Sunday, 29 July 2018

నల భీమ


“ఏమండీ... ఏం చేస్తున్నారు?”
“ఇప్పుడే పిల్లాడూ నేనూ భోజనం చేసాము. 
వాడు వర్క్ చేసుకుని నిద్ర పోయాడు. నేను టివి చూస్తున్నాను.”
పార్సిల్ తెచ్చుకున్నారా?
లేదు వండుకున్నాము. ఫ్రిడ్జ్ లో పెరుగు ఉందిగా ?
కూర కర్రీస్ పాయింట్ నుండి తెచ్చుకున్నారా?
రైస్ కుక్కర్ ఎలాను ఉండే. దోసగింజల చింత కాయ పచ్చడి. చేసాను. నెయ్యి వేసుకుని అప్పడాలు వేయించుకుని లాగించాం.
అబ్బో..
మరి.?
వంటగది అంతా కంగాళీ చేసి ఉంటారుగా? అబ్బా కొడుకులు.
ఏం లేదు. శుబ్రంగా కప్ బోర్డు లు తుడిచాం. ఫ్లాట్ ఫార్మ్ కడిగి పెట్టాం. నేల కి తడిగుడ్డ పెట్టాం. ఇద్దరం రెండు సార్లు స్నానం చేసాం. గుమ్మడి కాయ వడియాలు, ఊరమిరపకాయలు.
..
..
..
హ హ హ
..
..
ఎందుకే అంత నవ్వు? ఒక్క రోజు నువ్వు ఊరెళితే వంట చేసుకోలేమనుకున్నావా?
..
..
..
మిక్సీ స్విచ్ వేసేముందు జార్ మూత కుడివైపుకు తిప్పితే లాక్ అవుతుంది.

Saturday, 28 July 2018

మొనగాడు.

హైదరాబాదు లో ఉండే రాజా మహేంద్ర ప్రతాప్ కి అయిదేళ్ళ వయసు ఉన్నప్పుడు జరిగింది ఆ సంఘటన.
అతని కి, అతని స్నేహితులు కి మధ్య చిన్న పోటి. ఒక ఇనుప రాడ్ తో రెండు బజారు స్తంబాల మధ్య వేలాడే తీగలని తాక గలవా? అని
ప్రతాప్ శరీరం నుండి హై వోల్టేజ్ విధ్యుత్ ప్రవహించింది. 
అచేతనంగా పడిపోయిన ప్రతాప్ నుండి నుండి రెండు కాళ్ళు మోకాళ్ళ వరకు రెండు చేతులు మోచేతుల వరకు తోలిగించ వలసి వచ్చింది.
పదేళ్ళు... అవును నిండా పదేళ్ళు ...
అతనికి పదహారు వయసు వచ్చేవరకు నాలుగు గోడల మధ్య అతని జీవితం గడిచింది. సుదీర్గమయిన పగళ్ళు ...
మరింత సుదీర్గమయిన రాత్రులు...
అదే గది అతని మొత్తం ప్రపంచం.
మధ్యతరగతి కుటుంబం లో ముగ్గురు ఆడపిల్లల తర్వాత సంతానం.
అతని కోసం దర్జీ ఇంటికి వచ్చేవాడు.
డాక్టర్ ఇంటికే వచ్చేవాడు. అతను మాత్రం ఇల్లు దాటి రాలేదు.
కాని అతనికి ముగ్గురు అక్కలు ఉన్నారు.
అతనికి వాళ్ళే టీచర్లు. వాళ్ళే అమ్మలు. వాళ్ళే అక్కలు.
అతనికి ఉన్న అవయవాలతో నడవటం నేర్పారు.
మోచేతులు మోకాళ్ళు సాయం తో నడవటం నేర్చుకున్నాడు.
మోచేతులు రెండిటితో పెన్ను పట్టుకుని వ్రాయటం నేర్చుకున్నాడు.
అక్కలు అతనికి పాఠ్య పుస్తకాలు చదివి వినిపించారు.
వ్రాయటం నేర్పారు. చదవటం నేర్పారు.
అన్నీ ఇంట్లో అదే గదిలో ... అదే ప్రపంచం లో...
ప్రైవేటు గా పదో తరగతి పరీక్ష వ్రాయటానికి ఆతను మొదటిసారి ఇల్లు వదిలి వచ్చాడు.
మోకాళ్ళ కి కుట్టించుకున్న ప్రత్యక చెప్పులతో ఆతను ప్రపంచం లోకి వచ్చాడు.
ఒక్క రోజు కుడా స్కూల్ కి వెళ్ళకుండా ఆతను టెన్త్ పాసయ్యాడు.
ఇంటర్ పాసయ్యాడు. అతనిక వెనక్కి చూడలేదు.
ప్రపంచం అతనికి అద్బుతం గా అనిపించింది.
ఆతను నడిచే కొంది దూరం తగ్గిపోతుందని గమనించాడు.
ఆతను B.Com ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాడు.
ఉస్మానియా యునివర్సిటి నుండి ఫైనాన్స్ లో MBA పూర్తిచేసాడు.
డిల్లీ లోని ‘National Center for Promotion of Employment for Disabled People”.
నుండి ఉపకార వేతనం తీసుకున్నాడు.
అతని 'రేజ్యూం' చూసి అనేక ఉద్యోగ అవకాశాలు వచ్చాయి.
ఇంటవ్యూ లలో అతని ని వ్యక్తిగతం గా చూసాక అవి నిరాశ ని మిగిల్చాయి.
అపజయాలు అతనిలో పట్టుదల మరింత పెంచేవి.
నేషనల్ హౌసింగ్ బ్యాంకు లో అసిస్టెంట్ మేనేజర్ గా మొదటి ఉద్యోగం వచ్చింది.
ఉద్యోగం చేరిన మొదటి రోజు ఒక ఫారం ఫిల్ చెయ్యటానికి సహోద్యోగి చేయబోయిన సాయాన్ని ప్రతాప్ సున్నితంగా తిరస్కరించాడు.
నన్ను సహోద్యోగి గానె గుర్తించండి, బలహీనుడిగా కాదు అని చెప్పేవాడు.
ప్రస్తుతం అహమ్మదాబాదు ONGC లో అకౌంట్స్ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు.
కొలీగ్స్ సహకారం తో, అతని పట్టుదలతో ఒక మంచి అధికారిగా చాలా తక్కువ సమయం లో పేరు తెచ్చుకున్నాడు.
ప్రయాణాలు అంటే ఇష్టపడే ప్రతాప్ చాలా చోట్లు తిరిగాడు.
ప్రజల కళ్ళలో విస్మయం గమనించడానికి అలవాటు పడి పోయాడు.
చెస్ , కారేమ్స్ అధ్బుతం గా అడే ప్రతాప్ మంచి హోస్ట్. తన మీద తనే ఛలోక్తులు విసిరి నవ్వించ గల మొనగాడు.
ఒంటరిగా బస్సు/రైలు/విమాన ప్రయాణాలు చేస్తాడు. ఆనందం గా జీవించడం, తోటి వారికి సాయం చేయటం అతన్ని చూసి నేర్చుకోవాల్సిందే.
మనమంతా ఎదో ఒక చోట బలహీనులమే.
మానసిక అంగ వైకల్యం తో ఏంతో కొంత బాధపడుతున్న వారిమే.
రాజా మహేంద్ర ప్రతాప్ చూపులకి మాత్రమే తక్కువ.
వ్యక్తిగా మాత్రం చాలా ఎక్కువ..   




