Sunday 10 April 2016

మెట్లు

నేనతన్ని అక్కడ చూస్తానని అస్సలు అనుకోలేదు.
అది కూడా కోటూ, బూటూ వేసుకుని హుందాగా, భారీ స్తాయి మోసగాడి లాగా ..
ఎక్కడో కొట్టుకొచ్చినట్టున్నాడు. కొంత మంది బకారాగాళ్ళు చుట్టూ చేరి వాడు చెప్పేది ఆసక్తిగా వింటున్నారు.
మధ్య మధ్యలో నవ్వులతో కలిపిన చలోక్తులు విసురుతున్నాడు. గాలానికి యెర వేసినట్లు..
ఆర్డీవో గారి  వియ్యంకుడి కొడుకు పెళ్లి రిసెప్షన్ అది.
సమాజం లో ఉన్నత వర్గం తో పాటు అధికార్లు, ప్రజా ప్రతినిధులు లాటి  వారితో పాటు ఫోర్త్వెంటీ  రాజీ గాడు ..
నా కదే మింగుడు పడటం లేదు.
ఈవెంట్ మేనేజర్ ని అనే గాని నాకు RDO గారు ఇచ్చే మర్యాద అంతా ఇంతా కాదు, స్వంత మనిషి లెక్క.
తన ఆఫీసు లోపాయకారి వ్యవహారాలు చక్కబెట్టే విషాయాలు అన్నీ నేనే చూస్తుంటాను. ఆయన కి నేను నమ్మిన బంటు. కుడి బుజం. ఒక రకంగా నేను హనుమంతుని లెక్క .. అలాటి నాకు రాజి గాడి సంగతి  తేల్చాల్సిన బాద్యత ఉంది ..
రాజి గాడు చిన్నప్పుడు మావూర్లో మా ఇంట్లో పని చేసిన  మా పాలేరు కొడుకు.
మహా గడుగ్గాయి. ఒక్క చోట కుదురుగా ఉండేవాడు కాదు.
రోజూ  వాళ్ళ అయ్య చేతిలో తన్నులు, తింటుండే వాడు. ఎప్పుడో ఇంట్లో దొంగతనం చేసి పారి పోయినట్లు విన్నాను.
తర్వాత వాడిని ఇదే చూడటం. పెద్ద మోసగాడయి ఉంటాడు.
ఇలాటి వాళ్ళు సమాజానికి చీడ పురుగులవుతారు. అలాటి రాజి గాడు ఇక్కడ? ఎలా? అసలు వీడు రాజి గాడేనా ?
నెమ్మదిగా వెళ్ళి వాళ్ళ లో కలిశాను.
ఏదో విషయం నాక్కూడా అర్ధం కానీ ఆంగ్లం లో మాట్లాడుతున్నారు. మోసగాళ్ళకి ఇలాటి పనికి మాలిన స్కిల్స్ చాలా ఉంటాయి.
“నువ్వు వీరన్న కొడుకు రాజి గాడివి కదూ ?” స్పష్టంగా అడిగాను.
అతను ఒక్క సారి బేల కళ్ళతో చూశాడు.
సమూహం లో మిగిలినవారు నన్ను నా సంబోదనని ఆశ్చర్యంగా చూశారు.
అతను మెల్లిగా అవునండి .. మీరు ? క్షమించండి గుర్తుకు రావటం లేదు “ అన్నాడు.
ఎందుకు గుర్తొస్తుంది . వీడి బండారం బయటపడి పోదూ ?
“పెద కొత్తపల్లి గోవిందయ్య గారు గుర్తున్నారా? మీ నాన్న అక్కడ పని చేసేవాడు. పాలేరుగా”  చివరి పదాన్ని వంకరగాను , స్పష్టం గాను పలికాను.
మిగిలిన వాళ్ళు ఇంకా విస్తూ పోయారు. అసలు వీడి చరిత్ర తెలిస్తే ఇంకా స్పృహ తప్పడం ఖాయం.
నేను ఆ గోవిందయ్య గారి పెద్దబ్బాయిని  టౌన్ లో హాస్టల్ లో ఉండి పెద్ద చదువులు చదువు తుండే వాడిని  గుర్తుందా?”
“అయ్యో గుర్తు లేక పోవటం ఏమిటండీ అప్పట్లో మన ఊరిలో అంత గొప్ప చదువులు చదివిన వారిలో మీరు ఉన్నారు. ప్రత్యక్షంగా చూడక పోవటం వలన గుర్తుపట్టలేక పోయాను. మన్నించండి. గోవిందయ్య గారు బాగున్నారా?”
“ఆయన పోయి చాన్నాళ్ళయింది. గాని అప్పట్లో  ఇంట్లో దొంగతనం చేసి పారి పోయినట్లున్నావు ?”
నేను బాంబు పేల్చాను. తామేమి విననట్లు మిగిలిన వారు మాటల్లో పడ్డట్టు నటిస్తున్నారు.
“అవునండి. అక్కకి ఏదో ఫంక్షన్ చెయ్యటం కోసం నాన్న తెచ్చి పెట్టిన డబ్బు తీసుకుని వెళ్ళి రైలు ఎక్కాను, చిరంజీవి ని చూడాలని “  రాజి గాడు ఏమాత్రం బెరుకు బిడియం లేకుండా చెప్పాడు. అయినా నా చాదస్తం కాక పోతే ఇడిచేసిన వాడికి ఏం ఉంటుంది.
“చిరంజీవి ని చూద్దామనా? ఇంతకీ చూశావా?” వ్యంగ్యం గా అడిగాను.
లేదండీ. అది కుదిరి చావలేదు  రైల్లో వెళుతుంటే కుటుంబం తో తిరుపతి వెళ్ళి వస్తున్న ఒక అయ్యవారు కి దొరికాను. ఎంత బుజ్జగించినా ఊరు- పేరు చెప్పలేదు.”
“డబ్బులు లాక్కుని తన్ని తగలేశాడా?”
“ఎంత మాట? ఎంత మాట?. ఆయన నాకో శిక్ష వేశాడు. తనతో తీసికెళ్లి, చెల్లెలితో కలిపి నాకు చదువు చెప్పాడు “
“చెల్లా?”
పంతులు గారి అమ్మాయి “
“ఆహా ఏమి చదివించాడో .. కుతికలదాకా చదివావా?”
“లేదండీ అక్కడా ఆయన వల్ల కాలేదు, చిన్నగా గురుకుల పాఠశాలలో వేశాడు”
“మొత్తానికి వదిలించు కున్నాడన్న మాట “ నేను నవ్వాను.
రాజి గాడు కూడా తోడుగా నవ్వాడు.
“వదిలించుకున్నా బాగుండేది. దర్శి గురుకుల పాఠశాలలో ఆ యాడాది  టెన్త్ మంచి మార్కులతో పాసయిన రెండో వాడిని నేను”
“ఆహా.. ఆ తర్వాత “
“మళ్ళీ మాస్టారే పూనుకుని ప్రభుత్వ  రెసిడెన్షియల్ కాలేజీ లో చేర్పించాడు”
“అక్కడ కూడా పాసయ్యావా?”
“మీ నాన్న గారి లాటి వారి ఆశీర్వాదం ఆండీ . పాసయ్యాను మొదటి ప్రయత్నం లోనే సిద్దార్ధ మెడికల్ కాలేజీ లో సీటు వచ్చింది. మూడేళ్ళ  క్రోతమే మెడిసిన్ పూర్తి చేశాను”
నాకు నోట మాట రావడం కష్ట మయింది.
“అయితే ఇప్పుడు ను... ను వ్వు డాక్టర్ వా?”
“లేదండీ .. ఎందుకనో నేను డాక్టర్ గా కూడా  సంతృప్తిగా ఉండలేక పోయాను. ఈ లోగా చెల్లి పెళ్లి అయింది. ఆర్డీఓ గారి మనల్లుడి తో, ఇద్దరు కలిసి నన్ను డిల్లీ నెట్టేశారు “
“ఎందుకండీ? “ నా గొంతు సరిగా నాకే వినబడలేదు .
“సివిల్స్ కోచింగ్ తీసుకున్నాను రెండేళ్ళు. మొదటి సారి కుదర్లేదు రెండో సారి రాంకు వచ్చింది. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నాను “
“మీ అమ్మా .. నాన్నా “
“స్కూల్ అయిపోగానే కలిశాను. ఇప్పుడు పల్లె లోనే ఉంటున్నారు. వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు రెండు బర్రెలు పెట్టుకుని. వాళ్ళకి అలానే బాగుంది, నేను వాళ్ళని కదిలించదలుచు కోలేదు”
“మీ..రు... ఇ..క్క..డ?”
“పెళ్లి కూతురు ఎవరనుకున్నారు మా చెల్లెలే .. అదే మా అయ్యవారి కూతురు “
“ఆలానా అండీ.. సంతోషం “
మా సంభాషణ ఇంకా కొనసాగుతుండ గానే..
RDO గారి శ్రీమతి  రాజి గారి ని వెతుక్కుంటూ వచ్చింది.
“రాజా బాబు .. ఇక్కడున్నారా? మీ అంకుల్ మిమ్మల్ని పిలుస్తున్నారు. కలెక్టర్ గారికి పరిచయం చెయ్యాలట వెంటనే రమ్మన్నారు “ అంది చెయ్యి పట్టుకుని లాక్కెళుతూ..
నా వైపు తిరిగి “అన్నట్టు వెంకట్రావు గారు వచ్చేనెల మా అమ్మాయికి, రాజా బాబు కి ఎంగేజ్మెంట్ ఉంది. ఏర్పాట్లు అవి మీరు చూడాలి “ అంది.
“రాజా బాబు నాకు చేతులు జోడించి నమస్కారం చేశాడు “ మంచిదండి కలుస్తాను మిమ్మల్ని ఇలా కలవటం ఆనందం గా ఉంది “ అని ఆమెతో పాటు వేదిక వైపు నడిచాడు.


No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...