Monday, 18 May 2015

నేనే ఫస్ట్

రాత్రి కొంచెం లేటుగా అయినా
పాఠాలు అన్నీ పూర్తయ్యాక పడుకునే వాడిని కానీ
ఉదయాన్నే నిద్ర లేవడం మాత్రం నాకు సాద్యపడేది కాదు.
చదువులో నేను ముందంజ లోనే ఉండేవాడిని కనుక
ఉదయాన్నే లేవడం మీద నాకు కొంత సడలింపులు ఉండేవి.
.
ఉదయాన్నే లేవడం అంటే అది ఆ రోజే.
మెదడు లో ఉన్న అలారం మోగగానే టక్కున లేచి
పక్కనే సిద్దంగా ఉన్న సంచి అందుకుని ఒక్క ఉదుటున బయట పడ్డాను.
.
వీది చివరి వేపచెట్టు దగ్గర కొచ్చే సరికి అప్పటికే సిద్దంగా ఉంది మా టీం ..
వీరయ్య చౌదరి గారి అబ్బాయి కూడా వచ్చి కలిశాక మొదలైంది. పత్రి వేట.
.
ప్రతి వినాయక చవితి కి తప్పనిసరిగా ఎంతో కొంత వర్షం పడేది.
చేల గట్లు జారుతుండేవి.
కాళ్ళకి అంటుకునే బురద బూట్లతో మేం చెట్ల మీద దాడి చేసేవాళ్లం.
వినాయకుడికి ఏ మొక్కలు ఇస్టమో మాలో ఎవ్వరికీ తేలీదు .
మొత్తానికి పత్రి ప్రియుడని మాత్రమే తెలుసు.
పైగా అప్పట్లో ఇంత కమ్యూనికేషన్ కూడా లేదు ఆయన్నే అడుగుడామంటే.
.
శంకు పూల చెట్టు నుండి జిల్లేడు వరకు,
రాగి నుండి మర్రి చెట్టు వరకు చుట్టూ పక్కల పొలాలన్నీ తిరిగి
సంచి నిండా పెద్దాయనకి అన్నీ రకాల ఆకులు,
చిన్న చిన్న కాయలు, పూలు కోసిపారేశాము .
.
ఇక మిగిలింది పోలేరమ్మ గుడి వద్ద విరగబుసే పసుపు గన్నేరు చెట్టు మాత్రమే..
మా టీం లో పరుగు లో నేనే కొంత వెనుక ఉండేవాడిని.
పంతులు గారి అబ్బాయి అని నన్ను తమతో కలుపుకొని
ఎంతో కొంత ప్రయారిటీ ఇచ్చి నేను ఎక్కలేని చెట్ల వద్ద కూడా నాకు బాగం ఇచ్చేవారు.
.
పోలేరమ్మ గుడి వద్ద చాలా హడావిడి గా ఉంది.
రోడ్డు వారగ చిదుగులతో చిన్న మంట చుట్టూ
పలకలు (డోప్పలు) వేడి చేసుకుంటూ నలుగురు కూర్చున్నారు.
గుడి ముందు ఖాళీ స్తలమ్ లో గుంపుగా కొంతమంది కూర్చుని ఉన్నారు.
మద్యలో పొయ్యి. మంట మీద పెద్ద బాండీ లో కాగుతున్న నూనె.
ఒక రకపు ఉన్మాదం లో జనం.
.
సంచార జాతుల వాళ్ళు తరచూ గొడవలు పడ్డాక,
అక్కడే కుల పెద్దల పరిస్కారం కోసం నమేవేశ మవుతారని నేను అప్పటికే విని ఉన్నాను.
.
అసలు ఇదంతా ఎమోటో తెలుసా అన్నాడు చౌదరి గారి అబ్బాయి.
అందరం ఆసక్తిగా ఆగాము.
గన్నేరు చెట్టు గుడి ఆవల బావి పక్కన ఉంది.
అప్పటికే వారి అందర్నీ దాటుకుని వెల్లటమా మానటమా అనీ సంధిగ్డం లో ఉన్నాం.
.
నిన్న ఒకడు పక్కింటి వాళ్ళ కోడిగుడ్డు దొంగతనం చేశాడు ట.
పైగా నాకు ఏమి తెలీదని అబద్దం కూడా..
చివరికి గోడవ పెద్దదయ్యి
పోలేరమ్మ గుడి వద్ద కాగే నూనె లో కులపెద్ద సమక్షం లో చెయ్యి ముంచి.
తన సత్యాన్ని నిరూపించు కోవడానికి వారంతా పోగయ్యారు.
సంప్రదాయం ప్రకారం చెరో 500 ఖర్చు తో అందరికీ మర్యాదలు చెయ్యాలి,
కుల పెద్ద కు మాంసం మద్యం ఇలాటివి చాలా ఉంటాయట.
.
“ఏదీ పావలా కోడిగుడ్డు కోసమా?” అడిగాను నేను.
చెబుతున్నవాడు జాలిగా చూశాడు.
పంతులుగారి అబ్బాయి నువ్వు చాలా తెలుసుకోవాలి అన్నట్లు...
.
మేం గోడ వారగ నక్కి ఉండగానే
ఒక బక్క జీవి బావి వద్ద చిన్న టవల్ చుట్టుకుని వంటి మీద నీళ్ళు గుమ్మరించుకు వచ్చాడు.
తడిసిన పొడవాటి జుట్టు నుండి నీళ్ళు కారుతూనే ఉన్నాయి.
పోలేరమ్మ కి బయట నుండే దణ్ణం పెట్టాడు.
కుల పెద్ద వచ్చి కుంకుమతో పెద్ద బొట్టు పెట్టాడు.
పెద్దగా సత్యం గల పెద్ద తల్లి నువే తీర్పు చెప్పాలా అని అరిచాడు.
ఆ బక్క జీవి హఠాత్తుగా వచ్చి పొంగుతున్న నూనె లో చెయ్య ముంచి పైకి తీశాడు.
.
ఎప్పుడొచ్చారో గాని ఈ పలకల batch పెద్దగా శబ్దం చేస్తూ డోప్పలు వాయించ సాగారు.
అప్పటికే మైకం తో ఉన్న జనం లేచి “తల్లి .. సత్తెమ్ పలుకు అంటూ..ఆరవ సాగారు
పూనకం వచ్చిన ఆవిడ ఒకరు జుట్టు విరబోసుకుని గెంత సాగింది.
.
ఇక చూస్కో మేం ఇంటికి ఒకటే పరుగు. ఈ సారి మాత్రం నేనే ఫస్ట్.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...