Friday, 28 December 2018

లక్ష్మి పతి


టెన్నిస్ కోర్ట్ లో నాలుగు గేమ్స్ ఆడాక, ప్రాజెక్ట్ డైరెక్టర్ సాయినాద్, తన కిట్ లో రాకెట్ సర్దుకుంటూ మిత్రులకి బై చెప్పాడు.
అప్పటికే చమట తో టీ షర్టు వీపుకి అతుక్కుంది.
కౌంటర్ లో మినరల్ వాటర్ బాటిల్ ఒకటి తీసుకుని రెండు గుక్కలు తాగి, మిగిలిన బాటిల్ అక్కడే వదిలేసి, పార్కింగ్ లో ఉన్న బుల్లెట్ బండి తీసాడు.
ఆయన శుబ్రతకి చాలా ప్రాముఖ్యత ఇచ్చే మనిషి. ఒక్క గుడి లో తీర్ధం తప్ప మరెక్కడా మినరల్ వాటర్ కాకుండా ఒక్క చుక్క నీళ్ళు కూడా ముట్టుకోడు.
ఈ విషయం లో సాయినాద్ చాలా నిక్కచ్చి ..
టౌన్ కి ఆరు కిలోమీటర్ల దూరం ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఉన్న ప్రొఫెషనల్ టెన్నిస్ కోర్టు కి ఆతను సెక్రటరీ కూడా..
ప్రతి రోజు ఉదయాన్నే 'ట్రాక్ షు' లో అక్కడికి బండి మీద రావటం ఒక గంట సేపు 'గేం' ఆడటం బంగాళా కి వెళ్లి రెడి అవటం ఆయన దినచర్య.
ఆ రోజు ఎనిమిది గంటలకి ప్రిన్సిపల్ సెక్రయిటరీ గారి వీడియో కాన్ఫరెన్స్ ఉండటం వల్ల రెగ్యులర్ గా వెనక్కి వెళ్ళే రూట్ కాకుండా బస్తీ లోనుండి వెళ్ళే దగ్గర త్రోవ లో బయలు దేరాడు.
సన్నటి సిమెంట్ రోడ్డు చాలా బాగం ఆక్రమణ లోనె ఉంది.
పిల్లల స్నానాలు, బట్టలు ఉతుక్కునే స్త్రీలు, బ్రాయిలర్ పొయ్యిలు, ప్లాస్టిక్ బిందెలు క్యూ ఉన్న వీధి కుళాయిలు, రోడ్డు పక్కన ముసలాళ్ళు పడుకున్న మంచాలు... కాయ కూరల బండ్లు.. వాయిదా సామాను అమ్ముకునే వ్యాపారులు... అంతా సందడి.
నాలుగో చొరస్తా దాటి వినాయకుడి గుడి మలుపు తిరుగుతుంటే.. బండి టైర్ ఒక్క సారిగా ఫ్లాట్ అయింది.
సాయినాద్ బండి స్టాండ్ వేసాడు. ఒకరిద్దరు పిల్లలు గుమిగూడారు.
సాయినాద్ కి RDO గారి డ్రైవర్ ఈ బస్తీ లోనే ఉంటున్నట్టు గుర్తుకొచ్చింది.
RDO కి ఫోన్ చేసాడు. “బ్రదర్... టెన్నిస్ కోర్టు నుండి మిలటరీ కాలనీ రోడ్డు లో టౌన్ లోకి వస్తుంటే బండి పంచర్ అయినట్లు ఉంది. వెనక ఫ్లాట్ అయింది. మీ డ్రైవర్ ఇక్కడే ఉన్నట్టు గుర్తు. అతని నెంబరు తెలీదు.”
“ఇప్పుడే వాట్స్ అప్ పెడతాను. అతని పేరు లక్ష్మీ పతి అతనికి నేనూ ఫోన్ చేస్తాను. సరిగ్గా ఎక్కడ ఉన్నారు ?”
ఫోన్ ఆపిన అయిదు నిమిషాల లోపే డ్రైవర్ ‘లక్ష్మీ పతి’ అక్కడ ప్రత్యక్షం అయ్యాడు.
“సార్.. సార్... సార్ ..” అంటూ బండి స్టాండ్ తీసాడు. రోడ్డు వారగా నెట్టి మళ్లీ స్టాండ్ వేసాడు. బండి ని పిల్లల నుండి గమనిస్తుండమని అక్కడే ఉన్న ఒకావిడకి పురమాయించాడు.
“పంచర్ కుర్రాడి ని పిలిపించి పంచర్ వేయిస్తాను సర్. తమరి ఆఫీస్ కి తీసుకొస్తాను సార్.... మీరు ఆటో లో వెళ్ళొచ్చు సార్. మా ఇల్లు ఆ సందులోనే సర్. .” అన్నాడు మర్యాదగా.
సాయినాద్ కి అతనితో పరిచయం లేదు.
ఒక సారి అతని ఇల్లు చూడటం ఎందుకయినా మంచిదని అనిపించి..
“ఎక్కడ?” అన్నాడు ఆసక్తిగా..
“రండి సార్ .. కాఫీ తాగుదురు.” అన్నాడు మర్యాదగా..
సాయినాద్ షటిల్ రాకెట్ తీసుకుని అతనితో పాటు నడిచాడు.
