Thursday, 16 February 2017

'భాన్ గఢ్' కోట

ఇది చాలా పెద్ద చర్చే....
ఈ విషయంపై టీవీల్లో గంటలు గంటల పాటూ చర్చలు జరుగుతాయి. కెమెరాల ముందు దాదాపు మీదపడి రక్కుకున్నంత పని చేస్తారు మన మేథావులు. నాస్తికులకు ఈ విషయం చూయింగ్ గమ్ లాంటి నిత్య నాస్తా .
ఎంత నమిలితే అంత సాగుతుంది.
ఎంత వాగితే అంత కొనసాగుతుంది.
ఇంతకీ భారత ప్రభుత్వం ఏమంటుంది?
ప్రభుత్వం లెక్కల ప్రకారం అధికారికంగా దయ్యాలూ, భూతాలూ, శాపాలూ ఉన్నాయా?
ఉన్నాయి!!!
భారత ప్రభుత్వం దయ్యాలున్నాయని డిక్లేర్ చేసిందా?
చేసింది!!!
ఎప్పుడు? ఎక్కడ?
ఆ సంగతి తెలుసుకోవాలంటే మీరు ‘భాన్ గఢ్’ కి వెళ్లాలి.
ఢిల్లీ నుంచి జైపూర్ కి వెళ్లే మార్గంలో (300 km from Delhi) సరిస్కా టైగర్ రిజర్వ్ ప్రారంభం కావడానికి ముందు వచ్చే ఒక చిన్న గ్రామమే భాన్ గఢ్.
ఆ గ్రామంలో ఒక బోర్డు ఉంటుంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆ బోర్డును పెట్టింది.
ఆ బోర్డులో
 "ఈ భాన్ గఢ్ గ్రామంలోని భగ్నావశేషాల దగ్గర రాత్రి ఉండటానికి వీల్లేదు. ఎవరైనా రాత్రి ఈ ప్రదేశంలో ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.."
భాన్ గఢ్ లో ఒక కోట ఉంది. కోటలో వీధులు, బజార్లు, నర్తన శాలలు, విశ్రాంతి గృహాలు ఉన్నాయి.. అద్భుత శిల్పకళ ఉన్న గోపీనాథ మందిరం, సోమేశ్వరాలయం, మంగళాదేవి గుడి, కేశవరాయ్ కోవెల ఉన్నాయి. ఇళ్లూ, వాకిళ్లు ఉన్నాయి.
కానీ చీకటి కమ్ముకొచ్చే సరికి కోట మొత్తం ఖాళీ అయిపోతుంది.
నరప్రాణి ఉండదు. రాత్రిపూట భగ్నావశేషాల దగ్గర ఎవరూ ఉండరు.
మొత్తానికి మొత్తం ఖాళీ అయిపోతుంది.
రాత్రి వేళ కోటలో గజ్జెల సవ్వడి వినిపిస్తుంది. (మూర్తి అన్నా వింటున్నావా? :D)
కోట లోపలి నుంచి అస్పష్ట సంగీత రాగాలు అలలు అలలుగా దొర్లుకొస్తూంటాయి.
సందర్శకులు తీసిన గ్రూప్ ఫోటోల్లో టూరిస్టులతో పాటూ ఏవేవో వింత నీడలు కూడా అప్పుడప్పుడూ పడుతూంటాయిట.
అంతే కాదు.... కోటలోని ఇళ్లకి పై కప్పులుండవు. ఎవరైనా పొరబాటున కప్పు వేయడానికి ప్రయత్నిస్తే అవి తెల్లారేసరికి కూలిపోతాయి.
భాన్ గఢ్ 1573 లో మహారాజా భగనాన్ దాస్ నిర్మించాడు. ఆయన దాన్ని తన కొడుకు మాధవ్ సింగ్ కోసం కట్టించాడు. మాధవసింగ్ అక్బర్ సేనాని మాన్ సింగ్ కి తమ్ముడు. మాధవసింగ్ తరువాత ఆయన కొడుకు ఛత్రసింగ్ రాజయ్యాడు. ఛత్రసింగ్ 1630 లో చనిపోయాడు. ఆ తరువాత నుంచే భాన్ గఢ్ కళ తప్పింది. 1720 లో రాజా జయసింగ్ ఈ గ్రామాన్ని గెలుచుకున్నాడు. ఆ తరువాత 1783 భయంకరమైన కరువు వచ్చింది. అప్పట్నుంచీ ఊరు నిర్మానుష్యం అయిపోయింది.
మరి భాన్ గఢ్ లోకి భూతాలు ఎప్పుడు వచ్చాయి?
