Saturday, 4 June 2016

హమ్మయ్య లాటరీ తగల్లేదు. :(

ఏడాదికి సుమారుగా మూడు లక్షలు సంపాదించే పరంధామయ్య ఉన్న దాంతో సంతృప్తి పడే మనిషి.
ఆయన ఆ రోజు సాయంత్రం బోజనం ముగించి వరండా లో పక్క వేసిన నవ్వారు మంచం మీద టేబుల్ ఫాను గాలి బాగా తగిలేట్టుగా కూర్చుని తాను పని చేసే చోటు నుండి తెచ్చుకున్న ఆ రోజు పేపర్ తీరిగ్గా తిరగేయటం మొదలెట్టాడు.
వంటిల్లు సర్ది వచ్చిన భార్యామణి రెండో మంచం మీద కూర్చుంటు ఈ రోజు ధనలక్ష్మి లాటరీ రిజల్ట్స్ చూడటం మర్చిపోయాను. ఇవాళే కదూ ?” అంది.
అవును వేసినట్టు ఉన్నారు. నీ టికెట్ ఈ నెలదేనా?” అతను కళ్ల జోడు లోంచి నవ్వుతూ అడిగాడు.
మీరు మరీనూ.. ఈ నెల దే.. ధనలక్ష్మి లాటరీ టిక్కెట్టే! ఉండండి తీసుకు వస్తాను
నెంబరు చెప్పు?” అడిగాడు అతను.
సిరీస్ 9499 WP, నెంబరు 2 .. 6 ..”
 9499 , డబ్ల్యూ. పీ రెండూ. ఊ ఆరూ ఊ ఊ 
నిజానికి అతడికి లాటరీల మీద అసలు నమ్మకం లేదు కాని ఆమె కి మాత్రం తండ్రి నుండి వచ్చిన అలవాటు ఉంది. ఏ మార్కెట్ కో వెళ్ళి వచ్చేటప్పుడు మిగిలిన చిల్లర తో ఏదో ఒక లాటరీ టికెట్ కొంటుంది.
ఊ తర్వాత ?”
“Z 2 4 3 7 2 1 “
అతనికి చేసేందుకు పెద్ద పని కూడా లేదు. కాసేపు ఆమెతో పిచ్చాపాటి మాట్లాడటం తర్వాత గుర్రు కొట్టటం. ఏదో ఒకటి మాట్లాడాలి కాబటీ టికెట్ ప్రసక్తి తెచ్చాడు. బద్దకంగా పేపరు చూస్తున్న అతను ఒక్క సారిగా లేచి వరండాలో ట్యూబు లైట్ వేశాడు నిలబడి కళ్ళజోడు లోంచి కళ్ళు చికిలించి చూస్తూ మళ్ళీ చెప్పు అన్నాడు 
ఆమె చెప్పింది. “Z 2 4 3 7 2 1 “
లక్ష్మీ .. ఉందేవ్ Z ఇరవై నాలుగు ముప్పై ఏడు ఇరవై ఒకటి. అంతే కదా ?” అన్నాడు సంభ్రమంగా.
అతను చెప్పిన విధానాన్ని బట్టి అందులో తమాషా కానీ అబద్దం కాని ఏమి లేదని ఆమెకి అర్ధమయింది.
ఆమె చప్పున పేపర్ అందుకుని టిక్కెట్టు నెంబరు, ప్రకటన లోని నెంబరు పట్టి పట్టి చూసింది. క్రమీణా ఆమె పెదవులు చెవుల వరకు సాగాయి. అంత లోనే ప్రకటన కింద సిరీస్ ఆల్ఫాబెట్ నెంబరు తర్వాత ప్రకటిస్తామని నోట్ ఆమె కంట బడింది.
..
సిరీస్ ఆల్ఫబెట్ లో నాలుగే అక్షరాలు ఉంటాయి. తమ టికెట్ B సిరీస్. A/B/C/D వీటిలో ఏదో ఒక దానికి కోటి రూపాయల ప్రైజ్ మని ఉంది...
