Monday 18 May 2015

శ్రీ రామమూర్తి పంతులు గారి ప్రవేటు


అప్పట్లో ఇంగ్లీష్ పేపరు తప్పిన వాళ్ళు,
ముందు జాగర్త గల ఆంగ్ల ఆబ్యాసకులు శ్రీ రామమూర్తి మాస్టారు వద్ద ట్యూషన్ కి వచ్చేవారు. 
.
మద్దిపాడు కడియాల యనాదయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల కి
కొద్దిగా దూరంగా ఉన్న కొత్తపాలెం లో ఉండేది ఆయన ఇల్లు.
.
మా అక్క అప్పట్లో ఇంటర్ ఇంగ్లీష్ పేపరు పోవటం మూలాన
శ్రీరామమూర్తి మాస్టారు వద్దకి ట్యూషన్ చేరింది.
.
పల్లెల్లో పవర్ కట్ ఎక్కువగా ఉండేది.
ఉన్నా లో ఒల్టేజ్ సమస్య. అందుకే టార్చ్ లైట్ తో తనకి తోడుగా సాయంత్రం పూట
ఒక రెండు గంటల ట్యూషన్ కి నేనూ వెళుతుండే వాడిని.
.
మాస్టారి గురుకులం బిన్నంగా ఉండేది.
ఆయన ఆచార వ్యవహారాలు కూడా బిన్నంగా ఉండేవి.
విశాలమైన పల్లెటూరి ఇల్లు సింహద్వారానికి రెండు పక్కలా ఎత్తైన వసారా ఉండేది.
వసారా నిండా పిల్లలే. చాలా మంది పిల్లలు స్కూలు వదల గానే,
గ్రౌండ్ లో ఆడుకుని ఇంటికెళ్ళి స్నానం చేసి అన్నం తిని,
కోడిగుడ్డు బుడ్డి ( కిరోసిన్ దీపం ..వత్తి నుండి వెలువడే పొగ చుట్టూ అవకుండా ఒక మూత ఉండేది. ) తీసుకుని మాస్టారు ఇంటి కెళ్లటం పొద్దుపోయే వరకు దీపాల వెలుగులో చదువుకోవటం,
సారు నడిగి రానివి చెప్పించు కోవటం , ఆ అరుగుల మీదే చాప పరుచుకుని నిద్ర పోవటం,,
ఉదయాన్నే నిద్ర లేచి చదువు కోవటం, బాగా తెల్లరాక ఇంటి కెళ్ళి ఫ్రెష్ అయ్యి తిని, లంచ్ తీసుకుని స్కూల్ కెళ్లటం ఇదీ క్లుప్తంగా టైమ్ టేబుల్.
.
పిల్లలందరూ చదువుకుని నిద్ర పోయాక ఆయన ఆరుబయటే
నవారు మంచం మీద పడుకుని నిద్ర పోయేవారు.
ఉదయం లేవగానే మంచం కింద నీళ్ళ చెంబు తీసుకుని , పొలాల్లోకి వెళ్ళేవారు.
వస్తూ పోలేరమ్మ గుడి ముంగిట ఆగి అమ్మ వారిని చూసుకుని
వేప పుల్ల విరిచి నోట్లో ఉంచుకుని ఇంటికి వచ్కి
వసారా లో ఉన్న పిల్లలని నిద్ర లేపి చదువుకు పురమాయించి,
ఆ పై స్నానం ,పూజాది కార్యాలు చేసుకునేవారు. ఇది సాదారణ దిన చర్య.
.
తోటి పంతులు (మా నాన్న ఎలిమెంటరీ స్కూలు పంతులు)
గారి పిల్ల కనుక ప్రత్యేక శ్రద్ధ తో ఆయన మా అక్కకి ఇంగ్లీష్ చెప్పేవాడు.
గ్రామర్ అద్బుతంగా చెప్పే వాడు.
రొటీన్ గా part of speech లు అంటూ మొదలెట్టకుండా ,
am,is,are,was,were,be,been,being--- B forms,
Cases, genders, verb forms , numbers నేర్పించి, నేరుగా Tense లోకి తీసుకెళ్ళేవాడు.
చాలా సౌకర్యంగా ఉండేది నేర్చుకోవటం.
.
ఇంగువ కట్టిన గుడ్డ లాగా నాకూ కొంత వంట బట్టింది.
బయట ఆడుకుంటూ మద్య మద్యలో ఒక చెవి అటు వేసేవాడిని.
ఈ విదంగా నాకు ఇంగ్లీష్ పునాది పడింది.
ఒకసారి అక్క one of the best dress అని ఏదో చెబుతుంటే
విని నేను చిన్నగా one of the best dresses అని అండిచాను,
ఆమె అపనమ్మకంగా గాను మాస్టారు నన్ను ఆశ్చర్యంగానూ చూశారు.
.
ఒక మినీ ఇంటర్వ్యూ చేశాడు.
మనకేమి భయం. దడ దడ లాడించాం.
అప్పుడు నేను యెనిమిదో క్లాస్ లో ఉండేవాడిని.
మిగిలిన subjects లోనూ కొన్ని ప్రశ్నలేసి సమాదానం రాబట్టాక యేడు లో యెన్ని మార్కులొచ్చాయిరా అని అడిగారు.
రెండు 54 లు, రెండు 55 లు, రెండు 56 లు,మొత్తం 330 అని చెప్పాను.
అన్నీ సమాదానాలు తెలిస్తే అంతేనా మార్కులు. అన్నీ ప్రశ్నలకి సమాదానం రాశావా?
అడిగారు ఆయన.
“పాసు మార్కులు 35 కదా. 50 నుండి 60 మార్కులకే రాస్తాను.
మొత్తం రాయడం ఎందుకు చెయ్యి నొప్పి” వసారా గుంజ చుట్టూ తిరుగుతూ చెప్పాను.
.
ఆ తర్వాత ఏమైందో తెలీదు గాని మా నాన్న సంచి, బుజనికి తగిలించి, కోడిగుడ్డు దీపం ఇచ్చి నన్ను ట్యూషన్ కి పంప సాగాడు. ( ఇంకా ఉంది) .

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...