ రోశయ్య పంతులు గారి అబ్బాయి (మనమే) వెనక బెంచీలో కూర్చున్నాడు సార్..
వెంకట్రావుకు అందిస్తున్నాడు సార్.... చెప్పనే చెప్పింది. దొంగ ముఖం ది.
.
దీనికేం తెలుసు వెంకట్రావు గాడి సంచీలో ఉన్న సజ్జ బూరెల రుచి.
కొత్త పంతులు కేం తెలుసు.
ఏ మాట కా మాటే గాని వాళ్ళ అమ్మ ఏంచేసిగా రుచిగా ఉంటాయి.
ఒక్కసారి రుచి చూశారంటే
కొత్త పంతులు కూడా వెనక బెంచిలో వెంకట్రావు పక్కన కూర్చోవాల్సిందే..
.
"రేయ్ (ఇదీ మనన్నే) ఇటు రారా ... నువ్వు వెనక ఎందుకు కూర్చున్నావు ?"
"సార్ వెంకట్రావు రోజు వెంకటప్పయ్య బోండాలు తెచ్చి , శీను కు (ఇదీ మనమే) పెడతాడు సార్..."
ల మ్డీ కాణ ముచ్చు లాగా ఉంటది. అన్నీ కనిపెట్టింది. పోలీసు కుక్క ముక్కు దీనిది ..
..
ఇంత జరిగాక కొత్త పంతులు ఊరుకుంటాడా ?
ఇద్దరి ఎముకలు కలిసి లెక్క పెడుతుండగా పాసు బెల్లు మోగింది.
.
మనసు కుతకుత లాడుతుంది.
దీన్ని రెండు జాడలు పట్టుకుని వంచి నా సామి రంగా దబీ.. దబీ ..
దబీ దబీ.. దబీ.. దబీ ..దబీ దబీ.. దబీ.. దబీ ..దబీ దబీ.......
.
లాబం లేదు.
ఏదో ఒకటి చెయ్యాలి .
.what to do ?
క్యా కర్నా?
.
బ్లేడు తో దాని పుస్తకాల సంచి కాడలు కోస్తే?..
.దాని కారేజి గిన్నె వంగదీస్తే?
దాని జామెట్రీ బాక్స్ చెట్లలో విసిరి పడేస్తే?
కొత్త పుస్తకాల అట్టలు చించేస్తే.?
.సంచి నిండా మట్టి పోస్తే ?
సం థింగ్ మస్ట్ బి డన్........
.
జేబులో చెయ్యి పెట్టా..
బ్లేడు ముక్క చుట్టిన కాగితం ఉండ,
ఒక పది పైసల బిల్లా?
దేనిని ఎలా ఎప్పుడు వాడాలి...
.
పాసు బెల్లు కొట్టి పదినిమిషాలయింది.
పుల్ల ఐ సు బండి చుట్టూ పోగయిన పిల్లలు తగ్గిపోయారు.
మంచి మంచి ఐస్ లు అయిపోయాక కరిగిన ఇసులు అమ్ముకునే పనిలో ఐస్ బండబ్బాయి.
.
అప్పుడొచ్చిందా ఆలోచన..
గబగబా వెళ్ళి 10 పైసలకి మూడు ఇసు లిస్తావా అడిగాను.( పుల్ల ఐస్ ఒక్కోటి 5 పైసలు )
కొంచెం కరిగిన మూడు ఐస్ లు ఇచ్చాడతాను.
ఒరేయ్ వెంకట్రావ్ .. వాడిని పిలిచి ఒకటిచ్చాను.పరిచయాలు నిలుపుకోవడం ఎలాగో
అప్పట్లోనే తెలిసిన వాడిని
“ పొట్టి దాన్ని వదలనురా...” .వాడి తో చెప్పాను.
.
"ఒరేయ్ పాసుబెల్లు తర్వాత తెలుగు పంతుకు క్లాసు రా .
ఆయన చెయ్యి మందం తెలుసుగా?" ఐస్ తింటూ హెచ్చరించాడు. వెంకట్రావు...
రెండో ఐస్ గబ గబా కొరికి తినసాగాను.
.
&&&
.
లోపలి బెల్లు కొట్టారు.
అప్పుడే వచ్చినట్టు నటించడాని చివరగా క్లాసు లో కెల్లా.
.
తెలుగు పంతులు లావుగా పొట్టిగా పంచే కట్టుకుని ఉంటారు.
అద్బుతంగా పాటం చెబుతారు. అంతే అద్బుతంగా వీపు వాయిస్తారు.
నిన్న ఎంత వరకు పాటం చెప్పాను? అందరూ నోట్సులు తియ్యండి.
.
నేను గ్రామ దేవతలందరిని పూజించసాగాను.
కానీ నేను పూజిస్తున్న విషయం వారికి తెలిసే లోపే....
.
ఆ రాకాసిది పెద్దగా కేక పెట్టింది. కరిగిన ఐస్ పుల్ల పట్టుకుని చూపిస్తూ
" సార్ నా నోట్స్ లో ఎవరో ఐస్ పెట్టారు అంది."
.
" ఎవర్రా అది .".హుంకరించాడు ఆయన.
.
లమిడిఖానా అదే పుళ్ళతో నావైపు చూపింది.
.
రేయ్ ఇలారా.. నువ్వేనా?
తప్పు చేసేవాడిని కానీ అబద్దం ఆడే వాడిని కాదు. ...
.
.” నేనే సర్..”
.
మా మాస్టారు ఒక్క రెండు నిమిషాలు నేను చెప్పేది వింటే
నా శిక్ష తగ్గించు కునే వాడిని కానీ
ఆయన ఆ అవకాశం ఇవ్వలేదు.
.
అంతా ఐమ్యాక్స్ లో 150 టిక్కెట్టు పెట్టి మహేశ్ బాబు కొడితే
నేలకికరుచుకుని లేచి నిలబడ్డం, ఇప్పుడు చూశారు గాని
నా క్లాస్ మిత్రులు అప్పుడే చూశారు.
(1977-78 ప్రాంతాలలో మద్దిపాడు కడియాల యనాదయ్య ప్రబుత్వ కళాశాల
లోని తెలుగు మాస్టారి వేలి ముద్రలు కావల్సిన వారు
ఇప్పుడైనా నా వీపు మీద సేకరించు కోవచ్చు)