..
భార్యా బర్తలిద్దరూ కూర్చుని తమ టికెట్ కి 25% అవకాశం ఉందని తేల్చేశారు. ఒక వేళ తాము మిస్ అయితే లక్ష రూపాయల కన్సోలేషన్ మని ఖచ్చితంగా వస్తుంది...
..
పరంధామయ్య వరండాలోంచి మూడు గదుల ఆ ఇంట్లోకి , తిరిగి వరండా లోకి అనేక సార్లు పని ఉన్న వాడి మాదిరిగా నడిచాడు...
ఒక వేల ఆ ధనలక్ష్మి తమనే వరిస్తే మొత్తం వంద లక్షల రూపాయలు తమ కే సొంతం. అందులో టాక్స్ 30 శాతం పోయినా డెబ్బై లక్షలు,
అయిదు వందల రూపాయల కట్టలు మొత్తం 140. అవన్నీ తెచ్చుకోటానికి మంచి బ్యాగు ఏమయినా ఉందా అనికూడా ఆలోచన వెళ్లింది .
అతనికి ఉక్కిరి బిక్కిరిగా ఉంది.
..
లక్ష్మీ దేవి పరిగెట్టుకుంటూ వెళ్ళి దేవుడు గుడి ముందు కూలబడింది. మళ్ళీ దీపారాధన చేసి వరసబెట్టి ఇష్టదైవాలతో బేరాలు మొదలెట్టింది.
. ..
"ఒక వేల మనకే ఆ డబ్బు వస్తే .. కొత్త జీవితం . కొత్త ప్రపంచం .
అవును ఇది నీ డబ్బు.. నీది నాదీ ఏమిటి? మన డబ్బు. వెంటనే ఒక డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొంటాను. ఎన్నాళ్లని ఈ అద్దె కొంపలో మునిగిపోవటం??., చిన్న చితకా బాకీలన్నీ తీర్చేస్తాను.. మిగిలిన డబ్బు బాంకు లో నెలవారి వడ్డీకి ఇచ్చేస్తాను. ఎలా లేదన్న నెలకి పాతిక వేలు వడ్డీ .. దాంతో నా సామి రంగా .. 
పరంధామయ్య ఏదో ట్రాన్స్ లో ఉన్న వాడి మాదిరి మాట్లాడటం మొదలెట్టాడు.
...
 అవును స్వంత ఇల్లు కోనాలి. ఎన్నాళ్లని ఈ డబ్బా ఇళ్ళలో మాగి పోవటం?” ఎప్పుడొచ్చిందో కానీ లక్ష్మి అందుకుంది. ...
..
నిర్మల్ నగర్ ఏరియా లో కొందాము. కొంచెం ఖరీదయినా, ధనికులు ఉండే చోటు టౌన్ కి దగ్గర కూడాను ఆమె కూడా ట్రాన్స్ లో ఉండి మాట్లాడుతుంది...
..
<<<సాయి మందిరం నుండి హారతి వినిపిస్తూ ఉంది.
మందిరానికి నడక దూరం లో  టెంపుల్ వ్యూ లో నాలుగో అంతస్తులో సెకండ్ సెల్ కి వచ్చిన ఫ్లాట్ పరంధామయ్యకి. లక్ష్మి కి ఎంతో నచ్చింది. కొద్దిగా ఖరీదయినా తమ ఇద్దరి కూతుర్లకి కూడా బాగా నచ్చడం తో దానిని తీసేసుకోవాలని గట్టి నిర్ణయానికి వచ్చారు.
