Monday 9 January 2017

మోక్షం


“స్వామి నాకు మోక్షం ఎలా లభిస్తుంది?” ఆ యువకుడు అడిగాడు.
“గంగా నది లో స్నానం చెయ్యి” అన్నాడు గురువు.
“గంగానది ఎక్కడ?”
“ఇలా ఉత్తర దిక్కుగా వెళ్ళు.”
ఆ యువకుడు బయలుదేరాడు. రాత్రింబవళ్ళు ప్రయాణం చేశాడు. ఎండనకా వాననకా నడిచాడు.
కొంత కాలానికి ఉత్తర దిక్కుగా ఒక నది కనిపించింది.
అతను ఆ నదిలో స్నానం చేశాడు. పులకరించి పోయాడు.
పక్కనే ఒక పాకా వేసుకున్నాడు. చుట్టూ పొలాలలో పనికి వెళ్ళాడు. రోజు నిష్టగా స్నానం చేసేవాడు. గంగలో మునుగుతూ పరవశించి పొయ్యేవాడు.
కొన్నాళ్ళకి ఒక సాధువు అతనిని గమనించాడు.
“ఏమిటి నాయనా? ఇంత నిష్టగా నదీ స్నానం చేస్తున్నావు?” అని అడిగాడు.
“గంగా నది లో స్నానం చేస్తే మోక్షం వస్తుందని మా గురువు గారు చెప్పారు”
ఆ సాదువు అతన్ని చూసి జాలి పడ్డాడు. “ఇది గంగ కాదు నాయనా. ఇంకా దూరం ఉంది. ఉత్తరంగా చాలా దూరం పోవాలి”
అతను హతాశుడయ్యాడు. అక్కడి నుండి మళ్ళీ ఉత్తర దిక్కుగా ప్రయాణం ప్రారంభించాడు.
కొన్ని ఆమడలు నడిచాక మరొక నది కనిపించింది. పెద్దది. నిండుగా ఉంది. గొప్పగా ఉంది.
అతను తిరిగి అందులో స్నానం చేశాడు. అక్కడే ఉండి పోయాడు.
కొందరు పాదచారులని అడిగాడు. “ఇది గంగా నదేనా?”
“అయ్యో కాదు మిత్రమా .. ఇంకా చాలా దూరం ఉంది. మాతో రా. మేము అక్కడికే వెలుతున్నాం”
అతను వాళ్ళను అనుకరించాడు. ఎంతో కఠిన మయిన ప్రయాణం. ఆరోగ్యం సహకరించలేదు. కుంభమేళా వద్దకి చేరారు. కనుచూపు మేర లో “పవిత్ర గంగ” అతను రద్దీలో చిక్కుకు పోయాడు. తొక్కిసలాటలో నలిగి పోయాడు. అనారోగ్యం అతన్ని మింగేసింది. తనువు చాలించాడు.
***
చిత్ర గుప్తుడు భటులని మందలించాడు. ”ఇతని కోసం స్వర్గ ద్వారాలు తెరిచి ఉన్నాయి. నిత్య గంగా స్నానం చేసిన పుణ్యఫలం తో ఇతనికి మోక్షం సిద్దించింది. వెంటనే దైవ మర్యాదలతో స్వర్గం లో దిగబెట్టి రండి.” . అన్నాడు.
***
ఒక్కసారి కూడా గంగ లో మునక వేయకుండా అతనికి ఆ పుణ్యఫలం ఎలా వచ్చింది??
తను స్నానం చేసిన ప్రతి నదిని గంగ గానే భావించాడు. అతనికి ఆ నదులు గంగ గానే తోచాయి. వాటిలో స్నానం చేస్తూ పులకరించాడు. పరవశించాడు. అతనికి గంగ స్నానపు మోక్షం సిద్దించింది

గమ్యమే కాదు. ప్రయాణం ఎలా చేస్తున్నాం అన్నది కూడా ముఖ్యమే.



No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...