Sunday, 29 December 2019

దేవుడు ఎప్పుడూ గుడి లోనే ఉండడు.


పాలక్కడ్ (కేరళ) లో ఉండే ఒక పందొమ్మిదేళ్ళ కుర్రాడు జయక్రిష్ణన్ మూడేళ్ళ వయసప్పుడు తల్లి తండ్రిని ఒక ప్రమాదం లో కోల్పోయాడు.
మిగిలిన పూరి ఇంట్లో నానమ్మ పిల్లాడిని చాకింది. తినీ తినకా కూలి నాలి చేసుకుని వాడిని చదివిస్తూ ఉంది. 2007 లో జయక్రిష్ణన్ తన ప్లస్ వన్ (ఇంటర్ మొదటి సంవత్సరం) చదివేటప్పుడు అతని శరీరం లో మార్పులు మొదలయ్యాయి.
అతని #కధ మొదలయ్యింది.
హటాత్తుగా బరువు పెరగటం, కాళ్ళు వాయటం, మొహం వాపు, నిద్ర లేచేసరికి కళ్ళు కనిపించక పోవటం ...
పాలక్కడ్ ప్రభుత్వ ఆస్పత్రి లో రక్త పరీక్ష చేసారు. జయక్రిష్ణన్ కి ereatinine నిల్వలు పెరుకుపోవటం (కిడ్నీ సరిగా పనిచేయక పోవటం వల్ల వ్యర్ధాలు పేరుకు పోవటం) జరిగిందని అత్యవసరం గా వైద్య సాయం అందాలని...
అప్పటికే అనాధ అయిన జయక్రిష్ణన్ చదువు ఆపేయవలసి వచ్చింది.
నాయినమ్మ తాము ఉంటున్న ఇంటిని బంధువుల వద్ద తాకట్టు పెట్టి వైద్యం చేయించడం మొదలెట్టింది.
కాని అంతంత మాత్రపు వైద్యం అతనికి ఉపయోగ పడక పోగా కాళ్ళు చచ్చుపడి నడవ లేని స్థితికి చేర్చింది.
వెంటనే డాక్టర్లు డయాలసిస్ కి అతన్ని మార్చేసి ముసలావిడకి చెప్పేశారు. #కిడ్నీ ని వెంటనే మార్చాలి. లేకుంటే అతన్ని మర్చి పోవాలి.
**
వాళ్ళ వాడ లోనే ఉండే 'విష్ణు' అనే వ్యక్తి డయాలసిస్ కి ఆర్ధిక సాయం చేసేవాడు. అదృష్ట వశాత్తు ఆతను ‘దయా చారిటబుల్ ట్రస్ట్ ‘ లో ఆక్టివ్ మెంబర్.
నిరుపేదల సాయం కోసం పని చేసే ట్రస్ట్ అది.
విష్ణు ట్రస్ట్ లో సభ్యులకి జయక్రిష్ణన్ అసహాయ పరిస్థితి తెలియపరిచాడు. వెంటనే ఆ సంస్థ జయక్రిష్ణన్ ఇంటికి చేరింది.
జయక్రిష్ణన్ వైద్యం ఖర్చులు భరాయించేందుకు ట్రస్ట్ ముందుకు వచ్చింది. జయక్రిష్ణన్ దగ్గరి బంధువులని కిడ్నీ డొనేషన్ చెయ్యమని అడిగింది. కిడ్నీ దానం చేసిన వారికి ఒక మంచి ఇల్లు నిర్మించి ఇస్తామని, మంచి ఉద్యోగం చూయిస్తామని ప్రామిస్ చేసింది.
అప్పటిదాకా బండువులం అని చెప్పుకున్న వాళ్ళు కూడా మొహం దాచేశారు.
ఏమీ చెయ్యటానికి పాలు పోనీ స్థితిలో ట్రస్ట్ మెంబర్ ఒకరు తన ఫేస్బుక్ వాల్ మీద జయక్రిష్ణన్ దీన గాధ ని వ్రాసాడు.
దేవుడు ఎప్పుడూ గుడి లోనే ఉండడు.
కొట్టాయం లో ఉండే HR ప్రొఫెషనల్ 47 ఏళ్ల శ్రీమతి 'సీత దిలీప్' ఈ పోస్ట్ చదివింది. భర్త తో తను జయక్రిష్ణన్ కి కిడ్నీ దానం చేస్తానని చెప్పింది.
ప్రతి మనిషికి తన శరీరం మీద సర్వ హక్కులు ఉంటాయి. అవయవ దానం అనేది నీ వ్యక్తిగతం. నేను అబ్యంతర పెట్టను. కాని దీనికి చాలా ఓర్పు. సహనం కావాలి. కొన్ని త్యాగాలు కూడా చెయ్యవలసి ఉంటుంది. వాటన్నిటికీ నువ్వు సిద్దపడితే నాకు ఏమాత్రం అబ్యంతరం లేదు అని చెప్పాడతను.
మరు క్షణం ఆమె తన అభిప్రాయాన్ని స్థిరంగా మరో మారు చెప్పింది.
ఆమె భర్త తో పాటు ట్రస్ట్ ని కలిసింది.
అమృత ఆసుపత్రి లో క్రాస్ మ్యాచ్ టెస్ట్ లు జరిగాయి. దాత వి పేషంట్ వి బ్లడ్, టిస్యు లు అనేక సార్లు మ్యాచ్ చేసి చూడాల్సి వచ్చింది. వయసులో చిన్న వాడయిన అబ్బాయికి కిడ్నీ ఇవ్వటానికి ఆమె తన శరీరాన్ని శ్రమ కి గురి చెయ్యాల్సి వచ్చింది. ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సి వచ్చింది. చివరికి తన ఉద్యోగాన్ని వదిలెయ్య వలసి వచ్చింది. 2019 మే నుండి నవంబరు వరకు అనేక సార్లు క్రాస్ మాచ్ పరిక్షలు జరిగాక డిసెంబరు 10 తేది కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది.
ఈ లోగా ట్రస్ట్ వైద్యానికి అవసరం అయిన డబ్బు ని దాతల సహకారం తో ఏర్పాటు చేసింది. ఆసుపత్రి ఖర్చులకి 8 లక్షలు మిగిలిన ఖర్చులు కలసి మొత్తం 15 లక్షలు సంస్థ సేకరించింది.
డిసెంబరు 8 తేదిన సీతా & దిలీప్ లు తమ 23 వ వివాహపు వార్షికోత్సవాన్ని ఆసుపత్రి లోనే జరుపుకున్నారు.
అనేక మంది బంధువులు, స్నేహితులు భయపెట్టినా, నిరుత్సాహ పరచినా వేటికి వెరవకుండా #సీత జయక్రిష్ణన్ కి పునర్జన్మ ని ప్రసాదించింది.
జయక్రిష్ణన్ మరో మూడు నెలలు ఆ #తల్లి #సీత తో పాటు కొచ్చిన్ లో ఉంటాడు.
పాలక్కట్ లో జయక్రిష్ణన్ & నాయినమ్మ కోసం మంచి పరిసరాల్లో ఒక చిన్న ఇంటిని ఏర్పాటు చేసే పని దయా చారిటబుల్ ట్రస్ట్ తీసుకుంది.
**
ఎవరు చెప్పారు దేవుళ్ళు గుళ్ళోనే ఉంటారని??



Sunday, 27 October 2019

my hope


కాలు పాకుడు రాళ్ళ మద్య జారి పోయింది. తిరిగి తీసుకోవటం వీలవలేదు. రెండు రాళ్ళ మద్య ఇరుక్కు పోయింది. ప్రవాహం నడుం లోతు దాటింది. వాగు దాటటానికి సాయం గా తెచ్చుకున్న కర్ర సగానికి విరిగి పోయింది. బలంగా లాగిన కాలు మెలిపడి బయటకి వచ్చింది. క్షణాల్లో వాపు.
రెండడుగులు వేసే లోపు విపరీతమయిన నొప్పి..
ప్రవాహం పెరుగుతూ ఉంది. చలి వణికిస్తూ ఉంది. చీకటి కమ్ముకుంటుంది.
శక్తినంతా కూడదీసుకుని మరి కొద్ది అడుగులు ...
ఒకటి .. రెండూ... మూడు... నా... నాలుగు ... అయ్ .. అబ్బా..
రెండో కాలికి బలంగా చుట్టుకున్న తామర తూడు..
వాగులోకి జారి పోయిన శరీరం..ఉదృతం గా ప్రవహించే నీళ్ళు...
ఉహూ కష్టం.. ఇక నావల్ల కాదు.. ఎప్పుడో నను వీడి పోయిన నాన్న గుర్తుకొచ్చాడు.
తెల్లటి పంచె.. చేతిలో బెత్తం.. “వాసూ” అంటూ అదే పిలుపు..
నాన్నా.. ఇక నా వళ్ల కాదు. నేను వస్తున్నాను... వచ్చేస్తున్నాను..
**
ఎక్కడినుండో వెలుగు ..
రెండు కళ్ళ నుండి ధారాళంగా... వెలుగు  చూపు..
చాచిన చేతుల నుండి ప్రసరిస్తున్న వెచ్చటి స్పర్శ...
నేర్పుగా విసిరిన పాశం
ఒడ్డుకి లాగిన బలమయిన చేతులు...
స్పృహ తప్పుతుంటే.. దగ్గరగా వచ్చిన పరిచయం అయిన మొహం..
“సాయీ ... నువ్వే నా..”

Wednesday, 28 August 2019

వెంకట్రావ్ ఆగు తొందర పడకు

“అర్జంటుగా ఇటు రండి” కేక వేసింది ఇంటావిడ.
హడావిడిగా వెళ్లి చూద్దును గదా రెండో ఫ్లోర్ బాల్కనీ లో ఉంది ఈవిడ
“ఏమయింది?”
వెనక అపార్ట్ మెంట్ చూపిస్తూ “ మూడో ఫ్లోర్ లో మీ ఫ్రెండ్ వెంకట్రావ్ ని చూడండి. నా కెందుకో అనుమానం గా ఉంది”
అప్పుడే గమనించాను. సాయంకాలం చీకటి మొదలవుతుంది.
వాడి ఫ్లాట్ లో వెనుక పోర్చ్ చివరి కొచ్చి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ముఖం లో విపరీతమయిన విసుగు.
మాట్లాడుతూ ఎదో ఎత్తు బల్ల ఎక్కాడు. అక్కడి నుండి కనీసం నలబై అడుగులు ఎత్తు. అక్కడి నుండి జారితే నేరుగా బయట అపార్ట్మెంట్ కాంపౌండ్ వాల్ కి ఉన్న గేటు మీద నిలువుగా ఉన్న శూలాలు లాటి చువ్వలు మీదికి ..
“నా ఫోన్ తీసుకురా వాళ్ళ ఇంట్లో వాళ్లకి చెబుతాను .త్వరగా”
“ రేయ్ వెంకట్రావ్ .. ఏం చేస్తున్నావు?” పెద్దగా కేక పెట్టాను.
ఈ లోగా మా ఆవిడ ఫోన్ తెచ్చింది. వెంకట్రావు ఇంట్లో ల్యాండ్ నెంబరు కి ఫోన్ చేసాను. రింగ్ అవుతుంది.
“పాపం ఈ మద్య ఎవరో ఫైనాన్షియర్ మోసం చేశాట్ట.. ఎదిగిన ఆడపిల్ల ఉంది. ఏవో ఆర్ధిక సమస్యలు ఉన్నట్లు మొన్ననే చాకలమ్మాయి చెబుతుంది.” వెనక నుండి మా ఆవిడ ముక్కలు ముక్కలుగా చెబుతుంది.
“రేయ్. వెంకట్రావ్...” మళ్ళీ గొంతు పెగుల్చుకుని అరిచాను.
ఈ సారి వాడు నా వైపు చూసాడు. స్టూలు చివరికి వచ్చాడు. తనకి గోడకి మద్య అడుగు, అడుగున్నర మించి స్థలం లేదు.
ఫోన్ చెవి దగ్గర నుండి తీయకుండానే “ఏమిటి?” అన్నట్లు చూసాడు.
“రేయ్. తొందర పడకు... నీకు మేమున్నాం. నేను వస్తున్నాను. తొందర పడకు.” ల్యాండ్ లైన్ ఇంకా మోగుతూనే ఉంది. ఎవరూ లిఫ్ట్ చెయ్యలేదు.
ఒక్క నిమిషం ఫోన్ పక్కకి పట్టుకుని “అర్ధం కాలేదు” అని అరిచాడు.
చాలు. మాట్లాడితే చాలు ఇంకా వాడిని ఆపగలను.
"వెంకట్రావ్ ఆగు తొందర పడకు  .. నీకు తోడుగా మేము ఉన్నాం. మన భాస్కర్ గాడు, శ్రీవాత్వవ మేమంతా ఉన్నాం .. కూర్చుని మాట్లాడదాం. తొందరపడకు..”
..
..
..
..
..
..
..
..
మీది కూడా BSNL నెట్ వర్కేనా?” వెంకట్రావ్ పెద్దగా అరిచి అడిగాడు. 

Saturday, 6 July 2019

అమ్మాయేగా?

చలమయ్య వాకింగ్ నుండి వచ్చేసరికి జయమ్మ జొన్న రొట్టెలు చెయ్యటానికి పిండి సిద్దం చేస్తూ ఉంది.
కుర్చీ లో కూర్చుని షూ విప్పి ముందు గది లో ఉన్న రాక్ లో సర్ది, సాక్స్ తీసుకుని ప్లాస్టిక్ బాగ్ లో వేసి, వెళ్లి ఉతకాల్సిన బట్టల పక్కనే ఉంచి, చేతులు కాళ్ళు కడుక్కుని వచ్చి సోఫా లో కూర్చునే సరికి, చేతిలో రాగి గ్లాసులో నీళ్ళు తీసుకు వచ్చింది జయమ్మ.
గడియారం లో గంటల ముళ్ళు ఏడు వద్ద ఉంది.
ఇది దైనందికం. చలమయ్య ఖచ్చితమయిన మనిషి.
ఆర్మీ నుండి రిటైర్ అయ్యాక ఒక బ్యాంకు లో సెక్యూరిటీ గార్డు గా చేరాడు. ప్రబుత్వం ఇచ్చిన పొలం ఆతను రిటైర్ అయ్యేసరికి స్థలం గా మారింది.
కొంత స్థలం ఒక బిల్డర్ కి డెవలప్మెంట్ కి ఇచ్చి పది ఫ్లాట్స్ తీసుకున్నాడు. అయిదు అమ్మేసుకుని నెలసరి ఆదాయం వచ్చేట్టు మ్యూచువల్ ఫండ్స్ లో పొదుపు చేసుకుని మరో నాలుగు అద్దెకి ఇచ్చుకున్నాడు.
రెగ్యలర్ వ్యాయామం, పల్లెటూరి తిండి జయమ్మ ఇద్దరు కొడుకులు వెరసి ఒక చక్కటి ప్రణాళికతో ఉండే కుటుంభం చలమయ్యది.
**
మీరేవరయినా కొత్త వాళ్ళయి అతని గురించి నేను పరిచయం చేసిన మాటలు మాత్రమె తెలుసుకుని అతనితో మాటలు కలిపారంటే.. మీకు దెబ్బడి పోవటం ఖాయం.
ఏమయినా అడగండి. “మీకు ఎంతమంది పిల్లలు?” అని మాత్రం అడక్కండి.
“ఒక్కడు. ఒక్కడే” అని సమాధానమూ మరియూ లోపలి గది లో నుండి జయమ్మ నిట్టూర్పు వినబడుతుంది.
మీరు మరీ ఆసక్తిగా హల్లో కి తొంగి చూసారనుకోండి.
గోడ మీద ఒక ఆరోగ్యమయిన కుర్రాడు పక్కనే బురఖా లో ఉన్న అమ్మాయి, ఇద్దరి మెడ లకి పూల హారాలు ఉన్నది పెద్ద పోటో ఒకటి కనబడుతుంది.
ఇంకొంచెం పరీక్షగా చూస్తే బురఖా పిల్ల మొహం మీద ఒక కాగితం అంటించి ఉండటం దానిమీద ‘రాబందు’ అనే అక్షరాలూ ఉండటం కూడా కనిపిస్తుంది
.
అంతటితో మీరు మెడ వెనక్కి లాక్కొండి.
లేదా మీ టైం బాలేక “ ఆ ఫోటో లో అబ్బాయేనా?” అని అడిగారో మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు.
మీ బతుకు ఒక పార్టీ అభిమానుల పోస్ట్ రెండో పార్టీ సోషల్ మీడియా వాళ్ళ చేతుల్లో నలిగి నట్లు నాశనం అయి పోవాల్సిందే.
**
“కిరణ్ ఎక్కడ?” జయమ్మని అడిగాడు.
బెడ్ రూమ్ వైపు చూపించింది. ఆవిడ.
“వాడు కూడా తగలడ్డాడా?”
అడగాలా? అన్నట్టు చూసి ఆవిడ లోపలి వెళ్ళింది.
ఈ వాడు అనేవాడు #వెంకటేశం. కిరణ్ కి ఈ మధ్యే పరిచయం.
గడ్డం మీసాలు రాలేదు గాని వయసు బానే ఉంటుంది.
ఎర్రటి వళ్ళు నడుం వద్ద వంపు, బిగుతుగా ఉండే డ్రెస్ లు వేసుకుని తాడుమీద నడుస్తున్నట్లు, నడుం మీద బిందె తో తడిచిన చీర లో ఏటి ఒడ్డున నడిచే పిల్ల లాగా..... అదో రకం..
చలమయ్య కి ‘వెంకటేశం’ గాడు అంటే కచ్చ.
'అటూ ఇటూ కానోడి తో స్నేహం ఎంటిరా?' అని కొడుకుని చాలా సార్లు మందలించాడు.
కాని వాళ్ళ బంధాన్ని విడగోట్టలేక పోయాడు.
జైపూర్ లో ఆర్మీ లో మంచి పొజిషన్ లో ఉండే కిరణ్ కి ప్రతి మూడు నెలలకి ఒక నెల సెలవలు ఉంటాయి.
ఆతను ఇలా ఊర్లో కి అడుగు పెట్టీ పెట్టగానే వెంకటేశం తగులు కుంటాడు సారీ వచ్చేస్తాడు.
ఇక ఇద్దరూ సినిమాలు షికార్లు, పుస్తకాలు, రూముల్లో దూరి తలుపులు వేసుకోవటం, గంటల తరబడి ...
చలమయ్యకి గన్ పేల్చడం వచ్చు కాని అతనికి లైసెన్స్ ఉన్న గన్ను లేకపోవటం వెంకటేశం అద్రుష్టం గా చెప్పుకోవచ్చు.
హల్లో ఉన్న పేపరు అన్యమనస్కంగానే తిరగేసి కిరణ్ గది తలుపు తట్టాడు.
రెండు మూడు నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది.
వెం క టే శం ...
“వీడేడి?”
“నిద్రపోతున్నాడు మామయ్యా!” వెంకటేశం సమాదానం.
తెరిచిన తలుపు సందులో నుండి లుంగీ కట్టుకుని చొక్కా లేకుండా బోర్లా పడుకుని నిద్రపోతున్న కొడుకు కనిపించాడు.
"మామయ్యా అన్నావో మర్యాదగా ఉండదు."
చలమయ్య పళ్ళు కొరికిన శబ్దం కి వెంకటేశం నవ్వాడు.
**
హల్లో కి వచ్చిన చలమయ్య తో “జొన్న రొట్టెలు లు గుమ్మడి కాయ కూర చేసాను వేడిగా తింటారా?” అన్న జయమ్మ మాటలు వినబడలేదు.
టీవీ లో వస్తున్న ఒక ప్రోగ్రాం చూస్తుండి పోయాడు.
భర్త వద్ద నుండి ఏ సమాదానమూ రాక పోయేసరికి జయమ్మ హల్లో కి వచ్చింది.
ఒక సంప్రదాయబద్దం గా జరుగుతున్న పెళ్లి వేడుక ని ఆతను నోరు తెరుచుకు చూస్తున్నాడు.
రంగు రంగుల దీపాల అలంకరణ, నృత్యాలు, వంటలు, విందులూ మేళ తాళాలు, పురోహితులూ గొప్ప ఫోటోగ్రఫీ ..
కానీ .... దంపతులు ఇద్దరూ #మ_గ_వా_ళ్ళు.
కిరణ్ గది లో నుండి నవ్వుల శబ్దం వినిపిస్తుంటే చలమయ్య బార్యని ఉరిమి చూసాడు.
చేతికి అందిన రాగి గ్లాసు ని టివి మీదకి విసిరాడు.
**
#ఇక_చదవండి.
“మామీ జీ .. రేపు హాస్పిటల్ కి వెళ్ళి వచ్చి చెప్తాను.” మెల్లగా చెప్పింది ఫాతిమా..
“అర్జున్ ఏమి చేస్తున్నాడు?”
“నిద్ర పోతున్నాడు. లేపనా?”
“వద్దులెమ్మా.. జాగర్త.. మరీ నీరసంగా ఉంటే చెప్పు. నేను ఈయనకి ఏదొకటి చెప్పి వస్తాను.”
జయమ్మ ఫోన్ కట్ చేసి వంట గదిలో నుండి బయటకి వచ్చే సరికి చలమయ్య హల్లో సోఫా లో దిగాలుగా కూర్చుని ఉన్నాడు.
“పాలు తోడు పెట్టటం మర్చిపోయాను. మీరెంటి నిద్ర పట్టలేదా?”
చలమయ్య కూర్చోమన్నట్లు చూసి,
అర్జున్ ఫాతిమా ఫోటో చూయించాడు.
“పక్కనే కిరణ్ పెళ్లి ఫోటో ఉన్నట్లు కలోచ్చింది.”
“మంచిదేగా?”
“ఏం మంచిది. కిరణ్ వెంకటేశం కలిసి ఒకే దండలో ఉన్న ఫోటో అది.”
“ఛీ .. ఛీ “ జయమ్మ చీదరించుకుంది.
"మన కిరణ్ అలాటోడేనంటావా? కాలేజీ రోజుల్లో స్నేహితురాళ్ళు ఉండేవాళ్లు కదే ? తీరా ఇప్పుడు వయాసొచ్చాక ఈ చండాలం మొదలయ్యింది.”
“అసలు తప్పు మనదే. మంచి సంభంధం చూడండి. ఈసారి వాడు శెలవలకి వచ్చే సరికి పెళ్లి చేసేద్దాం.” జయమ్మ భరోసా ఇచ్చింది.
“పెద్దోడు చూస్తే కులాన్ని బ్రష్టు పట్టించి, ఆ ముస్లిం పిల్లని చేసుకున్నాడు. పిల్ల చక్కటిదే కానీ. ఆ బూబెమ్మ కోసం కన్న తండ్రిని వదులుకున్నాడు. వీడు చూస్తే శిఖండి లాగా తయారయ్యాడు. ఛీ.. ఇద్దరు మొగ పిల్లలు నీకేమిరా అని అందరూ అంటుంటే ఆనందపడ్డాను. ఈ గాడిదలు అంతా ఆవిరి చేశారు.’
“మీరేం బాధ పడకండి. పెద్దాడి బార్య నీళ్ళు పోసుకుంది. మిల్టరీ వాళ్ళకి అంత తేలిగ్గా అర్ధం అయి చావదు. కోడలు ఫాతిమా నెల తప్పింది. “
చలమయ్య “నిజమా?” అన్నాడు ఆసక్తిగా..
“నీ కెలా తెలుసు?”
“మొన్న పెద్దోడి ఆఫీసు లో పని చేసే అమ్మాయి మార్కెట్ లో కలిసినప్పుడు చెప్పింది. “
**
మర్నాడు జయమ్మ తయారయ్యి బయటకి వెళ్తుంటే “ఎక్కడికి?” అని అడగలేదు చలమయ్య.
సాయంత్రం ఇంటి కి వచ్చే సరికి ఇంట్లో వాతావరణం మరింత వేడిగా ఉంది.
హల్లో సోఫాలో కిరణ్ కూర్చుని ఉన్నాడు. పక్కనే వెంకటేశం. దాదాపు వళ్ళో కూర్చున్నట్లు.
“అమ్మా కూర్చో. ఒక ముఖ్యమయిన విషయం మాట్లాడాలి.”
చలమయ్య కంపరం గా చూశాడు.
వెంకటేశం సిగ్గు పడ్డాడు.
కిరణ్ గొంతు సర్దుకుని “ పెళ్లి విషయం ..” అన్నాడు స్పష్టం గా..
వెంకటేశం సర్దుకుని... “ అసలు రెండు నెలల నుండి ఎలా చెప్పాలో అర్ధం కాక సతమతమయి పోయాం. కిరణ్ కి ఈ వారం తో క్వార్టర్లీ సెలవలు అయిపోతాయి. ఇక ఎప్పుడయినా తప్పేది కాదు...” వెంకటేశం మళ్ళీ సిగ్గు పడ్డాడు.
చలమయ్య ఈ చండాలం వినటానికే ఇంకా బతికి ఉన్నానా? అన్నట్లు బేలగా బార్య వైపు చూశాడు
“నా స్నేహితుడి చెల్లెలు #మేరీ అని బాగా చదువుకుంది. మంచి పిల్ల. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది.”
చలమయ్య కళ్ళు పెద్దవి చేశాడు. “మళ్ళీ చెప్పు.”
“మేరీ అని ఏజీ బీఎస్సీ చదివింది. మంచి సంస్కారం ఉన్న అమ్మాయి. మంచి ఫామిలీ.”
చలమయ్య గట్టిగా గాలి పీల్చి వదిలాడు.
“లక్షణం గా చేసుకో.. వెళ్ళి అన్నా వదినలనకి కూడా చెప్పు . వాళ్ళని ఇంటికి రమ్మను. వారం రోజుల్లో పెళ్లి చేసేస్తాను.”
వెంకటేశం లేచి ఎదురుగా ఉన్న కుర్చీ లో ఠీవిగా కూర్చుంటూ కుడిచేయి పిడికిలి బిగించి బొటన వేలు పైకి చూపించాడు.

