Wednesday 18 January 2017

కుల్ ధరా - 1825 - ఆత్మగౌరవం

ఎడారి మార్గం లో పోతూ ఉంటాం. మండు టెండ ..
ఉన్నట్టు ఉంది ఒక ఊరు దూరంగా కనబడుతుంది. ఆశగా దగ్గరకి వెళ్తాం
మేడలు, మిద్దెలు, విశాలమయిన చావడీలు, వీదులు, కూడళ్ళు .. అన్నీ ఉంటాయి.
కానీ ఒక్క నర ప్రాణి  కూడా కనిపించరు.
అప్పుడు ఎలా ఉంటుంది?? ఒక్క సారి ఊహించుకోండి.
వీధుల్లో శూన్యం.. ఇళ్ళల్లో శూన్యమే .. ఎక్కడా అలికిడి లేదు సవ్వడి లేదు..
అలాటి శ్మశాన ప్రశాంతి క్షణమయినా తట్టు కోగలమా?
ఒకటి రెండు కాదు ఏకంగా 84 గ్రామాలు. 191 ఏళ్లుగా ఇలాగే నిశాబ్దంగా, నిర్జనంగా, నిజీవంగా నిలబడి శిధిలమయి పోటు ఉంటే. కడుపులో ఎలా ఉంటుంది. మెత్తటి తల్లి పేగుని ఎవరో పదునయిన గోరుతో గీకుతున్నట్టు లేదా?
అయితే ఇంకా చదవండి.
84 గ్రామాలు ఒకప్పుడు అమృత గ్రామాలు. జవం జీవం తో ఉట్టిపడిన గ్రామాలు.
ఇప్పుడు ప్రాణం పోయి మిగిలిన కళేబరాలు,, ప్రజలు విడిచిన ఖాళీ గూళ్ళు
అయితే వీటి వెనక ఒక కమాందుడి నిరంకుశం ఉంది.
గ్రామాలు వాణిజ్యానికి, వ్యవసాయానికి పట్టుకొమ్మలు. ఎడారిలోనూ బంగారం పండించే వారు అక్కడి ప్రజలు. వ్యాపారంలో పట్టిందల్లా బంగారంగా మార్చేవారు. జైసల్మేర్ మహారాజులకు అత్యధిక ఆదాయం గ్రామాల నుంచే వచ్చేది. అందుకే రాజులకు గ్రామాలంటే అమిత గౌరవం. సమృద్ధి నిండిన గ్రామాల్లోని ప్రతి ఇల్లూ ఒక సౌధమే. అన్ని సదుపాయాలు, అన్ని సౌకర్యాలు ఉండేవి. ఇంట్లోనే సువిశాలమైన దేవిడీలు, పెద్దపెద్ద స్నాన ఘట్టాలు .... ఇలా అతులిత వైభోగంతో అలరారేవి. ఎనభై నాలుగు గ్రామాలదీ ఒకే మాట. ఒకే బాట....
జైసల్మేర్ రాజుగారి మంత్రి 'సలీం సింగ్' కి 84 గ్రామాలన్నిటికీ పెద్దగా వ్యవహరిస్తున్న ఆయన కూతురుపై కన్నుపడింది. పరదాలు, ఘోషాలను చీల్చుకుని మరీ చూడగలిగే కళ్లుంటాయి కాముకులకి.
సలీం సింగ్ కళ్లు కూడా అందాల బొమ్మను చూశాయి. నరాలు జివ్వుమన్నాయి. చెట్టుకున్న పువ్వును చూసి సంతోషపడేవాళ్లు కొందరు. దాన్ని దేవుడి పాదాల ముందుంచి తృప్తిపడేవారు కొందరు. గౌరవంగా తలలో తురుముకుని ఆనందించేవాళ్లు కొందరు. కానీ 'సలీం సింగ్' పువ్వును తుంచి, ఒక్కో రేకూ తుంపి, కాలికింద మట్టగించి పాశవిక ఆనందం పొందే రకం.

