Monday, 4 June 2018

శెలవు.

బ్లాగ్ లో ఇక వ్రాసే ఉద్దేశం లేదు. శెలవు. 

Sunday, 13 May 2018

అమ్మ అబద్దం ఆడింది.

నాకు మెలుకువ వచ్చేసరికి అమ్మ ఏడుస్తూ ఉంది. నాన్న అమ్మ జుట్టు పట్టుకుని ఉన్నాడు.
తమ్ముడు నిద్ర పోతూ ఉన్నాడు. రోజూ లాగే ..
“అపార్ట్ మెంట్ లో ఆరిల్లల్లో పని చేస్తావ్? డబ్బులు అడిగితె లేవంటావే?”
“ఇంట్లో ఎచ్చాలు కొన్నాను. పిల్ల బడి లో కట్టాను. ఇంకేం మిగల్లేదు”
“నువ్వు ఎప్పుడు నిజం చెప్పావే?”
ఇద్దరు కాసేపు పెనుగులాడుకున్నారు. అమ్మ ఏడుస్తునే ఉంది నాకు మళ్ళీ నిద్ర పట్టింది.
**
ఉదయం మెలుకువ వచ్చే సరికి అమ్మ పంతులమ్మ వాళ్ళ ఇంట్లో పని చెయ్యటానికి వెళ్ళింది.
నాన్న లేటుగా లేచి అటో రెడి చేసుకుంటున్నాడు. తమ్ముడు నాన్న పక్కన చేరాడు.
నాన్నా నేనూ నడుపుతా అన్నాడు. నాన్న డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి హరన్ కొట్టించాడు.
వాడు మురిసి పోయాడు. “నాకు విమానం బొమ్మ కావాలి” రోజు లాగే అదే ప్రశ్న.
“విమానం బొమ్మ ఇవాళ తెస్తాను” నాన్న బయలు దేరాడు.
**
స్కూల్ వర్క్ లు పూర్తి చేసుకునే సరికి అమ్మ వచ్చేసింది. తమ్ముడికి స్నానం చేయించింది.
అప్పటికే నేనూ రెడి అయి ఉన్నాను. పంతులమ్మ వాళ్ళ ఇంట్లో తెచ్చిన పచ్చడి తో అన్నం కలిపి ఇద్దరికీ పెట్టింది.
బాబూ ని జాగర్త గా తీసుకెళ్ళు అని మమ్మల్ని స్కూల్ కి పంపింది. తిరిగి మరో ఇంటికి పని చెయ్యటానికి పరిగెత్తింది.
**
సాయంత్రం ఇంటికి వచ్చి ఆడుకుంటుంటే అమ్మ పిల్చింది.
“బాబూ .. నాన్న నీకు విమానం బొమ్మ తెచ్చాడు” అంది
బులుగు రంగు విమానం తెల్లటి రెక్కలు ఉన్నాయి. తమ్ముడి సంతోషం పట్టలేకుండా ఉంది. అప్పటికి అప్పుడు ఒక తాడు కట్టించాడు.
'డుర్రు' మని దానిని అటో లాగా నడపటం మొదలెట్టాడు.
వెనక ఒక చక్రం ఊడి పోయి ఉంది. పంతులమ్మ వాళ్ళ అబ్బాయి దగ్గర ఇలాటివి చాలా ఉన్నాయి. అచ్చు ఇలాటిదే...
అమ్మ ఈ విమానం బొమ్మ నాన్న తెచ్చాడని ఎందుకు చెప్పిందో నాకు తెలీదు.

అమ్మ అబద్దం ఆడింది.
Happy mothers day.

Sunday, 22 April 2018

పరిష్కారం.

నిశబ్దం గా ఉన్న చల్లటి గదిలో కూడా ఆమె మాట డాక్టర్ సౌజన్య కి వినబడలేదు
.
“మళ్ళీ చెప్పండి” అంది.

“రెండో బిడ్డ వెంటనే వద్దని నేనూ మా వారూ అనుకుంటున్నాం. పాపకి ఇంకా ఏడాది నిండలేదు. తన తోనే నిద్ర చాలటం లేదు. ఇంకా ఇప్పుడు రెండో సారి అంటే.. “

డాక్టర్ సౌజన్య పేషంటు తాలూకు గత నెలలో US లో చేయించిన రిపోర్ట్స్ చూసి ఉంది. డబుల్ మార్కర్ టెస్ట్. అడ్వాన్స్డ్ సైన్సు రిపోర్ట్స్ అవి.
జేనెటికల్ గా ఏమైనా సమస్యలు, లేదా అంగవైకల్యాలు ఉంటె ఆ పరీక్షలో స్పష్టంగా తెలుస్తాయి.

దాంతో పాటి గర్బం లో శిశువు ఫేమేల్ బేబి అనేది కుడా (ఇండియా లో రిపోర్ట్ లో చెప్పటం నిషేధం) రిపోర్ట్ లో ఉంది.

“మీరు ఎక్కడ ఉంటారు.?”

“US లో ఉండేవాళ్ళం ఈ వారమే ఇండియా కి మూవ్ అయ్యాం. ఇక్కడే హైదరాబాద్ లో ఉంటాం.”

“మీతో ఎవరు వచ్చారు.”

“మా హస్బెండ్. బయటే ఉన్నారు.”

“పిలవండి”

సన్నగా బట్టతలతో సుమారుగా నలబై ఏళ్ల వయసు ఉన్నతను లోపలి వచ్చాడు. అతని బుజం మీద ఒక పాప ఉంది.

ఏడాది నిండిన వయసు. మరీ చిన్నపిల్ల అని తనకి అనిపించడం కోసం బుజం మీద ఎత్తుకున్న్టట్లు డాక్టర్ గ్రహించింది.

“మేము ఇది ఉహించలేదండి. రిమువ్ చేయించుకుందామని నిర్ణయించుకుని మీ దగ్గరకి వచ్చాం.”

ఒక రకమయిన బ్రతిమాలె దోరణి లో వాళ్ళిద్దరూ ఆమెని కన్విన్సు చెయ్యటానికి ప్రయత్నించారు.

“ఇఫ్ ఐ యాం రైట్. యు బొత్ అర్ వెల్ ఎడ్యుకేటెడ్. వై డింట్ యు టేక్ కేర్”

వాళ్ళిద్దరి ప్రవర్తన చూసాక, పది నిమిషాలు మాట్లాడాక డాక్టర్ కి వాళ్ళ వ్యతిరేఖత రెండో బిడ్డ మీద కాదు ‘రెండో ఆడబిడ్డ’ మీద అని అనుభవం తో గ్రహించింది.

డాక్టర్ గా అనేకం చూసినా ఆమెకి బాధవేసింది.
ఇంకా సమాజం లో ముసుగు లు ఉన్నందుకు.

రెండు నిమిషాలు తటపటాయించింది.
ఒక నిర్ణయానికి వచ్చినట్లు అతన్ని కుడా కూర్చోమన్నట్లు చెప్పింది.

“నా దగ్గర ఒక మద్య మార్గం ఉంది.”

“మొదటి చైల్డ్ ని సరిగా అటెండ్ అవలేకపోతున్నాను అనే కదా మీ బాధ. పైగా నిద్ర చాలక పోవటం అలసి పోవటం. ఇదే కదా మీ సమస్య?”

వాళ్ళిద్దరి మొహాల్లో చిరునవ్వు విరిసింది. “అవును” అన్నట్లు తల ఉపారు.

“సమస్య పెద్దమ్మాయి కదా? సమస్య నే రిమూవ్ చేస్తే?” అని ఆగింది.

కొద్ది క్షణాలు మౌనం. “ఏం మాట్లాడుతున్నారు? మీకు తల పని చేస్తుందా?” పిల్లని రెండో బుజం మీదకి మార్చుకుంటూ ఆతను లేచి నిలబడి కోపంగా అరిచాడు.

డాక్టర్ ప్రశాంతంగా అతన్ని చూసి “మీరు వచ్చిన పనికి నా సమాదానం కుడా అదే”

తరవాత పేషంట్ ని రమ్మనట్లు గా ఆమె టేబుల్ మీద బెల్ నొక్కింది.
(ఒక మిత్రుడి వాల్ మీద చదివిన పోస్ట్ కి స్వేచానువాదం)

#susri