Sunday, 15 July 2018

శర్మ గారు

వెంకటరెడ్డి నేనూ రవ్వ దోశ కి న్యాయం చేసి ఇరాని టీ కోసం వెళుతూ ఉంటే..
బక్కపలచటి శరీరం కి తెల్లటి వెంట్రుకలు పెవికాల్ తో అడ్డదిడ్డంగా అంటించి నట్లు ఉన్న మొహం తో ఒకతను మమ్మల్ని ఆపాడు.
వెంకటరెడ్డి ఆయనతో పలకరింపు మాటలు మాట్లాడుతూ.. “శర్మ గారు గుర్తున్నారుగా అన్నా” అన్నాడు నన్ను చూస్తూ...
అలా గుర్తు చెయ్యక పొతే ఖచ్చితంగా గుర్తుపట్టే వాడిని కాదు.
“బావున్నారా?” అడిగాను. చెయ్యి కలుపుతూ.. చెయ్యి చల్లగా ఉంది. ..
రెండో చేతి లో కూరగాయల సంచి ఉంది.
“శ్రీనివాసరావు గారు నాకు బాగా గుర్తు.. మా మామ గారు పొలం కొలిచేటప్పుడు సాయం చేసారు. ఇప్పటికి ఆయన గుర్తు చేస్తూ ఉంటారు. అందాకా ఎందుకు? చందమామ హాలు స్థలం పంపకాలు సారు పరిచయం లేకుంటే తెగేదే కాదు.” అన్నాడు అభిమానంగా..
“పిల్లలు బాగున్నారుగా?” అన్నాడు నన్ను చూస్తూ..
“బాగున్నారండీ.. పెద్దమ్మాయి పెళ్లి చేసాను. తాతని కుడా అయ్యాను” అన్నాను నవ్వుతూ..
“ఓహ్ కాంగ్రాట్స్. మనమడా?”
అవునన్నట్లు తలూపాను.
“ఒక అబ్బాయి ఉండాలి కదా?”
“అవును. శర్మ గారు తంజావూరు లో బి టెక్ చదువుతున్నాడు.”
“మా వాడు కుడా బి టెక్ ఫైనల్ ఇయర్. KLU లో ఇంకో నెలలో ఇంటికి వస్తాడు.” అన్నాడు.
నేనూ నొసలు చిట్లిస్తుంటే వెంకటరెడ్డి నా చెయ్యి పట్టుకున్నాడు. ఆ పట్టుకోవటం లో ఒక హెచ్చరిక ఉంది.
కొద్ది సేపు వాళ్ళ అబ్బాయి ఎంత బాగా చదువుతున్నదీ చెప్పాక మేము సెలవు తీసుకున్నాం.
**
“అవునూ .. వాళ్ళ అబ్బాయే కదూ? హాస్టల్ లో పిట్టగోడ మీద నుండి పడి ...” పూర్తి చెయ్యకుండా ఆపేసాను.
“అవును. ఒక్కడే కొడుకు చక్కటి పుటక. పెద్దలు మిగిల్చిన కోట్ల ఆస్థి. తలలో నాలుక లాటి మనిషి. చీమకి కుడా హాని చెయ్యని వాడు.
ఫైనల్ ఇయర్ లో పరిక్షలపుడు హాస్టల్ పైన పిట్టగోడ మీద కుర్చుని చదువుకుంటూ నిద్రకి తూగి కిందపడి పోయాడు. స్పాట్ లోనే...
ఎనిమిదేళ్ళు గడిచి పోయాయి. ఎప్పుడు కనిపించినా ఈ నెలలో ఇంటికి వస్తున్నాడు అని చెబుతుంటాడు.
ఇంట్లో నుండి బయటకి రాడు. ఉదయం సాయంత్రం ఒక సంచి పట్టుకుని మార్కెట్ కి వెళ్లి కూరగాయలు కొనుక్కుని వస్తుంటాడు.
దారిలో తెలిసిన వాళ్ళు ఎదురయితే ఇదే మాట చెబుతుంటాడు.”
ఆగి వెనక్కి తిరిగి చూసాను.
రాబందు కాళ్ళకి చిక్కిన కోడిపిల్లలా కనిపించాడు. 

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...