నేర్పు లేని ఓర్పు

ఇంకా చాలా యేళ్ళ క్రితం.
ఒక సాయంత్రం . ఇదారేళ్ళ నేను పదేళ్ళ అక్క ఇంట్లో ఉన్నాం.
మద్దిపాడు లో ఒక పాతబడ్డ పెంకుటింట్లో ఉండేవాళ్లం.
.
పేడతో అలికిన మట్టి ఫ్లోరింగు,
సుమారు గా రోడ్డు మట్టం లోఉన్న పునాది తో మూడు గదుల ఇల్లు.
ఇంటి ముందు, వెనక పెరట్లో మాత్రం స్థలం ఉండేది.
పెరట్లో ఆలనా పాలన లేని చోటు తో,
పక్క ఇంటికి మాయింటికి మధ్య నున్న మట్టి కాంపౌండ్ గోడలు
పాక్షికంగా కూలిన మట్టితో కలసి అస్తవ్యస్తంగా ఉండేది.
.
హోరున వర్షం. ఆకాశం చిల్లి పడ్డట్టు.
నాన్న ఇంట్లో లేడు.
అమ్మ పొగాకు గ్రేడింగ్ కి వెళ్ళింధి.
(దగ్గర్లో NH_5 కొస్టాలు వద్ద నవభారత్, iltd, మొదలైన పొగాకు ట్రేడింగ్ కంపనీలలో పొగాకు ట్రేడింగ్ చేయడానికి నెలవారి మహిళా కూలీలు ఉంటారు.)
అమ్మ వచ్చేసరికి ఇంకా లేటు అవుద్ది.
పెరడు వంటగది ని దరవాజ గడప, కొద్దిగా వంపు తిరిగిన మట్టి కట్ట వేరు చేస్తుంటాయి.
.
వర్షం ఇంకా కురుస్తూనే ఉంది.
.
గడప కింద ఉన్న తూము నుండి సన్నగా నీరు వంటగదిలోకి వస్తుంది.
కరెంటు పోయింది.
సెమీ చీకటి.
అక్కకి నాకు ఒకటే కంగారు ..
క్రమీనా నీరు పెరిగింది.
వంటగది అంతా నిండుతున్నట్లు అనిపించింది.
.
యేదో ఒకటి చెయ్యల్స్లిన సమయం వచ్చింది.
అక్క నేను చెరో పళ్ళెం తీసుకున్నాం.
వంట గది తలుపు తీసి పళ్ళెం తో నీళ్ళు ముంచి మట్టి కట్ట మీదుగా
వీలయినంత దూరంగా పెరట్లోకి విసరటం మొదలుపెట్టం.
అప్పటికి మా వివేకం అంతే..
పెరడు లో నుండి నీరు దర్వాజా తూము నుండి తిరిగి వంట గదిలోకి వస్తూనే ఉంది.
కానీ గమ్మత్తుగా నీటి మట్టం పెరుగుతూనే ఉంది.
మేం భయం భయం గా విరామం లేకుండా అలా చేస్తూనే ఉండిపోయాము.
.
అమ్మ వచ్చింది..
.
వస్తూనే బురద పూసుకున్న మా ఇద్దర్ని ప్రేమగా చెరోటి వడ్డించింది.
గడప తుముకి ఒక గుడ్డ ఆడ్డం ఉంచింది.
అదే పళ్ళెం తో గబాలున నీరంతా నిమిషాల్లో ఖాళీ చేసి తలుపు వేసింది...
.
నా జీవితం లో అమ్మ దగ్గర నుండి నేను నేర్చుకున్న మొదటి గొప్ప పాటం.
( నాకు గుర్తు ఉన్నంతవరకు)
.
నేర్పు లేని ఓర్పు విజయం వైపు మనల్నివేగంగా నడిపించలేదు..

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...