Saturday, 23 April 2016

రేగు పళ్ళు

రేగు పళ్ళు (పార్ట్-1)
=============
పొద్దుపోయేంత వరకు అంగడిలో వెండి పని చేసి వచ్చి పడుకున్న చిన రోశయ్యని తెల్లారగట్ల నిద్ర లేపింది మల్లమ్మ...
.
అప్పటికే పెద రోశయ్య, వసారాలో ఉన్న పెద్ద రోలు లో జొన్నలు దంచుతున్నాడు. చెల్లెలు, తమ్ముడు ఇంకా నిద్ర పోతున్నారు..
..
నిద్ర లేచి కావిడి తీసుకుని వెళ్ళి ఫర్లాంగు దూరం లోని చేద బావి నుండి నీరు తోడుకుని వచ్చి దొడ్లో ఉన్న రాతి తొట్టి నిండా నీళ్ళు నింపాడు చిన రోశయ్య. 
..
అన్న తమ్ములిద్దరూ మైలు దూరం లోని పారే ఏటికి వెళ్ళి , వస్తూ స్నానం చేసి టవలు గట్టిగా పిండుకుని వచ్చేసరికి మల్లమ్మ పొయ్యి మీద జొన్న సంకటి తెడ్డు తో తిప్పుతుంది. ..
..
చెల్లెలు  అప్పటికే మల్లమ్మ కొంగు పట్టుకుని అమ్మా నాకు పండగ బువ్వ(బియ్యం అన్నం) కావాలే అంటూ గోము పోతుంది ..
..
మల్లమ్మ రోజు మాదిరి మాటలు చెబుతూనే తలాకొంచెం సంకటి సత్తు ప్లేట్లలో పెట్టింది. ..
పెద రోశయ్య చక్కి మీద పెట్టిన కంచు కంచం వైపు చూశాడు. 
అంచులు ఎత్తుగా ఉండే కంచు కంచం లో తండ్రి గురవయ్యకి మాత్రమే వడ్డిస్తుంది ఆమె. 
..
సాంబారు కారం లోకి లౌక్యంగా వంచిన నేతి ని కలుపుకుని చిన రోశయ్య గబగబా తినేశాడు. 
అప్పటికే తన స్నేహితుడు వచ్చి రోడ్డు మీద సైకిలు బెల్లు కొట్టటం విని ఉన్నాడు. 
రెండు కాడల కాకి సంచి చంకకి తగిలించుకుని, కాళ్ళకి తోలు చెప్పులు తొడుగుతుంటే తల్లి మల్లమ్మ వచ్చి రెండు గిన్నెల సత్తు కారేజి ఇచ్చింది. 
..
ఇంకేమీ లేవాఅడిగాడా పిల్లాడు. ..
..
మరి నా పధ్యం చెప్పు అంది మల్లమ్మ. 
..
అమితస్థావరజంగమం బయిన బ్రహ్మాండంబు దా నింతయున్
మమతాగోచర మీత్రిలోకములు నస్మద్బాహువజ్రానుపా
ల్యము లే నింద్రుఁడ నిట్టి న న్నుఱక లీలన్ జూదమాడంగ ను
త్తమసింహాసన మెక్క నీకుఁ జనునే దర్పించి నాముందటన్.”..
..
రాగయుక్తంగా మత్తేభాన్ని పాడాడు. 
..
మల్లమ్మకి చిన రోశయ్య పాడిన పధ్యం అర్ధం కాదు కానీ కొడుకు రాగ యుక్తంగా పాడుతూనే వినటం ఆమెకి ఎంతో ఇష్టం. 
..
పద్యం వింటూనే కాగితం లో పోట్లామ్ కట్టిన రేగు పళ్ళు చిన రోశయ్య చొక్కా జేబులో పెట్టింది. తలకి ఆముదం రాసి చక్క దువ్వెన తో తల నున్నగా దువ్వింది. ..
....'
"
దాని అర్ధం చెప్పు" ... 
..
ఇంద్రుడిని అయిన నన్ను గమనించకుండా జూదమాడుతూ ఉన్నావు సబబేనా ? అని “..
..
పూర్తి కాకుండానే బజార్లోకి పరిగెత్తి గురవారెడ్డి గారి అబ్బాయి సైకిలు చేరాడు.
సైకిల్ కి సంచి తగిలించి స్నేహితుడిని సైకిలు మీద కూచోబెట్టుకుని అడ్డ తొక్కుడు తొక్కుకుంటూ ఎనిమిది మైళ్ళ దూరం లో ఉన్న 'మారెళ్ల' అప్పర్ ప్రిమరీ స్కూల్ కి బయలు దేరాడు. ..
..
తల్లి తన జేబులో ఉంచిన రేగు పళ్ల విలువ చిన రోశయ్యకి బాగా తెలుసు. 
తండ్రి పొలం పనికి వెళ్ళాక. తల్లి పగటి పూట పశువులు మేపటానికి గంగవరం కొండకి వెళ్తుంది. సాయంత్రం తిరిగి వచ్చేటప్పటికి నిండా ముల్లు ఉండే రేగు చెట్ల కాయలు పండినవి దోరగా ఉన్నవి ఎరుకుని మరీ కోసు కొస్తుంది. ..
పిల్లలందరికి పెడుతుంది. తను ఒక్కటి కూడా తినదు. 
..
పచ్చివక్క తో తమలపాకు కి అంతసున్నం రాసి పొగకాడ తుంపుకుని నోట్లో వేసుకుంటుంది. రోజంతా ఆమె కి అదే ఆహారం. 
..
చిన రోశయ్య  మాత్రం మల్లమ్మ కి ప్రత్యకం 
అందుకే రెగ్గాయలు కొంచె ఎక్కువ పెడుతుంది. 
వాడొక్కడే ఇంట్లో 8 మైళ్ళ దూరం లో ఉన్న స్కూల్ కి వెళ్ళి సెకండ్ ఫామ్ చదువుతున్నాడు. 
పొద్దుటే వెళితే సాయంత్రం దాకా రాడు, 
చిరుతిల్లు కొనుక్కోటానికి చిల్లీ కాణీ ఇవ్వటం తనకి చేత రాదని ఆమెకి బాగా తెలుసు.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...