అమ్మాయిని జైసల్మేర్ లోని తన హవేలీకి పంపించమన్నాడు. లేకపోతే 'పన్నుపోటు' పెరుగుతుందన్నాడు. బతుకు దుర్భరం చేస్తానన్నాడు. తెల్లవారే సరికి మేనాలో అమ్మాయి రావలసిందేనన్నాడు.


తెల్లవారింది....
అమ్మాయి రాలేదు... సలీం సింగ్ తన మనుష్యులని పంపించాడు.
ఆశ్చర్యం..
కానీ ఎనభై నాలుగు గ్రామాల్లో ఒక్క నరపురుగు లేదు. ఇళ్లు ఖాళీ అయిపోయాయి. రాత్రికి రాత్రికి అంత సంపద నిచ్చిన ఆవాసాలను వదిలేసి అందరూ మాయం. సలీం సింగ్ కి తమ అమ్మాయినిచ్చి శాశ్వతంగా అవమానపు చీకట్లో ఉండే కన్నా అర్థరాత్రి ఆత్మగౌరవపు వెలుగును వెతుక్కుంటూ వెళ్లిపోయాయి ఊళ్లు.
ఊరు పోయింది.
కాడు మిగిలింది. ఇప్పుడు చెప్పండి. మెత్తటి తల్లి పేగుని ఎవరో పదునయిన గోరుతో గీకుతున్నట్టు లేదా?
తెల్లవారి వెలుగులో ఖాళీ గ్రామాలను చూసి తెల్లబోయాడు సలీంసింగ్.
సంఘటన 1825 లో జరిగింది.
అప్పట్నుంచే జైసల్మేర్ పాలకుల ఆదాయం తగ్గింది. ప్రభ కూడా తగ్గింది. సలీంసింగ్ అవమానంతో హవేలీకి పరిమితమయ్యాడు. ప్రజల ముందుకు మళ్లీ రాలేకపోయాడు.
ఖాళీ ఇళ్లలో వేరేవాళ్లని చేర్చేందుకు పాలకులు ప్రయత్నించారు.
కానీ శవానికి ట్యూబు ద్వారా ఆక్సిజన్ పంపితే ప్రాణం వస్తుందా?

ఊరొదిలి వెళ్లే ముందు 84 గ్రామాల ప్రజలు ఉమ్మడిగా " పాడుబడిన ఊళ్లో రాత్రి నిద్ర చేసిన వాళ్లకి మళ్లీ మెలకువ రాకూడదు" అని శాపం పెట్టారు. ఒకరిద్దరు సాహసం చేసినా శవాలై  తేలారు.
అప్పట్నుంచీ గ్రామాలు శవాలై , రాచరికానికి స్మశానాలుగా  నిలిచిపోయాయి.







84 గ్రామాలలో నివసించిన పాలీవాల్ బ్రాహ్మణులు ఎక్కడికి పోయారో, ఏమైపోయారో ఎవరికీ తెలియదు. గుజరాత్ లో ముస్లింల అత్యాచారాలు తప్పించుకునేందుకు పాలీ ప్రాంతం నుంచి 1291 లో వాళ్లు జైసల్మేర్ కి వచ్చారు. 524 ఏళ్ల తరువాత సలీం సింగ్ పుణ్యమా అని జైసల్మేర్ నీ వదిలిపెట్టారు.

వాళ్ల ఆత్మగౌరవానికి, కులగౌరవానికి ప్రతీకగా వాళ్ల గ్రామాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. జైసల్మేర్ కి 18 కి.మీ దూరంలో ఉన్న గ్రామాల్లో ఒక గ్రామం పేరు కుల్ ధరా.... అదిప్పుడు ఒక టూరిస్టు స్పాట్. అక్కడి గోడలు, మేడలే కాదు, ఆత్మగౌరవం కోసం అన్నీ వదులుకున్న పాలీవాల్ కులస్థుల కథ కూడా టూరిస్టులను అబ్బురపరుస్తూ ఉంటాయి.


No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...