Tuesday, 30 April 2019

టైం బ్యాంకు

నవీన్ కి ఆ పెద్దావిడ ఒక ప్రశ్నార్ధకం.
తను ఉండే సర్వీస్ అపార్ట్మెంట్ కి దగ్గరలోనే ఉంటుంది ఆవిడ. ఖరీదయినది కాక పోయినా సౌకర్యమయిన స్వంత ఇల్లు. విశ్రాంత ఉద్యోగి ఏదో స్కూల్ లో పని చేసినట్లు నవీన్ కి చెప్పింది కాని “స్విస్” స్లాంగ్ కి పూర్తిగా అలవాటు కాని నవీన్ కి ఆ స్కూల్ పేరు అర్ధం అవలేదు.
నవీన్ రొబాటిక్స్ లో 'ఎమ్మెస్' చేయటానికి వచ్చాడు. తన యూనివర్సిటీ దగ్గరలో మిత్రులతో పాటు సర్వీస్ అపార్ట్మెంట్ లో నివాసం.
అసలావిడ (రోజీ) తో పరిచయమే తమాషాగా జరిగింది.
మొదటి సారి సుమారుగా డెబ్బై ఏళ్ల వయసు లో ఉండే ఒక సన్నటి మగమనిషి తో డాక్టర్ ఆఫీస్ (హాస్పిటల్) వద్ద కనిపించింది.
రిసెప్షన్ లో అడిగే ప్రతి చిన్న ప్రశ్నకి అతన్ని అడిగి ఓపిగ్గా సమాదానం చెబుతుంది.
అతను మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. పెరాలసిస్ తో అతని నోటి నుండి వచ్చే మాట స్పష్టంగా లేదు. ఆమె ఓపిగ్గా అతని భావాన్ని డీకోడ్ చేస్తుంది. అది కాదు అతన్ని ఆశ్చర్యపరిచింది. చాలా చిన్న ప్రశ్నలకి కూడా ఆమె అతన్ని అడగటం.
భోజనం వేడిగా చేస్తారా? రాత్రి పూట తరచూ వాష్ రూమ్ కి వెళ్తారా? ఇలాటి మామూలు ప్రశ్నలకి కూడా అతన్ని అడిగి మరీ ఈవిడ చెప్పటం వింతగా ఉంది.
తర్వాత ఒక ఆదివారం పార్క్ కి వెళ్ళినప్పుడు వీల్ చైర్ ని నెట్టుక్కుంటూ అతనికి పార్క్ లో ఆడుతున్న పిల్లలగురించి నవ్వుతూ ఏదో చెబుతుంది.
ఆ చైర్ లో ఉన్న మనిషి లావుగా పూర్తి బట్టతల తో ఉన్నాడు. అతని కాలు ఒకటి సర్జరీ చేసి తొలగించినట్లు చూడగానే తెలుస్తుంది. ఇతను హాస్పిటల్ లో చూసిన #అతను కాదు. మరెవరో !!
**
నవీన్ కి 'రోజీ' మేడం ఇప్పుడొక ప్రశ్న.
ఆవిడని ఆసక్తిగా గమనించడం మొదలెట్టాడు.
తరచూ పలకరించు కోవటం మొదలయ్యింది.
ఆవిడ వయసు అరవై దాటిందనీ, సౌకర్యమయిన పెన్షన్ వస్తుందనీ.. ఏ ఆర్ధిక ఇబ్బందులు లేని ఒంటరి (విడో) అని తెలుసుకున్నప్పుడు అతని ఆశ్చర్యం రెట్టింపు అయింది.
“మిమ్మల్ని పార్క్ లో చూసాను. ఎవరినో వీల్ చైర్ లో తిప్పుతూ నవ్విస్తున్నారు.”
“ఓహ్ అతనా? రాబర్ట్ అని నాలాగే ఒంటరి జీవి. పిల్లలు ఉన్నారు. ఎల్లకాలమూ తండ్రి వద్ద గడపలేని జీవితాలు, జీతాలు. అతనికి ఆక్సిడెంట్. ఎండం కాలు తీసేయాల్సి వచ్చింది. వీలయినంత కాలం వాళ్ళు ఉండి వెళ్ళిపోయారు
అతను కూడా ‘టైం బ్యాంకు’ సభ్యుడు . వాలంటీర్ కోసం అప్లై చేసాడు.
నేను అటెండ్ అవుతున్నాను. రోజుకి రెండు గంటలు. అతని ఫ్లాట్ శుబ్రం చేసి, వంట చేసి పెట్టి, ఒక అరగంట కబుర్లు చెప్పి వస్తాను.
“టైం బ్యాంకు? కాలానికి కూడా ఒక బ్యాంకు ఉంటుందా?” అనుమానంగానే అడిగాడు నవీన్.
రోజీ నవ్వింది. " అవును ఉంది. డబ్బుతో అవసరం లేని బ్యాంకు. కేవలం సేవ మాత్రమే జమ/ఖర్చు చేసే బ్యాంకు. నేను డబ్బు కోసం ఈ పని చేయడం లేదు, నా సమయాన్ని 'టైమ్ బ్యాంక్ ' లో దాచుకుంటున్నాను. వృద్ధాప్యంలో, నేను కదలలేని పరిస్థితుల్లో తిరిగి వినియోగించుకుంటాను." అంది.
టైం బ్యాంకు గురించి చెప్పమని ఆవిడని ఆసక్తి గా అభ్యర్ధించాడు నవీన్.
టైమ్ బ్యాంక్ అనేది స్విస్ ప్రభుత్వ సామాజిక భద్రతా మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన వృద్ధాప్య పెన్షన్ కార్యక్రమం. ప్రజలు తాము యవ్వనంలో, ఆరోగ్యంగా ఉన్నపుడు వృద్ధులకు,అనారోగ్యంగా ఉన్నవారికి సేవలందిస్తూ, సమయాన్ని దాచుకొని, తిరిగి వారికి అవసరమున్నపుడు ఉపయోగించుకోవచ్చు.
దరఖాస్తుదారులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి, ప్రేమపూర్వక సంభాషణా నైపుణ్యం కల్గి ఉండాలి. ప్రతిరోజు వారి సేవలను కోరుకునే వారికి అందించగలగాలి. వారి సేవాకాలాన్ని వారి వ్యక్తిగత ఖాతాలలో సామాజిక భద్రతా మంత్రిత్వశాఖ జమ చేస్తుంది.
అలా ఆమె వారానికి రెండు రోజులు రెండు గంటల చొప్పున వృద్ధులకు సేవలందించడానికి వెళ్లేది.వారి గదుల్ని శుభ్రం చేయడానికి,సరుకులు తేవడానికి,వారికి సన్ బాత్ లో సహకరించడానికి, కొద్దిసేపు ముచ్చడించడానికీ సమయాన్ని కేటాయించేది.
అంగీకారం ప్రకారం సంవత్సరం తర్వాత టైమ్ బ్యాంక్ ఆమె/అతని సేవాకాలాన్ని లెక్కించి, 'టైమ్ బ్యాంక్ కార్డు'జారీ చేస్తుంది.
వారికి ఇతరుల సహాయం అవసరమున్నపుడు తమ కార్డును ఉపయోగించుకుని తమ ఖాతాలో ఉన్న సమయాన్ని ‘వడ్డీ’ తో సహా తిరిగి వాడుకోవచ్చు.. వారి ధరఖాస్తును పరిశీలించి, టైమ్ బ్యాంక్ ఒక వాలంటీర్ ను ఆమె ఇంటికి గానీ, ఆస్పత్రికి గానీ పంపుతారు.
అనుకోకుండా #రోజీ కీ ఒక ఇబ్బంది జరిగింది.
ఒకరోజు నవీన్ ఆమె ఇంట్లో కిచెన్ లో సాయం చేస్తుండగా ఆమె, కిటికీ శుభ్రం చేస్తుంటే స్టూల్ పై నుండి జారి పడింది.
నవీన్ క్లాస్సేస్ కి వెళ్ళకుండా వెంటనే సెలవు పెట్టి, ఆమెను హాస్పిటల్ కు తీసుకు వెళ్ళాడు.
ఆమె కాలు మడమ దగ్గర విరిగి, కొంత కాలం పాటు మంచం పైనే ఉండవలసి వచ్చింది. నవీన్ కొన్ని రోజుల పాటు ఇంటి పట్టునే ఉండడానికి సిద్ధమౌతుంటే, ఆమె ఏమీ దిగులు పడనవసరం లేదన్నది.
ఆమె అప్పటికే టైమ్ బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నది. ఆశ్చర్యకరంగా రెండు గంటల్లోపే ఆవిడకు సేవలందించడానికి టైమ్ బ్యాంక్ వాలంటీరును పంపించింది.
ఆ నెలంతా ఆ వాలంటీర్ ప్రతిరోజూ ఆవిడ బాగోగులు చూసుకుంటూ, రుచికరమైన వంటలు చేస్తూ, సరదాగా కబుర్లు చెబుతూ ఉండేది.
సరైన సేవల వల్ల ఆమె త్వరలోనే కోలుకుని, తిరిగి తన పనులు తాను చేసుకోవడం మొదలైంది. తానింకా ఆరోగ్యంగానే ఉన్నందున తిరిగి టైమ్ బ్యాంక్ లో మరింత కాలాన్ని నమోదు చేసుకుంటానంది ఆమె.
నవీన్ కి యునివర్సిటీ లో నేర్చుకునే దానికన్నా ఇదే విలువయిన విద్య అనిపించింది.
(ఈ రోజుల్లో స్విట్జర్లాండ్ లో వృద్ధులకు టైమ్ బ్యాంకులు సేవలందించడం అనేది సర్వసాధారణమైంది. ఈ విధానం దేశ భీమా ఖర్చుల్ని తగ్గించడమే కాక, అనేక సామాజిక సమస్యల్ని కూడా పరిష్కరిస్తుంది. స్విస్ ప్రజలు కూడా ఈ విధానానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ఒక సర్వే ప్రకారం సగం మంది స్విస్ పౌరులు ఈ విధానంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది. ప్రభుత్వం కూడా ఈ 'టైమ్ బ్యాంక్ 'విధానాన్ని చట్టబద్ధం చేసింది.)
ప్రస్తుతం ఆసియా దేశాల్లో కూడా క్రమంగా "ఒంటరి గూటి-వృద్ధ పక్షులు" పెరిగి పోవడం ఒక సామాజిక సమస్యగా మారుతున్నది.
దీన్ని మన దేశం లో అమలు చెయ్యటం అసాధ్యమా? ఒక ఆలోచన చేద్దాం.
HAPPY SUNDAY. _/|\_

విల్ పవర్


“విల్ పవర్ ఉండాలండీ విల్ పవర్” అంది మా ఆవిడ రెండు వారాల క్రితం.
దేనికో ఎసరు పెట్టినప్పుడు ప్రారంభ వాక్యాలు ఇలానే ఉంటాయి.
చేతికి ఇచ్చిన టీ కప్పులోకి తీక్షణం గా చూస్తుంటే ..
“ఏమిటి చూస్తున్నారు?” అంది సోఫాలో పక్కనే కూర్చుంటూ
“నువ్వు చెప్పింది కలిపావో లేదో అని” నవ్వాను.
“బానే ఉంది సంబడం. మన వీది లో మంచి నీళ్ళ టాంకర్ డ్రైవర్ తెలుసుగా?”
“అవును .. జాకీర్ వాళ్ళ పాప పెళ్ళికి పిలిసాడు. ఏం వండారే మటన్ బిర్యాని. నోట్లో వేసుకుంటే కరిగి పోయిందనుకో.”
“ఆహా మనుషులని గుర్తు పెట్టుకోటానికి ఏం ట్యాగ్ లు పెట్టు కుంటారు మహాను భాావా?”
“మళ్ళీ పలావ్ పార్టీ కి పిలిసాడా ఏమిటి?”
“అసలు ఎప్పుడూ నాన్ వెజ్ మీదే ఉంటుంది ద్యాస”
“నీకు తెలుసు కదా . ఇంట్లో వండితే తప్ప హోటల్ లో తినననీ”
“అవుననుకో .. ఇకనుండి ఇంట్లో కూడా నాన్ వెజ్ బంద్.”
“అదేంటే..అంత హఠాత్ నిర్ణయం .. రుణ మాఫీ లాగా దశలవారి ఉండాలి గానీ”
“నా కవన్నీ తెలీదు. బంద్ అంటే బంద్ అంతే. యాభై దాటాక నాన్వెజ్ మంచిది కాదంట మొన్న డాక్టర్ చెప్పాడు.”
“ఎవడా డాక్టర్.. నాగిరేడ్డేనా చెప్పు. అతను వాగెన్ ఆర్ రోడ్డు మీదే పెట్టి ఉంటుంది. ఆయిల్ ట్యాంక్ లో అర కేజీ చక్కర పోసి వస్తాను. దుర్మార్గుడు. అయినా నా కడుపు కొట్టినోడు ఏం బాగు పడతాడు."
“హోల్డాన్ హోల్డ్ ఆన్ .. ఆయన కాదు .. youtube లో చూసాను”
“ ఈ నెల నెట్ బిల్లు కట్టలేదే. ఇంకా కనెక్షన్ ఉంచాడా? బొచ్చు పీకిన కోడి మొహం వాడు.”
“మీరు ఎన్నయినా చెప్పండి. నో నాన్ వెజ్ ..దేనికయినా విల్ పవర్ ఉండాలి”
“ఇదుగో తినే తిండి దగ్గర నానా గాడిదలు చెప్పిన మాటలు వింటే విల్ పవర్ కాదు ‘విల్’ ఒక్కటే మిగులుతుంది.”
“డెసిషన్ ఈజ్ టేకెన్. నో అమెండ్మెంట్ అలోడ్”
“నీ ఇంగ్లిష్ కి నిప్పెట్ట. మనవడి కోసం నేర్చుకుంటున్నావా? లేక పొతే నా పొట్ట కొట్టటానికా? ఎన్నాళ్ళు ఈ మంకు?”
“ఎప్పటికీ”
“యాబై ఏళ్ళు పాలు పోసి పెరుగు పోసి, చికేనూ, మటనూ, చేపలు తిని పెంచిన వళ్ళు . తేడా కొడుతుంది. నీ ఇష్టం”
“ఏం లేదు విల్ పవర్ ఉండాలి. మీరు చెప్పిన ఆ జాకీర్ చిన్నప్పటి నుండి తాగేవాడట. వాళ్ళావిడ కి మాటిచ్చాడు టక్కున మానేసాడు.”
“వాడి బొంద .. వయసులో ఉన్నాడు. పెళ్ళాం తో కొంచెం ఎక్కువ పని ఉంటుంది కాబట్టి మానేసినట్టు ఒక బిల్డప్. అంతే. అవన్నీ మనసులో పెట్టుకోకు."
“కుదరదు.. ది మేటర్ ఈజ్ క్లోజేడ్ “ అంది కిరాతకంగా...
***
ఈ రోజు వస్తూ అరకేజీ తెచ్చుకున్నాను.
“అర్జంటుగా వండు. చపాతీలు చెయ్యి. ఇవాళ అటో ఇటో తేల్చుకోవాలి”
“చెప్పాగా వండేది లేదని. పనమ్మాయిని పిలిచి ఈ పాకెట్ ఇచ్చి పంపుతాను”
“ఉద్యోగం నుండి డిస్మిస్ చేస్తాను. ఊరినుండి మనవడు రాగానే”
“ఏం పర్లేదు. విల్ పవర్ ఉండాలి మనిషి అన్నాక.”
రోడ్డు మీద ఏదో గొడవ జరుగుతుంది. మేడ మీదికి వినిపిస్తుంది.
“వెళ్లి చూడు.” స్నానానికి వెళ్తూ చెప్పాను.
నైట్ డ్రెస్ తగిలించుకుని వచ్చే సరికి వంటింట్లో నుండి గుండమ్మ మార్క్ మషాలా వాసన గుమాయిస్తుంది.
“కింద గొడవ ఏమిటి?”
“ జాకీర్ వాళ్ళ ఆవిడ. గుడి దగ్గర పడి పోయిన అతని నెత్తిన బక్కెట్టు తో నీళ్ళు గుమ్మరించి మంత్రాలు చదువుకుంటూ ఇంటికి తీసుకుని వెళ్తుంది.”

రంగు కళ్ళద్దాలు

(ఒక్క సారి నలబై ఏళ్ల వెనక్కి వెళ్దాం )
రధానికి కట్టిన మోకులు రోడ్డు మీద సమాంతరంగా పరిచి ఉన్నాయి.
రధం మీద రంగనాయకుడు కొలువై ఉన్నాడు. పూలతో రధం నిండుగా ఉంది.
ఇరుసుకి కందెన పెట్టిన నిలువెత్తు చక్రాలు కదలటానికి సిద్దంగా ఉన్నాయి. చొప్పాలు (చక్రాల వేగం తగ్గించాడానికి బ్రేకుల లాటి త్రికోణం కొయ్యలు) పట్టుకుని గ్రామ కంసాలి కుటుంబం లోని మగ వాళ్ళు సిద్దంగా ఉన్నారు.
రెండు వైపులా మోకులు పట్టుకుని భక్తులు సిద్దంగా ఉన్నారు.
ఎర్రటి ఎండ ని ఎవరూ లక్ష పెట్టటం లేదు.
టైర్ బండి మీద పీపా తో తెచ్చిన నీళ్ళు తోవ పొడుగునా రోడ్డు మీద కారుస్తున్నారు.
రోడ్డు కి అడ్డంగా ఉన్న కరెంటు తీగలు కనెక్షన్ లు విప్పేసి తేరు (రధం) తిరగటానికి సిద్దం చేస్తున్నారు.
ఆకాశం వైపు అందరు ఆసక్తిగా చూస్తున్నారు.
అంతా సిద్దం.
బొబ్బలేక్కే కాళ్ళని ఎవరూ పట్టించుకోవటం లేదు.
నీడకి వెళ్లి తిరిగి వచ్చే సరికి మోకు లాగే అవకాశం మరొకరు లాగేసు కుంటారని ఎవరు కదలటం లేదు.
తలలోనుండి కారే చెమట కొత్త చొక్కాల్లోకి కారి పోతూ ఉంది.
నుదిటి సింధూరం బొట్లు ముక్కు మీదకి జారి పెదాలకి చేరుతున్నాయి.
రోశయ్య పంతులు తన పాత కాలం నాటి సైకిల్ తొక్కుకుంటూ అప్పుడే గుడి పక్కకి చేరాడు.
దిగి సైకిల్ ముందు కండవాచుట్టి పురికొస కట్టి ఏర్పాటు చేసిన సీటు మీది పిల్లాడిని కిందకి దించాడు.
అక్కడికి ఎనిమిది మైళ్ళ దూరం నుండి ఎండలో సైకిల్ తొక్కుకుంటూ వచ్చాడు. కాని నిజానికి ఎప్పుడో రావలసింది.
దారిలో సైకిల్ పంచరవటం దాన్ని బాగుచేయించు కుని రావటం వళ్ళ లేటయ్యింది
పిల్లాడిని దించ గానే కండవా విప్పి బుజాన వేసుకున్నాడు.
నడుముని ఉన్న మొలతాడు కి సైకిల్ తాళం కట్టుకున్నాడు.
తనవి పిల్లాడివి చెప్పులు తీసి సైకిల్ లజేజ్ స్టాండు కి కాగితం లో చుట్టి పెట్టాడు.
“ఇక పద”
“నాన్నా ఈ సారి నాకు కళ్ళ జోడు (అట్ట తో చేసి, రంగు కాగితం అంటించి రబ్బరు తల వెనక్కి తగిలించుకునేట్టు ఉండే బొమ్మ కళ్ళజోడు) కొనిపెట్టాలి.” పిల్లాడు అడిగాడు.
ఆ రోజు అది ఎన్నోసారో గుర్తే లేదు.
“ అలాగే “
“ఎర్ర రంగు ది. రబ్బరు గట్టిగా ఉండాలి “
“సరే రా ఖచ్చితంగా .. గుళ్ళోకి వెళ్లి స్వామి ని చూసి వచ్చి వెళ్ళేటప్పుడు అలాగే కొంటాను.”
రెండు అడుగులు వేసారో లేదో పిల్లాడు మళ్ళీ “నాన్నా” అన్నాడు.
“ఏమయింది?”
కాళ్లు కాలుతున్నట్లు కాలు మార్చి కాలు మీద గబా గబా నిలబడుతున్నాడు.
అయన వెంటనే పిల్లాడిని బుజం మీదికి ఎత్తుకుని కండవాతో అరికాళ్ళు అద్దాడు.
రంగనాధుడు తేరు మీదికి చేరడాన్ని అప్పటికే గమనించాడాయన.
పరుగు లాటి నడకతో గుడి ప్రవేశ ద్వారం వైపు నడిచాడు.
దారిలో కొబ్బరి కాయ, పూజా ద్రవాలు కొనుక్కుని తువాళ్ళో వేసుకుని గుడి లోకి నడిచాడు.
ధ్వజ స్థంభం చుట్టూ పిల్లాడి తో ప్రదక్షణలు చేసాడు.
గుడి చుట్టూ ప్రదక్షణలు చేసే చోట బండలు కాలి పోతూ ఉన్నాయి.
కొబ్బరి పీచు అక్కడక్కడా కాళ్ళు బొబ్బలు పోకుండా వేసి ఉన్నారు.
రంగానాధుని దర్శనం చేసుకుంటుంటే బజార్లో పెద్ద గా " #నారాయణ .. #నా#రా # #" అని వినిపించింది.
బక్తులంతా ముక్త కంఠం తో అరుస్తున్నారు.
రధం మీద అయ్యవారు ప్లేట్లో కర్పూరం వెలిగించి హారతి ఇవ్వసాగాడు.
మంగళ వాయిద్యాల మోత మొదలయ్యింది.
“అదుగో గరుత్మంతుడు.”
ఎవరో ఉద్వేగంగా అరిచాడు.
పిల్లాడిని ఎత్తుకుని కాళ్ళు రెండు తలకి రెండువైపులా వచ్చేట్టు కోర్చోబెట్టుకుని “వాసు చూడు అదిగో గరుత్మంతుడు. గుడి చుట్టూ తిరుగుతున్నాడు. ఇక రధం లాగుతారు.”
ఆయన రధం వద్దకి పరుగు లంకించుకున్నాడు.
అప్పటికే రద్దీ మొదలయ్యింది. గోల గోల గా నారాయణ అంటూ మోకు పట్టుకున్న వాళ్ళు లాగటం ఆకాశం లోకి మతాబులు పేల్చడం, రధం కదిలింది.
ఎవరో ‘హర హరా “ అన్నారు పెద్దగా.
అందరూ కోరస్ గా #హర #హరా అంటూ చెట్టు మాను సైజులో ఉన్న మోకులు బలంగా లాగారు.
ఒక్క కుదుపుతో రధం కదిలింది.
రధం మీద పసుపు ఉన్న ప్లేటు దొర్లింది.
గాలి గట్టిగా వీచింది. ఎవరో ఒక స్త్రీ జుట్టు విరబోసుకుని నాట్యం చేయటం మొదలయ్యింది.
మరెవరో బక్కేట్లతో నీళ్ళు గుమ్మరిస్తున్నారు.
రధం ఎటుపైపు లాగాలో ఒక పెద్దాయన గొంతు చించుకు అరుస్తున్నాడు.
చొప్పాలు వేసి రధం వేగం నియంత్రన చేస్తున్నారు.
అంతా 'నారాయణ' మయం. అందరూ ఎదో ఉన్మాదం లో ఉన్నారు.
రోశయ్య పంతులు పిల్లాడిని తల మీద నుండి దించకుండానే వచ్చి రధం మోకు పట్టుకోటానికి జనం లో దూరాడు.
గుంపులో అతికష్టం మీద చోటు చేసుకుని మోకు ముట్టుకున్నాడు. బుజం మీద బిడ్డ చేత ముట్టించాడు.
తోక్కుకుంటున్న జనం లోనుండి బయటకి వచ్చి దూరంగా ఒక చెట్టు కింద నిలబడి చేతులెత్తి రంగనాయకుని కి నమస్కరించాడు.
మొదలు పెట్టటం లేటే గాని గంటలో రధం నాలుగు వీధులు తిరిగి మళ్లీ గుడి ముందు దాని స్థానం లోకి వచ్చి చేరింది.
రధం తో పాటు ప్రదక్షణలు చేసిన గరుత్మంతుడు మాయం అయ్యాడు. సందడి సద్దు మణిగింది.
“నాన్నా కళ్ళ జోడు.” పిల్లాడు మళ్లీ మొదలెట్టాడు.
రోశయ్య పంతులు జేబులో చెయ్యి పెట్టాడు. అది #ఖాళీగా ఉంది.
పిల్లాడిని మోసుకుంటూ తను తిరిగిన ప్రతి చోట వెతకటం మొదలెట్టాడు.
ఆయనకి తెలిసిన వాళ్ళు కొందరు తారస పడ్డారు.
“ఏమయింది పంతులు గారు “
అయన ఆదుర్దాగా “నా డబ్బులు ఎనిమిది రూపాయలు ఉండాలి. ఇంకా చిల్లర కూడా, రెండు పావలాలు “
కాళ్ళు అరిగేలాగా తిరిగాడు. డబ్బు కనిపించ లేదు.
తిరునాళ్ళ లో పీచు మిఠాయి ని, గుర్రపు శాలని, రంగుల రాట్నాన్ని, చక్కర చిలకలని, బెల్లం మిఠాయిని, రంగు గోలీ శోదాలని, బూరలని, రక రకాల గాలిపటాలని, గిల్లక్కాయాలని, గోలీలని,
రేకు కప్పలని, చెక్క బొమ్మలని, కీ ఇస్తే డోలు కొట్టే కుందేలు బొమ్మని , చెరుకు గడలని, పిల్లాడు ఆశగా చూస్తూనే ఉన్నాడు.
తండ్రి డబ్బులు పారేసుకున్న సంగతి వాడికి అర్ధం అయింది. పిల్లాడికి కళ్ళద్దాలు కొనటానికి చిల్లరయినా మిగిలిందేమోనని జేబులు వెతికాడు.
“నాన్నా నాకు కళ్ళ జోడు వద్దు. చలివేంద్రం లో మంచినీళ్ళు తాగి ఇంటికి వెళ్లిపోదాం. నన్ను దించు ” అన్నాడు తండ్రి తో
***.
#సుశ్రీ 23-04-19

