Sunday, 25 September 2016

చంద్ర శేఖర ఆజాద్

చంద్ర శేఖర తివారీ, జులై 23 న 1906 లో మద్య ప్రదేశ్ లోని 'భవ్రా' గ్రామంలో జన్మించారు. 
తండ్రి సీతారాం తివారి, తల్లి జాగ్రాని దేవి (మూడో బార్య). మొదటి ఇద్దరు బార్యలు చనిపోయారు. 
చంద్ర శేఖర్ ని తల్లి ఒక గొప్ప సంస్కృత పండితుడిగా చూడాలని కల కనేది. అందుకే ప్రఖ్యాత హిందూ విశ్వవియాలయం (బెనారస్) లో చంద్ర శేఖర్ ని చేర్పించారు. 15 ఏళ్ల వయసున్నప్పుడు, మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమం లో పాల్గొని డిసెంబర్ 1921 లో అరెస్టు అయ్యాడు. 
మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినప్పుడు తన పేరు ను ‘ఆజాద్’ అని తన తండ్రి పేరు ‘స్వతంత్ర’ అని తన భావజాలం లో ఉన్న పదాలని దిక్కార స్వరం తో చెప్పాడు.
జైలు నే తన ఊరు అని చెప్పి, 16 హంటర్ దెబ్బలని శిక్షగా పొందాడు.
'వందేమాతరం' నినాదం తో వాటిని స్వీకరించి, సొమ్మసిల్లి పోయాడు.
ఆనాటి నుండి అతను చంద్ర శేఖర ఆజాద్ అయ్యాడు. 1922 లో జైలు నుండి విడుదల అయ్యాక అతను మరింత కరుడుగట్టిన స్వతంత్ర భారత అభిలాషి అయ్యాడు. HRA (హిందూస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్) స్తాపకుడు శ్రీ రామ్ ప్రసాద్ బిస్మిల్ తో పరిచయం అయినప్పుడు “ నీలో దేశభక్తి ని చూడాలను కుంటున్నాను” అన్నప్పుడు చంద్ర శేఖర్ ఒక వెలుగుతున్న దీపం మీద తన చేతిని ఉంచాడు. శరీరం కాలి వాసన వేస్తున్నా, అతను చలించలేదు. రామ్ ప్రసాద్ బిస్మిల్ అతన్ని వారించి HRA లో కి ఆహ్వానించాడు. అప్పటి నుండి చంద్ర శేఖర్ తను నమ్మిన HRA కి నిధులు వసూలు చేయటం మొదలెట్టాడు. ఎక్కువభాగం నిదులు బ్రిటిష్ ప్రభుత్వం నుండి కొల్లగొట్టనవి సేకరించేవాడు. సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ మీద ఒక నూతన ఇండియా ని నిర్మించాలని భావించాడు.
1925 లో జరిగిన కకొరి రైలు రాబరీ లో అతని పాత్ర ఉంది. 1926 లో విక్టోరియా రైల్ ను పేల్చే ప్రయత్నం చేశాడు.
మోతీలాల్ నెహ్రూ నుండి కూడా నిధులు వసూలు చేసేవాడు.
రైలు రాబరీ తర్వాత ఆజాద్ అజ్ఞాతవాసంలో కెళ్ళాడు.
ఝాన్సి సమీపం లోని అడవుల్లో స్థావరం ఏర్పాటు చేసుకుని తన అనుచరులకి తుపాకి కాల్చడం లో శిక్షణ ఇచ్చాడు . పరిసర గ్రామాలలోని యువకులని చేరదీసి దేశభక్తి నూరి పోసేవాడు, సైనిక శిక్షణ ఇచ్చేవాడు.
1929 మే 2న పార్లమెంటుపై జరిగిన బాంబు దాడి కేసులో భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులకు ఉరిశిక్ష ఖరారు చేశాయి న్యాయస్థానాలు. అది తెలిసి ఆజాద్ విచలితుడయ్యాడు. వారిని విడిపించేందుకు ఎంతకైనా తెగించాలనుకున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. 1931 ఫిబ్రవరి 27న జవహర్‌లాల్ నెహ్రూని కలిశాడు ఆజాద్. విప్లవ వీరులైన భగత్‌సింగ్ తదితరుల్ని విడిపించేందుకు సహకరించమన్నాడు. నెహ్రూ అందుకు అవుననలేదు, కాదనలేదు. ఆజాద్ అక్కడి నుంచి నేరుగా అలహాబాద్‌లోని ఆల్ఫ్రెడ్ పార్కుకి వెళ్లాడు. ఓ చెట్టు కింద ఇద్దరు మిత్రులతో కూచున్నాడు. భగత్ త్రయాన్ని ఎలాగైనా విడిపించేందుకు వారితో చర్చిస్తున్నాడు. అంతలో వారిలో ఒకరు పోలీసు ఇన్‌ఫార్మర్ అని అనుమానమేసింది. చప్పున కుడిచేయి మోకాలి దగ్గరి రివాల్వర్ దగ్గరకు వెళ్లింది. అదే క్షణంలో పోలీసులు చుట్టు ముట్టారు . ఆజాద్ వెంటనే కాల్పులు జరిపాడు . ముగ్గురు పోలీసులు తూటాలకు బలైపోయారు. ఒక్క పోలీసు కూడా తనను ముట్టుకోకుండా తుపాకీని కాలుస్తూనే ఉన్నాడు ఆజాద్. ఇక ఒక్క బుల్లెట్ మాత్రమే మిగిలింది. అది కూడా అయిపోతే పోలీసులకు తాను పట్టుబడటం ఖాయం. బతికుండగా బ్రిటిష్ వారికి చిక్కడమా? నెవ్వర్!అనుకున్నాడు. అంతే! ఆ ఒక్క తూటాతో తననే కాల్చుకున్నాడు ఆజాద్.
నేల కొరిగాడు.అప్పటికి అతని వయసు 24 ఏళ్ళు మాత్రమే..


 సజీవంగా బ్రిటిష్ ప్రభుత్వానికి దొరకను అని చెప్పిన మాట నిలబెట్టుకున్న వీరుడు. “చంద్ర శేఖర ఆజాద్”

No comments: