24 శనివారం నవంబరు
..
ఎందుకు ఈ వెధవలు ఇలా
తినేసేలా చూస్తారు
శరీరమంతా గొంగళి
పురుగులు పాకి నట్లు బాధపడతామని తెలీదా?
జీవితం లో ఏ ఆడపిల్ల
చిరునవ్వు అయినా దోచుకోగలరా వీళ్ళు ??
ఎందుకు ఈ మగాళ్ల ముందు తలెత్తుకు తిరగలేక పోతున్నాం ? ఆడ పుట్టుక పుట్టిన పాపానికా ? ఎలా స్త్రీ కాళ్ళ వద్ద దొర్లాది
పెరిగిన వీళ్ళు స్త్రీ కి ఇచ్చే గౌరవాన్ని చూడలేకా ??
ఏమిటి ఈ
కుర్రాళ్ళు ఇలా పాడయి పోతున్నారు, మా వెంట పడి తిరిగి విలువైన సమయాన్ని వృదా చేసుకోవటం, లేనిపోని గొప్పలు చెప్పుకోవటం, చేసిన పోకిరి పనులన్నిటిని
సమర్ధించుకోవటం, బురద లోంచి వచ్చిన పంది బురదనే పన్నీరుగా చల్లుకోవటం లాగా ..
గంభీరంగా మా
ఉనికిని గమనించకుండా మితంగా మాట్లాడే అబ్బాయిలనే అమ్మాయిలు ఇష్ట పడతారని ఎప్పుడు
నేర్చుకుంటారు.. ఈ అబ్బాయిలు ... నా సోదరులు
***
26 సోమవారం నవంబరు...
..
ఎందుకు ఎప్పుడూ
ప్రపంచ భారాన్ని మోస్తున్నట్లు అలా నిర్లిప్తంగా ఉంటావు చలాకీగా ఉడాల్సిన వయసులో ?? కొలీగ్ మాధవి అడిగింది. అలా అడగటం
ఎన్నో సారో ?? పద్మూడేళ్లుగా అలవాతయిన నిర్లిప్తత అని చెప్పనా??
అమ్మా నేను
ఒంటరిగా ఈ నరవానరాల మధ్య అనుభవించిన బాదాలన్నీ చెప్పనా?? ఏ దిగులు లేకుండా స్వచ్చంగా నిద్రించిన
గుర్తు లేదని చెప్పనా?
ఏమని చెప్పాను ?? ఒక వెర్రి నవ్వు నవ్వటం తప్ప ??
****
28 బుధవారం నవంబరు ..
..
ఇరవయై అయిదేళ్ళ
నా అందాన్ని నాకు గుర్తు చేసిన రోజు. మొదటగా కొంచెం కోపం వచ్చినా నన్ను ఆనందింప
చేసిన విషయం . ఎవరో అబ్బాయి లెటర్ రాశాడు.
ఖరీదయిన తెల్లటి
కాగితం.
మద్యలో ఒక
స్కెచ్ పెన్ను తో గీసిన ఆకర్షణీయమయిన బొమ్మ. ఒక అపురూప సుందరి ముందు మోకరిల్లి
నకస్కరిస్తూ ఒక సామాన్యుడు కూర్చుని ఉన్నాడు. ఆమె కుడిచేయి అతడిని
దీవిస్తున్నట్లుగా తలమీద ఉంది ఉంది.
మళ్ళీ మళ్ళీ
చూడాలనెంత ముగ్ద మనోహరం గా ఉంది.
ఏ సంభోదనా
లేకుండా కింద ఒకే ఒక వాక్యం ఇంగ్లీష్ లో ఉంది.
I was blessed in the Heaven to find an angel like
you ------ a boy like I
నాలాటి
అడగట్టేని చూడటానికి అతను స్వర్గం లో దీవింపబడ్డాడట .
ఒక్క వాక్యమయినా
అందమయిన పొగడ్త.
ని జాడ త్రాచు
పాము, పెదాలు దొండపండ్లు, ముఖం చంద్రబింబం, కళ్ళు అయస్కాంతాలు లాటి ఉపమానాలు ఎన్ని ఈ వాక్యం ఇచ్చిన
అనుభూతిని ఇవ్వగలవు?? ఉత్తరం దాచుకున్నాను. నా అందానికి వచ్చిన మొదటి సర్టిఫికేట్.
చించే అవసరం
రాదు. అర్ధం చేసుకోలేని బర్త వస్తే తప్ప
దాచుకునే ముందు
మరో సారి చదివాను ఆ ఏకైక వాక్యాన్ని
1 శనివారం డిశంబరు ..
..
నాన్న గుర్తొచాడు .
నాన్న ఛాతీ మీద
కూర్చొని తలకి అటు ఇటూ కాళ్ళు వేసి గుబురుగా ఉన్న ఆయన మీసాల తో ఆడుకోవటం చూచాయగా
గుర్తొస్తుంది.
నేనంటే ఎంత ఇష్టం
నాన్నకి . ఏకైక కూతుర్ని అని కాబోలు
మిలటరీ నుండి వస్తూ ప్రతి సారి నాకు బొమ్మలు, కొత్త కొత్త గౌనులు తెచ్చేవాడు. నాన్న
రావటం తోనే అమ్మ ఎంత హడావిడి పడేది??
ఇద్దరు కల్సి
నన్ను అడిస్తూ ఉంటే నేనెంత సంతోష పడేదాన్ని. అలాటి సంతోషం నా చరమ స్తితిలో నయినా
తిరిగి పొందగలనా?
నాన్న తన
ముఖాన్ని నా పొట్టకి ఆనించి కదిల్చినప్పుడు మీసాలు వత్తుకుని ఎంత చక్కిలిగింత
పుట్టేది? నేనెంతగా నవ్వేదాన్ని??
..
5 బుదవారం డిశెంబరు.
నాకు రెండో
సర్టిఫికేటు. అదే యూనివర్సిటీ (అబ్బాయి) నుండి
అదే కాగితం అదే
పద్దతి.