ఇది ఉహించని లక్ష్మి పతి కంగారుగా ఇంటి వైపు నడిచాడు.
***
చిన్న స్థలం ఇంకా చిన్నరెండు రేకుల గదులు. ఇనప రేకుల పంచ. ఒక మూల స్నానాల గది. ఇసుక రాళ్ళ తో ఎగుడు దిగుడు కాంపౌండ్ గోడ..
గేటు పక్కకి అని లోపలి నడుస్తూనే గోడ వార గా మంచం మీద నిద్రపోతున్న పిల్లాడిని తట్టి లేపాడు.
“పాల పాకెట్లు వేసి వచ్చి ఇప్పుడే కాసేపు పడుకున్నాడు సార్ “ అన్నాడు సంజాయిషీ గా..
పద్నాలుగు పదిహేను ఏళ్ల వయసు ఉంటుంది. నల్లగా ఆరోగ్యంగా ఉన్నాడు.
తండ్రి పక్కన ఉన్న ఆఫీసర్ ని చూసి గబాలున మంచం లేపి గోడకి నిలబెట్టాడు.
లక్ష్మీ పతి గది లో నుండి ఒక ఇనప కుర్చీ తీసుకువచ్చి రేకుల పంచ లో వేసి, దండెం మీది కండవా లాగి తుడిచి కూర్చో మన్నట్లుచూసాడు.
పిల్లాడు లోపలి వెళ్లి తల్లి కి తండ్రి కళ్ళతో చెప్పిన భాషని తర్జుమా చేసి చెప్పాడు.
ఆమె పొయ్యి మీద శుభ్రం గా ఉన్న గిన్నెలో పాలు పోసి పొయ్యి వెలిగించి పిల్లాడిని చూడామని సైగ చేసి కండువా ఒకటి కప్పుకుని బయటకి వచ్చి “నమస్తే అయ్యా” అంది పరిచయం లేకున్నా.
“ఎన్నార్యీజీఇ ప్రాజెక్ డైరెక్టర్ గారు .. వినాయకుడి గుడి ముందు మోటార్ సైకిల్ పంచర్ అయింది.” అన్నాడు క్లుప్తంగా...భార్య తో లక్ష్మి పతి.
సాయినాద్ రేకుల పంచ లో ఒక పక్క న ఉన్న పడక కుర్చీ ని గమనించాడు.
ఇనుపబద్దీలు, చక్కతో చేసిన పొడవాటి కర్రలు, మందపాటి గుడ్డ తో ఉన్న పడక కుర్చీ.. ఎప్పుడో తన చిన్న వయసులో (సాయినాద్) తండ్రి అలాటి కుర్చీ వాడటం గుర్తుకొచ్చింది. నలబై ఏళ్ల క్రితం మాట.
“మా నాన్న కి ఆ కుర్చీ వాళ్ళ తాసిల్దారు ఇచ్చాడట.. అదంటే మహా ప్రేమ .. ఆయన అప్పట్లో నౌకరు గా చేసేవాడు.”
రేకుల గది లో గోడలకి నాలుగు అడుగుల ఎత్తులో మూడు అంగుళాల ఎడం తో, ఇనప బద్దీలు రైలింగ్ లాగా బిగించి ఉండటాన్ని కళ్ళు విప్పార్చి చూసాడు సాయినాద్.
“మా నాన్నకి మోకాళ్ళు అరిగి పోయాయి. నడవటానికి చాలా ఇబ్బంది పడతాడు. ఆయన ఇంట్లో నడవటం కష్టం గా ఉంటుంది అని ఆ ఏర్పాటు చేశాం” లక్ష్మీ పతి వివరించాడు.
ఈ లోగా అతని బార్య లోపలి వెళ్లి మంచి గ్లాసు లో కొడుకు చేసిన కాఫీ పోసి ఆ గ్లాస్ ని ప్లేట్ లో పెట్టుకుని వచ్చి “తీసుకోండి సార్” అంది.
“అబ్బే నేనూ బిపి టాబ్లెట్ వేసుకోవాలి” అన్నాడు సాయినాద్ కుర్చీ లోనుండి లేస్తూ..
లక్ష్మీ పతి బార్య లోపలి నుండి బిందెలో నీళ్ళు గ్లాసు తో తెచ్చింది.
సాయినాద్ లేచి రెండు అడుగులు వేసి కాఫీని తిరస్కరించ బోయేటప్పుడు... గది కిటికీ నుండి, లోపల గదిలో కుర్చీ లో కూర్చుని ఉన్న ముసలాయన, ఆయన కాళ్ళ వద్ద కూర్చొని, వేళ్ళ గోళ్ళు తీస్తున్న పిల్లాడు కనిపించారు.
సాయినాద్ షర్ట్ జేబులోనుండి బిపి టాబ్లెట్ తీసుకుని నోట్లో వేసుకోబోతుంటే చేతి లో నుండి జారి కింద పడింది.
ఆతను వంగి, దానిని తీసుకుని నోట్లో వేసుకుని, ఆమె చేతిలో గ్లాసు ని అందుకుని, పెదాలకి ఆనించుకుని నీళ్ళు తాగేసి, కాఫీ గ్లాసు అందుకున్నాడు.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...