Friday, 2 February 2018

విశ్వాసం.

జనవరి నెల 2015 గొంగోలి గ్రామం, ఉత్తర ప్రదేశ్.
ఒక అనామక మహిళ ఆగ్రామం లో సంచరించడం, గ్రామస్తుల కంట పడింది. చాలా దయనీయమయిన పరిస్థితి లో ఉందావిడ. సరయిన తిండీ, బట్టా లేకుండా పిచ్చిదానిలా నీరసంగా ఉంది. ఏ వీది అరుగు మీదో చతికిల పడి ఎవరయినా ఏదయినా ఇస్తే తినటం మినహాయించి మరేమీ తెలియని స్థితి లో ఉంది. మనస్థిమితం కుడా సరిగా లేదు. ఆ గ్రామస్తులు ఆమెను ఒక చోట కూర్చోబెట్టి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.
కాని ఆమె వారితో మాట్లాడే పరిస్థితి లేదు. చుట్టూ గుమిగూడి వింతగా గమనిస్తున్న వాళ్ళందరిని దిక్కుతోచని స్థితి లో చూస్తూ ఉంది. మధ్య మధ్య లో కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంది.
“నేను ఆమెని ఎక్కడో చూసాను” అన్నాడు ఒక పిల్లాడు ఎదో గుర్తు కొచ్చినట్లు..
అందరు ఆ కుర్రాడిని ఆశ్చర్యంగా చూసారు.
"మన ఊర్లోకి కొన్నాళ్ళ క్రితం ఒక పెద్దాయన వచ్చాడు. గ్రామ పంచాయితీ వద్ద కుర్చుని తన సంచి లోనుండి ఫోటో కాపీలు తీసి చూయించాడు. కనిపిస్తే ఫోన్ చెయ్యమని వంచాయితి గోడ మీద ఫోన్ నెంబరు వేసాడు. ఆ ఫోటో లో ఉంది ఈమె అనుకుంటాను” అన్నాడు.
ఆ మాత్రం ఆధారం చాలు.
సాయంత్రానికి ఆఘమేఘాల మీద ఆ పెద్దాయన వచ్చేసాడు.
ఆవిడని చుసిన మరుక్షణం, మోకాళ్ళ మీద పడిపోయాడు. కళ్ళలో నీరు. కన్నీరు కాదు. పందొమ్మిది నెలలుగా గుండెల్లో గూడు కట్టుకున్న బాధ..
లేచి పరిగెత్తుకుంటూ ఆవిడ దగ్గరికి వెళ్లి ఆమెని కౌగలించుకున్నాడు. చిత్రంగా ఆమె అతని చుట్టూ చేతులు వేసింది.
ఆ దంపతులు కోలుకునే వరకు ఎవరూ మామూలు మనుషులు కాలేక పోయారు. కన్నీళ్ళతో అందరు ఆనందించారు.
***
ఆయన పేరు విజయకాంత్. ఆమె లీల. 2013 లో తీర్ధ యాత్రలకి ఉత్తరాఖండ్ వెళ్ళారు. అక్కడ వరదల్లో ప్రమాదవశాత్తు కొట్టుకుపోయిన వారిలో లీల ఒకరు. ప్రభుత్వం చనిపోయిన వారిలో ఒకరిగా ఆమెను కూడా ప్రకటించారు. కాని విజయకాంత్ కి ఒక పిచ్చి నమ్మకం. తన బార్య బ్రతికే ఉందని. ఆ రోజు నుండి ఆమె ఫోటో లు పట్టుకుని చుట్టూ పక్కల గ్రామాలన్నీ తిరుగుతున్నాడు. పందొమ్మిది నెలల తర్వాత అతని అన్వేషణ ఫలించింది. అతని నమ్మకం నిజమయ్యింది. వాళ్ళ ప్రేమ సజీవంగా మిగిలింది.
గ్రామస్తులందరి ఆతిధ్యం అందుకుని ఆ జంట ఇంటికి ప్రయాణం అయ్యారు.
నిజమయిన విశ్వాసం అనేది ఓటమి ఎరగదు. <౩ <౩ <౩

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...