ఆచరణ


పూర్వం ఒక ధనవంతునికి చిన్న సమస్య వచ్చింది.
అతని కన్ను ఒకటి విపరీతంగా సలపటం మొదలయ్యింది. 
అతను వైద్యం కోసం అనేక మంది వైద్యులని సంప్రదించాడు. రక రకాల చిట్కాలు వాడాడు.
కాని ఫలితం లేక పోయింది.
చివరికి అతను ఒక గురువు ద్వారా మమునా తీరాన ఉన్న ఒక సాధువుని కలిసాడు.
కంటి భాధ చెప్పుకున్నాడు.
ఆయన పరికించి చూసి, యాడాది పాటు ఆకుపచ్చ రంగుని మాత్రమే చూస్తే ఉపశమనం కలుగుతుంది. అని చెప్పాడు.
దానికా ధనవంతుడు ఆశ్చర్యపోయాడు. వింతగా ఉన్న వైద్య సలహా ఆచరించడం తప్ప మరో మార్గం లేక పోయింది.
అతను ఇంటికి వెళ్ళిపోగానే పీపాల కొద్దీ పచ్చరంగు కొన్నాడు. నౌకర్లు కి పురమాయించి ఇల్లు, పరిసరాలు అంతా పచ్చరంగు పూయించాడు.
భార్యా పిల్లలకి పచ్చటి బట్టలు కుట్టించాడు, ముఖాలకి పచ్చటి పరదాలు.
పనివాళ్ళకి పచ్చటి బట్టలు. ఎటు చూసినా పచ్చటి రంగు మయం.
కొన్నాళ్ళు గడిచాయి.
సాధువు ఆ గ్రామం గుండా పోతూ ఈ ధనవంతుడిని పలకరించడానికి వెళ్ళాడు.
ప్రహరీ గోడ నుండి లోపలి అడుగు పెట్టగానే నౌకర్లు అతని మీద ఒక పీపా పచ్చ రంగు దోర్లించారు.
“కషాయం రంగు యజమాని కళ్ళకి కీడు చేస్తుంది. మొత్తం పచ్చగానే ఉండాలనేది ఆయన ఆజ్న”
సాధువు నవ్వాడు.
లోకాన్ని మార్చాలనుకోవటం భ్రమ. ముందు మనం మారాలి. మార్పు మనవద్ద నుండే మొదలవ్వాలి.
పచ్చరంగు అద్దం కంటికి అడ్డుగా ఉంచుకుని తలపాగా చుట్టుకుంటే సరిపోయేది కదా? అని ఆ ధనవంతునితో చెప్పి తిరిగి ప్రయాణం అయ్యాడు.

ఖాళీ పెట్టె

"తాతా నాన్న ఎప్పుడొస్తాడు." అంది మనమరాలు.
కుర్చీలో కూర్చుని కాఫీ చప్పరిస్తున్న రామనాధం తో..
రామనాధం మనమరాలిని దగ్గరకి తీసుకున్నాడు. “రేపు వచ్చేస్తాడు. ఈ పాటికి బయలు దేరి ఉంటాడు. అక్కడ విమానం ఎక్కి జుమ్మని వచ్చి హైదరాబాదు లో దిగి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. బుజ్జి తల్లిని చూడటానికి” ఆరేళ్ళ మనమరాలికి చక్కిలి గిలి పెట్టాడాయన.
లావణ్య నవ్వింది. సిగ్గు పడింది. “నాకు బోలెడు బొమ్మలు తెస్తాడు. గౌనులు, ఇంకా కర్జూరాలు, చాక్లెట్లూ ,,” కళ్ళు పెద్దవి చేస్తూ చెప్పింది.
“అవును ... అమ్మకి, నాకు అమ్మమ్మ కి కూడా బోలెడు తెస్తాడు. నాకు కొత్త కళ్ళజోడు తెస్తాడు. అమ్మమ్మ పెద్దదయిపోయింది కదా వెండి జుట్టు కి రంగు తెస్తాడు. అమ్మ కి కూడా బోలెడు బహుమతులు తెస్తాడు.”
“తాతయ్యా మనకి నాన్న అన్నీ తెస్తాడు గదా? మరి నాన్నకి బహుమతులు ఎవరు ఇస్తారు?”
అంది చక్రాల్ల లాంటి కళ్ళని గుండ్రంగా తిప్పుతూ..
రామనాదం వద్ద రెడీమేడ్ సమాదానం ఏమీ మిగల్లేదు.
అతన్ని ఆ ఇబ్బంది నుండి తప్పించడానికి లోపలి నుండి అతని బార్య కృష్ణ వేణి వచ్చింది.
“లవ్వూ ఇవాళ స్కూల్ కి వెళ్ళవా?” అంది.
లావణ్య మూతి సున్నాలా చుట్టింది. “చూడు తాతా ..అమ్మమ్మ .. నాన్న వస్తుంటే..”
లోపలి నుండి తల్లి అపర్ణ కేక వేసింది.
“లవ్వూ వచ్చి స్నానం చెయ్యి స్కూల్ టైం అయింది”
సున్నా మూతితోనే లావణ్య ఇంట్లోకి వెళ్ళింది.
అపర్ణ మాట అంటే నే మనమరాలికి భయం.
“డాడీ వచ్చేది రేపు. రేపు శెలవు తీసుకో. ఈ రోజు స్కూల్ కి వెళ్ళాల్సిందే. అల్లరి చెయ్యకుండా రెడీ ఆవు” లోపలినుండి అపర్ణ నచ్చచేబుతూ ఉంది.
“అమ్మా .. నాన్నకి గిఫ్ట్లు ఎవరు ఇస్తారు ?” మళ్లీ తల్లిని అడిగింది.
“ఎవరూ ఇవ్వరు. నాన్నే మనకి అవన్నీ కొని తెస్తారు. నీకోసం మంచి బొమ్మలు కొని అట్టపెట్టె లో పెట్టించి దాన్ని మంచి కాగితం వేసి పాక్ చేయించి తీసుకు వస్తారు.”
“అమ్మా .. పాకింగ్ ఎందుకు చేస్తారు.” క్వశ్చన్ బ్యాంకు ఓపెన్ చేసింది లావణ్య.
“మనకి తెచ్చే బొమ్మలు ఎవరూ చూడకుండా, ఇంకెవరూ కాజేయకుండా పెట్టెలో పెట్టి కాగితం తో అంటించి తెస్తారు.”
ప్లేట్లో ఇడ్లీ ని తినిపిస్తూ చెప్పింది తల్లి.
లావణ్య కి బూట్లు తొడిగి తండ్రి తో “ నాన్నా లవ్వు ని స్కూల్ దగ్గర దించి రండి. లేటవుతుంది.” అంది.
రామనాధం లేచి అప్పటికే సిద్దంగా ఉంచుకున్న స్కూటర్ మీద మనమరాలిని ఎక్కించుకున్నాడు.
**
లావణ్య నిద్ర లేచే సరికి ఇల్లు సందడిగా ఉంది.
"నా బంగారు తల్లి లేచింది." అంటూ తండ్రి వచ్చి పిల్లని బుజానికి ఎత్తుకుని బుగ్గ మీద ముద్దు పెట్టాడు.
మీసాలు గుచ్చుకుని చక్కిలి గిలి పుట్టింది.
“నాన్నా ఎప్పుడు వచ్చావ్ “ అంది లావణ్య తండ్రిని వాటేసుకుని.
"ఇప్పుడేనమ్మా.. ఇవిగో నీకోసం అంటూ ట్రావెల్ బాగ్ లో నుండి బట్టల పాకెట్, కుకీస్ టిన్ లు బయటకి తీసాడు.”
వాళ్ల ఇద్దరి సందడి చూడటానికి కాఫీ గ్లాసు తో అపర్ణ వచ్చింది.
లావణ్య తండ్రి చేతుల్లోంచి తప్పుకుని తన స్కూల్ బాగ్ తీసుకొచ్చి అందులో నుండి ఒక పట్టు బట్ట లో మూట కట్టిన అట్టపెట్టె ని తండ్రికి ఇచ్చింది. "నాన్నా ఇది నీకు. గిఫ్ట్" అంది ముద్దుగా
తల్లికి ఏమీ చెప్పొద్దని గుండ్రటి కళ్ళతో సైగ చేసింది.
తండ్రి జాగర్తగా దాని ముడి విప్పాడు. అట్ట పెట్టె తెరిచాడు.
అందులో ఏమీ లేదు. అది ఖాళీగా ఉంది.
అతని మొహం చిన్న బోయింది.
'ఇందులో ఏమీ లేదుగా' అన్నాడు దిగులుగా లావణ్య ని చూస్తూ...
“రాత్రి నిద్ర పోయేంత వరకు ముద్దులు దాస్తూనే ఉంది” అంది అపర్ణ.
తండ్రి బిడ్డని హత్తుకున్నాడు.
అతని కళ్ళు చెమ్మగిల్లటం అపర్ణ తడి కళ్ళతో గమనించింది.

