Tuesday 30 April 2019

టైం బ్యాంకు

నవీన్ కి ఆ పెద్దావిడ ఒక ప్రశ్నార్ధకం.
తను ఉండే సర్వీస్ అపార్ట్మెంట్ కి దగ్గరలోనే ఉంటుంది ఆవిడ. ఖరీదయినది కాక పోయినా సౌకర్యమయిన స్వంత ఇల్లు. విశ్రాంత ఉద్యోగి ఏదో స్కూల్ లో పని చేసినట్లు నవీన్ కి చెప్పింది కాని “స్విస్” స్లాంగ్ కి పూర్తిగా అలవాటు కాని నవీన్ కి ఆ స్కూల్ పేరు అర్ధం అవలేదు.
నవీన్ రొబాటిక్స్ లో 'ఎమ్మెస్' చేయటానికి వచ్చాడు. తన యూనివర్సిటీ దగ్గరలో మిత్రులతో పాటు సర్వీస్ అపార్ట్మెంట్ లో నివాసం.
అసలావిడ (రోజీ) తో పరిచయమే తమాషాగా జరిగింది.
మొదటి సారి సుమారుగా డెబ్బై ఏళ్ల వయసు లో ఉండే ఒక సన్నటి మగమనిషి తో డాక్టర్ ఆఫీస్ (హాస్పిటల్) వద్ద కనిపించింది.
రిసెప్షన్ లో అడిగే ప్రతి చిన్న ప్రశ్నకి అతన్ని అడిగి ఓపిగ్గా సమాదానం చెబుతుంది.
అతను మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. పెరాలసిస్ తో అతని నోటి నుండి వచ్చే మాట స్పష్టంగా లేదు. ఆమె ఓపిగ్గా అతని భావాన్ని డీకోడ్ చేస్తుంది. అది కాదు అతన్ని ఆశ్చర్యపరిచింది. చాలా చిన్న ప్రశ్నలకి కూడా ఆమె అతన్ని అడగటం.
భోజనం వేడిగా చేస్తారా? రాత్రి పూట తరచూ వాష్ రూమ్ కి వెళ్తారా? ఇలాటి మామూలు ప్రశ్నలకి కూడా అతన్ని అడిగి మరీ ఈవిడ చెప్పటం వింతగా ఉంది.
తర్వాత ఒక ఆదివారం పార్క్ కి వెళ్ళినప్పుడు వీల్ చైర్ ని నెట్టుక్కుంటూ అతనికి పార్క్ లో ఆడుతున్న పిల్లలగురించి నవ్వుతూ ఏదో చెబుతుంది.
ఆ చైర్ లో ఉన్న మనిషి లావుగా పూర్తి బట్టతల తో ఉన్నాడు. అతని కాలు ఒకటి సర్జరీ చేసి తొలగించినట్లు చూడగానే తెలుస్తుంది. ఇతను హాస్పిటల్ లో చూసిన #అతను కాదు. మరెవరో !!
**
నవీన్ కి 'రోజీ' మేడం ఇప్పుడొక ప్రశ్న.
ఆవిడని ఆసక్తిగా గమనించడం మొదలెట్టాడు.
తరచూ పలకరించు కోవటం మొదలయ్యింది.
ఆవిడ వయసు అరవై దాటిందనీ, సౌకర్యమయిన పెన్షన్ వస్తుందనీ.. ఏ ఆర్ధిక ఇబ్బందులు లేని ఒంటరి (విడో) అని తెలుసుకున్నప్పుడు అతని ఆశ్చర్యం రెట్టింపు అయింది.
“మిమ్మల్ని పార్క్ లో చూసాను. ఎవరినో వీల్ చైర్ లో తిప్పుతూ నవ్విస్తున్నారు.”
“ఓహ్ అతనా? రాబర్ట్ అని నాలాగే ఒంటరి జీవి. పిల్లలు ఉన్నారు. ఎల్లకాలమూ తండ్రి వద్ద గడపలేని జీవితాలు, జీతాలు. అతనికి ఆక్సిడెంట్. ఎండం కాలు తీసేయాల్సి వచ్చింది. వీలయినంత కాలం వాళ్ళు ఉండి వెళ్ళిపోయారు
అతను కూడా ‘టైం బ్యాంకు’ సభ్యుడు . వాలంటీర్ కోసం అప్లై చేసాడు.
నేను అటెండ్ అవుతున్నాను. రోజుకి రెండు గంటలు. అతని ఫ్లాట్ శుబ్రం చేసి, వంట చేసి పెట్టి, ఒక అరగంట కబుర్లు చెప్పి వస్తాను.
“టైం బ్యాంకు? కాలానికి కూడా ఒక బ్యాంకు ఉంటుందా?” అనుమానంగానే అడిగాడు నవీన్.
రోజీ నవ్వింది. " అవును ఉంది. డబ్బుతో అవసరం లేని బ్యాంకు. కేవలం సేవ మాత్రమే జమ/ఖర్చు చేసే బ్యాంకు. నేను డబ్బు కోసం ఈ పని చేయడం లేదు, నా సమయాన్ని 'టైమ్ బ్యాంక్ ' లో దాచుకుంటున్నాను. వృద్ధాప్యంలో, నేను కదలలేని పరిస్థితుల్లో తిరిగి వినియోగించుకుంటాను." అంది.
టైం బ్యాంకు గురించి చెప్పమని ఆవిడని ఆసక్తి గా అభ్యర్ధించాడు నవీన్.
టైమ్ బ్యాంక్ అనేది స్విస్ ప్రభుత్వ సామాజిక భద్రతా మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన వృద్ధాప్య పెన్షన్ కార్యక్రమం. ప్రజలు తాము యవ్వనంలో, ఆరోగ్యంగా ఉన్నపుడు వృద్ధులకు,అనారోగ్యంగా ఉన్నవారికి సేవలందిస్తూ, సమయాన్ని దాచుకొని, తిరిగి వారికి అవసరమున్నపుడు ఉపయోగించుకోవచ్చు.
దరఖాస్తుదారులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి, ప్రేమపూర్వక సంభాషణా నైపుణ్యం కల్గి ఉండాలి. ప్రతిరోజు వారి సేవలను కోరుకునే వారికి అందించగలగాలి. వారి సేవాకాలాన్ని వారి వ్యక్తిగత ఖాతాలలో సామాజిక భద్రతా మంత్రిత్వశాఖ జమ చేస్తుంది.
అలా ఆమె వారానికి రెండు రోజులు రెండు గంటల చొప్పున వృద్ధులకు సేవలందించడానికి వెళ్లేది.వారి గదుల్ని శుభ్రం చేయడానికి,సరుకులు తేవడానికి,వారికి సన్ బాత్ లో సహకరించడానికి, కొద్దిసేపు ముచ్చడించడానికీ సమయాన్ని కేటాయించేది.
అంగీకారం ప్రకారం సంవత్సరం తర్వాత టైమ్ బ్యాంక్ ఆమె/అతని సేవాకాలాన్ని లెక్కించి, 'టైమ్ బ్యాంక్ కార్డు'జారీ చేస్తుంది.
వారికి ఇతరుల సహాయం అవసరమున్నపుడు తమ కార్డును ఉపయోగించుకుని తమ ఖాతాలో ఉన్న సమయాన్ని ‘వడ్డీ’ తో సహా తిరిగి వాడుకోవచ్చు.. వారి ధరఖాస్తును పరిశీలించి, టైమ్ బ్యాంక్ ఒక వాలంటీర్ ను ఆమె ఇంటికి గానీ, ఆస్పత్రికి గానీ పంపుతారు.
అనుకోకుండా #రోజీ కీ ఒక ఇబ్బంది జరిగింది.
ఒకరోజు నవీన్ ఆమె ఇంట్లో కిచెన్ లో సాయం చేస్తుండగా ఆమె, కిటికీ శుభ్రం చేస్తుంటే స్టూల్ పై నుండి జారి పడింది.
నవీన్ క్లాస్సేస్ కి వెళ్ళకుండా వెంటనే సెలవు పెట్టి, ఆమెను హాస్పిటల్ కు తీసుకు వెళ్ళాడు.
