Sunday, 15 July 2018

మట్టి గాజులు


అపర్ణ అటో దిగి ఫోన్ మాట్లాడుతూ ఎనిమిది అంతస్తుల అపార్ట్ మెంట్ ప్లాట్ లోకి వెళ్తూ ఉంటే, రోడ్డు మీద 'తోపుడు బండి' మీద మట్టిగాజులు అమ్ముతూ ఒక పదిహేను పదహారేళ్ళ పిల్ల కనిపించింది.
ఒక్క క్షణం ఫోన్ మాట్లాడటం ఆపి రంగు రంగుల డిజైన్ గాజులు చూస్తుంటే... 
“ఇవి కొత్త గా వచ్చాయి అక్కా.. తళుకుల గాజులు నీకు బాగుంటాయి.” అంది ఆ అమ్మాయి.
అపర్ణ ‘అక్కా’ అన్న ఆ పిల్లవయిపు.. తరువాత బండి మీద గాజుల వైపు చూసింది.
గాజులు నిజంగానే బాగున్నాయి.
బాగా నచ్చిన ఒక డజను డిజైన్ గాజులు ఎనబై కి బేరం చేసి రెండు వందల నోటు ఇచ్చింది.
ఒక ప్లాస్టిక్ పెట్టెలో ఉన్న చిల్లర నోట్లు లెక్కపెట్టి గాజుల తో పాటు ఇచ్చింది ఆ అమ్మాయి.
**
ప్లాట్ లోకి వచ్చాక గాజుల తో పాటు ఆ అమ్మాయి పొరపాటుగా మరో పది రూపాయలు ఎక్కువ ఇచ్చినట్లు గా గమనించింది. అపర్ణ.
వంటగది సర్విస్ నుండి చూస్తే ఆ పిల్ల బండి ఇంకా అక్కడే ఉంది. గట్టిగా కేక వేస్తే వినబడే దూరం లో ఉంది. పక్కనే ఉన్న వాచ్ మెన్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నాడు.
మురికిగా ఉన్న ఆ అమ్మాయి “అక్కా’’ అని పిలవటం గుర్తొచ్చి లోపలి వచ్చి వంట పనిలో పడింది.
**
అరగంట తర్వాత కాలింగ్ బెల్ మోగింది.
అపర్ణ తలుపు తీసింది.
గాజులమ్మాయి.
“అక్కా” అని మళ్ళీ అదే పిలుపు.
ఏమిటన్నట్లు చూసింది.
“దాదాపు అన్నీ ఫ్లాట్ లు తిరిగానక్కా.. నీకోసం.”
ఆ అమ్మాయి చేతిలో అపర్ణ ఫోను ఉంది.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...