Thursday 2 February 2017

ఒక బుద్ది హీనుడు

2012 ఎర్నాకులం , కేరళ.
సురేశ్ ఒక బుద్ది హీనుడు. జ్ణానంలేని మనిషి.
ఎర్నాకులం, (కొచ్చి) లో ప్రబుత్వ లాటరీ టికెట్లు అమ్ముకునే చిరు వ్యాపారి సురేశ్. 
గతవారం ‘అయ్యప్పన్’ అతని వద్ద అయిదు లాటరీ టికెట్స్ కొన్నాడు.
తీరా చూస్తే జేబులో సరిపడి నంత డబ్బు లేదు.
“నీ వద్దే ఉంచు. డబ్బు తీసుకుని ఇటు వచ్చినప్పుడు తీసుకెళ్తా, అని అతని వద్ద నే ఉంచాడు. సురేశ్ ఒక కవర్లో ఆ టికెట్స్ ఉంచి, పైన 'అయ్యప్పన్' అని వ్రాసి పక్కన ఉంచాడు.
అయ్యప్పన్ రెండు మూడు రోజులయినా రాలేదు.
ఈ లోగా లాటరీ ఫలితాలు వచ్చాయి.
అతని కోసం తని (చిత్తూరు మాండలికం సెపరేట్ గా అని అర్ధం) గా ఉంచిన టికెట్స్ డబ్బు లు మాత్రం రాలేదు.
ఇంటావిడ తో చెప్పాడు. అయ్యప్పన్ కోసం ఉంచిన 5 టికెట్స్ కి 250 రూపాయల డబ్బు రావాల్సి ఉంది అని.
ఆవిడ కవర్ ఓపెన్ చేసి టికెట్స్ ని ఫలితాలతో సరి చూసింది.
"దీనికి లాటరి తగిలింది." అంది ఆశ్చర్యం తో.
“నిజమా?” ఇప్పుడు ఎక్కడికి పోతాడు? నా 250 ఇవ్వకుండా అంటూ వాటిని పట్టుకుని అయ్యప్పన్ ఇంటికి బయలుదేరాడు సురేశ్.
బార్య అతన్ని విస్తుపోయి చూసింది.
“ఏమయ్యా?? నికేమయినా పిచ్చి పట్టిందా?” అంది.
"వద్దు.. ఇంకొంచెం సేపు ఉంటే నీకే కాదు నాకు పిచ్చి ఎక్కుతుంది. దానికి ముందే మన డబ్బు నేను వసూలు చేసుకొస్తాను. ఉండు" అంటూ పరుగు లాటి నడకతో అయ్యప్పన్ ఇంటికి వెళ్ళాడు. సురేశ్.
అయ్యప్పన్ విషయం విని కొయ్యబారి పోయాడు.
బుద్ది లేని సురేశ్ ని విస్తుపోయి చూశాడు.
అతని నోట మాట రాలేదు.
"నేను డబ్బు ఇవ్వలేదు కదా అవి నీవే.. ని డబ్బే .. నాకు వద్దు" అన్నాడు.
“కాదు నీదే... నీ టికెట్లు నువ్వు తీసుకుని నా డబ్బు నాకివ్వు.
అందులో యబై కి పైగా నాకు కమిషన్ వస్తుంది నాకు అది చాలు.
దేవుడు నాకు ఇచ్చేది ఎలా అయినా ఇస్తాడు. ఇది నాది కాదు ” స్థిరంగా చెప్పాడు సురేశ్.
మర్నాటి నుండి తిరిగి లాటరీ టికెట్లు అమ్ముకోవటం మొదలెట్టాడు.
"ఇదం న మమ" (ఇది నాది కాదు)
"పరద్రవ్యేషు లోష్ఠవత్" (పరుల సొమ్ము రాయితో సమానం)
చెప్పడం ఎంత సులభం?
చేయడం ఎంత కష్టం?
అందుకే సురేశ్ కథ తెలుసుకున్న తమిళ నటుడు పార్తిబన్ సురేశ్ ను వెతుక్కుంటూ ఎర్నాకుళం వచ్చాడు.
ఒక సందు మూల లాటరీలు అమ్ముకునేసురేశ్ ను కలుసుకున్నాడు.
"అన్నిరూపాయలు ముందుంటే నువ్వు చూపిన నిజాయితీని నేను చూపుతానో లేదో" అని నిజాయితీగా ఒప్పేసుకున్నాడు.
సురేశ్ ను తనతో చెన్నై తీసుకెళ్లాడు. తన సేవాసంస్థ 'మనిద నేయ మండ్రమ్' ఆధ్వర్యంలో సురేశ్ ను సన్మానించాడు. దర్శకుడు భాగ్యరాజా శాలువా కప్పాడు.
ఈ కార్యక్రమం 2012 మార్చి 26 న చెన్నైలోని లక్ష్మీహాల్ లో జరిగింది.
సురేశ్ ను సినీ ప్రముఖులు వివేక్, ప్రసన్న, రోహిణిలు కూడా ప్రశంసలతో ముంచెత్తారు.
లక్ష రూపాయల బహుమతి కూడా ఇచ్చారు. .
సురేశ్ వదిలేసుకున్న డబ్బు కన్నా అతనికి వచ్చిన లక్ష చాలా గొప్పది.
దాని కన్నా గొప్పది అతనికి వచ్చిన ప్రశంస. అంతకన్నా గొప్పది. .ఎందరెందరినో తన ముందు తల వంచేలా చేసిన అతని నిజాయితీ, నిబ్బరం. దాని విలువ పరాయి సొమ్ము కన్నా చాలా చాలా చాలా ఎక్కువ.
ఇంతకీ అయ్యప్పన్ కి ఇచ్చిన లాటరీ కి తగిలిన మొత్తం ఎంతో తెలుసా?
“ ఒ క కో టి , న ల బై ల క్ష లు మాత్రమే “
సురేశ్ లాంటి బుద్ధిలేని వాళ్లు, అజ్ఞానులు ఈ ప్రపంచంలో ఇప్పటికీ ఉన్నారు.


No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...