శెలవు రోజు సాయంత్రం బండి తీసి బయటకి వెళ్తుంటే.. అప్పటికే రెడీ
గా ఉన్న మా అబ్బాయి గబ గబా మెట్లు దిగి వచ్చాడు.
“నాన్నా నన్ను రత్నమహల్ సినిమా హాలు వద్ద దించుతారా? “
“ఏమిటి విశేషం?”
ఈ రోజు మా ఫ్రెండ్స్ కొంతమందిమి “నాన్నకు ప్రేమతో”
సినిమాకి వెళ్దామనుకున్నాం. చెప్పాడు వాడు.
నెలకో సారి ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళటం మామూలే.
“ సరే వచ్చేసేయ్. డబ్బులున్నాయా? “
“ ఆ అమ్మని అడిగి తీసుకున్నాను “
మేము మా ఇల్లు రోడ్డు దాటి మైన్ బజార్లోకి వెళ్ళాం.
“మీరు వెళ్తుంది అటెనా? “ అడిగాడు
పిల్లాడు.
“ లేదురా. మా ఫ్రెండ్ అంజి వాళ్ళ అమ్మగారు హస్పేటల్
లో ఉన్నారు. ఒక సారి పలకరించి వద్దామని వెళ్తున్నాను “
“ఓహ్ .. ఆ అంకులా, శివాని స్కూల్ దగ్గర ఉంటారు. నల్లగా పొడవుగా ?”
“అవును తానే.. వాళ్ళ అమ్మగారి కి ఈ మధ్య ఒక సర్జరీ
చేశారు మరో వారం లో డిశ్చార్జ్ అవుతారు”
మేమిద్దరం ఇలా మాట్లాడుకుంటూ వెళుతున్నప్పుడు
ఎదురుగా వస్తున్న ఒక 'వాను డ్రైవర్' కింద నున్న కుక్కని గమనించకుండా పోనివ్వటం తో దాని
ముందు టైరు కుక్క కాలు మీద నుండి పోవటం అది
హృదయ విదారకంగా మొరగటం క్షణాల్లో జరిగింది.
మేం బండి పక్కన పెట్టి వచ్చేసరికి ఎక్కడినుండి వచ్చాయో గాని చుట్టూ పక్కల గొందుల్లోంచి
కుక్కలు పరిగెట్టుకొచ్చాయి. కాలు విరిగిన కుక్క చుట్టూ చెరీ వాటి అరుపులతో అవి దాదాపు రోడ్డు బ్లాక్ చేశాయి. విరిగిన దాని కాలు
నాలుకతో నాకీ దాని నొప్పి ఉపశమనం కలిగించేందుకు రెండు కుక్కలు ప్రయత్నిస్తున్నాయి.
**
సినిమా హాలు వద్ద పిల్లాడిని దించి “వచ్చేటప్పుడు
ఆటొ కి రా బాబు. అవసరం అయితే నా నెంబరుకు ఫోన్ చెయ్యి నేను వస్తాను “ మా వాడికి చెప్పాను.
“ఒక్క నిమిషం నాన్నా.. ఇప్పుడే వస్తాను ఉండండి
“ వాడు సినిమాహాలు బయట నిలబడి ఉన్న వాడి స్నేహితులతో రెండంటే రెండు నిమిషాలు మాట్లాడి
పక్కనే ఉన్న బంకులో రెండు కొబ్బరి బోండాలు కొట్టించుకుని వచ్చాడు.
“నాన్నా నేను వస్తాను పదండి “ అన్నాడు బండి వెనుక
కూర్చుంటూ ...
మా వాడు పెద్దవాడవటం నేను గమనించాను. మీరు గమనించారా??
No comments:
Post a Comment