ఆమె కాలు మడమ దగ్గర విరిగి, కొంత కాలం పాటు మంచం పైనే ఉండవలసి వచ్చింది. నవీన్ కొన్ని రోజుల పాటు ఇంటి పట్టునే ఉండడానికి సిద్ధమౌతుంటే, ఆమె ఏమీ దిగులు పడనవసరం లేదన్నది.
ఆమె అప్పటికే టైమ్ బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నది. ఆశ్చర్యకరంగా రెండు గంటల్లోపే ఆవిడకు సేవలందించడానికి టైమ్ బ్యాంక్ వాలంటీరును పంపించింది.
ఆ నెలంతా ఆ వాలంటీర్ ప్రతిరోజూ ఆవిడ బాగోగులు చూసుకుంటూ, రుచికరమైన వంటలు చేస్తూ, సరదాగా కబుర్లు చెబుతూ ఉండేది.
సరైన సేవల వల్ల ఆమె త్వరలోనే కోలుకుని, తిరిగి తన పనులు తాను చేసుకోవడం మొదలైంది. తానింకా ఆరోగ్యంగానే ఉన్నందున తిరిగి టైమ్ బ్యాంక్ లో మరింత కాలాన్ని నమోదు చేసుకుంటానంది ఆమె.
నవీన్ కి యునివర్సిటీ లో నేర్చుకునే దానికన్నా ఇదే విలువయిన విద్య అనిపించింది.
(ఈ రోజుల్లో స్విట్జర్లాండ్ లో వృద్ధులకు టైమ్ బ్యాంకులు సేవలందించడం అనేది సర్వసాధారణమైంది. ఈ విధానం దేశ భీమా ఖర్చుల్ని తగ్గించడమే కాక, అనేక సామాజిక సమస్యల్ని కూడా పరిష్కరిస్తుంది. స్విస్ ప్రజలు కూడా ఈ విధానానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ఒక సర్వే ప్రకారం సగం మంది స్విస్ పౌరులు ఈ విధానంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది. ప్రభుత్వం కూడా ఈ 'టైమ్ బ్యాంక్ 'విధానాన్ని చట్టబద్ధం చేసింది.)
ప్రస్తుతం ఆసియా దేశాల్లో కూడా క్రమంగా "ఒంటరి గూటి-వృద్ధ పక్షులు" పెరిగి పోవడం ఒక సామాజిక సమస్యగా మారుతున్నది.
దీన్ని మన దేశం లో అమలు చెయ్యటం అసాధ్యమా? ఒక ఆలోచన చేద్దాం.
HAPPY SUNDAY. _/|\_

3 comments:

నీహారిక said...

ఎంతో మంచి సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలండీ ! భలే మంచి ఆలోచన ! మనదేశంలో కూడా ప్రవేశపెడితే నేను కూడా నమోదు చేసుకుంటాను. ఈ బ్యాంక్ ఎక్కడైనా సక్సెస్ అవుతుంది, సందేహం లేదు.

Shekar said...

Manchi alochana

శ్యామలీయం said...

ఎంత అద్భుతమైన ఆలోచన ఈ టైమ్ బ్యాంక్ అన్నది.
ప్రభుత్వాలు పూనుకోవాలి మనదేశంలో వెంటనే.
ఆసక్తికర వ్యక్తులు కూడా పూనుకోవచ్చు.
దేశంలో బోలెడు బ్యాంకు లున్నట్లు, బోలెడన్ని టైమ్ బ్యాంకులు కూడా ఉండవచ్చును.

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...