Wednesday 12 October 2016

ముసుగు

మూర్తి గారింటికి వెళ్ళి రమ్మని అమ్మ చెబితే తీరిక చేసుకుని నేను మా చిన్నమ్మాయి బయలు దేరాం. 
మూర్తి గారి బార్యకి ఆరోగ్యం బాలెదట పలకరించి రమ్మని రెండు రోజుల నుండి అమ్మ చెబుతూనే ఉంది. ఎప్పుడో నాన్నగారి కి సన్నిహితుడట . అడ్రెస్ కూడా సరిగా తెలీదు. రామ్ నగర్ లో ఉంటున్నట్టు చూచాయగా చెప్పింది. 
ఆ పూట తీరిక చేసుకుని వెళ్తుంటే సెలవులకి ఇంటికి వచ్చిన చిన్నమ్మాయి ‘నాన్నా నేను వస్తాను’ అంది. 
“ఎందుకు నాన్నా నాకే సరిగా అడ్రెస్ తెలీదు. కనుక్కుని వెళ్ళాలి “ అన్నాను. 
“పర్లేదు వస్తాను.. ..వస్తూ పాని పూరి తిందాము” అంది. 
***
రామ్ నగర్ లో మా సన్నిహిత మిత్రుడు ఒకడున్నాడు. తన దగ్గరకి వెళ్ళి అడిగాను. మూర్తి గారి చిరునామా గురించి. “ఇలాటివి మనకేలా తెలుస్తాయి. మా ఆవిడని అడుగుదాం.” అంటూ శ్రీమతి ని కేక వేశాడు. 
“బాగున్నారా అన్నాయ్యా?” అందామే పలకరింపుగా. 
“అదేనమ్మా, మూర్తి అని మా నాన్న గారి ఫ్రెండ్. ఆయన ఇక్కడెక్కడో ఉంటారు. వాళ్ళావిడ ఆరోగ్యం అంత బాగా లేదట” 
ఆమె అయోమయంగా మొహం ఉంచింది. నేను ట్రంప్ కార్డులు బయటకి తీశాను.
“వాళ్ళ పిల్లలిద్దరూ న్యూ జెర్సీ లో ఉంటారు. ఈ ఏరియాలో నే ఇల్లు కట్టుకున్నారు. అక్కడి నుండే కారు కొని పంపారట ..” నా మాటలు ఇంకా పూర్తి కాలేదు. “ఓ కామేశ్వరమ్మ గారా? మూడో లైన్ రెండో ఇల్లు వైట్ బిల్డింగ్, స్టీల్ రైలింగ్ డిజైన్ గ్లాస్ వర్క్ “ వాళ్ళకి థాంక్స్ చెప్పి మూడో లైన్ కి వెళ్ళాం. 

ఊహించని విషయం అది. ఇల్లు ఎంతో లక్షరీ గా ఉంది. డబ్బు అంగుళం అంగుళం అతికించినట్లు ..
బిడియంగా నే కాలింగ్ బెల్ నోక్కాను. ఎవరో మైడ్ ఒకరు వచ్చి తలుపు తీసి "ఎవరు?" అంది. 
“శ్రీరామమూర్తి గారి ఇల్లు ఇదేనా? “ “అవును”. 
మా నాన్న గారి పేరు చెప్పి “ఆయన కుమారుడిని వచ్చానని చెప్పండి” అన్నాను. మూసిన తలుపులు రెండు నిమిషాలకి తెరుచుకున్నాయి. “లోపలికి రండి” అంది ఆవిడ
పాల రంగు పాలరాయి మీద మా కాళ్ళ గుర్తులు పడకుండా లౌక్యంగా అడుగులు వేసుకుంటూ హల్లో కి నడిచి సోఫాలో కూర్చున్నాము. మూర్తి గారు వచ్చారు. 
వయో భారం తో ఉన్నారు. చిన్నగా వచ్చి ఒక చక్క కుర్చీ లో కూర్చున్నారు. “సోఫాలో కూర్చుంటే మళ్ళీ ఒక్కడినే లేవటం కష్టం “ అన్నాడు జనాంతికంగా. 
“నమస్తే సార్ .. నేను _________ “ 
“ ఓహ్ తెలుసు. అప్పట్లో మీ నాన్న గారి స్టూడెంట్ ని. ఈ అమ్మాయి ఎవరు? నీ కూతురా? అమ్మ బాగుందా?” 
నాకు చాలా సంతోషం వేసింది. అతను చక్కగా రిసీవ్ చేసుకున్నందుకు. “బాగుందండీ. కామేశ్వరమ్మ గారి ఆరోగ్యం బాలేదని ఒక్క సారి వెళ్ళి కనబడి రమ్మని రెండు రోజుల నుండి చెబుతుందండి. రేపటి నుండి మళ్ళీ ఎవరి గోల వారిది సెలవులు కూడా అయిపోయాయి. ఆవిడ ఎలా ఉన్నారండి ?” 
ఆయన లేచి లోపలికి రమ్మన్నట్టు మావైపు చూసి తల ఊపి మరో గది లోకి నడిచాడు. అక్కడ పడక కుర్చీ లో కూర్చుని ఉన్నారావిడ. ఒక నర్సు స్పూన్ తో ఏదో తినిపిస్తూ ఉంది. ఎంత శుబ్రంగా ఉన్నప్పటికి ఆసుపత్రీ వాసన వేస్తూ ఉంది. 
కొద్ది నిమిషాలు ఆమెతో మాట్లాడి మళ్ళీ హల్లో కి వచ్చాం. 
మా పిల్లలిద్దరూ న్యూ జెర్సీ లో ఉన్నారు. అక్కడే స్వంత ఇల్లు కొనుక్కున్నారు. పెద్దోడు ఫెరారి కొన్నాడు. చిన్నోడు కి అమరావతి వద్ద 80 సెంట్లు స్థలం ఉంది. మొన్నే అక్కడి నుండి కారు పంపాడు. ఇల్లు కోటి రూపాయలు దాటింది. ఇద్దరు పనిమనుసులు, విజిటింగ్ డాక్టర్లు, ఈ గోడ మీది పెయింటింగ్ చూశావా రెండున్నర లక్ష అంత చిన్నోడు కొని పంపించాడు.” ఒకదానికి ఒకటి ఏమాత్రం సంబందం లేని విషయాలు చాలా మాట్లాడాడు. 
లోపలి నుండి ఇందాక తలుపు తీసిన పని పిల్ల గ్లాసు ల్లో ఏదో జ్యూస్ లాటిది తెచ్చింది. 
“తీసుకోండి. మా వాడు రెండు నెలల క్రితం ఇండియా వచ్చినపుడు తీసుకువచ్చాడు. ఇంస్టెంట్ జ్యూస్. నేనెప్పుడు తాగలేదు. మా ఇద్దరికీ షుగర్ ఉంది.” 
నేను మా అమ్మాయి గ్లాసులు తీసుకుని తాగటం మొదలెట్టాం. 
బస్టాండ్ లో టి తాగే అలవాటు ఉన్నవాడిని ఏదయినా తాగగలను కాబట్టి నేను మామూలుగా తాగినా.. కళ్ళతోనే డ్రింక్ బాలేదని వదిలేస్తానని మా చిన్నది చెప్పింది. వద్దు బాగోదు, ఎలా కొలా తాగేయ్యమని నేను చెప్పాను. ముఖం అనేక రకాలుగా మారుస్తూ బలవంతాన త్రాగుతుంది.
“ఆ గ్లాసులు అక్కడి నుండి మా వాడు పంపించాడు. ఒక్కోటి మన డబ్బులో 1800 ఆట. మామూలు వస్తువులు వాడితే వాడికి నచ్చదు” మళ్ళీ ఆయనే సంబందం లేని విషయాలు అందుకున్నాడు. ఆయన కళ్లలోకి చూసి “మీరు ఎలా ఉన్నారు? అంతా సంతృప్తిగా నే ఉందిగా?” అన్నాను నేను. 
మూర్తి గారి కళ్ళలో ఒక ముసుగు ఉంది దాని వెనుక భావం మాత్రం నాకు అందలేదు. 
“ఓహ్ భ్రహ్మాండం “ నవ్వడాయన. మేం సెలవు తీసుకుని లేచి బయటకి నడవబోయేటప్పుడు లోపల నుండి ఒక పెంపుడు కుక్క పరిగెత్తుకు వచ్చి మా మీద దూక బోయింది.. 
“ అయ్ జానకి “ అంటూ పిలిచాడు మూర్తి గారు. ఠక్కున వెనక్కి తిరిగింది. టీపాయ్ మీద పెట్టిన గ్లాసు కింద దొర్లి పగిలింది. నేను పక్కకి సర్దుకునే లోపు ఒక గాజు పెంకు నా కాలి బొటన వేలు కి గుచ్చుకుంది. 
మా చిన్నమ్మాయి వెంటనే నన్ను కొర్చోమని నైపుణ్యంగా గాజు పెంకు తీసి, నెత్తురు కారకుండా చేతిని బిగించి పట్టుకుని తన చేతి రుమాలుని వ్రేలుకి బిగించి కి కట్టింది. 
మేము బయలుదేరుతుంటే.. గేటు వద్దకి వచ్చి మూర్తి గారు వీడ్కోలు చెప్పాడు. ఆయన కళ్ళలో ఉన్న ముసుగు తొలిగి లోపలి భావం నాకు స్పష్టంగా అర్ధమవుతుండగా.. 
మా అమ్మాయి “పద నాన్నా చలపతి డాక్టర్ వద్దకి వెళ్ళి ఒక టి టి చేయించు కుందాం’ అంది.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...