Sunday 15 July 2018

సున్నితమయిన సమస్య

ఆఫీస్ అవర్స్ ముగిసేటప్పుడు పర్సనల్ నెంబరు మోగింది.
డాక్టర్ విజయ్.. నా మిత్రుడు, డెంటిస్ట్.
"ఇప్పుడు రాగలవా? నీ RCT క్లోజ్ చేస్తాను."
"రేపు అనుకున్నాం కదా?"
"రేపు నైట్ బ్యాంకాక్ వెళ్తున్నాను. మరో వారం దొరకను"
"ఒక్కడివేనా?"
"అవును. వస్తున్నావా?లేదా?"
"వస్తున్నాను. గంటలో అక్కడ ఉంటాను. బైక్ తీసుకుని వస్తాను"
సబ్ స్టాఫ్ కి చెప్పి బయలుదేరాను.
మరో అరగంట దూరం లో ఉన్నప్పుడు SE గారి టెలీ కాన్ఫరెన్స్ మొదలయ్యింది.
ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటూ అక్కడికి చేరాను.
..
తన రూం లో మరో కుర్రాడు కూడా ఉన్నాడు. అతనే పేషంట్స్ ని చూస్తున్నాడు.
కన్నె BDS అని, ఈ వారం రోజులు హాస్పిటల్ చూసుకోటానికి ఏర్పాటు చేశానని చెప్పాడు.
రెండో సీట్లో కూర్చోబెట్టి నా RCT (రూట్ కెనాల్ ట్రీట్మెంట్)పూర్తి చేశాడు.
..
ఇద్దరం లేచి హాస్పిటల్ పక్కనే ఉన్న ఒక హోటల్ లో కూర్చుని ఒకే ప్లేట్ లో రెండు మినప గారి తెప్పించుకుని తింటూ ..కబుర్లలో పడ్డాం.
"చందన ని లాంగ్ టర్మ్ చేరుస్తున్నావుగా?"అడిగాను. చందన విజయ్ ఏకైక కూతురు.నీట్ లో ఆశించిన ఫలితం రాలేదు.
..
"నీ పోస్ట్ ఇవాళే చూసాను." అన్నాడు ఉపోడ్ఘాతంగా..
నేను నుదురు చిట్లించాను.
"రాత్రి పన్నెండున్నర అప్పుడు వాష్ రూము కి వెళ్ళటానికి లేచాను...
అతను ఆగాడు..
"హాల్లో చందన టక్కున చేతిలో సెల్ పక్కన పెట్టింది. దుప్పటి కప్పుకుంది"
"నేను తనని పిలిచాను. సెల్ తీసుకుని చూసాను ఎవరో అభిరామ్ ట"
..
నేను మౌనం గా వింటున్నాను.
"బాగా కొట్టాను"
"కో..ట్టా.. వా?
"అవును. అడ్డు వచ్చిన మా ఆవిడని కూడా"
ఇప్పటి వరకు ఎవరితోనూ షేర్ చేసుకొని ఉండడు.
..
"ఉదయం నీ పోస్ట్ చూసాను."
ఎందుకో తెలియదు కాని నాకు మా సంభాషణ మీద ఆసక్తి పోయింది.
ఇంతలో తన ఫోన్ మోగింది.
..
క్లినిక్ లోకి వచ్చేసరికి కన్నె BDS, ఒకావిడ పన్ను ని బలాత్కరిస్తున్నాడు. విజయ్ వెళ్లి విరిగిన పన్ను ముక్కల్ని జాగర్తగా తీసి ఆమెని పంపేసాడు.
..
సెలవు తీసుకుని బయలుదేరుతుంటే..
జూనియర్ తో చెబుతున్నాడు..
"పన్ను ని గట్టిగా పట్టుకోవాలి కానీ వత్తకూడదు. వత్తితే విరిగిపోతుంది"

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...