ఖచ్చితంగా తెలియదు కానీ స్థానికుల కథనాల ప్రకారం బాబా భోలేనాథ్ అనే బాబాజీ ఆ ప్రాంతంలో తపస్సు చేసుకునేవాడు.
ఆయన దగ్గరకి వచ్చి అప్పటి రాజుగారు కోట నిర్మించుకునేందుకు అనుమతి కోరాడట. "రాజా నాకు డబ్బూ దర్పం అంటే అసహ్యం.. నువ్వు కోట కట్టుకో. రాజసౌధం కట్టుకో... కానీ దాని నీడ నా పై పడటానికి వీల్లేదు. పడ్డ మరుక్షణం ఊరు పాడుబడిపోతుంది. ఇది దయ్యాల కోట గా మారిపోతుంది. " అంటూ కండిషనల్ పర్మిషన్ ఇచ్చాడు బాబాజీ.
రాజుగార్లు కోటలు కట్టుకున్నారు. రాజసౌధాలను కట్టుకున్నారు. క్రమేపీ భోలేనాథ్ మాట మరిచిపోయారు. అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు "బాబా కంటే ఘనుడు భాన్ గఢ్ బాలయ్యలు" వచ్చేశారు. భవనాల ఎత్తు పెంచేశారు. ఒక రోజు భాన్ గఢ్ రాజసౌధం నీడ బాబాజీ సమాధిని తాకింది. ఆయన బాబా గారు. తృణమో పణమో పుచ్చుకుని అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించే మునిసిపల్ అధికారి కాడు మరి. అంతే.... శాపం తన పనిని తాను చేసుకుపోయింది. ఊరు పాడుబడిపోయింది.
ఇంకో కథ ప్రకారం భాన్ గఢ్ రాకుమారి రత్నావతి 'మంత్ర' విద్యలో మహాదిట్ట. ఆమెని ' సింఘియా' అనే ఇంకో మాత్రికుడు మోహించాడు.
రత్నావతికి మంత్రించిన నూనె పంపించాడు. ఆమె దాన్ని తాకగానే అతని వశమౌతుంది. కానీ రత్నావతి ఆ నూనెను పారబోయించి, తన మంత్రశక్తితో బండరాయిగా మార్చింది.
ఆ బండరాయి దొర్లి దొర్లి వెళ్లి 'సింఘియా'ని పచ్చడి పచ్చడి చేసేసింది.
చనిపోతూ చనిపోతూ "ఒసేయ్ అరుంధతీ... నన్నీ బండ కింద కుళ్లబెట్టావా? వదల బొమ్మాళీ వదల " స్టయిల్లో తెల్లారే సరికి ఊరు పాడుబడిపోతుందని, అక్కడ రాత్రి ఉండేవాళ్లు చనిపోతారని శపించాడు.
ఆ రాత్రికి రాత్రి ఊరు నాశనమైపోయిందట. అప్పట్నుంచీ అది దయ్యాల కోట అయిపోయింది.
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వ విభాగం. ఆ విభాగం భాన్ గఢ్ లో "దయ్యాలున్నాయి జాగ్రత్త" అని అధికారికంగా బోర్డు పెట్టించింది.
కాబట్టి భారతప్రభుత్వం దయ్యాలు, భూతాలు ఉన్నాయని అంగీకరించినట్టే కదా? ఇట్స్ అఫీషియల్ నౌ..... దయ్యాలు,.... భూతాలు ఉన్నాయి....
ఇప్పుడు భాన్ గఢ్ టూరిస్టు స్పాట్. (పగటి పూట మాత్రమే సుమా! )














ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దయ్యాలున్నాయని నమ్ముతుందా?
ఏమో తెలియదు కానీ.... ప్రాచీన కట్టడాలు ఉన్న ప్రతి చోటా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయం ఉంటుంది.
కానీ భాన్ గఢ్ లో మాత్రం వాళ్ల ఆఫీసు లేదు. :p

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...