Sunday, 4 March 2018

గృహ వాస్తు.

నమ్మం గాని ఆడవాళ్ళ ధారణ శక్తి అమోఘం అండి.
నిన్న ఆఫీసు నుండి ఫోన్ చేసి “టాబ్ ఎక్కడ వుందో చూడు దానితో పని పడింది.” అని చెప్పాను.
వెతికే వస్తువు కాకుండా మిగిలినవన్నీ దొరకటం మధ్య తరగతి సంప్రదాయ విధానం.
సహజం గానే టాబ్ కనిపించలేదు గాని ‘ఏదో గృహ వాస్తు పుస్తకం కనిపించిందట. పుస్తకాల రేక్ లో '
సాయంత్రం ఇంటికి వచ్చాక “ఈ పుస్తకం చదువుతున్నాను” అని చూపించింది.
“హల్లో సోఫా నడకి అడ్డం గా మార్చావు ఎందుకు?” అని అడగబోయి మౌనంగా ఉన్నాను.
టీ కప్పు ఇస్తూ ఇక్కడ కూర్చోండి అంటూ హల్లో ఒక మూల ఉంచిన ఎత్తుపాటి స్టూల్ చూయించింది.
“ఇంటి యజమాని ఈ మూల కూర్చోవాలి” అంది.
“డ్రస్ కోడ్ లేదు కదా? అనుమానంగా అడిగాను. అప్పటికే సగం బట్టలు విప్పేసి ఉన్నాను.
“ఇంకా ఆ చాప్టర్ దాకా చదవలేదు”
యర్రగొండపాలెం లో తెల్లారితే మొదలెట్టాల్సిన ఇంటి మార్కింగ్ ప్లాన్స్, బెడ్ రూమ్ లో ఉన్న సిస్టెమ్ మీద సిద్దం చేస్తూ ఉంటే.
“మన మంచం పక్క యజమాని వైపు నైరుతి లో ఫ్లోరింగ్ ఎత్తుగా ఉండాలి కదా? “ అంది.
కాళ్ళు తుడుచుకునే పట్టా మాత్రమే ఉంది అక్కడ.
“ఇక పడుకుంటావా? నాకు కొంచెం పని ఉంది.” ఓపిగ్గా చెప్పాను.
“అటు వైపు నేలమీద ఒక సన్నటి పరుపు వేస్తే ఎత్తుగా ఉంటుంది కదా?” అయిడియా కూడా తానే ఇచ్చింది.
“ఇక వాగుడు ఆపుతావా? పడుకో నోర్మూసుకుని” దైర్యం గా అన్నాను.
పెళ్లయాక ఇలాటి సాహసాలు పట్టుమని పది కూడా ఉండవు.
ఇక అటునుండి మాటల్లేవ్.
ఆవిడ మూడ్ ఎలా ఉందో అని మనసులో పీకుతూనే ఉంది.
వళ్ళు విరుచుకుంటున్నట్లు గా వెనక్కి చూశాను. ఇయర్ఫోన్స్ పెట్టుకుని చైనీస్ సినిమా టాబ్ లో చూస్తూ ఉంది.
డేట్ మారేలోగా పని పూర్తి చేసుకుని వాట్స్ అప్ప్ లో ప్లాన్స్ పంపి, పడుకున్నాను.
నైరుతి లోనే...
***
ఉదయం లేటుగా లేచాను.
వాష్ రూమ్ కి వెళ్ళి వచ్చి ఎందుకయినా మంచిదని హల్లో మూల ఉన్న ఎత్తుపాటి స్టూల్ మీద కూర్చుని ‘టీ’ కోసం ఎదురు చూస్తుంటే..
“కింద పడుకున్నారు ఏమిటి?” అంది. తెలిసే అడిగిందా? తెలియక అడిగిందా?
“రాత్రి కుంఫు సినిమా చూశావా?” అడిగాను.
“అవును. భలే ఫైట్ మూవీ” అంది ఆనందంగా.
మెలిక పడ్డ చేతిని జాగర్త గా ముందుకు చాపి కప్పు అందుకున్నాను.
నమ్మం గాని ఆడవాళ్ళ ధారణ శక్తి అమోఘం అండి.
బజార్లో పరుపులు కుట్టేవాడిని పట్టుకోవాలి.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...