Friday, 13 January 2017

డెడ్ & గెలిలీ సముద్రాలు

ఇది పశ్చిమాసియాలో ఉన్న రెండు సముద్రాల కథ.
వీటిని సముద్రాలు అంటారు కానీ, నిజానికి అవి పెద్ద చెరువులు.
రెండూ ఒకే నది నుంచి వచ్చే నీళ్ల నుంచి ఏర్పడ్డాయి. గోలన్ హైట్స్ నుంచి పుట్టిన జోర్డాన్ నది హెర్మన్ కనుమల నుంచి, లెబనాన్ లోని సెడర్ చెట్ల నుంచి రకరకాల ఔషధీ తత్వాలను తీసుకుని, స్వచ్ఛంగా ప్రవహిస్తూ ఉత్తరం దిశగా వెళ్లి ఒక సముద్రంగా ఏర్పడుతుంది. దక్షిణం దిశగా వెళ్లి ఇంకో సముద్రంగా ఏర్పడుతుంది.
ఉత్తరాన ఉన్న సముద్రం పేరు గలీలీ సముద్రం. అది 166 కిలోమీటర్ల వ్యాసం, 21 కి.మీ పొడవు, 13 కి.మీ వెడల్పు ఉన్న సముద్రం.
దక్షిణాన ఉన్న సముద్రం పేరు డెడ్ సీ (మృత సాగరం). అది 50 కిమీ పొడవు, . 15 కి.మీ వెడల్పు ఉంటుంది. 605 కి మీ వైశాల్యం. 
ఒకే నీటి నుంచి పుట్టిన ఈ రెండు సముద్రాల స్వభావ, స్వరూపాల్లో ఆకాశానికి, పాతాళానికి ఉన్నంత తేడా ఉంటుంది. గలీలీ సముద్రం జీవ జంతువులతో కళకళలాడుతూ ఉంటుంది. తీరప్రాంతమంతా చెట్లూ చేమలతో ఉంటుంది.
డెడ్ సీలో మాత్రం కళ్లకు కనిపించని కొన్ని బాక్టీరియాలు తప్ప ఎలాంటి జంతువులూ ఉండవు. నీటిలో లవణాల గాఢత ప్రపంచంలోనే అత్యధికం. 37 శాతం వరకూ ఉంటుంది. ఆ నీరు నోట్లో పెట్టుకులేము. కళ్లలోకి వెళ్తే కళ్లు వాచిపోతాయి. ఎర్రబడిపోతాయి. అత్యధిక లవణాల గాఢత వల్ల మనుషులు నీటిపై తేలతారు తప్ప మునగరు.
ఒకే నది నుంచి పుట్టిన రెండు జలాశయాల స్వభావం ఇంత భిన్నంగా ఎందుకుంది?
గలీలీ సముద్రంలోకి వచ్చిన నీరు బయటకు పోయే మార్గం ఉంది. దాని నుంచి నీరు ఒక ఛానెల్ గుండా బయటకు వెళ్తుంది. డెడ్ సీ సముద్ర మట్టానికి 1300 అడుగుల దిగువన ఉంటుంది. అక్కడినుంచి నీరు బయటకు వెళ్లే మార్గం లేదు. ఎండ వేడికి రోజూ ఏడు మిలియన్ టన్నుల మేరకు నీరు ఆవిరైపోతుంది. లవణాలు అందులోనే ఉండిపోతాయి. దీని వల్ల డెడ్ సీలో లవణాల గాఢత పెరుగుతుంది.
ఈ రెండు జలాశయాలు మనకి ఏదో పాఠం చెబుతున్నట్టు అనిపించడం లేదూ?
ఒకటి వచ్చింది పంచుకుంటుంది. ఇంకొకటి వచ్చింది ఉంచుకుంటుంది.
పంచుకునేది కళకళలాడుతుంది. ఉంచుకునేది కుళ్లి, కృశించి, మృతమైపోతోంది.
బతకడానికి, చావడానికి మధ్య ఉన్న తేడా ఇవ్వగలగడమే!
ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనూ లేనే లేదు అన్నదే ఈ సందేశం కదూ!!










..
(వివిద మార్గాల నుండి సేకరణ)

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...