తమ కున్నది ఎటు ఇద్దరు ఆడపిల్లలే కాబట్టి ఎప్పటికయినా ప్రాపర్టీ వాళ్ళకే చెందుతుంది, కాబట్టి ఫ్లాట్ రిజిస్ట్రేషన్ తమ పేరున చేస్తే మిగిలిన డబ్బు చిన్న అమ్మాయికి తమ తదనంతరం వచ్చే ఏర్పాటు చెయ్యొచ్చని, బంగారం పని చేసే పెద్దల్లుడు తన అభిప్రాయాన్నిఆజ్ఞ  లాగా  చెప్పాడు.
వచ్చే డబ్బులో ఎక్కువ బాగం ఫ్లాట్ కి పోతుంది మిగిలిన కొంచెం డబ్బులు అదీ ముసలాళ్ళు పోయాక తమకి ఇవ్వటం ఎలా కుదురుతుంది? ప్లీడర్ గుమాస్తా గా చేసే చిన్నల్లుడి ఆర్గుమెంటు  పాయింటు.
కూతుర్లు, అల్లుళ్లు రెండు వర్గాలుగా చెరీ ఎవరి వాదనలు వారు వినిపించు కోవడం మొదలయ్యింది.ఈ లోగా పెద్ద కూతురి కూతురు తాతా నాకు గాజులు చేయించవూ?” అని అడుగుతుంది.
గత నాలుగేళ్లుగా చుట్టపు చూపులు తప్ప మరేమీ లేని పిల్లలు, మర్యాదలతో ముంచేయటం, లక్ష్మి తో చాటుగా మంతనాలు చెయ్యటం మొదలయ్యింది. వచ్చే డబ్బుని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎంత లాభాలొస్తాయో చిన్నల్లుడు చెవిలో పోరు పెట్టుకుని చెబుతున్నాడు.>>>
పరంధామయ్యకి మెళుకువ వచ్చింది.
పక్కనే ఉన్న మంచం మీద బార్య నిద్ర పట్టకుండా దొర్లటం గమనించాడు.
తాను కూడా మెసలటం గమనించి ఏమండీ .. కొంత డబ్బుతో ఇద్దరు పిల్లలకి బంగారం కొందామండీ. మానమరాలు ఉందనే కానీ దాని చేతిలో ఏనాడూ మనం ఒక రూపాయి పెట్టింది లేదు. కనీసం ఇప్పుడయినా??” అంది.
మళ్ళీ రెండు నిమిషాలు ఆగి చిన్నల్లుడు ఎన్ని లా పాయింట్లు తీస్తాడో. పైగా ఆ వేదవకి బార్య మీద  చెయ్యి చేసుకునే అలవాటు కూడా ఉంది
తనలాటి మానసిక స్థితి లోనే బార్య కూడా ఉందని గమనించడానికి పరంధామయ్యకి ఎంతో సేపు పట్టలేదు. కనీసం పెద్దవయసులో తమకి ఉండే మెడికల్ ఖర్చుల గురించి ఎవరికి ఆలోచన లేదు. డబ్బు చేరుతుందనగానే , పిల్లలు, ప్రేమ ముసుగులు, బంగారం, వాటాలు, వాదనలూ, కేకలు
గాలి మేడలు కట్టకుండా నిద్రపో బార్యని మందలించి చిన్నగా నిద్ర లోకి జారు కున్నాడు.
**
మర్నాటి ఉదయం పేపర్లో వచ్చిన సవరణ లో సిరీస్ అక్షరం B గానే ఉంది గాని మొదటి అంకెలు మొ 9499 WP,
నెంబరు 2 .. 6..” కాదు 4 ..6. అని ఉంది. కోటి కాదు కదా కనీసం కన్సోలేషన్ లక్ష కి కూడా టికెట్టు పనికి రాలేదు.
విచిత్రంగా పరంధామయ్య గాని లక్ష్మి గాని సవరణ చూశాక బాధపడలేదు.
ఒక పెద్ద ముప్పు తగ్గిపోయినట్లు ఒక నిట్టూర్పు విడిచారు .
లక్ష్మి లాటరీ టిక్కెట్లు కొనటం మానేసింది.



No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...