Monday 18 May 2015

మేరీ నామ్ శ్రీనివాసరావు హై



ఆరో తరగతి లో బద్ర రావు కి హిందీ లో
ఎప్పుడూ క్లాస్ థర్డ్ వచ్చేదంటే అది ఖచ్చితంగా నా పుణ్యమే.
.
మా హింది అయ్యవారు ధారాళంగా ప్రతి యూనిట్ లోనూ
“తేరా నామ్ క్యా హై” అని ఒక ప్రశ్న ఇచ్చేవారు.
నా ముందు క్లాస్ ఫస్ట్ శ్రీలక్ష్మి “మేరీ నామ్ శ్రీలక్ష్మి హై” అని వ్రాసేది.
నేను ఎంతో సమర్ధంగా దాన్ని చూసి “మేరీ నామ్ శ్రీనివాస రావు హై” అని వ్రాసేవాడిని.
శ్రీలక్ష్మి 2/25 తో క్లాస్ ఫస్ట్.
మనం 1.5/25 తో సెకండ్ వచ్చేవాళ్లం.
.
ఇక ఈ బద్ర రావు గాడు ఉండేవాడే కృష్ణ జేమ్స్ బాండ్ సినిమాలో
శెట్టి అని ఒకాయన పెద్ద గుండు రౌడీ ఉండేవాడు.
వీడు ఛోటా శెట్టి టైపు.
నాకు ఇద్దరి వెనుక కూర్చున్నా సాయంత్రం గ్రౌండ్ లో గుద్దుతానని చాలా మర్యాదగా చెప్పి
నా పేపరు లోంచి కాపీ కొట్టి నా శ్రమ దోపిడీ చేసి మరీ
“మేరీ నామ్ శ్రీనివాస రావు హై” అని వ్రాసి 1/25 తో ఎప్పుడూ క్లాస్ థర్డ్ వచ్చేవాడు.
.
మిగిలిన వాళ్ళంతా యధావిడిగా పేపరు క్వశ్చన్ పేపరు దించే వారు
కానీ అయ్యవార్లు కనికరం లేకుండా పెద్ద సున్నా వేసేవాళ్ళు.
.
అట్లాంటి బద్ర రావు కి మనకి చేడింది.
విషయం చిన్నదేమి కాదు. బాగా సీరియస్సు.
ఇంటి నుండి నేను ఆరు కిలోమీటర్లు నడిచి
(మద్దిపాడు నుండి ఇనమనమేళ్ళూరు వచ్చేవాడిని)
మోసుకొచ్చు కున్న మూడుగిన్నెల కారేజి లోంచి లంచ్ బెల్లు లోపలే
తినుబండారన్నీ దొంగిలించి తినేవాడు.
.
వేరుశనగ ముద్దలు, ఉడికించిన కోడి గుడ్లు, బిస్కెట్లు, కజ్జికాయలు,
కారపూస, మాగాయ ముక్క, వీడి శార్ధం. పిండాకూడు అన్నీ, అది ,ఇది అని లేదు..
గాడిద... ఒక్క సత్తు కారేజి, మజ్జిగన్నం తప్ప అన్నీ తిని వళ్ళు పెంచి
ఛోటా శెట్టి లాగా తయారయ్యాడు. .
.
సింగయ్య పంతులు కి గతం లో చెప్పినపుడు
ఆయన బెత్తం తో వీడి వీపు విమానం మోగింది గాని
దున్న మీద వర్షం పడితే యేమి. కుడితి పడితే యేమి?
.
నేను సరిగ్గా వాడి తొడ సైజు లో ఉండే వాడిని.
అర్బకుడిని. వాడిని ఏమిచేయలేక స్కూలు కి రాగానే అంధరికి తెలిసేట్టు
అన్నీ ఎంగిలి చేసి మళ్ళీ సర్దుకునేవాడిని.
.
బండోడు... ఎంగిలి అని తెలిసీ తినేవాడు.
పైగా ఆపూట గ్రౌండ్ లో తన్నులు అదనం.
ద్రిల్లు మాస్టారు ముందు షేక్ హాండ్ ఇచ్చినా చెయ్యి సలిపిండి (అరిశల పిండి ) చేసేవాడు.
వాడి బారి నుండి తప్పిచ్చుకోడానికి అనేక ఉపాయలు అమలు చేసినా వాడి ముందు కుదిరేవికాదు.
.
కానీ సంక్రాంతి పండక్కి అమ్మ చేసిన నువ్వుల అరిశలు
గుడ్డ సంచి లో సర్ధుకున్న రెండువరసల పుస్తకాల మద్యలో దాచినా ఒంటి బెల్లు లో తినేశాడు.
పైగా” నువ్వుల అరిశలు చాలా బాగున్నాయి రా” అని లైక్ తో కూడిన కామెంటు కొట్టాడు.
.
ఇక చూడు నా రక్తం కాగి పోయింది.
సాయంత్రానికి నేను వాడి సైకిల్ టైర్లలో గాలి తీయడం.
వాడు నన్ను బార్ని (పచ్చి పొగాకు కాలవడానికి వాడే కొలిమి ఇల్లు. వాడకం లో లేని అందులోనే మా క్లాసులు జరిగేది ఇప్పుడక్కడ మంచి హై స్కూల్ ఉంది .)
ఆడ మగ పిల్లలని వేరుచేసే ఇనప గొట్టం మీద వేసి కుమ్ముకోవడం తో మాకు చెడింది.
వీడిని బలం తో గెలవలేమని నాకు అర్ధమయ్యింది.
.
స్వయంగా ఇది అంతా సింగయ్య మాస్ట్రారు చూడటం తో
ఎలాగయితే నేమి వాడి పీడా విరగ డయ్యింది .
మేము పలుక్కోవడం మానేశాము
.
మమ్మలినిద్దరిని చెరో సెక్షన్ లో వేయడము,
కారేజీలు హెచ్‌ఎం గారి రూములో పెట్టే ఏర్పాటు చేయటం తో సమస్య ఒక కొలిక్కి వచ్చింది..
స్వేచ్చగా నేను ఇంటి నుండి తెచ్చుకున్న నా జంతికలు,నూగు జీడీలు,
చక్కెర చిలకలు, నిమ్మ బద్దలు, కారప్పూస, పేల పిండి,
అరిశలు,వేపిన కండిపప్పు బెల్లం,వేరుశనగ గుండ్లు,గనిసిగడ్డలు
సాయంత్రపు ఇంటర్ బెల్ టైమ్ లో గర్వంగా తినేవాడిని.
.
మళ్ళీ వాడికి హిందీ లో సున్నా మార్కులు రావడం మొదలైంది.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...