Sunday 13 May 2018

అమ్మ అబద్దం ఆడింది.

నాకు మెలుకువ వచ్చేసరికి అమ్మ ఏడుస్తూ ఉంది. నాన్న అమ్మ జుట్టు పట్టుకుని ఉన్నాడు.
తమ్ముడు నిద్ర పోతూ ఉన్నాడు. రోజూ లాగే ..
“అపార్ట్ మెంట్ లో ఆరిల్లల్లో పని చేస్తావ్? డబ్బులు అడిగితె లేవంటావే?”
“ఇంట్లో ఎచ్చాలు కొన్నాను. పిల్ల బడి లో కట్టాను. ఇంకేం మిగల్లేదు”
“నువ్వు ఎప్పుడు నిజం చెప్పావే?”
ఇద్దరు కాసేపు పెనుగులాడుకున్నారు. అమ్మ ఏడుస్తునే ఉంది నాకు మళ్ళీ నిద్ర పట్టింది.
**
ఉదయం మెలుకువ వచ్చే సరికి అమ్మ పంతులమ్మ వాళ్ళ ఇంట్లో పని చెయ్యటానికి వెళ్ళింది.
నాన్న లేటుగా లేచి అటో రెడి చేసుకుంటున్నాడు. తమ్ముడు నాన్న పక్కన చేరాడు.
నాన్నా నేనూ నడుపుతా అన్నాడు. నాన్న డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి హరన్ కొట్టించాడు.
వాడు మురిసి పోయాడు. “నాకు విమానం బొమ్మ కావాలి” రోజు లాగే అదే ప్రశ్న.
“విమానం బొమ్మ ఇవాళ తెస్తాను” నాన్న బయలు దేరాడు.
**
స్కూల్ వర్క్ లు పూర్తి చేసుకునే సరికి అమ్మ వచ్చేసింది. తమ్ముడికి స్నానం చేయించింది.
అప్పటికే నేనూ రెడి అయి ఉన్నాను. పంతులమ్మ వాళ్ళ ఇంట్లో తెచ్చిన పచ్చడి తో అన్నం కలిపి ఇద్దరికీ పెట్టింది.
బాబూ ని జాగర్త గా తీసుకెళ్ళు అని మమ్మల్ని స్కూల్ కి పంపింది. తిరిగి మరో ఇంటికి పని చెయ్యటానికి పరిగెత్తింది.
**
సాయంత్రం ఇంటికి వచ్చి ఆడుకుంటుంటే అమ్మ పిల్చింది.
“బాబూ .. నాన్న నీకు విమానం బొమ్మ తెచ్చాడు” అంది
బులుగు రంగు విమానం తెల్లటి రెక్కలు ఉన్నాయి. తమ్ముడి సంతోషం పట్టలేకుండా ఉంది. అప్పటికి అప్పుడు ఒక తాడు కట్టించాడు.
'డుర్రు' మని దానిని అటో లాగా నడపటం మొదలెట్టాడు.
వెనక ఒక చక్రం ఊడి పోయి ఉంది. పంతులమ్మ వాళ్ళ అబ్బాయి దగ్గర ఇలాటివి చాలా ఉన్నాయి. అచ్చు ఇలాటిదే...
అమ్మ ఈ విమానం బొమ్మ నాన్న తెచ్చాడని ఎందుకు చెప్పిందో నాకు తెలీదు.

అమ్మ అబద్దం ఆడింది.
Happy mothers day.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...