పగిలిన హృదయపు
బొమ్మ గీచి ఉంది. మధ్యగా ఒక పుష్పం గుచ్చి ఉన్న బాణం ఉంది. చూసిన వెంటనే ఆ బాణం
గుచ్చుకొని ఆ హృదయం పగిలిందా ? అనిపించేలా ఉంది. కుర్రాడెవరో గాని మంచి ఆర్టు ఉంది. చక్కగా
గీశాడు.
క్రింద ఒకే ఒక్క
వాక్యం.
My heart B R O K E .
You CAUSED it . .
అతని హృదయం
పగిలిందట. నేనే కారణమట .
అతడిని
ఆకర్షించిన విషయం ఎంత సున్నితంగా చెప్పాడు? యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డ నాకు
కొద్దిగా సంతోషాన్ని పంచగలిగింది ఈ ఉత్తరం.దాచుకున్నాను .
యెవరయి ఉంటారు?? నాకు తెల్సిన వారు ఎవరు లేరే !!
ఆఫీసులో ఉన్న
ఒక్క బ్రహ్మచారికి వ్రాతే కుదరదు. ఇక బొమ్మలు గీయటం కూడానా? అదీ అంత చక్కగా?
..
7 శుక్రవారం డిశంబరు
అమ్మకి సాయంత్రం
ఫిట్స్ వచ్చాయి. అలా నిశ్చలంగా నిస్త్రాణంగా ఉన్న అమ్మని చూడాలంటేనే నాకు భయం.
రైలు ప్రమాదం లో
చనిపోయిన నాన్న శవాన్ని ముందుగా తెలియపరచకుండా హఠాత్తుగా తీసుకొచ్చారు. ఆ ఘోరమయిన
నిజాన్ని అంత తక్కువ సమయం లో జీర్ణించుకోలేక అమ్మ అలానే కిందికి కూలి పోవటం
నాకింకా గుర్తే.
అప్పుడే
అనుకుంటాను ఈ ఫిట్స్ ప్రారంభం.
పది సంవత్సరాల
పాటు రాత్రింబగళ్లు మిషను కుడుతూ , శరీర కష్టం చేస్తూ, నన్ను అపురూపంగా పెంచి చదువు చెప్పించిన అమ్మ ఆరోగ్యం ఎంత గా
దిగజారింది??
అప్పుడు ఇలానే
ఫిట్స్ వచ్చి అమ్మ మాట్లాడక పోతే ఏమయిందో తేలిక ఒంటరిగా భయమేసి “అమ్మా .. మాట్లాడమ్మా .. నేను బాగా
చదువుకుంటానమ్మా ..మాట్లాడమ్మ.. ఎప్పుడూ నువ్వు చెప్పిన మాట వింటానమ్మా
..మాట్లాడమ్మా “ అంటూ అమ్మ గడ్డం పట్టుకుని ఊపుతూ నేనెంతగా ఏడ్చేదాన్ని.??
నేను అమ్మకి
చేయూత నివ్వగలిగాక మూడో సారి ఇలా జరగడం. కానీ ఈ రోజు అరగంటకి పైగా నిశ్చలంగా భీతి
గొలిపే విదంగా ..
భగవంతుడా మేము
మరుసటి రోజు నాలుగు వెళ్ళు నోట్లోకి వెళ్లడానికి ముందు రోజే దిగులు పడే రోజుల్లో
నిన్ను నమ్మలేదు. నిన్ను తిట్టాను కూడా ...
నాకీ ఉపాది
కలిగాక ఆకలి సమస్యని జయించాక ‘ఎగ్నాస్టిక్’ గా వ్యవహరించాను. ని ఉనికి తో అవసరం లేదనుకున్నాను.
నీ ఉనికి పట్ల
నాకిప్పుడు అపారమయిన నమ్మకం ఉంది.
నా తల్లి
ఆరోగ్యాన్ని కాపాడు. ఈ ప్రపంచం లో నాకు మిగిలిన స్నేహితురాలు, తల్లి , తండ్రి, గురువు , దైవం సర్వం ఆమె !!
.. 8
శనివారం డిశెంబరు
..
అమ్మని హాస్పిటల్ కి
తీసుకు వెళ్ళాను. రానని గొడవ చేసినప్పటికీ
“డాక్టరు నరాలు బాగా నీరసించి పోయాయి. గుండెపోటు వచ్చే ప్రమాదం
ఉంది. ఉద్రేకపడవద్దు . మానసికంగా బాధ పడుతున్నట్లు ఉంది. ఉల్లాసంగా ఉంచండి “ అని చెప్పారు.
హు ... ఇరవై
అయిదేళ్ల కూతురికి పెళ్లి కాలేదని, ముఖ్యంగా అసలు కాదేమోనని
క్రుంగిపోతున్న ఆమెని ఉల్లాసంగా ఉంచడమెలా?
నాకు ఉద్యోగం వచ్చిన
మూడు సంవత్సరాలలో ఎన్ని సంబందాలు వెతికింది ??
నలబై ఇస్తావా ?? యబై ఇస్తావా? అని అడిగేవాళ్లు, అమ్మాయి అందంగా
ఉంది కనుక పది వేలు తగ్గించుకోమని రిబేటు ఇవ్వగలిగిన మహానుభావులే తప్ప బర్త ఎంత
పేదవాయినా జీవితాంతం కలిసి అతని సంతోషాన్ని విషాదాన్ని పంచుకుంటూ అతని ప్రేమ కోసం
తపించే అర్ధాంగిని ఎన్నుకోవటం చాతనయినా వారేనా??
..
12 బుదవారం డిశెంబరు ..
..
ఆ కుర్రాడు మరో
లెటర్ రాశాడు. సరిగ్గా ప్రతి బుదవారం.
హృదయపు ఆకారం లో
ఉన్న ప్రదేశం పై ఓ అందమయిన కోట బొమ్మ ఉంది. కోట ద్వారానికి to let బోర్డు
ఉంది.
I built a
Castle in my HEART and there Is only room for you… A boy like I
అతని హృదయం లో కోట
నిర్మించాడట. అందులో నా ఒక్కదానికే స్థానం ఉందట. నా మనసుని కల్లోలపరచడానికి, ఆశలు
రేకెత్తించడానికి ఈ వాక్యం చాలు. నవ్వుకున్నాను భావాన్ని ఇంత సున్నితంగా
రాసినందుకు.
ప్రేమలేఖ రాయగలిగిన
కుర్రాళ్ళు తమ ఉనికిని తెలుపు కోవటానికి భయపడతారు ఎందుకో?? వివాహానికి
వెంటపడతామని కాబోలు.
చాలా చాలా ఆలోచనలు
వచ్చాయి రాత్రంతా ..
..
14 శుక్రవారం డిశెంబరు...
..
ప్రపంచంలోకల్లా
విలువయినది ముఖ్యమయినది ‘డబ్బే’నట మాధవి అంది.
ఆవేశం లో చేసిన
తప్పుకి శిక్ష గా పుట్టిన బిడ్డని తల్లి వదల్లేదు ఎందుకని?
కేవలం జన్మనిచ్చిన
కారణంగా తను ఏ పనయినా చేసి బిడ్డని పోషిస్తుందే?
పసుపు తాడు కట్టగానే
అతడిని కొంగుచాటున దాచి కాపాడుకుంటుదే స్త్రీ ..
ఈ ప్రపంచం లో
విలువయినది డబ్బుకాదు. అమ్మ లేదా సెంటిమెంటు.
..
16 ఆదివారం డిశెంబరు ..
..
అతనెవరో అందమయిన
బార్య దొరికేతే పది వేలకే చేసుకుంటాను అన్నాడట.
తీరా అతని కంటే నేను
ఎక్కువ చదివానని తెల్సి 'వద్దు బాబోయ్' అని చేతులెత్తేసాడట. అమ్మ చెప్పింది.
పాపం 'మేల్
కాంప్లెక్స్' అడ్డొచ్చింది కాబోలు.
ఈ మద్య మరో జీవి
కట్నం వద్దు ఏమి వద్దు అని ముహూర్తాల వరకు వస్తే అమ్మ ఎగిరి గంతేసినంత పని
చేసింది.
నేనూ ఆనందించాను. మన
మధ్య ఇంకా 'హీరోలు' ఉన్నారని ఎంతగానో అభిప్రాయపడ్డాను. నా ఉద్యోగం ప్రవేటు దని ఏ
క్షణాన అయినా ఊడొచ్చని తెలుసుకుని మాయమయ్యాడు.
ఈ దేశం లో ఎంతమంది
అమ్మాయిలు వివాహం అనే పవిత్ర బంధాన్ని అనుభవించాలని అబ్బాయిలని కోరుకుంటున్నారు?
ఈ సమాజం లో రక్షణ
కోసం తప్ప.
అండ్ హొ మేని అరె
బీయింగ్ క్రషెడ్ అండర్ ది ఫీట్ ఆఫ్ దిస్ బార్బేరియస్ డౌరి లైక్ మీ .
.
19 బుదవారం డిశంబరు ..
..
ఒక సెలయేటి ప్రక్కన
నిర్మానుశ్యంగా ఉన్న ప్రాంతం లో పూల మొక్కల మద్య ఓ చిన్న పర్ణశాల
I built a
HOUSE and you can only make it HOME.--------- నేను.
అతన్ని సంతోష
పరచగలిగే దాన్ని నేనొక్కతినే ఆట.
అయితే ఏమిటట?. నన్ను వివాహం
చేసుకుంటాదా ?? నా బీదరికం, టెంపరరీ ఉద్యోగం తెలిస్తే పారిపోతాడా అబ్బాయి.
..
25 మంగళవారం డిశంబరు...
..
నిద్రపోయే ముందు
బుదవారపు ఉత్తరాలు రాసే కుర్రాడు జ్ణాపకం వచ్చాడు. ఆలోచనలన్నీ అతన్ని ఊహించడమే.
ఈ అమ్మాయిలంతా
ప్రేమలేఖలకి ఎందుకు బయపడతారు?. ఇంత మధుర మయిన అనుభూతి ని వద్దనుకుంటారు?. బహుశా బాహ్య నటన
కాబోలు.
లేక మరేమయినా??
ఎవరతను? ఎలా ఉంటాడు ? ఏం చేస్తుంటాడు ??
కొద్ది రోజుల్లోనే
మనసంతా ఆక్రమించాడు...
ఇంతకీ రేపు బుధవారం
కదా?? grin emoticon..
''
26 బుధవారం డిశంబరు ..
..
పెళ్లి దుస్తుల్లో
ఉన్న అమ్మాయి, అబ్బాయి ఒకే దండలో ఒదిగి ఉన్న బొమ్మ అది.
Companionship
is a beautiful thing that fills the most important need of the human HEART.
కాదని నేనన్నానా? అసలు అతని
ఉద్దేశం అర్ధం కావటం లేదు.
అతని జీవితం లోకి
నన్నుఆహ్వానిస్తాడా?
మరి ఈ దాగుడు మూత
లెందుకు?? ఓ అబ్బాయి? ని పేరయినా
వ్రాయి.
28 శుక్రవారం డిశంబరు
..
రోజంతా కొట్టుకుంటూ, తిట్టుకుంటూ
గడిపినా కుటుంబ సబ్యుల మధ్య ఎంతో బలమయిన బందం ఉంటుంది. ఒకరి మీద మరొకరికి ఎంత
అప్యాయతలు ఉంటాయో అన్నీ అనుభవించే వాళ్ళకు తెలియక పోవచ్చు. కోల్పోయిన నాలాటి
వారికి తెలుస్తుంది వాటి విలువ. నా పరిస్తితి కొంత మెరుగు. కడుపులో దాచుకోటానికి
నాకు అమ్మ ఉంది చాలు.
..
30 ఆదివారం ..డిశంబరు .
..
అమ్మకి మళ్ళీ
అనారోగ్యం. డాక్టరు దగ్గరికి రానంది.
“ఇంకా ఎంత దూరమని ప్రయాణం. నాకు మరణం వచ్చినా బావున్ను” అంది.
అమ్మ ఎంత బాద
అనుభవిస్తూ ఉంది. ఆడపిల్లని కనడమేనా ఆమె చేసిన తప్పు ??
