Monday, 16 January 2017

రిగ్రెట్ అయ్యర్

ఆయనొక రచయిత.
అనేక వ్యాసాలు, కధలు, కధానికలు వ్రాసి వివిధ పత్రికలకీ పంపేవాడు. కానీ ఆయన రాసిన రాతలను ప్రచురించే సాహసం ఏ ఎడిటరూ చేయలేకపోయాడు. అందుకే మీ రచనలు ప్రచురించలేకపోతున్నందుకు క్షంతవ్యులం అంటూ రిగ్రెట్ స్లిప్ లు పంపించే వారు. 
ఆయన పేరు సత్యనారాయణ అయ్యర్!
కానీ అందరికీ తెలిసిన పేరు రిగ్రెట్ అయ్యర్!!
అయ్యర్ గారు తక్కువ తిన్నారా? రాతల్లేకపోతే ఏం, రిగ్రెట్ స్లిప్ లు ఉన్నాయి కదా అనుకున్నారు.
 ఆ రిగ్రెట్ స్లిప్పులను జాగ్రత్త చేయడం మొదలుపెట్టారు.
మొట్టమొదటి రిగ్రెట్ స్లిప్ 1964 లో వచ్చింది. అప్పట్నుంచీ ఇప్పటి దాకా మొత్తం 375 రిగ్రెట్ స్లిప్పులు జమ అయ్యాయి. ఆ స్లిప్పులన్నీ తీసుకుని లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తలుపు తట్టాడు.
ఖంగారు పడ్డ లిమ్కా బుక్కు వాళ్లు ఒక కొత్త కేటగరీనే సృష్టించి, ఈయన పేరిట ఒక సరికొత్త రికార్డు నెలకొల్పారు.
ఆయన పేరు రిగ్రెట్ అయ్యర్ అయి కూచుంది.
తరువాత ఆయన రచనలు ఎన్నో పబ్లిష్ అయ్యాయి. పేరున్న రచయిత అయ్యారు. కానీ రిగ్రెట్ అయ్యర్ అన్న పేరు మాత్రం అలాగే ఉండిపోయింది. ఆయన ఈ విషయంలో ఏనాడూ రిగ్రెట్ అవలేదు.
పైగా రిగ్రెట్ అయ్యర్ పబ్లికేషన్స్ అండ్ ప్రొడక్షన్స్ అనే సంస్థను ఏర్పాటు చేసి యువ ప్రతిభకు పట్టం కడుతున్నారు.
రచనలు తిరుగుటపాలో వస్తే నిరాశచెందక్కర్లేదని ధైర్యం నూరిపోస్తున్నాడు.
ఆయన మంచి ఫోటోగ్రాఫర్ కూడానండోయ్.
ఆయనకు 2011 లో టీ ఎస్ సత్యన్ మెమోరియల్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు కూడా వచ్చింది.
బెంగుళూరులో ఉండే ఈ అయ్యర్ గారిని మన తెలుగువాళ్లు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. లేకపోతే మనం ‘రిగ్రెట్’ అవాల్సి ఉంటుంది.
అనంతపురం జిల్లా కదిరికి 35 కిలో మీటర్ల దూరంలో తిమ్మమ్మ మర్రిమాను అనే మర్రిచెట్టుంది. అది ప్రపంచంలోనే అతిపెద్ద మర్రిచెట్టు. అది అంత పెద్ద చెట్టని గుర్తించి, 1989 లో గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కించిన ఘనత కూడా ఆయనదే.
ఎనిమిదెకరాల విస్తీర్ణంలో 19107 చదరపు మీటర్ల ఆకులు, కొమ్మలతో ఉండే అతి విశాలమైన మర్రి మాను అది. రిగ్రెట్ అయ్యర్ గారు దాన్ని చూసేంత వరకూ ఆ చెట్టు గురించి కదిరి, అనంతపురం ప్రజలకే తెలుసు. అక్కడ ఉన్న తిమ్మమ్మ గుడిలో అప్పుడప్పుడూ దీపం వెలిగేది. ఏడాదికోసారి శివరాత్రి జాతర అయ్యేది. అంతే....
రిగ్రెట్ అయ్యర్ కెమెరా భుజాన వేసుకుని వచ్చి, ఫోటోలు తీసి వ్యాసం రాసి ఉండకపోతే తిమ్మమ్మ మరిమాను ఖ్యాతి అనంతపురంలోనే అంతమైపోయేది. 





యావత్ ప్రపంచమే రిగ్రెట్ అవాల్సి వచ్చేది.
రిగ్రెట్ అయ్యర్ కథ చెప్పే నీతి ఒక్కటే!
 తిరస్కరణ లు పట్టించుకోకుండా విజయం వచ్చేవరకు సాగి పోవటమే జీవితం.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...