Monday, 4 March 2019

సెక్షన్ 90


అర్దరాత్రి దాటింది.
మంచి నిద్ర లో ఉన్న ఆడిటర్ CA Satish ఫోన్ మోగింది.
తమ రెగ్యులర్ కస్టమర్ వెంకట్రావ్ నుండి.
ఆడ్ టైం లో అంత అవసరం ఎమొచ్చిందో అనుకుంటూ “హలో” అన్నాడు.
“సతీష్ బాబూ..ఈ సంవత్సరం మొత్తం ఎనబై రెండు వేలు టాక్స్ కట్టించావ్ నాచేత.” డైరెక్ట్ గా విషయం లోకి వచ్చాడు వెంకట్రావ్.
“ఇప్పుడేమయింది.వెంకట్రావ్ గారూ?”
“సెక్షన్ 90 కింద పన్ను రాయితీ ఇప్పించలేదు.”
“అది 90 కాదు 80 C అండీ. అది కూడా మాక్సిమం క్లెయిమ్ చేసి ఉంటాను.”
“లేదు నేను ఇప్పటి వరకు బాలన్స్ షీట్ చెక్ చేసాను.”
“ఒక వేళ పొరపాటున క్లెయిమ్ చెయ్యక పోయినా మనం సప్లమెంటరీ రిటర్న్స్ వెయ్యొచ్చు. ఎక్కువ కట్టిన డబ్బు మీ ఎకౌంటు కి క్రిడిట్ అవుతుంది. పొద్దుటే ఆఫీస్ కి రండి చెక్ చేద్దాం.”
“అబ్బే. నేను థరో గా చెక్ చేసాను. మొత్తం ఎనిమిది వేల మూడు వందల రూపాయలు ఎక్కువ టాక్స్ కట్టాను.”
సతీష్ కి విసుగొచ్చింది. అయినా ప్రొఫెషనల్ ఓపిక తో “రేపు చెక్ చేద్దాం.” అన్నాడు.
“ఎక్కువ కట్టిన టాక్స్ వెనక్కి వస్తుందా?”
“డెఫినెట్ గా వస్తుంది.”
“వచ్చాక తీసుకుందురు. ఇప్పుడొక పావుగంట లో అప్సర బార్ అటెండర్ వస్తున్నాడు. ఒక మూడు వేలు ఇచ్చి పంపించండి. లేక పొతే రేప్పోద్దుట మీ ఆఫీస్ కి రాలేను.”

Friday, 15 February 2019

సరళంగా సాంకేతిక విషయాలు.(పోలవరం _4)

డబ్బు మెరక కి వెళ్తుందేమో కాని నీరు మాత్రం న్యాయంగా పల్లానికే ప్రవహిస్తుంది.
నీటి ప్రవాహం వైపు (పల్లం వైపు చూస్తూ) నిలబడినప్పుడు కుడి వైపు కాలవని right canal, అలాగే రెండో దానిని left canal గానూ పిలుస్తాం.
గరాటు లో ఎక్కడ నీరు పోసినా అది దిగువ నున్న సన్నటి భాగం లోకి వస్తుంది. అలాగే ఎగువ ప్రాంతాలనుండి గ్రావిటీ (వాటం/వాలు) ద్వారా పల్లానికి చేరి రిజర్వాయర్/చెరువు వద్ద పోగవుతుంది. ఆ ప్రవాహ ప్రాంతాన్ని కేచ్మేంట్ ఏరియా (catchment area) అంటారు.
నదీ ప్రవాహాన్ని అడ్డుకట్ట కట్టటం అంత సాధారణమయిన పనేం కాదు. కొంత దూరం గా కట్టిన రెండు సమాంతర గోడలు (coffer dam) ల మధ్య పటిష్టమయిన డయాఫ్రం గోడ నిర్మిస్తారు.
రాక్ కం ఎర్తెన్ డాం అని, డయాఫ్రం వాల్ అని,
దీన్ని రికార్డు కాలం లో 414 రోజుల్లో పూర్తి చేసి నట్లు శిలా ఫలకాలు ఉంటాయి కంగారు పడొద్దు.
స్థూలంగా చెప్పాలంటే ఒక సాండ్విచ్ లాటిది రెండు బ్రెడ్ ముక్కల (coffer dams) మద్య ఆమ్లెట్ (డయాఫ్రం వాల్/రాక్ కం ఎర్త్ డాం) లాటి నిర్మాణం.
పోలవరం ప్రాజెక్ట్ లో ప్రధాన మయిన DAM ని సాంకేతికంగా’ స్పిల్ వే’ అంటారు. ఇది నేల మీద అడ్డంగా పడుకున్న సొర చాప లాగా ఉంటుంది.
దాని మద్య వెన్ను పూస లాగా ఒక దీర్ఘ చతురస్రాకారపు సొరంగం లాటి నిర్మాణం ఉంటుంది. దీన్ని ‘గేలరీ’ అంటున్నాం.
ఈ గెలరీని స్పిల్ వే నిర్వహణకోసం వాడతారు. డాం సీపీజ్ (ఊట నీరు) కొంత ఈ గెలరీ వే లో చేరుతుంది. అందుకే పక్కన ఒక కాలవ లాటి నిర్మాణం ఉంటుంది. మోటార్ల ద్వారా ఆ నీటిని downstream side కి పంపుతారు.
spillway/dam కి సమాంతరంగా గ్యాలరీ మార్గం ద్వారా అటునుండి ఇటూ, ఇటునుండి అటూ వెళ్ళవచ్చు.
శ్రీ శైలం డాం లో కూడా ఈ ఏర్పాటు ఉంది. (ఒకప్పుడు గాలరీ ఉండేది కాదు. ఆధునిక స్పిల్ వే లలో మాత్రమే ఇలా డిజైన్ చేస్తున్నారు.)
స్పిల్ వే మీద పటిష్టంగా కాంక్రీట్ పిల్లర్లు ఉంటాయి వాటి మద్య పై కి కిందకి హైడ్రాలిక్ పవర్ తో కదిలించగల గేట్లు బిగిస్తారు. (మన షాపు లకి ఉండే రోలింగ్ షట్టర్ లాటివి అనుకోండి)
పోలవరం ప్రాజెక్ట్ లో మొత్తం 1.1 కిలోమీటరు పొడవయిన స్పిల్ వే ని మొత్తం 49 పిల్లర్లతో నిర్మిస్తున్నారు. వాటి మధ్య మొత్తం 48 గేట్లు బిగిస్తారు. సహజం గానే గాలరీ 1.1 కిలోమీటరు పొడవు ఉంటుంది గదా!!
ప్రస్తుతం పోలవరం లో 40 వ పిల్లరు 41 వ పిల్లరు మద్య ఒకే ఒక గేటు ట్రైల్ గా బిగించారు. ఈ మధ్య సోషల్ మీడియా లో వైరల్ అయిన "భజన" వీడియో అక్కడిదే..
మొత్తం గేట్లు మూసేసి నీటిని నిలవ ఉంచితే సుమారు 150 అడుగుల/41.5 మీటర్లు లోతు ఉన్న రిజర్వాయిర్ ఏర్పడుతుంది.
ఇక్కడ ఆగుదాం.
ఇప్పుడు రెండు ప్రశ్నలు. అంతా బానే ఉంది నదీ ప్రవాహం ఎక్కడ ఉంది. మీ పాటికి మీరు నదీ ప్రవాహాన్ని తప్పించి పక్కన ఎక్కడో స్పిల్ వే కట్టుకుంటూ పొతే రిజర్వాయిర్ ఎలా ఏర్పడుతుంది.?? అనేవి.
దిగువ coffer dam ఇంకా పూర్తి కాలేదు. సుమారు గా 196 మీటర్లు వర్క్ పెండింగ్ ఉంది. డయాఫ్రం వాల్ నది మట్టం వరకు కట్టారు.
రాక్ కం ఎర్త్ డాం ఎప్పుడు కడతారు.?
దిగువ coffer డాం నిర్మాణానికి ప్రస్తుతం ప్రవహిస్తున్న నది లోతు ఇబ్బంది గా ఉంది. వేసవి కాలం లో మాత్రమె పని చెయ్యటం వీలవుతుంది. కొంత నీటి మట్టం తగ్గాల్సి ఉంది.
1.7 కిలో మీటర్ల వెడల్పు గలిగిన గోదావరి నుండి, spill way 1.1 కి మీ ల నిర్మాణం, పూర్తి అయ్యి గేట్లు బిగించి సాకేంతికంగా క్లియరెన్స్ వచ్చాక Y ఆకారం లో ఎగువ ప్రాంతాన్ని లోతుగా తవ్వి రిజర్వాయర్ ఏర్పాటు చేస్తారు.
అదేవిదంగా రెండో వైపు దిగువ ప్రవాహాన్ని కూడా దారి మళ్ళించడానికి వీలుగా తవ్వి కాంక్రీట్ తో విశాలమయిన ఫ్లాట్ ఫారం నిర్మిస్తారు.
ఈ కాంక్రీటింగ్ ని ఒకే రోజు చేసి గిన్నిస్ బుక్ లో నమోదు చేయించారు.
స్పిల్ వే పూర్తి స్థాయిలో నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణం జరిగి పూర్తి అయ్యాక డయాఫ్రొం పునాది మీద రాక్ ఎర్త్ ఆనకట్ట నిర్మాణం నదీ ప్రవాహానికి అడ్డుగా కడతారు.
ఇది రిజర్వాయర్ అడ్డుకట్టగా మిగిలి పోతుంది. తర్వాత జాగర్త గా caffer dam లని కూల్చేస్తారు.
స్పిల్ వే కి ఎగువ ప్రాంతాన్ని (అంటే crab/ పీత లాగా ఉండే) ప్రాంతాన్ని upstream side అనీ, ఎత్తిన స్పిల్ వే గేట్లు నుండి కిందికి దూకి అక్కడి నుండి కుడి ఎడమల కాలువలికి వెళ్ళే వైపు ని downstream side అనీ అంటారు.
మరొక్క మాట పోలవరం లో రెండు coffer dams మద్య, డయాఫ్రం వాల్ ఆధారంగా “hydro power plant” నిర్మాణం జరగనుంది.
dam ఎత్తుని కొన్ని లాలూచీల కారణంగా తగ్గించి, పవర్ ప్లాంట్ నిర్మాణం ఆపేస్తారని ఒక ఆధారం లేని న్యూస్ కూడా ప్రచారం లో ఉంది.
ఏది ఏమైనా పవర్ ప్లాంట్ నిర్మాణం ఇంకా మొదలవలేదు. ఇంకా ఉంది...













