Sunday, 25 February 2018

నలుపు.


"రిటైర్ అయ్యాక మీ నాన్న గారి చాదస్తం మరీ ఎక్కువయింది అంది జయలక్ష్మి కూతురితో వంటగదిలో నిలబడి, చట్నీ తాలింపు వేసిన చిన్న బాండి లో రెండు ఇడ్లీ అద్దుకు తినేస్తూ...
“కాఫీ కాస్త వేడిచేసి నాన్నగారికి ఇవ్వు .. వచ్చేస్తున్నానని చెప్పు” అంది కూతురితో
రాజు గారు కాఫీ తాగేసరికి ముడేసుకున్న జుట్టు అర్జంటుగా దువ్వేసి, క్లిప్ తగిలించుకుని,
ముందుగా సర్ది ఉంచుకున్న హాండ్ బాగ్ అందుకుని, "నేను రెడీ" అంది హల్లో కి నడుస్తూ...
రాజు గారి చూపు ఇంకా తడి ఆరని ఆమె జుట్టు మీదకి ఒక్క క్షణం వెళ్లింది.
“ఏమయినా తిన్నావా?” అన్నాడు చెప్పుల్లో కాళ్ళు దూరుస్తూ..
"తిన్నాలెండి లేటవుతుంది పదండి" అంది ఆవిడ కూడా బయటకి నడుస్తూ..
“ఇంట్లో జాగర్త తల్లీ.. మద్యానం బోజనం టైమ్ కి వచ్చేస్తాము. అక్కడ బయలుదేరగానే ఫోన్ చేస్తాను. రైస్ కుక్కర్ స్విచ్ వెయ్యి. నాన్న గారికి చల్లటి అన్నం అరగదు తెలుసుగా?” కుమార్తె తో అంది.
ఆటో లో బస్ స్టాండ్ చేరుకుని, యడ్లపాడు వెళ్ళటానికి గుంటూరు బస్సు ఎక్కిందాకా ఇద్దరు పెద్దగా మాట్లాడు కోలేదు.
మంచి ఏ‌సి బస్సు, ఊరు దాటగానే “అబ్బాయి నల్లగా ఉంటే మాత్రం ఒప్పుకునేదే లేదు” అంది ప్రారంభం గా.
రాజు గారు నవ్వాడు. “సర్లే.. పసుపు బొమ్మ లాగా ఉంటావు. నన్ను చేసుకోలా?”
ఆవిడ బుగ్గలు దాచుకుంటూ “మన కాలం వేరు. ఇప్పుడు పిల్లలు ఆస్తులు చూడటం లేదు. ఒడ్డు పొడుగు.. చూడ చక్కగా ఉంటే తప్ప ఊ అనటం లేదు.”
“తప్పు జయా మనుషుల ని వంటి రంగు ని బట్టి లెక్కించడం మంచిది కాదు. పిల్లాడు అబ్రాడ్ లో ఎం‌ఎస్ చేశాడు. పి‌హెచ్‌డి కూడా చేస్తున్నాడు ఫెలో షిప్ స్కాలర్షిప్ కూడా హండ్సమ్ గా వస్తుందట. ఒక్కడే కొడుకు. తండ్రికి వ్యవసాయ పొలం, నెలవారి ఆదాయం ఇచ్చే షాపింగ్ ఏరియా ఉన్నాయట.”
“ఈ వారం లో ఇది ఏ పదో సారో చెప్పటం”
జయలక్ష్మి ఇంట్లో కూతురికి ఫోన్ చేసింది.
“ పాలు తోడు పెట్టటం మర్చి పోయినట్లున్నాను. ఒక చుక్క చేమిరి వెయ్యి. పక్కింట్లో అడిగి కొంచెం తోడు తీస్కో. ఆ .. ఆ . బస్సు ఎక్కేశాం.”
***
కుర్రా రాజ శేఖర్ @ శేఖర్ కుర్రా ఇంటికి చేరుకునే సరికి వాళ్ళు తమ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
సంబందం చెప్పిన వెంకటేశం బస్టాండు లోనే కలిశాడు.
పిచ్చాపాటి .. ఆరంభ మాటలు పూర్తి అయ్యాక తెలిసిన విషయాలనే మళ్ళీ కొత్త కొత్తగా ఒకరికి ఒకరు చెప్పుకుని బుద్దిమంతులుగా తలాడించు కున్నారు.
అందరు కూర్చున్న గదిలో కుర్చీలో లో కూర్చుని ఉన్న శేఖర్ తెల్లగా లేడు.
అలాగని నలుపు కాదు.
రాజు గారు శేఖర్ ని గమనిస్తూ, మద్య వర్తి చెప్పేది వింటూ ఉన్నాడు.
జయ లక్ష్మి బాగ్ లోనుండి కుమార్తె ఫోటో తీసింది.
“ఇదిగొండి వదినా మా అమ్మాయి ఫోటో .. మా ఇంట్లో అయ్యప్ప భజన పెట్టుకున్నప్పుడు తీసిన ఫోటో .. పిల్ల పెళ్లి చూపులకి అంటూ ప్రత్యకంగా తీసిన ఫోటో లో లేవు” అంది శేఖర్ తల్లి కి ఇస్తూ..
“బావగారు ఎక్కడమ్మా?” రాజు గారు అడిగారు.
“తాగి ఎక్కడో దొర్లుతుంటాడు. వస్తాడు లెండి.” అంటూ శేఖరం తండ్రికి ఫోన్ చేశాడు.
తను చదివిన విధానం, ఎం‌ఎస్ లో తన పర్ఫార్మన్స్, తను పి‌హెచ్‌డి చేస్తున్న యూనివర్సిటీ, తను ఉండే సిటీ అక్కడ ఉన్న సౌకర్యాలు చెబుతూ ఉంటే జయలక్ష్మీ చూస్తూ ఉండి పోయింది.
"అబ్బాయి ఫోటో ఏదయినా ఇవ్వండి మా బందువులకి చూయించుకొటానికి అంటూ అడిగింది."
శేఖర్ తల్లి ని ..
“నేనూ పెళ్లి కంటూ ప్రత్యేకంగా ఏమి ఫోటో లు తీయించు కోలేదు ఆంటీ” చెప్పాడతాను.
తల్లి లోపలికి వెళ్ళి ఆల్బమ్ లో నుండి ఒక ఫోటో తీసు కొచ్చింది. “ఇది చూడండి” అంది.
శేఖరం లేచి లోపలికి వెళ్ళాడు. తల్లి కూడా వెళ్లింది. “బుద్ది ఉందా నీకు ఆదా ఇచ్చేది? ఆ కోటు వేసుకున్న ఫోటో ఏది?” లోపలి గది లో నుండి తల్లీ కొడుకుల మాటలు హాల్లోకి మెల్లిగా వినబడుతున్నాయి.
రాజు గారికి, శేఖరం కి తల్లి తండ్రి పట్ల ఉన్న గౌరవం ఏపాటిదో అర్ధం అయింది.
రెండు నిమిషాల్లో జయలక్ష్మీ చేతికి మరో ఫోటో వచ్చింది.
ఈ లోగా పిల్లాడి తండ్రి వచ్చాడు. కొబ్బరి బోండాల గెల తీసుకుని.
నల్లగా దృడం గా ఉన్నాడు.
మరో అరగంట సమావేశం తర్వాత ఇద్దరు బయలు దేరారు.
‘అమ్మాయి అభిప్రాయం తెలుసుకుని, తమ తోబుట్టువుల తో మాట్లాడి మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం’ అని చెప్పి బయలు దేరారు రాజు గారి దంపతులు.
శేఖరం తండ్రి మామిడి తాండ్ర పొట్లం ఒకటి జయలక్ష్మీ దంపతులకి ఇచ్చి బయటి వరకు సాగనంపాడు.
మళ్ళీ తిరుగు బస్ ఎక్కగానే కూతురికి ఫోన్ చేసింది జయలక్ష్మి. “పిల్లాడు చామన ఛాయ. మంచి ఆస్తి పాస్తులు ఉన్నాయి. ఒక్కడే కొడుకు. మంచి చదువు. జీవితం. మంచి మ్యాచ్ అనిపిస్తుంది”
“నాన్న ఏమంటున్నారు?”
“ఏమి చెప్పలేదు. ఇంటి కి వచ్చాక నువ్వే అడుగు. ఒక గంట లో ఇంట్లో ఉంటాం.”
**
బోజనం అయ్యాక రాజూ గారి మాట కోసం ఎదురు చూస్తున్న కూతురితో ఆయన అన్నాడు.
“పిల్లాడు కారు నలుపు”
Post a Comment