Sunday 15 July 2018

అన్నపూర్ణ.

రెండు ఇడ్లీలని చట్నీ నంచుకు తింటూ ప్రపంచాన్ని జయిస్తున్నట్లు గా ఆనందిస్తుంది తను.
అడుగు ఎత్తుతో ఉన్న నాప బండ మీద రెండు వైపులా కాళ్ళు వేసి కుర్చుని ఇడ్లీలని ఆస్వాదిస్తూ ఉంది.
కొంచెం శ్రద తక్కువగా పెరుగుతున్న పిల్ల. సన్నగా ఉంది. 
నాలుగు అయిదు ఏళ్ళు మించవు.
దగ్గరలో ఉన్న వర్కింగ్ క్లాస్ ఇంటి పిల్లలా ఉంది.
ఎందుకో తెలీదు చూడగానే నచ్చేసింది.
అరడుగు మించని పాదాలకి, మరో రెండు అంగుళాలు పెద్దవి గా ఉన్న ప్లాస్టిక్ చెప్పుల్ని వేసుకుని కుర్చుని ఉంది ఆ పాప.
చెప్పులు బావున్నాయని పరిచయం గా చెప్పాను.
“ మా అమ్మవి “ అంది.
ఊరి చివర గా ఉన్న ఆ చిన్న హోటల్ లో కారం కొంచెం తక్కువగా వాడతారు.
వర్కింగ్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఎప్పుడూ ఉదయం టిఫిన్ అక్కడే చేస్తుంటాను.
నేనూ ఇడ్లీ తినేసరికి, తను శుబ్రంగా ఆకులో ఉన్న చట్నీతో సహా తినేసింది.
“గుడ్డు దోశ తింటావా?” అడిగాను.
“ఉహు” అంది.
చేతిలో పది రూపాయల కాగితం చూపించి
“మా తమ్ముడి కి రెండు ఇడ్లీల పొట్లం తీసుకెళ్ళాలి” అంది.
ఈ లోగా హోటల్ ఆవిడ ఒక ఉల్లి దోశ, మరో గుడ్డు దోశ తీసుకు వచ్చింది.
ఉల్లి దోశ తీసుకుని పాప వైపు చూయించాను.
తనముందు ఉంచిన దోశ ని ఆశగా చూస్తూ "నా దగ్గర డబ్బులు లేవు" అంది.
“ఇవాళ నా పుట్టిన రోజు అందుకే నీకు పార్టీ ఇస్తున్నాను. తినేసేయ్.” నవ్వుతూ చెప్పాను.
“నిజమా?” అంది ఆ పిల్లది. అవునన్నట్లు గా చూసాను.
ఆ హోటల్ పక్కనే ఉన్న చిన్న గుడి ని చూయిస్తూ “గుడి కి వచ్చావా?” అంది.
చాలా సార్లు వచ్చినప్పటికీ ఆ మలుపు లో ఉన్న చిన్న దేవాలయాన్ని పరీక్షగా గమనించలేదు.
“అవును” అన్నాను.
“సగం తిని సగం మా తమ్ముడికి తీసుకువెళ్తాను” అంది.
“తమ్ముడా? వాడు కూడా మన పార్టీ నే. ఇంకోటి పొట్లం కట్టిద్దాం. నువ్వు ఇది తినేసేయ్”
అన్నట్లు మా కొత్త ఫ్రెండ్ పేరు చెప్పలేదు కదూ.. అన్నపూర్ణ.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...