Saturday, 16 July 2016

దబిడ దబిడే

“సెంట్రల్ లో దిగి, లోకల్ ట్రైన్ ఎక్కి ఎగ్మోరే వెళ్ళి అక్కడనుండి రాత్రంతా ప్రయాణం చేసి, ఉదయం మళ్ళీ రెండు బస్సులు మారి, కాలేజీ గేటు నుండి కాలిజేర్రు లాగా కిలోమీటరు నడిస్తే గాని ని కొడుకు దర్శనం కాదు. ని ఇష్టం వచ్చినట్టు సర్దావ్ లగేజీ ఈ బాగు ఏమిటి?ఈ దుప్పట్లు ఏమిటి?. ఈ పుస్తకాలు అంటే తప్పవు. ఈ పచ్చడ్లు ఏమిటి?. వాడేమన్నా అడివిలో నా ఉండటం? ఇంతోటి పచ్చడ్లు అక్కడా బోలెడు? ఈ చక్రాలు, సున్నుండలు, రవ్వ లడ్లు  ఏమే పిల్లాడు ఇవన్నీ తిని కాలేజీ ఊడవాలా యేమిటి?
రెండున్నర ట్రైన్ కి తత్కాల్ లో టికెట్ దొరికింది అతనికి . హాస్టల్ లో ఉండి చదువుకుంటున్న పిల్లాడి వద్దకి వెళ్ళటానికి నెలన్నర తర్వాత ఇప్పటికీ కుదిరింది. ఉదయం బొంగరం లాగా పనిచేసి హాఫ్ డే లీవు చేయించుకుని వచ్చేసరికి ఒంటిగంటయింది. ప్లేట్లో బోజనమ్ కలుపుకుని తింటూ నే ఇంటావిడ సర్దిన లగేజీ గురించి రివ్యూ చేస్తున్నాడు.  ఈ నెల రోజుల్లో పిల్లాడు  ఫోన్ చెయ్యటం ఇంటావిడ  బాగ్ సర్దటం. తీరా బయలు దేరేసరికి రెండు బాగులు  మోయలేనంత బరువు వి సర్ది ఉంచింది. అతను కేకలు వేస్తూనే ఉన్నాడు.
తనకేమి వినబడనట్టు ఆవిడ డేట్టాల్ సబ్బులు రెండు సైడ్ జిప్పులో ఉంచింది.
“నేనిక్కడ వాగుతున్నానా? తీయి .. ఆ పచ్చడ్లు తియ్. సబ్బులు, బొబ్బులు అక్కడ కొనుక్కుంటాడు లేవే”
ఇఖ  చివరి అస్త్రం ఆవిడ బయట కి తీసేలోపు పోను మ్రోగింది.
అవతల అతని  అధికారి. “ఎక్కడ?”
“సార్ .. సార్  ... ట్రైన్ టైమ్ అయ్యింది. అన్నం తింటున్నాను. ఆటో పట్టు కోవటమే ఆలస్యం “
“నేను కారు తీసుకొస్తున్నాను. నిన్ను స్టేషన్ లో దింపేస్తాను”
ఈ సారి ఆశ్చర్య పోవటం అతని  వంతు అయ్యింది. ఆయన తన కార్లో వచ్చి తనని  స్టేషన్ లో దించడమా?
సహజంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ “చూశావా ? మా ఇ ఇ కి నేనంటే ఎంత అభిమానమో?” అన్నాడు తింటూనే.
“ఎవరు వేణుగోపాలరావేనా?” అంది  ఆవిడ పెరుగు వంచుతూ .
“అవును వాళ్ళ అబ్బాయి కూడా అదే కాలేజీ లో మనాడికి సీనియర్. చెప్పాగా పోయిన సారి”
“ఆ గుర్తుంది . మీకు ఇక దబిడ దబిడే “ అంది ఆవిడ  విచిత్రంగా.
ఇంటి ముందు కారు హారన్ వినిపించింది. అన్నం ముద్ద నోట్లో కుక్కుకుని చేతిని కడిగి ఆమె చీర కొంగుకి తుడిచి బాగ్ లు రెండు పట్టుకుని బయట పడ్డాడు.
**
పొద్దుటే పూజ చేసుకుని వంట మొదలేడుతూ బర్త కి ఫోన్ చేసిందావిడ.
“ఎగ్మోర్ లో ట్రైన్ అందిందా?”
“మొత్తానికి ట్రైన్ పట్టుకున్నాగాని. నువ్వన్న దబిడ దబిడే కి అర్ధం తెలిసింది. ఆయన కొడుక్కి చేర్చమని పచ్చళ్ళు ఉన్న  అట్ట పెట్టె మరొకటి ఇచ్చాడు. పైగా గ్లాస్ విత్ కేర్ స్టిక్కర్ ఒకటి”

ఇంటావిడ నవ్వింది. 
**
(కార్తీక్ కట్టా .. కోసం)

No comments: