Sunday 15 July 2018

మన ఇంట్లో విషయం

NH-5 టోల్ ప్లాజా మీద ఉన్న ఫుడ్ కోర్టు లో సాయంత్రం భోజనం చేస్తూ ఉన్నాం నేనూ మా అబ్బాయి సాయి, మా మేనకోడలు, ముగ్గురం.
“మొత్తానికి బెటర్మెంట్ పరిక్షలు బాగా వ్రాసానంటావు”
“బాగా వ్రాసాను మామయ్యా అంది” పావని తన సెల్ లో నుండి తల పైకి ఎత్తి. 
ఒక చేత్తో స్పూన్ తో తింటూ మరో చేత్తో బ్రౌజ్ చేస్తూ ఉంది. వాట్స్ అప్ లో టైపు చేస్తూనే ఉంది.
“కనీసం నైన్ గ్రేడ్స్ దాటతాయి అనుకున్నాను. 8.5 దగ్గర ఆగిపోతావని అనుకోలేదు.”
ఒక్క నిమిషం తను ఏమి మాట్లాడలేదు. “మా సెక్షన్ లో నావే మంచి మార్కులు” అంది. కొన్ని డెసిబల్స్ ల శబ్దం తక్కువగా ఉంది.
“నాన్న తక్కువ ఫీజు కట్టాడా? ఆ సెక్షన్ లో ఎందుకున్నావు?”
“మొదటి నెలలో టెస్ట్ పెట్టి వాళ్ళే సెక్షన్ లు చేసారు.”
“మీ ఊర్లో మంచి కాలేజి లు ఉన్నాయిగా? అక్కడ చదువుతావా? రెండో సంవత్సరం.”
“ఉహు, విజయవాడే చదువుతాను మామయ్యా”
“బై పి సి నుండి టార్గెట్ కొట్టాలంటే ఎలా చదవాలో తెలుసుగా?”
పావని ఏమి మాట్లాడలేదు.
“అక్కడ హాస్టల్ లో సెల్ కి పర్మిషన్ ఉందా?”
కళ్ళజోడు లోంచి కళ్ళు మెరిసాయి “ఉంది “
సాయి ఐస్ క్రీం కోసం వెళ్ళాడు.
“రాత్రి నువ్వు పడుకున్నాక నీ సెల్ చెక్ చేసాను. మీ నాన్న గాని మీ అమ్మ గాని ఎప్పుడయినా నీ సెల్ చూసారా?”
పావని మాట్లాడలేదు.
“మీ నాన్న తో తప్ప అనవసరమయిన చాలా మంది తో చాట్ చేసావు. కెరీర్ కి ఉపయోగపడేవి నాకు ఏమి కనిపించలేదు. కొంత మంది పిల్లలు ముభావంగా ఉన్నా నువ్వే కదిలించి మాట్లాడినట్లు అనిపించింది.” తన కళ్ళలోకి సూటిగా చూసాను.
తను కళ్ళు తిప్పుకుంది.
ఏమాత్రం శబ్దం చెయ్యలేదు. చీకటి రోడ్డు మీద లైట్స్ వెలుగులో బారులు తీరి ప్రయాణిస్తున్న వాహనాలు. సరిగా రోడ్డు అడ్డంగా అంత ఎత్తున అద్దాల ఫుడ్ ప్లాజా.. గొప్ప వ్యూ.
"నాన్నా ఇక్కడ వ్యూ బావుంది" అన్నాడు సాయి. చేతి లో రెండు కప్పులు ఐస్ క్రీం ఉన్నాయి. పావని కి ఒక టి అందిస్తూ. “టూటి ఫ్రూటి తింటావుగా?” అన్నాడు.
“సాయి ..నాకు fb ఒక బలహీనత అయిపొయింది. నిరంతరం అదే ద్యాస. బస్సులో ప్రయాణం చేసేటప్పుడు. ఇంట్లో మీతో మాట్లాడుతున్నప్పుడు. డ్రైవింగ్ లో ఉన్నప్పుడు.. ఎప్పుడు నా కళ్ళు సెల్ మీదే ఉంటున్నాయి. ఎడిక్ట్ అయిపోయానని అనిపిస్తుంది. కనీసం రెండు రోజులు ఉండగలనా సోషల్ మీడియా విడిచి అనిపిస్తుంది.”
“మీకు అదేమంత కష్టం కాదు. “ సాయి అన్నాడు.
“ మీ వళ్ళ కాదు మామయ్యా..” అంది పావని.
“ఒక పని చేద్దాం నువ్వు మళ్ళీ కాలేజి కి వెళ్ళేంత వరకు స్మార్ట్ ఫోన్ వాడకు. నేనూ fb అకౌంట్ డి ఆక్టివేట్ చేస్తాను. కాలాన్ని మరింత విలువగా వాడతాను. ఇదిగో బేసిక్ ఫోన్ నీ కోసమే కొన్నాను. సిం ఇందులోకి మార్చుకో నీ స్మార్ట్ ఫోన్ నాకు ఇవ్వు”
“సాయి.. నా అకౌంట్ డి ఆక్టివేట్ చెయ్యి.” మే 20 వ తేది సాయంత్రం మా భోజనం ముగిసింది.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...