Tuesday 30 April 2019

ఖాళీ పెట్టె

"తాతా నాన్న ఎప్పుడొస్తాడు." అంది మనమరాలు.
కుర్చీలో కూర్చుని కాఫీ చప్పరిస్తున్న రామనాధం తో..
రామనాధం మనమరాలిని దగ్గరకి తీసుకున్నాడు. “రేపు వచ్చేస్తాడు. ఈ పాటికి బయలు దేరి ఉంటాడు. అక్కడ విమానం ఎక్కి జుమ్మని వచ్చి హైదరాబాదు లో దిగి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. బుజ్జి తల్లిని చూడటానికి” ఆరేళ్ళ మనమరాలికి చక్కిలి గిలి పెట్టాడాయన.
లావణ్య నవ్వింది. సిగ్గు పడింది. “నాకు బోలెడు బొమ్మలు తెస్తాడు. గౌనులు, ఇంకా కర్జూరాలు, చాక్లెట్లూ ,,” కళ్ళు పెద్దవి చేస్తూ చెప్పింది.
“అవును ... అమ్మకి, నాకు అమ్మమ్మ కి కూడా బోలెడు తెస్తాడు. నాకు కొత్త కళ్ళజోడు తెస్తాడు. అమ్మమ్మ పెద్దదయిపోయింది కదా వెండి జుట్టు కి రంగు తెస్తాడు. అమ్మ కి కూడా బోలెడు బహుమతులు తెస్తాడు.”
“తాతయ్యా మనకి నాన్న అన్నీ తెస్తాడు గదా? మరి నాన్నకి బహుమతులు ఎవరు ఇస్తారు?”
అంది చక్రాల్ల లాంటి కళ్ళని గుండ్రంగా తిప్పుతూ..
రామనాదం వద్ద రెడీమేడ్ సమాదానం ఏమీ మిగల్లేదు.
అతన్ని ఆ ఇబ్బంది నుండి తప్పించడానికి లోపలి నుండి అతని బార్య కృష్ణ వేణి వచ్చింది.
“లవ్వూ ఇవాళ స్కూల్ కి వెళ్ళవా?” అంది.
లావణ్య మూతి సున్నాలా చుట్టింది. “చూడు తాతా ..అమ్మమ్మ .. నాన్న వస్తుంటే..”
లోపలి నుండి తల్లి అపర్ణ కేక వేసింది.
“లవ్వూ వచ్చి స్నానం చెయ్యి స్కూల్ టైం అయింది”
సున్నా మూతితోనే లావణ్య ఇంట్లోకి వెళ్ళింది.
అపర్ణ మాట అంటే నే మనమరాలికి భయం.
“డాడీ వచ్చేది రేపు. రేపు శెలవు తీసుకో. ఈ రోజు స్కూల్ కి వెళ్ళాల్సిందే. అల్లరి చెయ్యకుండా రెడీ ఆవు” లోపలినుండి అపర్ణ నచ్చచేబుతూ ఉంది.
“అమ్మా .. నాన్నకి గిఫ్ట్లు ఎవరు ఇస్తారు ?” మళ్లీ తల్లిని అడిగింది.
“ఎవరూ ఇవ్వరు. నాన్నే మనకి అవన్నీ కొని తెస్తారు. నీకోసం మంచి బొమ్మలు కొని అట్టపెట్టె లో పెట్టించి దాన్ని మంచి కాగితం వేసి పాక్ చేయించి తీసుకు వస్తారు.”
“అమ్మా .. పాకింగ్ ఎందుకు చేస్తారు.” క్వశ్చన్ బ్యాంకు ఓపెన్ చేసింది లావణ్య.
“మనకి తెచ్చే బొమ్మలు ఎవరూ చూడకుండా, ఇంకెవరూ కాజేయకుండా పెట్టెలో పెట్టి కాగితం తో అంటించి తెస్తారు.”
ప్లేట్లో ఇడ్లీ ని తినిపిస్తూ చెప్పింది తల్లి.
లావణ్య కి బూట్లు తొడిగి తండ్రి తో “ నాన్నా లవ్వు ని స్కూల్ దగ్గర దించి రండి. లేటవుతుంది.” అంది.
రామనాధం లేచి అప్పటికే సిద్దంగా ఉంచుకున్న స్కూటర్ మీద మనమరాలిని ఎక్కించుకున్నాడు.
**
లావణ్య నిద్ర లేచే సరికి ఇల్లు సందడిగా ఉంది.
"నా బంగారు తల్లి లేచింది." అంటూ తండ్రి వచ్చి పిల్లని బుజానికి ఎత్తుకుని బుగ్గ మీద ముద్దు పెట్టాడు.
మీసాలు గుచ్చుకుని చక్కిలి గిలి పుట్టింది.
“నాన్నా ఎప్పుడు వచ్చావ్ “ అంది లావణ్య తండ్రిని వాటేసుకుని.
"ఇప్పుడేనమ్మా.. ఇవిగో నీకోసం అంటూ ట్రావెల్ బాగ్ లో నుండి బట్టల పాకెట్, కుకీస్ టిన్ లు బయటకి తీసాడు.”
వాళ్ల ఇద్దరి సందడి చూడటానికి కాఫీ గ్లాసు తో అపర్ణ వచ్చింది.
లావణ్య తండ్రి చేతుల్లోంచి తప్పుకుని తన స్కూల్ బాగ్ తీసుకొచ్చి అందులో నుండి ఒక పట్టు బట్ట లో మూట కట్టిన అట్టపెట్టె ని తండ్రికి ఇచ్చింది. "నాన్నా ఇది నీకు. గిఫ్ట్" అంది ముద్దుగా
తల్లికి ఏమీ చెప్పొద్దని గుండ్రటి కళ్ళతో సైగ చేసింది.
తండ్రి జాగర్తగా దాని ముడి విప్పాడు. అట్ట పెట్టె తెరిచాడు.
అందులో ఏమీ లేదు. అది ఖాళీగా ఉంది.
అతని మొహం చిన్న బోయింది.
'ఇందులో ఏమీ లేదుగా' అన్నాడు దిగులుగా లావణ్య ని చూస్తూ...
“రాత్రి నిద్ర పోయేంత వరకు ముద్దులు దాస్తూనే ఉంది” అంది అపర్ణ.
తండ్రి బిడ్డని హత్తుకున్నాడు.
అతని కళ్ళు చెమ్మగిల్లటం అపర్ణ తడి కళ్ళతో గమనించింది.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...