అమ్మని ఎలాగయినా
కాపాడుకోవాలి. తనకి ఏమయినా జరగకూడనిది జరిగితే..
ఊహూ ఆ ఉహే
బయంకరం.
భగవంతుడా అమ్మతో
నే నేను వచ్చేస్తాను...
..
2 బుదవారం జనవరి...
..
ఆ కుర్రాడు
గ్రీటింగ్ పంపాడు.
పేరు వ్రాశాడు.
కొమ్మ మీద ఒక దాని పక్కన మరొకటి ఒదిగి ఉన్న చక్కటి పావురాళ్ల జంట 3D గ్రీటింగు.
సులోచనా...
I welcome you soon. ------ ప్రభాకర్ ..
..
6 ఆదివారం జనవరి...
..
ప్రభాకర్ ఉత్తరం
నన్నెంత సంతోష పెడుతుంది. ఇదంతా నిజమేనా?
నువ్వు కనబడే
వరకు ఈ ఉద్యెగాన్ని భరించగలనా..
ఎంత సున్నితంగా
కన్విన్స్ చేశావు నన్ను. ఎలా ఉంటావు ??
త్వరలో కనబడు..
కొద్దిపాటి దైర్యం చెయ్యి మిత్రమా ..
..
9 బుదవారం జనవరి ..
..
ప్రభాకర్ ఉత్తరం
రాయలేదు ??? ఎందుకని ??
ఏ అనారోగ్యమయినా
ఆపిందా ?? చ చ అలా అయి ఉండదు.
పోస్ట్ మిస్ అయి
ఉంటుంది. ఎదురు చూస్తాను. ..
..
22 మంగళవారం జనవరి...
..
ఈ రెండు వారాలు
ఎంత నరకం. తెలియని అశాంతి
ఎవడీ వెదవ నిర్మలంగా
ఉన్న మనసుని కల్లోల పరిచాడు. శాడిస్టిక్ లక్షణాలు పెంచుకుంటున్న వాళ్ళలో ఒకడు కాదు
కదా??
ఈ ఉత్తరాలు
రాకున్న బావుండేది .
ఆహ్వానిస్తాడట.
ఆహ్వానిస్తాడు.
ఎక్కడికి ?? నరకానికా ?? ..
23 బుధవారం జనవరి
..
ఈ రోజు ఎంత శుభ దినం
?? ప్రభాకర్ ఉత్తరం
రాశాడు వివరంగా.
‘నా వయసు ఇరవై ఏడు . IOB లో పనిచేస్తున్నాను,
painting చెస్ ఆడటం ఇష్టాలు. మీ గురించి
పూర్తిగా తెల్సు.
మీ అమ్మగారి
గురించి, మిలటరీ లో మా నాన్నగారి స్నేహితులయిన
మీ నాన్నగారి
గురించి, మీ అమ్మగారి అనారోగ్యం గురించి,
మీ నాన్నగారి
మరణం గురించి అన్నీ ...
..
ముఖ్యంగా మీ
సింప్లిసిటీ గురించి, ..
రెప్పవాల్చకుండా
చూడాలనిపించే మీ అందం గురించి కూడా తెలుసు,
నా కోసమే మీరు
పుట్టారనుకున్నాను. ఆదివారం సాయంత్రం గాంధీ పార్కు కి రండి.
నేను మిమ్మల్ని
చాలా సార్లు చూశాను. నేనే పరిచయం చేసుకుంటాను.
మనసు విప్పి
స్నేహితుల్లా మాట్లాడుకుందాము. మీరు ఒంటరిగా రానవసరం లేదు.
మీ
స్నేహితురాలినేవారినయినా వెంటబెట్టుకు రావచ్చు.
మీ బోండాం మాధవి
నయినా సరే. నేనేం అసబ్యంగా ప్రవర్తించను.
సిగిరెట్లు
తాగుతాను. రెండు మూడు సార్లు బీరు కూడా తాగాను.
మీరు బాగా
ఆలోచించుకోండి. నన్నే ఎన్నుకోమని బలవంత పెట్టాను.
మీ
అభిప్రాయానికి గౌరవం ఇస్తాను.
..
నా మనసులో మాట
సరిగా చెప్పగలిగానో లేదో.
మీరు
మరెవరినయినా ఇష్టపడితే రానక్కర్లేదు. మనం కలవాల్సిన అవసరం లేదు.
నేను ఎదురు
చూస్తుంటాను”..
..
ఈ వెలుతురు
చీకటిగా మారే లోపు ఎన్ని సార్లు చదివానని, పదేళ్ళ తరవాత కూడా అప్పు చెప్పగలను.
ఎంత సిన్సియర్ గా రాశాడు ??
వాళ్ళ నాన్నగారు
మా నాన్న గారు స్నేహితులా??
ఆఫీసులో టైప్
చేసిన మాటర్ లో తప్పులున్నాయన్నాడు మేనేజరు . లివు పడేశాను వాడి మొహాన. వీడేవాడు? నా ఆనందాన్ని అనుభూతిని
బంగపరచడానికి.....
నిన్న రాసుకున్న
ఒక మూడక్షరాల పదం ఉంచనా?? కొట్టేయనా?
ఉంచుతాను.
ఎందుకంటే నిన్న.. నిన్నే
..
25 శుక్రవారం జనవరి
..
పండ్లు
తోముకునేది టూత్ పౌడర్ తో కదా ఫేస్ పౌడర్ తో కాదనుకుంటానే ?
కాటుక కళ్లకేనా
నుదుట పెట్టుకోకూడదా ఏం ??
రెండ్రోజులు గా
పరద్యానంగా ఉన్నానట ! అయినా ముఖం కళగా ఉందట అమ్మ అంది. ..
..
27 ఆదివారం జనవరి...
..
పదిహేనేళ్ళ గా
నేను అనుభవించిన ఒంటరితనాన్ని, వెలితిని జయించిన అందమయిన సాయంత్రం . ఒంటరిగానే వెళ్ళాను.
“ ప్ర భా క ర్ “ కలిశాడు. తానే పలకరించాడు.
పొడవుగా,కొంచెం సన్నగా, దృడంగా ఎంత బావున్నాడనీ,
అతను ప్రభాకర్
కాదంటే నా కళ్ళకి నచ్చక పోవచ్చు గాక. అది వేరే విషయం.
..
చీవాట్లు
పెట్టడానికి వచ్చాను నేను “ కోపం నటించడానికి కష్ట పడ్డాను...
.
“ అబద్దాలు చెప్పటం అందరికీ చేత కాదు. చీవాట్లు పెట్టటానికి
ప్రత్యేకంగా అలంకరించుకుని సిటీ బస్ స్ట్రైక్ అయినా మూడు మైళ్ళు నడిచి
రానక్కర్లేదు” నవ్వాడు. నేనేం మాట్లాడలేదు..
..
పది నిమిషాల్లో
నా మొహమాటాన్ని, బిడియాన్ని పోగొట్టాడు. ఎంత స్నేహంగా మాట్లాడాడు ? , నెమ్మదిగా నీరసంగా తిరిగిన కాలం ఎంత
వేగంగా హడావిడిగా పరిగెట్టింది.??
నాలుగు గంటలు
మాట్లాడుకున్నాం. బాగా ఆలోచించి నా ఇష్టాన్ని చెప్పమన్నాడు. రాయాలని కూర్చుంటే ఏది
లిపి లోకి మారదే?? ఏ అక్షరాల కూర్పుతో నా ఈ ఆనందాన్ని రాసుకోగలను. వస్తూ త్రాగిన
లిమ్కా బావుంది. బాయ్ ఫ్రెండ్ తో తాగిన మొదటి లిమ్కా ...
.. 4 సోమవారం ఫిబ్రవరి
..
ఒంటరి ఆడపిల్లని
చూస్తే ప్రతి ఒక్కరికీ చులకనేనా?? ఏ ఒక్కరికీ సానుభూతి లేదా??
‘చేరదీస్తాను’ అని ఎంత గొప్పగా చెప్పాడు ఎదురింటి బాన కడుపు ముసలాడు. నా కన్నా
వయసులో పెద్ద కూతురు ఉన్న విషయం మర్చి పోయాడా??
వాడు కుసిన కూత నా
మనసుని ఎలా చిత్రవద చేసింది. ఎలా తెలుస్తుంది ఆ కుక్కా , నక్కా, పంది, చుంచు, ఏలకా, గాడిదకి ??
..
6 బుధవారం ఫిబ్రవరి.
..
ఈ బుధవారం నేను ఉత్తరం
బాంకు అడ్రేస్ కి వ్రాసాను.
ఒకే ఒక వాక్యం నా
మనసులో ఉన్న ఆనందానికి మూలమయిన మాటని
How
deliciously you have sown the seed of love in my fallow heart .. సులోచన
..
10 ఆదివారం ఫిబ్రవరి
..
స్నేహితురాలి
ఇంటికని అమ్మతో చెప్పి లైబ్రరీ కి వెళ్ళాను.
ప్రభు ఆదివారాలు
అక్కడ ఉంటానని చెప్పాడు.
నన్ను చూడగానే అతని
కళ్ళల్లో వింత మెరుపు.
తన ఇంటికి
తీసుకెళ్తానన్నాడు.
“మీ అమ్మ కొడుతుంది “ అన్నాను నేను.
ఆహా అది చూద్దాం “ నవ్వాడు తను.
అబ్యంత రం
పెట్టేకోందీ తీసుకెళ్ళాడు. అతని బైక్ ఎక్కాను. ఆ సాయంత్రం చల్లని గాల్లో అతనలా
వేగంగా బైక్ నడుపుతుంటే అతని నడుం చుట్టూ చెయ్యి వేయకుండా ఎలా కూర్చోవటం.
ఇంట్లోకి
వెళ్ళటానికి భయపడుతుంటే అనసూయమ్మ గారు ఊ హు హు అత్తయ్య గారు ఆహ్వానించారు. మామయ్య
గారిని ఎక్కడో చూశాననిపించింది.
నా విషయం
పెద్దవాళ్ళిద్దరికి తెలుసట. ఇదంతా మామయ్య గారి ప్రోత్శహమేనట. నేను బ్రమ లో
ఉన్నానేమో నన్న అనుమానం నన్నికా విడలేదు.
అత్తయ్య ఆప్యాయంగా
మాట్లాడింది. నా డైన్యాన్ని వాళ్లెంతగా పంచుకున్నారు.
ఈ అప్యాయతకేగా నేను
మొహం వాచి ఉన్నాను.
నన్ను సెలెక్ట్
చేసింది మామయ్య గారెనట. ప్రభాకర్ కి ఉద్యోగం వచ్చాక ఇక్కడికి వచ్చారట. ఆర్నెల్ల
క్రితం . అప్పుడే వారికి తెలిసిందట మేమిక్కడే ఉంటున్న విషయం. పలకరించి పోటానికి మా
ఇంటికి కూడా వచ్చారట. అప్పుడే చూసిన జ్నాపకం. నా మనసెంత తేలిక పడింది.
ప్రపంచం లోని ఏ బాద
నన్నెమి చేయలేదు. ప్రభాకర్ నా తోడు ఉన్నంత వరకు. అవును ప్రభాకర్ ఏమిటి పొడుగ్గా. “ ప్రభు . అవును
ప్రభూ”
అక్కడే ముఖం
కడుక్కుని కాఫి తాగాను.
వీలున్నప్పుడల్లా
రమ్మని అతయ్య మరి మరి చెప్పింది.
ప్రభు వీది చివరవరకు
దించి వెళ్ళాడు.
ఎదురు చూస్తున్న
అమ్మకు అబద్దం చెప్పాను.
నాలుగు రోజుల్లో
మామయ్య గారే వస్తారుగా అన్నీ వివరాలు చెప్పటానికి .
నిద్రెలా వస్తుంది.
ప్రభు చూపుల నుండి తప్పించుకోవటం తోనే సరిపోయింది.
..
14 ఫిబ్రవరి గురువారం
..
తలంటు పోసుకుని
తయారుగా ఉన్నాను. అమ్మకేలా చెప్పటం.
మామయ్య, అత్తయ్య, ప్రభు ముగ్గురూ
వచ్చారు.
మొదట కంగారు పడ్డా
పూర్తిగా విన్నాక అమ్మ ఎంత సంతోష పడింది .
చిన్నగా గుండెల్లో
నొప్పి అని మమ్మల్ని కంగారూ పెట్టేంత.
సింపుల్ గా 'రిజిస్తార్
మారేజి' చేయటానికి
నిర్ణయించి వెళ్లారు. బోజనాల తర్వాత .తమ తరఫున కూడా ఎక్కువ మంది బందువులు లేరట, స్నేహితులు తప్ప.
‘వచ్చిన వారెవరూ?’ అంటూ ఆరా తియ్యను వచ్చిన వారికి అమ్మ
ప్రభు గురించి మామయ్య గురించి ఆనందం గా చెబుతూనే ఉంది. పొద్దు పోయెవరకు.
మా కింత ఆనందాన్ని
పంచిన మీ అందరినీ అపురూపంగా చూసుకుంటాను ప్రభూ __
18 సోమవారం ఫిబ్రవరి
..
నిన్నెంతగా ఎదురు
చూశాను. ప్రభూ వస్తేనా?? ఈ రోజు బాంకు కి వెళ్ళాను. నన్ను చూస్తూనే దగ్గరగా వచ్చాడు.
నవ్వుతూ
“మీ కోసం రాలేదు, ఆకవుంటూ ఓపెన్ చేద్దామని వచ్చాను’
కోపం నటించడం చాలా
కష్టం. అది ఈ పిల్లాడి ముందు.
“నీకో విషయం చెప్పనా ఒక అందమయిన సులోచన లాటి అమ్మాయి ఆలస్యంగా
ఇంటికొస్తే తల్లి అడిగిందట ఆలస్యం ఎందుకయింది అని . దానికా అమ్మాయి దారిలో నావెంట
ఒక రోమియో పడ్డాడు అని అందిట”
“రోమియో వెంట పడితే ఆలస్యం ఎందుకవుద్ది “ నేను అడిగాను.
“సరిగ్గా ఇదే అడిగిందట ఆ తల్లి. అందుకా అమ్మాయి ‘నన్నెం
చెయ్యమన్నావు అతను చిన్నగా నడిచాడు’ అందట. తలవంచుకున్నాను. అతనికి నా
బుగ్గలు కనబడకుండా..
ప్రభూ నిన్ను విడిచి
నేను జీవించగలనా ?? ఎక్కడున్నావు ఇన్నాళ్ళు ?
..
25 సోమవారం ఫిబ్రవరి
..
ప్రభూ ఉత్తరం రాశాడు.
I am not
able to do anything because my everything is with you
ఇద్దరం ఒకే నావలో
ప్రయాణం చేస్తున్నాం అబ్బాయ్.
..
28 గురువారం ఫిబ్రవరి
..
మామయ్య నేను ప్రభు
కలిసి రిజిస్టర్ ఆఫీసుకి వెళ్ళాం. వివాహానికి అప్పికేషను పెట్టాం. నెల రోజుల
గడిచాక మంచి రోజు చూసుకుని రమ్మన్నారు.
మామయ్య, పంచాగాలు, కాలండర్లు, జాతకాలు గట్రా
తిరగేసి ఏప్రియల్ 2 వ తేదీని వివాహపు రోజుగా నిర్ణయించారు.
సరిగ్గా నెల. ముపై
రోజులు. ఏడువందల ఇరవై గంటలు .
..
3 ఆదివారం మార్చి
..
అమ్మకి ఆరోగ్యం
పుంజుకుంది. షి నీడ్స్ నో మెడిసిన్స్. తనకి ఈ ఆనందం చాలు. జీవించి ఉండాలనే
కోర్కెకి జీవం పోసేందుకు.
ఐ యామ్ సుపీరియర్ టు
సొ మేని గర్ల్స్
..
4 సోమవారం మార్చి.
..
ప్రతి గురువారం, ఆదివారం
కలుసుకోవాలని ప్రభు నేను అనుకున్నాం. ప్రభు వ్రాసిన ఉత్తరాలన్నీ బయటకు తీసి నిద్ర
వచ్చేంత వరకు చదువుకున్నాను.
..
7 గురువారం మార్చి
..
శెలవు పెట్టి
అత్తయ్య దగ్గరకు వెళ్ళాను. ప్రభు బాంక్ కి వెళ్ళాడు. మామయ్య కూడా లేరు.
“ప్రభు తో గడపటాన్నే ఇష్టపడతావనుకున్నాను. నన్ను చూడాలని
పించిందా” అత్తయ్య నన్ను
ఉడికిస్తూ అంది.
నవ్వాను. నాకోసం
కొబ్బరి లౌజు చేసింది.
సాయంత్రం ప్రభు
వచ్చే వరకు మాట్లాడుకున్నాం. మామయ్య అత్తయ్య ది ప్రేమ వివాహం ఆట. అందుకే బందువులు
పెద్దగా రారాట. అత్తయ్య చెప్పింది.
అత్తయ్య ఎంత
సమార్దురాలు కాకుంటే ప్రభు వ్యక్తిత్వాన్ని ఇంత గొప్పగా తీర్చి దిద్దగలరు ?
అందరూ తల్లులూ ఇంత
ఉన్నతంగా ఉంటే ఈ సజీవ దహనాలు, బలవన్మరణాలు, కట్నాలు ఉండేవా మన మధ్య ??
ప్రభు వచ్చాక
అడిగాను. ‘బైక్ కొని సంవత్సరం దాటింది కదా ఇంకా ఇంట్లో ఆ 'L' బోర్డు ఎందుకు?” అని.
అత్తయ్య ఆటుపోగానే ‘ రేపు మన బెడ్ కి
తగిలించుకోవచ్చని” అన్నాడు.
వంచిన తల ఎత్తితే వొట్టు
.
“మా అమ్మని కాకా పడుతున్నావెందుకు ?” బైక్ మీద
దిగబెడుతూ అడిగాడు.
