Sunday, 15 July 2018

ఈ పెద్దోళ్ళున్నారే


కొత్తపట్నం లో ఉన్న తాబేలు పిల్లకి కి, పాకల ఎండ్రకాయ పిల్లాడికి కి స్నేహం కుదిరింది. 
రెండు బీచ్ లలోను అనేకం మాట్లాడుకున్నారు. ఇద్దరి మనసులు దగ్గరయ్యాయి. 
“మనం పెళ్లి చేసుకుంటే” అంది తాబేలు.
“మా ఇంట్లో ఏమి అభ్యతరం ఉండదు మీ నాన్న తోనే సమస్య” అన్నాడు పిల్లాడు.
“మా నాన్నకి నేనూ నచ్చ చెబుతాను” అంది తాబేలు పిల్ల.
**
“పాకల వాళ్ళు మొరటు వాళ్ళు . వాళ్ళ సంబంధం మనకి వద్దు. అసలు వాళ్లకి మనకి అసలు కుదరదు. సమస్య వస్తే అడ్డంగా పరిగెత్తి తొర్రల్లో దాక్కుంటారు. పిరికి సన్నాసులు”
పిల్ల బ్రతిమాలి మరీ తండ్రిని ఒప్పించింది.
“సరే నువ్వు ఇంతగా చెబుతున్నావ్ కాబట్టి ఒక్క సారి ఇంటికి రమ్మను మాట్లాడతాను. వచ్చే పౌర్ణమి సాయంత్రం”
తాబేలు పిల్ల ఆనందపడింది. తండ్రి అన్న మాటలని యదాతదం గా పిల్లాడికి చెప్పింది.
**
పిల్లాడికి రోషం వచ్చింది. తెల్లవారు ఝామునే లేచి పతంజలి యోగా తో మొదలెట్టి ఖఠోర వ్యాయామాలు చేసాడు. నెల తిరిగే సరికి నిలువుగా నడవటం ప్రాక్టీస్ చేసాడు.”
పౌర్ణమి వెన్నెల విరగ కాస్తుంది.
పిల్లాడు ఉన్నంతలో చక్కటి డ్రెస్సు వేసుకుని, జుట్టు కి నూనె పెట్టి క్రాఫ్ దువ్వుకుని నిలువుగా నడుచుకుంటూ వీలయినంత నాజుగ్గా పిల్ల ఇంటికి వచ్చాడు. పిల్ల ఆనంద పడింది.
తండ్రి ‘ఊ’ అనక తప్పని పరిస్థితి.
“నాన్నా..” అంది.
తండ్రి నొసలు చిట్లించాడు.
“ఛీ . నే చెప్పలా ?.. పుల్లుగా తాగి ఉన్నాడు చూడు. అడ్డదిడ్డంగా ఎలా నడుస్తున్నాడో..”

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...