Tuesday, 28 February 2017

ఇంబసైల్

మా (పశ్చిమ ప్రకాశం) ప్రాంతాలలో ఎంతో కొంత మిర్చి పంట ఉంది. 
పది ఎకరాల రైతు బోర్లు ఏండి పోవటం తో పూర్తిగా చేతులెత్తేశాడు. బోర్లు పరిస్తితి బావుంటే చీనీ/నిమ్మ పొలాలు కనీసం మంచి బొబ్బర్లు పండేవి. బోర్లు ఎండిపోయాయి. చుక్క నీరులేదు. విపరితమయిన కరువు. 
డీప్ బోర్లు మూగబోయాయి. పల్లెలు వాడుక నీటికి, పశువుల నీటికి అల్లాడుతున్నాయి. తాగునీటి డబ్బాల వ్యాపారం ఎటూ జనజీవన స్రవంతి లో కలిసి పోయింది. అందరూ వాటికి అలవాటు పడిపోయారు. ఎక్కడయినా పొలాల్లో కొద్దిగా నీరు ఉన్న బోర్లు ఉంటే....వాటిలో ఎవయినా సన్నగా, వచ్చి రానట్టుగా, వస్తూ ఉంటే ఎక్కువ బాగం పంటని వదిలేసి కొద్ది బాగాన్ని కాపాడుకుంటున్నాడు.
సుమారుగా 20 శాతం మించదు అది.
‘పండు మిర్చి’ ధర యదావిదిగా రైతు చేతికి వచ్చే సరికి సగానికి పడిపోయింది.
రోజంతా ఎర్రటి ఎండలో పండు మిర్చి కోసి ఒడ్డుకు చేరిస్తే వచ్చే కూలి మనిషికి 150 రూపాయలు.
దీనికోసం స్థానికంగానే కాక ప్రక్క కరువు మండలాలు (తర్లుపాడు, హనుమంతునిపాడు, దొనకొండ) నుండి కూడా ఆటోల్లో ఆడవాళ్ళు చద్దిమూట కట్టుకుని కిక్కిరిస్నట్టు ప్రయాణం చేసి వస్తుంటారు. సాయంత్రానికి మళ్ళీ అలాగే అలసిన శరీరాల్తో వెళ్తుంటారు. 




మనసు మీద దుప్పటి కప్పితే తప్ప ఈ దారుణం చూస్తూ కన్నీళ్లు పెట్టుకొనుండా ఉండలేము.
కొన్ని రిమోట్ పల్లెల్లో మీరు నమ్మినా నమ్మక పోయినా, ఇళ్ళల్లో ఉండే వాడుక నీరు కన్నా అక్కడ దొరికే, సాఫ్ట్ డ్రింకులు, బీర్లు, చీపు లిక్కరు లో ఎక్కువ ద్రవ ప్రదార్ధం ఉంటుంది.
ఇంత దారుణమయిన పరిస్తితి ఉంటే...
కొన్ని ప్రత్యేక విదులలో భాగంగా పోలీస్, & వీడియొ పర్సనల్స్ తో తిరుగుతూ..
మరికొన్ని విషయాలన్నీ గమనించాను.
మా వెహికల్ వెళ్ళిన చోట యూనిఫార్మ్ లో ఉన్న మా సిబ్బంది ని చూసి..
చెట్ల కింద, గొడ్ల పాకల్లో పేకాట ఆడే వాళ్ళు / తాగి దొర్లేవాళ్లు చాలా మంది తలా ఒక దిక్కు పరిగెత్తడం గమనించాను.
సాయంత్రం పనినుండి వచ్చిన ఆడమనిషి వండి పెడితే పగలంతా ఈ తాగి దొర్లే వాళ్ళు సిగ్గులేకుండా వాళ్ళ రక్తం ఎలా తింటారో అర్ధం కాదు. పల్లెల్లో అందరూ ఇలా ఉండరు.
కానీ యువతరం ఇలాటి ‘ఇంబసైల్’ గా తయారవ్వటం గమనిస్తుంటే చాలా బాధగా ఉంది.

Sunday, 26 February 2017

ఫోటో కావాలి

మా అమ్మాయి నేను ఇవాళ టాటా షో రూమ్ కి వెళ్ళాం.
టియాగో చూశాం.
ఎవరో సేల్స్ మేనేజర్ ఒక అమ్మాయి చురుగ్గా, అన్నీ టెక్నికల్ విషయాలు అర్ధం కానంత వేగంగా చెప్పింది.
బోల్ట్, టియాగో, తో పాటు పెద్ద వెహికల్స్ కూడా ఉన్నాయి.
మీ బడ్జెట్ ఎంత ? అడిగింది అనుమానంగా? పర్సు తీసి చూసి సుమారుగా ఐదు లేదా ఆరు చెప్పాను.
"లక్షలేగా?" అనుమానంగా అడిగింది.
నేను అదేం పట్టించుకోకుండా...
“ఆటో లు, కార్లకి ఒకే షోరూమా?” నానో ని చూస్తూ అడిగాను.
“నానో ని తక్కువ చేయకండి సార్ .. 25 మైలేజి, ఇరగదీసే ఏసీ.. మీకు తెలుసా ఒకతను 6 ఏళ్ల పాటు వాడిన నానో బై బాక్ ఇచ్చి మళ్ళీ నానో కారు తీసుకెళ్ళాడు”..
అంది అక్కడి నుండి యూస్డ్ కార్ల లో ఉన్న పాత నానో ఒకదాన్ని అద్దం లోంచి చూపిస్తూ...
“టియాగో గురించి చెప్పండి.” మా అమ్మాయి అంది.
“1.2L ఇంజన్ పవర్ విండోస్, ఏసీ, అడ్జస్టబుల్ స్టీరింగ్, స్పేసియస్ బూట్ స్పేస్ ...”
ఒక కాగితం మీద కొటేషన్ వ్రాసి ఇచ్చింది.
“మీరేమీ అనుకో పోతే.. ఫోటో ఒకటి వాట్స్ అప్ లో పంపుతారా?” నా నెంబరు చేప్పాక అడిగాను.
“ఇప్పుడే తీసుకోండి”
“నేను అడిగింది కారు ఫోటో కాదు. నానో ఇచ్చి మళ్ళీ అదే తీసుకెళ్లాడని చెప్పారుగా అతనిది. 12x8 ప్రింట్ ఒకటి వేయించి గోడకి తగిలిద్దామని.”

టమోటాలు

ఆదివారం వచ్చిందంటే గుండమ్మ కి ఫుల్ టైమ్ చిక్కినట్టే...
పొద్దుటే యు ట్యూబ్ లో ఇయర్ ఫోన్స్ ఉంచుకుని 'ఆశా' పాటలు వింటున్నానా?
“చిన్నమ్మాయి ని తీసుకుని మార్కెట్ కి వెళ్ళి వస్తారా?” అంది. 
కొన్ని ప్రశ్నలు మర్యాద ఇచ్చినట్టే కనిపిస్తాయి కానీ అవి ఆజ్ఞలు.
సర్వ జ్ణాలులు మీకు చెప్పేదెముంది.
బయలు దేరాం. మా చిన్న దానితో (జీవన) పర్చేజ్ అంటే తలనొప్పి వ్యవహారం కాంప్రమైజ్ కాదు. చిక్కుడు కాయలు కూడా ఒక్కోటి వేరుతుంది.
ఒక అంగడి మీదకి వదిలి సెల్ లో పాటలు వింటూ బండి మీద కూర్చున్నాను.
నాలుగు పాటలు పూర్తిగా విన్నాక రెండు చేతుల్లో రెండు సంచిల కూరగాయలు మోసుకుని వచ్చింది.
‘ఇక పదండి’ అంది.
“హొ గయా?” అన్నాను అనుమానంగా.
“మోర్ కె పాస్ జానా.. పన్నీర్ లెనా హై” అంది. గోడకి కొట్టిన బంతి లాగా.
“ఠీక్ హై “
 ..
మార్కెట్ దాటి ఫర్లాంగు వచ్చాక “రుక్నా రుక్నా” అంది.
“క్యా హువా?”
“దో మినిట్ “
పరుసు తీసుకుని, సంచీలు నా చేతికి ఇచ్చి పరుగు లాటి నడకతో వెనక్కి వెళ్లింది.
కూరగాయల సంచి లో టమోటాలు ఆఖర్లో తీసుకోవటం ఒక జాగర్త.
మనకి లేక పోయినా చిన్నమ్మాయి కి అబ్బినందుకు ముచ్చటేసింది.
పదినిమిషాలు గడిచాయి.
ఒక కారి బాగ్ లో రెండు కిలోల టమోటాలు మోసుకుంటూ నా వద్దకి వచ్చింది. జీవన.
“తీసుకున్నావు కదా ఇంకా ఎందుకు?”
అదేం పట్టించుకొనట్టు బండి మీద కూర్చుని సంచీలు జాగర్తగా పట్టుకుని “పోనివ్వండి” అంది.
తానే చెప్పటం మొదలెట్టింది.
“మేం చైతన్యఇంటర్ లో చదివేటప్పుడు (ఆరేడు సంవత్సరాల క్రితం) మా కాలేజీ వాచ్మేన్ ఉండేవాడు. మమ్మల్ని బాగా పలకరించేవాడు. అందరం కాలేజ్ నుండి బయటకి వచ్చి బస్సు ఎక్కే అంత వరకు జాగర్త చెబుతుండేవాడు. అది ఉద్యోగం లాగా కాదు. బాద్యతగా ఉండేవాడు. మంచి వాడు “
“అయితే ?”
“ఇందాక మార్కెట్ లో నన్ను చూసి నవ్వాడు. నేను గుర్తు పట్టలేదు. తీరా బయటకి వచ్చాక స్పురించింది. ప్రస్తుతం ఉద్యోగం లేదట బండి మీద కూరగాయలు అమ్ముకుంటున్నాడు. ఉత్తినే డబ్బు తీసుకునే మనిషి కాదు. చేతికి వచ్చిన టమోటాటు తీసుకుని అడిగినంత రేటు ఇచ్చి వచ్చాను.”
‘‘మీతో పాటు నాకు టమోటా బాత్ తప్పదు. రైట్. రైట్” అంది నవ్వుతూ..

తప్పు నుండి బయటపడక పోవటం నిజమైన తప్పు

ఒక పన్నెండేళ్ళ పిల్లాడు.
అప్పుడప్పుడే బుద్ది వికసిస్తుంది.
ప్రపంచాన్ని గమనించడం, గమనించి అనుకరించడం అలవాటు చేసుకుంటున్నాడు.
అతడి బంధువొకడు సిగరెట్ పీల్చేవాడు. అతన్ని చూసి ఈ పిల్లవాడు కూడా సిగరెట్ తాగడం నేర్చుకున్నాడు. సిగరెట్ నచ్చలేదు. కానీ గుప్పు గుప్పున, పొగ రింగులు వదలడం మాత్రం మహా సరదాగా ఉండేది.
కానీ పెద్ద చిక్కు వచ్చిపడింది. పెద్దల ముందు సిగరెట్ తాగడం అసంభవం. 
అలాంటప్పుడు సిగరెట్ కొనడానికి డబ్బు ఎలా అడగటం?
ఎవరో అతనికి ఫలానా చెట్టు కాడ కాల్చి పొగపీలిస్తే అచ్చు సిగరెట్ తాగినట్టుంటుందని చెప్పాడు.
చవకబేరం కదా అని ఆ పనీ చేశాడు.
కానీ సిగరెట్ లోని మజా దొరకలేదు.
దాంతో ఇంట్లోని నౌకర్ల జేబులు తడిమి హస్తలాఘవం ప్రదర్శించడం మొదలుపెట్టాడు.
హఠాత్తుగా ఒక రోజు ఆ అబ్బాయిని ఎవరో కుదిపినట్టయింది. దొంగచాటుగా సిగరెట్ తాగడం ఎందుకు? దాని కోసం దొంగతనం ఎందుకు? అనుకున్నాడు.
..
"ఛీ... ఇదేం బ్రతుకు" అనుకుని ఉమ్మెత్త గింజలు తిని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.
కొన్ని గింజల్ని తెచ్చి పొడిగా చేసి తినడానికి సిద్ధమయ్యాడు.
కానీ ధైర్యం చాలలేదు.
చనిపోవడం అన్న ఆలోచన అతడిని భయపెట్టింది.
ఖర్మగాలి చావకపోతే ఏమవుతుందో అన్న ఆలోచన ఇంకా భయపెట్టింది.
చివరికి ఆత్మహత్యా యత్నాన్ని విరమించుకున్నాడు.
సిగరెట్ జబ్బు వదిలింది.
దొంగతనమూ మానేశాడు...
ఆ కుర్రాడికి చాపల్యం పోలేదు. చిన్న చిన్న తప్పులు చేస్తూనే ఉన్నాడు.
అలా అలా అవసరాలకని ఒక బంధువు దగ్గర అప్పు చేశాడు.
ఆ అప్పు తీర్చడం కష్టమైపోయింది. అమ్మనీ, నాన్ననీ అడగడానికి ధైర్యం చాలలేదు.
చివరికి ఒక ఆలోచన వచ్చింది.
ముంజేతికి ఉన్న బంగారు కడియంలో ఒక ముక్క ఇచ్చి అప్పు తీర్చేస్తే పోలా... అనుకున్నాడు.
అదే చేశాడు.
అప్పయితే తీర్చాడు... కానీ అతనిలో అంతర్మథనం మొదలైంది.
"అయ్యో... ఎంత తప్పు చేశాను... నా పాపానికి నిష్కృతి లేదు" అని వేదన చెందాడు.
చివరికి తండ్రి కాళ్ల మీద పడి జరిగిందంతా చెప్పేయ్యాలని, కన్నీళ్లతో ఆయన కాళ్లు కడిగేయాలని అనుకున్నాడు.
కానీ తండ్రి ఎదుటపడే ధైర్యం లేకపోయింది.
అటు పశ్చాత్తాపం...
ఇటు పిరికితనం....
ఈ రెండూ అతడిని దహించివేయసాగాయి.
చివరికి జరిగిందంతా ఒక కాగితం మీద రాసి, తను మరెన్నడూ తప్పుచేయనని, సన్మార్గంలో నడుస్తానని వాగ్దానం చేశాడు.
ఆ లేఖను తండ్రి పాదల దగ్గర ఉంచి తలుపుచాటున నిలుచున్నాడు.
అప్పుడు తండ్రికి జ్వరం... మంచం పట్టి ఉన్నాడు.
ఆయన ఆ లేఖను చూసి, నెమ్మదిగా ఎలాగోలా ఓపిక తెచ్చుకుని దాన్ని ఆసాంతం చదివాడు.
ఆయన కళ్లలో నీరు ఉబికింది.
అది జలజలా ఉత్తరంపై రాలింది.
ఆయన కళ్లు రెండూ మూసుకున్నారు.
ఆ లేఖను ముక్కముక్కలుగా చించేశారు.
పిల్లవాడిని ఆయన ఒక్కమాటా అనలేదు.
ఆ పిల్లవాడు అవాక్కయ్యాడు. తండ్రి ఒక్క మాటా అనకపోవడం అతడిని తీవ్రంగా బాధించింది. గుండెలోతుల్లో గునపం గుచ్చినంత వేదన కలిగింది. తండ్రి ఎంత కలత చెందారో అతను కళ్లారా చూశాడు. ఆ మౌన వేదన ఆ పిల్లాడిని మార్చేసింది.
పెద్దవాడయ్యాక అతడు తన ఆత్మకథలో ఇలా వ్రాసుకున్నాడు.
"తన తప్పుల్ని శుద్ధమైన అంతఃకరణంతో పెద్దల ముందు ఒప్పుకుని, ఆ తప్పులను మరెన్నడూ చేయకపోవడమే నిజమైన ప్రాయశ్చిత్తం"
ఆ కుర్రాడి పూర్తి పేరు 'మోహన్ దాస్ కరంచంద్ గాంధీ.'

Friday, 24 February 2017

ముగ్గురు పాలేర్లు

రామన్న కి కబురు వెళ్లింది.
వెంకట్రాద్రి వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది. బంగారు హారం ఒకటి మాయమయ్యింది. ‘ఇంటిదొంగ’ పనే అని ఆయన అనుమానం. ఇంట్లో ఉన్న ముగ్గురు పాలేర్లలో ఎవరో ఒకరై ఉంటాడని ఆయన గట్టి నమ్మకం. అదే విషయం రామన్న గారితో చెప్పాడు వెంకటాద్రి.
సాయంత్రం దేవాలయ ప్రాంగణం వద్దకి ఆ ముగ్గురిని పంపమని చెప్పాడాయన.
శివరాత్రి జాగారం చేయటానికి దేవాలయం వద్ద పొగయిన ప్రజలని ఉద్దేశించి కొన్ని నీతి కధలు చెబుతున్నాడాయన.
ముగ్గురు పాలేర్లు రావడం గమనించి వారిని ఒక పక్క కూర్చుని చెప్పే విషయాలు శ్రద్ధగా వినమని రామన్న సైగ చేయటం వారు కూడా శ్రోతలుగా మారటం జరిగి పోయింది.
రామన్న కొత్త కధ చెప్పటం మొదలెట్టాడు.
పూర్వం ఒక గురుకులం లో ఒక రాజ కుమార్తె విద్య అబ్యసించింది. కొన్ని సంవత్సరాల శిక్షణ ముగిసింది. బాలికగా వచ్చిన ఆమె యవ్వనవతి అయ్యింది. సౌందర్య రాశి అయింది. విధ్య పూర్తి అయ్యి తండ్రి వద్దకు వెళుతూ గురువు వద్దకి వచ్చింది.

గురు దక్షణ చెల్లించడానికి సిద్దమయింది.
అందుకాయన “ వచ్చే శివరాత్రి నీవు సకల రాచరికపు అలంకరణతో కాలి నడకన వచ్చి గురుకులం లో జరిగే పూజలో పాల్గొనాలి” అదే నేను నిన్ను అడిగే గురుదక్షణ అన్నాడు.
ఆమె అందుకు అంగీకరించి, నమస్కరించి వెళ్ళి పోయింది.
కొన్నాళ్ళకు ఆమెకు ఒక చక్కని రాకుమారుని తో వివాహం అయ్యింది.
బర్తతో ఆమె గురుదక్షణ విషయం చెప్పింది ”తనని శివరాత్రి రోజు కన్యగా, ఒంటరిగా, కాలినడకన రమ్మని గురువు ఆదేశం అని”
ఆ రాకుమారుడు వెంటనే ఆమె ను “గురు దక్షణ తీర్చేంత వరకు నేర్చుకున్న విధ్యకు, వినయానికి విలువ లేదు కనుక, శివరాత్రి వరకు వేచి ఉంది గురుదక్షణ చెల్లించి రావలసినది గా బార్యకి నచ్చ చెప్పాడు.
శివరాత్రి రానే వచ్చింది.
ఆమె చక్కగా తయారయింది, వజ్ర వైఢూర్యాల నగలు ధరించి ఆశ్రమానికి, ఒంటరిగా కాలి నడకన బయలు దేరింది.
మార్గ మధ్యం లో చీకటి పడింది. అయినా ఆమె నడుస్తూనే ఉంది.
ఒక గజదొంగ ఆమెని బందించాడు.. నగలు మొత్తం వలిచి ఇవ్వమని చెప్పాడు.
ఆ రాజకుమారి తను వెళ్తున్న విషయం చెప్పి ‘పూజానంతరం అదే మార్గం లో తిరిగి వస్తాను అని అప్పుడు అతను కోరిన విధంగా తన నగలు అన్నిటిని ఇచ్చేస్తానని .. తన దారి విడమని అడిగింది. మాట తప్పనని ప్రమాణం చేయిచ్చుకున్నాక అతను దారి పొడవునా తోడుగా వచ్చి గురుకులం లో దిగబెట్టాడు.
ఆశ్రమం లో పూజా కార్యక్రమం పూర్తి అయింది.
తెల్లవారుతుండగా ఆమె తిరుగు ప్రయాణం అయింది. దారిలో దొంగని కలిసింది. నగలు మూట కట్టి అతనికి ఇచ్చింది. దొంగ విచలితుడు అయ్యాడు. “తల్లీ నీ అంతటి ఉత్తమురాలి వద్ద దోచుకున్న ధనం నాకు వలదు. నన్ను మన్నించి నీవే తిరిగి అలంకరించుకొని వెళ్ళమని కోరి, నగలు తిరిగి ఇచ్చి పంపాడు.
ఇంటికి వెళ్ళిన తర్వాత బర్త తో కలిసి అన్నీ విషయాలు చెప్పి ఆమె సంతోషంగా జీవితం ప్రారంభించినది.
రామన్న చెప్పటం ముగించాడు.
“మీరంతా .. శ్రద్ధగా విన్నారు కదా? ఇప్పుడు ఈ కధలో ముగ్గురు వ్యక్తులగురించి మాట్లాడుకుందాం. 
గురుదక్షణ తీర్చిన ‘రాకుమారి’,
ఆమె గురువు కోరికను అనుమానించ కుండా ఒంటరిగా పంపిన ‘రాకుమారి బర్త’,
అందివచ్చిన నగలను తిరస్కరించిన ‘దొంగ’ వీరిలో ఎవరు గొప్పవారు?
అందరితో పాటు ముగ్గురు పాలేర్లను కూడా అడిగి సమాదానం తెలుసుకున్నాడు. విచిత్రంగా ముగ్గురూ తలా ఒక సమాదానం చెప్పారు. 
***
మర్నాటి ఉదయం రామన్న, వెంకటాద్రి గారికి ముగ్గురు పాలేర్లలో దొంగ ఎవరో చెప్పారు.
(చిన్నతనం లో విన్న కధ... కొంత మార్పులతో.. నా మాటల్లో )

లక లక లక – కే‌ఎన్ మూర్తి.

వామనరావు ఫోను మ్రోగింది.అది ఎలా మ్రోగుతుందో, ఎలా మ్రోగించాలో ఆయనకి తెలీదు. ఆకుపచ్చ చుక్కని పక్కకి లాగాలని ఆయన కూతురు కళ్యాణి విమానం ఎక్కేరోజు చెప్పి వెళ్లింది. దానినుండి ఆమెకి ఫోన్ చెయ్యటం ఎలానో కూడా ఆయనకి తెలీదు.చాలా కాలం అయింది ఆమె తనతో మాట్లాడి... రోజు ఆశగా గూట్లో ఫోను చూస్తూ ఉండటం అలవాటయింది ఆయనకి. ఫోను మ్రోగినపుడు ఆ చుక్కని పక్కకి లాగుతాడు. ఒక్కోసారి అది ఆయన మాట వినదు.ఎప్పటిలాగే అదేపని చేశాడు.. కూతురు కనిపిస్తూ ఉంది.ఏదో మాట్లాడుతూ ఉంది. తనకి వినబడటం లేదు. ఏదో చెబుతుంది. అరచేతి కన్నా చిన్న ఫోను లో ఆమె ఏదో సీరియస్ గా మాట్లాడుతుంది.కానీ వామనరావుకి వినిపించడం లేదు. ఆయన లో కంగారు మొదలయింది.వా

 ఆయన లో కంగారు మొదలయింది. ........
కధా రచనలో ఇదో ఎత్తుగడ. ప్రారంభపు కొద్ది వాక్యాలలో ఒక ముడి వేయటం.. రచయిత దాన్ని విప్పేంత వరకు పాఠకుడిని ఏక బిగిని చదివించేలా చెయ్యటం శైలి లో ఉన్న బిగువు.
అది నిండుగా ఉన్న ఓ కధా సంచికని నేనీ రోజు చదివాను.
90 పేజీల అందమయిన లేఔట్ కలిగిన ఈ చిన్న పుస్తకాన్ని అతి తక్కువ ధరకు ఆన్లైన్ లో అందుబాటులో ఉంచిన రచయిత శ్రీ కే‌ఎన్ మూర్తి కి దన్యవాదాలు.
పేరుకి దయ్యాల కధలయినా.. మూర్తి గారి దయ్యాలకి మనసు ఉంటుంది.
అవి మనన్ని ప్రశ్నిస్తాయి.
మనన్నీ శిక్షిస్తాయి.
వేలెత్తి చూపిస్తాయి.
నిజానికి దయ్యం అనేది ఒక పప్పెట్.
ఆ పప్పెట్ ని అడ్డుగా ఉంచుకుని రచయిత తన భావాన్ని అంతర్లీనంగా హృద్యంగా చెప్పటం నేనీ సంకలనం లో గమనించాను.
ఇది ప్రారంభం మాత్రమే ఈ లక లక లక కి కొనసాగింపు ఉంది.
ఎందుకంటే సమస్యలు, రుగ్మతలు మరెన్నో ఉన్నాయి.
వాటన్నిటి మీదా రచయిత దృష్టి ఉంది.
పుస్తకం కొని చదవటం కష్టతరంగా మారిన ఈ రోజుల్లో సరళమయిన ధరకి (రూ 60-00)చక్కటి పేజ్ లే అఔట్ తో విభిన్నంగా ప్రెజెంట్ చేసిన ‘ ఈ పుస్తకం’ లోని ప్రతి కధా (మొత్తం 28 కధలు) మిమ్మల్ని అలరిస్తుందని నా నమ్మకం. చక్కగా ఈ కధా సంపుటిని (పి‌డి‌ఎఫ్ లో) మన స్మార్ట్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు.
కధకి రెండు రూపాయల చిరు ఖర్చు తో విలువైన ప్రశ్నలని ఎన్నింటినో రేకెత్తించిన మూర్తి నా సోదర సమానుడు కావటం నాకు ఎంతో ఆనందం గా ఉంది. 

తిక్క శంకరయ్య

వారంతా అమృతం కోసం పాలసముద్రాన్ని మధిస్తున్నారు.
దేవతలను అమరులుగా చేసేందుకు అమృతం కావాలి.
అమృతం కోసం ప్రయత్నిస్తే వద్దన్నా వచ్చేది హాలాహలం.
హాలాహలం  కాలకూట విషం. అది నిలువునా ప్రాణులని  చంపేస్తుంది.
ఆ తర్వాత  అమృతం వస్తే ఎంత? రాకపోతే ఎంత?
హాలాహలం వరకు  ఎవరైనా హరించేస్తే ఎంత బాగుంటుంది?
అప్పుడు ఒక బైరాగి ముందుకొచ్చాడు.
అతడు బేసి  కన్ను వాడు. గోచిపాత వాడు.
అతను మంచుని, మంటని ఒక్కటిగా లెక్క చేసే తిక్క శంకరయ్య.
చర్మమే ఆయన దుస్తులు......
భస్మమే ఆయన ఆభరణాలు.....
స్మశానమే ఆయన ఇల్లు......
భూతాలు ఆయన మిత్రులు ........
"లోకాల... కోసం నేను విషాన్నిమింగేస్తాను." అన్నాడు.
"రేపు రాబోయే అమృతం కోసం నేడు హాలాహలం తాగేస్తాను" అన్నాడు.
హాలా హల విషమంటే మాటలా? విషం దహించి వేస్తుంది. ఆవిరులు ఊపిరిని ఆపేస్తాయి.
అయినా విషాన్ని ఖుషీగా తాగేస్తానంటున్నాడు తిక్క శంకరయ్య.


"నాకోసం విషాన్ని తాగుతున్నావా తండ్రీ?" ఆప్యాయంగా అనుకుంది పాము.
అంతే చర చర బిర బిర వచ్చి విషం మంటలను తగ్గించేందుకు ఆ శంకరయ్య గొంతుకు చుట్టుకుంది.
విషం గొంతు దిగితే చతుర్దశ భువనాలు ధ్వంసమైపోతాయి.
కాబట్టి అది గొంతు దిగకుండా భార్య పార్వతి వచ్చి ఆయనలో తాను సగమైంది.
గొంతును అదిమి పట్టుకుంది.
"జగత్తు కోసం విషం తాగుతున్న ఓ చక్కనయ్యా... నీకు చల్లదనాన్ని పంచుతా".
అంటూ చంద్రుడు శంకరయ్య తలపై కూచుని వేదన తగ్గించే చల్లదనాన్నిచ్చాడు.
శిరోభారం తగ్గించేందుకు గంగ చిరుజల్లులు కురిపించసాగింది.


..
విషం గొంతులో ఉంది.
శంకరయ్య నీల కంఠుడయ్యాడు...
గరళ కంఠుడయ్యాడు....
స్థితి కంఠుడయ్యాడు.
తల తిరుగుతోంది.
మత్తు ఆవహిస్తోంది.
విషం తన పని తాను చేసుకుంటోంది. 
రాత్రి గడిస్తే కానీ విషయం అవగతం కాదు.
..
"అయ్యో మాకోసం త్యాగం చేస్తున్నావు. నీకోసం మేముంటాము" అంటూ, సప్త లోకాలు, చతుర్దశ భువనాలు, ముక్కోటి దేవతలు, శతకోటి జనాలు, అశేషకోటి జీవాలు రాత్రి తెల్లవార్లూ అతడిని కనిపెట్టుకుని నిద్ర మాని జాగారం చేశాయి.

సమాజం కోసం పనిచేసేవాడికి సమాజమే తోడు.
లోకహితం కోరేవాడికి లోకమే హితం చేకూరుస్తుంది.
జనం కోసం విషం తాగిన వాడు.  
అందుకే శవం కాకుండా శివం అయ్యాడు.

ఆ రాత్రి శివరాత్రి అయ్యింది!!!

లేట్ నైట్ పోస్ట్


కొత్త ఊరు.
ఎవరో అన్నట్టు కొన్ని పరిచయాలు తత్కాల్ టికెట్ వంటివి. 
ఆమె. రెస్టారెంట్ లో కనిపించింది. 
పరిచయాలు అయ్యాయి.
వ్యాపారనిమిత్తం ఆయన అక్కడికి వచ్చానని చెప్పాడు.
ఆమె కూడా అదే నిమిత్తం అతన్ని తన ఇంటికి తీసుకెళ్లింది.
చిన్న హాల్లో గోడ మీద ఒక యువకుడి బొమ్మ.
ఎవరతను? మీ తమ్ముడా?
కాదు.
మరెవరు?
వదిలేయ్.
చెప్పకూడడా?
నవ్విందామే. “నిజం చెప్పనా?”
“ఊ”
‘నేనే అప్రెషన్ కి ముందు’. 

Tuesday, 21 February 2017

వైద్యనాథ మహాదేవ

ఆమె మనసు నిండా భయం, బర్త కోసం దిగులు ....
యుద్ధానికి వెళ్లిన భర్త క్షేమసమాచారం లేదు...
ఏమయ్యాడో తెలియదు. పది రోజుల క్రింద ఉత్తరం వచ్చింది.
ఆ తరువాత నుంచి ఎటువంటి సమాచారము లేదు....
గుర్రంపై స్వారీ చేస్తూ తెలియకుండానే కొండపైకి ఎక్కుతోంది ఆమె....
"మార్టిన్.... ఐ మిస్ యూ మార్టిన్.... ఐ మిస్ యూ సో మచ్ డియర్"
కళ్లల్లో నీళ్లు తిరిగాయి....కడిగేసినంత స్పష్టంగా కల్నల్ మార్టిన్ బొమ్మ ఆమె కళ్లముందు కట్టింది....
సాయంత్రం....
సూర్యుడు పడమర ఒడిలో పడుకుండి పోతున్నాడు...
కొండమీద కాషాయ కాంతి విరజిమ్ముతోంది....
వింత నిశ్శబ్దం అంతా పరుచు కుంటూ ఉంది.
ఉన్నట్టుండి......
గణ గణ గణ గణ .....
గణ గణ గణ గణ......
గంటల శబ్దం నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చింది....
ఆ శబ్దం వచ్చిన వైపు చూపింది ఆమె....
దూరంగా ఒక శిధిల దేవాలయం.... అందులోనుంచి హారతి దీపాల వెలుగు....ధూపాల పొగ....ఘంటారావం....
అప్రయత్నంగానే ఆమె ఆ గుడిపైపు వెళ్లింది. గుడిముందు గుర్రం దిగి చెప్పులు విప్పి లోపలికి వెళ్లింది....
లోపల ‘వైద్యనాథ మహాదేవ శివుడు’....లింగాకారంలో విచిత్ర కాంతులు వెదజల్లుతూ.....
అర్థనిమీలిత నేత్రాలతో పూజారి అర్చన చేస్తున్నాడు.... ఆయన నోటి నుంచి మంత్రాలు అలవోకగా వెలువడుతున్నాయి....
ఆమె తనకు తెలియకుండానే అక్కడే నిలబడిపోయింది.....కళ్లనుండి ధారగా నీరు కారుతూనే ఉంది....
పూజ పూర్తికాగానే పూజారి ఆమె వైపు చూశాడు..."మేమ్ సాబ్....తీర్థం తీసుకొండి...."
"ఏమిటమ్మా ఏదో దుఃఖంలో ఉన్నట్టున్నారు"
ఆమె తన భర్త కల్నల్ మార్టిన్ అఫ్గన్ యుద్ధానికి వెళ్లిన సంగతి, ఆయన క్షేమ సమాచారం లేని విషయమూ చెప్పింది. చెప్పిందన్న మాటే కానీ కన్నీళ్ల వర్షం కురుస్తూనే ఉంది...
"మేమ్ సాబ్... కంగారు పడకండి... ‘బైద్యనాథ్ మహాదేవుడు’ అందరినీ కాపాడతాడు...
ఆయన దయ ఉంటే మృత్యువేమీ చేయదు. అంతఃకరణ శుద్ధిగా బైద్యనాధుడిని అర్చించండి.
‘ఓం నమశ్శివాయ’ అన్న మంత్రాన్ని పదకొండు రోజుల పాటు చేయండి... అంతా మంచే జరుగుతుంది." అన్నాడు....
ఆమెకి ఏమనిపించిందో తెలియదు కానీ ఆ మరుసటి రోజు నుంచే అన్నపానాలు మానేసింది. అన్ని పనులూ మానేసింది. తన గదిలోనే కూచుంది...."ఓం నమశ్శివాయ.... ఓం నమశ్శివాయ..." మంత్రం జపించసాగింది.
మరొక ధ్యాస లేదు... ఇంకో ధ్యానం లేదు.... ఓం నమశ్శివాయ... ఓం నమశ్శివాయ....
ఒకటి ... రెండు .... మూడు ..... నాలుగు .... అయిదు .....
రోజులు గడిచిపోతున్నాయి...
"ఓం నమశ్శివాయ.... ఓం నమశ్శివాయ..."
పదకొండో రోజు.... రోజు రోజంతా పంచాక్షరిని జపించింది...
...
సాయంత్రం అవుతూ ఉండగా సేవకుడొకరు....
"మేమ్ సాబ్ ... మేమ్ సాబ్... సాహిబ్ కీ చిట్ఠీ ఆయీ హై... సాహిబ్ కీ చిట్ఠీ ఆయీ హై..." అని పరిగెత్తుకుంటూ వచ్చాడు....ఉద్వేగాన్ని ఆపుకుంటూ ఆమె ఆ లేఖను తెరిచి చూసింది....
తన ప్రియాతిప్రియమైన మార్టిన్ సంతకం చూసింది.... కట్టలు తెంచుకుంటున్న భావోద్వేగాన్ని ఎలాగోలా ఆపుకుంటూ లేఖను చదవసాగింది....
"డియర్....
గతంలో నీకు లేఖ వ్రాసిన మరుసటి రోజు నుంచే అఫ్గన్లు మా పటాలాన్ని చుట్టుముట్టారు. నలు వైపుల నుంచి భీకరమైన దాడి చేశారు. మేమెవరమూ బతికిబట్టకట్టి బయటపడే పరిస్థితి లేదు. మా దగ్గర ఆయుధాలూ తక్కువే... ఆహారమూ తక్కువే.... వాళ్లు వందల సంఖ్యలో ఉన్నారు.... ఇక మా పని అయిపోయిందనుకున్నాను.... ఒక అఫ్గన్ పొడవాటి ఖడ్గంతో నాపై దూకాడు... నేను భయంతో కళ్లు మూసుకున్నాను... ఆ క్షణంలో నువ్వు తప్ప నాకింకెవరూ గుర్తుకురాలేదు...
అంతలో అద్భుతం జరిగిపోయింది....
ఎవరో ఒక మనిషి అఫ్గన్లపైకి దూకాడు... ఆయన్ని నేను అంతకుముందు ఎప్పుడూ చూడలేదు....ఒళ్లంతా తెల్లగా ఏదో రాసుకున్నాడు. సింహం చర్మం మొలకి కట్టుకున్నాడు... చేతుల్లో పొడవాటి శూలం లాంటి ఆయుధం ఉంది.. ఆ శూలం కొన మూడుగా చీలి ఉంది.... ఆయన ధాటికి అఫ్గన్లు కకావికలమైపోయారు. కాలికి బుద్ధిచెప్పి పారిపోయారు....వాళ్లు పారిపోగానే ఆయన కూడా ఏమైపోయాడో తెలియదు.... ఎక్కడికి వెళ్లిపోయాడో తెలియదు...
ఆయన ఆ క్షణాన వచ్చి ఉండకపోతే నేను నీకు దక్కేవాడికి కాదు డియర్..."





* * *
1880 అఫ్గన్ యుద్ధం నుంచి తిరిగి వచ్చాక కల్నల్ మార్టిన్, ఆయన భార్య కొండమీద కొలువున్న బైద్యనాథ్ మహాదేవుడిని దర్శించుకున్నారు. శిథిలావస్థలో ఉన్న ఆ దేవాలయం జీర్ణోద్ధరణకు పదిహేనువేల రూపాయలు సమర్పించుకున్నారు. మహాదేవ్ మందిరానికి కొత్త శోభ వచ్చింది.
కొన్నాళ్లకి కల్నల్ మార్టిన్ సతీ సమేతంగా ఇంగ్లండుకు తిరిగి వెళ్లిపోయారు. అక్కడ కూడా వారి ఇంట్లో ఒక శివుడి విగ్రహం పెట్టుకున్నారు. కడవరకూ ఆయన్నే అర్చించారు..
మందిరం ముందు ఉన్న శిలాఫలకంపై తమ కథను కల్నల్ మార్టిన్, ఆయన భార్య వ్రాయించారు. ఆ మందిరం మధ్యప్రదేశ్ లోని షాజాపూర్ జిల్లాలోని అగర్ మాల్వాలో ఉంది. భారత దేశంలో బ్రిటిషర్ కట్టించిన ఏకైక దేవాలయం అది....
http://daily.bhaskar.com/news/JM-RIT-british-made-shiva-temple-5328275-PHO.html

Sunday, 19 February 2017

అబ్బక్క రాణి

కంప్యూటర్లు రాని కాలంలో .... కమ్యూనికేషన్లు లేని రోజుల్లో .... ఉల్లాల్ అన్నా, చౌతా అన్నా గుర్తొచ్చేది ఒకే ఒక్కరు...
ఆమె పేరు అబ్బక్క......
అవును ... ఆ కాలంలో పేర్లకు ఇంకా ఫ్యాషన్ బురద అంటలేదు.
అబ్బక్క...
మనసు గూగుల్ మ్యాప్ లో కర్నాటక తీరంలోని రేవు పట్టణం ఉల్లాల్ కి జూమ్ అవండి. ఉల్లాల్ వెళ్లాక టెమ్ మెషీన్ లో నాలుగొందల ఎనభై ఎనిమిదేళ్లు వెనక్కి వెళ్లండి. అప్పటి తీరాలను, అప్పటి ఊళ్లను, అప్పటి రాచరికాలను, అప్పటి యుద్ధాలను కళ్లముందు బొమ్మకట్టించుకొండి... అప్పుడు సాక్షాత్కరిస్తుంది అబ్బక్క. ....
తుళునాడు కి రారాజ్ఞిగా పోర్చుగీసు దోపిడీదారులను పదేపదే మట్టికరిపించిన పోరాటయోధురాలు అబ్బక్క మహాదేవి.....
కత్తియుద్ధం, గుర్రపుస్వారీలతో పాటు రాజకీయ వ్యవహారాలు, దౌత్యనీతిలో దిట్టగా వెలుగొందిన ధీర అబ్బక్క మహాదేవి.....
అటు కేరళ జామొరిన్ పాలకుడు, ఇటు మంగుళూరు మహరాజులు, మరోవైపు అహ్మద్ నగర్ నవాబులను కలుపుకుని ఒక స్వదేశ రక్షణ త్రికోణశక్తిని తయారుచేసి, ఆ త్రికోణానికి బిందువుగా నిలిచిన భారత భద్రతా శ్రీచక్రం.... అబ్బక్క మహాదేవి......
1525 లో మూడబిద్రి లో పుట్టిన అబ్బక్క 'చౌతా' కుటుంబానికి చెందిన జైన మతస్తురాలు. వంశాచారం ప్రకారం మామ తిరుమల రాయని రాజ్యానికి రాణి అయింది ఆమె. జైన మతానుయాయురాలైనా రంగులు మారే రుద్ర శిలతో తీర ప్రాంతాన ఒక అద్భుత శివలింగాన్ని ఏర్పాటు చేసి, గుడి కట్టించింది ఆమె. జనరంజక పరిపాలన, దూరదృష్టి, సమర్థ నేతృత్వాలతో ఆమె రాజ్యం అలరారుతూండేది. ఉల్లాల్ మసాలాదినుసుల ఎగుమతికి పేరెన్నిక కన్న ఊరు. ఆమె భర్త లక్ష్మణప్ప మంగుళూరుకి రాజు. కానీ రుద్రమదేవిలాగానే అబ్బక్కకీ, ఆమె భర్తకీ పడిరాలేదు. ఆమె జైనమతస్తురాలు. భర్త శైవ మతావలంబి. (రుద్రమదేవి విషయంలో ఇది తిరగబడింది. ఆమెది శైవం. భర్తది జైనం)
అవి భారత్ పై తెల్లయూరోప్ నల్లమేఘమై ముసురుకుంటున్న రోజులు... పోర్చుగీసు వాళ్లు పడమటి తీరాన భారత సూర్యుడిని దిగముంచేందుకు యత్నిస్తున్నారు. అప్పటికే 1510 నాటికి గోమాంతక్ భూమి వారి వశమైంది. (గోమాంతక్ అన్నది పలకలేక గోవా అన్నారు. పోర్చుగీసులు పోయినా మనం మాత్రం గోవా అనే అంటున్నాం. ). ఇక రత్నాగిరి, కొంకణ తీరాలపై పట్టు దొరికింది. ఆ తరువాత వారి కన్ను కేరళ సాగర తీర రాజు జామొరిన్ పై బడింది. జామొరిన్ ను వశపరచుకునేందుకు వెళ్తూ వెళ్తూ మంగుళూరును మట్టికరిపించారు. అది 1525. ఆ తరువాత ముందుకువెళ్లబోతే అబ్బక్క రాజ్యం తుళునాడు అడ్డం ఉంది. "ఇదెంత పని... ఆడదేం చేస్తుంది" అనుకున్నారు పోర్చుగీసువాళ్లు...ఉల్లాల్ మసాలా దినుసుల ఘాటు నసాళానికంటుతుందన్నది వారికి తెలియలేదు. అబ్బక్క దెబ్బకు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. 1555 లో అడ్మిరల్ డాం వారో డా సిల్వానియా నాయకత్వంలో మళ్లీ దాడి చేశారు. మళ్లీ మట్టికరిచారు. 1568 లో మూడో సారి పో పీక్సోరో అనే సేనాని నాయకత్వంలో మళ్లీ దాడి చేశారు. ఈ దాడిలో ఉల్లాల్ రాజభవనం వారి చేజిక్కింది. అబ్బక్క మహాదేవి ఒక మసీదులో తలదాచుకోవాల్సి వచ్చింది. కానీ అదే రాత్రి రెండు వందల మంది సైనికులతో ఆమె బుడతకీచుల (పోర్చుగీసులకు తెలుగోడు పెట్టుకున్న పేరు) పై విరుచుకుపడింది. ఈ దాడిలో జనరల్ పీక్సోటోను కత్తికో కండగా చేసింది. ఆ తరువాత మంగుళూరు కోటపై దాడి చేసి అడ్మిరల్ మాస్కరెన్హస్ ను పైలోకాలకి పంపించింది. ఏడాది పాటు ఆమె మంగుళూరు కేంద్రంగా పరిపాలించింది. కానీ భర్త లక్ష్మణప్ప పోర్చుగీసులతో కలిసి పోయాడు. పోర్చుగీసులు మళ్లీ ఆమెపై యుద్ధం జరిపారు. వారిని ఎదుర్కొనేందుకు ఆమె జామొరిన్, అహ్మద్ నగర్ రాజులతో కలిసి ఒక కూటమిగా ఏర్పడి పోరాటం చేసింది. 1570లో చివరికి పోర్చుగీసులదే పైచేయి అయింది. అబ్బక్క రాణి పోర్చుగీసు చెరసాల పాలైంది. జైల్లో ఉంటూ కూడా ఆమె తలవంచలేదు. అలాగే పోరాడుతూ పోరాడుతూ ప్రాణాలు వదిలింది.
అబ్బక్క కథ కన్నడిగులకు యక్షగాన గాథ అయింది. పౌరుషపు పాట అయింది. పోరాటపు బాట అయింది. తుళునాడులో గళం గళం ఆమె పాట పాడింది. అబ్బక్క ఉల్లాల్ కోట, కట్టించిన రుద్రశివ మందిరం, పూజించిన జైన బాసాడి, తలదాచుకున్న మసీదు తీర్థస్థలాలయ్యాయి. తరతరాలుగా తీరనగరిని అబ్బక్క ఆవేశించింది. ఉల్లాల్ నగరం వెళ్తే ఫిరంగి పక్కన నిలుచుని సేనలను ప్రోత్సహిస్తూనో, గుర్రం పై కత్తి చేబూని సింహిణీనాదం చేస్తూనో అబ్బక్క రణభూమిలో తిరుగాడుతున్నట్టు అనిపిస్తుంది. ఆమె కాంస్యవిగ్రహం నాలుగు వందల తొంబై మూడు ఏండ్ల కాలం నాటి పోరాటగాథ చెప్పేందుకా అన్నట్టు నగరం నడిబొడ్డున నిలుచుని ఉంటుంది.
కేంద్రంలో వాజ్ పేయీ ప్రభుత్వం వచ్చాక 'అబ్బక్క' పేరిట తపాలా స్టాంపు విడుదలైంది. ఈ మధ్యే తీరంలో విదేశీ తిమిరంపై సమరం చేసిన అబ్బక్క పేరిట మన తీరరక్షణ దళం (కోస్టుగార్డు) ఒక నౌకను కూడా జలప్రవేశం చేయించింది.


ఈ కథ చదివాక ఉల్లాల్ అంటే స్నేహా ఉల్లాల్, చౌతా అంటే సందీప్ చౌతాలు మాత్రమే కాక, అబ్బక్క రాణి కూడా గుర్తుకు వస్తే ఈ ఆర్టికల్ ఆశయం ఫలించినట్టే......
మీకు ఇంకా అబ్బక్క రాణి గురించి తెలుసుకోవాలని ఉంటే ఈ లింకులు సాయం చేస్తాయి.

దశరథ్ కి కోపం వచ్చింది

భీహార్ లో గయా వద్ద ఒక చిన్న పల్లెటూరిలో1934 లో  పుట్టిన
దశరథ్ మాంఝి (Dashrath Manjhi) కి కోపం వచ్చింది ...
ఎవరి మీద?
కొండ మీద...
ఎందుకు కోపం వచ్చింది?
అడ్డంగా ఉన్నందుకు... అడ్డం పడుతున్నందుకు...
అవును
కొండకు అటువైపు తన గ్రామం అత్రి ఉంది.
కొండకు ఇటువైపు వాజరంగ్ గ్రామంలో తన పొలం ఉంది.
పొలానికి వెళ్లాలన్నా, అడవిలో కట్టెలు కొట్టాలన్నా కొండను దాటాల్సిందే... చెమటలు కక్కాల్సిందే..
దశరధ్ భార్య ఫల్గుణి దేవి
రోజూ మధ్యాహ్నం భార్య ఆహారం తేవాలన్నా ఈ కొండ ఎక్కి రావాల్సిందే.
ఒక రోజు ఆమె భోజనం తెస్తూండగా ఒక బండరాయి కాలికి తగిలి ఆమె పడిపోయింది. ఆమెకు దెబ్బలు తగిలాయి. అన్నం ముంత పగిలిపోయింది.
అందుకే ...
దశరథ్ కి కోపం వచ్చింది.
ఎవరి మీద?
కొండ మీద.
ఎందుకు కోపం వచ్చింది?
అడ్డంగా ఉన్నందుకు... అడ్డం పడుతున్నందుకు...
దశరథ్ ఊళ్లోకి వచ్చి గ్రామస్తులతో ఈ కొండను తొలిచి దారిని నిర్మిద్దాం అన్నాడు.
"అసాధ్యం" అన్నారు అంతా.
దశరథ్ కోపం మాత్రం చల్లారలేదు.
సుత్తి తీసుకున్నాడు. కొండరాళ్లను బద్దలు గొట్టడం మొదలుపెట్టాడు. పొలం పని, ఇంటి పని పోను మిగతా పగలంతా పగలగొట్టడమే పని.
రాళ్ల కింద మంట పెట్టడం....
పగుళ్లు రాగానే వాటిని బద్దలుచేయడం ...
ఇదే పని....
ఆ దశరథుడు పుత్రకామేష్టి చేసినంత నిష్ఠకా ఈ బీహారీ దశరథుడు "పత్థర్" కామేష్టి చేశాడు.
బండలు బద్దలయ్యాయి...
కొండలు పిండి అయ్యాయి.
చివరికి ...
కొండ రెండుగా చీలి .... దశరథ్ కి దారి ఇచ్చింది. కిలో మీటర్ల దూరం చెరిగిపోయింది.
ఇప్పుడు అత్రి, వాజరంగ్ ల మధ్య 360 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు ఉన్న దారి ఏర్పడింది.
దారి పొడవునా దశరథ్ చెట్టు నాటాడు. ఆ మొక్కలు పెరిగి మహావృక్షాలయ్యాయి.

55 కిలోమీటర్ల దారి 15 కిలోమీటర్లలో సర్ధుకుంది.


కొండను తవ్వి దారిని దొరకబట్టడానికి దశరథ్ కి ఒకటి కాదు ... రెండు కాదు ... ఏకంగా 22 (1960-83) ఏళ్లు పట్టింది.
ప్రజలూ, ప్రభుత్వం దశరథ్ కి బ్రహ్మరథం పట్టాయి. అవార్డులు,రివార్డులు వచ్చాయి. మౌంటెన్ మాన్ గా పేరు పొందాడు. ప్రత్యక్షంగాను పరోక్షంగాను అతని కధ తో కొన్ని సినిమాలు తీశారు.
2007 ఆగస్టు 17 గాల్ బ్లాడర్  కాన్సర్ తో AIMS, న్యూ డిల్లీ  లో  మరణించేటప్పటికి  అతని వయసు 72 ఏళ్ళు.

వాల్మీకి శోకం శ్లోకమైంది....
దశరథ్ కోపం కొండదారి అయ్యింది. ....
****
అయితే దశరథ్ చనిపోయేనాటికీ కోపం వస్తుండేది.
ఎవరి మీద?
అసమర్థుల మీద.
ఆత్మవిశ్వాస రహితుల మీద ....
ఎందుకు కోపం వస్తుంది?
అసాధ్యం, అసంభవం అని చేతులు ముడుచుకున్నందుకు .....

ఆత్మశక్తిపై అపనమ్మకం ఉన్నందుకు .....

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...