Saturday, 21 July 2018

'పాప'O

బస్సు దిగి అటో కోసం బైపాస్ లో నిలబడ్డాను. 
రెండు నిమిషాల్లోనే అటో వచ్చింది. 
''సార్ రండి'' ఆటో అబ్బాయి పిలిచాడు. తెలిసిన పిల్లాడే..
వెనక సీట్లో ఒక పెద్దావిడ కూర్చుంది. బాగ్ వళ్ళో పెట్టుకుని సర్దుకుని కూర్చున్నాను. 
ముందుగా దిగాల్సిన మూడో అతను కుర్చోగానే బాగ్ సీటు వెనుక పెట్టాను. 
‘ఆడాళ్ళ పక్కన ఎలా కూర్చోవాలో కుడా తెలీదు’ అంటూ పెద్దావిడ కుడివైపు ఇనప హండిల్ మీద కూర్చుంది.
అప్పటిదాకా నాకు పక్కన ఉన్నది ‘ఆడ’ (?) మనిషి అని తెలీదు.
ఇంకొంచెం సర్దుకుని “సరిగా కూర్చోండి అమ్మా?” అన్నాను.
“అమ్మా ఏమిటి అమ్మా ఎదో బొప్పి వైనట్లు”అంది.
**
జెడ్పి కాలని వద్దకి వచ్చేసరికి అటో ఆతను “రెండు నిమిషాలు సార్ ఈవిడని లోపల దించి వద్దాము.” అన్నాడు.
చీకటి మొదలయ్యింది.
“వద్దు. నేను ఇక్కడే నిలబడి ఉంటాను. వెళ్లి రా” అంటూ దిగాను.
“పర్లేదు కూర్చోండి. ఎంత రెండు నిమిషాలు”
“వెళ్లిరా ఈ లోగా వంద కాగితం మారుస్తాను.”
**
కొబ్బరి బొండా తాగి పదినిమిషాలు గడిచినా అటో రాలేదు. కొద్దిగా నడిచి చూద్దామని లోపలి వెళ్లాను.
నలుగురు అయిదుగురు గుమిగూడి ఉన్నారు. అటో ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
తిరగబడ్డ అటో నుండి డ్రైవర్ కుర్రాడిని చేయి అందించి లేవటానికి సాయం చేసాను.
“ఏమయింది?”
“పొరపాటున అడ్డ రోడ్డు దాటి కొద్దిగా ముందుకు వెళ్లాను. చీకట్లో నన్ను ఎక్కడికి తీసుకెల్తున్నావురా? అని గావు కేక పెట్టింది. టక్కున సైడ్ కి తిప్పాను వెనక టైరు ఎదో రాయి ఎక్కింది.”
“సర్లే పద వెళ్దాం”
“ఇంతకీ ఆవిడ ఏది ?”
ఆ కుర్రాడు చీకట్లో చూపించిన వైపు సెల్ లో లైట్ వేసి చూసాను.
సైడు కాలవలో పాప కదులుతూ ఉంది.

Sunday, 15 July 2018

ఇద్దరు అమ్మాయిల కధ

ఈ కధ ముప్పై అయిదేళ్ళ క్రితం 12 మార్చి 1982 న మాదాపూర్ అనే గ్రామం లో ఉత్తర ప్రదేశ్ లోని గౌండ జిల్లాలో మొదలయ్యింది.
క్రిమినల్స్ గురించి సమాచారం రావటం తో తన సబ్ అర్దినేట్స్ తో కలిసి DSP ఎస్.పి. సింగ్ రాత్రి వేళ హుటాహుటిన వెళ్ళాడు.
అతని శరీరం మర్నాడు ఉదయం ప్రభుత్వ అసుపత్రి కి చేరింది.
మరో 12 మంది దుండగులతో కలిసి అతను బాంబు దాడిలో చనిపోయినట్లు బార్య విభా సింగ్ కి సమాచారం పంపారు.
నిజానికి DSP సింగ్ కి అతని సబ్ అర్దినేట్స్ కి మధ్య ఉన్న వైరం అతన్ని పొట్టన పెట్టుకుంది. అతని సబ్ ఆర్దినేట్స్ ఒక నకిలీ ఎన్కౌంటర్ లో చంపేశారు.
“దయచేసి నన్ను కాల్చొద్దు. నాకు ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు” అనేది ఆయన చివరి మాట.
సింగ్ భార్య 'విభా సింగ్' హై కోర్టుని ఆశ్రయించింది. సిబిఐ కి కేసు బదలాయించారు. తోటి ఉద్యోగులు క్రిమినల్స్ తో కలసి ఈ దారుణానికి పాల్పడినట్లు సిబిఐ చార్జ్ షీట్ ఫైల్ చేసింది.
సుదీర్గమయిన కోర్టు ప్రక్రియ మొదలయింది.
**
DSP సింగ్ హత్య జరిగినప్పటికి, అతనికి బార్య విభా సింగ్ కి కింజాల్ అనే ఆర్నెళ్ళ పాప, ఇంకా లోకం చూడని (ప్రింజాల్ సింగ్) బిడ్డ ఉన్నారు.
తల్లి కి వారణాసి ట్రెజరీ లో ఓక చిన్న ఉద్యోగం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది.
తండ్రి మరణాన్ని ప్రశ్నిస్తూ న్యాయం కోసం తల్లి చేసిన పోరాటం నీరు కారి పోయింది. భర్త తో పాటు పని చేస్తున్న ఉద్యోగులు ఆమెకి ఎవరు సహకరించలేదు.
ఆమె ఉద్యోగం లో జాయిన్ అయింది. రెండో బిడ్డ భూమి మీదకి వచ్చింది.
ఇద్దరు పిల్లలని ఆమె చదివించడం మొదలెట్టింది.
కొద్ది ఆదాయం, తండ్రి లేని ఒంటరి కుటుంభం. అన్ని రకాల గడ్డు సమస్యలని ఎదుర్కుంది.
పిల్లలిద్దరూ వారి చదువుల కోసం అనేక త్యాగాలు చేసారు.
తండ్రి ఫోటో ని చూస్తూ.. అతన్నే ఇన్స్పిరేషన్ గా తీసుంటూ ఇష్టపడి చదువు సాగించారు.
పెద్దమ్మాయి కింజాల్ డిల్లీ లోని అత్యున్నతమయిన “లేడి శ్రీరాం కాలేజ్” లో సీటు సంపాదించింది.
కింజాల్ డిగ్రీ మొదటి సంవత్సరం లో ఉన్నప్పుడు తల్లి కి కాన్సర్ అని తెలుసుకుంది. ఆమె ఎక్కువ కాలం జీవించే అవకాశం లేదని తెలిసిన రెండు రోజుల కి వ్రాసిన పరిక్షల లో ఆమె యునివర్సిటీ టాపర్ గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది.
తల్లి మరణ శయ్య వద్ద తామిద్దరు UPSC క్రాక్ చేస్తామని మాట ఇచ్చింది.
**
2004 లో తల్లి మరణానంతరం అక్క చేల్లెల్లిద్దరు డిల్లీ చేరారు.
ముఖర్జీ నగర్ లో ఒక సాదారణ గది లో నివాసం ఉంటూ UPSC కి చదవటం మొదలెట్టారు.
మిత్రుల వద్ద అరువు తెచ్చుకున్న పుస్తకాలతో వాళ్ళు యజ్ఞం మొదలెట్టారు.
స్వగ్రామం మరిచి పోయారు.
బందువులు లేరు. ఒక పండగ లేదు ఒక సరదా లేదు. ఒక విరామం లేదు. వాళ్లిద్దరు ఒకరి కొకరు ప్రేరణ. వాల్లిదరికి తల్లి తండ్రి ప్రేరణ.
2007 లో కింజాల్ సింగ్ IAS, ప్రింజాల్ సింగ్ IRS ని సాధించారు.
వారిద్దరి పట్టుదల విజయగాధ జ్యుడిషిల్ వ్యవస్థని తాకింది.
తండ్రి ని చంపిన 31 ఏళ్ల తర్వాత, చార్జ్ షీట్ చేసిన 27 ఏండ్ల తర్వాత ఎనిమిది మంది పోలిస్ అధికారులని నిందితులుగా నిర్ధారించింది. ఎస్ పి సింగ్ నిజాయితీ ని, తల్లి ఆరోపణలని నిజమని ప్రపంచానికి కోర్టు రుజువు చేసింది.
తీర్పు చెప్పినప్పుడు అప్పటి 'లక్ష్మి పుర ఖేరి' జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ గా ఉన్న కింజాల్ సింగ్ దుఖం దాచుకోలేక పోయింది. కన్నీటి పర్యంతం అయింది.
**
ఆడపిల్లలని తక్కువ గా చేసి చూసే/మాట్లాడే వాళ్లకి కింజాల్ సింగ్, ప్రింజాల్ సింగ్ ఒక సమాధానం.
దేశం గర్వించదగ్గ ఈ సోదరీమణులు ఇద్దరు నేటి అనేక మంది పిల్లలకి ఆదర్శం.






మెలకువ వచ్చింది

కార్బైడ్ వేసి మగ్గబెట్టి పండించిన మామిడిపండులా ఉంది కనకం. 
ఊటి లో అడివిలా అనిపించే చిక్కటి చెట్ల మధ్య దగ్గర దగ్గరగా కుర్చుని ఉన్నాం. 
“వచ్చి మూడు వారాలు అయింది. ఇక వెళ్దామా?”
“వద్దు ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉండిపోదాం.” 
“ATM కార్డులు బ్లాక్ అయినాయి. tez మీద లాక్కోస్తున్నాను. వెళ్లిపోదాం.”
“అక్కడ మనకి ప్రైవసీ ఉండలేదు. ప్రతి చిన్న విషయం మీ శిష్యులు ఇంటికి చేరవేస్తూ ఉన్నారు.”
“నేను చెబుతాలే. ముందు నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళిన రెండు రోజులకి నేనూ వచ్చేస్తాను. ఒకరికి ఒకరం మాట్లాడుకోవద్దు. నో ఫోన్. నో వాట్స్ అప్. నో fb. అసలు నువ్వెవరివో నేనెవరినో. మరో వారం లో అమరావతి లో కొత్త డిజైన్ ల ప్రదర్శన ఉంటుంది. అందరు అందులో రెచ్చిపోతారు. ఇక మన జోలికి రారు.”
“ఆ నరసరావ్ పేట శిష్యుడు ఉన్నాడే. అతనొక్కడు చాలు”
“ఎదో డిపార్ట్మెంట్ పేరు మీద ఒక లారి సానిటరీ పాన్స్ కి ఆర్డర్ పెట్టి లెటర్ బస్సులో డ్రైవర్ కి ఇచ్చి పంపుతాను. అది ఎక్కడి నుండి వచ్చిందో అర్ధం కాక దాన్ని పట్టుకుని ఉన్న జుట్టు పీక్కుంటూ ఉంటాడు.”
“అంతే అంటారా?”
“అంతే..”
“నన్ను వదిలించుకునే ఆలోచన ఉందేమో అని చిన్న అనుమానం”
“ఛి.. ఛి... అలాటివి మనసులో పెట్టుకోకు..”
“ఎదో శబ్దం అవుతుంది వినండి”
..
..
..
..
..
“ఎదో అడవి జంతువు. పు .. లి గాండ్రింపు లో ఉంది”
“పు లా ?%^$#@??”
పొదలో నుండి చప్పుడు చెయ్యకుండా బయటకి వచ్చాం. ఇంకా చీకటి పడలేదు. సన్నటి చినుకులు. అడవి పూల వాసన. వాతావరణం ఆస్వాదించే పరిస్థితి లేకుండా.. దూరంగా గాండ్రింపు.. వెన్నులో వణుకు.
కనకం వళ్ళు చల్లబడింది.
ఆకులు మీద ఎదో జంతువు నడుస్తున్న చప్పుడు... చుట్టూ నిశబ్దం. కోతులు చెట్టు ఊడలు పట్టుకుని దూరంగా వెళ్లి పోతున్నాయి. పక్షుల శబ్దాలు ఆగిపోయాయి. కాలానికి పాజ్ బటన్ నొక్కినట్లు...
కర్ణభేరి పగిలేట్టు గా పులి గాండ్రింపు...
“వింటున్నారా?” గుస గుస గా అంది.
“లేదు లెక్క పెడుతున్నాను. నుటముప్పైనాలుగు కి వర్గం ఎంత అని?”
ఆమె కోపంగా చూసింది.
“బిపి కంట్రోల్ చేసుకోటానికి నాకు తెలిసిన పద్దతి ఇదే.”
ఈ చెట్టు ఎక్కుదాం.
ఇద్దరం చెట్టు ఎక్కటం మొదలెట్టాం. ప్రాణ భయం అన్నీ నేర్పుతుంది. దాదాపు పది అడుగులు ఎక్కాను.
కొమ్మ మీద స్తిరంగా కూర్చుంటూ కనకానికి చెయ్యి అందించాను.
..
..
..
..
సరిగ్గా అప్పుడు జరిగిందా సంఘటన. గుబురుగా ఉన్న ఆకుల మద్య నుండి ఒక పొడవాటి చిరుత ఎగిరి దూకి కనకాన్ని లాక్కు పోయింది. ఏం జరిగిందో మైండ్ లో రికార్డ్ అయ్యే లోపు జరిగి పోయింది.
నూట ముప్పై నాలుగు ఇంటు నూట ముపై నాలుగు #$%@
..
..
..
పది నిమిషాలు భారం గా గడిచాయి.
మళ్లీ చప్పుడు.. రాలిన ఆకుల మీద మెల్లగా నడుస్తూ వచ్చింది చిరుత..
కొమ్మ ని కరుచుకుని దాగే ప్రయత్నం చేస్తున్న నన్ను ప్రశాంతం గా చూసింది.
అయిపొయింది. కధ ముగింపు కి వచ్చింది.
నూట ముప్పై నాలుగు కి వర్గం పదిహేడు వేల తొమ్మిది వందలా .....
జేబులో నుండి పిస్టల్ తీసి గురి చూసి కాల్చాను.
గాల్లోకి ఎగిరిన పులి వెనక్కి పడి పోయింది.

..

మన ఇంట్లో విషయం

NH-5 టోల్ ప్లాజా మీద ఉన్న ఫుడ్ కోర్టు లో సాయంత్రం భోజనం చేస్తూ ఉన్నాం నేనూ మా అబ్బాయి సాయి, మా మేనకోడలు, ముగ్గురం.
“మొత్తానికి బెటర్మెంట్ పరిక్షలు బాగా వ్రాసానంటావు”
“బాగా వ్రాసాను మామయ్యా అంది” పావని తన సెల్ లో నుండి తల పైకి ఎత్తి. 
ఒక చేత్తో స్పూన్ తో తింటూ మరో చేత్తో బ్రౌజ్ చేస్తూ ఉంది. వాట్స్ అప్ లో టైపు చేస్తూనే ఉంది.
“కనీసం నైన్ గ్రేడ్స్ దాటతాయి అనుకున్నాను. 8.5 దగ్గర ఆగిపోతావని అనుకోలేదు.”
ఒక్క నిమిషం తను ఏమి మాట్లాడలేదు. “మా సెక్షన్ లో నావే మంచి మార్కులు” అంది. కొన్ని డెసిబల్స్ ల శబ్దం తక్కువగా ఉంది.
“నాన్న తక్కువ ఫీజు కట్టాడా? ఆ సెక్షన్ లో ఎందుకున్నావు?”
“మొదటి నెలలో టెస్ట్ పెట్టి వాళ్ళే సెక్షన్ లు చేసారు.”
“మీ ఊర్లో మంచి కాలేజి లు ఉన్నాయిగా? అక్కడ చదువుతావా? రెండో సంవత్సరం.”
“ఉహు, విజయవాడే చదువుతాను మామయ్యా”
“బై పి సి నుండి టార్గెట్ కొట్టాలంటే ఎలా చదవాలో తెలుసుగా?”
పావని ఏమి మాట్లాడలేదు.
“అక్కడ హాస్టల్ లో సెల్ కి పర్మిషన్ ఉందా?”
కళ్ళజోడు లోంచి కళ్ళు మెరిసాయి “ఉంది “
సాయి ఐస్ క్రీం కోసం వెళ్ళాడు.
“రాత్రి నువ్వు పడుకున్నాక నీ సెల్ చెక్ చేసాను. మీ నాన్న గాని మీ అమ్మ గాని ఎప్పుడయినా నీ సెల్ చూసారా?”
పావని మాట్లాడలేదు.
“మీ నాన్న తో తప్ప అనవసరమయిన చాలా మంది తో చాట్ చేసావు. కెరీర్ కి ఉపయోగపడేవి నాకు ఏమి కనిపించలేదు. కొంత మంది పిల్లలు ముభావంగా ఉన్నా నువ్వే కదిలించి మాట్లాడినట్లు అనిపించింది.” తన కళ్ళలోకి సూటిగా చూసాను.
తను కళ్ళు తిప్పుకుంది.
ఏమాత్రం శబ్దం చెయ్యలేదు. చీకటి రోడ్డు మీద లైట్స్ వెలుగులో బారులు తీరి ప్రయాణిస్తున్న వాహనాలు. సరిగా రోడ్డు అడ్డంగా అంత ఎత్తున అద్దాల ఫుడ్ ప్లాజా.. గొప్ప వ్యూ.
"నాన్నా ఇక్కడ వ్యూ బావుంది" అన్నాడు సాయి. చేతి లో రెండు కప్పులు ఐస్ క్రీం ఉన్నాయి. పావని కి ఒక టి అందిస్తూ. “టూటి ఫ్రూటి తింటావుగా?” అన్నాడు.
“సాయి ..నాకు fb ఒక బలహీనత అయిపొయింది. నిరంతరం అదే ద్యాస. బస్సులో ప్రయాణం చేసేటప్పుడు. ఇంట్లో మీతో మాట్లాడుతున్నప్పుడు. డ్రైవింగ్ లో ఉన్నప్పుడు.. ఎప్పుడు నా కళ్ళు సెల్ మీదే ఉంటున్నాయి. ఎడిక్ట్ అయిపోయానని అనిపిస్తుంది. కనీసం రెండు రోజులు ఉండగలనా సోషల్ మీడియా విడిచి అనిపిస్తుంది.”
“మీకు అదేమంత కష్టం కాదు. “ సాయి అన్నాడు.
“ మీ వళ్ళ కాదు మామయ్యా..” అంది పావని.
“ఒక పని చేద్దాం నువ్వు మళ్ళీ కాలేజి కి వెళ్ళేంత వరకు స్మార్ట్ ఫోన్ వాడకు. నేనూ fb అకౌంట్ డి ఆక్టివేట్ చేస్తాను. కాలాన్ని మరింత విలువగా వాడతాను. ఇదిగో బేసిక్ ఫోన్ నీ కోసమే కొన్నాను. సిం ఇందులోకి మార్చుకో నీ స్మార్ట్ ఫోన్ నాకు ఇవ్వు”
“సాయి.. నా అకౌంట్ డి ఆక్టివేట్ చెయ్యి.” మే 20 వ తేది సాయంత్రం మా భోజనం ముగిసింది.

సున్నితమయిన సమస్య

ఆఫీస్ అవర్స్ ముగిసేటప్పుడు పర్సనల్ నెంబరు మోగింది.
డాక్టర్ విజయ్.. నా మిత్రుడు, డెంటిస్ట్.
"ఇప్పుడు రాగలవా? నీ RCT క్లోజ్ చేస్తాను."
"రేపు అనుకున్నాం కదా?"
"రేపు నైట్ బ్యాంకాక్ వెళ్తున్నాను. మరో వారం దొరకను"
"ఒక్కడివేనా?"
"అవును. వస్తున్నావా?లేదా?"
"వస్తున్నాను. గంటలో అక్కడ ఉంటాను. బైక్ తీసుకుని వస్తాను"
సబ్ స్టాఫ్ కి చెప్పి బయలుదేరాను.
మరో అరగంట దూరం లో ఉన్నప్పుడు SE గారి టెలీ కాన్ఫరెన్స్ మొదలయ్యింది.
ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటూ అక్కడికి చేరాను.
..
తన రూం లో మరో కుర్రాడు కూడా ఉన్నాడు. అతనే పేషంట్స్ ని చూస్తున్నాడు.
కన్నె BDS అని, ఈ వారం రోజులు హాస్పిటల్ చూసుకోటానికి ఏర్పాటు చేశానని చెప్పాడు.
రెండో సీట్లో కూర్చోబెట్టి నా RCT (రూట్ కెనాల్ ట్రీట్మెంట్)పూర్తి చేశాడు.
..
ఇద్దరం లేచి హాస్పిటల్ పక్కనే ఉన్న ఒక హోటల్ లో కూర్చుని ఒకే ప్లేట్ లో రెండు మినప గారి తెప్పించుకుని తింటూ ..కబుర్లలో పడ్డాం.
"చందన ని లాంగ్ టర్మ్ చేరుస్తున్నావుగా?"అడిగాను. చందన విజయ్ ఏకైక కూతురు.నీట్ లో ఆశించిన ఫలితం రాలేదు.
..
"నీ పోస్ట్ ఇవాళే చూసాను." అన్నాడు ఉపోడ్ఘాతంగా..
నేను నుదురు చిట్లించాను.
"రాత్రి పన్నెండున్నర అప్పుడు వాష్ రూము కి వెళ్ళటానికి లేచాను...
అతను ఆగాడు..
"హాల్లో చందన టక్కున చేతిలో సెల్ పక్కన పెట్టింది. దుప్పటి కప్పుకుంది"
"నేను తనని పిలిచాను. సెల్ తీసుకుని చూసాను ఎవరో అభిరామ్ ట"
..
నేను మౌనం గా వింటున్నాను.
"బాగా కొట్టాను"
"కో..ట్టా.. వా?
"అవును. అడ్డు వచ్చిన మా ఆవిడని కూడా"
ఇప్పటి వరకు ఎవరితోనూ షేర్ చేసుకొని ఉండడు.
..
"ఉదయం నీ పోస్ట్ చూసాను."
ఎందుకో తెలియదు కాని నాకు మా సంభాషణ మీద ఆసక్తి పోయింది.
ఇంతలో తన ఫోన్ మోగింది.
..
క్లినిక్ లోకి వచ్చేసరికి కన్నె BDS, ఒకావిడ పన్ను ని బలాత్కరిస్తున్నాడు. విజయ్ వెళ్లి విరిగిన పన్ను ముక్కల్ని జాగర్తగా తీసి ఆమెని పంపేసాడు.
..
సెలవు తీసుకుని బయలుదేరుతుంటే..
జూనియర్ తో చెబుతున్నాడు..
"పన్ను ని గట్టిగా పట్టుకోవాలి కానీ వత్తకూడదు. వత్తితే విరిగిపోతుంది"

శర్మ గారు

వెంకటరెడ్డి నేనూ రవ్వ దోశ కి న్యాయం చేసి ఇరాని టీ కోసం వెళుతూ ఉంటే..
బక్కపలచటి శరీరం కి తెల్లటి వెంట్రుకలు పెవికాల్ తో అడ్డదిడ్డంగా అంటించి నట్లు ఉన్న మొహం తో ఒకతను మమ్మల్ని ఆపాడు.
వెంకటరెడ్డి ఆయనతో పలకరింపు మాటలు మాట్లాడుతూ.. “శర్మ గారు గుర్తున్నారుగా అన్నా” అన్నాడు నన్ను చూస్తూ...
అలా గుర్తు చెయ్యక పొతే ఖచ్చితంగా గుర్తుపట్టే వాడిని కాదు.
“బావున్నారా?” అడిగాను. చెయ్యి కలుపుతూ.. చెయ్యి చల్లగా ఉంది. ..
రెండో చేతి లో కూరగాయల సంచి ఉంది.
“శ్రీనివాసరావు గారు నాకు బాగా గుర్తు.. మా మామ గారు పొలం కొలిచేటప్పుడు సాయం చేసారు. ఇప్పటికి ఆయన గుర్తు చేస్తూ ఉంటారు. అందాకా ఎందుకు? చందమామ హాలు స్థలం పంపకాలు సారు పరిచయం లేకుంటే తెగేదే కాదు.” అన్నాడు అభిమానంగా..
“పిల్లలు బాగున్నారుగా?” అన్నాడు నన్ను చూస్తూ..
“బాగున్నారండీ.. పెద్దమ్మాయి పెళ్లి చేసాను. తాతని కుడా అయ్యాను” అన్నాను నవ్వుతూ..
“ఓహ్ కాంగ్రాట్స్. మనమడా?”
అవునన్నట్లు తలూపాను.
“ఒక అబ్బాయి ఉండాలి కదా?”
“అవును. శర్మ గారు తంజావూరు లో బి టెక్ చదువుతున్నాడు.”
“మా వాడు కుడా బి టెక్ ఫైనల్ ఇయర్. KLU లో ఇంకో నెలలో ఇంటికి వస్తాడు.” అన్నాడు.
నేనూ నొసలు చిట్లిస్తుంటే వెంకటరెడ్డి నా చెయ్యి పట్టుకున్నాడు. ఆ పట్టుకోవటం లో ఒక హెచ్చరిక ఉంది.
కొద్ది సేపు వాళ్ళ అబ్బాయి ఎంత బాగా చదువుతున్నదీ చెప్పాక మేము సెలవు తీసుకున్నాం.
**
“అవునూ .. వాళ్ళ అబ్బాయే కదూ? హాస్టల్ లో పిట్టగోడ మీద నుండి పడి ...” పూర్తి చెయ్యకుండా ఆపేసాను.
“అవును. ఒక్కడే కొడుకు చక్కటి పుటక. పెద్దలు మిగిల్చిన కోట్ల ఆస్థి. తలలో నాలుక లాటి మనిషి. చీమకి కుడా హాని చెయ్యని వాడు.
ఫైనల్ ఇయర్ లో పరిక్షలపుడు హాస్టల్ పైన పిట్టగోడ మీద కుర్చుని చదువుకుంటూ నిద్రకి తూగి కిందపడి పోయాడు. స్పాట్ లోనే...
ఎనిమిదేళ్ళు గడిచి పోయాయి. ఎప్పుడు కనిపించినా ఈ నెలలో ఇంటికి వస్తున్నాడు అని చెబుతుంటాడు.
ఇంట్లో నుండి బయటకి రాడు. ఉదయం సాయంత్రం ఒక సంచి పట్టుకుని మార్కెట్ కి వెళ్లి కూరగాయలు కొనుక్కుని వస్తుంటాడు.
దారిలో తెలిసిన వాళ్ళు ఎదురయితే ఇదే మాట చెబుతుంటాడు.”
ఆగి వెనక్కి తిరిగి చూసాను.
రాబందు కాళ్ళకి చిక్కిన కోడిపిల్లలా కనిపించాడు. 

పిల్లలు- ఆర్ధిక క్రమశిక్షణ


నోకియా ఫోన్ నుండి మా ఇంటికి మెసేజ్ పెట్టాను. “ కలెక్టర్ మీటింగ్ అయ్యేసరికి లేటయ్యింది. అక్క వాళ్ళ వద్ద ఉండి రేపు టౌన్ లో పని చూసుకుని వచ్చేస్తాను. జాగర్త” అని
**
అక్క రోజు మాదిరిగా నాలుగున్నరకే లేచి కారేజి లు రెడి చేసింది. ఏడు గంటలకి బావ తను పని చేసే స్కూల్ కి వెళ్ళటానికి బస్టాండ్ కి , ఎనిమిదికి రవి బాబు హైస్చూల్ కి వెళ్ళిపోయారు.
నేనూ స్నానం చేసి అక్కకి సాయం గా వంటగదిలో చపాతీలు కాలుస్తూ ..
“అక్కా .. ఏమయినా అనుకో కాని చెప్పాల్సిన బాద్యత నాకు ఉంది.” అక్క మొహం లో అంత ఆశ్చర్యం ఏమీ లేదు.
“నా పర్సు లో అయిదువందల కాగితం ఒకటి మిస్సయింది.” .. తనవైపు చూస్తూ “రవిబాబు తీసాడు” అన్నాను.
నేన్ను ఆశ్చర్యపరుస్తూ అక్క “నాకు తెలుసు. ఈ మధ్య తరచూ ఇంట్లో నుండి డబ్బులు మిస్సవుతున్నాయి.”
**
మరుసటి వారం మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు హల్లో ఒక పటం కట్టించి పెట్టిన అయిదువందల నోటు దాని కింద “నేను దొంగని” అని వ్రాసిన రవిబాబు వ్రాత కనిపించాయి. ఈ ఛండాలపు ఆలోచన బావది అని తెలిసుకుని బాధ పడ్డాను.
**
ఇలాటివి టీన్స్ లోకి అడుగిడుతున్న పిల్లలు ఉన్న ఇంట్లో సహజంగా జరుగుతుంటాయి. (చిన్నప్పుడు మా అక్క తన టెస్ట్ పుస్తకాలలో దాచుకునే రెండు రూపాయల కాగితాలు దొంగిలించి అనేక సినిమాలు చూసే వాడిని.)
ఇలాటి సమస్యలని ఎంత బాగా డీల్ చేసామా అనే దానిమీద పిల్లల వ్యక్తిత్వపు నిర్మాణం జరుగు తుంది.
**
ఆ తర్వాత ఒక సారి ఒక సివిల్స్ టాపర్ ఇంటర్వ్యూ చదివాను. అప్పటిదాకా ఎదిగే నా పిల్లలని ఈ సమస్య తలెత్తకుండా ఎలా పెంచాలా అనే ఆలోచన నన్ను కలవర పెడుతూ ఉండేది.
ఆ ఇంటర్వ్యూ లో ఆమె తన తండ్రి అనుసరించిన ఒక పద్దతి గురించి చెప్పారు. సరిగ్గా నేనూ అదే ఆచరించాను.
**
పుల్ల ఐసు అర్దరుపాయి అమ్మే రోజుల్లో మా పెద్ద పిల్లలిద్దరికి చెరో చిన్న పుస్తకం చెరో యాబై రూపాయలు ఇచ్చేవాడిని. ఎంతయినా ఖర్చు పెట్టుకోండి. ఎందుకు ఖర్చు చేసారో ఈ పుస్తకం లో వ్రాయండి. డబ్బు ఖర్చు అవగానే నాకు ఈ పుస్తకం చూయించి మళ్ళీ యాబై తీసుకోండి. అని చెప్పాను. (అది ఇప్పుడు అయిదు అంకెల్లోకి మారింది.)
నేనెప్పుడు వాళ్ళు వ్రాసిన వాటిలో ఇదెందుకు? అని అడగలేదు. నాన్నకి చెప్పాలి అని అన్న ఆలోచన వారిని ఆలోచింపచేస్తుంది. మా పిల్లల ముగ్గురికి ఇదే పద్దతి అలవాటు చేసాను. ఆర్ధిక క్రమశిక్షణ తో నా పిల్లలు ఎదగటానికి ఇది తోడ్పడింది.
**
తండ్రి కి తెలియకుండా తల్లి పిల్లలకి డబ్బు ఇవ్వటం కరెక్ట్ కాదు (నా దృష్టిలో)
అది ప్రేమ కేటగిరి కింద అనిపిస్తుంది కాని కరెక్ట్ మాత్రం కాదు.
బ్రతకటానికి ఎక్కువ ఖర్చు కాదు. మరోకరిలా బ్రతకాలి అనుకున్నప్పుడే సమస్యలు. అసంతృప్తులు...
**

గురుదక్షణ

పొద్దుటే నేను నిద్ర లేచేసరికి మా వాడు వెళ్లి హైదరాబాదు నుండి వచ్చిన మా రెండో అమ్మాయిని పిక్ అప్ చేసుకు వచ్చాడు.
టీ తాగుతూ పేపర్ చదువుతుంటే... ఇద్దరు “హుష్ హుష్” అనుకుంటూ సైగలు చేసుకుంటున్నారు.
“బస్టాండ్ కి కారు తీసుకెళ్ళావా?” మా వాడిని అడిగాను.
అవునన్నట్లు నవ్వాడు.
“రిటర్న్ లో అక్క డ్రైవ్ చేసిందా?”
ఈ సారి జీవన నవ్వింది.
త్రోవలో ఎవరో స్కూటీ అతన్ని భయపెట్టి వచ్చిదట.
“జాగర్త గా డ్రైవ్ చెయ్యాలి గదా? హిట్ అయితే కేసు పొద్దుటే పోలిస్ స్టేషన్ కి వెళ్ళాల్సి వచ్చేది.”
“ఆతను కేసు పెట్టె అవకాశం లేదు.” అంది జీవన.
“తెలిసిన అతనా?”
“నాకు డ్రైవింగ్ నేర్పింది అతనే”

ఈ పెద్దోళ్ళున్నారే


కొత్తపట్నం లో ఉన్న తాబేలు పిల్లకి కి, పాకల ఎండ్రకాయ పిల్లాడికి కి స్నేహం కుదిరింది. 
రెండు బీచ్ లలోను అనేకం మాట్లాడుకున్నారు. ఇద్దరి మనసులు దగ్గరయ్యాయి. 
“మనం పెళ్లి చేసుకుంటే” అంది తాబేలు.
“మా ఇంట్లో ఏమి అభ్యతరం ఉండదు మీ నాన్న తోనే సమస్య” అన్నాడు పిల్లాడు.
“మా నాన్నకి నేనూ నచ్చ చెబుతాను” అంది తాబేలు పిల్ల.
**
“పాకల వాళ్ళు మొరటు వాళ్ళు . వాళ్ళ సంబంధం మనకి వద్దు. అసలు వాళ్లకి మనకి అసలు కుదరదు. సమస్య వస్తే అడ్డంగా పరిగెత్తి తొర్రల్లో దాక్కుంటారు. పిరికి సన్నాసులు”
పిల్ల బ్రతిమాలి మరీ తండ్రిని ఒప్పించింది.
“సరే నువ్వు ఇంతగా చెబుతున్నావ్ కాబట్టి ఒక్క సారి ఇంటికి రమ్మను మాట్లాడతాను. వచ్చే పౌర్ణమి సాయంత్రం”
తాబేలు పిల్ల ఆనందపడింది. తండ్రి అన్న మాటలని యదాతదం గా పిల్లాడికి చెప్పింది.
**
పిల్లాడికి రోషం వచ్చింది. తెల్లవారు ఝామునే లేచి పతంజలి యోగా తో మొదలెట్టి ఖఠోర వ్యాయామాలు చేసాడు. నెల తిరిగే సరికి నిలువుగా నడవటం ప్రాక్టీస్ చేసాడు.”
పౌర్ణమి వెన్నెల విరగ కాస్తుంది.
పిల్లాడు ఉన్నంతలో చక్కటి డ్రెస్సు వేసుకుని, జుట్టు కి నూనె పెట్టి క్రాఫ్ దువ్వుకుని నిలువుగా నడుచుకుంటూ వీలయినంత నాజుగ్గా పిల్ల ఇంటికి వచ్చాడు. పిల్ల ఆనంద పడింది.
తండ్రి ‘ఊ’ అనక తప్పని పరిస్థితి.
“నాన్నా..” అంది.
తండ్రి నొసలు చిట్లించాడు.
“ఛీ . నే చెప్పలా ?.. పుల్లుగా తాగి ఉన్నాడు చూడు. అడ్డదిడ్డంగా ఎలా నడుస్తున్నాడో..”

రొజూ జూకేనా ?

ఒక తాత గారు మనమడి తో కలిసి తన పాత కార్లో ఒక జింక పిల్లని కుడా తీసుకెళ్తున్నాడు.
మనమడు, జింక పిల్ల... వెనక సీట్లో ఆడుకుంటున్నారు.
దారిలో ట్రాఫిక్ పోలిస్ లు కారుని ఆపేశారు.
“జింక పిల్ల ఎక్కడిది?”
“ఏమో .. ఉదయం మా కాలనీ వెనక నున్న సరుగుడు తోట లో బుడి బుడి నడకలతో కనిపించింది. మా మనమడు చూసాడు. తెచ్చి పాల పీక సీసాతో పాలు తాపాము. షికారుకి వెళ్తున్నాము.”
“చుస్తే పెద్దవారిలా ఉన్నారు. వెంటనే జూ కి తీసుకు వెళ్ళండి”
“అలాగే.”
**
రెండో రోజు మళ్ళీ అదే ట్రాఫిక్ పోలిస్ అదే కారుని ఆపాడు.
వెనక సీట్లో బుడ్డోడు, జింక పిల్ల ఇంకాస్త దోస్తీ పెరిగింది.
“మీకేం చెప్పాను? జూ కి తీసుకువెళ్ళమన్నానా?”
“తీసుకెళ్ళాను. ఇవాళ బీచ్ కి వెళ్తున్నాం”
కారు అద్దాలు దించాడు మనమడు.

ప్రేమ అభిమానం

మందిరం లో హోమం నిర్వహించేటప్పుడు.. సుబ్బారావు చైనా పోన్ మ్రోగింది. 
రింగ్ టోన్ “పక్కా లోకల్ .. పక్కా లోకల్ “ అంటూ గయ్యిమంది. 
అందరూ అతన్ని వింతగాను, ఎబ్బెట్టుగాను చూసారు. 
సుబ్బారావు మొహం చిన్నబుచ్చుకోవాల్సి వచ్చింది. 
**
ఆ సాయంత్రం బార్లో కూర్చున్నప్పుడు మళ్ళీ ఫోన్ మోగింది.
జేబులోనుండి రెండో చేత్తో ఫోన్ తీస్తూ ఉంటె.. చేతిలో నిండు పేగ్ తోలికి పోయింది.
బేరర్ టిష్యు పేపర్ తో చొక్కా తుడిచాడు. టేబుల్ మరో సారి క్లీన్ చేసాడు.
వంగి ఫ్లోరింగ్ మీద పడిన మందుని శుభ్రంగా తుడిచేసాడు.
సారి చెబుతూ.. కాంప్లిమెంటరీ డ్రింక్ తీసుకు వచ్చాడు.
**
ఎక్కడ ప్రేమ అభిమానం దొరుకుతాయో మనం అక్కడి కే తరచు వెళ్ళటం మంచిది.
సుబ్బారావు ఇప్పుడే ఇంటి నుండి బయటకి వెళ్ళాడు..
ఆతను ఎక్కడికి వెళ్తున్నాడు అంటే..
మాకు తెలుసులే అంటున్నారా? సరే అయితే..  

ఇప్పుడిది మామూలే.

అర్దరాత్రి దాటి అరగంట అయింది.
పదిహేనువేల కిలోమీటర్ల దూరాన్ని మెసెంజర్ మాయం చేస్తూ ఉంది.
అరగంట సంభాషణ కి పుల్ స్టాప్ పెడుతూ అటునుండి అతను “గుడ్ నైట్ డియర్” అని ఒక టెక్స్ట్ ఒక లవ్ సింబల్. పంపాడు.
“అప్పుడేనా?.. ఏం తొందర?
“పన్నెండు దాటింది. ఇక నిద్ర పో.. “
“ఉహూ నిద్ర రావటం లేదు. నువ్వెప్పుడు ఇండియా వస్తావా? నన్నెప్పుడు   “
“ఊ...నన్నెప్పుడు .. పూర్తి చెయ్యొచ్చు కదా?”
“ఇప్పుడు దిండు ఉన్న చోట ఉంచు కుని “
“ ఊ ఉంచుకుని ...”
ఆటిన్ సింబల్స్,,, ఎర్రటి రెండు పెదాల బొమ్మ.
అటునుండి ఇంకొంచెం రొమాంటిక్ గా బొమ్మలు.
**
తెల్లవారఝామున పక్క కి వచ్చి పడుకుంటున్న మొగుడితో
“ఎందాకా వచ్చాడు మానవుడు?”
“పిచ్చెక్కి ఉన్నాడు. ఆర్నెల్ల కష్టం. మొత్తం చాట్ అంతా స్క్రీన్ షాట్స్ తీసి పెట్టాను. నీతో మాట్లాడిన ఆడియో ఫైల్స్, ఇవీ అన్నీ ఒక ఫోల్డర్ లో ఉన్నాయి. ఫోల్డర్ పేరు ‘యుఎస్ నైన్’.
“పడుకోండి రోజు ఇదో జాతర అయిపొయింది.”
“ఇంకెన్నాళ్ళు భారీ టెండర్ ఒకటి పెడదాం. కొన్నాళ్ళు ఫోన్ తీయకు. చాట్ చేయకు. ఒక రెండు వారాల తర్వాత నీ ప్రాపర్టీ బ్యాంకు ఆక్షన్ కి వస్తుంది. డబ్బు అడ్జెస్ట్ కాదు. ఇబ్బందుల్లో ఉంటావు. ఈ వత్తిడి లో ఉన్నాను అని మెసేజ్ పెడతావు. అటునుండి నీ ఎకౌంటు నెంబరు అడుగుతాడు.. ఉహు మీకెందుకు నా సమస్యలు అంటావు. నీ వన్నీ నావి కావా అంటాడు” అన్నీ నావి అనే పదాలు నొక్కి పలికి నవ్వాడు.
“ఏడిసాడు. చింపాంజీ మొహం గాడు. పట్టపగలు చక్కటి పెళ్ళాన్ని ఇంట్లో ఉంచుకుని బెడ్ రూమ్ లో నుండి చాటుగా ఫోన్ లో చొంగ కార్చుకునే రకం.”
“అంత వలకబోస్తున్నాడా?”
“అబ్బో .. పక్కోడి తిండి మీద ఎంత యావో.. ఈ కొజ్జా వాళ్లకి. తొందరగా ఫైల్ క్లోజ్ చేద్దాం. డిసెంబరు లో ఇండియాకి దిగబడతాడట.”
“కొత్త బకరాని వెతుకుతున్నాను. వాడిని లైన్ లో పెడదాం. వీడిని క్లోజ్ చేద్దాం.”

పిచ్చిది


మతి స్థిమితం లేని చిపిరి జుట్టు తో ఉన్నావిడ మార్కెట్ వద్ద తిరుగుతూ ఉంది.
వంటి మీద దుస్తులు పట్ల గాని, చిక్కు పడ్డ జుట్టు మీద గాని ఆమెకి శ్రద్ధ లేదు.
పార్కింగ్ లో తన వెహికల్ ఉంచేటపుడు ప్రమీల ఆవిడని గమనించింది.
వారం లో ఒక్క శుక్రవారం రోజు మార్కెట్ కి వస్తుంది ప్రమీల.
వారానికి సరిపడా కూరగాయలు తీసుకుంటుంది.
బెంగుళూరు లో పని చేస్తున్న భర్త కార్తీక్ శని, ఆది వారాలు వీకెండ్ కి మాత్రమే వచ్చి పోతుంటాడు.
యాడాది గా చేస్తున్న బదిలీ ప్రయత్నాలు ఏమాత్రం ఉపయోగపడటం లేదు.
ప్రమీల ఐ టి హబ్ లోనే ఉంది. స్వంత ఫ్లాట్.
తనకి కావాల్సిన వి కొనుక్కుని పార్కింగ్ లో ఉన్న స్కూటివద్దకి వస్తున్నప్పుడు గమనించింది ఆవిడని మళ్ళీ ..
ఎవరో ఒకతను రెండు అరటి పళ్ళు చేతి కి అందించాడు.
ఆమె ఆతను ఇచ్చిన అరటిపళ్ళు దూరంగా విసిరేసింది.
**
స్కూటి తీస్తుంటే ఫోన్ మోగింది. “మాలతి కాలింగ్”
ఆమె నవ్వుకుంటూ “చెప్పు రాకేశ్” అంది.
పది నిమిషాలు గుస గుసలు అయ్యాయి.
“రేపు కార్తీక్ వస్తాడు. రెండు రోజులు ఫోన్ చెయ్యకు. గుర్తుంచుకో”
ఆగి సెల్ లో కాల్ డేటా క్లియర్ చేసి బండి స్టార్ట్ చేసింది.
**
మతి స్థిమితం లేని ఆవిడ కువ్వ పోసిన వ్యర్ధాల నుండి చేతికి అందిన కాయ తీసుకుని నోట్లో ఉంచుకుంది.
చూడటానికి కుడా ఇబ్బంది గా ఉందా దృశ్యం.
ప్రమీల కి వళ్ళు జలదరించింది.

అన్నపూర్ణ.

రెండు ఇడ్లీలని చట్నీ నంచుకు తింటూ ప్రపంచాన్ని జయిస్తున్నట్లు గా ఆనందిస్తుంది తను.
అడుగు ఎత్తుతో ఉన్న నాప బండ మీద రెండు వైపులా కాళ్ళు వేసి కుర్చుని ఇడ్లీలని ఆస్వాదిస్తూ ఉంది.
కొంచెం శ్రద తక్కువగా పెరుగుతున్న పిల్ల. సన్నగా ఉంది. 
నాలుగు అయిదు ఏళ్ళు మించవు.
దగ్గరలో ఉన్న వర్కింగ్ క్లాస్ ఇంటి పిల్లలా ఉంది.
ఎందుకో తెలీదు చూడగానే నచ్చేసింది.
అరడుగు మించని పాదాలకి, మరో రెండు అంగుళాలు పెద్దవి గా ఉన్న ప్లాస్టిక్ చెప్పుల్ని వేసుకుని కుర్చుని ఉంది ఆ పాప.
చెప్పులు బావున్నాయని పరిచయం గా చెప్పాను.
“ మా అమ్మవి “ అంది.
ఊరి చివర గా ఉన్న ఆ చిన్న హోటల్ లో కారం కొంచెం తక్కువగా వాడతారు.
వర్కింగ్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఎప్పుడూ ఉదయం టిఫిన్ అక్కడే చేస్తుంటాను.
నేనూ ఇడ్లీ తినేసరికి, తను శుబ్రంగా ఆకులో ఉన్న చట్నీతో సహా తినేసింది.
“గుడ్డు దోశ తింటావా?” అడిగాను.
“ఉహు” అంది.
చేతిలో పది రూపాయల కాగితం చూపించి
“మా తమ్ముడి కి రెండు ఇడ్లీల పొట్లం తీసుకెళ్ళాలి” అంది.
ఈ లోగా హోటల్ ఆవిడ ఒక ఉల్లి దోశ, మరో గుడ్డు దోశ తీసుకు వచ్చింది.
ఉల్లి దోశ తీసుకుని పాప వైపు చూయించాను.
తనముందు ఉంచిన దోశ ని ఆశగా చూస్తూ "నా దగ్గర డబ్బులు లేవు" అంది.
“ఇవాళ నా పుట్టిన రోజు అందుకే నీకు పార్టీ ఇస్తున్నాను. తినేసేయ్.” నవ్వుతూ చెప్పాను.
“నిజమా?” అంది ఆ పిల్లది. అవునన్నట్లు గా చూసాను.
ఆ హోటల్ పక్కనే ఉన్న చిన్న గుడి ని చూయిస్తూ “గుడి కి వచ్చావా?” అంది.
చాలా సార్లు వచ్చినప్పటికీ ఆ మలుపు లో ఉన్న చిన్న దేవాలయాన్ని పరీక్షగా గమనించలేదు.
“అవును” అన్నాను.
“సగం తిని సగం మా తమ్ముడికి తీసుకువెళ్తాను” అంది.
“తమ్ముడా? వాడు కూడా మన పార్టీ నే. ఇంకోటి పొట్లం కట్టిద్దాం. నువ్వు ఇది తినేసేయ్”
అన్నట్లు మా కొత్త ఫ్రెండ్ పేరు చెప్పలేదు కదూ.. అన్నపూర్ణ.

మట్టి గాజులు


అపర్ణ అటో దిగి ఫోన్ మాట్లాడుతూ ఎనిమిది అంతస్తుల అపార్ట్ మెంట్ ప్లాట్ లోకి వెళ్తూ ఉంటే, రోడ్డు మీద 'తోపుడు బండి' మీద మట్టిగాజులు అమ్ముతూ ఒక పదిహేను పదహారేళ్ళ పిల్ల కనిపించింది.
ఒక్క క్షణం ఫోన్ మాట్లాడటం ఆపి రంగు రంగుల డిజైన్ గాజులు చూస్తుంటే... 
“ఇవి కొత్త గా వచ్చాయి అక్కా.. తళుకుల గాజులు నీకు బాగుంటాయి.” అంది ఆ అమ్మాయి.
అపర్ణ ‘అక్కా’ అన్న ఆ పిల్లవయిపు.. తరువాత బండి మీద గాజుల వైపు చూసింది.
గాజులు నిజంగానే బాగున్నాయి.
బాగా నచ్చిన ఒక డజను డిజైన్ గాజులు ఎనబై కి బేరం చేసి రెండు వందల నోటు ఇచ్చింది.
ఒక ప్లాస్టిక్ పెట్టెలో ఉన్న చిల్లర నోట్లు లెక్కపెట్టి గాజుల తో పాటు ఇచ్చింది ఆ అమ్మాయి.
**
ప్లాట్ లోకి వచ్చాక గాజుల తో పాటు ఆ అమ్మాయి పొరపాటుగా మరో పది రూపాయలు ఎక్కువ ఇచ్చినట్లు గా గమనించింది. అపర్ణ.
వంటగది సర్విస్ నుండి చూస్తే ఆ పిల్ల బండి ఇంకా అక్కడే ఉంది. గట్టిగా కేక వేస్తే వినబడే దూరం లో ఉంది. పక్కనే ఉన్న వాచ్ మెన్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నాడు.
మురికిగా ఉన్న ఆ అమ్మాయి “అక్కా’’ అని పిలవటం గుర్తొచ్చి లోపలి వచ్చి వంట పనిలో పడింది.
**
అరగంట తర్వాత కాలింగ్ బెల్ మోగింది.
అపర్ణ తలుపు తీసింది.
గాజులమ్మాయి.
“అక్కా” అని మళ్ళీ అదే పిలుపు.
ఏమిటన్నట్లు చూసింది.
“దాదాపు అన్నీ ఫ్లాట్ లు తిరిగానక్కా.. నీకోసం.”
ఆ అమ్మాయి చేతిలో అపర్ణ ఫోను ఉంది.

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...