Sunday, 30 October 2016

చిన్ననాటి దీపావళి

నరకాసుల వధలు, పిండివంటలు, కొత్తబట్టలు, మిఠాయిలు విషయం మాకెందుకు. మేము’ చాట’ బ్యాచ్. ఇప్పటి జెనరేషన్ కి ఈ విషయాలు తెలీదు. అబ్బో మా రోజుల్లో...
ఒక వెదురు పుల్లకి పిన్నిసుని నిలువుగా ఉంచి ముక్కు కిందకి ఉండేట్టు గా నిలబెట్టి కట్టడం, రెండో చివర పుల్లని చీల్చి మందపాటి అట్ట ముక్కని డైమండ్ షేపులో ఉంచి నేర్పుగా కుట్టటం తో దీపావళి సంబరాలు మదలయ్యేవి మా చిన్న తనం లో .. 5 పైసలకి/ పది పైసలకి తుపాకి రీళ్లు, బిళ్ళలు (గుండ్రటి బొట్టు బిళ్లలా గా ఉండే రెండుపోరల కాగితం మద్య చిన్న మొటిమంత ప్రేలుడు మందు ఉండేది) 
ఒక్కొక్క తుపాకి బిల్ల మధ్య నున్న మందు కి పిన్నిసు ములికిని గుచ్చి పైకి ఎగరేస్తే అది కిందపడేటప్పుడు నెలని గుద్దుకుని ప్రేలేది. తక్కువ ఖర్చుతో ఎక్కువ వినోదం అంటే అప్పట్లో అదే. 
ఒక పిల్లిపిసర దండ పావలా ఉండేది. తెచ్చి జాగర్తగా తాడు విప్పి విడిగా చేసేవారం. 50 వచ్చేయి. ఒక చాట లో పేపరు పరిచి దీపావళి కి పది రోజులముందు నుండే కొనుక్కున్న మందు సామాగ్రీ పరుచుకుని పెంకుటింటి చూరు మీద ఎండలో పెట్టేవారం. విచిత్రంగా, కుట్టు మిషన్ సొరుగులు, గిరగమాత పెట్టెలో, కండిపప్పు డబ్బాల్లో ఉండే చిల్లర మాయమవుతుండేది. పెద్దవాళ్ళు అడిగినప్పుడు ఎండబెట్టిన చాట మీద ఒట్టేసి ‘ఏమి ఎరగమ్’ అని చెబుతుండేవాళ్లం. 
ఎండబెట్టిన ‘చాట’ కి వైఫై ఉండేది. ఇప్పటి jio కంటే మోస్ట్ పవర్ ఫుల్. దాన్ని ఎవరయినా తాకారో ఎంత దూరాన ఉన్నా పిల్లలకి ఎలెర్ట్ వెళ్ళి పోయేది. క్షణాల్లో ప్రత్యక్షం అవటం, ఆస్తులు కాపాడు కోవటం వెను వెంటనే జరిగేది. మద్యాన్నం నుండే బొమ్మల కొలువులా స్నేహితుల మందు గుండు సామాగ్రి పరిశీలించడానికి వెళ్ళేవాళ్లం. అందరి వద్ద ఉన్న వి తమ దగ్గర ఉన్న వాటితో బెజురి వేసుకుని కొందరు స్థితి మంతులులని గుర్తించి మొదట వాళ్ళ వరండాలో కాల్చడం మొదలెట్టేవాళ్లం.
తర్వాత ఎవరి ఇళ్ళకి వారు వెళ్ళేవాళ్లం. అక్క చెల్లెళ్లతో పంపకాలు మొదలయ్యేయి కొవ్వొత్తులు, మతాబులు, వెన్నపూసలు , తాళ్ళు,పాము బిళ్ళలు, కాకరపూవత్తులు, కొండకచో భూ చక్రములు వాళ్ళకి. మిగిలిన ప్ల్రెలుడు సామాను భూ విష్ణు చక్రములు, అవ్వాయి సువాయిలు, తౌసండ్ వాలాలు, టెలిఫోనే లు ఇత్యాదులు మగపిల్లలం మొదలెట్టేవాళ్లం. 
పెద్దవాళ్ళు ఏవో చెబుతూనే ఉంటారు. బామ్మలు బక్కెట్ల తో నీళ్ళు అందుబాటులు ఉంచుతారు. అవేవీ మనం పట్టించుకోం . 
ఒక కర్ర పుల్లకి విడదీసిన పిల్లిపిసర ని రబ్బరు బాండు తో చుట్టి కర్ర రెండో చివర పట్టుకుని దైర్యంగా (?)కాల్చే వారం. ఒక్కెక్కటి కాల్చి విసుగొచ్చి ఒక కాగితం ముక్క అంటించి దాని మీద మిగిలినవి అన్నీ వేసి కాల్చడం  తో దీపావళి దిగ్విజయంగా పూర్తి అయ్యేది. 
ఉదయాన్నే లేచి రాత్రి కాల్చిన వాటిలో , కాలకుండా మిగిలినవి వెతుక్కుంతుండే.. పెద్దవాళ్ళు కేకలు వెయ్యటం తో తిరిగి కాల చక్రం మొదలయ్యేది. వచ్చే దీపావళి కి టెంటేటివ్ గా ఒక ప్రణాళిక మనసులో  తయారవుతుండేది. 
చిన్నతనం మరచి పోనీ/పోలేని మిత్రులకి దీపావళి శుభాకాంక్షలు.

No comments: