Saturday, 26 November 2016

అభినందనలు

ఆర్మీ 'మేజర్' తన ట్రూప్ కి శిక్షణ ఇవ్వటం కోసం అడవిలోకి తీసుకెళ్ళాడు. 
క్లిష్టమయిన శిక్షణ లో ఉన్నప్పుడు సిగ్నల్ తక్కువగా ఉండటం వల్ల హెడ్ క్వార్టర్స్ నుండి కమ్యూనికేషన్ కట్ అయింది. 
**
రెండో రౌండ్ ప్రాక్టీస్ చేయిస్తుంటే,, హెడ్ క్వార్టర్స్ నుండి ఒక రైఫిల్ పేలటం వినిపించింది.
అత్యవసర పరిస్థితులలో ఇచ్చే సిగ్నల్ అది.
మేజర్ వెంటనే జీపు లోకి దూకి డ్రైవర్ ని వేగంగా వెళ్ళమని చెప్పాడు.
అరగంటలో అక్కడికి ఆఘమేఘాలమీద గమ్యం చేరుకున్నారు.
**
జీపు పార్క్ చేసి ఇద్దరు లోపలికి నడుస్తుంటే.. కల్నల్ ఎదురోచ్చి “ మీకో గుడ్ న్యూస్ ఓహ్ సరిగ్గా అరగంటలో వచ్చేశారు. గుడ్ . మీకు అభినందనలు “ చెయ్యి కలుపుతూ ..
“ నాదేముంది. అంతా డ్రైవరు గొప్పతనం. నిజానికి అతనినే అభినందించండి" అన్నాడు మోడెస్టీ గా
కల్నల్ డ్రైవరు బుజం తట్టి “ మీ మేజర్ కి అమ్మాయి పుట్టింది. మీకు అభినందనలు”

స్వైపింగ్ మిషను కావలెను.

ఉరిచివర ఇసోలేటెడ్ గా ఉన్న ఆ రెండు పోర్షన్ ల బిల్డింగ్ లో అర్ధ రాత్రి దొంగలు చొరబడ్డారు. 
ఉత్తరం పోర్షన్ బయట గడి పెట్టారు. ఏ‌సి పైపు లోకి క్లోరోఫామ్ ఎక్కించారు. దక్షణమ్ పక్క ఉన్న భాగం లో యజమాని ఉంటాడు అనే జనరల్ నాలెడ్జ్ తో దాని తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు. ముందు గదిలో ఒక ముసలావిడ పడుకుని ఉంది. వెంట తెచ్చుకున్న ఆడ్హెసివ్ టేపు నోటికి అంటించారు. దానితోటే చేతులు రెండు కలిపి టేప్ చేశారు. 
మరో గదిలో ఇంటావిడ నిద్రపోతు ఉంది. పక్కనే మూడు అంకె వేసుకుని మగ వ్యక్తి కూడా. ముఖం మీద స్ప్రే చల్లి ఆమెని పూర్తిగా స్పృహ తప్పించారు. అతను మత్తుగా నిద్ర పోతున్నాడు.
ఒక దొంగ కాపలా ఉంటే మిగిలిన వాళ్ళు సోదా ప్రారంభించేరు.
హల్లో పెద్ద్ టి‌వి, దొడ్లో రాగి బాయిలరు తప్ప విలువయినవి ఏమి కనిపించలేదు. నగల కోసం వెతికారు. ఆమె వంటిమీద ఉన్నవి గిల్టు నగలు అని అనుభవం తో అర్ధం అయింది. మగ మనిషి చేతికి రంగు రాళ్ళ గిల్టు ఉంగరాలు ఎనిమిది ఉన్నాయి.
బీరువా తాళాలు తెరిచే ఉన్నాయి. చిరగటానికి సిద్దంగా ఉన్న పట్టు చీరలు రెండు, నాలుగు జతల బట్టలు, మూడు ఫోటో ఆల్బమ్ లు, డాక్టర్ బిల్లులు, మెడికల్ రిపోర్త్లు తప్ప మరేమీ కనిపించలేదు.
మగ మనిషిని కట్టేసి అతని ముఖాన నీళ్ళు చల్లారు.
“డబ్బు ఎక్కడ?” ముసుగుల్లోంచి అతన్ని అడిగారు.
అతనికి విషయం వెంటనే అర్ధం అయింది.
బారు మూసేటప్పుడు బేరర్ తెచ్చిన బిల్లు చెక్ చేసినట్టు వాళ్లందరిని పరకాయించి చూశాడు.
“డబ్బులా? కొత్తవా ? పాతవా?”
“ఎవయినా సరే?” గదమాయించారు దొంగలు.
“తిక్క సన్నాసుళ్ళారా.. ఇండియా లో ఎవడి దగ్గరయినా డబ్బులు మిగిల్చాడట్రా .. డిల్లీ లో పెద్ద దొంగ?”
దొంగలకి చిరాకు పుట్టింది. గత రెండు వారాల నుండి ఇదే పరిస్తితి. ఏ జేబు కొట్టినా ఖాళీ పర్సులే, ఏ ఇంటికి చొరబడ్డా ఖాళీ చేతులే?”
లాగి పెట్టి ఒకటి పీకారు.
అతను ప్రైవేట్ కాలేజీ లెక్చరర్. ఇలాటివి ఎలా పరిష్కరించాలో బాగా తెలుసు.
“అబ్బాయిలు మీకు చేతులు నొప్పి, తర్వాత పోలీసులకి మీడియాకి పని తప్ప ఏం ఉపయోగం లేదు. దీనికి మధ్య మార్గం ఒకటే ఉంది. మీదగ్గర స్వైప్ మిషన్ ఉంటే చెప్పండి. మీరు కష్టపడ్డందుకు, నష్ట పోకుండా క్రెడిట్ కార్డు లిమిట్ వరకు గీకుతా”
..
“ స్వైపింగ్ మిషనా ? అంటే? “ అన్నాడు కుర్ర దొంగ. ..
..
“అప్డేట్ కండి. వెళ్ళండి. టైమ్ వెస్ట్ చేసుకోవద్దు. వెళ్తూ తలుపులు దగ్గరగా వెయ్యండి. మంచి నిద్ర పాడు చేశారు. “

బ్యాంక్ రాబరీ (మోడి వెర్షన్)

పొద్దుటే ఫర్లాంగ్ ఉన్న 'క్యూ' లైన్ మధ్యానానికి పలచబడింది. 
లంచ్ బ్రేక్ కి ముందు కాషియర్ ముందున్న కస్టమర్ ఒకరు హటాత్తుగా బాగులోంచి తీసిన ఒక నాటు తుపాకిని గాల్లోకి పేల్చాడు. 
మొహమాటానికి తిరుగుతున్న ఫ్యాన్ రెక్క ఊడి పక్కనే ఉన్న మానేజరు టేబుల్ మీద పడింది.
“ఖబార్డర్ ఎవరన్నా కదిలారంటే కాల్చేస్తాను. అసలే నాకు షూటింగ్ రాదు. ఎవరికి తగులుద్దో బాలయ్య బాబు కూడా చెప్పలేదు. మూడు రోజుల నుండి క్యూ లో నిల్చుని ఉన్నాను. కౌంటర్ దగ్గరకి వచ్చే సరికి డబ్బు అయిపోయింది అని చెబుతున్నారు”
రెండో చేతిలో సిద్దంగా ఉంచుకున్న పాసు బుక్, అందులో 24000 సెల్ఫ్ చెక్కు లోపలికి నేట్టాడు.
“పిల్లాడికి పరీక్ష ఫీజు కట్టాలి. మా ఆవిడకి రెండు రోజుల నుండి జ్వరం. చేతిలో రూపాయి లేదు. మా మేనేజరు ఇచ్చిన శెలవు ఇవాళ తో ముగుస్తుంది. “
తుపాకి కాషియర్ కి గురి పెట్టాడు.
చెక్ పాస్ చేసి నోరుమూసుకుని లిమిట్ 24000 ఇచ్చేసెయ్. అన్నీ 2000 నోట్లు ఇచ్చావో ఖాతం. 100 రూపాయల కట్టొకటి ఇవ్వు. పాస్ బుక్ అప్డేట్ గా ప్రింట్ చేసి ఇవ్వు. ఖబర్దార్ ఎవరయినా అడ్డుపడ్డారో నా చేతుల్లో బలే.” పెద్దగా అరిచి చెప్పాడతను. 

Friday, 25 November 2016

అదే కధ

కాలేజీ పాత విధ్యార్డుల, సమావేశం జరిగింది. 
పాత రోజులు గుర్తు చేసుకుంటూ .. కళాశాల అంతా తిరిగి చూస్తూ హాస్టల్ వైపు నడిచాడు లంబోదరం.. 
..
30 ఏళ్ల నుండి ‘అదే భవనం’, ‘అవే తలుపులు’..
తను చదువుకున్నప్పుడు ఉన్న రూముకి వెళ్ళాడు. 
తలుపు తట్టాడు.
..
నలుగురు కుర్రాళ్ళు ఉన్నారు లోపల.
పరిచయాలు అయ్యాయి.,
..
“అవే కిటికీలు, అవే మంచాలు” అన్నాడు లంబోదరం.
గోడల మీద కాలెండర్లు చూశాడు. “అవే కాలెండర్” అన్నాడు నవ్వుతూ.
..
కుర్రాళ్ళు కంగారుగా వాటిని వెనక్కి తిప్పేశారు.
కుర్చీలో కూర్చుని వాళ్ళతో పిచ్చాపాటి మాట్లాడుతుంటే, మంచం కింద సీసాలు కనిపించాయి.
..
“ మాది ఫల  రసాయనం .. మా నాయినమ్మ పంపింది” అన్నాడు ఒక విద్యార్ధి కంగారుపడుతూ...
లంబోదరం నవ్వి “అదే కధ “ 

కుర్చీ తుడిచిన కాగితం

నేను టిఫిన్ చెయ్యటానికి ఆ చిన్న హోటల్ వద్ద ఆగగానే ఆవిడ నన్ను గుర్తు పట్టింది.
పొయ్యి వద్ద నుండి పక్కకి వచ్చి, ఒక పాత పుస్తకం నుండి బర్రున ఒక కాగితం చించి, ఇనపకుర్చీ శుబ్రంగా తుడిచింది.
నాలుగు ఇడ్లిలు, ఒక సాదా దోశె తిన్నాను.
..
నా కష్టం పగ వాడికి  కూడా వద్దు.
..
కుర్చీ తుడిచిన కాగితం లో నాకధ ఉంది. స్టైల్ గా బుగ్గన పెన్ను పెట్టుకుని ఉన్న ఫోటో ఉంది. 

Tuesday, 22 November 2016

వాత

బజార్లో ఏమి జరిగినా  సంపూర్ణ కి  అత్యవసరం.
ఆ వీధి లోకి కొత్తగా ఎవరు చేరినా? ఎవరింటి లో అయినా చిన్న గొడవ జరిగినా, పిల్లలు పరీక్షలు పాసయినా, ఫైల్ అయినా, ఎవరేం కొన్నా, ఆఖరికి ఏమి వండుకున్న సరే,  అన్నీ ఆమెకి తెలియాల్సిందే.
ఆ జబ్బు కొన్నాళ్ళకి ముదిరి పోయి, ఎదుటివారి గురించి ఊహాగానాలు చెయ్యటం  వాటి కి ప్రచారం కల్పించడానికి ఆమె అలవాటు పడి పోయింది.
ఈ మద్యే ఒక యువ జంట మా వీది లోకి కొత్తగా చేరారు.
పాపం అతను ఆటో వేస్తాడు. మంచి చురుకయిన వాడు. 
ఆమె బెల్దారు కులీ  పనికి వెళ్తుంది.  వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటం మినహాయించి మరో విషయం లో జోక్యం చేసుకోవటం నేనేరగను.
ఎప్పుడయినా ఎదురయితే మర్యాద పూర్వకంగా నవ్వుతాడు, లేదా చెయ్యెత్తి పలకరిస్తాడు. అంతే.
ఒక రోజు అతని ఆటో ఒక బార్ వద్ద ఆగి ఉందట, బజారు మొత్తానికి అతడు తాగుబోతని, రోజు బారు వద్దే తాగి పడి పోతాడని.... మరో కొత్త వార్త ఊహించే వరకు చెబుతూనే ఉంది. 
ఆ మాటలు అతనికి చేరేలేదంటే నేను నమ్మను. కానీ అతను ఆ విషయం పట్టించుకోక పోవటం నాకు వింతే !!
..

ఆదివారం ఉదయం ఒక విశేషం జరిగింది. 
అతని ఆటో సంపూర్ణ ఇంటి ముందు నిలిచి ఉంది. 

రిబ్బను పొడవు ఎంత?

9 సెంటి మీటర్ల వెడల్పు ఉండే పొడవాటి రిబ్బను ఒకదాన్ని ఒక అవధూత బ్రహ్మీ డాక్టర్కి బహుమతి గా ఇచ్చాడు. 
'నీకు బాగా అవసరం అయినప్పుడు మనసులో ద్యానం చేసుకుని ఆ రిబ్బను చేతిలో తీసుకుని ప్రార్ధన చేస్తే' ఆ కోరిక నెరవేరుతుందని, 
ఒక్కో కోరిక కోరెకొంది ఆ రిబ్బను పొడవు లో సగానికి, వెడల్పులో మూడోవంతు కి తగ్గిపోతుందని చెప్పాడు. 
..
మనాడు ఎగురుకుంటూ వెళ్ళి నర్సు సిమ్రాన్ కి ఈ విషయం చెప్పాడు...
.. 
మొదటి కోరిక నాకు బస్తాడు 2000 నోట్లు కావాలిఅందామే...
వెంటనే ఒక పెద్ద బస్తా 2000 నోట్లు కట్టలతో ప్రత్యక్షమయింది. 
రిబ్బను పొడవులో సగానికి , వెడల్పులో మూడో భాగనికి తగ్గి పోయింది. 
..
వారం గడిచింది. ఇద్దరు ఊరంతా తిరిగినా ఒక్క నోటు కి కూడా చిల్లర దొరకలేదు...
.. 
రెండో కోరిక: ఈ మొత్తం డబ్బుకి చిల్లర కావాలిఅన్నారు ఇద్దరు...
.. 
రెండు బస్తాల నిండా 500/1000 నోట్లు ప్రత్యక్షం. 
రిబ్బను పొడవులో సగానికి , వెడల్పులో మూడో భా గనికి తగ్గి పోయింది...
భ్రమి ఆనందం ఏడుపు కింద మారటానికి ఎంతో సేపు పట్టలేదు. అవన్నీ రద్దయిన నోట్లు. 
..
మూడో కోరిక: ఈ చెత్త నోట్లు అన్నీ మాయం అయిపోవాలి”. తదాస్తు!! అన్నీ మాయం అయిపోయాయి...
.. 
రిబ్బను పొడవులో సగానికి , వెడల్పులో మూడో భాగనికి తగ్గి పోయింది...
.. 
మొత్తానికి ఎక్కడ బయలు దేరారో అక్కడే మిగిలి పోయారు. 
చేతిలో అవదూత ఇచ్చిన 4.0 చదరపు సెంటీమీటర్ల ముక్క మిగిలింది. 
***
అవదూత మొదట్లో ఇచ్చిన రిబ్బను వెడల్పు 9 సెంటీమీటర్లు, పొడవు ఎంత ఉందో గుర్తు లేదు. మీరేమయినా సాయం చేస్తారా? 
---------------------
పగలంతా శ్రమ చేసి, వేడి నీళ్ళు పోసుకుని రాగి అంబలి తాగిన వాడికి మల్లె నిద్ర ప్రాప్తిరస్తు. 

మార్నింగ్ చాయ్-బిస్కెట్.

కన్వేయర్ బెల్ట్ మీద 500,1000 నోట్ల కట్టలు, ప్రయాణం చేస్తూ ఉన్నాయి. 
రద్దయిన కోట్లాది నోట్లని ఎలెక్ట్రిక్ క్రిమేషన్ :) కి పంపిస్తున్నారు. 
మార్గం రద్దీగాను, ప్రయాణం మందం గాను సాగుతుంది. 
..
ఇంతలో పక్క పక్క నే ఉన్న ఒక 500 నోటుకి, మరో 1000 నోటుకి స్నేహం కుదిరింది.
రెండు వాటి జీవిత ప్రయాణాన్ని గుర్తుచేసుకుని నిట్టూర్చాయి. ..
..
“నేను జీవితం లో అన్నీ అనీభవించేశాను” అంది వెయ్యి నోటు. ..
కళ్ళు విప్పార్చింది 500 నోటు.
..
“కంకార్డ్ విమానాల్లో తిరిగాను, నెలల తరబడి షిప్పులో ప్రయాణం చేశాను. నీకు తెలుసా ఏ‌సి కారు తప్ప మరోటి ఎక్కలేదు నేను. మాల్దీవ్స్ లో అందాలన్నీ చూశాను. గొప్ప అందగత్తెల పర్సు లన్ని తిరిగేశాను. షాంపైన్ ల రుచి చూశాను. “ తన్మయత్వం తో అంది...
..
500 నోటు నిట్టూర్చింది. ..
“ నా జీవితం ఎంతో పవిత్రం గా గడిచింది. నేను తిరగని గుడి లేదు, చూడని హుండీ లేదు, తిరపతి నుండి, షిర్డి, చార్ధామ్ లాటి అన్నీ పవిత్ర స్థలాలు చూశాను.., చాలా వృద్ధాశ్రమాలు, అనాధ శరణాలయాలు చూశాను.” అంది.
..
వెయ్యి నోటు అడ్డుపడింది. “ గుడా ??!! హుండీ నా?!! అంటే?!!”

Wednesday, 16 November 2016

కష్టం - సుఖం

మెడికల్ షాపు లో అమ్మ కోసం 'పైన్ బామ్' ఒకటి కొనటానికి ఆగినప్పుడు, బాల్య మిత్రుడు ఒకరు కలిశాడు. చదువు పెండలాడే ఆపేసి ఫ్సైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. ఆడ పిల్లలు ఇద్దరు యూ‌.ఎస్ లో ఉన్నారట. 
పిల్లలు, చదువులు, లాటి పిచ్చాపాటి మాట్లాడాక, పెద్దమ్మాయి వివాహం దగ్గరలోనే ఉందని చెప్పాను. 
"మీ నాన్న, అమ్మ.. అంతెందుకు మీకుటుంబం నాకు బాగా తెలుసు. పెళ్ళికి అవసరం అయిన డబ్బు ఇస్తాను.(500,1000 నోట్లు). ఈ రోజే తీసుకో. చే ఉత్తరం వ్రాసి ఇవ్వు. చాలు. ఎప్పుడో జనవరి లో ఇద్దువు గాని. వడ్డీ కూడా పెద్దగా వద్దు" అన్నాడు ఆప్యాయంగా. ..
అతడి విశాలమయిన మనసుకి హనందించి.. నవ్వి."నాకు డబ్బు అంత అవసరం లేదు. మధ్యతరగతి వాడిని, నేను కష్టంగా ఏర్పాటు చేసుకోవాలిసినంత డబ్బు అవసరం అవలేదు. వద్దు థాంక్స్ " అన్నాను.
"కష్టం - సుఖం పంచు కొక పోతే స్నేహాలు ఎందుకు?" అతనే అన్నాడు.
'ఈ ముక్క వారం క్రితం 500,1000 నోట్లు రద్దుకు ముందు అనేవాడా?' చిన్న సందేహం.

Tuesday, 15 November 2016

హొ ఆర్ యు డూయింగ్ ?

ఒక బాసుడు ఆఫీసులోకి బాసిని వచ్చింది. తను స్టాఫ్ చేత ఎంత బాగా పని చేయిస్తాడో బాసిని కి వినిపించాలని అతని ఆరాటం. వెంటనే ఒక సబ్ ఆర్డినేట్ కి ఫోన్ చేశాడు. 
..
"How are you doing?" అన్నాడు స్పీకర్ ఫోన్ నుండి...
..
అటునుండి ఫోను మెడ వంపులో ఉంచుకుని మాట్లాడుతున్నట్టుగా ఉంది...
..
సమాదానం ఇలా ఉంది
"I was under a lot of pressure, but things seem to be flowing well now. I've got a firm grip on the situation and am seeing some good volumes & output. It may take a while before I achieve completion, but it's important to take one's time in order to stay focused on objectives.
I expect to wash my hands off the whole thing soon !"
**
బాసుడు బడాయిగా కళ్లెగరేశాడు.
..
..
..
"ఈ బడాయి కేం గాని అతను వాష్ రూములో ఉన్నట్టున్నాడు. "

Monday, 14 November 2016

పాతిక సీటు


బస్సులో 55 రూపాయల టికెట్ కి స్వైపింగ్ గాని, చెక్ గాని స్వీకరించక పోవటాన్ని ఖండిస్తుంటే... మరో నలుగురు నిలబడి ప్రయాణం చేస్తున్న బాదితులు  ప్రోగయ్యారు.  అప్పటికప్పుడు ఒక యూనియగా తయారయ్యాము.  
ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. తాత్కాలిక ప్రసిడెంటు గా 3-2 ఓట్లతో విజయం సాధించాను.
కొత్త 2000 నోటు లాగా నాజూగ్గా మొదలెట్టి, ఆదివారం చాపలు అమ్మే అవ్వ చేతి సంచిలో మిగిలి పోయిన పాత అయిదొందల నోటు లాగా తయారయ్యి, వాదిస్తూ ఉంటే.. బస్సులో ఒక సీటు ఖాళీ అయింది.
యూనియన్ నిభందనలని తుంగలో  తొక్కి, ఒలెంపిక్స్ ఆటగాడిలా నేర్పుగా బాగ్ సీట్లో కి విసిరి,  నైస్ గా సీట్లో
కూర్చున్నాను. మిగిలిన సబ్యులు రోషం గా  చూసి నట్టు ఉన్నారు. మా యూనియన్ వీగి పోయింది..
పక్కనే ఉన్న ప్రయాణీకుడు మిగిల్చిన  అర సీట్లో అమాయకంగా కూర్చిని మాటల్లో దించాను, మరో పాతిక సీటు సంపాదించాలని ఆశ “మాస్టారూ పిల్ల లెంతమంది?”
“ముగ్గురు.” అన్నాడు. మన లాగే కష్టజీవి అనమాట.
“ఏం చేస్తున్నారు?”
పెద్దోడు, యాక్సిస్ బాంక్, రెండో అమ్మాయి, బంక్ ఆఫ్ బరోడా, మూడోవాడు, ఆంద్రాబాంకు “
వార్ని బాంకు ఉద్యోగాలన్నీ టోకున కొన్నాడా అనుకుంటుంటే”
అతనే  పూర్తి చేశాడు. “ ఏ‌టి‌ఎం ల దగ్గర క్యూ లో నిలబడి ఉన్నారు. వాళ్ళకి అన్నాలు తీసుకెళుతున్నా” అని రెండు చేతుల్తో గవ్వలు ఊపినట్లు భళ్ళున నవ్వాడు.

మన అర లో   పాతిక సీటు  అప్పటికే నోక్కెశాడు. 

Sunday, 13 November 2016

ఎటువైపు?

తెల్లవారి 2.30 కి పిల్లాడికి ఫోన్ చేసింది.
బబ్లూ నిద్ర లేచావా? ఇంకో అరగంటలో స్టేషన్ వస్తుంది.”
3.00 కి నన్ను నిద్ర లేపింది.
నేను నెట్ లో ట్రైన్ ట్రెస్ చేసి ఫోన్ చేశాను “బబ్లూ ట్రైన్ 9 నిమిషాలు లేటు. 3-18 కి స్టేషన్ లో ఉంటుంది.”
సరే నాన్నా. ప్లాట్ ఫార్మ్ ఎటువైపు?”
వెంటనే ఈవిడ అందుకుంది. “సాయిబాబా గుడి కనబడుతుంది అటువైపు”
ఏ సి లో కూర్చున్న వాడికి అర్ధరాత్రి సాయి బాబా గుడి కాదే.. అయనే కనబడతాడు. రే బబ్లూ ట్రైన్ వెళ్తున్నా వైపు తిరిగి నిలబడు. ని లెఫ్ట్ హాండ్ వైపు ఫ్లాట్ ఫామ్.”
అంతలోకి వాళ్ళ చిన్న అక్క మొదలెట్టింది. జి‌పి‌ఎస్ ఆన్ చేసుకో, ట్రైన్ నార్త్ వైపు వెళ్తూ ఉంటుంది. వెస్ట్ వైపు ఫ్లాట్ ఫోమ్ వస్తుంది”
మళ్ళీ వాళ్ళమ్మ ఏదో చెప్పింది. స్పీకర్ ఆన్ చేసి “సాయి అర్ధం అయిందా? ఇప్పుడు చెప్పు ఫ్లాట్ ఫామ్ ఎటువైపు వస్తుంది “ అని ఒక మార్కు ప్రశ్న వేసింది.

వాడు అరక్షణం లో “డోరు వైపు” అని సమాదానం చెప్పాడు.

Friday, 11 November 2016

As father as son.

హాస్టల్ లో ఉన్న తమ్ముడి తో మా ఆమ్మాయి స్పీకర్ ఫోన్ లో మాట్లాడుతుంది.
“మొన్న సండే వ్రాసిన appsc ఎక్సామ్ ఏమయిందక్కా?”
“రిజల్ట్స్ రాలేదురా? కీ ఇచ్చారు. క్వాలిఫై దాటి మరో 30 మార్కులు వస్తాయి”
మళ్ళీ ఎక్సామ్ ఉందా?
“అవును రౌండ్ టూ మెయిన్స్ ఉంటుంది. డిసెంబరు ఎండింగ్ లో “
సబ్జెక్టేనా ?
“ అవును.. GK కూడా ఉంటుంది.”
“ఇంకా ఏం చదువుతావు లే అక్కా?”
“ రేయ్ స్పీకర్ ఆన్ చేసి ఉందిరా?”
“చెప్పవే.. అక్కా బాగా చదువు  అక్కా యు కెన్ డూ ఇట్ ”.
“రేయ్ నాన్న కూడా పక్కనే ఉన్నారు. వింటున్నారు”
 “రోజు న్యూస్ పేపర్ చూడు, రెండో పేజీ లో వ్యాసాలు చదువు. ..”
“రేయ్ ఇంక చాలు గాని. పిచ్చోడిలా ఆ గడ్డం ఏమిటి క్రాఫ్ చేయించు కోలేదా?? ఫోటో చూశాను “

“అక్కా.. సిగ్నల్ బాలేదు . మళ్ళీ చెయ్యనా?”

Tuesday, 8 November 2016

బుడగ

నేనో ప్రముఖుడు తో ఉన్న ఫోటో ఆమె చూసింది.
...
అలానే చూస్తూ ఉంది.
...
నా చొక్కా బిర్రు అయింది.
...
"మీ ఫోటో అతను కుడా ఇలానే దాచుకుని ఉంటాడా??"
..
"టప్"
ఎవడు రా బుడగ పగల గొట్టీంది ??

Sunday, 6 November 2016

శివ శివా !!

మీకు మళ్ళీ చెబుతున్నా, చిన గంజాం (మా పాత ఇళాఖా.. 6 ఏండ్లు పని చేసాను) లో 
మా మిత్రుడు 'సాయని శ్రీను' వాళ్ల ఇంట్లో నేను మా పెద్దమ్మాయి భావనా భోజనం చేసాం. 
..
కంద కూర, బ్రెడ్ ముక్కల కూర పులుసు బాగున్నాయి.
శుబ్రంగా తిన్నాం.
...
తెలంగాణా ఏర్పడ్డాక, ఇక్కడ వీటిని 
నాటు కోడి కూర, చాపల పులుసు అంటున్నారట..
ఏంటో కలి కాలం.
...
శివ శివా.. ఎంత ఘోరం.!!😁😁

Friday, 4 November 2016

రచనా సహకారం.

మొన్నో పాత స్నేహితుడు (చదువుకునే రోజుల ) FB లో గుర్తు పట్టి 
కనెక్ట్ అయ్యాడు. 
ప్రేమ వివాహం చేసుకుని చక్కగా ఉంటున్న దంపతులిద్దరూ చాలా సేపు ఫోన్ లో మాట్లాడారు. 
" అప్పటి ప్రేమలేఖ లకి సహా రచయిత మిరే నటగా?" అంది ఆమె.
"హలో .. హల్లో.. హల్లో.. మీరేదో చెబుతున్నారు. సరిగా వినబడటం లేదు. సిగ్నల్ సరిగా లేనట్టు గా ఉంది.. మరో సారి మాట్లాడతాను" ఫోన్ పెట్టేసాను. .
(ఒరేయ్ .. నికుందిరా నా చేతిలో )

Wednesday, 2 November 2016

కాట్ ??

నిండు బస్సు. 
గుండమ్మ లేడీస్ సీట్లో కూర్చుని ఉంది.
వెనుక నిలబడి నేను.
టికెట్లు తననే తీసుకొమఁన్నాను.
లేడి కండక్టర్ కి నన్ను చూపించి టిక్కెట్ తీసుకుంది తను.
"సార్ మిరేనా?? క్యాట్??" అరిచింది ఆవిడ.
***
RTC వారికి విన్నపం. Concessional Annual Travel Card పెరు మార్చ గలరు. 

ఇంట్లో విషయాలు పబ్లిక్ గా అడుగుతున్నారు.

యుద్దం తర్వాత!!

బురఖా లలో భర్త వెనుక నాలుగు అడుగుల దూరం లో ఫాలొ అయ్యే భార్యలు.. ఉండే ఇరాక్ లో..
..
ఆడవాళ్ళు నడిచిన బాటలోనే పడడుగులు వెనుక మగవాళ్ళు  నడవటం చూసి ఆశ్చర్య పోయాడు కొత్తగా అక్కడికి వచ్చిన మరో దేశపు జర్నలిస్ట్ .
..
స్థానిక జర్నలిస్ట్ తో ఈ పరిణామం గురించి విచారించాడు.
..
"ఇందులో ఆశ్చర్యం ఏముంది??" ఆంగ్లం లో నిట్టూర్చాడు ఆతను.
..
"యుద్ధం తర్వాత చాలా మార్పులు వచ్చాయి."
..
అర్ధం కాలేదు అన్నాడు ఇతను.
...
"ఏమో ల్యాండ్ మెయిన్స్ ఎక్కడయినా ఉండొచ్చు."

Tuesday, 1 November 2016

పులిహోర


గుళ్ళో ప్రసాదాల వినియోగం అప్పుడు ప్రపంచం మొత్తం రివ్యూ అవుతుంది.
అసలు కార్తీక మాసం మహిమ ఏమిటో తెలుసా?” మా వీది లో ఉండే పేపర్ డీలర్ కేశవ అడిగాడు.
మనం పురాణాల్లో సానా వీకు. పట్టుమని పాసు మార్కులు కూడా రావు. ఎందుకయినా మంచిదని ఒక చెవి అటువేసి ఆసక్తి గా చూశాను.
సంవత్సరం మొత్తం మీదా ఆడాళ్ళు ఇంటి మగమనిషిని గౌరవించేది ఈ నెలే?” అన్నాడు.
అదేందిరా సామి కార్తీక మాసం మొదటి రోజే గౌతమి అంత స్టేట్మెంట్ ఇస్తే? పేపరు ఏజంటూవీ. మిగిలిన పేపర్లు చదివే పనిలే ??”
అదెలా?” ఒకాయన నెత్తి తడుము కుంటూ అడిగాడు. అది అతని మేనరిజం అంది. అనవసరంగా నెత్తిన బుడిపెలు ఉన్నాయని అపార్ధం చేసుకోకండి.
ఏం లేదండీ. ఈ నేలంతా ఏ గుడి లో ప్రసాదం తిన్నా సరిపోతుంది. మద్యాన్నం పూట అయ్యప్ప స్వాములకి బోజనం సౌకర్యం చాలా గుళ్లలో ఉందనే ఉండే.


ఒక లుంగీ, చొక్కా, టవలు ఉంటే ఎక్కడయినా బతోకొచ్చు. పెద్దగా ఇంట్లో వాళ్ళతో పని ఉండదు. అందుకే చేతుల్లో నుండి జారీ పోకుండా జాగర్తగా కనిపెట్టుకుని ఉంటారు.
నిజమా?” అడిగాను నేను.
నిజం సార్.. కావాలంటే చూడండి. వందలు, వందలు పెట్టి మన చేత చీరలు కొనిపిస్తారా? ఎప్పుడు ఆ బొమ్మల గొట్టలు (నైటీలు కాబోలు) వేసుకుని జుట్టు విరబోసుకుని ఉంటారు. ఈ నెలలో చూడండి తెల్లవారగట్ల రెడీ అయ్యి రంగు రంగుల చీరలు కట్టి గుడికి వస్తారు. మన కి టయానికి టంచనుగా కారేజి రెడీ చేసి పెడతారు.రహస్యంగా చెప్పాడు.
పిల్లాడి దగ్గర చాలా విషయం ఉంది. రెండో రౌండ్ పులిహార, అలసంద గుగ్గిళ్ళు పెట్టించుకుని మళ్ళీ సంభాషణ మొదలెట్టాము.
ఏం సార్ ? ఈ విషయం లో మీ విలువయిన అభిప్రాయం ఏమిటి?” వచ్చే ఏడాది రిటైర్ అవబోతున్న మాస్టారిని అడిగాను.
అబ్బే .. దానికి దీనికి సంభందం ఏమి లేదు కేశవా .. మనం తెలివిగా ఉండాలిఅంతే అన్నాడాయన.
తెలివిగా అంటే?”
మనం ఇంట్లో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుని , చిన్న చిన్న విషయాలు వాళ్ళకి వదిలేస్తే సరి. ఒకరి సబ్జెక్ లో మరొకరు ఇంటర్ ఫియర్ కాకూడదు.
మాస్టారు మాది లాస్ట్ బెంచ్. వివరంగా చెప్పండి.పులిహారలో ఇవాళ పచ్చి మిర్చి తగిలిందే లేదు. నా బాద ఎవరూ తీర్చేది కాదు.
ఏం లేదండీ. ఇప్పుడు అమెరికా లో ఎవరు ప్రెసిడెంటు గా గెలవాలి అనే విషయం నేను చూసుకుంటాను. ఆవిడ ఈ విషయం లో జోక్యం చేసుకోడు. అమ్మాయి పెళ్లి ఎవరితో చెయ్యాలి అనే చిన్న చిన్న విషయాలు ఆమె చూసుకుంటది. మనం జోక్యం చేసుకోం. ఇంక విలువల ప్రసక్తి ఏముంది?” చెప్పాడు మాస్టారు నవ్వుతూ.
అప్పటికే పులిహోర తినటం పూర్తయింది.
మాస్టారూ మీరు కదలకుండా కాళ్ళు దగ్గర పెట్టుకుని నిలబడి ఉండండి. చేతులు కడుక్కుని వచ్చి పాదాభి వందనం చేసుకుంటాను.గబ గబా డస్ట్ బిన్ వద్దకి నడిచాను.




ప్రేమ రంగు నలుపు

మంటల్లో నా దేహం కాలిపోతూ ఉంది.
దూరంగా తడి బట్టలతో నా బర్త ఏడుస్తున్నాడు. 
అతని సన్నిహితులు అతడిని ఓదారుస్తున్నారు. పొగలి పొగలి అతను ఏడవటం నాకెందుకో బాధగా లేదు. ఏడేళ్ళ కాపురం. అగ్నిగుండం చుట్టూ చిటికిన వేలు పట్టుకుని ప్రదక్షనలు చేశాను. ఏడడుగులు అతనితో  నడిచాను. అమ్మమ్మ చెప్పిన ఆచారాలన్నీ మనసా వాచా పాటించాను. అతన్ని స్నేహించాను,సేవించాను,  ప్రేమించాను, కామించాను.  బార్యగా నేను చేయవలసిన విధులన్నీ ఇష్టపడి చేశాను.
మరి బరద్వాజ?? ఎంత సహజంగా ఏడుస్తున్నాడు? ఏమి ఎరగనట్టు? తన చేతులతో తానే మత్తు ఇచ్చి అవును మత్తు ఒక ఎనెస్థీషియా వైద్యుడు చంపదలుచుకుంటే, ఏ ప్రపంచానికి తెలుస్తుంది. అతను హైపర్తైటీస్ వాక్సిన్ అన్నాడు. నేను నమ్మాను. అసలు నమ్మటమనే పదమే తప్పు. బరద్వాజ నా ప్రాణం. తానొకటి నేనొకటి కాదు? మరి ఎందుకు ? ఎందుకు చేసావి పని? నన్నెందుకు చంపావు.
***
చితి మండిన పది పదిహేను  రోజుల తర్వాత అనుకుంటా.. అతను హాస్పిటల్ లో ఉన్నప్పుడూ.. అతనితో పాటు నేను ఉన్నాను. ఈ విషయం చెప్పటం అనవసరం. నేను అతనితో లేని దేప్పుడు. ?? నేను అతనితోనే ఉన్నాను.
ఊహించని విషయం ...
సంజనా అతని గది లోకి వచ్చింది. సంజనా నా పి‌జి స్నేహితురాలు. ప్రాణ స్నేహితురాలు. మా ఇద్దరి పేర్లు కూడా ఒకటే.
 ఎందుకు? ఎందుకు ? వచ్చి ఉంటుంది. బరద్వాజ గురించి ఊహ మాత్రం గా కూడా తప్పుగా ఊహించలేను. అతను నా వాడు. ఎప్పటికీ అతను నావాడే. మరో విదంగా ఆలోచన చేసినా కూడా నన్ను నేను తప్పు గా అనుకున్నట్లే..
“సంజానా గారా నమస్తే కూర్చోండి” బరద్వాజ చిరు మందహాసం తో చెప్పాడు. హమ్మయ్య ..
ఆమె తటపటాయిస్తూ ఉంది...
“డాక్టర్ జీ మీరేమీ అనుకోకండి. ఇది సమయం కూడా కాదు. కానీ అవసరం అలాటిది.”
“చెప్పండి . పర్లేదు “
“కొన్ని కారణాల వల్ల నాకు ఒక చేదు పరిచయం ఉండేది. “ ఆమె తల వంచుకుని నెమ్మదిగా మాట్లాడుతుంది.
“అయిదేళ్ళ తర్వాత నేను జీవితం లో స్తిరపడ్డాక అతను మళ్ళీ తారస పడ్డాడు. ముగిసి పోయిన చరిత్ర తవ్వి తీశాడు .. నేను నచ్చ చెప్పాను. వినలేదు..”
అతను ఉత్తరాలు వ్రాస్తుండే వాడు. వి.. వి .. రం .. గా.. తన ఉత్తరాలు అన్నిటిని తను అడిగినప్పుడు తిరిగి ఇచ్చేయాలని, ఒక్కటి మిస్ అయినా నా గతం గురించి ఇంట్లో చెప్పాల్సి వస్తుందని భయపెట్టాడు”
“నరకయాతన అనుభవించాను. మా వారితో చెప్పాను. కొంత ఘర్షణ జరిగినా మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. సాక్షాలుగా ఆ ఉత్తరాలు కావాల్సి వచ్చాయి...”
భరద్వాజ వినకూడని విషయం వింటున్నట్టుగా ముందుకి వంగాడు.
“వాటిని నా ప్రాణ  స్నేహితురాలు మీ భార్య అంజు వద్ద దాచాను. వైలెట్ కలర్ మఖమల్ క్లాత్ లో చుట్టి న చిన్న మూట.. తన వార్డ్ రోబ్ లో ఉంటుంది.. మీరు శ్రమ అనుకోకుండా వెతికి ...”
బరద్వాజ రక్తం మొత్తం డ్రైన్ అయిన వాడిలా కుర్చీ లో నుండి లేచి ఆమె మీదకి లంఘించాడు.  

“రాకాసి దానా ఎంత పని చేసావే?.. అన్యాయంగా నా బార్యని చేజెతులారా ..”  లేచి ఆమె గొంతు పట్టుకున్నాడు.

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...