“ని కోసమే “ లోపలికి పరిగెడుతూ చెప్పాను.
..
10 ఆదివారం మార్చి
..
అమ్మా నేను వెళ్ళాం.
పెద్దవాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే నేను ప్రభు గదిలో దురాను. నా మనసంతా హాయిగా
పతంగం లా ఉంది.
చెస్ ఆడాం ఇద్దరం.
నేన్ను గెలిపించాలని తను ఎంత అజాగర్తగా ఆడినప్పటికి నేనే ఓడిపోయాను.
“మీదే పై చెయ్యి “ అన్నాను.
“ఎక్కడయినా నేను పైనే “
సమాదానం చెప్పటానికి
తలెత్తాను. ప్రభు నవ్వుతూ నా కళ్ల లోకి చూస్తున్నాడు. అప్పుడు అర్ధమయింది పూర్తిగా
అతనన్న మాట.
ఆహా.. పిల్లాడికి మాటలు
కూడా వచ్చు ..
..
14 గురువారం మార్చి
..
సోమవారం పుట్టిన
రోజు అని చెప్పాను.
పుట్టిన రోజు సులోచన
ఎలా ఉంటుందో చూడాలి .అన్నాడు.
ఈ మద్య ముదురు మాటలు
మాట్లాడుతున్నాడు. కానీ ఇంకెన్నాళ్ళు ?
“ఆ రోజు పనులు ఏమి పెట్టుకోకు. సినిమాకి వెళ్దాం “
..
17 ఆదివారం మార్చి
..
లైట్ డిజైన్ ఉన్న
తెల్లటి ఆర్గండి చీర ప్రజంట్ చేశాడు పుట్టిన రోజు కి అడ్వాన్స్ గా. ఎంత బాగుందనీ.
రేపు నేనిది
కట్టుకోవాల్ట. తను చెప్పాలా?
“ఇలాటి పెద్ద డిజైన్ లు ఉన్న చీర కట్టుకుని నన్ను భయ పెట్టవద్దు” అన్నాడు.
చిన్న డిజైన్స్
ఇష్టం అన్నమాట. ఈ చీర 'ప్రభు' ముందెప్పుడు కట్టుకొను..
చి. చి నా బాష కూడా
శృతి తప్పుతుంది.
ప్రభూ ఇంకా చెప్పు
నిమేమి ఇష్టం ??
..
18 సోమవారం మార్చి
..
ఎప్పటి లాగా
నేనెందుకు పుట్టానా? అని బాధ పడ లేదు
ప్రభు మెప్పు
పొందేలా ఎలా అలంకరించు కోవాలా అని ఆలోచించాను. కలిసి వెళ్ళాం ముందు గుడికి, హోటల్ కి తరువాత
సినిమాకి ..దారి లో పూలు కొనిచ్చాడు.
“ఇవన్నీ పెళ్లి తర్వాత చెయ్యాల్సిన పనులు” జడలో
పెట్టుకుంటూ అన్నాను.
“కానే కాదు అవి వేరుగా ఉన్నాయి. మరో రెండు వారాలు ఆగు చెబుతా” ముఖం దాచుకునే
అవకాశం కూడా లేదు. రౌడీ పిల్లాడు. కానీ అదేమిటో రౌడీ పిల్లాడు కూడా నచ్చాడు.
వీర బోరు సినిమా .
మూలగా కూర్చున్నామ్. తను సినిమా చూస్తేనా?? నా వయిపే చూస్తూ కూర్చున్నాడు.
సినిమా చూడండి “ చిన్నగా
చెప్పాను.
బుద్దిగా తెర వైపు
చూస్తూ కూర్చున్నాడు.
“ఏం బాగుందని అటే చూస్తున్నారు ?”
నవ్వాడు నావైపు చూసి
. బలే సిగ్గెసింది.
“సినిమా బాగుందా ??” బయటకి నడుస్తూ అడిగాడు.
“చాలా బాగుంది.” “ఇంత బోరు సినిమానా?”
“ఊహూ నీతో కలసి చూడటం “
ఆ చిన్న వాక్యం
నన్నెంత సంతోష పెట్టింది అంటే అతని చేతిని గట్టిగా పట్టుకునేంత.
..
22 శుక్రవారం మార్చి
..
ఉగాది . నిన్న ప్రభు
కలవలేదు.
లెటర్ వ్రాసాను.
స్కెచ్ పెన్ను తో మూసి ఉన్న పెదాల బొమ్మ వేసి కింద రాశాను.
“ఓన్లీ యువర్ డ్రీమ్స్ డార్లింగ్ “
24 ఆదివారం మార్చి.
..
నిన్ననే ఆఫీసుకి
శెలవు పెట్టాను.
అమ్మా, నేను కలిసి
ఇల్లు శుభ్రం చేశాం. సున్నం వేయించాము.
నాలుగురయిదురు బందువులు (?) వచ్చారు. ఇన్నాళ్ళు మేమేవరమో ఎవరికి
తెలీదు. ప్రభు పనుల వత్తిడిలో ఉన్నాడు. కలవటం విలవలేదు.
ప్రభు ని చూడాలి
ఎలా ?
..
29 శుక్రవారం మార్చి.
..
ప్రభుని
చూడకుండా రెండు రోజులు కాదు కదా? రెండు క్షణాలు కూడా జీవించలేదు. అత్తయ్య ఇంటికి వెళ్ళాను.
అత్తయ్య హడావిడి లో ఉంది. ఎవరో కొద్ది మండి గెస్ట్ లు కూడా ఉన్నారు. అత్తయ్య నన్ను
పరిచయం చేయగానే “అప్పుడే పెళ్లి కళ వచ్చేసిందే” “సిగ్గు మొత్తం అప్పుడే ఖర్చు చేయకు” అంటూ చమత్కారాలు ప్రారంభించారు.
ప్రభు రావటం తో
నే తన గదిలోకి వెళ్ళాను. ముఖ్యమయిన స్నేహితులను స్వయంగా పిలవటానికి వెళ్లాడట.
“ఏమిటి ఈ వేళ అప్సరసలా వెలిగిపోతున్నావు” పరిక్ష గా చూస్తూ అన్నాడు .