Thursday, 14 February 2019

గోదావరి మలుపులు (పోలవరం_3)

2004 లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తన పూర్తి దృష్టిని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ (జల యజ్ఞం) మీద పెట్టింది. అనేక ప్రధాన ప్రాజెక్ట్స్ ని, పరిశీలించింది. చాలా ప్రాజెక్ట్స్ కి నిధులు మంజూరు చేసి ప్రారంభించింది.
అప్పటికే కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉండి ‘రామ పాద సాగర్ ప్రాజెక్ట్’ నుండి ”పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్” గా గుర్తింపు పొందిన ఈ ప్రాజెక్ట్ అప్పటి ముఖ్యమంత్రి ని ఎంతో ఆకర్షించింది. అప్పటికే దాని అంచనా వ్యయం 8200 కోట్లు.
సహజంగా భారీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు కేంద్ర ప్రభుత్వ అధీనం లో జరుగుతాయి. కాని అప్పటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుకూలత చూసుకుని మంత్రి వర్గం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నే ప్రారంభించాలని నిర్ణయించుకుంది..
ఈ నిర్ణయం వెనుక అనేక ఆకర్షణీయమయిన/ అద్బుతమయిన కారణాలు ఉన్నాయి.
గోదావరి నది సహజసిద్దమయిన వంపు తిరిగి ప్రాజెక్ట్ కట్టుకోవటానికి అనుకూలంగా ఉండటం.
కేచ్మేంట్ ఏరియా(catchment area)* ఎక్కువగా ఉండటం, స్టోరేజ్(storage)* కెపాసిటీ ఎక్కువగా ఉండటం, గోదావరి నదికి వరద నీరు ఎక్కువగా వస్తూ ఉండటం, అనేక లక్షల cusec ల నీరు సముద్రం లో కి విడవాల్సి రావటం లాటివి.
మరీ ముఖ్యంగా “ప్రాజెక్ట్ పూర్తి అయి పూర్తి స్థాయి లో రిజర్వాయర్ లో నీరు నిలవ ఉంచగలిగితే” అది దిగువ ప్రాంతాల కి #వరసగా#నాలుగు_కరువు_సంవత్సరాల ని తట్టుకుని పంట/ తాగు నీరు ఇవ్వగలగటం. అంత పెద్ద భారీ ప్రాజెక్ట్.
2004 లో కుడి కాలవ పనులు మొదలయ్యాయి. 2005 లో ప్రాజెక్ట్ మొదలయ్యింది.
అంతే వేగంగా 2006 మే లో డాం నిర్మాణం ఆగి పోయింది.
అటవీ శాఖ, మైనింగ్, వన్య ప్రాణుల సంరక్షణ, ప్రకృతి, ముంపు ప్రాంత నిర్వాసితుల సమస్య లాటి అనేక కోర్టు సమస్యలు, విఘాతల కారణంగా నిర్మాణం అపెయ్యవలసి వచ్చింది.
అయితే ప్రధాన డాం పని అగినప్పటికి కాలవ పనులు మాత్రం కొనసాగాయి.
రాష్ట్ర ప్రభుత్వ చొరవ, కేంద్ర ప్రభుత్వ సహకారం తో ప్రాజెక్ట్ ఇబ్బందులు అన్నీ 2009 కి మబ్బుల్లా విడిపోయాయి.
దాదాపు నూరు శాతం అనుమతులతో ప్రాజెక్ట్ పనులు పరిగెత్తాల్సిన సమయం వచ్చింది.
తెలుగు రాష్ట్రం లో అక్టోబర్, 2009 ఒక విషాదం చోటు చేసుకుంది.
రాష్ట్రం ఒక #ముఖ్యమంత్రిని కోల్పోయింది.
జలయజ్ఞం కింద మొదలయిన చాలా పనులు ఆగిపోయాయి. ఆపధర్మ ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు మరలించలేక పోయారు. ప్రాజెక్ట్ పనులు ఆగిపోయాయి.
#నిర్మాణ_వ్యయం మాత్రం రోజు రోజుకి పెరిగి పోతూ ఉంది.
కొన్నాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం “పోలవరం ప్రాజెక్ట్” కి జాతీయ హోదా కావాలని విన్నపాలు మొదలెట్టింది.
జాతీయ హోదా అంటే ప్రాజెక్ట్ ఖర్చులో 90 శాతం నిధులు కేంద్రం ఇవ్వటం.
అప్పటి ప్రధాని అంగీకరించలేదు. మౌన ముద్ర వీడలేదు. ఒక రాష్ట్రానికి ఆ స్థాయిలో నిధులు అందించడం సాద్యం కాదనేది ఆయన ప్రబుత్వ వాదన.
కాలం పరిగెడుతూనే ఉంది.
నాటకీయం గా తెలుగు రాష్ట్రం బహువచనం అయ్యింది.
విడిపోయిన ఆంధ్రపదేశ్ లోటు బడ్జెట్ లో ఉన్నందున పోలవరం కి నేషనల్ స్టేటస్ ఇస్తామని ప్రబుత్వం హామీ ఇచ్చింది.
2014 ఎన్నికల తర్వాత రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. కేంద్రం లో అధికారం లోకి కొత్త ప్రభుత్వం వచ్చింది. రాష్టం లో సీనియర్ నాయకుడి ప్రభుత్వం ఏర్పడింది.
రాష్త్రం విడిపోయే ముందు ఇచ్చిన స్పెషల్ స్టేటస్ హోదాని కొత్త ప్రబుత్వం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం వత్తిడి చేసింది.
ఎన్నికలలో సపోర్ట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వ అబ్యర్ధన న ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. పోలవరం కి స్పెషల్ స్టేటస్ #ఇచ్చింది.
అంతా బాగుంది ఇక ఆటంకాలు లేవు ప్రాజెక్ట్ తిగిరి పట్టాలు ఎక్కే దశ లో ఒక అవాంతరం వచ్చింది.
కొంతమంది హ్యూమన్ రైట్ activist లు ...
వారి వాదన ఇలా ఉంది..




ప్రాజెక్ట్ పూర్తి అయితే అప్ స్ట్రీమ్ (upstream side*) లో ఉన్న సుమారు 276 గ్రామాలు ముంపుకి గురవుతాయి. ఆ గ్రామాల ప్రజలకి నష్టం వాటిల్లుతుంది. వారి కి సరైన మార్గాంతరం చూపకుండా ప్రాజెక్ట్ పనులు కొనసాగించా రాదు.
అనేక వందల ఎకరాల అడవి ప్రాంతం నీట మునిగి పోతుంది. తిరిగి రెట్టింపు వైశాల్యం లో అడవిని పెంచాలి,
అటవీ వన్య మృగ రక్షణ కి చర్యలు చేపట్టాలి.
ముందుగా ఇవన్నీ సంతృప్తికరంగా చేసాక మాత్రమే ప్రాజెక్ట్ తిరిగి మొదలెట్టాలి ..
ప్రాజెక్ట్ పని మొదలవకుండానే ఆగి పోయింది.

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...