“ఈ ఋషి కోసమే.” అన్నాను.
ప్రభు నిజంగా
ఋషే . అతని వైపే చూశాను. నా కళ్ల భాష అర్ధం అవక పోవటం ఏమిటి?
“అలా చూడకు. నిన్నేమయినా చేయాలని పిస్తుంది”
“ఏం చేయాలని పిస్తుందట?” ప్రశ్న కంటే ఆహ్వానం ఉంది అందులో .
ఇలా రా
చెబుతాను. “ ఒక బార్య బర్త ఇంటికి వచ్చినప్పటి నుండి నీళ్ళు తోడేటప్పుడు, టవల్ అందించెటప్పుడు , బోజనానికి పిలిచే టప్పుడు, బోజనమ్ చేసేటప్పుడు, అతని వైపే చూస్తూ త్వరగా కానివ్వండి
నిద్దరొస్తుంది అన్నదట” అదే ని చూపుకి అర్ధం.
విసురుగా బయటకి
రాబోతున్న నన్ను జబ్బ పట్టుకుని దగ్గరకి లాక్కున్నాడు.
“మొరటు వాడివి బాబు” గోణిగాను.
వెన్నెల్లో
ఆడపిల్ల నవల్లో ఒక వాక్యం గుర్తొచ్చింది.
How delicious is the winning of a kiss at the loves
beginning.
..
31 ఆదివారం మార్చి.
..
పుట్టినప్పటి
నుండి అనుభవించాల్సిన ఆనందాన్ని , సంతోషాన్ని , జీవిత మాధుర్యాన్ని కొద్ది రోజుల్లో నే అనుభవించాను. సరిగ్గా ఒక
జీవిత కాలపు విషాదాన్ని జీర్ణించుకున్న తర్వాత.
ప్రభు తోడుగా
ఉన్నత పరాకు తిరిగి ఆ ఒంటరితనం, వ్యధ నన్ను తాకలేవు.
ప్రభు లాటి
స్నేహితుడు నా జీవితపు ఆరభం నుండి ఉంది ఉంటే ఎంత బాగుండేది?
నేను ని కేమి
ఇచ్చుకోగలను. ప్రభూ నున్ను నా గుడెల దగ్గరగా లాక్కుని ని ని జుట్టు చెరిపేసి, ని నుదిటిని చుంబించాలని ఉంది. అంతటి
చనువు నాకెప్పుడూ ప్రసాదిస్తావు?
రెండురోజుల
తర్వాతనా ??? మిత్రమా ..
1 ఏప్రిల్ సోమవారం
విది ఎంత
క్రూరమయినది ప్రభూ ..
వాహనం రూపం లో వచ్చి
తన వికృతి పాదాల్తో, నిర్దాక్షణ్యంగా నిన్ను నాకు దూరం చేసింది.
ఈ భూమి మీద నాకు
తోడుగా నివున్నావన్న ఆనందం తో తేలిపోతున్నాను. తన కఠినత్వపు కబండ హస్తాలతో నిన్ను
తిరిగి ముంచింది. నా కళ్ల వెంట కన్నీటి బొట్టు జారదే ??
నేవు లేవన్న ఆలోచనే
జీర్ణించుకోలేను. నడి రోడ్డు లో రక్తపు మడుగు మధ్య నిన్ను చూసినప్పటికి.
జీవించేందుకు బాదపడరాదు. బాధపడుతూ నేను జీవించలేను.
ఈ ఆనంద
బాస్పాలని నేను విషాదానికి చిహ్నం గా ఎందుకు జార విడవాలి?
ఏ మృత్యువు
విడదీయలేని ఆ లోకానికే ఇద్దరం వెళ్దాం. నువ్వు కొంచెం ముందుగా వెల్లావు. వివాహపు
ఏర్పాట్లు చేయటానికి పులదండతో నన్ను ఆహ్వానించడాని. అంతేగా జరిగింది.
ఇక్కడ మనాన్ని
విడదీయగలిగిన మృత్యువు సయితం అక్కడ ఓడిపోతుంది గా.
వస్తున్నాను. ని
కౌగిలి కోసం పరిగెత్తుకు వస్తున్నాను. కన్నీళ్లతో కాదు సంతోషం తో.
ఎలాటి విపత్తు
కి భయపడనక్కర్లేని ఆ స్వర్గం లోనే కలిసి జీవించబోతున్నామనే సంతోషం తో.
మరో శుభవార్త ..
నీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది. ఆ రక్తపు మడుగులో లారీ క్రింద నజ్జు నజ్జయిన ని శరీరాన్ని
చూసిన కొద్ది నిమిషాల్లోనే గుడెపోటుతో మీ అత్తయ్య అక్కడికి వచ్చింది. మన
వివాహానికి పెద్దగా
ఉదయం కదా
ముహూర్తం . ముహూర్థపు క్షణాలకు వీలయినంత ముందుగా వస్తాను.
ఈ ఉదయం కొరకు
ఎదురు చూస్తుండు.
ఈ జన్మ కిది
చాలు ప్రభూ .. నిన్ను వదులుకోలేని ... ని సులోచన...
**
(తెలిసి తెలియని 18 ఏండ్ల వయసులో, 30 ఏండ్ల క్రితం వ్రాసిన ప్రేమకధ. ఇది. మూడు బాషల్లోకి అనువదింపబడి, 600 పైగా ఉత్తరాలు ఉదయం వార పత్రిక వారిని
ముంచేశాయి. ఈ కధని ప్రేమించిన సబ్ ఎడిటర్ నాగేంద్ర దేవ్ గారికి, అప్పటి ఎడిటర్ అల్లణీ శ్రీధర్ గారికి, టైటిల్ వ్రాసిన కరుణాకర్ గారికి, మంచి చిత్రాన్ని గీసిన ఆర్టిస్ట్ చందు
కి సదా ఋణపడి ఉంటాను. ముగింపు మీద నాకు బాద గానే ఉంది కానీ అప్పుడు అదే రాశాను.
రాసిన దానిలో కొంత తగ్గించాను కానీ కొత్తగా ఏమి కలపలేదు )